November 20, 2008

వృద్ధుల్ని మట్టుపెడదాం, రండి!

మొన్నామధ్య నవ్య వీక్లీ(ఆంధ్రజ్యోతి ప్రచురణ) దీపావళి సంచిక లో ఒక కథ చదివాను. చదివాక ఏం చెయ్యాలో తెలీలేదు.(పుస్తకం పక్కన పడెయ్యాలి అనకండి, విషయం అది కాదు)ఆ కథ పేరు "కిల్లింగ్ మెర్సీ"!
 మానవత్వానికి మచ్చ తెచ్చే ఆ కథని ఎలా యాక్సెప్ట్ చెయ్యాలో అర్థం కాక, పత్రిక ఎడిటరు గారికి ఒక ఉత్తరం రాసి పడేసాను.

"ఆర్యా, ఈ కథ ప్రచురించడం వల్ల మీరు పాఠకులకు ఏం చెప్పదల్చుకున్నారో పత్రికా ముఖంగా
తెలియజేయగలరు" అని! ఆ కథని మీకు ఇక్కడ  పరిచయం చేయబోతున్నా!


సుమధుర(పేరు చూడండి, ఎంత అందంగా ఉందో), మెర్సీ చిన్నప్పటినుంచీ స్నేహితురాళ్ళు. సుమధుర ఇంటిపక్కనే ఉండే మెర్సీ సుమధుర ఇంటి తోటలో పూసే గులాబీలంటే ఎంతో మోజు పడేది. పెద్దయ్యాక మెర్సీకి పెళ్ళై, భర్తతో ఊటీ వెళ్ళిపోయింది. మెర్సీ అత్త దయామయి కి మొగుడి ద్వారా సంక్రమించిన బోలెడు
ఆస్థి ఉంది. కొడుకూ కోడలు దగ్గరే ఉంది.

మెర్సీ, సుమధురా ఇద్దరూ రిటర్మెంట్ వయసు వాళ్లయ్యారు. సుమధుర వాళ్ళ నాన్నగారు స్థాపించిన అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ ఉంది. ఆ శరణాలయాల పనుల మీద ఊటీ వెళ్ళి, మెర్సీని కలిసింది. మెర్సీ అత్తకి
అప్పటికి 89 ఏళ్ళు వచ్చాయి. ఆవిడ పనులతో విసిగిపోతున్నానని, ఎక్కడికీ వెళ్లడానికి కూడా పడటం లేదని మెర్సీ సుమధురతో వాపోయింది.పైగా ఆ ముసలావిడ ఆస్థి అంతా తన వద్దే ఉంచుకుని "ఇదిఓ అదిగో " అని కాలం
గడిపేస్తోంది తప్ప ఎంతకీ ఆస్థి కొడుక్కి ఇవ్వడం లేదు.  తొంభై దగ్గర పడ్డా జిహ్వ చాపల్యం చావలేదు.

మెర్సీ  విసుక్కుంటుందే కానీ ముసలావిడకు ఇష్టమని మాంసం కూరలూ అవీ చేసి పెడుతూనే ఉంటుంది. కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కాకపోతే తనకు బ్రేక్ అనేదే లేకుండా పోయిందని స్నేహితురాలి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది.మెర్సీ భర్త కెన్నీ తన తల్లి తొభయ్యో పుట్టిన రోజు మరుసటి రోజే కాబట్టి, తమతో కూడా ఉండి పార్టీలో పాల్గొనాలని సుమధురని కోరాడు.

ఆ మరుసటి రోజు ఉదయం మెర్సీ తోటలో కూచున్న సుమధురకి మెర్సీ తన గులాబీలను
చూపిస్తూ "ఏమిటో సుమధురా, మీ తోటలో పూసినట్టు పూయవు నా గులాబీలు!రేకలు సమానంగా ఉండవు" అంటుంది.


రాత్రికి దయామయి పుట్టినరోజు పార్టీ జరుగుతుంది.మెర్సీ కేకు తయారు చేస్తుంది. ముసలావిడ "ఇక చాల్లే" అని కొడుకు ఆపే వరకూ కేకు తింటుంది.

