April 9, 2009

సోమరి తనానికి హామీ!మొన్నీమధ్య కొత్త పాళీ గారి బ్లాగులో "పని చేయకుండానే జీతం చేతికి వచ్చి పడుతుంటే తీరిక సమయాల్లో మీరేం చేస్తారు?" అనే విషయం మీద చర్చ జరిగితే చాలా మంది ఉత్సాహంగా పాల్గొని, తామేం చేస్తారో చెప్పారు. అసలు పని చేయకుండానే నెల తిరిగే సరికల్లా డబ్బు వచ్చి చేతిలో పడుతుంటే కొన్నాళ్ళకి "పని చేసి సంపాదించడం" లేదా "సంపాదన కోసం పని చేయడం" అనే కాన్సెప్ట్ ని మర్చిపోరా అందరూ? ఆదరా బాదరా పొద్దున్నే లేవనక్కర్లేదు, సిటీ బస్సుకోసం పరిగెట్టక్కర్లేదు, లేటు మార్కుల చీవాట్లు తినక్కర్లేదు, ఒళ్ళొంచి పని అసలే చేయక్కర్లేదు, సాయంత్రం వేలాడే మొహాలతో ఇల్లు చేరి ఆ చిరాకు పెళ్ళాం మీద చూపించక్కర్లేదు. హాయిగా టీవీ చూస్తూనో, పేకాడుకుంటూనో, స్నేహితులతో బాతాఖానీ వేసుక్కూచునో రోజంతా గడిపేయొచ్చు! డబ్బున్న వాడైనా , మధ్య తరగతి వాడైనా, పేదలైనా , నిరుపేదలైనా ఇదేగా పరిస్థితి?


"పనిచేసే" మాజీ ముఖ్య మంత్రి గారిచ్చిన "నగదు బదిలీ" పథకం హామీ ఇలాగే లేదూ? నిరుపేదలకు నెలకు రెండు వేలంటే ఎక్కువకిందే లెక్క. కుటుంబ ఖర్చులు వెళ్ళిపోతాయి. నెల తిరిగే సరికి డబ్బు వచ్చి ఒళ్ళొపడుతుంటే వాళ్లలో ఇక పని చేసి సంపాదించుకునేది ఎవరు? అమలంటూ జరిగితే, కోట్లమందిని సోమరిపోతులుగా కూచోబెట్టడానికి తప్ప ఈ పథకం వల్ల నిజంగా నిరుపేదల జీవితంలో వెలుగొస్తుందా?రోజు కూలీలంతా నిరుపేదలకిందికే వస్తారు. భవన నిర్మాణ కార్మికులు, ముఠా కూలీలు, రైతు కూలీలు, హమాలీలు, రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లంతా నిరుపేదలో, పేదలో అయి ఉంటారు. వీళ్లందరికీ నెల నెలా పని లేకుండా జీతాలిస్తుంటే తర్వాత, వీళ్లలో ఎంతమందికి పనికి ఒళ్ళొంగుతుంది? రెండువేలకంటే ఎక్కువడబ్బు అవసరమైనపుడు మాత్రమే వీళ్ళు పనికి కదులుతారన్నమాట. ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారో లేదో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చెర్నాకోల ఛెళ్ళుమనిపిస్తూ పరుగులు పెట్టించి పని చేయించిన మాజీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పనా ఇది?


రాష్ట్రంలో నిరుపేదలు, పేదలు కలిసి ఎంతమంది ఉంటారు? వీళ్ళకు అయిదేళ్లలో గరిష్టంగా లక్ష రూపాయలిస్తారట. ఎక్కడినుంచి తెచ్చీ?ఎవర్ని దోచీ?


ఇందాక టీవీలో రెండు పసుప్పచ్చ కోడిపిల్లలు మాట్లాడుకుంటూ "కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ పథకం బాగా విజయవంతమైందని" చెప్పుకుంటున్నాయి.నిజమే! ప్రభుత్వం మీద అదనపు భారం పడకుండా ఇటువంటి పధకాలు అభివృద్ధి చెందిన దేశాల్లో విజయవంతం అవుతాయి. ఎందుకంటే అక్కడి ప్రజలు చిన్న చితకా ఉద్యోగాలు చేసుకునే వారు మొదలు వ్యాపారస్థుల వరకు పన్నులు ఎగ్గొట్టకుండా కడతారు కాబట్టి. మన దేశంలో అది వీలవుతుందా? సినిమా వాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళు, బడా బడా వ్యాపారస్థులు...వీళ్ళలో ఖచ్చితంగా పన్నులు కట్టేవాళ్ళను లెక్కెట్టడానికి ఒక చేతి వేళ్ళూ చాలేమో! మరి ఇంత భారం రాష్ట్ర ఖజానా మీద ఎలా వేయాలనుకుంటున్నారు?


ఆకలైన వాడికి అన్నం పెడితే ఇవాళ తిని మళ్ళీ రేపు ఆకలయ్యే టైముకు మళ్ళీ వస్తాడు. అదే అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తే? చచ్చినట్టు పని చేస్తాడు. చెయ్యాలి కూడా!


ఇంకో విషయం . నెల మొదటి వారంలో డబ్బు ఎకాఎకిన వచ్చి ఇంటి తాలూకు మహిళ అకౌంట్ లో పడుతుందట. (జోకు కాకపోతే మహిళ అకౌంట్లో పడగానే ఆ మొత్తానికి మహిళ అధికారి అయిపోయినట్లే?)పని లేకుండా కూచోడానికి అలవాటుపడ్డ భర్త గారు నాలుగు తన్ని ఆ డబ్బు లాక్కుని వారం తిరిగే సరికల్లా డబ్బుని సారా కొట్లోనో, కల్లు కాంపౌండ్ లోనో మార్చేస్తే? పని చేయడమా అలవాటు తప్పి పోయింది, డబ్బులా మొదటివారమే ఖర్చయిపోయాయి. ఇటువంటి సందర్భాల్లో ఈ నిరుపేదలు దొంగతనాల వంటి అక్రమార్జనలకు పాల్పడితే?(నా ఊహ అతిగా ఉన్నా, నిజమయ్యే అవకాశం లేకపోలేదు)మొన్నామాధ్య ఊరికెళ్ళినపుడు చూశాను. మా అమ్మవాళ్ళింటి ప్రహరీ గోడ ఒక పక్క కూలిపోతే దాన్ని రిపేరు చేయడానికి కూలీలు దొరకడం ఎంత కష్టమైపోయిందో! ఉపాధి హామీ పధకం కింద ఒక మీటరు దూరం గొయ్యి తీసి వంద రూపాయలు పట్టుకెళ్లడానికి అలవాటు పడ్డ పని వాళ్ళు రోజు కూలీ 250 రూపాయలన్నా కూడా రావడానికి సిద్ధపడటం లేదు.ఐటీ వాళ్ళ జీతాలను "ఈజీమనీ"గా పిలవడానికి అలవాటుపడ్డ బూర్జువాలు దీన్నేమంటారో? నేనేమీ పేదలకో, కూలీలకో వ్యతిరేకం కాదు. జనాన్ని ఆకట్టుకోవడానికి మన నాయకులు ఎంతకైనా తెగిస్తారంటున్నానంతే!మరోవైపు,ఈ పధకం వల్ల నిజంగా లబ్ధి పొందే నిరుపేదలెంతమంది? దళారుల ప్రమేయం లేకుండా చూడగలరా? లేక డబ్బున్న వాడే రెండు "నిరుపేద సర్టిఫికేట్లు" తెచ్చుకుంటే రెండేసి వేల చొప్పున చొప్పున రెండు మొత్తాలిచ్చేస్తారా? (ఒక్క రేషన్ కార్డు కూడా లేని కటిక పేదలు, రెండు మూడు కార్డులున్న మధ్యతరగతి వారు నాకు బోలెడుమంది తెలుసు).మళ్ళీ CEO సీటు దక్కించుకోడానికి చంద్రబాబు ఇలాంటి చెత్త హామీకి కూడా తెగబడ్డాడనిపిస్తోంది.ప్రజల్ని సోమరిపోతులుగా మార్చడానికి కంకణం కట్టుకున్నాడు. ఏ వ్యక్తి తో రాజీపడకుండా మొన్నీమధ్య దాకా సమైక్యవాదిగా నిలిచాడో అదే వ్యక్తితో పొత్తుపెట్టుకున్నాడంటే , సరే సీట్ల కోసం అనుకుందాం! మరి ఈ అర్థం లేని హామీ ఏమిటి? ఈ భారం రాష్ట్ర ఖజానా మీద ఎన్ని వందల కోట్లు? అదంతా ఎవరి నెత్తిన రుద్దబోతున్నారు? ఏ విధంగా రుద్దబోతున్నారు? ఈ ప్రశ్నలకు నాకు జవాబు కావాలి! కావాలి! కావాలి!

