December 25, 2008

ఈ-తెలుగు స్టాల్లో మేము- కొన్ని విశేషాలు

క్రిస్మస్ ఆటవిడుపు రోజు వీలైనంత మంది మహిళా బ్లాగర్లు పుస్తకాల పండగ లో ఈ-తెలుగు స్టాల్ లో కలుసుకోవాలనుకుని అనుకున్నాం! నేను, వరూధినిగారు, పూర్ణిమ, స్వాతి(ఊసులు),విరజాజి శిరీష గారు, జ్ఞానప్రసూన గారు,జ్యోతి గారు, రమణి గారు,అరుణ గారు కొంచెం ముందూ వెనుకలు గా అక్కడ కలుసుకున్నాం! స్టాలు కి మేము చేసిన సేవలు ఏమీ లేకపోయినా అందరం కలుసుకోవడం మాత్రం మరపురాని అనుభూతినే మిగిల్చింది.




చక్రవర్తి(భవదీయుడు)గారు,రవిగారు,తాడేపల్లి గారు,భార్గవ్, శ్రీనివాస్ కుమార్, హరివిల్లు శ్రీనివాస్,శ్రీధర్ గారు,మహేష్ కుమార్ గారు, పద్మనాభంగారు,నామాల మురళీధర్(మురళీగానం),దైవానిక(బెంగుళూరు నుంచి ఈ తెలుగు స్టాల్ కోసమే ప్రత్యేకంగా వచ్చారు)..వీరందరినీ కలుసుకున్నాం! కస్తూరి మురళీకృష్ణ గారి పుస్తకాలు,కొల్లూరి సోమ శంకర్ గారి మనీ ప్లాంట్ వారిద్దరి ఆటోగ్రాఫులతో సహా కొనేసుకున్నాం నేనూ, వరూధిని గారూ!



జ్ఞానప్రసూన గారు, జ్యోతి గారు ఆప్యాయత నింపి తెచ్చిన పూర్ణాలు,సున్నుండలు మొహమాటం లేకుండా ఖాళీ చేశాము. కంపెనీ గా ఉంటుందని బయట నుంచి మిర్చి బజ్జీలు కూడా వీటికి జత చేశాము.



జ్ఞానప్రసూన గారు ఆమె రాసిన పుస్తకాలు, వారి నాన్నగారు రాసిన పుస్తకం మా అందరికీ ప్రేమతో ఇచ్చారు.
ఇంతలో కలహార స్వాతికుమారి గారు మెరుపులా వచ్చి మమ్మల్ని పలకరించి మాయమైపోయారు


తాడేపల్లి గారు, శ్రీధర్ గారు, శ్రీనివాస్ గార్లు,పద్మనాభం గారు సందర్శకులతో బిజీగా ఉండగా మరి కాసేపు అందరం కలిసి గడిపి కొన్ని ఫొటోలు తీసుకుని వీడ్కోలు చెప్పుకుని బయలు దేరాం.
అప్పటివరకూ ఊహల్లో వేరే రూపాలు ఉన్నా, కలుసుకున్న తర్వాత వెంటనే ఎప్పటినుంచో స్నేహితులుగా మసలుతున్న అనుభూతితో ముచ్చటించుకున్నాం అందరం! రూపాలకు ప్రాముఖ్యం లేదని తేలిపోయింది.
నిజంగా ఈ క్రిస్మస్ మరపురానిదే మా అందరికీ!

December 23, 2008

ఎల్లలెరుగనివారము!

