June 26, 2008

అమ్మాయిలు - ఆంటీలు

తెలుగులో కొన్ని కొన్ని మాటలు ఇతర భాషల నుండో, లేక సరదా కోసం పుట్టించినవో లేక మరో రకంగానో వచ్చి చాలా జెన్యూన్ గా చెలామణి అయిపోతుంటాయి. 'సుత్తి ' , 'అంత సీన్ లేదు ' 'కాలింది '(మండిపోయింది) మొదలైనవి..ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు విషయం వాటి గురించి కాదు.

ఇలా పుట్టిన మాటల్లో నాకు ఒళ్ళు మండించే మాట ఒకటుంది. అదే "ఆంటీ" ! ఆ మధ్య ఒక బ్లాగులో 'ఆంటీ 'అని పిలవడం పట్ల కొందరు స్త్రీ బ్లాగర్లు బాధ పడ్డారు కూడా! కేవలం బాధ బాధ పడి ఊరుకుంటె లాభం లేదని, ఒక టపా రాసేయాలని అనిపించి రాస్తున్నాను.

నా చిన్నప్పుడు మా అమ్మ స్నేహితుల్ని 'సుశీలత్త ''రాధత్త ' 'కమలత్త 'ఇలాగే పిల్చేదాన్ని! హైస్కూలుకొచ్చాక ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మల్ని 'అత్తా 'అని పిలుద్దామంటె కొంచెం సంకోచంగా ఉండేది.పైగా నా ఫ్రెండ్స్ అన్నలెవరూ అంత పెద్ద అందగాళ్ళు కుడా కాదని తెలిసిపోయింది. ఈ లోపు నా స్నేహితురాళ్ళు మా అమ్మను 'ఆంటీ ' అని పిలిచి నాకు దారి చూపించారు.

ఆడవాళ్ళను గౌరవంగా పిలవడానికి ఉపయోగించే మాటగా దీనికేమైనా నిఘంటువు అర్థం ఉందేమో గానీ నాకు మాత్రం భలే మంట! ముక్కూ, మొహం తెలియనివాళ్ళు వచ్చి 'ఆంటీ' అని పిలవడమేంటి?

మొదట నన్ను మా ఇంటి వోనర్ గారి అమ్మాయి, నా ఈడుదే, పెళ్లైన కొత్తలో వాళ్ళింట్లో చేరిన నాల్రోజుల కల్లా "ఆంటీ అమ్మ మీకు ఇమ్మంది 'అని పాయసమో నా పిండాకూడో ఏదో ఇచ్చి శుభారంభం చేసింది. ఆ రోజు నుండి ఆంటీగా ఫిక్సయి పోయాను. నేను అప్పుడే నన్ను అక్కా అని పిలవమని చెప్పాను సౌమ్యంగానే!

ఆ పిల్ల 'సరే అక్కా ' అని సంతోషంగా ఒప్పేసుకుంది. ఆ మర్నాడు నుంచి మా వారు ఆఫీసు నుంచి రాగానే
' బావా, అక్క నీకు తాళాలియ్యమంది ' అనగానే పాపం తను ఎగిరి పడి పారిపోయారు.
అయినా ఆ అమ్మాయి రూటు మార్చుకోక,
' బావా, అక్క ఇంకా రాలేదా,
బావా అక్క ఆఫీస్ ఎక్కడ,
'బావా ఏడికెల్లొస్తున్నవ్ ' అంటూ బావా బావా బావా అని ఊదరగొట్టేసింది.!
నేను కనపడితే 'అక్కా, బావ డ్యూటీకి పొద్దున్నే పోతడా?'
'బావ నీకంటె స్మార్ట్ కొడుతున్నడు కదా, నిన్నెట్ల షాది చేసుకుంటుండె?' అని మాట్లాడ్డం మొదలెట్టింది.
దీనితో తను ఆఫీస్ అయిపోయాక రోడ్లమ్మట తిరిగి అర్థ రాత్రులు ఆ పిల్ల నిద్రపోయాక ఇంటికి వచ్చి, తిరిగి మరదలు నిద్ర లేవకముందే ఆఫీస్ కి పారిపోవడం ప్రాక్టీస్ చేసాడు.
దానితో నేను మళ్ళీ ఆంటీగా మారడానికి నిశ్చయించుకున్నాను. అదే మొదలు!

సిటీ బస్సులో అయిటే స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, పరిచయం లేని మగవాళ్ళు అందరూ 'ఆంటీ ' అనే పిలవడం! పెళ్ళి వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటన్నమాట! ఇక లాభం లేదని, వాడుతున్న సబ్బు మానేసి, సంతూర్ సబ్బు మొదలెట్టాను.వాళ్ళూ ఆ మోడల్ కి ఎంత డబ్బిచ్చారో గానీ, సబ్బు వాడాక కూడా నన్ను మాత్రం ఒక్కళ్ళు కూడా ఆంటీ అనడం మానలేదు.

ఇక మా పాప పుట్టాక పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇదివరలో ఎవరో ఒక్కళ్లన్నా, 'దీదీ' అనో, మేడం అనో పిలిచేవాళ్ళు! ఇప్పుడు చాలా మామూలుగా అదేదో నా పేరన్నట్టు నన్ను 'ఆంటీ' ని చేసేశారు.
పెళ్ళవగానే 'శ్రీమతి ' తో పాటుగా 'ఆంటీ' కూడా బోనస్ గా వచ్చి చేరుతుందని అనుభవ పూర్వకంగా తెలిశాక, ఇహ ఏమీ చెయ్యలేకపోయాను. ఎంతమందికని చెప్పడం "నన్ను పేరుతో పిలవండి ' 'నన్ను ఆంటీ అని పిలవకండి ' అని?

పాలు, పేపరు వేసే వాడు (వయసు నలభై కి తక్కువుండవు) 'ఆంటీ , సారు లేరా? " అని అడిగినపుడు ఒళ్ళు మండి పోతుంది! నేనేమో ఆంటీ, ఆయనేమో 'సారు '!
బయటి నుంచి వస్తుంటే,సెక్యూరిటీ 'ఆంటీజీ,ఆప్ కేలియే కొరియర్ " ఆంటీజీ !,ఇందులో బోడి మర్యాదొకటి!
ఎల్కేజీ చదువుతున్న పాపను స్కూల్లో దింపడానికి వెళితే పదేళ్ళ కొడుకుని తీసుకునొచ్చిన చిన్ని నాయన 'ఆంటీ, వేర్ కెన్ ఐ మీట్ ద ప్రిన్సిపాల్?" అనడుగుతాడా?
మా ఇంటి దగ్గర కడుతున్న ఒక బిల్డింగ్ లో పని చేసే తాపీ పని వాడు "ఆంటీ టైమెంత?" అని అడుగుతాడు.పాతిక నిండకుండానే పదివేల మంది నన్ను ఆంటీ అని పిల్చేసారు.

ఇక చెత్త తీసుకెళ్ళే వాడైతే బెల్లు కొట్టి "చెత్తాంటీ!" (చెత్త ఉందా.ఆంటీ అనడం అన్నమాట) అని అరుస్తాడు. ఇదీ మరీ భయంకరంగా అనిపించింది నాకు. ఎన్ని సార్లు చెప్పినా ప్రతి ఇంటి ముందూ ఇదే కేక! గట్టిగా చీవాట్లేసానొకరోజు "చెత్తాంటీ ఏమిటి నీ మొహం " అని!
మర్నాటినుంచీ వాడు "ఆంటీ, చెత్త " అనరవడం మొదలు పెట్టాడు. "ఒరే నాయనా, చెత్తాంటీ అన్నా, ఆంటీ చెత్త అన్నా తేడా లేదురా " అని చెపితే ఈ లాజిక్ వాడికర్ధం కాలేదు.
పైగా విసుక్కుని "అబ్బ ఏంటాంటీ మీరు, ఒక పని చేయండి మీరంతా, నా బండి పదింటిదాకా ఈ ఏరియాలోనే ఉంటది.తొమ్మిదింటికి మీరు నాకో missed call ఇయ్యండి, నేనొచ్చి చెత్త దీస్క పోతా'నన్నాడు.
అందువల్ల వాడు పైకి రాకుండా చెత్త అంతా కింద కలెక్ట్ చేసుకునే పద్ధతి పెట్టి వాడి నుంచి తప్పించుకున్నాం!

