సరే, వాళ్ళు ఆ యువతుల మీద యాసిడ్ పోశారు. పోలీసులు "ఆత్మ రక్షణ" కోసం వాళ్ళను ఎన్ కౌంటర్ చేశారు. వాళ్ళకు తగిన శిక్షే పడింది."ఇంకెవ్వరూ ఇలాంటి పని చేయరు".అని జనం అభిప్రాయపడుతున్నారు. దుష్ట సంహారం జరిగిందని పండగ చేసుకుంటున్నారు.
ముగ్గురు సామాన్య యువకుల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడం కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వస్తుందా అనే డౌటు నాకు రావట్లేదు. అంతే కాదు.
"పోలీసుల కస్టడీ లో ఉన్న నిందితులకు తుప్పు పట్టిన కత్తులు, తుపాకీలు ఎలా వచ్చాయి? దొంగిలించిన వాహనాన్ని వెతకడానికి అర్థ రాత్రి ఎందుకు వెళ్లారు? "లాంటి ప్రశ్నలు కూడా నేనడగను. జవాబులు తెలిసిన ప్రశ్నలు మళ్ళీ అడగటం దేనికి?
ఆ ముగ్గురు నిందితులు చేసింది మామూలు నేరం కాదు. అమానుషమైన చర్య! యాసిడ్ పోసి ఆడపిల్లల రూప లావణ్యాలను చిదిమి చిదిమి కసి తీర్చుకోవాలనుకున్నారంటే వారిలో ప్రతీకార వాంఛ ఎంతగా ప్రజ్వరిల్లి పోయిందో అర్థం చేసుకోవచ్చు. పాపం హాస్పటల్లో నరక యాతన అనుభవిస్తున్న ఆ పిల్లలు కూడా "వాడిని యాసిడ్ పోసి ఆ బాధలోనే వరంగల్ రోడ్లనీ తిప్పి రోడ్డు మీద వదిలేయాలి" అని తమ ఆగ్రహాన్ని,ఆవేదనను వెళ్ళగక్కారు. చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ల ముందు మైకు పెట్టి ఇలాంటి భీకర ప్రతిజ్ఞలు చేయిస్తున్న మీడియా మీద ఎనలేని అభిమానం కలిగింది.
దీన్ని రాజకీయం చేయకుండా కేవలం తల్లులుగా, తండ్రులుగా వచ్చి ఆ ఇద్దరు యువతుల్ని పరామర్శిస్తున్న రాజకీయ నాయకుల్ని చూసి కూడా "పాపం, ఎంత బాధ పడుతున్నారో" అనిపించింది.
నిందితులకు కఠిన శిక్ష పడాలని నేనూ కోరుకున్నాను. అంతకు ముందు నేను ఇంకో విషయం కూడా ఆలోచించదల్చుకున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను. ఆ పిల్లలిద్దరూ దారుణమైన బాధకు గురవుతూ బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో 'వారి పాత్ర ఏమిటి " అనే ప్రశ్న లేవనెత్తడం నాకే అమానుషంగా అనిపిస్తుంది కానీ తప్పని సరి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను వేసుకుని జవాబు కోసం వెదుక్కుంటున్నాను.
ఈ రోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ప్రధాన నిందితుడు దాదాపు 25 వేల రూపాయల విలువైన బహుమతులు స్వప్నిక కు ఇచ్చాడు. అతడంటే ఇష్టం లేనప్పుడు ఆ బహుమతుల్ని ఆమె ఎలా తీసుకుంది? ఆ అమ్మాయి తండ్రి "మా అమ్మాయి జోలికి రావొద్దు" అని అతడిని హెచ్చరించాడట. "బహుమతులెందుకు తీసుకున్నావు?" అని కూతుర్ని ఎందుకు మందలించలేదు? పక్కా కమర్షియల్ అయిన ఆ నిందితుడు "అయితే నా డబ్బు నాకిచ్చేయమ"ని పేచీ కి దిగాడు. దానికి అమ్మాయి తండ్రి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎందుకని? "తీసుకో, నీ ముష్టి బహుమతులు" అని వాడి మొహాన్న కొట్టలేదెందుకని?