43 comments:

కత్తి మహేష్ కుమార్ said...

రాష్ట్రం సంవృద్ధిగా ఉండాలంటే, అందరూ "పే" చెయ్యాలి అని చెప్పి క్రితం ఎన్నికల్లో బోత్తాపడ్డాడు. ఇప్పుడు ఎంతైనా "పే"చేస్తాం గెలిపించండి అంటున్నాడు. ఇదే రాజకీయాల్లో FULL CIRCLE అంటే!

కాంగ్రెస్ అంతాఫ్రీ అనేసింతరువాత మిగిలింది ఎదురుడబ్బులిచ్చి ఓట్లేయించుకోవడమే కదా! ఎవడి బాధ వాడిది. ఈ సారి గెలవకపోతే చంద్రబాబుకు భవిష్యత్తు లేదు. మరి ఆ మాత్రం మనల్ని వెధవల్ని చెయ్యకపొతే ఎలా. మనమెప్పుడూ అవడానికి తయారేగా!

భాస్కర రామి రెడ్డి said...

అవునా సుజాత గారు? 2౦౦౦ వేలే ..? అలా అయితే మా వూర్లో ఓట్లు ఎవరికేసినా C.E.O గెలవాలని కోరుకుంటారేమో !

చైతన్య said...

నిజంగా ఇలాంటి హామీలు నెరవేరతాయని అనుకుంటున్నారా?
రెండు రూపాయలకి కిలో బియ్యం పథకమే అమలు చేయలేని వారు ... నెలకి రెండు వేలు నగదు బదిలీ హామీ నెరవేరుస్తారా?

Krishna said...

సుజాత గారు చాలా మంచి అంశం.ఆ మద్య నేను అమెరికా వెళ్ళినప్పుడు తెలిసింది వెదేశాలలో ఇలాంటి స్కీములు ఉన్నాయి అని. కొంచం అశ్చర్యపడి దీనికి కావల్సిన నిధి గురించి నాసహొద్యొగులని ప్రశ్నిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి కావల్సినంత స్వయంప్రతిపత్తి ఉంటుంది, తద్వారా కావల్సినంత నిధులను సమీకరిస్తారు. అది కూడా సింహభాగం పన్నుల రూపేణా వస్తుందట.ఈ పద్దతి అంతా అక్కడ బాగా నడవటానికి కారణం అక్కడి అధికారులలొ లేదా నాయకులలో మళ్ళి మాట్లాడితే ప్రజలలో కూడా అవినీతి శాతం మనతో పోల్చుకుంటే.
కానీ ఇలాంటి పధకాలు మన దేశంలో ప్రజల్ని పూర్తిగా పాడుచేస్తాయి అనటంలో ఏ సందేహమూ లేదు. ఈ మాట అలా ఉంటే అసలు మన నాయకులు ఇలాంటి పధకాలని అమలుచేస్తారా అన్నది నా పెద్ద సందేహం. ఒకవేళ అమలు చేసినా అందులో అవకతవకలు తద్యం. ఇకపోతే అమలు చెస్తే పెద్దసంఖ్యలో నష్టపొయేది సామాన్య పౌరులే (పన్ను కట్టేవాల్లే).
ఒక్కొసారి నాకు మన నాయకులమీద తీరని చిరాకు వస్తుంది.
వీరు ఏనాడు పన్ను కట్టే ప్రజలకోసం అలోచించినట్టే కనపడరు.పన్ను కట్టినందుకు మనకి కావల్సిన మౌళిక సదుపాయలు మనం పొందాలి కదా. అలాంటి అలోచనలు మన నాయకుల బుర్రలలో ఈ రోజు పుట్టిన పాపాన పొలేదు.
ఇలాంటి ఆవేదనలు ఇంకా చలానే ఉన్నాయి లెండి. మొత్తానికి మంచి టపా. ఉదయానే మంచి కాఫీ లా ఉంది.

శ్రీనివాస్ said...

చంద్ర బాబే కాదు ఎవరు గద్దెనెక్కాలన్నా ఇలాంటి హామీలు తప్పని సరి .. ( చదువుకున్న నిరక్షరాస్యుల కోసం ) ఇంకా కూలీల విషయం . ... పాపం ఇంట చేసి కూలీలకు మిగిలేదేం లేదు ... వాళ్ళ మేస్త్రి లాక్కుంటాడు కొంత ... రెండువందల యాభయి కూలీ అందులో యబహి దాక మేస్త్రి కివ్వ్వాలి .... మల్ల మూడు కూలీలకు ఒక మేస్త్రి కూలీ గా ఇవ్వాలి. సో మన ఇంటికి పది మంది కూలేలను పంపితే మళ్ళా మూడు మేస్త్రి కూలీలు ఇవ్వాలనమాట.... అటు కూలోడు తినడడం లేదు ఇటు పని చేయించుకునే వారికీ చిల్లు పడ్తుంది మద్య లో దళారులు బాగు పడతారు. ఇంకా చంద్ర బాబు హామీలన్నీ అమలు సాధ్యమో కాదో తెలీదు గాని .... ఇలాంటి హామీలు లేక పొతే .... అయన గెలవడం కష్టం .

@ ఆకలైన వాడికి అన్నం పెడితే ఇవాళ తిని మళ్ళీ రేపు ఆకలయ్యే టైముకు మళ్ళీ వస్తాడు. అదే అన్నం సంపాదించుకునే మార్గం చూపిస్తే? చచ్చినట్టు పని చేస్తాడు. చెయ్యాలి కూడా!