చిన్నప్పుడు 80' ల్లో స్కూల్లో ఉన్నరోజుల్లో ప్రతి ఆదివారం ఉదయం 8-30 కి శ్రీ చిత్తరంజన్ గారు హైదరాబాదు రేడియో కేంద్రంలో "కలసి పాడుదాం" అనే కార్యక్రమాన్ని నిర్వహించే వారు. కొంత మంది పాడు పిల్లలని(పాడే పిల్లలని లెండి) తీసుకుని వారికి భారతీయ భాషల్లో ఒక పాటని నేర్పించడం. ప్రతి నెలా ఒక్కో పాట! అలా ఈ కార్యక్రమం రెండు, మూడేళ్ళు కొనసాగినట్టు గుర్తు! నేను ఆరోక్లాసులోనో, ఏడో క్లాసులోనో ఉండగా ఈ పాట "ఎల్లలెరుగని వారము.." ను ప్రపంచ బాలల గీతం పేరుతో చిత్తరంజన్ గారు నేర్పించారు. మేము దాదాపు ప్రతి పాటా రేడియో ముందు కదలకుండా కూచుని, శ్రద్ధగా రాసుకుని నేర్చుకునే వాళ్ళం. ఎందుకంటే మేమూ పాడు పిల్లలమే కాబట్టి! అన్ని బహుమతులూ అమ్మాయిల హైస్కూలుకే రావాలనీ, బాయ్స్ హై స్కూలుకు ఒక్క బహుమతీ రాకుండా చేయాలనే దుగ్ధ కూడా మా ఆసక్తికి,శ్రద్ధకు కొంత వరకు కారణం!



ఎంతమందికి గుర్తున్నాయో గానీ ఆ పాటల్లో కొన్ని



హోంగే కామియాబ్(హింది)

మిల్కే చలో(హింది)

ఎక్ లా చలోరే(బెంగాలి)

ఆకాశ్ గంగా సూర్య చంద్ర తారా(అస్సామీ)

ఓడి విళయాడు పాపా(తమిళం)

జయ జయహే భగవతి సుర భారతి(సంస్కృతం)

జయ జన భారత్, జనమన్ అభిమత్(ఇదీ సంస్కృతమే)

పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా(తెలుగు)

ఎల్లలెరుగని వారము(తెలుగు)



ఇంకా కొన్ని పాటలు మెదడులో కొట్టుకుంటున్నాయి గానీ బయటకు రావట్లేదు.

వీటిలో ప్రపంచ బాలల గీతాన్ని ప్రపంచ భాషలన్నింటిలోనూ రాసి ఆయా దేశాల్లోని పిల్లలు పాడుకుంటారని చిత్తరంజన్ గారు అప్పట్లో చెప్పిన గుర్తు. ఆ పాట సాహిత్యం ఎవరి దగ్గరన్నా ఉంటే కావాలని చిత్తజల్లు అంజని గారు నా బ్లాగులో వ్యాఖ్యానిస్తూ కోరారు. ఆ పాట స్కూలు రోజుల నాటి పాత పుస్తకాల్లో ఎక్కడుందో వెతికి పట్టుకునే సరికి ఇన్నాళ్లయింది. ఆ పాట ఇది.



పల్లవి: ఎల్లలెరుగని వారము కల్లలెరుగని వారము

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటే :ఎల్లలెరుగని:



చరణం 1 : అన్నం పప్పు చారు కూర శాకాహారం తినువారైతే

గుడ్డు, చేప కోడి కూర మాంసాహారం తినువారైతే

తిండేదైనా తీరేదైనా, తినగోరే ఆ రుచులేవైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే





చరణం 2 :గోధుమ రంగున కొందరు పసుపు రంగు ఇంకొందరు

తెలుపు నలుపు యాపిల్ ఎరుపు ఏ రైంగైనా ముచ్చట గొలుపు

రంగేదైనా రూపేదైనా నివసించే ఆ చోటేదైనా

బాలలం మేం ఒక్కటే లోకమూ మాకొక్కటే



చరణం 3: ఔనందురు యెస్ అందురు కొందరు ఓకే దాదా అందురు కొందరు

సీ, దేఖో, జావ్ అంటూ కొందరు పలు విధాలుగా పలుకుచుందురు

మాటేదైనా పాటేదైనా, మాట్లాడే ఆ భాషేదైనా

బాలలం మేం ఒక్కటే, లోకమూ మాకొక్కటే

ఈ పాట ఆడియో నాకు ఎక్కడా దొరకలేదు అంతర్జాలంలో! ఎవరికన్నా దొరికితే అప్ లోడ్ చేస్తే విని ఆనందిస్తాను.

December 13, 2008

ఆటవిక న్యాయం అమలైంది!

సరే, వాళ్ళు ఆ యువతుల మీద యాసిడ్ పోశారు. పోలీసులు "ఆత్మ రక్షణ" కోసం వాళ్ళను ఎన్ కౌంటర్ చేశారు. వాళ్ళకు తగిన శిక్షే పడింది."ఇంకెవ్వరూ ఇలాంటి పని చేయరు".అని జనం అభిప్రాయపడుతున్నారు. దుష్ట సంహారం జరిగిందని పండగ చేసుకుంటున్నారు.