కూరల వాడు, బస్టాప్ లో పక్కన నిల్చున్న కాలేజీ అమ్మాయిలు,పాత పేపర్లు కొనేవాడు,పక్కింటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్, (వాళ్ళు నార్త్ ఇడియన్స్ అయితే వాళ్ళ నాన్న కూడా),పై ఇంటి పిల్లల తల్లి, కిందింటి కొత్తగా పెళ్ళైన జంట(ఇద్దరూ) ...అరె ఒకళ్ళా ఇద్దరా!

మగవాళ్ళ కి 'అంకుల్ ' పిలుపు ప్రాబ్లం ముప్ఫై కూడా నిండకుండా ఇంత తీవ్రంగా ఉంటుందనుకోను. అందుకే వాళ్ళు మరణ మృదంగం నవల్లో బిలహణుడిలాగా 'అల్లనల్లన జుట్టు తెల్ల బడినా, ఏ పిల్లా నన్నింత వరకూ అంకులనలేదు ' అని మురిసి పోతుంటారనుకుంటా!

నన్ను ఆంటీ అని పిలిచేవాళ్ళెవరూ మా ఆయన్ని 'అంకుల్ ' అని పిలవగా నేను చూళ్ళేదు. పోయిన వేసవి లో నాలుగేళ్ళ మా అమ్మాయిని స్విమ్మింగ్ క్లాసులకి తీసుకెళ్ళినపుడు ఒక ప్రబుద్ధుడు ఒడ్డున ఉన్న నాతో 'your daughter is an excellent swimmer aunty, where is her dad? అనడిగాడు. అతని పదేళ్ల కొడుకు దున్నపోతులా ఈదుతున్నాడో పక్క!పళ్ళు నూరుతూ 'అదిగో అక్కడున్నార 'ని చూపించాను.
' పేరేంటీ అనడిగి మరీ వెళ్ళి 'మిస్టర్ శ్రీనివాస్, యువర్ డాటరీజ్ గోయింగ్ టు బి ఏ చాంపియన్ ' అని అభినందిస్తుంటే నాకు నిజంగా మండిపోయింది.
ఇలా సింపుల్ గా ఉంటే లాభం లేదు, మా బిల్డింగ్ నిండా లుక లుక లాడుతూ ఉండే నార్త్ ఇండియన్స్ లాగే మనమూ ఫాషన్ గా ఉండాలని నిశ్చయించుకుని VLCC కి వెళ్ళి, బ్యూటి 'ఫుల్లు 'గా మారిపోయి (మారిపోయాననుకుని) ఇంటికొచ్చి బెల్లు కొట్టాను.మా ఆయనఒచ్చి తలుపు తీసి "ఓహ్, సారీ అండి , మా ఆవిడ ఇంట్లో లేదు, తర్వాత రండి! sorry for the inconvenience అని తలుపేశాడు..!
తర్వాత విషయం తెల్సుకుని విసుగ్గా 'అబ్బ, ఎవరేమని పిలుస్తే ఏముందిలెద్దూ!నువ్వెంచక్కా ఎప్పటి లాగా హాండ్లూం చీరెలూ, డ్రెస్సులూ వేసుకో"అన్నాడు.
మనకు ఇంట్లోనే ప్రోత్సాహం లేకపోతే బయటివాళ్లననుకుని ప్రయోజనం ఏముందని నిరాశగా సర్దిచెప్పుకున్నాను!

ఇలా ఉండగా వినాయక చవితి కి మా కమ్యూనిటీలోనే ఒక మండపం పెట్టి కనీసం 5 రోజులు పూజ జరపాలని కాలనీవాళ్ళు నిర్ణయించారు!

అందుకని వినాయకుడు పుట్టినప్పటి నుంచి (అదేలెండి తయారైనప్పటినుంచి) చంద్రుడు పగలబడి నవ్వేంత వరకు పదిహేను సీన్లతో ఒక నాటకం తయారు చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించి విజయవంతంగా ప్రదర్శించాము! పైగా నాటకం హిందీలో! (ఇక్కడంతా వాళ్ళే ఎక్కువ! మేమేదో సొంత ఇళ్ళల్లోనే చత్రపతి సినిమాలో శరణార్ధుల్లా బతికేస్తున్నాం) తెలుగులో రాసి, దాన్ని ఒక గుజరాతీ అమ్మాయికి ఇంగ్లీషులో వివరించగా ఆవిడ హిందీలో తిరగ రాసింది. నాకు హిందీలో ఇరవై వరకు నెంబర్లే మధ్యలో ఎవరన్నా అందించాలి.


ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్న లలిత్ చోప్రా కి ఇంకా పెళ్ళి కాలేదు.ఎందుకు చెప్పానంటే నన్ను ఆంటీ అనడానికి చోప్రాకి సర్వ హక్కులూ ఉన్నాయన్నమాట!రోజూ సాయంత్రం mind space నుంచి డైరెక్టుగా ప్రాక్టీస్ కి వచ్చి కావాలని ఒకటికి పది సార్లు 'బలే ఉందాంటీ నాటకం ' అనేవాడు. '
'ఇదిగో చోప్రా, నన్ను ఆంటీ అని పిలిచావంటే నిన్ను చంపుతాను ' అని బెదిరించి చూసాను.

చివరి రోజున నాటకం పూర్తయ్యాక, పిల్లలందరికీ బహుమతులు ఇచ్చి, 'మేకప్ చేసిన రాధాంటీ కి, లైట్లు పోకుండా చూసిన సుమన్ ఆంటీకి....అంటూ పిలిచి ఏవో మెమెంటోలు ఇచ్చాడు. నేను స్టేజీ కిందనుంచే 'నన్ను ఆంటీ అని పిలిచావో.....చూడు" అని సైలెంట్ గా తర్జని చూపించాను.

లలిత్ గాడు నవ్వుతూ.."చివరగా ఈ కార్యక్రమం విజయవంతంగా నడిపించిన బేబీ సుజాతని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను " అన్నాడు. 'పార్వతిగా వేసినమ్మాయి వల్ల నాటకం రక్తి గట్టిందనుకున్నాం గానీ ఆ పాప పేరు అది కాదే ' అని ఆలోచిస్తుండగా , మా వారు నన్ను చూసి నవ్వుతూ "లలిత్ నిన్నే పిలుస్తున్నాడు ,నువ్వు ఆంటీ అనొద్దన్నావుగా ' అని ముందుకు నెట్టారు.
ఈలోపుగా లలిత్ నాలుగైదు సార్లు 'బేబీ సుజాత , ఎక్కడున్నా స్టేజీ మీదికి రావలెను ' అని అనౌన్స్ చేసాడు. ఆడాళ్లంతా వాడిని కొట్టినంత పని చేసారు. 'మేమంతా ఆంటీలా,తనేమో బేబీనా ' అని!
నేనేమో 'ఓరి దొంగ చచ్చినాడా " అనుకుంటూ లేచాను.
ఆ దెబ్బతో ఒక నాలుగైదు నెల్ల పాటు నేను 'బేబీ' గానే చెలామణి అయ్యాను.
సో, మొత్తానికి పెళ్ళై పిల్ల(లు) పుట్టాక ఎంతటివారలైనా ఆంటీలు అయిపోతారనడానికి ఎంతమాత్రమూ సందేహం లేదు. మీ వయసెంతైనా సరే! మీలో ఎంతమంది ఆంటీలున్నారో, లేక 'ఆంటీ' అని పెళ్లైన ఆడవాళ్లని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులెత్తండి!