వాడికి పని చూపిస్తే డెవలప్ ఆవడా ... పైకొచ్చి రేపు అవినీతిని ప్రశ్నించడా ... బలే వారె మీరు

@మరోవైపు,ఈ పధకం వల్ల నిజంగా లబ్ధి పొందే నిరుపేదలెంతమంది? దళారుల ప్రమేయం లేకుండా చూడగలరా? లేక డబ్బున్న వాడే రెండు "నిరుపేద సర్టిఫికేట్లు" తెచ్చుకుంటే రెండేసి వేల చొప్పున చొప్పున రెండు మొత్తాలిచ్చేస్తారా? (ఒక్క రేషన్ కార్డు కూడా లేని కటిక పేదలు, రెండు మూడు కార్డులున్న మధ్యతరగతి వారు నాకు బోలెడుమంది తెలుసు).

అవును నాలాంటి పేదలు ఏంటో మంది రేషన్ కార్డు లేక అవస్త పడ్తున్నారు

సుజాత said...

@చైతన్య,
ఈ పథకాన్ని మొదట్లోనే ఉట్టికెక్కించడానికి లేదు. ఎందుకంటే మహా కూటమి విజయావకాశాలన్నీ ఈ హామీ మీదే ఆధారపడి ఉన్నాయి.అందువల్ల ఉచిత విద్యుత్ లాగ కనీసం కొద్ది పాటి కండిషన్లతో అయినా సరే అమలు పరచాల్సిందే!

ఏకాంతపు దిలీప్ said...
This comment has been removed by the author.
oremuna said...

నేనీ పథకాన్ని పూర్తిగా సమర్దిస్తున్నాను.
త్వరలో వీలు చూసుకొని ఒ టపా కట్టాలి.

ఏకాంతపు దిలీప్ said...

వ్యవస్థ, పని సంస్కృతి మారిపోతుందండి. ఎంత మంది శారీరక శ్రమ చెయ్యడానికి ఇష్టపడుతున్నారు? ఏ రంగాన్నైనా తీసుకోండి... మా తాత వ్యవసాయం చేసినప్పుడు చేసినంత శరీరక శ్రమ మా నాన్న చెయ్యలేదు, మా నాన్న చేసినంత ఇప్పుడు మా మవయ్య చెయ్యడం లేదు... రైతే మారిపోతున్నప్పుడు, వ్యవసాయ కూలీ ఎందుకు మారడు.. ఇంతకుముందు పొలంలో దిగి ఒక్కో రైతు ఇద్దరు కూలీలు కష్టపడినంత పని చేసేవాళ్ళు... తనే ఒక ఉదాహరణగా నిలిచి కూలీలచేత పని చేయించుకునే వాడు.. కూలీ కూడా రైతుతో పోటీ పడేవాడు కష్టపడటంలో... ఇల్లు కట్టుకునేప్పుడు తనూ ఇటుకలెత్తేవాడు...

ఇలా గ్రామ వాతావారణంలోనే కాదు, పట్టణ వాతావరణంలో కూడా మార్పు వచ్చేసింది... ఇదంతా మనంతట మనమే సృష్టించుకుంది... మట్టి పిసికే వాడిని మనం ఎప్పుడూ గౌరవంగా చూడలేదు... పై పైన హడావుడి చేసి పది మందిని వెనకేసుకు తిరిగేవాడికో, కష్టపడకుండానే డబ్బు సంపాదిస్తున్నాడు అనుకునే వాడికో ఇచ్చే గౌరవం వొల్లొంచి కష్టం చేసుకునేవాడికి ఇవ్వలేదు... ఇవ్వడం లేదు... తాడేపల్లి గారు తన టపాల్లో ప్రస్తావించినట్టు, బ్రిటీషు వాడి ఉద్యోగాలు, వాటి డాబు, అప్పుడు లభించిన గుర్తింపు, స్వాతంత్ర్యానంతరం అదే వ్యవస్థని కొనసాగించడం వల్ల మన పని సంస్కృతి నాశనమైపోయింది...

డబ్బిచ్చి చేయించుకోగలిగేవాడు పని చేయించుకుంటాడు... వాడి డబ్బు వాడి సోమరితనాన్ని దాచేస్తుంది...
డబ్బు లేనివాడు చెయ్యనంటేనో, ఎక్కువకావాలి అంటేనో సోమరితనాన్ని అంటగట్టేస్తాము... ఏమైనా అంటాము...

దీనికంతటికీ మూలం వ్యవస్థలో పతనమైపోతున్న విలువలు... ఎవరికీ చిన్ని చిన్ని త్యాగాలు కూడా చేసే ఓపిక లేకపోవడం, పెరిగిపోతున్న స్వార్ధం... ప్రజలకి సరైన నాయకత్వం అందించకుండా వారి బలహీనతలని పెంచి పోషించే రాజకీయ నాయకులు...

చంద్రబాబు అప్పుడు ప్రభుత్వాన్ని నడిపించిన తీరు పని సంస్కృతిని బాగు చేసే దిశగానే సాగింది... కష్టమైనప్పుడు మంచి భవిష్యత్తు కోసం కొన్నేళ్ళు ఓపిక పట్టే సహనం లేని సమాజం అని నిరూపించుకున్నాము మనం...

కాంగ్రెస్ గ్రామీణ ఉపాధి పథకం కింద, వళ్ళకి 100 రోజులు 100 రూపాయులు అందించి ఓటు బేంకు గా మలచుకుందామనే ప్రయత్నించింది కానీ, ఆ పథకం కింద అమలు అవుతున్న పనుల నాణ్యతని తుంగలో తొక్కేసింది... అందుకే చిన్న చిన్న పనులు అక్కడక్కడా నామ మాత్రంగా చేయించి, వారికి డబ్బు మాత్రం బానే ఇచ్చింది... తక్కువ కష్టానికే ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు, ఎక్కువ కష్టం ఎవడు పడాలనుకుంటాడు?

దీని వల్ల రైతులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కున్నారు, సకాలంలో కావలసినంతమంది కూలీలు దొరకక. చాలా మంది రైతులు ఈ ఐదేళ్ళల్లో తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నారు... కూలీలు అవసరంలేని, ఎక్కువ అవసరం లేని జామాయిలు, సుబాబుల్, పాం ఆయిలు తోటలు, పండ్ల తోటలు వేసేసుకున్నారు...

తెలుగుదేశం ఇది గమనించి, గ్రామీణ ఉపాధిని వ్యవసాయ పనులతో అనుసంధానం చేస్తానంది. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని, ఎంత మంది కూలీలు అవసరం దాన్ని బట్టి ఉపాధి లేని వాళ్ళకి వ్యవసాయ పనులు అప్పగించి కూలీల కొరత లేకుండా చేయాలని... ఈ ప్రక్రియలో భాగంగా కూలీ జీతాన్ని రైతు సగం, ప్రభుత్వం సగం చెల్లించే విధంగా మేనిఫెస్టోలో ప్రకటించింది...