పార్టీ అయ్యాక కూడా "కేకుందా, అయిపోయిందా" అనడుగుతుంది.

ఆరోజు రాత్రే నిద్రలో దయామయి ప్రాణం విడుస్తుంది. అందరూ 'తొంభయ్యో పుట్టిన్రోజు కోసమే ఆగింది ముసలావిడ ప్రాణం" అని చెప్పుకుంటారు.సుమధుర ఊరెళ్ళిపోతుంది.

కొద్ది రోజుల తర్వాత మెర్సీ సుమధురకి 5 లక్షలకు చెక్కు పంపుతూ "అత్తమ్మకి బతికున్నన్నాళ్ళూ సేవ చేయగలిగాను. కంఫర్టబుల్ గా ఉంచగలిగాను, ఆవిడ ఆస్థిలో కొంత నీ అనాధ శరణాలయం కోసం
పంపుతున్నాను"అని ఉత్తరం రాస్తుంది.

అపుడు ఊటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా విప్పని తన ట్రావెల్ బాగ్ తెరుస్తుంది సుమధుర. అందులో ఒక పురుగుల మందు సీసా ఉంటుంది. పార్టీ రోజు రాత్రి అందరూ నిద్ర పోయాక, ముసలావిడ తిండిపిచ్చిని అడ్డం పెట్టుకుని సుమధుర ఒక కేకు ముక్క మీద పురుగుల మందు పోసి

"మీ కోసమే తెచ్చాను, తినండి" అని తినిపిస్తుంది. ఆవిడ తిని, తెల్లారే సరికి హరీ అంటుంది.

ఇదీ కథ!


ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలో, కనీసం ఏం ఆశించాలో(కథ చదివినందుకు మానసికానందమో, ఆవేదనో, ఆలోచనో ఏదో కలగాలి కదా) అర్థం కాలేదు నాకు. "కథని కథ లాగా చదవాలి '(సినిమాని సినిమాలాగా చూడమన్నట్టు)అనుకోవాలేమో మరి!

కథ సుమధురే నెరేటర్ గా 'నేను ' అని ప్రథమ పురుషలో సాగుతుంది.

తొంభై యేళ్ళ ముసలావిడ పట్ల సుమధుర భావాలెలా ఉంటాయో చూడండి.

ముసలావిడ ఏదో మాట్లాడుతూ ఉంటే "ఏమిటి మెర్సీ, ఆ "చెత్త వాగుడంతా" వింటూ
కూచోమన్నావా" అంటుంది కోపంగా!

మెర్సీ ఎంత చేసినా ముసల్ది తప్పులెంచుతూనే ఉండేదిట. కోడిగుడ్డుకి ఈకలు పీకే రకంట!

మెర్సీ వాళ్ళ అత్త మీద ఎక్సెస్ మెర్సీ చూపిస్తోందనిపించిందిట. అందుకే ఆ మెర్సీ ని కిల్ చేయాలని ముసలావిడకు పురుగుల మందు పట్టించిందిట.

పైగా చివరి వాక్యం చూడండి, "ఇప్పుడు మెర్సీ గార్డెన్ లో రోజెస్ తనిచ్చే ప్రేమతో చక్కగా వికసిస్తాయి" ట!

ముసలావిడ మీద అకారణ ద్వేషం పెంచుకుని పరలోక ప్రయాణం కట్టించిన
సుమధుర చేసే పనేంటో తెలుసా..అనాధ శరణాలయాలు నడపటం.  ఇంత "దయా హృదయురాలు" అలాంటి పనెలా చేస్తుందో మరి! వాళ్ల శరణాలయాల్లో కూడా ఎవరైనా తొంభై దగ్గర పడ్డ ముసలాళ్ళుంటే ఇలాగే గుటుక్కుమనిపిస్తుందో ఏమిటో!

కందకు లేని దురద కత్తి పీటకెందుకని....మెర్సీ కి లేని  కోరిక (ముసలావిడని చంపాలని ) ఈవిడకెందుకో! మెర్సీకి ఆవిడ మీద ద్వేషం ఏమీ లేదని ఆమె రాసిన ఉత్తరం చెప్తూనే ఉంది.

