May 14, 2008

మా వారి 'అమ్మ ' కథ

అమ్మల రోజు వెళ్ళిపోయినా జాన్ హైడ్ కనుమూరి గారు అమ్మ గురించి ఇంకా రాయమని ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ టపా మొదలు పెట్టాను. అయితే అది మా అమ్మ గురించి కాదు. గడ్డిపూలు సుజాత గారు రాసిన అమ్మ టపాకు కొన్ని కూడికలు, కొన్ని తీసివేతలు జరిగితే మా అమ్మ టపా తయారవుతుంది.కొత్తగా ఏమీ ఉండదు.(ఇంగువా, అగరొత్తులు కలిసిన పరిమళంతో సహా). అమ్మల కోసమే కాకుండా, అమ్మలా చూసుకునే అత్తగార్లకు కూడా ఒక రోజుంటే బాగుంటుందని నాకెప్పుడూ అనిపిస్తుంటుంది, మా అత్తగార్ని చూశాక!

అందుకే నేను మా వారి అమ్మ, అంటే మా అత్తగారి గురించి ఈ టపా రాస్తున్నాను. ఆవిడ పేరు కూడా మా అమ్మ పేరే. పద్మావతి. నా వివాహం అయి తొమ్మిదిన్నరేళ్ళు అయినా నేను ఒక్కరోజు కూడా ఆవిడలో 'అత్త గార్ని 'చూడలేదు. చూసే అవకాశం ఆమె నాకివ్వలేదు.

నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గర లేని స్వేచ్చ నాకు మా అత్తగారి దగ్గర దొరుకుతుంది.నేను మా వారిని పేరుతో పిలవడం, ఏకవచనంతో సంబోధించడం మా అమ్మకు(ఆమె పెరిగిన, మమ్మల్ని పెంచిన సంప్రదాయాల కారణంగా) నచ్చదు.నేను పెళ్లైన కొత్తలో శ్రీనివాస్ ని 'ఏవండీ' అని క్రుతకంగా పిలుస్తుంటే, "వాడిని నువ్వు పేరుతో పిలిస్తే నాకేం అభ్యంతరం లేదు. గౌరవం పిలవడంలో కాదు, మనసులో ఉండాలి" అని చెప్పారు.
ఇంకో విషయం ఏమిటంటే, ఆవిడ చాలా హాస్య ప్రియత్వం కలది, హాస్య స్ఫోరకంగా మాట్లాడగలదీను! అది ఆవిడ జీన్స్ లోనే ఉందనుకుంటా! ఎందుకంటే పాత తరం హాస్య నట చక్రవర్తి కస్తూరి శివ రావు కి ఆమె స్వయానా అన్నగారి కూతురు మరి! వాళ్ళింట్లో (అదే లెండి, మా అత్తవారింట్లో) ఎప్పుడూ, విట్లూ, జోకులే తప్ప మొహాలు మాడ్చుకోవడాలు, గొణుక్కోవడాలు,మనసు కష్టపెట్టుకుని మూగ నోములు పట్టడాలూ "ఉండనే ఉండవు"!

మాది ప్రేమ వివాహం! పెద్దల్ని ఒప్పించి చేసుకున్న వివాహం! "మీరు అప్పుడే మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు కదా! మీకు కోపం రాలేదా?" అని నేనడిగితే, ఆవిడ ఇలా చెప్పారు. "సరే,నేనొద్దంటాను, వాడు నేను చెప్పిన అమ్మాయినే చేసుకుంటాడు. అప్పుడు నాకొరిగేదేమిటి? 'అమ్మ కూడా నన్నర్థం చేసుకోలేదు ' అని వాడు బాధ పడటం, మీ ఎడబాటు, మరో పిల్ల గొంతు కోత!లేక మీరిద్దరూ మమ్మల్ని ధిక్కరించి పెళ్ళి చేసుకున్నా, నా మీద మీకెప్పుడూ గౌరవం ఉండదు, కొన్నాళ్ళ తర్వాత మనం కలిసున్నా సరే!మానసికంగా దూరంగానే ఉంటారు.నాకు వాడు, వాడి సంతోషం ముఖ్యం! అదీ కాక, వాడి ఎంపిక సరైనదని నాకెప్పుడూ నమ్మకమే"