June 21, 2008

గూర్ఖా..ఎండ్లూరి సుధాకర్

కాలేజీ రోజుల్లో రాత్రి రెండు గంటలకు (ఒక్క నిమిషం అటూ ఇటూ కాకుండా) మా వీధిలోకి గూర్ఖా వచ్చేవాడు! దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్న కాలంలో రెండు గంటల అర్థరాత్రి వేళ గేటు మీద గూర్ఖా కొట్టిన కర్ర చప్పుడు విన్నాక నిశ్చింతగా నిద్ర పట్టేది. అలాంటి గూర్ఖాకి నెల మొదటివారంలో రెండేసి రూపాయలు ఇవ్వడానికి కూడా పది సార్లు తిప్పేవాళ్ళని చూస్తే నాకైతే చంపేయాలని ఉండేది. ఒక ఆదివారం నాటి ఉదయం దినపత్రికలో శ్రీ ఎండ్లూరి సుధాకర్ రాసిన గూర్ఖా కవిత చదివి మనసు కరిగి కన్నీరై ప్రవహించింది. ఈ కవిత కనీసం వారం రోజులు నన్ను వేదనకు గురి చేసింది. అందుకే జాగ్రత్తగా కత్తిరించి దాచుకున్నాను. మీ అందరితో పంచుకోవాలని....ఇక్కడ..!


అతడు రాత్రి సూర్యుడు
కళ్ల బొరియల్లోనిదుర చాప మడత పెట్టి
దొంగ చీకటిని వెంటాడుతుంటాడు
వీధి మలుపులోంచే అతడి పద ధ్వనుల్నీ, వాసనల్నీ పసిగట్టి
గల్లీ కుక్కలు గౌరవ సూచకంగా తోకలూపుతాయి
వేగుచుక్క పొడిచిందనడానికి
బీడీ ముక్క విశ్రాంతిగా పొగలు వదులుతూ ఉంటుంది
అతడు ఆరు రుతువుల చెలికాడు
కాలం అతడి చేతిలో టార్చి లైట్
భార్య తన ప్రేమంతాచేతివేళ్లలోకి
ఊలు సూదుల్లోకి నింపిఅల్లిన స్వెట్టెర్
వెచ్చని జ్ఞాపకమై హత్తుకుపోతుంది
ప్రతి నడిరేయి
ప్రతి తెల్లవారుజామున
వేల వేల ఆలింగనాలూ,చుంబనాలూ
వేడి నిట్టూర్పులూ, వేడికోళ్ళూ,
రహస్య రసోద్రేకాల మీదుగా
నిర్లిప్త పరివ్రాజకుడై నడిచిపోతుంటాడు
అతడికి సెలవులుండవేమో
అతడి అపరిపక్వ కోర్కెలు పండవేమో
అర్థ రాత్రి భార్యా బిడ్డల్ని విడిచి
ప్రతి రాత్రీ గౌతమ బుద్ధుడవుతాడు
ఎక్కడివాడో తెలియదు గానీమనకత్యంత ఆప్తుడనిపిస్తాడు
తలపై కత్తుల కరచాలనం గుర్తు లాంటి ఉన్ని టోపీ
బాగా మాసిన ఖాకీ దుస్తులు
గొప్ప గౌరవం పుట్టిస్తూ గంభీరంగా కనపడతాడు
మంత్రదండం లాంటి అతడి చేతికర్ర చప్పుడు
మన భయోద్వేగాన్ని తగ్గించే మందు
మధ్య రాత్రులు మన గేటు తట్టి
నిద్రా భంగంలోనూకొండంత ధైర్యాన్ని కరపత్రంలో పంచి పోతాడు
ఏ జ్వరమో వచ్చి అతడు రాని రోజు
చిక్కని రాత్రి కళ్ళు చీకటి కన్నీళ్ళు రాలుస్తాయి
అతడి జీతభత్యాల గురించి ఎవరికీ తెలియదు
అతడి జీవిత సత్యాల గురించి ఎవరికీ పట్టదు
ఒక్క తన పెంకుటిల్లు తప్ప
అందరిళ్ళకూ పహరా కాస్తాడు
మనకు జీతం వచ్చిన రోజు నుంచీ
అతడు తన జీతం తాడు పేనుకుంటూ పోతాడు
ఒక్క రూపాయి బిళ్ళో, రెండు రూపాయల కాయితమో చాలు
అవనత శిరస్కుడై'అచ్చా సాబ్' అంటూ వినమ్రంగా నిష్క్రమిస్తూ ఉంటే
అతడి జేబు బావి లోంచి
చిల్లర గొంతులు బాధగా మూల్గుతాయి...

June 18, 2008

అమ్మ, నాన్న, ఓ వృద్ధాశ్రమం

అమ్మ, నాన్న!కడుపులోంచి వొడిలో పడ్డప్పటి నుంచి బిడ్డలే ప్రాణం అమ్మకి. పొత్తిళ్లలోని పాపని, పెంచి ప్రయోజకుణ్ణి చేయడానికి అమ్మకి ఎంత టైము పట్టి ఉంటుంది? గాలికి పెరగలేం గా? పసితనంలో ఒకట్లు, రెండ్లు శుభ్రం చేయడాలు, అన్నం తిననని మారాము చేస్తే ఎత్తుకుని చందమామని చూపిస్తూ తినిపించడాలు! బిడ్డకి చిన్న సుస్తీ చేసినా అన్నం మానేసి కళ్లల్లో వొత్తులేసుక్కూచునే అమ్మ,పెద్దయ్యాక కూడ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేసే అమ్మ(అవి త్యాగాలని ఆమె గుర్తించదు) !
మరి నాన్నో! ప్రయోజకులైన వ్యక్తులున్నారంటే వారి వెనక తండ్రుల శ్రమ, బాధ్యత, త్యాగం ఇవేవీ లేకుండానే తయారైపోతారా?(స్వయం శక్తితో పైకొచ్చిన వారు నూటికో కోటికో ఉండొచ్చు) మన పరీక్షల ఫలితాల కోసం మనకంటే టెన్షన్ గా ఎదురు చూసే నాన్న! మన విజయాలను తన విజయాలుగా చెప్పుకునే నాన్న! మన కోసం రెండు ఉద్యోగాలు చేసిన నాన్న! మన 'కంఫర్ట్స్ ' కోసం తన అవసరాలను వాయిదా వేసే నాన్న!
పై వాళ్ళిద్దరికీ పిల్లలెప్పుడూ 'బర్డెన్ ' కాదు! అనవసరపు 'లగేజీ ' కాదు! వారి సౌకర్యాల తర్వాతే తమ అవసరాలు!
మరి ఇప్పుడు మన జీవితాలు మన చేతుల్లో ఉన్నప్పుడు, అమ్మ, నాన్న మనకెందుకు 'బరువై 'పోతున్నారు? మన 'కుటుంబం 'లో వారికెందుకు చోటు లేదు? వీధికో బస్టాపులా గా ఏరియాకు నాలుగైదు వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయి. అవేమైనా ఖాళీగా ఉన్నాయా అంటే ...లేవే?
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో ఇంట్లో వృద్ధులుంటే వారి పరిస్థితి ఏమిటి? ఆరోగ్యం సరిగా ఉంటే సరే! లేనివారైతే? ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మాని ఇంట్లో కూచోలేని పరిస్థితి అయితే? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వెలిసినవే 'రెటైర్మెంట్ హోం లు '!
ఇటువంటి పరిస్థితి లేని కుటుంబాల నుంచి కూడా వృద్ధులు స్వచ్చందంగా ఆశ్రమాల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి దాని వెనక ఏముంది? నిస్సందేహంగా పెద్ద వారికి కావలసిన ఆదరణ (వేళకు తిండి, పడక కాదు ఆదరణంటే) ఆ ఇంట్లో దొరక్కపోవడమే!
నాకు తెలిసిన ఒక రెటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. భార్య పోయింది. పెద్ద కొడుకు ఉన్న ఇల్లు ఆయనదే! ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఒక ఫైన్ మార్నింగ్ 'నేను ఫలానా ఆశ్రమంలో చేరుతున్నానని ప్రకటించి వెళ్ళిపొయారు. అక్కడ ఆయన స్నేహితులున్నారు. కొడుకు, కోడలు వెర్షన్ల ప్రకారం ,చుట్టుపక్కల వాళ్ళ వెర్షన్ల ప్రకారమూ, కూడా ఆయనకు ఆ ఇంట్లో ఏ కష్టమూ లేదు.