ముగ్గురు సామాన్య యువకుల నుంచి ఆత్మ రక్షణ చేసుకోవడం కోసం ఎన్ కౌంటర్ చేయాల్సి వస్తుందా అనే డౌటు నాకు రావట్లేదు. అంతే కాదు.
"పోలీసుల కస్టడీ లో ఉన్న నిందితులకు తుప్పు పట్టిన కత్తులు, తుపాకీలు ఎలా వచ్చాయి? దొంగిలించిన వాహనాన్ని వెతకడానికి అర్థ రాత్రి ఎందుకు వెళ్లారు? "లాంటి ప్రశ్నలు కూడా నేనడగను. జవాబులు తెలిసిన ప్రశ్నలు మళ్ళీ అడగటం దేనికి?

ఆ ముగ్గురు నిందితులు చేసింది మామూలు నేరం కాదు. అమానుషమైన చర్య! యాసిడ్ పోసి ఆడపిల్లల రూప లావణ్యాలను చిదిమి చిదిమి కసి తీర్చుకోవాలనుకున్నారంటే వారిలో ప్రతీకార వాంఛ ఎంతగా ప్రజ్వరిల్లి పోయిందో అర్థం చేసుకోవచ్చు. పాపం హాస్పటల్లో నరక యాతన అనుభవిస్తున్న ఆ పిల్లలు కూడా "వాడిని యాసిడ్ పోసి ఆ బాధలోనే వరంగల్ రోడ్లనీ తిప్పి రోడ్డు మీద వదిలేయాలి" అని తమ ఆగ్రహాన్ని,ఆవేదనను వెళ్ళగక్కారు. చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ల ముందు మైకు పెట్టి ఇలాంటి భీకర ప్రతిజ్ఞలు చేయిస్తున్న మీడియా మీద ఎనలేని అభిమానం కలిగింది.


దీన్ని రాజకీయం చేయకుండా కేవలం తల్లులుగా, తండ్రులుగా వచ్చి ఆ ఇద్దరు యువతుల్ని పరామర్శిస్తున్న రాజకీయ నాయకుల్ని చూసి కూడా "పాపం, ఎంత బాధ పడుతున్నారో" అనిపించింది.

నిందితులకు కఠిన   శిక్ష పడాలని నేనూ కోరుకున్నాను. అంతకు ముందు నేను ఇంకో విషయం కూడా ఆలోచించదల్చుకున్నాను. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను. ఆ పిల్లలిద్దరూ దారుణమైన బాధకు గురవుతూ బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో 'వారి పాత్ర ఏమిటి " అనే ప్రశ్న లేవనెత్తడం నాకే అమానుషంగా అనిపిస్తుంది కానీ   తప్పని సరి పరిస్థితుల్లో ఈ ప్రశ్నను వేసుకుని జవాబు కోసం వెదుక్కుంటున్నాను.

ఈ రోజు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ప్రధాన నిందితుడు దాదాపు 25 వేల రూపాయల విలువైన బహుమతులు స్వప్నిక కు ఇచ్చాడు. అతడంటే ఇష్టం లేనప్పుడు ఆ బహుమతుల్ని ఆమె ఎలా తీసుకుంది? ఆ అమ్మాయి తండ్రి "మా అమ్మాయి జోలికి రావొద్దు" అని అతడిని హెచ్చరించాడట. "బహుమతులెందుకు తీసుకున్నావు?" అని కూతుర్ని ఎందుకు మందలించలేదు? పక్కా కమర్షియల్ అయిన ఆ నిందితుడు "అయితే నా డబ్బు నాకిచ్చేయమ"ని పేచీ కి దిగాడు. దానికి అమ్మాయి తండ్రి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఎందుకని? "తీసుకో, నీ ముష్టి బహుమతులు" అని వాడి మొహాన్న కొట్టలేదెందుకని?