వాళ్ళింట్లో కుటుంబసభ్యుల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయో నాకప్పుడే తెలిసింది.పైగా మా వివాహానికి గ్రీన్ సిగ్నల్ రావడానికి కారణం, వారి వివాహం కూడా ప్రేమ వివాహమే కావడం! పెళ్లయ్యాక, శ్రీనివాస్ హైదరాబాదులో ఇల్లు దొరకలేదనే కారణంతో నన్ను నెల రోజుల పాటు మా అత్తవారింట్లో(పశ్చిమ గోదావరి లో భీమవరం పక్కనున్న ఉప్పులూరు అనే పల్లెటూరులో)ఉంచాడు. ఆ నెల రోజుల్లో మా అత్తగారు, నేను మరింత స్నేహితులమయ్యాము. ముఖ్యంగా మా ఇద్దరి ఉమ్మడి అభిరుచి క్రాస్ వర్డ్ పజిల్స్ పూర్తి చేయడం కావడంతో అదంత పెద్ద కష్టం కాలేదు. అప్పట్లో ఆంధ్ర ప్రభలో అరుణ మణి పేరుతో శ్రీ పెద్ది భొట్ల సుబ్బరామయ్య గారు కష్టమైన (పొద్దు పజిల్స్ లాగానే) పజిల్స్ ఇచ్చేవారు.అవీ, రచన మాసపత్రికలో ఇచ్చే బహు కష్టమైన పజిళ్ళు ఇద్దరం కలిసి పూరించేవాళ్ళం .ఇప్పటికీ కష్టమైన పజిల్ కి సొల్యూషన్ ఇస్తే దానికింద సరిగ్గా పూరించిన వారి పేర్లలో బి.పద్మావతి గారి పేరు తప్పక ఉంటుంది.

ఆ నెల్రోజుల్లోనే నేను శ్రీనివాస్ కి ఇష్టమైన పనసపొట్టు ఆవ పెట్టిన కూర, వంకాయ పచ్చి పులుసు, కంది పచ్చడి,పాఠోళీ వగైరాలన్నీ నేర్చుకున్నాను. మా మామ గారి పాత్రని విస్మరించకూడదిక్కడ! ఆయన ఇంట్లో ఉన్నారంటే పొట్ట ఒకచేత పట్టుకుని ఉండాల్సిందే ! అంత హాస్యంగా మాట్లాడతారు.
మా అత్తగారు నరసాపురం లో హైస్కూలు హెడ్ మిస్ట్రెస్ గా రిటైర్ అయ్యారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బిజీగా ఉన్నా, పిల్లలు ముగ్గుర్నీ ఎంత క్రమశిక్షణతో పెంచారంటే, బాగా కోపం తెప్పించే అంశాన్ని కూడా పాజిటివ్ గా తీసుకుంటారు వాళ్ళు.నా వల్లయితే కాదనిపిస్తుంది ఒక్కోసారి.ఆమె రిటైర్ అయ్యాక, పిల్లల కోసం పాటలు, పద్యాలు రాసి పత్రికలకు పంపుతుండే వారు.

ఆవిడ సత్సంగీ!(దయాల్బాగ్, ఆగ్రా)అందువల్ల మడి, పూజలు కూడా తప్పనిసరి కాదు. మా మామగారు సంత్సంగీ కాదు. ఆయన పూజకు మాత్రం ఈవిడాన్నీ రెడీ చేసి ఉంచుతారు. ఒకరి ఆధ్యాత్మిక చింతనని ఒకరు విమర్శించుకోరు. ఎవరి space వాళ్లకుండటం అంతే ఇదేనేమో అనిపిస్తుంది నాకు.

రెండు వేపులా డబ్బున్నా, అలక పానుపు దగ్గరో, మనుగుడుపుల దగ్గరో చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని జీవితాంతం కోడళ్లని సాధించిన (సాధించడం అంటే తిట్టక్కర్లేదు, కొట్టక్కర్లేదు, నవ్వుతూ ఒక వ్యంగ్యం విసిరితే చాల్దూ) వాళ్ళని బోలెడు మందిని చూశాను నేను. మా ఇంట్లో కట్నానికే చోటు లేదు, ఇక లాంచనాల దాకా ఎందుకు? మా వారు నా మీద ఫోన్లో ఏవైనా ఫిర్యాదులు చేసినా నాకేం భయం లేదు. ఎందుకంటే అటువేపు నుంచి మా అత్తగారు " ఇహ ఆపరా! నా కోడలి సంగతి నాకు తెల్సులే,నువు మూసెయ్ " అంటారని నాకు తెలుసు.
మా ఇంట్లో పద్ధతులివీ, నువ్విలాగే ఉండాలి అని ఈనాటికీ నాకెవరూ అత్తవారింట్లో చెప్పలేదు.(నేనూ అడ్వాంటేజ్ తీసుకోలేదు).

