మానవత్వానికి మచ్చ తెచ్చే ఆ కథని ఎలా యాక్సెప్ట్ చెయ్యాలో అర్థం కాక, పత్రిక ఎడిటరు గారికి ఒక ఉత్తరం రాసి పడేసాను.
"ఆర్యా, ఈ కథ ప్రచురించడం వల్ల మీరు పాఠకులకు ఏం చెప్పదల్చుకున్నారో పత్రికా ముఖంగా
తెలియజేయగలరు" అని! ఆ కథని మీకు ఇక్కడ పరిచయం చేయబోతున్నా!
సుమధుర(పేరు చూడండి, ఎంత అందంగా ఉందో), మెర్సీ చిన్నప్పటినుంచీ స్నేహితురాళ్ళు. సుమధుర ఇంటిపక్కనే ఉండే మెర్సీ సుమధుర ఇంటి తోటలో పూసే గులాబీలంటే ఎంతో మోజు పడేది. పెద్దయ్యాక మెర్సీకి పెళ్ళై, భర్తతో ఊటీ వెళ్ళిపోయింది. మెర్సీ అత్త దయామయి కి మొగుడి ద్వారా సంక్రమించిన బోలెడు
ఆస్థి ఉంది. కొడుకూ కోడలు దగ్గరే ఉంది.
మెర్సీ, సుమధురా ఇద్దరూ రిటర్మెంట్ వయసు వాళ్లయ్యారు. సుమధుర వాళ్ళ నాన్నగారు స్థాపించిన అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ ఉంది. ఆ శరణాలయాల పనుల మీద ఊటీ వెళ్ళి, మెర్సీని కలిసింది. మెర్సీ అత్తకి
అప్పటికి 89 ఏళ్ళు వచ్చాయి. ఆవిడ పనులతో విసిగిపోతున్నానని, ఎక్కడికీ వెళ్లడానికి కూడా పడటం లేదని మెర్సీ సుమధురతో వాపోయింది.పైగా ఆ ముసలావిడ ఆస్థి అంతా తన వద్దే ఉంచుకుని "ఇదిఓ అదిగో " అని కాలం
గడిపేస్తోంది తప్ప ఎంతకీ ఆస్థి కొడుక్కి ఇవ్వడం లేదు. తొంభై దగ్గర పడ్డా జిహ్వ చాపల్యం చావలేదు.
మెర్సీ విసుక్కుంటుందే కానీ ముసలావిడకు ఇష్టమని మాంసం కూరలూ అవీ చేసి పెడుతూనే ఉంటుంది. కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కాకపోతే తనకు బ్రేక్ అనేదే లేకుండా పోయిందని స్నేహితురాలి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది.మెర్సీ భర్త కెన్నీ తన తల్లి తొభయ్యో పుట్టిన రోజు మరుసటి రోజే కాబట్టి, తమతో కూడా ఉండి పార్టీలో పాల్గొనాలని సుమధురని కోరాడు.
ఆ మరుసటి రోజు ఉదయం మెర్సీ తోటలో కూచున్న సుమధురకి మెర్సీ తన గులాబీలను
చూపిస్తూ "ఏమిటో సుమధురా, మీ తోటలో పూసినట్టు పూయవు నా గులాబీలు!రేకలు సమానంగా ఉండవు" అంటుంది.
రాత్రికి దయామయి పుట్టినరోజు పార్టీ జరుగుతుంది.మెర్సీ కేకు తయారు చేస్తుంది. ముసలావిడ "ఇక చాల్లే" అని కొడుకు ఆపే వరకూ కేకు తింటుంది.
పార్టీ అయ్యాక కూడా "కేకుందా, అయిపోయిందా" అనడుగుతుంది.
ఆరోజు రాత్రే నిద్రలో దయామయి ప్రాణం విడుస్తుంది. అందరూ 'తొంభయ్యో పుట్టిన్రోజు కోసమే ఆగింది ముసలావిడ ప్రాణం" అని చెప్పుకుంటారు.సుమధుర ఊరెళ్ళిపోతుంది.
కొద్ది రోజుల తర్వాత మెర్సీ సుమధురకి 5 లక్షలకు చెక్కు పంపుతూ "అత్తమ్మకి బతికున్నన్నాళ్ళూ సేవ చేయగలిగాను. కంఫర్టబుల్ గా ఉంచగలిగాను, ఆవిడ ఆస్థిలో కొంత నీ అనాధ శరణాలయం కోసం
పంపుతున్నాను"అని ఉత్తరం రాస్తుంది.
అపుడు ఊటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా విప్పని తన ట్రావెల్ బాగ్ తెరుస్తుంది సుమధుర. అందులో ఒక పురుగుల మందు సీసా ఉంటుంది. పార్టీ రోజు రాత్రి అందరూ నిద్ర పోయాక, ముసలావిడ తిండిపిచ్చిని అడ్డం పెట్టుకుని సుమధుర ఒక కేకు ముక్క మీద పురుగుల మందు పోసి
"మీ కోసమే తెచ్చాను, తినండి" అని తినిపిస్తుంది. ఆవిడ తిని, తెల్లారే సరికి హరీ అంటుంది.