వయసు బాగా మీద పడ్డ వృద్ధులు ఏదో ఒక సొద చాదస్తంగా మాట్లాడుతూనే
ఉంటారు. వారిని అస్తమానూ కనిపెట్టుకుని ఉండటం కొంచెం కష్టమైన విషయమే!
 అందుకని "చంపేస్తే పోలా?" అనేసుకుంటే ఒక పనై పోతుందన్నమాట.

సినిమాల సంగతి నాకు తెలీదు కానీ సాహిత్య ప్రభావం సమాజం మీద ఎంతో కొంత ఉంటుందని నేను నమ్ముతాను. ఇలాంటి కథలు ఒక పదో పదకొండో వరసగా వచ్చాయంటే , ఎనభయ్యో, తొంభయ్యో దగ్గర పడ్డ వృద్ధులు ఇంట్లో ఉన్నవాళ్ళకో, లేదా ఏ ఓల్డేజ్ హోం లో అటెండెంట్స్ కో
"గుక్కెడు ప్రాణం ఎంతలో పోవాలి? చంపేస్తే ఎవరికి తెలుస్తుంది. ఎలాగూ ముసల్దేగా" అనిపిస్తే...దాని పర్యవసానం ఏమిటి?
హోం లో చేర్పించాలనుకున్న వాళ్ళు కూడా "ఎందుకూ, ఖర్చు, పీక నొక్కితే
ఫినిష్" అనుకుంటే సరి!
"నిజంగా అలాంటి కర్కోటకులుంటారా ఏమిటి లెద్దూ" అనకండి. ఈ ఫొటో చూడండి..

తల్లిని భారంగా భావించిన పుత్రుడెవరో ఈవిడకు పున్నామ నరకం బతికుండగానే చూపించదలచి గోనె సంచిలోకట్టి ముళ్లపొదల్లో పారేశాడు.


ఇలాంటి సాహిత్య ధోరణులు ప్రబలితే, ఆ తర్వాత మనకి ఎక్కడన్నా రోడ్డు పక్కన ఇలాంటి సంచులు కనపడితే దాటుకుని వెళ్ళేంత ధైర్యం వస్తుంది.

November 7, 2008

హింస ధ్వని




మొన్నొక రోజు మా చిన్నత్త నళిని ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించింది. వాళ్ళబ్బాయి సంగీతం వినడానికి. నిజానికి నాకు వెళ్ళాలని లేకపోయినా ఆమె దగ్గర నావి రెండు పుస్తకాలుండిపోయాయి. అవి ఆవిడ ఎలాగూ తిరిగివ్వదు, నేను వెళ్లయినా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్లింటికి వెళ్ళాను.

లోపలికెడుతుండగానే గదిలోంచి,గుండెలు జలదరించే బీట్ తో మ్యూజిక్ తారాస్థాయిలో వినపడుతోంది. లోపలి గదిలోంచి వాళ్ళ పుత్ర రత్నం కిరణ్, తలుపు తీసి నన్ను చూసి "హాయ్ వదినా" అంటూ ఆహ్వానించాడు.

 "హాయ్ రా కిరణ్" అంటూ లోపలికి వెళ్ళేసరికి పక్క గదిలోంచి, కాలి మీద బూటు కాలు పడితే అప్రయత్నంగా వెలువడే కేకల్లాంటి కేకలు వినపడుతున్నాయి.

"ఆ కేకలేమిట్రా" అంటే వాడు మెరిసే ప్లాస్టిక్ చొక్కాని చూసుకుంటూ, నవ్వుతూ,

"పో వదినా, మేము ఒక ఆల్బం చేస్తున్నాం, దాని ట్రాక్ అది" అని వివరించాడు.

అంతలోంచి పై నుంచి నళిని ఆంటీ దిగొచ్చి, అందుకుంది.