మా అత్తగారొస్తే నాకు చిన్న నాటి స్నేహితురాలొచ్చినట్టుంటుంది. చెప్పుకోడానికి బోలెడు కబుర్లొస్తాయి. మామూలు ఆడవాళ్ళే అయినా, కోడళ్ళ విషయంలో హెడ్ మిస్ట్రెస్సుల్లా ఉండె అత్తగార్లకి వ్యతిరేకంగా నిజజీవితంలో హెడ్ మిస్ట్రెస్ అయ్యుండి, కోడలితో స్నేహితురాలిలా ఉండేది ఒక్క పద్మావతి గారేనేమో!
నేను కవితాత్మకంగా చెప్పలేకపోయుండొచ్చు, సమగ్రంగా చెప్పి ఉండకపోవచ్చు. కాని మనస్ఫూర్తిగా మాత్రం చెప్పాననిపిస్తోంది.

కోడలిలో కూతుర్ని చూడగలిగిన ఆ అమ్మకి మదర్స్ డే సందర్భంగా తలవంచి నమస్కరిస్తున్నాను.

30 comments:

రాఘవ said...

ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను మీరు వ్రాసిన "మా వారి అమ్మ కథ" చదివాక.

దీపు said...

@సుజాత గారు
మీరు జాన్ హైడ్ కనుమూరి గారిని బొల్లోజు బాబా గారనుకుంటున్నారనుకుంట.. మీ అత్తగారు ఆరోగ్యంతో హాయిగా జీవించాలని కోరుకుంటున్నాను.. ఇంకా "మనుగుడుపు".. ఈ పదాన్ని చిన్నప్పుడు అంటే దాదాపు పదిహేనేళ్ళ క్రితం మా అమ్మమ్మ అంటుంటే విన్నాను.. మరలా ఇదే.. ఒక తెలుగు పదాన్ని మరిచిపోనీకుండా చేసినందుకు థాంక్స్...

sujatha said...

deepu gaaru, you are right!I made a mistake! I got confused. I will contact to john hide gaaru. Thanks verymuch!

కొత్త పాళీ said...

మీ అత్తగారికి నమస్కారాలు. అంత మంచి అత్తగారిని పొందినందుకు మీకు అభినందనలు.
..ఇప్పుడు ఒక అరడజను వీణలు మోగుతున్న బేక్ గ్రవుండ్ మ్యూజిక్ ...
"ఆదీ లక్ష్మి వంటి అత్తా గారివమ్మా ..
సేవలంది మాకు .. వరములీయవమ్మా .."

Kathi Mahesh Kumar said...

మీ అదృష్టాన్ని మాతో పంచుకుని, మమ్మల్ని అదృష్ట వంతుల్ని చేశారు. చాలా మంది ఆడవాళ్ళు మీమీద ఈర్షపడి ఉంటారండోయ్!

రానారె said...

మనుగుడుపు అంటే ఏమిటండీ?

నిషిగంధ said...

మీమీద పెద్ద ఎత్తున కుళ్ళుకుంటున్నానండి! నన్నడిగితే మంచి భర్త దొరకటం కంటే మంచి అత్తామామలు దొరకటం అసలైన అదృష్టం అని చెప్తాను.. మీ 'అత్తమ్మ ' గారికి నా హృదయపూర్వక అభివాదాలు!

ఇంతకీ పాఠోళీ అంటే ఏ రకమైన వంటండీ?

sujata said...

సుజాత గారు..