ఒక ధర్మ సందేహం... డబ్బు వచ్చేది ఆడ వాళ్ళ అకౌంటులోకి... ఇప్పుడు అమలవుతున్నట్టు గ్రామీణ ఉపాధి ఈజీ మనీ వస్తున్నట్టు అమలవదు... వ్యవసాయ పనులు చేయాల్సి వస్తుంది...
చేస్తే ఆ పనులు చెయ్యాలి, లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు హయాములో గ్రామీణ ఉపాధి పనుల్లో పని చేసినట్టు చెయ్యాలి... పెళ్ళం చేతికి డబ్బులు వస్తున్నాయి కదా అని, పని చెయ్యని మగాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళని గౌరవించే పెళ్ళాలు ఎంత మంది ఉంటారు?

పైన ఎవరో రెండు రూపాయలు కిలో బియ్యం అమలు చెయ్యలేకపోయాడు అని ఎద్దేవా చేసారు... పదిహేనేళ్ళ క్రితం కిలో 6, 7 రూపాయల బియ్యాన్ని 2 రూపాయలకి ఇవ్వడం జరిగింది... 2004 లో బియ్యం 12 నుండి 18 రూపాయల మధ్య ఉండేది, అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది 5.50 కి... దాన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేసేసింది... అలా ఆ పథకం గురించి ఎద్దేవా చేసే వాళ్ళు వాస్తవాలని కన్వీనియంటుగా నిర్లక్ష్యం చేస్తారు... ఎప్పుడైతే కాంగ్రెస్ మరలా ఇవ్వడం మొదలుపెట్టిందో, మిగిలిన పార్టీలు కూడా అదే దారి పట్టాయి...

ఒక పక్క ఎల్లలు లేని అవినీతి/అసమర్ధ ప్రభుత్వం, తక్కువ అవినీతి/సమర్ధతని నిరూపించుకున్న అనుభవం ఉన్న తెలుగు దేశం, ఇంకో పక్క అనుభవంలేని/మిగిలిన రెండు ప్రధాన పక్షాలకి తేడా లేని ప్రజా రాజ్యం, మార్పు సాధించే దిశగా మాటలు/చేతలు ఒకటిగా సాగుతున్న లోక్ సత్త... ఎవరిని ప్రజలు ఎన్నుకుంటారో!

ఏకాంతపు దిలీప్ said...

సుజాత గారు, నేను పైన చిన్న సవరణ చేసాను... కాబట్టి రెండో పోస్ట్ మాత్రమే అనుమతించండి...

ఏకాంతపు దిలీప్ said...

ఇంకా,
డ్వాక్రా, వెలుగు, పొదుపు సంఘాల ద్వారా చంద్రబాబు మహిళల్లో ఉత్తేజాన్ని తీసుకొచ్చాడు... ఇప్పుడు ఆ మహిళలనే మరలా ఆకర్షించే ప్రయత్నం... మెనిఫెస్టో నేను పూర్తిగా చదవలేదు... కానీ ఈ పథకం గురించిన షరతులని ఎలా అమలు పరుస్తారో చంద్రబాబు ప్రచారం కల్పించడం లేదు... నేను అక్కడక్కడా సేకరించిన సమాచారం ప్రకారం ఆ షరతులన్నీ మంచివే... కుటుంబం కేంద్రంగా విద్య, ఆరోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమానికి సంభందించినవి...

నిన్న మీరు వార్త చదివే ఉంటారు... మందు తాగడం మానేస్తే ఇంకో 500 వందలు ఇస్తాము అని చెప్పాడు... ఈ షరతు అమలు చేసినా చెయ్యకపోయినా, ఇలాంటివే ఉంటాయి... ఎప్పుడైతే షరతులు ప్రకటిస్తాడో, ప్రతి పక్షాలు అనవసరమైన దుష్ప్రాచారం చేస్తాయని.. వ్యూహంగా ప్రకటించడం లేదేమో!

suresh kumar said...

అయ్య లార...అమ్మ లారా...
పేద వాళ్ళు అంటే మీ అర్ధం వేరు. వాళ్ళ అర్ధం వేరు.
ముఖ్యమంత్రి అయ్యిఊండీ కారు లొ షికారు భాగ్యము నోచుకొని రాజు గారు
మాజీ ప్రధాన మంత్రి అయ్యి ఉండీ, కొడుకు మాజీ ముఖ్య మంత్రి అయ్యి ఉండీ అస్సలు ఆదాయం లేని, పొరుగు రాష్ట్ర నివాసి అయిన సదరు నిద్ర "మన్నిన మగ" గారు
జాతీయ పార్టీ కి అధినేత్రి అయ్యి ఉండి సొంత ఇల్లు కూడా లేని

పేదలు మీకు కంపించకపోవడం విడ్డూరం సుమీ

గీతాచార్య said...

I'll write a post, about what I observed.

Ha Ha Ha. CEO? To whom?

@ Mahesh garu,

For Satyam or Maytas. This is full circle.

గీతాచార్య said...

@ Dileep garu,

I wanted to write a post. U indeed wrote it.

సుజాత said...

దిలీప్ గారు, ఓపిగ్గా చదివి మీ అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు!
నేను పని చేసే ముఖ్య మంత్రిగా చంద్రబాబుని ఎంతో అభిమానించాను.మొదటిసారి ఓటేసాక పని చేసి చూపించడంతో రెండోసారీ ఆయనకే ఓటేసాను.

కానీ ఈ అధికారం అన్నది చూశారూ, ఒక మత్తు,మైకం లాంటిది. దానికోసం ఎంతకైనా తెగించేలా చేస్తుంది. మొదటినుంచీ సమైక్యవాదిగా ఉన్నా ఆయన ఏకంగా TRS తో పొత్తు పెట్టుకోవడం నన్ను విస్మయపరిచింది. ఇది కేవలం అధికారం కోసం చేసిన పని కాదూ? ఇప్పుడు ఆయన ప్రకటించిన ఈ నగదు బదిలీ పథకాన్ని నేను ఎంత మాత్రమూ సమర్థించను. పేదల చేతిలో డబ్బుండాలి. కానీ ఇలా కాదు.

రెండురూపాయల కు కిలో బియ్యం, డ్వాక్రా, ఈ క్రెడిట్స్ అన్నీ తెలుగుదేశానికే చెందుతాయి. చెందాలి కూడా! అది ఒప్పుకుంటాను.

"డబ్బిచ్చి చేయించుకోగలిగేవాడు పని చేయించుకుంటాడు... వాడి డబ్బు వాడి సోమరితనాన్ని దాచేస్తుంది...
డబ్బు లేనివాడు చెయ్యనంటేనో, ఎక్కువకావాలి అంటేనో సోమరితనాన్ని అంటగట్టేస్తాము... ఏమైనా అంటాము..."

నేనో ఇల్లు కట్టుకోవాలి. నాకు తాపీ పని రాదు. నేను డబ్బిచ్చిపని చేయించుకుంటే అది సోమరి తనం అవుతుందా? డబ్బు లేనివాడు చెయ్యనని అనడు. అవసరం కాబట్టి చేస్తాడు. చేసిన పని విలువ కంటే ఎక్కువ డబ్బు చేతికొస్తున్నవాడు(ఉపాధి హామీ పధకంలో పల్చని రోడ్లు వేసే వాడో మరొకడో) ఇక్కడ కూడా ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తాడు. ఇది నేను కొన్ని చోట్ల చూసి రాస్తున్నాను.

