నాకు వోటరు గుర్తింపు కార్డు వచ్చిన విధమెట్టిదో ఇంతకు ముందొక టపా రాశాను.(భయపడొద్దు, ఆ టపా లింకు ఇవ్వటం లేదు.)"మీ ఇంటికే వస్తుంది కార్డు" అని చెప్పడంతో చాలా నెలలు వేచి చూసి ఇక లాభం లేదని వెబ్ సైట్ లో కార్డు వివరాలు తీసుకుని మునిసిపల్ ఆఫీసుకు వెళ్లాను. సాధారణంగా ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటపుడు దార్లో రెండు చార్టుల బీపీ టాబ్లెట్లు కొనుక్కుని వెళ్తాను నేను.
ఇంతకు ముందు జరిగిన అనుభవంతో "ఆస్తిపన్ను" అనే గదిలో కార్డు అడగటానికి వెళ్లాను. అక్కడ ఇద్దరు స్వీపర్లు కూచుని పేలు చూసుకుంటున్నారు. మరో ఇద్దరు పురుషులు(బంట్రోతులనుకుంటా)టీ సేవిస్తున్నారు. అందులో ఒకడు నిర్లక్ష్యంగా ఒక చూపు విసిరి "ఎవలు? ఏం కావాలె?" అన్నాడు. అతడి చూపుకి నా బీపీ థర్మా మీటర్లో పాదరసంలా సర్రున పైకి పోయింది. వెంటనే ఒక టాబ్లెట్ మింగి కార్డు సంగతి చెప్పాను. అతడు టీ తాగుతూనే "ఆ పక్కన"అని చెయ్యి ఊపాడు.
ఓహో, ఎన్నికల సమాచారం ఈ సారి "పట్టణ దారిద్ర్య నిర్మూలన పథకం" గదిలో లభిస్తుందన్నమాట! లోపలికి వెళ్ళి విషయం చెప్పి నా వివరాలిచ్చాక, అక్కడ ఉన్న ఇద్దరు కాంట్రాక్ట్ క్లర్కులు ఒక కార్డుల కట్ట తీసి నా మీదకు దాదాపు 'విసిరారు'. మరో రెండు టాబ్లెట్లు మింగి కట్టలో వెదికాను.నా కార్డు లేదు. వెబ్ సైట్లో ఉన్న వివరాల ప్రకారం నా పోలింగ్ స్టేషన్ నంబర్ చెప్పాను. ఆ క్లర్కు కుర్చీలోంచి ఎగిరిపడ్డంత పని చేసి "ఫలానా నంబరా? అదెట్లయితది?"అన్నాడు. అదెట్లయితదో నాకూ తెలీకపోవడంతో జవాబు చెప్పలేకపోయాను.
మరో నాలుగు కట్టలు వెదికాక, నా కార్డు నాకు ఏవిధంగానూ సంబంధం లేని నంబర్ పోలింగ్ స్టేషన్ కట్టలో దొరికింది.నా పక్కనే ఉన్న మా ఆయన (ఈయనకసలు బీపీ రాదు.) ఆ కార్డు చూస్తూనే "పేరు ఇదే గానీ ఫొటో మావిడది కాదండీ"అని తేల్చేసి వెనక్కిచ్చేసారు. ఆ క్లర్కు ఒకసారి నాకేసి కార్డుకేసి మార్చి మార్చి చూసి" ఏమి సారూ, ఇంత సక్కగ గొడుతుంటే? మేడమే ఇందులున్నది"అని తీర్మానించాడు. ఆ ఫొటో నాదే అని ఒప్పుకోడానికి మెదడు మొరాయిస్తోంది.
ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొహం ఆనవాలు తెలీకుండా గాయాలపాలై మరణించినవాళ్లని ఒంటిమీదున్న వస్తువుల్ని బట్టి గుర్తుపట్టినట్లు, నేను కూడా కాసేపు పరికించి చూసి సంతోషంతో కెవ్వుమన్నాను."ఏవండోయ్, ఇవిగో, ఈ ఇయర్ రింగ్స్ నావే! నాదే ఈ ఫొటో" అని ప్రకటించాను. తనేమో కథల్లో రాసినట్లు స్థాణువై పోయాడు కాసేపు.
