January 27, 2009

పొద్దు గడి కి ఈ సారి స్లిప్పుల సర్వీసు ఇక్కడ!

స్లిప్పుల సుగాత్రి(సుగాత్రి గారూ, ఈ పేరు నేను కాదండీ పెట్టింది)ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు.ఎంత పిలిచినా వినడం లేదు.  ఈ సారి(కూడా) గడి సొంతగా పూర్తయ్యేలా లేదు.  స్లిప్పులు కావలసిందే! (అత్తగారు కూడా ఊర్లో లేరు)అందువల్ల గడి పూర్తి చేసే వారు నా బ్లాగులో స్లిప్పులు ఇచ్చి పుచ్చుకుంటే ఉభయతారకంగా ఉంటుందని నా అవిడియా! చన్నీళ్లకు వేణ్ణీళ్ళు లాగా నేను కొన్ని స్లిప్పులిస్తున్నా......! అందుకుని నాక్కొన్ని స్లిప్పులివ్వండి దయగల ప్రభువులు...!

1 అడ్డం - అర్జునుల కాలం కూడా ఇదే!


4 అడ్డం -చారులో కంపల్సరీ


5 నిలువు - వేజు

10 నిలువు - గద్దర్ పక్కనే ఉంటాడెక్కువగా


27 నిలువు - crab అనగా పీత..

21 నిలువు - భోగి మర్నాడే!

38 అడ్డం - ఇన్నర్ సీక్రెట్ .....



నాకు స్లిప్పులు కావలసినవి..



22 నిలువు

17 అడ్డం

12 నిలువు



మిగిలినవి తరవాత చెప్తాను...!

January 24, 2009

"లలిత" ప్రియ కమలం విరిసినది....!

హైదరాబాద్ మొత్తం సంగీత వర్షంలో తడిసి ముద్దయి పరవశించింది. సంగీత ప్రియులంతా ఒక్క చోట కూడి కురిపించిన వేల వేల చప్పట్ల మధ్య సంగీతం నాట్యం చేసింది.




ఆయన కనపడగానే "అసలే కనులలో నీవు, ఆ పై కన్నీరు, తీరా దయ జేయగ నీ రూపు తోచదయ్యయ్యో" అన్నట్లు, దుఃఖమో, సంతోషమో, ఉద్విగ్నమో తెలియని స్థితిలో నీటితో కళ్ళు నిండిపోయి చూపు మసకేసిపోయింది.



ఆయన స్వరాన్ని వింటూ మైమరచి శిలలైపోయిన శ్రోతలకు రాల్గరిగించే అమరగానంతో జీవం పోసి,వారిని కరిగించి ప్రాణాలు తీసుకుని మళ్ళీ అమృతం పోసి అమరత్వాన్ని ప్రసాదిస్తూ, సంగీత రసాంబుధిని వేయి చేతుల కార్తవీర్యార్జునుడిలా ఈదుతూ, శ్రోతలని తనతో పాటు తీసుకెళ్ళి, ఆ స్వర రాగ గంగా ప్రవాహంలో తిప్పి తిప్పి మంత్ర నగరి సరిహద్దులకు విసిరి కొట్టాడా సంగీత మాంత్రికుడు.





(జేసుదాస్ గారు మీడియా కూడా తన కచేరీని రికార్డ్ చేయకూడదని నిబంధన విధించడంతో ఫొటోలు తీయలేకపోయాను. ఇది చివర్లో కచేరీ ముగిసాక మొబైల్ లో తీసింది).



లలిత కళా తోరణం ఈ సాయంత్రం పరవశించి పులకించి పోయింది.అద్భుతమైన సాయంత్రపు ఆవిష్కరణకు వేదికై నిలిచింది. శ్రీ జేసుదాస్ శాస్త్రీయ సంగీత కచేరీ హైదరాబాదు సంగీత ప్రియుల దాహాన్ని కొంత వరకు తీర్చింది.



సంగీత సరస్వతి సాక్షాత్కారం అంటే ఏమిటో అనుభవానికొచ్చింది. ఈ సంగీత సరస్వతి కా గురువాయూరప్ప దర్శనాన్ని తిరస్కరించింది? దురదృష్టం!అవును దురదృష్టమే....ఆ గురువాయూరప్పది! జేసుదాస్ పాటను వినలేకపోయాడు.



మధుర స్వరానికి మతం లేదు. సంగీతానికి కులం లేదు. జేసుదాస్ కచేరీ ముందు మాట్లాడిన రెండు మాటలు కూడా ఇవే! "మతాలన్నింటిలో దేవుడున్నాడు, కానీ దేవుడికి మతం లేదు. అందర్నీ ప్రేమించండి" ఇవే ఆయన మాట్లాడిన మాటలు.!