" ... తక్కువ కష్టానికే ఎక్కువ డబ్బు వస్తున్నప్పుడు, ఎక్కువ కష్టం ఎవడు పడాలనుకుంటాడు?"..

ఇదే నేను చెప్తున్నది కూడానూ! అసలు కష్టమే పడకుండా ఇప్పుడు డబ్బు చేతికొస్తే, మరి భవిష్యత్తులో కష్టపడాలని ఎవరనుకుంటారో చెప్పండి?

ఆదాయ మార్గం చూపించాలి గానీ డబ్బు తెచ్చి చేతిలో పోయడంసబబా? ఇది చంద్రబాబు దివాళాకోరు తనానికి పక్కా నిదర్శనంగా ఉంది. మహేష్ గారు చెప్పినట్లు ఈ సారి ఓడితే ఇక తెలుగుదేశానికి భవిష్యత్తు లేదు. అందుకే ఇంతటి హామీకి తెగబడ్డాడనుకుంటా.

BTW ఈ అవిడియా లోకేష్ బాబుదట. వారసుడు తయారైనట్లే!

ఏకాంతపు దిలీప్ said...

గీతాచార్య గారు,
అయినా సరే, మీరు రాస్తే చదవాలని ఉంది... మీ బ్లాగుకున్న చదువరుల ద్వారా మరింత మందికి చేరుతుంది...

raman said...

Dileep
you are right
you said what everybody wanted to say
Chandrababu wanted everybody work, including govt. employees, ofcourse they didn't like it.
the result was...Chandrababu lost. He lost only election but the people of Andhra lost a working govt, work culture and see what we had in the last 5 years.
the idea of giving money is seen as an election stunt, probably to certain extent. If it comes with some restrictions and make the people resposible to certain extent it'd be good. I know young graduates not able to attend interviews, restrict on sending applications or taking extra courses necessary due to lack of money.
NTR called govt. employees as Bandacooks,Pandikokkulu...they are more than that. They like YSR not NCB or NTR because they wanted them to work or justify their salaries.

Sujata said...

సుజాత గారూ

హమ్మయ్య ! చాలా బాగా అనిపించింది 'మనసు లో మాట కూడలి లో చూసి. నా మనసులో మాట ఏమిటంటే, కేంద్రం లో మాత్రం భా జ పా రాకూడదు. కమ్యూనిస్టులూ వొద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వారి మంత్రివర్గం టీం బావుంది. భాజపా దగ్గర నాయకులే లేరు. ఉన్నా - మత తత్వం, హిందూ తాలిబానీకరణ విజృంభించవచ్చు. తీవ్రవాద దాడులు ఎక్కువ అవుతాయి. అద్వానీ ఆవేశపరుడు. సోనియా, మన్మోహన్ లు చాలా మందికి నచ్చకపోవచ్చు - గానీ భాజపా కన్నా చాలా బెటర్.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి వస్తుందనుకుంటాను. చంద్రబాబు పాపం డెస్పరేట్ గా టీవీ, డబ్బులూ ఇస్తానంటున్నారు. ఆయన వస్తే రెటైర్మెంట్ వయో పరిమితి 53 ఏళ్ళకు కుదిస్తారేమోనని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కొంచెం భయం. ప్రజారాజ్యం గానీ లోక్ సత్తా గానీ సత్తా లోకి వస్తే బావుణ్ణు. రాష్ట్రం లో మాత్రం కాంగ్రెస్, తె.దే.పా లతో, తెలంగానం తో విసిగిపోయి ఉన్నారు జనం. లోక్ సత్తా కి అర్ధ బలం, అంగ బలం లేవు. కాబట్టి చిరంజీవి వైపే చూపులన్నీ ! కానీ చిరంజీవి మంత్రివర్గం ఎలా ఏర్పరుస్తారనేది చూడాలి.

రాష్త్రం లో ఎవరొచ్చినా పర్లేదు గానీ - కేంద్రం లో మాత్రం కాస్త గట్టి ప్రభుత్వం రావాలి. పక్కలో తాలిబాన్ ని పెట్టుకొని మనకి అసమర్ధ ప్రభుత్వం వస్తే మాత్రం చాలా కష్టం.

ఏకాంతపు దిలీప్ said...

సుజాత గారూ,

చాలా చిన్న పనులకి, చెయ్యని పనులకి ఇప్పుడున్న ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ ద్వారా డబ్బులిచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు...
గ్రామీణ ఉపాధి హామీ కింద లబ్ధి పొందని వారు, కూరగాయల రేట్లు ఉప్పు పప్పుల రేట్లు పెరిగిపోయాయని చెప్పి ఎక్కువ అడుగుతున్నారు...
ఆ రెండు కారణాలే కాకుండా కూలీలు గ్రూపులుగా కట్టి పలాన కూలీ ఇస్తేనె వస్తాము అని అడగడం ఎప్పటినుండో ఉంది... ఈ మూడో సమస్యకి పై రెండు తోడై, సమస్య తీవ్రతరమైపోయింది...

ఇంకా పని విలువలు మారిపోతున్నాయి... శారీరక శ్రమ చేసేవాళ్ళు తగ్గిపోయి అదొక ఖరీదైన వస్తువులాగా తయారైంది... ఇంకా మన దేశంలో శారీరక శ్రమ కి సంభందించి రంగాల్లో పూర్తిగా సంఘటితం కావడం జరగలేదు... ఒకవేళ సంఘటితం అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా మనం వాళ్ళు అడిగినంత ఇచ్చుకోకతప్పదు... ఆరోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి, అప్పుడు ఖర్చు ఎక్కువైపోతుంది అని ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు... పలాన పని చెయ్యడం రాదు అనుకుంటే, ఖర్చు భరించక తప్పదు... నా అమెరికన్ కొలీగ్ ఒకతను, ఇల్లు కట్టుకొనేప్పుడు ఖర్చు తగ్గించుకుందామని రెండేళ్ళ క్రితం 5:30 తరవాత ఇంటికెళ్ళిపోయి తను కూడా కొంత పని చేసుకునేవాడు...

చాలా వరకు అది మన చేతుల్లో లేదు. సేవల రంగం ఎటు వైపు వెళ్తుందో! కానీ రైతాంగానికి కూలీ సమస్యలు రావడం ( మెషీన్లతో సంఘటితంగా పని చేసే ప్రత్యామ్నాయాలు లభించనంత వరకూ...) అరికట్టాలి... మన వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరిగే వరకూ చంద్రబాబు చెబుతున్నట్టు గ్రామీణ ఉపాధిని, వ్యవసాయ పనులతో అనుసంధానం చేస్తే రైతాంగం పూర్తి సామర్ధ్యంతో పని చేసే అవకాశం ఉంటుంది...

చంద్రబాబు గ్రామీణ ఉపాధిని కింద చాలా చేయించాడు... నీరు మీరు, జన్మ భూమి బాగా ప్రజాదరణ పొందినవి... అందులో అవినీతి కూడా జరిగింది... కానీ, జరిగిన పనుల్లో కూలీకి పని చెయ్యకుండా డబ్బులివ్వడాలు, చిన్న పనికే ఎక్కువ డబ్బులివ్వడం లాంటివి జరగలేదు....