స్వప్నిక తన వద్దనుంచి బహుమతుల్ని తీసుకుని కార్తీక్ అనే మరో యువకుడితో చనువుగా ఉంటోందని శ్రీనివాస్ కి ఖోపం వచ్చింది. గట్టిగా నిలదీసి అడిగితే "డబ్బు తిరిగిచ్చే విషయమై మాట్లాడ్డానికి కాలేజీ వద్దకు రమ్మన్నది"ట. కార్తీక్ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసా తెలియదా? యండమూరి ఏదో పుస్తకంలో రాసినట్టు పిల్లల ప్రేమ వ్యవహారాలు ఆఖరున తెలిసేది తల్లిదండ్రులకేనేమో!


ఇంతకు ముందు జెమిని టీవీ యాంకర్, రేడియో జాకీ లక్ష్మి సుజాత కూడా ఇలాంటి పనే చేసి హత్యకు గురైంది.హంతకుడితో డబ్బు కోసం 'చనువు" గా ఉంటూ, అవసరం తీరగానే మరొకరితో చనువు వెలగబెట్టడం ఆమె చేసిన పని.(పేపర్లలో వచ్చిన కథనాల ప్రకారం) ఆడపిల్లలు జీవితాల్ని ఎందుకింతా ఈజీగా తీసుకుంటున్నారో అంతుపట్టడం లేదు. "సులభంగా" చేతికందే డబ్బుకోసం, విలాసాల కోసం అబ్బాయిలతో చనువుగా ఉండటం, బహుమతుల వంటివాటిని ఆశించడం, తీసుకోవడం ఎక్కడికి దారి తీస్తుందో ఊహ తెలిసిన యువతులు గ్రహించలేరా? ఖరీదైన బహుమతుల్ని ఇవ్వడానికి సిద్ధపడిన యువకులు "ఏమీ" ఆశించకుండానే ఇస్తారా? ఈ విషయాన్ని అమ్మాయిలు గ్రహించలేరా?



ముసుగేసుకున్న మందుపాతరల లాంటి అబ్బాయిలతో స్నేహాన్ని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచడం ఎప్పటికి నేర్చుకుంటారు వీళ్ళు? నిన్న టీవీలో చూశాను, ఒక రాజకీయ నాయకురాలైన నటి, కొడుకుల్ని సరిగా పెంచలేదని శ్రీనివాస్, అతడి మిత్రుల తల్లి దండ్రుల్ని శాపనార్థాలు పెడుతోంది. మగపిల్లలకేనా కావాలి సరైన పెంపకం?


తను కోరుకుంది ఇంకొకరికి దక్కనివ్వకపొవడం, తనకు దక్కకపోతే దాన్ని నాశనం అయినా సరే చేయడానికి ఒడిగట్టడం ..ఇవాల్టి యువకుల్లో , చాలా మందిలో అభివృద్ధి చెందుతున్న వైరస్! శ్రీలక్ష్మి, లక్ష్మి సుజాత, మరొకరు, మరొకరు ...ఎంతో మంది బలైన తర్వాత కూడా అలవి కాని స్నేహాలు ఎటు దారి తీస్తాయో గ్రహించలేని అమాయకులైన ఆడపిల్లని చూసి జాలి పడాలో కోపం తెచ్చుకోవాలో తెలీడం లేదు.

కాలి బూడిదైన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు భవిషత్తులో ఏమైపోతాయో ఎవరికి పడుతుంది? ఒక వారం రోజులు ఈ మీడియా హడావుడి, రాజకీయ నేతల పరామర్శలు! ఆ తర్వాత స్వప్నిక, ప్రణీతల సంగతి ఏమిటి?

అసలు జనం ఆగ్రహావేశం చూసి పోలీసులు వాళ్లని ఎన్ కౌంటర్ చేసారు గానీ,వాళ్ళకు పడిన శిక్ష ఎంతని? క్షణంలో ప్రాణాలు పోయాయి. విచారణ తర్వాత వాళ్ళకు జీవితాంతం (14 యేళ్ళు కాదు)కఠిన జైలు శిక్ష విధించాలి. కళ్ళముందే భవిష్యత్తు మంచులా కరిగి పోయి, జీవితం సర్వ నాశనం కావడం అంటే తెలిసేలా చేయాలి. ఒకటో అరో కాకుండా ఆడపిల్లల్ని వేధించే ప్రతి వారికీ కఠిన శిక్షలు విధించాల్సిందే! కానీ ఉన్న పళంగా ప్రాణాలు హరించడమా శిక్ష?