స్వప్నిక తన వద్దనుంచి బహుమతుల్ని తీసుకుని కార్తీక్ అనే మరో యువకుడితో చనువుగా ఉంటోందని శ్రీనివాస్ కి ఖోపం వచ్చింది. గట్టిగా నిలదీసి అడిగితే "డబ్బు తిరిగిచ్చే విషయమై మాట్లాడ్డానికి కాలేజీ వద్దకు రమ్మన్నది"ట. కార్తీక్ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసా తెలియదా? యండమూరి ఏదో పుస్తకంలో రాసినట్టు పిల్లల ప్రేమ వ్యవహారాలు ఆఖరున తెలిసేది తల్లిదండ్రులకేనేమో!
ఇంతకు ముందు జెమిని టీవీ యాంకర్, రేడియో జాకీ లక్ష్మి సుజాత కూడా ఇలాంటి పనే చేసి హత్యకు గురైంది.హంతకుడితో డబ్బు కోసం 'చనువు" గా ఉంటూ, అవసరం తీరగానే మరొకరితో చనువు వెలగబెట్టడం ఆమె చేసిన పని.(పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం) ఆడపిల్లలు జీవితాల్ని ఎందుకింతా ఈజీగా తీసుకుంటున్నారో అంతుపట్టడం లేదు. "సులభంగా" చేతికందే డబ్బుకోసం, విలాసాల కోసం అబ్బాయిలతో చనువుగా ఉండటం, బహుమతుల వంటివాటిని ఆశించడం, తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తుందో ఊహ తెలిసిన యువతులు గ్రహించలేరా? ఖరీదైన బహుమతుల్ని ఇవ్వడానికి సిద్ధపడిన యువకులు "ఏమీ" ఆశించకుండానే ఇస్తారా? ఈ విషయాన్ని అమ్మాయిలు గ్రహించలేరా?
ముసుగేసుకున్న మందుపాతరల లాంటి అబ్బాయిలతో స్నేహాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఎప్పటికి నేర్చుకుంటారు వీళ్ళు? నిన్న టీవీలో చూశాను, ఒక రాజకీయ నాయకురాలైన నటి, కొడుకుల్ని సరిగా పెంచలేదని శ్రీనివాస్, అతడి మిత్రుల తల్లి దండ్రుల్ని శాపనార్థాలు పెడుతోంది. మగపిల్లలకేనా కావాలి సరైన పెంపకం?
తను కోరుకుంది ఇంకొకరికి దక్కనివ్వకపొవడం, తనకు దక్కకపోతే దాన్ని నాశనం అయినా సరే చేయడానికి ఒడిగట్టడం ..ఇవాల్టి యువకుల్లో , చాలా మందిలో అభివృద్ధి చెందుతున్న వైరస్! శ్రీలక్ష్మి, లక్ష్మి సుజాత, మరొకరు, మరొకరు ...ఎంతో మంది బలైన తర్వాత కూడా అలవి కాని స్నేహాలు ఎటు దారి తీస్తాయో గ్రహించలేని అమాయకులైన ఆడపిల్లని చూసి జాలి పడాలో కోపం తెచ్చుకోవాలో తెలీడం లేదు.
కాలి బూడిదైన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు భవిషత్తులో ఏమైపోతాయో ఎవరికి పడుతుంది? ఒక వారం రోజులు ఈ మీడియా హడావుడి, రాజకీయ నేతల పరామర్శలు! ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతల సంగతి ఏమిటి?