సరసాంగి రాగంలో వర్ణం తో మొదలు పెట్టి "హరివరాసనం" అన్న అయ్యప్ప పాటతో ముగిసిన స్వర రాగ గంగా ప్రవాహం రెండు గంటలు సాగింది. అతిథుల కోరికపై చిత్ చోర్ చిత్రంలోని "జబ్ దీప్ జలే ఆనా" కూడా పాడి వినిపించారు. ఆయన రామప్రియ రాగానికి, పంతువరాళి రాగానికి స్వరస్థానాల్లోని తేడాలు ఒక కీర్తన పాడుతూ వివరిస్తుండగా దగ్గర్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక రైలు రెండు సార్లు రెండు శ్రుతుల్లో కూత పెట్టింది. వెంటనే జేసుదాస్ ఆ స్థాయిల్లోని తేడాలను రామప్రియ రాగం స్వరస్థానాలకు అన్వయించి చెప్పి రక్తి గట్టించారు.



చివరగా...శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి ఈ కచేరీలో నిజమైంది. సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.

January 20, 2009

ఎవరికి తెలియని కథలివిలే!

ఆ మధ్య శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు రచన మాస పత్రికలో "సంకట్ కాల్ మే బాహర్ జానేకా మార్గ్" అని ఒక కథ రాశారు. ఆ మాటకు "ఎమర్జెన్సీ ఎగ్జిట్" అని అసలర్థం! కానీ కథా పరంగా మాత్రం అమెరికాలో మన వాళ్ళు చీటికీ మాటికీ చేసుకునే సత్యనారాయణ వ్రతం అని అర్థం! అక్కడ పుట్టి పెరిగిన ఆడపిల్లలు ఇండియా సంబంధాలు ఒప్పుకోకపోవడం, పిల్లలకు మంచి యూనివర్సిటీల్లో సీట్లు రాకపోవడం వంటి సంకటాల్లోంచి బయట పడటానికి(బాహర్ జానేకేలియే) ఈ వ్రతం మొదలెడతారంటూ సరదాగా సాగుతుంది.




నిజానికి ఇలా సత్యనారాయణ వ్రతం తరచూ చేసుకునే సంప్రదాయం/అవసరం/అలవాటు చాలా ఇళ్లలో ఉంటుంది. నా చిన్నప్పుడు మేము, మా అత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, మామయ్యలు అంతా కట్ట గట్టుకుని ఒకే వూళ్ళో ఉండటం వల్ల పెళ్ళి రోజనో, పుట్టిన రోజనో మరోటనో నెలకు రెండు వ్రతాలు గ్యారంటీగా జరిగేవి మా కుటుంబంలో! ఏ ఇంట్లో వ్రతం జరిగినా అంతా కట్టుగట్టుకుని హాజరు! బోలెడంత మంది కజిన్లు!మా ఇంట్లో వ్రతానికి మా నాన్నారు సాంబమూర్తి గారనే పురోహితుడిని పిల్చేవారు. ఆయన వృద్ధుడు. కొడుకులు సరిగా చూసేవారు కాదు. ఆయనకు కొంచెం జరుగుబాటు ఉంటుందని నాన్న ఆయన్ను పిల్చేవారు. పాండిత్యం ఉన్నా,వృద్ధాప్యం వల్ల మాట సరిగా వచ్చేది కాదు. కోపంలో మాత్రం దూర్వాసుడే!



మేము ఆరేడు తరగతుల్లో ఉన్నపుడు మా అక్కలు, కజిన్లు కాలేజీని ఉద్ధరిస్తూండేవాళ్ళు. సాంబమూర్తి గారు వ్రత కథలు చెపుతున్నపుడు వీళ్ళంతా గుడగుడ లాడుతూ కబుర్లు చెప్పుకుంటుండే వాళ్ళు.

ఆయన కళ్ళలో నిప్పులు కురిపిస్తూ "అబ్బబ్బ, కాసేపు గమ్మున కూచోండమ్మా(మీ నోళ్ళు పడా)" అనేవాడు సౌమ్యంగానే,బ్రాకెట్లోని మాటను "కుంజరః "టైపులో పలుకుతూ!
వీళ్ళు సంతాప సభకు వచ్చినట్టు రెండు నిమిషాలు మౌనం పాటించి, మళ్ళీ నెమ్మదిగా కబుర్లలోకి దిగేవాళ్ళు. కథలయ్యేదాక కదలడానికి వీల్లేదు మరి.