ప్రభుత్వం ఇప్పటికే నిర్భంధ విద్య, ఆరోగ్యం, స్త్రీ, శిశు సంక్షేమం కోసం చాలా ఖర్చుపెడుతుంది... ఒక రూపాయి సేవలు అందించడానికి మూడు రూపాయలు ఖర్చుపెడుతుంది అని ఒక లెక్క...అయినా సరే, ఆశించిన ఫలితాలు సాధించడం లేదు... చాలా కారణాలు ఉన్నాయి... ఇప్పుడు నగదు బదిలీ కార్యక్రమం ద్వారా, పైన చెప్పిన అంశాల్లో సాధించాలనుకున్న లక్ష్యాలని చేరడానికి షరతులతో ప్రజలని అవలభించేట్టు చేస్తారు... నిర్దేశిత సమయాల్లో ఆయా పరీక్షలు చేసిన తరవాత నగదు బదిలీ వాళ్ళకి కొనసాగాలో లేదో నిర్ణయిస్తారు... ఈ పథకాన్ని అమలు చేస్తున్న దేశాలు అలానే లక్ష్యాలని చేరుకోగలిగాయి... లక్ష్య సాధన్లో నేరుగా ప్రజలని భాగస్వాములని చెయ్యడం అన్నమాట!

ఇది కొంత కాలం అమలయితే, ఒక ఇరవయ్యేళ్ళ తరవాత మరింత రోగ నిరోధకతతో, మరింత ఆరోగ్యంతో, మరింత అక్షరాస్యతతో మన సమాజం తయారవుతుంది... ఈ పథకాన్ని సమర్ధించే వాళ్ళకి ఉన్న ఒకే ఒక ప్రశ్న "అందరినీ అర్హులైన వాళ్ళనే ఎంపిక చేస్తారా?" ఒకవేళ ఎటువంటి అవకతవకలు జరగకుండా అమలైతే, దీన్ని మించిన సంక్షేమ పథకం ఇంకోటి ఉండదు...

బొల్లోజు బాబా said...

Chandrababu wanted everybody work, including govt. employees, ofcourse they didn't like it.

ఇదొక పెద్ద మిత్.
ఏ ప్రభుత్వోద్యోగైనా పనిచేసేది, తను నిరంతరమూ కంటాక్ట్ లో ఉండే పరిస్థితులు, ప్రజలకొరకే.
అక్కడే అతని గౌరవమైనా, ఆదాయమైనా.

ఇక పోతే గతప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల్ని పరుగులు పెట్టించింది, జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, ఇంకుడు గుంటలు వంటి నిరర్ధక, అన్ ప్రొడక్టివ్ పనులగురించే. (ఇప్పుడు మరోరకమైన పనులు లెండి)
మీ ఏరియాలో ఎన్ని ఇంకుడు గుంటలు తవ్వారు, వాటి వైశాల్యము లోతులు ఎంతెంత, వానివల్ల పెరిగిన భూగర్భ నీటి మట్టం శాతం ఎంతెంత వంటి వివరాల రిపోర్టూలు ప్రతీవారం ఆఘమేఘాలమీద ప్రతీవారం పంపించాల్సివచ్చేది.

ఇదేనా ప్రభుత్వ ఉద్యోగుల్ని పనిచేయించటం.
ఇక జన్మ భూమి కార్యక్రమాలని గ్రామాలలో కేంపులు పెట్టించి, ఆ పరిస్థితులలో ఎంతమంది ప్రభుత్వోద్యోగులు చనిపోయారో ఒకసారి పాత పేపర్లు తిరగేయండి. గాడిద చేసేపని గాడిద చేయ్యాలి, కుక్కచేసే పని కుక్క చేయాలని పెద్దలు ఊరికే అనలేదు.(దీన్ని వక్రీకరించవద్దు దయచేసి)

డ్రైనేజ్ లలో మురికి పేరుకుపోయినందుకు, ఒక కలెక్టరును, మెడపట్టుకొని చూడు చూడు అంటూ ముందుకు తొయ్యటం అరాచకం కాక మరేమిటి. అదా సరిగ్గా పనిచేయించటం
తన జీవితమంతా కొలువులో గడిపేసి, వృద్దాప్యంలోకి చేరిన పించను దారులకు పెరిగిన ధరలకు అనుగుణంగా పించను పెంచకపోవటం కూడా బాగా పనిచేయించటమా?

గతప్రభుత్వ హయాంలోమాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసారు, అది బాగా పనిచేయించింది అనే ఒక అభూతకల్పన ప్రజల్లో బాగా పాతుకుపోయింది.

ఏ ఉద్యోగి అయినా జీతం తీసుకొంటున్నామన్న స్పృహతోనే ఉంటాడు, పని చేస్తాడు. ఇక లంచాలు, సోమరితనం అనేవి ప్రతీ చోటా ఉండేవే. అవో సామాజిక రుగ్మతలు తప్ప ప్రభుత్వోద్యోగానికి మాత్రమే పరిమితమైన లక్షణాలు కావు.

కొత్త పాళీ said...

మీయీ ఆవేదనా పత్రంలో సాక్ష్యాలు నిలబెట్టలేని అనుకోళ్ళు ఉన్నాయి యువరానర్!

"అక్కడి ప్రజలు చిన్న చితకా ఉద్యోగాలు చేసుకునే వారు మొదలు వ్యాపారస్థుల వరకు పన్నులు ఎగ్గొట్టకుండా కడతారు"
రాంంంంగ్! ఇటీవల పన్నులబాకీ కి గానూ ఆరోగ్య మంత్రిగా పదవీ స్వీకారం చెయ్యబోయిన టాం డేషల్ గారు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆర్ధిక మంత్రి గైట్నర్ గారు అదే కారణం వల్ల చావు తప్పి కన్ను లొట్టబోయి, మొత్తానికి ఎలాగో గట్టేక్కారు. ఇలాగే అనేకులు, కోకొల్లలు పన్నుల ఎగవేతలు.

అవునూ, రోజూ రెండు పూట్లా నాలుగువేళ్ళూ నోట్లోకి పోడానికి నానా కష్టాలూ పడే హమాలీలూ, భవన నిర్మాణ కూలీలూ, వ్యవసాయ కూలీలూ, ఇతర పేదలూ .. ఈ పుణ్యమాని కనీసావసరాల్ని గడుపుకుంటారు. అందులో తప్పేముందబ్బా?
అవున్నిజమే, వాళ్ళ పొట్టల్లో ఆకలై మండుతుంటేనే గానీ వాళ్ళు రోజుకి అరవై డెభ్హై రూపాయల కూలికి రారుగా! ఏంటో, నేను కూడా కమ్యుణిస్టులా ఆలోచిస్తున్నా. ముందా కొకు ని చదవడం మానెయ్యాలి.

సుజాత said...

కొత్తపాళీ గారు, ఊప్స్, నిజమా! అక్కడ కూడా పన్నులెగ్గొట్టే వాళ్ళున్నారా? మరీ మన లెవెల్లో ఉండరేమో!