"ఏమిటో నమ్మా, వాళ్ల నాన్న ఎంత చెప్పినా వినట్లేదు వీడు. "టోకీ" గారు వీడి వాయిస్ ని తెగ మెచ్చేసుకున్నారా, అప్పటినుంచీ ఆల్బం చేసే తీరాలని పట్టుకున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో బిడ్డ..." అంది మురిపెంగా
వాడిలో "ఎన్రిక్ ఇగ్లేసియాస్" ని చూసుకుంటూ!

మీకేమీ అర్థం కావట్లేదు కదూ, నాకూ అంతే లెండి మొదట్లో! విషయమేమిటంటే ..
వాడు ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఒక "కింగ్ ఆఫ్ ఇండియా" పాటల
కార్యక్రమంలో మూడు రౌండ్లు దాటాడు.

దానికి జడ్జీగా వచ్చిన "టోకీ" అనే సంగీత దర్శకుడు(పాపం వీళ్ళ నాన్నగారు పాత తరంలో మెలోడీ కి ప్రాణం పోసిన పాటలెన్నిటినో కూర్చిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు)

"సూపర్బ్, నీకు తిరుగు లేదు, నీకు మంచి ఫ్యూచరుంది, రెచ్చిపో" అనడంతో మనవాడు నిజంగానే చదువు చెట్టెక్కించి..(ఇంజనీరింగ్) వాళ్ళ నాన్న సొంత డబ్బులు (లేకపొతే వీడిని ఎవరు స్పాన్సర్ చేస్తారో)ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ ఆల్బం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి నళిని గారి సపోర్ట్ ఎంతైనా ఉందని నాకు తెలుసు.

ఇంతలో కిరణ్ నా గుండె గుభిల్లుమనే వార్త ఇంకోవార్త వినిపించాడు.


"మేమొక మ్యూజిక్ ట్రూప్ తయారు చేస్తున్నాం, మంచి పేరు కోసం చూస్తున్నాం
తెలుసా వదినా?"

"పెట్టండి, bad boys అనో, Road Romeos అనో, లేకపోతే Street hawkers అనో "

అన్నాను గొంతులో కసిని నవ్వు కింద మారుస్తూ!

వాడు అది గమనించకుండా "ఆ పేర్లతో  ఆల్రెడీ ట్రూపులున్నాయి. అందుకే కొత్త పేరొకటి సెలెక్ట్ చేసాం" అన్నాడు.

గుండె చిక్కబట్టుకుంటూ.."చెప్పూ" అన్నాను.

వాడు కొంచెం సిగ్గుపడుతూ,"డర్టీ ఫెలోస్" అన్నాడు.

"ఎవరూ" అన్నాను అయోమయంగా!

"మేమే" అని అంతలోనే కంగారు పడుతూ సరిదిద్దుకుని.."అంటే...మా ట్రూపు పేరు" అన్నాడు.

"సూపర్ గా ఉందిరా పేరు. "ఒక్కడికీ వాయిస్ లేదు" అనో,

 "సింగిల్ పాటతో చంపేస్తారు"  అనో టాగ్ లైను పెడితే బాగుంటుందేమో ఆలోచించు" అన్నాను.
వాడు ఆలోచించబోయి,

నా మాటల్లో వ్యంగ్యం అర్థమైనట్టు "పో వదినా, నువ్వు!సరే ఆల్బం విందువు గానీ, రా" అని లోపలికి తీస్కెళ్ళాడు. ఆ రూమంతా ఆదిత్య 369 సినిమాలో టైం మెషీన్లా ఉంది. ఒక కంప్యూటర్, దానికి అనుసంధానించి కీ బోర్డు, వగైరాలు...స్పీకర్లు...వైర్లు, కేబుల్స్....!


ఆ తర్వాత నేను పడ్డ హింస చెపితే అర్థం కాదు. అనుభవించాల్సిందే!

పొద్దున్న నేను చిన్నత్త వాళ్లింటికి వెళతానంటే ఈయన జాలిగా ఎందుకు చూసారో నాకిప్పుడు అర్థమైంది.



* * *

ఇప్పుడు రాత్రి prime time లో మనం ఏ తెలుగు చానెల్ పెట్టినా , ఇదే గోల!