కానీ ఈ ఎన్ కౌంటర్ వల్ల మరొక ప్రేమోన్మాది ఇలాంటి పనులు చేయడానికి వెనకడతాడన్నది మాత్రం నిజం కాదు !ఏమైనా సరే, తనను కాదన్నందుకో, తనతో "తిరగనందుకో" ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకుని బయలు దేరిన ఉన్మాది 'గతంలో ఇలాంటి పనులెవరు చేసారు, వారికి పడ్డ శిక్షలేంటి? ఎన్నాళ్ళు విచారణ జరిగింది" వంటి విషయాలు ఆలోచిస్తూ కూచోడు. కక్ష తీరాలంతే! ఇలాంటి తక్షణ శిక్షల వల్ల ఆటవిక న్యాయం అమలవుతుందే కానీ మనుషుల ప్రవృత్తిలో మార్పు వస్తుందనుకోవడం భ్రమ.

స్వప్నిక హింస అనుభవించాలని శ్రీనివాస్ కోరుకున్నాడు, అతడు చావాలని మనం కోరుకున్నాం! "అమ్మయ్య, వాళ్లను చంపేశారు, వాళ్ళ ప్రాణాలు తీశారు" అని చెప్పుకుని టపాసులు కాల్చుకునే స్థితిలో మనమున్నామంటే , ఆ ముగ్గురు నిందితులకీ, మనకీ పెద్ద తేడా లేదనిపిస్తోంది.

చర్మం కాలి,మాంసం ఉడికి రూపం చెరిగి పోయిన స్వప్నిక ను చూసినపుడు .."వాళ్ళకీ ఇలా జరిగితే గానీ ఈ బాధ తెలియదు" అని నాకూ అనిపించింది. కానీ ఇలా వెంటనే చంపేస్తారు అని ఊహించలేదు.ఎన్ కౌంటర్ ఎలా జరిగింది అన్న ప్రశ్నకు కూడా ఎస్పీ సజ్జనార్ అవకాశం ఇవ్వడం లేదు. "చట్టం తన పని తను చేసింది. people should "understand" that" అని మీడియా వాళ్ళను గద్దించాడు. చట్టం పని అధికారం తో ఇష్టమొచ్చిన వాళ్లను హత్యలు చేయడం అన్నమాట!ఇదే పని ఏ రాజకీయ నాయకుడి చుట్టమో పక్కమో చేస్తే చట్టం ఏం చేస్తుందో ఆయేషా కేసులో చూసాం!



నేను కాలేజీలో ఉన్నపుడు మా అమ్మమ్మ ఎపుడైనా "అరిటాకు- ముల్లు" సామెత చెప్తే "ఆపు నీ గోల" అని మండిపడేదాన్ని. అప్పుడు సమాజం ఇంత దరిద్రంగా తయారవలేదు. ప్రస్తుతం గుర్రపు డెక్క ఆకులా విస్తరించిన కలుష సంస్కృతి లో, ఉన్మాద స్థాయికి చేరిన ప్రేమ చరిత్రల నేపథ్యంలో ఇప్పుడు ఎవరైనా ఆ సామెత గురించి చెప్తే,కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఎలా అనిపిస్తుందొక్కోసారి! కానీ వాస్తవ జీవితం నుంచి నేర్చుకునే పాఠాలకంటే పుస్తకాల్లో నేర్చుకునేది ఎక్కువేం కాదు.



మరో పక్క రాజకీయ పార్టీలకు, మహిళా సంఘాలకు చెందిన మహిళా మణులు ఒక టీవీ ఛానెల్లో ఇదే విషయం మీద భేదాభిప్రాయాలతో కాట్లకుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. ఏమిటో, అంతా గొప్ప కన్ ఫ్యూజన్ గా ఉంది.

December 1, 2008

కౌముది లో నా కథ!

డిసెంబర్ నెల కౌముది అంతర్జాల మాస పత్రికలో నేను రాసిన "నీలమ్మ" కథ ప్రచురితమైంది. చదివి, అభిప్రాయం చెప్పండి.

నీలమ్మ కథ ఇక్కడ .