"ఇదేమిటి? ఇలా ఉందేమిటి ఫొటో" అని బాధపడ్డాడు .
'అదే నా నిజస్వరూపం! ఊరుకోండి" అని ఓదార్చాను.
ఇంతా చేసి కార్డులో మా ఇంటి నంబర్ తప్పు, కాలనీ పేరు లేదు, ఏరియా తప్పు. తప్పుడు అడ్రసు...పైగా అచ్చుతప్పులతో! దీనివల్ల మా కాలనీ వాళ్లంతా ఒక చోట, నేనొక్కదాన్నీ వేరేచోట వెయ్యాల్సివస్తుంది ఓటు!
ఒక్క ఊరట ఏమిటంటే భర్త పేరు అనే చోట పేరు సరిగా ఉండటం. కొంతమందికైతే వాళ్లనీ మార్చేశారు.
"ఇదేమిటి ఇన్ని తప్పులు ?" అనడిగితే,
"మాకేమెరిక ? మేమేమన్నా ప్రింట్ కొడుతున్నామా"- మళ్ళీ ఒక టాబ్లెట్!
"మరి ఈ కార్డు పనికొస్తుందా?"
"ఈసేవా కేంద్రానికెళ్ళి సరి చేయించుకోవాలె"
"ఏ ఈసేవా కేంద్రం?"
"మాకేమెరిక? న్యూస్ పేపర్లో ఇస్తారు, చూసుకోండి"
"ఎప్పుడిస్తారు?"
"మాకేమెరిక? రోజూ చూసుకోండి, ఇస్తారొక రోజు" గుప్పెడు టాబ్లెట్లు మింగి కార్డు తీసుకుంటుండగా క్లర్కు ఐదారు కార్డులు తీసి "గివి మీ బిల్డింగ్ కార్డులు మేడము! నువ్వు దీస్కబోవాలె" అన్నాడు కొంచెం మర్యాదగా!
'నేను తీసుకెళ్లను " అందామనుకుని "నేను తీసుకెళ్లడమేమిటి? వాళ్ళకు మీరు పంపరా"అన్నాను.
"పంపాలంటే ప్రాపర్టీ టాక్స్ బిల్ కలెక్టరు రావాలె! గాయన లీవ్ లో ఎల్లిండు, మీరు దీస్కోని దస్కత్ పెట్టండమ్మా "అన్నాడు. సరే ఇలాంటి సంఘసేవ చేస్తే మనక్కూడా మన బిల్డింగ్ లో వెయిట్ ఉంటుందని తీసుకుని, సంతకం పెట్టి వచ్చాను.
ఇంటికొచ్చాక ఆ కార్డులు ఒక్కోటీ ఒక్కోరకంగా భయంకరంగా నవ్వించాయి మమ్మల్ని! ఈటీవీ లో సుమన్ గారి "శ్రీకృష్ణ బలరామ యుద్దం" చూసినప్పుడు కూడా అంతగా నవ్వలేదంటే నమ్మండి.
మచ్చుకు నా కార్డు చూడండి.
"బికశ్రీపత్తి నగర్" అంటే "భిక్షపతి నగర్" అని అర్థం కావాలంటే మెదడులో కొంచెం ఎక్కువ గుజ్జు ఉండాల్సిందే! అది మాకంటే మా వాచ్ మన్ కి ఎక్కువగా ఉండటం వల్ల తను కనుక్కున్నాడు. భిక్షపతి నగర్ అనేది ఎక్కడుందో మాకెవ్వరికీ తెలీదు. "గోపాల రెడ్డి.న ...." అని సగంలో వదిలేశారు. ఆయనెవరో నిజంగా నాకు తెలీదు. ఒకవేళ అది గోపాలరెడ్డి నగర్ అయితే, అది ఈ చుట్టుపక్కల ఎక్కడుందో మాకు తెలీదు. kondapur village అనే మాటలు యధాతథంగా తెలుగులోకి కొండాపూర్ "విళ్గే" అని దించారు. ఇంతా చేసి మేముండేది కొండాపూర్ విలేజ్ లో కాదు.