ఒంట్లో సర్వావయాలూ సక్రమంగా పని చేస్తున్నపుడు, పని చేయకుండా పబ్బం గడుపుకోవాలంటే ఎలాగండీ? పని చేయండి, సంపాదించుకోండి, తినండి! అంతే! అరవై డెబ్భై రూపాయల కూలీకి రమ్మని అడిగేంత లేదు కానీ, ఉపాధి హామీ పధకం వల్ల తక్కువ పనికి ఎక్కువ డబ్బు తీసుకోవడం అలవాటైన వారు మన వైపు ఊళ్లలో ప్రైవేటు పని అంటే కొండెక్కి కూచుంటున్న సంగతి మాత్రం వాస్తవం! నేను బూర్జువానికాదండీ. ఇదివరలో కమ్యూనిస్టునే!:)))

సుజాత said...

మిగిలిన వ్యాఖ్యాతలకు రేపు జవాబిస్తాను. ఇప్పుడు కాసేపట్లో మాకు కరెంట్ పోతుంది.:))

ఏకాంతపు దిలీప్ said...

@బాబా గారు,

"జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్, ఇంకుడు గుంటలు వంటి నిరర్ధక, అన్ ప్రొడక్టివ్ పనులగురించే"

ఏంటో ఒక్క వాక్యంతో అంతా నిరర్ధకం అని తేల్చేసారు... నా కళ్ళతో నేను చూసాను, జన్మ భూమి వల్ల స్థలాలు, చెరువులు ఎలా ఉపయోగకరంగా మార్చబడ్డాయో... నాకు మరపు లేదు... నీరు-మీరు ద్వారా జరిగిన పూడిక తీతలు, కాలువ గట్టు నిర్మాణాలు, ఇంకుడు గుంటలు తరవాత పడిన వర్షపు నీరు చెల్లా చెదురై పోకుండా ఉండేందుకు సాయపడ్డాయి... ఇంతకుమునుపు వర్షాలు పడితే నిలిచేది కాదు.. నీటి మట్టం కూడా పెరిగింది...

మా పశ్చిమ గోదావరిలోనే తీసుకుంటే ఇంతకుముందు వర్షాలు పడితే ఎర్ర కాలవ, కొవ్వాడ కాలవలు పొంగి పొలాలని ముంచేసేవి... అంత నీరు ఉపయోగం లేకుండా పోయేది... జన్మ భూమి, నీరు-మీరులతోనే ఆ కాలవలని దగ్గర్లో ఉన్న ఊళ్ళల్లోని చెరువలకి చిన్న చిన్న కెనాల్ లు తవ్వి, చెక్ డాములు కట్టి అనుసంధానం చేసారు... ఇప్పుడు ఎర్ర కాలవ, కొవ్వాడ కాలవ ఇంతకుముందులా పొలాలని ముంచి నష్టాలు తీసుకురావడం లేదు...

కరవు ప్రాంతమైన పాలమూరులో కూడా జన్మభూమి(అవినీతి జరిగినా), నీరు-మీరు లకి మంచి ఆదరణ వచ్చింది.. పాలమూరు గురించి అప్పుడు ఆ కార్యక్రమాల ద్వార జరిగిన పనుల గురించి అంతర్జాలంలో కూడా దొరుకుతుంది సమాచారం... అవి ప్రభుత్వం రూపొందించినవి కాదు, కొన్ని స్వచ్చంద సంస్థల పరిశీలన...

గుంటూరు పట్టణం లో నడి బొడ్డున నిరర్ధకంగా ఉన్న ప్రభుత్వ స్థలం జన్మ భూమి పనులతో చదును చెయ్యబడి, అక్కడ ఒక స్టేడియం కట్టారు... మునిసిపాలిటీ అధికారులు వాళ్ళకి క్వార్టర్సు కట్టాలి అని డిమాండ్లు చేసినా, ప్రజోపయోగమైన స్టేడియం ని కట్టారు... ఇప్పుడు అక్కడ అది ప్రజల అవసరాలని తీరుస్తుంది...

నేను గమనించిన చోటల్లా నాకు ఉపయోగం, ఉత్పాదకత కనపడింది. అంతే కాదు, ఇవి జాతీయంగానూ, అంతర్జాతీయంగాను ఎంతో ప్రాచుర్యం పొందాయి... ఎందరో ప్రవాస భారతీయిలని ప్రభావితం చేసి వాళ్ళ గ్రామాలని దత్తత తీసుకునేట్టు చేసాయి....

మీరేమో తీసిపాడేసారు.

అబ్రకదబ్ర said...

>> "మళ్ళీ CEO సీటు దక్కించుకోడానికి చంద్రబాబు ఇలాంటి చెత్త హామీకి కూడా తెగబడ్డాడనిపిస్తోంది.

నిస్సందేహంగా.

>> "ప్రజల్ని సోమరిపోతులుగా మార్చడానికి కంకణం కట్టుకున్నాడు"

ఇది సందేహాస్పదం. బెల్లం పెడితేనే బడికెళతాననే పిల్లోడికి తాయిలమిచ్చే తల్లిదండ్రుల తీరు చంద్రబాబుది. 2004 ఎన్నికలయ్యాక అతను నేర్చుకున్న పాఠం ఇది. పబ్బం గడిచాక మాట మారుస్తాడు చూడండి. ఇందులో మనుషుల్ని సోమర్లుగా మార్చే కుట్ర నాకైతే కనిపించటం లేదు (మీరు కూడా కుట్ర కోణాల గురించి రాయటమేంటండీ. ఆ పని చేసేవాళ్లు వేరే ఉన్నారు కదా :-) )

>> "ఏ వ్యక్తి తో రాజీపడకుండా మొన్నీమధ్య దాకా సమైక్యవాదిగా నిలిచాడో అదే వ్యక్తితో పొత్తుపెట్టుకున్నాడంటే , సరే సీట్ల కోసం అనుకుందాం!"

తప్పు, తప్పు. అసలు కేసీయార్‌ని మించిన సమైక్య వాదెవడు రాష్ట్రంలో ;-)

తెరాసతో పొత్తు సీట్ల కోసమనేది కొంత నిజం. పోలింగ్ మేనేజ్‌మెంట్‌లో అధికార పార్టీ అంగబలానికి దీటుగా ఉండటానికి ఉద్రేకపరులైన తెరాస, కమ్యూనిస్టు కార్యకర్తల అండ బాబుకిప్పుడు కావాలి. ఎన్నికలయ్యాక కుడితిలో పడేది కేసీయారే చూడండి. ఎలక్షన్లయ్యాక కాంగ్రెసుకి బొంద పెడతానని కేసీయార్ కోతలు కోస్తున్నాడు కానీ, పనయ్యాక బాబు తనకే పాడె కడతాడని తెలుసుకోలేకపోతున్నాడు.


>> "ఈ అర్థం లేని హామీ ఏమిటి? ఈ భారం రాష్ట్ర ఖజానా మీద ఎన్ని వందల కోట్లు? అదంతా ఎవరి నెత్తిన రుద్దబోతున్నారు? ఏ విధంగా రుద్దబోతున్నారు? ఈ ప్రశ్నలకు నాకు జవాబు కావాలి! కావాలి! కావాలి!"