అక్కడ ఆయనకు కావలసింది తిండి, బట్ట మాత్రమే కాదు, తన మనుషులు కూడా! కోడలు తమ్ముడు చదువుకోడానికి సిటీకి రాగానే, ఆవిడ బాల్కనీ కి sliding glass shutters పెట్టించి దానికి 'గది ' కళ తెప్పించి ఈయన కోసం ఒక మడత మంచం కొని అందులో వేసింది. ఆయన తన గది వదిలి అందులో ఉండాల్సి వచ్చింది. పేపరు పొద్దున్నే ఆయన చేతికి రాదు. అందరూ ఆఫీస్ కి , స్కూళ్లకు వెళ్ళాక చదవాలి. ఇంట్లో వాళ్ళు(పిల్లలతో సహా) ఏ చానల్ పెడితే అదే చూడాలి! ఏదన్నా విషయంలో కల్పించుకుని మాట్లాడబోతే 'మీరూరుకోండి, మేము మాట్లాడుతున్నాంగా, అంతా చాదస్తం " అని ఈసడింపులూ! స్నానం పూజ అన్నీ అందరూ వెళ్ళాకే! ఎవరికీ అడ్డం కాకూడదన్న వాళ్ళ మనసులో భావాన్ని ఆయన ఎవరూ చెప్పకుండానే గ్రహించి తన అలవాట్లు మార్చుకున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా రెండో సారో, మూడో సారో కాఫీ తాగాలనిపిస్తే అడిగే స్వతంత్రం కూడా ఈయనకు లేకపోవడం! భార్య పోయిన మగాళ్ల దుస్థితి ఇక్కడ బయట పడుతుంది.
ఈ పరిస్థితిలో ఆయన తన మిత్రుడిని కలుసుకోడానికి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి సాయంత్రం వరకూ అక్కడ హాయిగా గడిపి...వెంటనే ఒక నిర్ణయానికొచ్చారు. పొద్దున్నే వాకింగ్, కాఫీ, టిఫిన్, ధ్యానం,నాలుగైదు రకాల పేపర్లు, మంచి మిత్రులు, అందుబాటులో డాక్టరు! వృద్ధాప్యంలో ఇంతకంటే ఏం కావాలి? 'ప్రేమ? ' ! కరక్టే, ప్రేమ కావాలి! అది దొరకదని నిర్థారణ అయ్యాక, భౌతికం గా దొరికే మిగతా వాటితో తృప్తి చెందడం కరక్టేగా!

ఇంకొకరి విషయం! భార్యా భర్తా ఇద్దరూ డాక్టర్లు! కొడుకూ, కూతురూ ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో అమెరికాలో స్థిరపడ్డారు. డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉంది వాళ్ళకి! కానీ ముసలావిడకి అక్కడి వాతావరణం పడకపోవడంతో ఇండియా వచ్చేసారు. ఇద్దరూ ఒంటరిగా ఉండలేకపోయారు..ఆరోగ్య కారణాల రీత్యా! అందుకే హోం లో చేరారు.వాళ్ళు దగ్గర లేరన్న చింత తప్ప పిల్లలకు వారి బాగోగుల గురించి చింత లేదు.ఇదొక పరిస్థితి!

ప్రేమాభిమానాలు పిల్లల దగ్గర లభిస్తే తప్ప, 'వృద్ధాప్యంలో కొడుకు దగ్గరే ఉండాలి ' అని నిర్ణయించుకోవడం, సమాజం ఏమనుకుంటుందో (కొడుకు గురించి) అనే ఒక false concernతోనో పిల్లల దగ్గర పడుండక్కర్లేదని నా అభిప్రాయం!

ఈ మధ్య వచ్చిన కొత్త చట్టం..వృద్ధులైన తల్లి దండ్రుల బాధ్యతను పిల్లలు తిరస్కరిస్తే 3 నెలలు జైలు తప్పదని హెచ్చరిస్తోంది! ఎంత మంది తల్లులు, తండ్రులు ముందుకు వచ్చి పిల్లల గురించి ఫిర్యాదు చేస్తారు? తల్లి దండ్రుల నుంచి ఆస్థులను పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే, తిరిగి వారినుంచి ఆస్థులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుందట! ఈ చట్టాన్ని ఎంతమంది తల్లి దండ్రులు ఉపయోగించుకుంటారో చూడాలి!
ఇక ప్రతి వృద్ధాశ్రమంలోనూ ప్రేమగా చూస్తారా, ప్రశాంత వాతావరణం ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం! సిటీ మధ్యలో చుట్టూ పెద్ద స్థలం కూడా లేకుండా నడిపే ఆశ్రమాలున్నాయి.ఇక్కడ మనం 'పిండి కొద్దీ రొట్టె ' సామెత గుర్తు చేసుకోవాలి!

అయితే ఒక విషయం! ఎంత విశాలమైన ఆశ్రమం అయినా, ఎన్ని వసతులున్నా, డాక్టరు పక్కనే ఉన్నా పిల్లల (ప్రేమ పూర్వక)సాహచర్యం, సాన్నిధ్యాన్ని మించింది ఉంటుందా? కనీసం వొంట్లో నలతగా ఉన్నపుడైనా 'పిల్లలుంటే ఇప్పుడు ?' అనిపించదంటారా? (అక్కడ చేరిన పరిస్థితులేవైనా కానివ్వండి)

June 17, 2008

పెళ్ళంటే నూరేళ్ళ వంటా?

ఇవాళెందుకో వంట చెయ్యబుద్ధి కాక వంటిల్లు తాళం వేసి తాళం చెవులెక్కడో(తాళం చెవులనాలా, చేతులనాలా?) పారేశాను. వంట చెయ్యడం నాకు ఇష్టమైన పనే,వంట ఒక కళే! నన్ను నేనే పొగుడుకుంటే బాగోదు గానీ బాగా వండుతాను కూడా! కానీ పదేళ్ళుగా రోజూ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రోజూ ఇదే పనా?

ఉద్యోగం చేసినప్పుడు, చెయ్యనప్పుడూనా?


ఏరోజు కారోజు మెనూ వెతుక్కోవడం! వారంలో రెండు సార్లు ఒకే మెనూ రిపీట్ కాకుండా చూడ్డం, పోపులు పెట్టడం, ఆవ నూరడం, పొడులు చేయడం,పచ్చళ్ళురుబ్బడం.ఓహ్..నో! ఇందులో మళ్ళీ పాప గారి కోసం కారాలు తక్కువ వెయ్యడాలు, నేతులు ఎక్కువ వెయడాలు! ఎంత ఇష్టమైన పనైనా రోజూ చేస్తుంటే మొనాటనస్ గా ఉండదూ!

'ఏమిటమ్మా అలా కూచున్నావు పొద్దున్నే?" అనడిగాడు మా ఆయన ప్రేమగా! 'నాకు వంట మీద విరక్తిగా ఉంది ' అని చెప్పానో లేదో, మొహం చిరాగ్గా పెట్టేసుకుని  'నేను బిజీగా ఉన్నప్పుడే నీకిలాంటి విరక్తులు కలుగుతాయి ' అని మనసులో తిట్టుకుంటూ (తను మనసులో ఏ భాషలో తిట్టుకున్నా సరే, నాకు తెలుగు అనువాదంతో సహా వినబడుతుంది, పొగడ్తలు అంతగా వినబడవు గానీ) "అలాగా, అయితే బయటినుంచి తెప్పించుకో నీకూ, పాపాయికీ, నేనెలాగూ ఆఫీస్ లోనే గా " అని డిస్కౌంట్ ఇచ్చి మాట్లాడాడు!

"నేను పదేళ్ళ బట్టీ, నాన్ స్టాప్ గా వంట చేస్తున్నాను కదా, ఇన్నేళ్ళ వంటంతా కలిపితే ఎంతమందికి భోజనాలు పెట్టచ్చంటావు?" అనడిగాను.

"బోల్డు మందికి! నువ్వసలే ఇద్దరికి అంటే నలుగురికి వండుతావు ! మా వూరి మావుళ్ళమ్మ జాతరలో ఒకరోజు అందరికీ సంతర్పణ చెయ్యొచ్చు నీ పదేళ్ళ వంటతో" అన్నాడు.

'అమ్మో నేనింత ప్రొడక్టివా ' అని మూర్చ పోయాను.