అసలు జనం ఆగ్రహావేశం చూసి పోలీసులు వాళ్లని ఎన్ కౌంటర్ చేసారు గానీ,వాళ్ళకు పడిన శిక్ష ఎంతని? క్షణంలో ప్రాణాలు పోయాయి. విచారణ తర్వాత వాళ్ళకు జీవితాంతం (14 యేళ్ళు కాదు)కఠిన జైలు శిక్ష విధించాలి. కళ్ళముందే భవిష్యత్తు మంచులా కరిగి పోయి, జీవితం సర్వ నాశనం కావడం అంటే తెలిసేలా చేయాలి. ఒకటో అరో కాకుండా ఆడపిల్లల్ని వేధించే ప్రతి వారికీ కఠిన శిక్షలు విధించాల్సిందే! కానీ ఉన్న పళంగా ప్రాణాలు హరించడమా శిక్ష?
కానీ ఈ ఎన్ కౌంటర్ వల్ల మరొక ప్రేమోన్మాది ఇలాంటి పనులు చేయడానికి వెనకడతాడన్నది మాత్రం నిజం కాదు !ఏమైనా సరే, తనను కాదన్నందుకో, తనతో "తిరగనందుకో" ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకుని బయలు దేరిన ఉన్మాది 'గతంలో ఇలాంటి పనులెవరు చేసారు, వారికి పడ్డ శిక్షలేంటి? ఎన్నాళ్ళు విచారణ జరిగింది" వంటి విషయాలు ఆలోచిస్తూ కూచోడు. కక్ష తీరాలంతే! ఇలాంటి తక్షణ శిక్షల వల్ల ఆటవిక న్యాయం అమలవుతుందే కానీ మనుషుల ప్రవృత్తిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.
స్వప్నిక హింస అనుభవించాలని శ్రీనివాస్ కోరుకున్నాడు, అతడు చావాలని మనం కోరుకున్నాం! "అమ్మయ్య, వాళ్లను చంపేశారు, వాళ్ళ ప్రాణాలు తీశారు" అని చెప్పుకుని టపాసులు కాల్చుకునే స్థితిలో మనమున్నామంటే , ఆ ముగ్గురు నిందితులకీ, మనకీ పెద్ద తేడా లేదనిపిస్తోంది.
చర్మం కాలి,మాంసం ఉడికి రూపం చెరిగి పోయిన స్వప్నిక ను చూసినపుడు .."వాళ్ళకీ ఇలా జరిగితే గానీ ఈ బాధ తెలియదు" అని నాకూ అనిపించింది. కానీ ఇలా వెంటనే చంపేస్తారు అని ఊహించలేదు.ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అన్న ప్రశ్నకు కూడా ఎస్పీ సజ్జనార్ అవకాశం ఇవ్వడం లేదు. "చట్టం తన పని తను చేసింది. people should "understand" that" అని మీడియా వాళ్ళను గద్దించాడు. చట్టం పని అధికారం తో ఇష్టమొచ్చిన వాళ్లను హత్యలు చేయడం అన్నమాట!ఇదే పని ఏ రాజకీయ నాయకుడి చుట్టమో పక్కమో చేస్తే చట్టం ఏం చేస్తుందో ఆయేషా కేసులో చూసాం!
నేను కాలేజీలో ఉన్నపుడు మా అమ్మమ్మ ఎపుడైనా "అరిటాకు- ముల్లు" సామెత చెప్తే "ఆపు నీ గోల" అని మండిపడేదాన్ని. అప్పుడు సమాజం ఇంత దరిద్రంగా తయారవలేదు. ప్రస్తుతం గుర్రపు డెక్క ఆకులా విస్తరించిన కలుష సంస్కృతి లో, ఉన్మాద స్థాయికి చేరిన ప్రేమ చరిత్రల నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఆ సామెత గురించి చెప్తే,కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అనిపిస్తుందొక్కోసారి! కానీ వాస్తవ జీవితం నుంచి నేర్చుకునే పాఠాలకంటే పుస్తకాల్లో నేర్చుకునేది ఎక్కువేం కాదు.
మరో పక్క రాజకీయ పార్టీలకు, మహిళా సంఘాలకు చెందిన మహిళా మణులు ఒక టీవీ ఛానెల్లో ఇదే విషయం మీద భేదాభిప్రాయాలతో కాట్లకుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. ఏమిటో, అంతా గొప్ప కన్ ఫ్యూజన్ గా ఉంది.