ప్రతి చానెల్లో ఒక్కో మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసే పాటల

ప్రోగ్రాములు! "బోర్ ఆఫ్ ఆంధ్రా" అని ఒకడు పేరు పెడితే," సూపర్ లూజర్" అనే పేరుతో మరొకడు(ఈ మాత్రం క్లూ లు చాలవూ మీరు ఆ కార్యక్రమాల పేర్లు కనుక్కోడానికి?) మరో చానెల్లో " స ని ద ప మ " అనే పేరుతో!

సోనీ టీవిలో ఇండియన్ ఐడల్ జరిగినప్పటినుంచీ, మన వాళ్ళు కూడా

పిచ్చెత్తినట్టు ఈ కార్యక్రమాలకు ఆంధ్ర దేశం నిండా ఆడిషన్లు పెట్టి "సా పా సా" అనడం వచ్చిన వాళ్లందరినీ టోకున సెలెక్ట్ చేసి పారేసి, మన ఖర్మ కాల్చడానికి ప్లాను వేసేసారు.

ఈ కార్యక్రమాలకు జడ్జీలు గా వచ్చే "గాయ"కులు(నీ మణులు) బుద్ధ విగ్రహాలల్లే కూచుని అపశ్రుతులతో పాడిన వాళ్ళను కూడా "నీ గొంతు "యూనిక్" గా ఉంది. ఇలాంటి గొంతులు అందరికీ ఉండవు(అది నిజమేలెండి)
అని ఓ మెచ్చేసుకోవడం!

ప్రతి చానెల్లో ఈ ప్రోగ్రాములు ఉండటం వల్ల, పోటీ ఎక్కువై, ఎక్కువమందిని ఫిల్టర్ చేసే అవకాశం లేక కనపడిన వాళ్ళందరి చేతా పాడించెయ్యడం మొదలెట్టారు. ఆ పాట పాడిన వాళ్ళకు గాత్ర శుద్ధి లేదని, శ్రుతి అవుట్ అయిపోతోందని,తెలియడానికి సంగీతం తెలియక్కర్లేదు. కనీసం సినిమా పాటలు వినడం తెలిస్తే చాలు.

అయినా జడ్జీలు "I have no words. excellent" , "I'm speech less" అంటారు.

ఈ మధ్య మా స్నేహితుడొకరు(సంగీత దర్శకుడు)తను కూర్చిన పాటల ట్యూన్లు వినడానికి పిలిస్తే వెళ్లాము. అతను చెప్తే తెలిసింది. ఈ కార్యక్రమాల్లో పాడేవాళ్లందరినీ అలా మెచ్చేసుకోవాలని జడ్జీలకు ముందే నిబంధనట!

ఎందుకంటే ఎవర్నీ నిరాశపర్చకూడదట!


ఒక జాతీయ హిందీ చానెల్ పెట్టిన పాటల పోటీలో రన్నరప్ గా నిలిచిన నల్లాన్ చక్రవర్తుల వారి అబ్బాయి వారుణ్య, ఆ పోటీ తర్వాత ఎప్పుడైనా కాసేపు శాస్త్రీయ సంగీతం ప్రాక్టీస్ చేసుంటాడంటారా? చెమికీలు, అద్దాలు, పూసలు, కుందన్స్,బల్బులు వగైరాలు కుట్టిన మెరిసే చొక్కాలు వేసుకుని,స్టీలు బెల్టులు, పూసల గొలుసులు వేసుకుని ప్రస్తుతం పాటల ప్రోగ్రాములకు యాంకర్ గా చేస్తున్న అతడిని చూస్ట్తే ఎంత బాధ వేస్తుందో!

ఈ రోజు వారీ సంగీత హింసే కాక, కొన్ని చానెళ్ళు "ఒక్కతే" అని, "ఏడే స్వరాలు" అనే పేర్లతోనూ పాపం డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన ఒక గాయనిని యాంకర్ గా పెట్టుకుని వారాంతంలో కూడా టీవీ వైపు చూడాలంటే దడ పుట్టేట్లు చేస్తున్నారు.


