October 30, 2008

సెంచరీ కొట్టేశాను!

సెప్టెంబర్ 29 న నేను రాసిన "మీ చదువులే మా చావులు" టపా అక్షరాలా వంద వ్యాఖ్యలను సంపాదించింది. వీటిలో నా ప్రతిస్పందనలు కూడా ఉన్నాయి. వాటిని మినహాయించినా అత్యధికంగా కామెంట్లకు నోచుకున్న టపా గా దీన్ని భావిస్తున్నాను. నేను కూడలికి చేరి ఆరు నెలలే కాబట్టి అంతకు ముందు ఏ టపాకైనా ఇంత ప్రతిస్పందన వచ్చిందేమో నాకు తెలియదు.



టపా అంశం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుభవించిందీ, ఇప్పుడు పిల్లల కోసం అనిభవిస్తోందీ కావడంతో ప్రతి ఒక్కరూ వారి అనుభవాలనూ, అభిప్రాయాలనూ పంచుకోవడంతో ఇన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నాకెదురైన అనుభవాలను పంచుకుందామనుకున్నానే గానీ ఇంత మంది విద్య కు అయ్యే వ్యయం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారనీ, కొంత మంది ఈ చదువు ఖర్చుల గురించి ఆందోళన పడుతున్నారనీ నాకు ఇప్పుడే తెలిసింది.


వ్యాఖ్యాతలందరికీ శతకోటి ధన్యవాదాలు.

వందో వ్యాఖ్య రాసిన సత్యాన్వేషి గీతాచార్య కు ప్రత్యేక ధన్యవాదాలు!

October 26, 2008

ఆరోజులికముందు రావేమి నేస్తం!


పిల్లలకు ఇష్టమైన రెండు పండగలు చెప్పండంటే ఏం చెప్తాం...వినాయక చవితి, దీపావళి అని తప్పించి? పిల్లలందరూ కలిసి పార్టిసిపేట్ చేసి..అనుభవించి, ఆనందించే పండగలు ఈ రెండూ! కానీ మా చిన్నప్పుడు మేము జరుపుకున్న దీపావళికీ, ఇప్పుడు పిల్లలు జరుపుకుంటున్న దీపావళికీ పోలికే లేదు.


అసలు వినాయక చవితికి పత్రి "కొనడం" అనే concept ఏమిటో పెద్దయ్యాక నాకు చాల్రోజులు అర్థం కాలేదు. పిల్లలంతా కలిసి తోటల మీద పడి, చెట్లెక్కి అక్కడినించీ పడి...పత్రి సేకరించడం అన్నది ఇవాళ పల్లెటూర్లలో కూడా కనపడదు.


దీపావళి మందులు ఇంట్లో తయారు చేయడం అన్నది కూడా ఇవాళ టౌన్లలో, పల్లెటూర్లలో లేదు. ప్రతిదీ డబ్బు "పారేసి" కొనడమే!

నిన్న టపాసులు (పటాసులు అనాలా టపాసులే కరెక్టా) కొనడానికి వెళితే ధరల ధాటికి కళ్ళు తిరిగి వాటర్ బాటిల్ కొనవలసి వచ్చింది.(మళ్ళీ ఇదో ఖర్చు)
 కాకర పువ్వొత్తుల పాకెట్టు అనగా పన్నెండు కాకర పువ్వొత్తుల గల పాకెట్ అక్షరాలా 120 రూపాయలు. మతాబులు ఒక్కోటీ పదిహేను రూపాయలు.
 రెండు సెకన్లు వెలిగే చిచ్చు బుడ్డి ఒక్కోటీ పది రూపాయలు,
ఐదు సెకన్లు పని చేసేదైతే నలభై రూపాయలు.
మట్టి ప్రమిదలు ఒక్కోటి ఆరు రూపాయలు. అవి టెర్రకోటవైతే పదిరూపాయల నుంచి మొదలు ఒక్కోటీ!
కరెంట్ తీగలు, వెన్నముద్దలు చివరికి అగ్గిపుల్లలు కూడా భగ్గున మండిపోయే రేట్లోనే ఉన్నాయి.
ఇక 5 thousand waala, 10 thousand wala గురించి ఆలోచించే ధైర్యం వస్తుందా వీటి రేట్లు వింటుంటే! ఒక్క స్టాక్ మార్కెట్ తప్పించి అన్నీ పై పై కే! అసలు నిజంగా దీపావళి మందులు ఉత్పత్తి వ్యయం+లాభం కులుపుకుంటే కూడా ఇంతింత ధరలు ఉండడం న్యాయమేనా అనిపిస్తోంది నాకు!

కాసేపు చిన్నప్పటి రోజుల తల్చుకుని రిలాక్స్ అయితే తప్పించి ఈ ధరల షాక్ నించి తేరుకోవడం కష్టం!