మా ఇంట్లో వాళ్ళకు ఇంకో ప్రత్యేక సౌకర్యం ఉంది. మా ఇంటికి దగ్గర్లో శ్రీ రమా మేదినీ సమేత సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. ఆ గుళ్ళో ప్రతి వారం పూజారి చక్రవర్తి సామూహిక వ్రతం జరిపించేవాడు. జరిపిస్తే నీకేం అని మీరనడానికి లేదు.గుడికి ధర్మకర్త వెంకటేశ్వర్లు గారు కొన్న నాలుగు మైకుల్నీ మా కాలనీ వైపు పెట్టి కథలన్నీ వినిపించేవాడు.ప్రతి వారమూ కథా శ్రవణమే! ఇహ కార్తీక మాసం, ధనుర్మాసం వస్తే చెప్పక్కర్లేదు. రోజూనూ! ఒక్కోసారి విరక్తి కలిగేది.



మేం అమెరికాలో ఉన్నపుడు ఇహ చెప్పేదేముంది,చిట్టెన్ రాజు గారు చెప్పినట్టే జరిగింది. నెలకు రెండు సార్లన్నా వ్రతం తప్పనిసరి గుడిలో! అన్ని భాషలవాళ్ళు ఉంటారు కాబట్టి, వారిలో కొంత మంది తమ అమెరికన్ స్నేహితుల్ని కూడా తీసుకొస్తారు కాబట్టి పూజారి గారు అందరి సౌకర్యార్థం ఆంగ్లంలో పూజ జరిపించే విధానం భలే వినోదభరితం!



"put flowers"

"take water into the hand"

"sprinkle chandan"

"put dakshina in the pan leaf"

"Do aatma pradakshina" అంటూ సాగేది పూజ! కథలన్నీ ఆంగ్లం లోనే!



మేమున్న వూర్లో తెలుగువారందరికీ ఒక పెద్ద ఉండేవాడు. ఆయన చాలా కలుపుగోలుగా, అందర్నీ కలుపుకోని ముందుకుపోవాలనుకునే తత్వం గల మనిషి. ఈయనకు ఒక అలవాటుండేది.

ప్రద్దానికీ "మన" "మన" అని తగిలిస్తుండేవాడు. "మన సంసారాలు, మన పిల్లలు, మన దాంపత్యాలు" అంటు అవి అక్కడ అందరికీ ఉమ్మడిగా ఉన్నట్టు మాట్లాడుతుండేవాడు.

కూతురితో నడిచొస్తున్న ఒకావిడతో "ఏమిటీ మన పాపే? ఎంత ఎదిగిపోయిందీ?" అని హాశ్చర్యం పడ్డాడొకసారి. ఆవిడ మనసులో మండిపడుతూ పైకి సౌమ్యంగానే "మన పాప కాదండీ, మా పాప! మీ పాప అదిగో స్నేహితులతో ఉంది" అని చూపించి వెళ్ళిపోయింది. ఆ తెలుగు పెద్దాయన కలుపుగోలుతనం మా అందరికీ చచ్చే చావుగా ఉండేది.



సరే, ఆయన "మన పిల్లలకు భక్తి అంటే ఏమిటో తెలియాలి" అని ఒక పని చేశాడు. సత్యనారాయణ స్వామి వ్రత కథలను చీల్చి చెండాడి, ఘోరంగా ఎడిట్ చేసి పారేసి ఒక్కో కథా అరఠావు లో వచ్చేలా కుదించి ఒక్కో కథా ఒక్కో పిల్ల /పిల్లాడి చేత చదివించేవాడు. ఆ కాపీలు మాకు కూడా ఇచ్చి ఫాలో అవమనే వాడు. ఈ ఫొటోలో చూడండి, అందరూ ఎలా అనుసరిస్తున్నామో కథలను! కొన్నాళ్ళకు పిల్లల్లో భక్తి నశించి గుడికి రావడం మానేశారు.




ఒకసారి ఒక తెలుగు స్నేహితుల కుటుంబం గుడిలో వ్రతం చేసుకుంటూ కథలు తెలుగులో చెప్పాలని పూజారి గార్ని కోరారు. ఆయన బ్రతుకు జీవుడా అని వెంటనే ఒప్పుకున్నారు.

నా పక్కన కూచున్న రాజు, అతడి భార్య రమ ఏదో విషయం మీద వాదించుకోడం మొదలెట్టారు గుసగుసల్తోనే! ఇంట్లో అత్తగారొక్కరే ఉన్నారట, వెళ్ళిపోదామని రమ, వద్దని రాజూ!
 చివరికి సహజంగానే రమ మాట నెగ్గి వెళ్దామని లేస్తుండగానే పూజారి గారు ఇలా చెప్పారు ...

."ఆ విధంగా కళావతి పూజ మధ్యలో లేచి వెళ్ళిపోవడం వల్ల, ఆమె భర్త తాలూకూ ఓడలన్నీ నీటిలో మునిగిపోయి, అతడు కూడా నీటిలో..మునిగి మర....."