అత్తగారి విషయంలో నేనూ అధ్రుష్టవంతురాలినే. నేను ఆఫీసు నించీ రాగానే వేడిగా కమ్మని భోజనం పెడతారు. నేను లేనప్పుడు కూడా ఎపుడైనా.. మా అక్క ఆఫీసు పని మీద ఆ ఊరు వస్తే మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకంటే.. మా ఇంట్లో మా అమ్మగారింట్లో ఉన్నట్టే ఫ్రీ గా ఉండొచ్చు. ఇంకా తనకి రాయల్ ట్రీట్మెంట్.. తనకు ఇష్టమైనవన్నీ చేసి పెడతారు. ఆవిడ మంచి పనిమంతురాలు. నాకు కూడా పూజకు అన్నీ రెడీ చేస్తారు. శనివారం ఉపవాసం ఉంటాము. అపుడు నాకు ఆకలవుతుందని.. పళ్ళూ..పాలూ..రక రకాలు మిగతా రోజుల కన్నా ఎక్కువ పెడతారు. పెళ్లి అయ్యాకా.. బోల్డంత బరువు పెరిగిపోవడానికి ఆవిడా.. ఒక కారణమే. చూసారా.. ఇక్కడ కూడా మనకి సారూప్యత ..?!

రాధిక said...

నాకు తెలిసినంతవర్కు మనుగుడుపు అంటే పెళ్ళయ్యాకా అల్లుడికి తినిపించేది/ తినడానికి ఇచ్చేది.అత్తవారింట్లో ఉన్న అల్లుడికి మూడుపూటలా బాగా పెట్టి వళ్ళు చేయిస్తుంటారు.మా అమ్మ తన అల్లుళ్ళకి మనుగుడుపు పెట్టలేదని చాలా బాధపడింది.ఉద్యోగాల రీత్యా పెళ్ళయిన నాలుగో రోజునే ఊరెళ్ళిపోయారు.ఈ మధ్యకాలం లో డబ్బులు ఇచ్చేస్తున్నారు మీరే తినండని.అదేనా సుజాతగారూ
మీరు అదృష్టవంతులు.మీ అత్తగారు కూడా.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

అత్తగారూ,కోదలు గారూ కాదు ఆయన వాసు అనబడు శ్రీనివాస్ ది అసలు అదృష్టం

దీపు said...

@రాధిక గారు

అదే నండి.. పెళ్ళి తరవాత పెళ్ళి కూతురు వాళ్ళు ఇచ్చే మూడు రోజుల విందు,వినోదాల కార్యక్రమం...

ramya said...

చక్కటి అత్తగారు ముచ్చటైన కోడలు.
మీవారి అమ్మ కథలు ఇంకా కొన్ని పంచుతారని ఆశిస్తున్నా.

కృష్ణుడు said...

చాలా సంతోషంగా వుంది.అందరూ అత్తాకోడళ్ళు ఇలాగే వుంటే ఎంత బాగుంటుందో ఈ సమాజంలో.

దైవానిక said...

పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు కాని మరి ఇలాంటి అత్తగారు రావాలంటే ఏమి చెయ్యాలో చెప్పలేదే??
మీరు చాలా బాగా వ్రాస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.
నా బ్లాగు నుంచి మీ బ్లాగుకి లంకె వేసుకోవచ్చా?

sujatha said...

@ రాఘవ గారు,
@ మహేష్ గారు,
@దీపు గారు,
@రమ్య గారు,
@ రాధిక గారు,
@క్రిష్ణుడు(క్రిష్ణ అనబడే ప్రమద గారు, మీరు పేరు మార్చుకోవాలండీ)గారు,

థాక్యూలండీ!

కొత్తపాళీ గారు,
నిజమేనడీ, ఆ పాట నాకు గుర్తు రాలేదు, లేదంటే ఆ రెండు లైన్లతో ముగిస్తే ఇంకా బాగుండేది! రికార్డ్ నా దగ్గర లేదు కానీ, చెవుల్లో ఆ బ్రుందగానం రింగు మంటోంది. ధన్యవాదాలు!

నిషిగంధ,
కరక్టే! భర్త సరే, మంచి అత్త మామలు దొరకడం చాల గొప్ప విషయం!

పాఠోళీ అంటే, 1/4 కిలో పచ్చి సెనగ పప్పు నానబెట్టి, అందులో ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర కలిపి మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బి, ఒక అరలీటరు నూనెతో దాన్ని ఒక సంవత్సరం వేయించాలి. (అంత టైం పడుతుంది)deep fry కాదు.చూడ్డానికి crispyగా ఉండాలి, తింటే మెత్తగా ఉండాలి. చాలా కష్టమైన టెక్నిక్ అది. మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు గుర్తు చేయకండి, అసలే బరువు తగ్గే ప్లాన్ లో ఉన్నాను కదా!