పెళ్లైన కొత్తలో నాకు ఎక్కువ వెరైటీలు చేయడం వచ్చేది కాదు.మా అత్తగారింట్లో నేర్చుకోవచ్చులెమ్మని సరిపెట్టుకున్నాను.మొదటి రోజే వాళ్ళింట్లో నాకొక పెద్ద పజిల్ ఎదురైంది. కంచంలో పప్పు తర్వాత నల్లటి లేహ్యం వడ్డించారు.. తర్వాత అన్నం! ఎంత ఆలోచించినా ఆ కపిల వర్ణ శాకమేమిటోఅర్థం చేసుకోలేక పచ్చడితో లాగించేస్తున్నా!

ఇంతలో "ఇవాళ వంకాయ కూర భలే కుదిరింది" అని మా మామ గారు ఆత్తగార్ని ప్రశంసిస్తున్నారు. నాకసలే వంకాయ కూరంటే ప్రాణం! 'ఎక్కడ, ఎక్కడ వంకాయ కూర ' అని చూడగా, మా వాళ్ల కంచాల్లో లేహ్యం మాయమై పోయి ఉండటం గహించాను. మా అమ్మ చేసిన వంకాయ ముద్దకూరలో వంకాయ ముక్కలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడేమో ...!

"కలుపుకో, కలుపుకో " అని బలవంతం చేస్తున్నారు ఒక పక్క! పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అంటె ఇదే కాబోలనిపించింది.

ఇహ ఆ తర్వాత ప్రారంభమైంది పండగ నాకు! వాళ్ళింట్లో ఉదయం, సాయంత్రం రెండేసి కూరలుండాలి. పొద్దున వండినవి రాత్రికి తినరు. వెరైటీలుండాలి. నా గుంటూరు వంటలు నచ్చేవి కావు. నాకు ఆశ్చర్యం కలిగించేదీ, కోపం కూడా తెప్పించేదీ ఏమిటంటేప్రపంచంలో పశ్చిమ గోదావరి వంటలు తప్ప ఇంకో వంటలు ఉంటాయని వాళ్ళొప్పుకోరు. నేనొకసారి అద్భుతం గా గోంగూర పచ్చడి చేస్తే మూడేసి వాయలు తినేసి...'ఇలా ఉందేమిటి గోంగూర పచ్చడి? ఇలా కాదు చెయ్యాల్సింది" అంది మా AP .

"మీరు డైలాగ్ తప్పు చెప్పారు! ఇదేమిటి ఇలా ఉంది అని కాదు, ఇలాక్కూడా చేస్తారా? " అనడగాలి అన్నాను కోపం కనపడకుండా!

ఇహ మేము USA వెళ్ళాక హాయిగా ఇద్దరికే వొండచ్చు అనుకుంటే అక్కడ ఇంకా కష్టాలెదురయ్యాయి. మేము ఎక్కువ రోజులు ఒక్లహోమా లోని Tulsa అనే వూర్లో ఉన్నాం! అక్కడ మన ఇండియన్స్ అంతా కలిపి 700 మందికి మించరు. తెలుగోళ్ళు 200 వేసుకోండి.తరచూ ఈ రెండొందలమందికీ వంట చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, , వంటలో ఒక చెయ్యి వేయడానికి పిలవడం! అసలు USలో ఉన్న మూడేళ్ళలోనూ, పాతికవేల మిర్చి బజ్జీలు, ఒక టన్ను బియ్యం పులిహోర, చేసి ఉంటాను. ఒక లారీ లోడు టమాటాలతో ఊరగాయ పెట్టుంటాను. ప్రతి ఆదివారం ఒక పాట్ లక్! గాడిపొయ్యి మీద కూడా పెద్ద పెద్ద వంటలు చేసే కెపాసిటీ వచ్చేసింది. ఎంత విసిగి పోయానో!

 ఏదో ఒక రోజు ప్రతి స్త్రీకీ వంటంటే విసుగు పుట్టే సందర్భం ఒకటుంటుందని నా నమ్మకం!
మా ఆడపడుచు (వర్కింగ్) పొద్దున్నే నాలుగున్నరకు లేచి కుక్కర్ పెట్టి "ఆ శాస్త్రి గాడు (పెళ్ళి చేయించిన పురోహితుడు) ఏ ముహూర్తాన తెల్లవారుజామున నా చేత స్థాళీపాకం వండించాడో గానీ, ఆ రోజు నుంచీ ఇహ రోజూ నాలుగింటికే కుక్కర్ పెడుతున్నాను" అని రోజూ శాస్త్రి గార్ని తిట్టిపోస్తుంది.

ఇండియా వచ్చేసాక ఒక రోజు(అప్పుడు మేము గుర్గావ్ లో ఉన్నాం) వంట్లో బాగోక వంట చేయలేదు. ఆంధ్రా భవన్ కి వెళ్ళొచ్చాక మా అత్తగారికి ఫోన్ చేస్తే ఆవిడ 'అదేమిటి, నువ్వు వంట చేయలేకపోతే వాడికొచ్చుగా, వండకపోయాడా ' అన్నారు. నేను భయంకరంగా ఆశ్చర్యపోయి 'నీకు వంటొచ్చా?"అనడిగాను.


దానికి మా ఆయన.. "అంటే అదీ అలాక్కాదులే, కొంచెం వచ్చు! నేనూ అన్నయ్యా రూం లో ఉన్నప్పుడు అన్నయ్యే వండేవాడు..అసలప్పుడు నాకు వంట సగమే వచ్చు, కాని తర్వాత మొత్తం మర్చి పోయి, కొంచెం నేర్చుకున్నాక, కాఫీ కలిపి..కూరలు తరిగి..అంటె అన్నయ్యకు హెల్ప్ గా,," అని ఏదేదో మాట్లాడ్డం మొదలు పెట్టాడు. నాకు మండిపోయి మా బావగారికి ఫోన్ చేసాను

"మీకు వంటొచ్చా, రూం లో మీరు, మీ తమ్ముడు ఉన్నప్పుడు వంటెవరు చేసేవాళ్ళూ" అనడిగాను ఫోనెత్తగానే!ఆయన కోపంగా

 "ఏవమ్మో! మగాళ్ళు వంట చేయడం మా ఇంటా వంటా లేదు. నీకు మా తమ్ముడు చెప్పాడా నేను వంట చేసేవాణ్ణని...నాకసలు వంటే రాదు, నువ్విలా అవమాన కరమైన ప్రశ్నలు వేస్తే మా ఆవిడకు చెప్తా " అని బెదిరిస్తుండగా, వెనకనించి '"నాలుగైంది, ఇంత వరకూ కాఫీ లేదు నా మొహాన్న " అని మా తోడికోడలు గొంతు వినపడింది. 'ఇదీ సంగతి ' అనుకుని పెట్టేసాను. సో, తనకు వంటొచ్చన్న సంగతి నాకు తెలిస్తే నేను అడ్వాంటేజ్ తీసుకుంటానని ఈయన భయం !

 అందువల్ల ఎప్పుడైనా మా ఆయన రహస్యాలు తెలియాలంటే మా అత్తగారికి ఫోన్ చేస్తే చాలు సమాచార హక్కు చట్టం ఉపయోగించినట్టు మొత్తం డేటా వస్తుంది!

ఈయన మాత్రం "నువ్వసలు తల్లివేనా" అని తల బాదుకుంటారు.

మా బంధువుల్లో కొందరు పుట్టుకతో వృద్ధులైన యువకులు 'ఏం, వంట రోజూ చేస్తే చచ్చి పోతారా ఆడాళ్ళూ! మీరు చేస్తే వంటిల్లు organised గా ఉంటుంది. ఆ టెక్నిక్ మాకు తెలీదు అని శుష్క వాదాలు చేస్తారు. నా కజిన్ రాధ కి భలే కోపం ఇలా మాట్లాడితే! "మీరు క్రికెట్టో, లేక ఇంకేదైన బయటికెళ్ళే ప్రోగ్రమో ఉంటె ఝామ్మని పెద్ద ప్రిపరేషన్ లేకుండా వెళ్ళిపోతారు. మేం మాత్రం ముందే వంటా అదీ చేసిపెట్టుకుని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలన్నమాట! ఎప్పుడన్నా వంట చేయకుండా బయటికి వెళ్లామంటే ఇంటికొచ్చేదాకా మనసు మనసులో ఉండదు! అసలు వంటింటినే మనసులో పెట్టుకు తీసికెళ్ళిపోతాం ఎక్కడికెళ్ళినా! ఒక్క రోజు ఫ్రెండ్స్ తో బయటికెళ్లాలన్నా, తీరిగ్గా ఒక పుస్తకం చదవాలన్నా, కాసేపు డాబా మీదికెళ్ళి చంద్రుణ్ణో, చల్లగాలినో ఆస్వాదించాలన్నా, ఈ వంట ఒక పెద్ద ముల్లులా గుచ్చుతూ ఉంటుంది వెనకాల! నోరు మూసుకోండి వెధవ ఆర్గ్యుమెంట్లు చెయ్యొద్దు ' అని క్లాసు పీకేసింది ఒకసారి!