ఇద్దరూ అదిరిపడి వెర్రిగా చూసుకుని చతికిల బడ్డారు.


నవ్వాపుకోవడం కష్టమనిపిస్తోంది నాకు.

చివరి కథ జరుగుతోండగా ఇంట్లోంచి అత్తగారి ఫోను."అమ్మాయ్, ఎవరో వచ్చారే, తలుపు తియ్యనా వద్దా" అని!

"ప్రసాదం తర్వాత తీసుకుందాం లే, పదండి వెళ్దాం"అని రమ లేచింది.

ఇంతలో పూజారి గొంతు వినపడింది.

"ఆ విధంగా ఆ రాజు గారూ, ఆ గొల్లవాడి నుంచి స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళేసరికి స్వామి వారి ఆగ్రహం వల్ల అతడి నూర్గురు కొడుకులు విగతజీవులైరి. అతడి సంపదలన్నీ నశించి..."


"సంపదలన్నీ నశించి..."రమ గొణుక్కుని "అమ్మో ' అని 'అల్మైరా తాళాలెక్కడ పెట్టారూ" అంది.

"కాఫీ టేబుల్ మీదా" అన్నాడు రాజు ఇంకెక్కడ పెడతానూ అన్నట్టు.

"మీకసలు బుద్ధుందా" అంది రమ పదునుగా.

"అదుంటే పెళ్ళెందుకు చేసుకుంటాను" అన్నాడు రాజు అవమాన పడి.

"అయినా అక్కడ మనకేం ఓడలు లేవులే మునగడానికి" అన్నాడు వెటకారంగా.

"హబ్బో, తమరు ఓడలు కూడా సంపాదిస్తారా? ఉన్నవి నాలుగూ ఊడితే చాల్దూ" అంది రమ కోపంగా. ఈ లోపున కథ అయిపోయి పూజ ముగిసింది.ప్రసాద వితరణ కూడా జరిగింది.

ఇలాంటివాళ్ళు పక్కన చేరితే ఒక్క కథ కూడా వినలేం! అందుకే నేను మాత్రం కథలు విన్నా వినకపోయినా చివర్లో

"మంత్ర హీనం, క్రియా హీనం, భక్తిహీనం...."ఇది మాత్రం మనస్ఫూర్తిగా చదువుకుంటాను.


ఈ కార్తీక మాసం నుంచి సంక్రాంతి వెళ్ళేలోపుగా ఎన్ని వ్రతాలకెళ్ళానో! లెక్కేలేదు. విదేశాలనుంచి బ్రేక్ తీసుకుని వచ్చిన మా వారి అన్నగారింట్లో వారం క్రితం!

రెండు రోజుల క్రితం మా కిందింటి రెడ్డిగారి భార్య వచ్చి "మా ఇంట్లో సత్ నారాణ్ కత ఉంది రమ్మం"ది.


 ఇవాళ పొద్దునే మా పక్కింట్లో ఉండే బిదిషా దాస్ అనే బెంగాలీ అమ్మాయి వచ్చి "సత్యనారాయణ పూజ చేస్తున్నాం. భోజన్ కూడా ఏర్పాటు చేసాం ,తప్పక రావాలని హిందీలో పిల్చింది. కథలు బెంగాలీలో చెప్తారా అన్నాను భయంగా! అలా అయితే రాను అందామనుకుని.

"ఏమో, మా అమ్మనడగాలి" తెలుగు హీరోయిన్లా అనేసి వెళ్ళిపోయింది బిదిష!


"హమ్మయ్య,ఇవాళ వంటింటికి విడాకులు" అనేసుకుని శ్రీఖండ్, రస్ మలాయ్ వంటి బెంగాలీ రుచులు ఊహిస్తూ ఒంటిగంటి వరకూ గడిపి వాళ్లింటికి వెళ్లాను.

తీరా చూస్తే అక్కడ భోజనం ఏర్పాట్లు ఏమీ లేవు గానీ భజన మాత్రం జోరుగా సాగుతోంది.

భోజన్=భజన్! అదీ సంగతి. బెంగాలీ "ఓ" మహాత్మ్యం!

నీరసంగా ఇంటికొచ్చి నా టిఫిన్ల లిస్టులో చివ్వర్లో ఉండే "ఉప్మా" చేస్తూ, అదయ్యే లోపున ఈ టపా రాద్దామని ........!

హెచ్చరిక..ఛ..గమనిక(నీరసంలో మాటలు కూడా సరిగా రావడం లేదు) ఈ టపా శ్రీ సత్య నారాయణ స్వామిని గానీ, వారి భక్తుల్ని గానీ కించపరుచుటకు రాసింది కాదు.