మా వాచ్ మన్ కార్డులో భర్త పేరు అని రాసి దాని కింద తండ్రిపేరు వేసారు.మరొకరికి తండ్రిపేరు అని వేసి భర్త పేరు ! మా కిందింటి సుధా రామనాధన్ గారి పుట్టిన తేదీ పదేళ్ళు వెనక్కి జరిపారు. "భర్త పేరు మారినా ఒప్పుకుంటాను కానీ దీనికి మాత్రం ఒప్పుకో"నంటుందావిడ! అమ్మో ఏకంగా పదేళ్ళే? 29 నుంచి 30 దాకా డేకడానికే ఆరేళ్లు తీసుకుందాయెను!
నాలుగో ఫ్లోర్ లో ఉండే వైభవ్ చోప్రా గారి పేరు తెలుగులో "విధవ్ చోప్రా"గా పడింది.ఇది మరీ ఘోరం! తెలుగులో దానర్థం వివరించేసరికి అసలే తెల్లగా ఉండే ఆయన మొహం ఇంకా పాలిపోయింది.మరొకావిడ కార్డులో ఆవిడ ఫొటోకి బదులుగా పురుషుడి ఫొటో పెట్టారు.అది మేము చాలాసేపటికి గానీ పట్టుకోలేకపోయామనుకోండి:-)!
ఇక లాభం లేదని ఒక శనివారం పొద్దున్న (మా కాలనీలో ఎక్కువమందికి శనివారమే తీరికుండేది)మా నియోజకవర్గానికి నిర్దేశించిన ఈ సేవా కేంద్రానికి వెళ్లాము. వాళ్ళు "ఇక్కడ కాదు, మార్చేశాం, వేరే చోటికి వెళ్లాలి" అని అడ్రసు ఇచ్చారు.మళ్ళీ వెనక్కి! ఇక్కడికొచ్చాక ఇక్కడి వాళ్ళు కనీసం మా దరఖాస్తులైనా చూడకుండా, తలైనా తిప్పకుండా పదో తారీకు వరకూ టోకెన్లిచ్చేసాం పొండి. పదో తారీకు తర్వాత రండి. వీలుంటే చూస్తాం. లేదంటే ఎన్నికలయ్యాకే ఇహ"అన్నారు.
వైభవ్ కి ఒళ్ళుమండిపోయి(పేరు విషయంలో తీరని అన్యాయం జరిగింది కదా పాపం) "ఈ కార్డుల తాలూకు డేటా ఎంట్రీ ఎవరు చేసారు?ఈ ప్రింటింగ్ తప్పులకు కారణమెవరు? వాళ్ల మీద పగ తీర్చుకోవాలంటే ఏం చెయ్యాలి" అనడిగాడు.
"దానికి సాయంత్రం 5-6 మధ్యలో తీసుకుంటున్నాం అప్లికేషన్లు, సాయంత్రం త్వరగా రండి! ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది."అని జవాబిచ్చారు వాళ్ళు తలకూడా తిప్పకుండా!
గమనిక: నా కార్డులో ఉన్న అడ్రసు ఆధారంగా మా ఇల్లు గూగుల్ ఎర్త్ వాడు కూడా కనుక్కోలేడు. ఈ చిరునామా ఆధారంగా మా ఇంటికి ఎవరైనా రావాలని ప్రయత్నించి తప్పిపోతే నా పూచీ లేదు.
NOTE నేను ఇదంతా సరదాగా రాశాను గానీ నగరంలో లక్షల కార్డుల్లో అచ్చుతప్పులే!పోలింగ్ స్టేషన్ కి వెళ్ళాక, వోటు వెయ్యడానికి వీల్లెదంటే ఏం చెయ్యాలో చాలా మందికి తెలీదు. అందువల్ల వోటర్ గుర్తింపు కార్డుతో పాటు ఇతర గుర్తింపు కార్డు(బాంక్ పాస్ బుక్,డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్) తీసుకెళితే మంచిది.(తెలీనివాళ్లకోసం).