రాధ మాటలు నిజమే అనిపిస్తుంది! ప్రశాంతంగా మనది అంటూ ఆస్వాదించాలనుకున్న క్షణంలో కూడా నానబెట్టిన మినప్పప్పో,ఎండబెట్టిన వడియాలో, తరగవలసిన కూరలో, కాచాల్సిన పాలో గుర్తొస్తే జీవితం నిస్సారం అనిపించక మానదు.... కనీసం ఆ క్షణం!

భర్తల నుంచి కొంచెం co-operation, అప్పుడప్పుడు బ్రేక్ లేకపోతే వంట ఎప్పటికైనా బోరు కొట్టేస్తుందండి! అదేమిటో ఇప్పటికీ కూరలు తేవడం, వంటలో పెళ్ళానికి కాస్త సహాయం చెయ్యడం నామోషీ అనుకునే పురుష పుంగవులు కోకొల్లలు!

June 12, 2008

బడి గంట మోగింది

ఇవాళ స్కూళ్ళు తెలిచే రోజు! కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మినహా, ప్రతి యేడూ ప్రభుత్వ పాఠశలలన్నీ తెరిచే రోజు! పిల్లలంతా ఆసక్తిగానూ, కొంచెం నిరాశగానూ (అప్పుడే సెలవులైపోయాయా అని) ఎదురు చూసే రోజు!

ప్రతి జూన్ పన్నెండునా స్నేహితులందరినీ మళ్ళీ కలుసుకోబోతున్నామన్న సంతోషంతో స్కూలుకి వెళ్ళేవాళ్ళం మేము! ఇప్పట్లాగా ఇన్ని కమ్యూనికేషన్లు అప్పుడు లేవు పదిహేను పదహారేళ్ళ క్రితం! అందువల్ల ఏప్రిల్ 23(చివరి పని దినం)న విడిపోతే మళ్ళీ జూన్ పన్నెండునే పునర్దర్శనం! పైగా సెలవులిచ్చిన రోజునే, (లేదంటే ఆ మర్నాడన్నా) మామయ్య వాళ్ళింటికో అమ్మమ్మ వాళ్ళింటికో చెక్కేస్తాం కదా!

స్కూలు పునఃప్రారంభం రోజు స్కూలంతా కొత్త కొత్తగా ఉంటుంది అది మన స్కూలే అయినా! అవే క్లాసు రూములు, వాళ్ళే టీచర్లు! అయినా సరే! టీచర్లు కనపడగానే 'అమ్మయ్య ' అనిపిస్తుంది. ఎందుకో కొంచెం భయం కూడా వేస్తుంది. ఆ రోజు టీచర్లందరూ కొత్త చీరలు (సెలవుల్లో కొన్నవి) కట్టుకొస్తారు! మనం మాత్రం యూనిఫాం లోనే వెళ్ళాలి. కొత్త అడ్మిషన్ వాళ్ళకి కొంచెం సడలింపు!
టీచరమ్మని వాళ్ళాయన బండి మీద దింపితే 'టీచరు గారికి కూడా మొగుడూ, పిల్లలూ ఉంటారా' అని తెల్లబోయే వాళ్ళం మేము!ఉంటారని అంతకు ముందు తట్టదు ఎంచేతో!

మా వూరి ఆడపిల్లల హైస్కూలు మేము చదువుకున్నపుడు(ఇప్పుడెలా ఉందో తెలియదు)మార్కుల్లోనూ, ఇతర extra curricular activities కీ చాలా పేరు పొందింది! టీచర్లు అంతా మమ్మల్ని స్నేహితుల్లాగానే చూస్తూ, తగిన క్రమశిక్షణలో ఉంచేవారు! పొరపాటున జడలు ముందుకు పడినా మా N.S టీచర్ జోసెఫిన్ గారు 'జెళ్ళు జెళ్ళు ' అని హెచ్చరిస్తూ ఉండేది! పైగా మా కాంపౌండులోనే బాయ్స్ హైస్కూలు మా పక్క బిల్డింగ్ లోనే ఉండేది!(ఈ హైస్కూల్లోనే నాయని సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ గా పని చేసారు. వారి అమ్మాయి నాయని కృష్ణ కుమారి గారు మా నాన్న గారి క్లాస్ మేట్) అందువల్ల మమ్మల్ని టీచర్లు సొంత పిల్లలకంటే జాగ్రత్తగా చూసే వాళ్ళు!

కొత్త యూనిఫాం కుట్టించుకోవడం ఒక పెద్ద పండగలా ఉండేది మాకు!ఇప్పట్లా స్కూల్లోనే అమ్మేవాళ్ళు కాదు! బయటే కుట్టించుకోవాలి!కొత్త షూలు కొనుక్కోవడం, వాటిని మొదటి నెలరోజుల పాటు రోజూ అవసరమున్నా లేకపోయినా పాలిష్ చేయడం..సాక్సులు ఉతకడం బలే సరదాగా ఉండేది!ఇక లేపాక్షి నోట్సులు కొనుక్కోవడం మరో సరదా! అవి బాయ్స్ హైస్కూలు స్టాఫ్ రూం దగ్గర దగ్గర అమ్మేవాళ్ళు! 200 పేజీల ఒక్కో నోట్సు ఒక రూపాయి తొంభై పైసలు! (నిన్ననే మా పాపకి 180 పేజీల నోట్సు 23 రూపాయలు పెట్టి తెచ్చాను) దాని మీద నంది బొమ్మ ఉండేది. పుస్తకాలకు బ్రౌన్ కలర్ కవర్లు వేయాలనే నిబంధన ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ కొందరు సితార, జ్యోతి చిత్ర మొదలైన పుస్తకాల్లోంచి కలర్ ఫుల్ గా సినిమా బొమ్మల కవర్లు వేసుకొచ్చేవాళ్ళు! అలాంటివి వేస్తే మా నాన్న గారు చంపి ఉప్పు పాతర వేస్తారు కాబట్టి నేను, మా చిన్నన్నయ్య, మా చెల్లెలు చచ్చినట్టు బ్రౌన్ కలర్ అట్టలు వేసుకునేవాళ్లం మనసులో ఏడుస్తూ!

సెక్షన్లు చేయక ముందు అందరం కలిసి ఒక పెద్ద హాల్లో కూచునే వాళ్ళం! మా ఫ్రెండ్స్ అందరం ఒకే సెక్షన్లో ఉండాలని 'మమ్మల్ని విడగొట్టద్దని ముందే క్లాస్ టీచర్ ఎవరో కనుక్కుని ఆవిణ్ని బెదిరిస్తూ వేడుకునే వాళ్ళం! 'నోళ్ళు ముయ్యకపోతే మాళ్ళు పగుల్తాయి '(ఇది మా జోసెఫిన్ గారి డవిలాగే, నాకు గుర్తుంది)అని ఏ మాటా ఇవ్వకుండానే మా గుంపుని ఒకటే సెక్షన్లో వేసేవారు! టెంత్ క్లాసులో మాత్రం అందరం బి సెక్షను, లెనినా మాత్రం ఏ సెక్షన్లో పడటంతో అది వెక్కి వెక్కి యాడవటం మొదలు పెట్టింది, ఒక రోజంతా! దానితో దాన్ని మళ్ళీ మా సెక్షన్లో వేసారు. పిల్లల మనో భావాలకు, భావోద్వేగాలకు అంత విలువ ఇచ్చేవాళ్ళు మా బంగారు టీచర్లు!