కొన్ని చానెళ్ళలో అన్ని రౌండ్లూ ముగిసి, ఫైనల్ కి వచ్చే వాళ్ళు ప్రేక్షకుల SMS ల దయతో కాస్త మంచి వాళ్ళే మిగులుతున్నారు.కొన్నింటిలో అదీ లేదు. ఇంతా చేసి ఈ గాయనీ గాయకుల అంతిమ లక్ష్యం ..
"సినిమాల్లో పాడటం"! ఇంతవరకు గెలిచిన వాళ్లకు ఎంత మందికి సినిమా అవకాశాలొచ్చాయో అందరికీ తెలిసిందే!

సెమీ ఫైనల్స్ కి చేరిన వాళ్ల ఇంటికి చానెళ్ళ వాళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళి,వాళ్ల ఆవకాయ జాడీలు, సింకులో అంట్లూ,బాత్ రూములో బకెట్లు, ఇంటి ముందు ముగ్గూ, కుంపట్లో బొగ్గు,వాళ్ళ బొచ్చు కుక్కపిల్ల, దాన్ని ఆడించే పని పిల్ల,వాళ్ల తలుపు గొళ్ళెం, తోమని హారతి పళ్ళెం, అన్నీ పడేట్టు చిత్రీకరిస్తూ వాళ్ల ను ప్రోత్సహిస్తారన్నమాట.


ఇహ, వోడిన వాళ్ళు భోరున ఏడవటం! యాంకర్లు, జడ్జీలు.. వాళ్ళ చుట్టాలెవరో పోయినట్టు విషణ్ణ వదనాలు పెట్టుకుని వాళ్ల భుజం తట్టి "this is what life!(ఇదేనట జీవితం)  నీ ఓటమి మరో గెలుపుకి పునాది" అని సోది ఓదార్పులతో కన్నీళ్ళు తుడవటం..ఇవన్నీ మనకి కూడా(ఎందుకు చూస్తున్నామురా దేవుడా అని) కన్నీళ్ళు తెప్పించే డ్రామాలు!


అవన్నీ పక్కనపెడితే,పట్టుమని నాలుగేళ్ళు నిండని పసి మొగ్గల చేత ఈ పోటీల్లో little buds అనీ 'చిన్నారుల సరాగాలు అనే పేర్లతో పాడించడాన్ని నేనసలు సహించలేకపోతున్నాను. గంట ప్రోగ్రాం రికార్డింగ్ కి రోజంతా పట్టే సందర్భాలుంటాయి.

అలా పసి బిడ్డల్ని రోజంతా కూచో బెట్టి హింసించి పాడిస్తే తల్లి దండ్రులకు ఏం వొరుగుతుందో అర్థం కాదు. అంత చిన్న పిల్లల గొంతుల్లో మెలొడీని, శృతి, లయలు పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశించలేం! అయినా ఆ పిల్లల కంటే ముందు తల్లుల(తండ్రుల పాత్ర తక్కువే ఈ ఆరాటంలో) టెన్షన్ చూడాలి!


చెపితే నమ్మరు(చూసి ఉంటే సరే),  స ని ద ప మ కార్యక్రమంలో ఒక పదేళ్ళ పాప బాగా పాడుతున్నా కొన్ని చిన్న పొరపాట్ల వల్ల eliminate అయి తొలగవలసి వచ్చింది. వెంటనే వాళ్ళమ్మ ఘొల్లున ఏడుపు. "మా అమ్మాయి ఫైనల్స్ కి వెడుతుందని టోకీ గారు చెప్పారు. ఇక్కడ రాజకీయం జరిగింది. పిల్ల తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్ చేసింది..(ఎవరి కోసమో)" అని గోల గోల చేసింది. అందరూ ఆవిడను ఓదార్చడం!


ఇదంతా ప్రేక్షకులకు అవసరమా?ఆ తర్వాత (ఆ పాపను ఎంతగా హింసించారో), వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి వచ్చి..పాడి నెగ్గింది ఆ రౌండ్! వాళ్ళమ్మ మళ్ళీ ఘొల్లుమంది....ఈ సారి ఆనందంతో!