@సుజాత గారు,
మళ్ళీనా! బాగుంది! చేతులకు గోరింటాకు పెట్టుకుంటే , మా అత్తగారు పెసరట్లు వేసి తనే తినిపించడం నాకు ప్రతి సారీ ఆశ్చర్యమే!(డజను పెసరట్లు తిన్నాక కూడా).

@రాజేంద్ర కుమార్ గారు,
మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైంది!

@రానారె గారు,
మనుగుడుపులంటే రాధిక గారు చెప్పినదేనండీ!

@దైవానిక గారు,
ఏమో నాకూ తెలియదండీ!రెండూ చేయాలో ఏమిటి? లంకె వేసేసుకోండి! మీ బ్లాగు చూసిన వారు కొంతమందైనా నా బ్లాగు చూస్తారు!

@అందరికీ

లేఖినిలో, వట్రవసుడి (క్రిష్ణుడు, ప్రక్రుతీ) మొదలైన పదాలు రాయడానికి వాడేది ఎలా రాయాలో చెప్తారా దయచేసి!

దైవానిక said...

సుజత గారు, R వాడండి. వచ్చేస్తుంది.
kRShNuDu = కృష్ణుడు

త్రివిక్రమ్ Trivikram said...

అంతమంచి అత్తగారిని పొందగలిగిన మీరు ఎంతో అదృష్టవంతులు. ఆంధ్రప్రభ పజిళ్ళ గురించి నాకు తెలియదుగానీ రచనలో డా. ఎన్.సురేంద్ర కూర్చే పజిలింగ్ పజిల్ చాలా బాగుంటుంది. మధ్యలో కొన్నేళ్ళు విరామం తీసుకున్న సురేంద్ర పోయిన్నెల్లోనే సెకండిన్నింగ్స్ మొదలుపెట్టారు. సత్యం మందపాటి, అవసరాల రామకృష్ణారావు లాంటి వాళ్లు కూర్చిన పజిళ్ళకు, సురేంద్ర కూర్చే పజిళ్ళకు తేడా గమనించారా?

sujatha said...

దైవానిక గారు,

థాంక్యూ!

త్రివిక్రం గారు,
థాంక్యూ! రెండేళ్ల నుంచి బెంగుళూరులో ఉండటం వల్ల రచనలో పజిల్స్ చూడ్డం లేదు.(ఇక్కడ రచన దొరకదు) కానీ సురేంద్ర గారి పజిల్స్ రెండు మూడు సాల్వ్ చెయ్య(లేక)కుండా వదిలేసాను కూడా నేను! సత్యం గారి పజిల్స్ తొందరగానే పూర్తి చెయ్యొచ్చు. ఇప్పుడు ఆంధ్ర ప్రభ వీక్లీలో కూడ ఇస్తున్న పజిల్స్ కష్టంగా ఉంటున్నాయి. కానీ పజిల్స్ అనేవి కష్టంగా ఉంటేనే కదా మజా!

త్రివిక్రమ్ Trivikram said...

సుజాతగారూ!

ఏప్రిల్ నెల పజిలింగ్ పజిల్ రచన వెబ్సైట్లో ఉంది చూడండి.

>>పజిల్స్ అనేవి కష్టంగా ఉంటేనే కదా మజా!

అందుకే గదా పొద్దులో 'గడి కష్టంగా ఉంది బాబోయ్' అని పాఠకులు ఎంత గోలపెడుతున్నా క్రిప్టిగ్గానే ఇస్తున్నది? :)
ఇప్పుడు సుగాత్రి బ్లాగులో చర్చ చూడండి ఎంత రసవత్తరంగా నడుస్తోందో?

మేధ said...

సుజాత గారు, పైన అందరూ చెప్పిందే నేను మళ్ళీ చెబుతున్నాను.. అంత మంచి అత్తగారు దొరికినందుకు అభినందనలు...

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ బ్లాగు పోస్టుకు వచ్చిన అభిప్రాయాల సంఖ్య చూసి ఈర్ష్య వేస్తుందండీ!

ఇంతమదిని కదిపిన మీ రచనకు, అనుభవాలకు అభినందనలు

sujatha said...

మేథ గారు,
జాన్ హైడ్ గారు,
ధన్యవాదాలండీ!

te.thulika said...

Beautiful. మీ అమ్మలాటి అత్తగారిగురించి చెప్పినవన్నీ మళ్లీ గుర్తుకొచ్చి కళ్లు చెమ్మగిల్లేయి. మీరు కూడా అలాటి అత్తగారే కాగలరెప్పుడో :). సంఘం మారుతోందనడానికి ఇంతకన్నా ఏంనిదర్సనం కావాలి.