సెక్షన్లు చేయగానే మేము 80 శాతం పైగా మార్కులు ఎవరు సంపాదించగలరో వారికి మా గ్రూపులో ఉదారంగా చోటిచ్చే వాళ్ళం!ఇహ అప్పటి నుంచే పోటీ మొదలు! కానీ మా మీద ఎటువంటి వత్తిడీ ఉండేది కాదు! ట్యూషన్ కి కూడా వెళ్ళే అవసరం మాకెప్పుడూ రాలేదు. అంత బాగా ఉండేవి పాఠాలు! స్కూలునీ, చదువునీ ఇష్టమైన పనిగా నిర్వహించాం అప్పుడు!

ఈ ఏడాది కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మే చివరి వారంలోనే స్కూళ్ళు మొదలెట్టేశాయి మండుటెండల్లో! 'ఇంట్లో కూచుని ఏం చేస్తారు పిల్లలు? కాస్త సిలబస్ అన్నా కవర్ అవుతుంది, మొదలెట్ట 'మని తల్లి దండ్రులే అడిగారని వాళ్ళు చెపుతున్నారు. ఆరో క్లాసు నుంచే IIT కోచింగ్ ఇచ్చే కొన్ని స్కూళ్ళైతే అసలు వేసవి సెలవులివ్వడానికే ఆసక్తి చూపించట్లేదు! ఏ మాత్రం సిగ్గు పడకుండా 'ఆరో తరగతి నుంచే చదివే ప్రతి పాఠం వెనకా IIT ఆశయం, రాసే ప్రతి టెస్టు లోనూ IIT కోణం అని FM రేడియోలో కూడా ఊదరగొట్టేస్తున్నారు! ఎంతమంది గొర్రెలమంద లాంటి పేరెంట్స్ లేకపోతే వాళ్ళకంత ధైర్యమొస్తుంది?

సెలవులూ, ఆటలూ,వెన్నెలా, అమ్మమ్మ గారి ఊరూ, తాతయ్యతో షికార్లూ కాలవలో స్నానాలూ, ఆరుబయట వేసవి నిద్రలూ ఇవేవీ అక్కర్లేదన్నమాట పిల్లలకి! వాళ్ల మనసుల్నీ, ఆలోచనలనీ,సృజనాత్మకతనీ, చివరకి వాళ్ళ మనసుల్లోని ప్రేమని కూడా చంపి IIT గోతిలో పాతిపెట్టడానికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు సిద్ధం! వారికి పలుగు పారా అందించడానికి వేలకొద్దీ తల్లిదండ్రులు సిద్ధం!

రండి, చూడండి, కూకట్ పల్లిలో, దిల్ సుఖ్ నగర్లో...గుంటూర్లో, విజయవాడలో .. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా..వీరే...వీరే!
చదువులా...చావులా ఇవి?

June 10, 2008

స్ఫూర్తి దాయకం 'ఇడ్లి-వడ-ఆకాశం'




దాదాపు పదిహేను రోజులుగా ఇంటర్నెట్ కి దూరంగా ఉన్నాను. అందువల్ల ఈ పుస్తకం మీద ఎవరైనా తమ బ్లాగుల్లో ఇప్పటికే సమీక్ష రాసారా లేదా అన్న విషయం తెలియదు. ఇప్పటికే రాసి ఉంటే ఈ సమీక్ష కూడా చదివి ఎలా ఉందో చెప్పండి! అసలు పుస్తకమే చదివేసి ఉంటే సమస్యే లేదు.
ఇడ్లి-వడ-ఆకాశం పుస్తకం పేరే వింతగా అనిపిస్తుంది చూడగానే! అందునా ఇది యండమూరి రాసాడంటే అంచనాలు ఇంకా పెరుగుతాయి! నిజానికి ఇది యండమూరి సొంత రచన కాదు. కామత్ హోటల్స్ (ఒకప్పటి)అధినేత, ముంబాయి లోని ఆర్కిడ్ హొటల్ యజమాని విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ కు యండమూరి స్వేచ్చానువాదం!
పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని విఠల్ కామత్ ముంబాయిలో నిర్మించిన ఆర్కిడ్ హోటల్ భారతదేశంలో మొదటి ECOTEL. ప్రపంచంలోని దాదాపు 200 హోటళ్ళు దీనితో పోటీకి దిగగా, ప్రపంచపు నంబర్ వన్ హోటల్ గా అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 37 అవార్డులు గెల్చుకుంది.ఈ ఐదు నక్షత్రాల ఎకోటెల్ కట్టడమే విఠల్ వెంకటేష్ కామత్ జీవితాశయం! ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి ఎన్ని మెట్లు ఎక్కవలసి వచ్చిందో, ఎక్కుతుండగానే ఎన్ని మెట్లు కూలిపోయాయో, కూలిన మెట్లను, విఠల్ ఎంత శ్రమకోర్చి పునర్నిర్మించుకున్నారో అత్యద్భుతంగా కామత్ ఇందులో వివరిస్తాడు.
ఆయన ఇంత ఉన్నత స్థితికి తొలిమెట్టు కామత్ హోటల్ లో దొరికే రుచికరమైన ఇడ్లీ!
అందుకే తన విజయం దేనితో ప్రారంభమైందో...ఆ ఇడ్లీ పట్ల కృతజ్ఞతతో కామత్ తన ఆత్మకథకు Idli, orchid and will power అని పేరు పెట్టారు. స్ఫూర్తి దాయకంగా సాగే ఈ పుస్తకాన్ని ఇప్పటికే 14 భాషల్లోకి అనువదించడమే కాక, రెండు యూనివర్సిటీల్లో నాన్-డీటైల్డ్ గా పెట్టారు. అసలు రచన ఎలా ఉన్నా , అనువాదం యండమూరి చేతిలో సాగింది కాబట్టి ఆయన శైలికి అనుగుణంగా సాగిపోతూ ఇది యండమూరి రాసిన పుస్తకమే అనిపిస్తుంది. ఎక్కడా అనువాదమనిపించదు.
"ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ ఆలోచన ఉంటుంది! ఎక్కడ సంకల్పం ఉంటుందో, అక్కడ ఆ ఆలోచన విజయంగా మారుతుంది" ఇదీ విఠల్ నమ్మిన సూత్రం! అన్నింటికంటే విఠల్ కి పెద్ద ప్రేరణ అతని తండ్రి వెంకటేష్ కామత్! చేతిలో పైసా లేక, చదువు లేక ఎనిమిదేళ్ళ వయసులో పొట్ట చేతబట్టుకుని బొంబాయి చేరిన వెంకటేష్ ఒక హోటల్లో క్లీనర్ గా చేరి, నమ్మకంగా పని చేస్తూ, యజమాని ఇబ్బందుల్లో ఉండి హోటల్ ను వదిలి వేరే చోట ఉండగా దాదాపు ఏడాదిన్నర పాటు సమర్థంగా ఆ హోటల్ ని నిర్వహిస్తాడు. హోటల్ యజమాని శ్రీనివాస్ కామత్ అబ్బురపడి 'నా అల్లుడివౌతావా?' అని అడిగితే వెంకటేష్ ఏమన్నా డో చూడండి.."క్షమించండి, ముందు నా సొంత హోటల్ కి యజమానిని కావాలి! ఆ తర్వాతే ఆలోచిస్తాను"
సొంత హోటల్ కి యజమాని అయ్యాక, శ్రీనివాస్ కామత్ కూతుర్ని వెంకటేష్ పెళ్ళి చేసుకుని ఆరుగురు పిల్లల తండ్రవుతాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న సమయమలో అయిన వాళ్ల ద్రోహానికి గురైనా, కొడుకుల చేయూతతో తేరుకుంటాడు. అయితే పిల్లల్ని క్రమ శిక్షణలో పెట్టే విషయంలో వెంకటేష్ కామత్ వారిని కొట్టడానికి కూడా వెనుకాడడు. తండ్రి కొట్టడం, తిట్టడం వెనక తండ్రి తాపత్రయాన్ని అర్థం చేసుకుని విఠల్ కామత్ బాగుపడగా, చివరి కొడుకు శివానంద్ మరింత మొండివాడిగా మారి, చివరికి కుటుంబం ముక్కలు కావడానికి కారణమవుతాడు.(చివర్లో)

ఇంజనీరింగ్ చదివిన విఠల్ కామత్ తండ్రికి ఆసరాగా ఉండాలని హోటల్ రంగంలో ప్రవేశించాడు.నెమ్మది నెమ్మదిగా ఆ రంగంలో మెళకువలు తెల్సుకుంటూ, ఆరితేరాడు. తండ్రి తన కామత్ హోటళ్ళని బొంబాయంతా విస్తరిస్తే, విఠల్ తన ఆతిధ్య పరిశ్రమని ప్రపంచమంతటా విస్తరింపచేసాడు. స్టాఫ్ తో కలుపుగోలుగా ఉండటం,కస్టమర్లతో అభిమానంగా మాట్లాడటం(రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ల అభిరుచులను గుర్తుంచుకోవడంతో సహా) వంటతో సహా ప్రతి పనినీ స్వయంగా పర్యవేక్షించడం, ఇవన్నీ తండ్రి నుంచి విఠల్ కి సంక్రమించాయి.