చిచ్చు బుడ్లు,మతాబులు వగైరాలు బయట మార్కెట్లో కొనడం మా ఇంటా వంటా ఉండేది కాదు. మామయ్యలు, పిన్ని, పెద్దమ్మ(మేము ఆమ్మ అంటాం పెద్దమ్మను) మేనత్త అంతా ఒకే వూళ్ళో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటంటే కజిన్స్ అందరూ తరచుగా కలుసుకోవడం ! ఇది వాళ్ల మధ్య ఎంతటి ప్రేమను, స్నేహ భావాన్ని, ఆప్యాయతల్ని పెంచి, పంచుతుందో ...నాకు బాగా తెలుసు.ఇప్పుడు మేమంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, అందరం  కలిసినపుడు ఒక్క సారిగా చిన్న పిల్లలమై పోయి..మా పిల్లల్ని కూడా మర్చిపోతాం. పైగా వాళ్లందరిలోనూ నేనూ, మా చెల్లి చిన్న పిల్లలం కావడంతో వాళ్ళు మమ్మల్ని ఇంకా పసివాళ్ళుగానే చూడ్డం భలే 'కిక్' ఇస్తుంది.


మా చిన్నన్నయ్య, వాడి వయసు కజిన్స్ దసరాకు ముందు నించే చిచ్చు బుడ్లు, మతాబులు,సిసింద్రీలు,తారాజువ్వలు,(అవ్వాయి చువ్వాయిలు),తాటాకు టపాకాయలు

తయారు చేయడం లో బిజీ అయిపోయే వాళ్ళు. "అంత శ్రద్ధ వాళ్ళు చదువు మీద పెట్టడం ఈ పాపిష్టి కళ్ళతో ఎప్పుడు చూస్తానో" అని మా అత్త వాపోతుండేది.


 కోమట్లబ్బాయి గుప్తా తో కల్సి సూరేకారం, గంధకం(రెండూ ఒకటి కాదు కదా) ఇంకా ఏవేవో సరుకులు తెచ్చి పడేసే వాళ్ళు. వాటిని డాబా మీద ఎండబెట్టడం! మా పని ఏమిటంటే ఎండబెట్టిన వాటికి వెధవ కాపలా కాయడం! కుమ్మరి బజారుకెళ్ళి చిచ్చుబుడ్లకోసం,మట్టి కంటైనర్లు(ముంతలంటే అర్థం కావొద్దూ)ఆర్డరిచ్చి తయారు చేయించేవాళ్ళు.


తయారు చేసేటపుడు ఎంత హడావుడి చేసేవాళ్ళో తల్చుకుంటే మండిపోతుంది. చిన్న పిల్లలమనే వంకతో మమ్మల్ని అటువైపు రానిచ్చేవాళు కాదు. మతాబులు చుట్టడానికి మాత్రం పేపర్లు కత్తిరించి ఇచ్చేవాళ్లం.వీళ్ళు తయారు చేసిన టపాసులని మేం దొంగిలించి  స్నేహితులకు కొన్ని ఇచ్చి వితరణ వెలగబెట్టేవాళ్ళం కూడా!



చీపురు పుల్లలు లేకుండా తయారు చేసిన తారాజువ్వలు(వీటికి బోడి జువ్వలని పేరు)వెలిగించి వదిలేస్తే అవి దిక్కు తెలీకుండా పరిగెత్తేవి. అందుకే అన్నయ్యలు, ఇతర కజిన్స్ అందరూ పాంట్లు వేసుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళు.


పండగ లోపుగా ఎర్రని మందు బిళ్ళలు(ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి),వాటి రోల్స్ చిన్ని తుపాకుల్లో పెట్టి మధ్యాహ్నం ఎవరికీ మనశ్శాంతి లేకుండా "ఢాం ఢాం " అని పేల్చేస్తుండేవాళ్ళం. ఇవి కాకుండా నాన్నారు తెచ్చిన మందులు చేటల్లో న్యూస్ పేపర్లు వేసి ఎండబెట్టి వాటికి కాపలా కాయడం గొప్ప సరదా కలిగించే బాధ్యత.


పండగ సాయంత్రం నిమిషాల కొద్దీ చిచ్చు బుడ్లు పువ్వులు చిమ్ముతుంటే, వాటిని తయారు చేసిన కళాకారుల మొహం లో సంతోషం ఆ వెలుగులకు పదింతలు ఉండేది.కొన్ని మందులు దాచిపెట్టి కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ కాల్చేవాళ్ళం.


ఆ మధ్య అత్తయ్య కొడుకు  కలిసినపుడు "ఈసారి దీపావళికి చిచ్చుబుడ్లు తయారు చేద్దాం రా " అంటే వాడు మా వారివైపు చూస్తూ.."మీ ఆవిడకు భలే తింగరి అయిడియాలు వస్తాయండీ! రోజు ఇంట్లో కూడా ఇంతేనా" అనడిగాడు!



ఫెస్టివ్ ఆఫర్ల గోల,వాకిలికి కట్టే మావిడాకుల నుంచీ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి,"హాపీ దివాలీ " అంటూ పెదాల చివరినుంచీ రాలే పొడి పొడి శుభాకాంక్షలతో నార్త్ ఇండియన్ చెమికీలద్దుకున్న 'దివాలీ ' ని దివాలా తీసిన మొహాలతో (టపాసులు కొనే సరికి ఎలాగూ దివాలా తీసి ఉంటాం కదా) జరుపుకోడానికి సిటీలో పూర్తిగా అలవాటుపడిపోయాము.


అందరికీ దీపావళి శుభాకాంక్షలు!