ఈ చిట్టి మొగ్గల చేత "హుషారు గొలిపే "పాటల రౌండ్ లో పాడించే పాటలు వింటే జన్మ రాహిత్యం కలుగుతుంది.

"ఓరోరి యోగి .."(ఆ తర్వాత రాయలేను, క్షమించండి)

"వంగతోట మలుపు కాడ" ..ఇవీ!


"అబ్బో, ఈ పాటలకు పసి పిల్లలు రక రకాలు మూమెంట్స్ తో డాన్సాడుతుంటేనే చూసేశాం, పాట వినలేమా "అంటారా? సరే, అలాగే కానీండి!

న్యాయనిర్ణేతల గురించి రాయకపోతే నాకు నిష్కృతి లేదు. పాడిన ప్రతి వాళ్ళనూ యధాశక్తి మెచ్చుకోగలగడం వీళ్ల ప్రాథమిక అర్హత.భాష గురించి పట్టింపు లేదు. మొన్నొక కార్యక్రమంలో తెలుగు పాటలోని ఉచ్చారణా దోషాన్ని మలయాళీ మాల్గాడి శుభ పట్టుకుని చూపించేదాక ఎవరికీ తెలీకపాయె!

 మరో పాటల కార్యక్రమంలో ఒక కుర్ర జడ్జీ చిరంజీవి పాట ఒక పాప పాడుతుంటే హుషారుగా లేచి కుర్చీ దిగొచ్చి డాన్సాడేశాడు, చిరు స్టెప్పులతోనే!

టోకీ గారికి ఆ సదరు స ని ద ప మ వాళ్ళు ఎంత డబ్బిస్తారో గానీ రోజుకొక సారి
" ఈ చానెల్ కి నేను రుణ పడ్డాను..పడ్డాను..పడ్డాను" అని చెపుతూనే ఉంటారు!

నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి..బాల సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన

కార్యక్రమాల నాణ్యత ఇప్పుడు నడుస్తున్న వాటిలో ఒక్క దానికీ లేదంటే లేదు. గొంతు లో నాణ్యతను పట్టుకోగలిగే శాస్త్రీయ సంగీతం తెలిసీన న్యాయ నిర్ణేతలు ఉండేవారు బాలు ప్రోగ్రాముల్లో!

మన  గురువు గారికి అసలే భాషంటే ప్రాణం,పట్టింపూనూ!!
 "చాలా చక్కగా పాడావమ్మా "నా దేషం " అని ఒక్క విసురు విసిరితే ఇక జీవితాంతం "శ" కి "ష" కీ మధ్య తేడాని మర్చిపోలేరు ఎవరూ!


* * * *

కట్ చేస్తే....

మా కిరణ్ గాడి మూడో సెమిస్టరు తన్నేయడంతో వాళ్ళయ్య బెల్టు పుచ్చుకుని వెంట బడ్డాడు.(ఇదేదో మొదటే చేయవలసింది)దానితో వాడు ఆల్బంల గోల ( ప్రస్తుతానికి) వదిలి పుస్తకాలు పుచ్చుకుని స్టడీ రూములో సెటిలయ్యాడు.
* * *
మొన్నొక రోజు రాత్రి తొమ్మిందింటికి టివీ లో ఏ చానెల్ వెదికినా ఇవే పాటల ప్రోగ్రాములు వస్తుండటంలో తప్పక , మేము ఒక మూవీ చానెల్లో 'గోమాత వ్రత మహాత్మ్యం" సినిమా చూసాము! చాలా నచ్చింది నాకు. పాత సినిమాల విశ్లేషణ కింద నవతరంగం వాళ్ళు వేసుకుంటారేమో అడిగి, రాయాలి!



తాజాకలం:నాకు విదేశాల్లో ఉండాలని కోరికేం లేదు గానీ, ఇలాంటి కష్టాలెదురైనప్పుడు మాత్రం తెలుగు టీవీ చానెళ్ళు చూడలేని ప్రవాసాంధ్రులందరి పట్లా అసూయతో రగిలిపోతుంటాను.