ఇతర దేశాల్లోని హోటళ్ళు ఎలా ఉంటాయో తెల్సుకొవాలని విఠల్ విదేశాల్లో విస్తృతంగా పర్యటించాడు....ఎక్కడికక్కడ ఉద్యోగాలు సంపాదిస్తూ! విఠల్ వెనిస్ నగరానికి చేరుకునే సరికి ఆయన 3 రోజులకు గాను ముందుగానే డబ్బు చెల్లించి రిజర్వ్ చేసుకున్న హోటల్ రూం తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు.అప్పుడు డబ్బు సంపాదించడానికి విఠల్ చేసిన పని విఠల్ మాటల్లోనే చదవండి.
"నేనున్న హోటల్ పక్కనే ఒక టూరిస్టు ప్రదేశం ఉంది. ఊరంతా తిరిగి మధ్యాహ్నం అయ్యేసరికి అక్కడికి చేరిన టూరిస్టులు ఎండకు వాడి పోయి దాహంతో ఉండేవారు. డబ్బు చేసుకోవడానికి ఇదొక అవకాశంగా కనపడింది నాకు.నేనున్న హోటల్లోనే ముగ్గురు పనివాళ్ళతో మాట్లాడాను. నా గదినే కార్యాలయంగా మార్చాను.చల్లని నీళ్ళు,పుచ్చకాయ రసం, నిమ్మకాయ, దోసకాయ ముక్కలు, దాని మీద కొద్దిగా ఉప్పుచల్లి ప్లేట్లలో అందంగా సర్ది పనివాళ్ళ చేత టూరిస్టులకి అందించసాగాను.నాలుగే రోజుల్లో నాకు మంచి లాభం వచ్చింది. అక్కడే ఒక బస్సు అద్దెకు తీసుకుని తిప్పసాగాను. ఈ అనుభవం నాకో పాఠం నేర్పింది.ధైర్యం ఉంటే ఎడారిలో కూడా ఇసుక బిజినెస్ చేయవచ్చని!"
ఇలాంటి అద్భుతమైన సంఘటనలు ఈ పుస్తకం నిండా కనిపిస్తాయి. విఠల్ మరో కిటుకు చూడండి."మొదట్లో ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ విడిగా గిన్నెలో సర్వ్ చేసే వాళ్ళం! తర్వాత మూడూ ఒకేదాంట్లో వచ్చేలా దొప్పలున్న స్టీలు ప్లేట్లు చేయించాను. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకు పాతిక వేలు తగ్గింది."

గుజరాత్ హైవే మీద హోటల్ పెట్టి,వేగంగా వెళ్ళే వాహనాలకు అక్కడ హోటలున్నదని తెలియడం కోసం వేలు ఖర్చు పెట్టి బోర్డులు రాయించకుండా బంధు మిత్రుల కార్లు కొద్ది రోజుల పాటు రోజూ అక్కడ పార్క్ చేయించి ఉంచాడు.

వందల హోటళ్ళు పెట్టడం ఒకెత్తు! బొంబాయిలో ఎయిర్ పోర్ట్ ప్లాజా (3 స్టార్ల హోటల్)కొని దాన్ని కామత్ ప్లాజాగా మార్చడం ఒకెత్తు! దాని పక్క స్థలం కూడా కొని 5 నక్షత్రాల హోటల్ నిర్మించాలని విఠల్ గమ్యం! తన గమ్యానికి చేరువవుతున్నానని విఠల్ అనుకుంటుండగానే కష్టాలు మొదలయ్యాయి. ఎయిర్ పోర్ట్ ప్లాజా పైపు లైన్ల మీద నిర్మించారని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని తెలిసినపుడు, 24 గంటల్లో దాన్ని మూసివేసాడు విఠల్. అదొక సాహసోపేత నిర్ణయం! వ్యాపారం కన్నా ప్రాణాలే ముఖ్యమని విఠల్ భావించడం ఆయనలోని మానవతకు నిలువుటద్దం!
తర్వాత విఠల్ చెప్పినట్టుగానే కష్టాలు ఒంటరిగా కాక, సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చాయి.తమ్ముడు శివానంద్ మొండికేయడంతో, సగంలో ఆగిపోయిన ఆర్కిడ్ హోటల్, కోట్ల కొద్దీ అప్పులు విఠల్ కి, మిగిలిన ఆస్తులన్నీ ఇతర కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి నిర్ణయమైంది.విఠల్, అతని భార్య విద్య, పిల్లలు మౌనంగా సంతకాలు పెట్టారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలంటే ఏమిటో తెలిసింది! స్నేహితులనుకున్న వాళ్ళు మొహం చాటేసారు.బాంకులు కూడా అప్పివ్వలేదు.

విసిగిపోయిన విఠల్ ఒక దశలో పదహారో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.అప్పుడతనికి తన పని ద్వారానే కర్తవ్య బోధ చేసిందెవరో తెలుసా!ఎదురు బిల్డింగ్ కు కదులుతున్న ఒక చెక్క పరంజా మీద నిలబడి ఇరవై ఆరో అంతస్థుకి రంగులేస్తున్న ఒక పెయింటర్! జీవితం విలువ, కుటుంబం పట్ల బాధ్యతా గుర్తొచ్చాయి.పడి లేచిన కడలి తరంగమయ్యాడు. ఆ తర్వాత ఆత్మ విశ్వాసమే ఆయుధంగా కష్టాలను జయించి 21 గదులతో ఆర్కిడ్ హోటల్ని నిర్మించి చివరి క్షణాల్లో ఉన్న తండ్రి చేత ప్రారంభోత్సవం చేయించాడు. దానితో మళ్ళీ అప్పులు దొరికాయి. ఆర్కిడ్ కల సాకారమైంది.

నిస్సందేహంగా ఈ పుస్తకం స్ఫూర్తిని కలిగించేదే!కాకపోతే ఇది యండమూరి చేత అనువదించబడటం వల్ల ఆయన ఇతర వ్యక్తిత్వ వికాస పుస్తకాల ప్రభావం రచనలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల మూలంలోని మాటలను యధాతథంగా వాడారు! పేజీ 90లో 'సింగపూర్ లో కుస్ కుస్ వాడటం నిషేధం' అని ఒక వాక్యం ఉంది. కుస్ కుస్ (నిజానికది ఖస్ ఖస్ అయి ఉండాలి)అంటే గసగసాలు!
అలాగే కవర్ పేజీ మీద ఇది విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథ అని ఎక్కడా ప్రచురించలేదు. ఆ విషయం వెనకపేజీ మీద ఉంటుంది.కొందరు ఇది యండమురి డైరెక్టు పుస్తకమనుకుని కొన్నారట.(రైల్వే స్టేషన్లో పుస్తకాల షాపు వ్యక్తి చెప్పాడు).
చదివి తీరాల్సిన విజయ గాధ ఇది!
ప్రచురణ: నవసాహితి పబ్లిషర్స్ , విజయవాడవెల: 100 రూపాయలు లభ్యం: అన్ని పుస్తకాల షాపుల్లోనూ!