వికటకవి said...

సుజాత గారు,

చాలా బాగా రాశారండీ. ఒక్క సలహా, ముఖ్యంగా మహిళా బ్లాగర్లకి. మీరు కొన్ని వ్యక్తిగత విషయాలు (చదవటానికి చక్కగా ఉన్నయి కానీ ఇది అంతర్జాలమనీ మంచి ఎంతో చెడు దానికి రెండింతలెక్కువ ఉంటుందనీ మరవకండి)సాధ్యమయినంత వరకు గోప్యంగా ఉంచితేనే మంచిది. మరోలా భావించకండి, మీరు ఆ పర్లేదనుకుంటే చెప్పలేను కానీ, ఇక్కడ రాసే ప్రతి ముక్కా ఎక్కడో ఓ చోట శాశ్వతంగా నిక్షిప్తమై ఉంటుందని మరువకండి.

sujatha said...

vikaTakavi gaaru,
thank you very much for the valuable advice. you are right! I will take care!

రానారె said...

మనుగుడుపు (మనువు, కుడుపు) వరెవ్వా! భలే పదాలున్నాయి మనకు. ఇంకా పాఠోళీ కూడా నాకు కొత్తపదమే. ఈ పదాన్ని పాతాళభైరవి సినిమాలో వాడుకొని వుండొచ్చు. :)

రాధిక, దీపు, సుజాతగార్లకు థాంకులు.

duppalaravi said...

మనసును కదిలించే మీ రాత, ఎవరికో కాని దొరకని అదృష్టం. ఆ అపురూప వైభవాన్ని అందరితో చెప్పుకోవడం చాలా మంచిది. కుళ్లుకున్నవాళ్లని కోనివ్వండి. కనీసం ఇది చదివిన వాళ్లయినా ఇలా కావాలనుకుంటే తర్వాతి తరానికయినా ఎంత బావుంటుంది కదండీ. వికటకవి గారికి భయమక్కర్లేదు. ఇలాంటివి నిక్షిప్తమవనీండి. చాలా మంచి మానవీయతా దృశ్యం కదా. అందరికీ పాఠమ్ అవుతుంది.

-దుప్పలరవికుమార్

Purnima said...

మీరు చెప్పిన ఇన్నాళ్ళకి కుదిరింది ఈ టపా చదవటం. ఇంకా నాకంటూ అనుభవం లేదు కానీ.. చూట్టూ చూస్తుంటానా.. ఏదోలా ఉంటుంది.

నీ వాడికి అమ్మ అయినప్పుడు... నీకు అమ్మకన్నా ఎక్కువ.. ఒక రెడీమేడ్ జీవితాన్ని నీకిచ్చింది గనుక అని నా అభిప్రాయం. కానీ ఎందుకో.. కొందరి జీవితాల్ని తరచి చూస్తే ఇవ్వన్నీ కబుర్లే కానీ నిజం కావు అనిపించేలా ఉంటాయి. పెళ్ళయిన కొత్తలో అన్నీ నేర్చుకోటానికి అమ్మాయి అత్త వెంట తిరుగుతూ.. అన్నీ నేర్చుకున్నానుకుని "మీ అమ్మ చుట్టూ తిరుగుతావు" ఇక్కడుంటే అంటూ భర్తను తీసుకెళ్ళేవాళ్ళనీ చూస్తున్నాను. డబ్బుకోసమో.. దర్పం కోసమో.. అత్తమామలను దూరం పెట్టే వారిని చూశాను. వాళ్ళ బాధని చూశాను. నన్ను చాలా కలవరపెట్టిన విషయాల్లో ఇది ఒకటి.

మీ టపా చదివాకా అదో హాయి కలిగింది. Best wishes to your entire family!!

RamaniDeepika said...

inta goppa attagariki kodaliga velladam nijamga mee adrustam.
Enta manchi attagarina edo oka sandharbhamlo kodalni oka mata ani badha pettakunda vundaru alage enta manchi kodalu ayina edo oka vishayamlo attagarilo tappulu enchutundi ani chala balam nammutanu nenu.

Mee post chadivina taravata naa abhiprayam kocnahm marchukovachhu ani anipistondi :)

vvraomyneni said...

good

Post a Comment