ఇదీ కథ!
ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలో, కనీసం ఏం ఆశించాలో(కథ చదివినందుకు మానసికానందమో, ఆవేదనో, ఆలోచనో ఏదో కలగాలి కదా) అర్థం కాలేదు నాకు. "కథని కథ లాగా చదవాలి '(సినిమాని సినిమాలాగా చూడమన్నట్టు)అనుకోవాలేమో మరి!
కథ సుమధురే నెరేటర్ గా 'నేను ' అని ప్రథమ పురుషలో సాగుతుంది.
తొంభై యేళ్ళ ముసలావిడ పట్ల సుమధుర భావాలెలా ఉంటాయో చూడండి.
ముసలావిడ ఏదో మాట్లాడుతూ ఉంటే "ఏమిటి మెర్సీ, ఆ "చెత్త వాగుడంతా" వింటూ
కూచోమన్నావా" అంటుంది కోపంగా!
మెర్సీ ఎంత చేసినా ముసల్ది తప్పులెంచుతూనే ఉండేదిట. కోడిగుడ్డుకి ఈకలు పీకే రకంట!
మెర్సీ వాళ్ళ అత్త మీద ఎక్సెస్ మెర్సీ చూపిస్తోందనిపించిందిట. అందుకే ఆ మెర్సీ ని కిల్ చేయాలని ముసలావిడకు పురుగుల మందు పట్టించిందిట.
పైగా చివరి వాక్యం చూడండి, "ఇప్పుడు మెర్సీ గార్డెన్ లో రోజెస్ తనిచ్చే ప్రేమతో చక్కగా వికసిస్తాయి" ట!
ముసలావిడ మీద అకారణ ద్వేషం పెంచుకుని పరలోక ప్రయాణం కట్టించిన
సుమధుర చేసే పనేంటో తెలుసా..అనాధ శరణాలయాలు నడపటం. ఇంత "దయా హృదయురాలు" అలాంటి పనెలా చేస్తుందో మరి! వాళ్ల శరణాలయాల్లో కూడా ఎవరైనా తొంభై దగ్గర పడ్డ ముసలాళ్ళుంటే ఇలాగే గుటుక్కుమనిపిస్తుందో ఏమిటో!
కందకు లేని దురద కత్తి పీటకెందుకని....మెర్సీ కి లేని కోరిక (ముసలావిడని చంపాలని ) ఈవిడకెందుకో! మెర్సీకి ఆవిడ మీద ద్వేషం ఏమీ లేదని ఆమె రాసిన ఉత్తరం చెప్తూనే ఉంది.
వయసు బాగా మీద పడ్డ వృద్ధులు ఏదో ఒక సొద చాదస్తంగా మాట్లాడుతూనే
ఉంటారు. వారిని అస్తమానూ కనిపెట్టుకుని ఉండటం కొంచెం కష్టమైన విషయమే!
అందుకని "చంపేస్తే పోలా?" అనేసుకుంటే ఒక పనై పోతుందన్నమాట.
సినిమాల సంగతి నాకు తెలీదు కానీ సాహిత్య ప్రభావం సమాజం మీద ఎంతో కొంత ఉంటుందని నేను నమ్ముతాను. ఇలాంటి కథలు ఒక పదో పదకొండో వరసగా వచ్చాయంటే , ఎనభయ్యో, తొంభయ్యో దగ్గర పడ్డ వృద్ధులు ఇంట్లో ఉన్నవాళ్ళకో, లేదా ఏ ఓల్డేజ్ హోం లో అటెండెంట్స్ కో
"గుక్కెడు ప్రాణం ఎంతలో పోవాలి? చంపేస్తే ఎవరికి తెలుస్తుంది. ఎలాగూ ముసల్దేగా" అనిపిస్తే...దాని పర్యవసానం ఏమిటి?
హోం లో చేర్పించాలనుకున్న వాళ్ళు కూడా "ఎందుకూ, ఖర్చు, పీక నొక్కితే
ఫినిష్" అనుకుంటే సరి!
"నిజంగా అలాంటి కర్కోటకులుంటారా ఏమిటి లెద్దూ" అనకండి. ఈ ఫొటో చూడండి..
తల్లిని భారంగా భావించిన పుత్రుడెవరో ఈవిడకు పున్నామ నరకం బతికుండగానే చూపించదలచి గోనె సంచిలోకట్టి ముళ్లపొదల్లో పారేశాడు.
ఇలాంటి సాహిత్య ధోరణులు ప్రబలితే, ఆ తర్వాత మనకి ఎక్కడన్నా రోడ్డు పక్కన ఇలాంటి సంచులు కనపడితే దాటుకుని వెళ్ళేంత ధైర్యం వస్తుంది.