హామీ అర్ధం లేనిదే కావచ్చు. భారం మాత్రం - పడినప్పుడు కదా. మాట మార్చటంలో బాబు ఎంత మొనగాడో తెలిసీ మీరాయన హామీలు నమ్ముతున్నారంటే ఆశ్చర్యం. మీకు జవాబులు కావాలి, బాబుకి అధికారం కావాలి. మీకు జవాబులు దొరక్కపోయినా ఫరవాలేదు కానీ బాబుకి అధికారం దొరక్కపోతే (ఆయనక్కాకపోతే చిరంజీవికి, లేకపోతే జేపీకి) రాష్ట్రంలో రాబోయే రెండేళ్లలో జరగబోయేది నిలువుదోపిడీయే. ఈ ఐదేళ్లలో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములూ దొరికిన కాడికి అమ్ముకుని సొమ్ములు చేసేసుకున్నారు. మరో ఐదేళ్లు రెడ్డిగారి చేతిలో అధికారం పెడితే అమ్ముకోటానికి ఇంకేమున్నాయి? అప్పుడిక వాళ్ల కళ్లు పడేది ఇళ్లలో ఆడాళ్ల మెడల మీద, అలమరలు, బీరువాల మీద. ఆ రోజులు రానీకుండా చెయ్యటానికే బాబు నేడు అడ్డమైన గడ్డీ కరుస్తున్నాడేమో?

బొల్లోజు బాబా said...

ఇంకుడు గుంటలపట్ల నా అభిప్రాయం అంతే.
ఇది కొండప్రాంతాలలో కేచ్మెంట్ ఏరియా ఉన్న ప్రదేశాలలో ఉపయుక్తంగా ఉంటుంది తప్ప మనరాష్ట్రం లాంటి సమతల ప్రాంతానికి కాదని ఒక పరిశీలన.

ఇకపోతే క్లీన్ అండ్ గ్రీన్, జన్మభూమి అనేవి ఆ యాప్రాంతాలలో, స్థానికంగా సమిష్టిగా జరుపుకోవాల్సిన పనులు తప్ప, ఎక్కడినుంచో (కొన్ని సందర్భాలలో వందల కిలోమీటర్ల దూరంనుంచి) ఆఫీసర్లను నియమించి, ఏడాదికి రెందువారాలలో మార్పు తీసుకురమ్మంతే ఎలా? ఎవరికి నిబద్దత ఉంటుంది? ఇబ్బంది పడటం తప్ప. అవన్నీ తూతూమంత్రంలానే జరిపారు. ప్రజలకు కలిగిన ఇంప్రెషనేమిటంటే, ఫేను క్రింద కూర్చునే ఆఫీసరు, మనవీధిలో చీపురుపుచ్చుకొని తుడిచాడు కనుక ప్రభుత్వం ప్రభుత్వాధికారులతో భలే పనిచేయించింది అని.

ఇదీ నేను చెప్పదలచుకొన్న పాయింటు.

డిస్ క్లైమర్: నేనే పార్టీకీ చెందినవాడిని కాదు. నాకు ప్రస్తుతం వోటుకూడా లేదు. గల్లంతైంది. :-౦

భవదీయుడు
బొల్లోజు బాబా

చైతన్య.ఎస్ said...

జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన అన్న మనిషి ఈరోజు కలర్ టి.వి, 2000 నగదు బదిలీ ....ఏంటో ..అంతా మాయ.

వేణూ శ్రీకాంత్ said...

సుజాత గారు మీరే అన్నారు కదండీ గెలుపు కోసం ఏం చేయటానికైనా రడీ అయ్యాడు అని. ఇవన్నీ ఎన్నికల వాగ్దానాలు మాత్రమే... మహా అయితే ఓ నాలుగు నెలలు ఓ నలుగురికి ఇస్తాడేమో అంతే.. సోమరి పోతులుగా చేయడానికి కంకణాలు గట్రా అంత లేదు.

రాఘవ said...

అబ్రకదబ్రగారు చెప్పింది నిజమనే నాకూ అనిపిస్తోంది, కేసీఆర్‌ని మించిన సమైక్యవాది రాష్ట్రంలో ఉండడు. ఒకవేళ నిజంగా వెంటనే తెలంగాణా వచ్చేస్తే తీవ్రంగా నష్టపోయేది బహుశా కేసిఆరే కాబట్టి.

తర్వాత నెలకి ౨౦౦౦ పథకం ఒక రకంగా చూస్తే ఈ రోజుకి ౧౦౦ పథకం కంటే చాలా నయం. పని తూతూమంత్రంగా చేసినా రోజుకి ౧౦౦ రూపాయలు ఇస్తుంటే మీరు అన్నట్టుగా ఒకపట్టాన పనికి ఎవరూ రావటం లేదు, వచ్చినా చాలా ఎక్కువ అడుగుతున్నారు (మీరూ ఇదే అన్నారు). ఇప్పుడు ఈ పథకం ఎత్తేసి నెలకి రెండు వేలు ఇస్తే ఈ బెడద తగ్గేలా అనపిస్తోంది. అంతే కాకుండా ఒకవైపు ఈ పథకం ద్వారా లభ్ధి పొందే వాళ్ల పిల్లలకి కూడా ఉపయోగకరమేమో ఆలోచించండి (స్కూలు ఫీజులు, పుస్తకాలు, గట్రా).

చంద్రబాబు ఇప్పుడు నలుగురితోనూ చేతులు కలిపాడు అంటే... అది తప్పదు. ప్రజారాజ్యం రావటం ఒకటి, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులు రెండు. ఏదైనా ప్రతిపక్షంవాళ్లు ప్రభుత్వంలోకి వస్తే ఇది చేస్తాం అని ప్రకటించబోతున్నారని తెలిస్తే ముందుగా ప్రభుత్వమే అది ప్రకటించేయడం, వేఱే మీడియాతో కూడా అవసరం లేకుండా సొంతంగా పత్రిక ఛానెలు ఏర్పాటుచేసుకోవడం, హామీలమీద హామీలు ఇచ్చేయడం, ఒకే సారి లక్ష ప్రాజెక్ట్లులు ప్రారంభించేయడం (పూర్తవ్వడం తర్వాత ప్రభుత్వం వాడి తలనొప్పి), ... ఇలా. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి కూడా ఉందేమో కానీ చెడు దానిని పూర్తిగా కప్పేస్తోంది అని నా అభిప్రాయం.

జన్మభూమి, ప్రజలతో ముఖ్యమంత్రి, ... (నాకు గుర్తున్నవి ఇవి రెండే నేను స్కూల్లో ఉన్నాను ఇవి ప్రారంభమయ్యే సరికి, నీరు మీరు నాకు పెద్దగా అర్థం కాలేదు అప్పటికి). ఈ రెండూ చాలా మంచి పథకాలు. చెత్త చెత్తలా తయారైన పార్కులు పునరుద్ధరించడం దగ్గర్నండీ, మన స్కూలు ఆఫీసు రోడ్డు మనమే సరిగ్గా ఉంచుకోవాలనే నినాదం దగ్గర్నుండీ, మనమే నాలుగు మొక్కలు నాటాలి అనే అవగాహన ... ఒకటేమిటి నాకు చాలా చాలా నచ్చేసాయి ఇవన్నీ. ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనిపించేలా నడిచేది. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి పదవిలోకి వస్తే నాయుడుబాబు ఇవన్నీ చేస్తారో చేయరో తెలియదు కానీ, కాస్తో కూస్తో మంచి జరుగుతుందనే ఆశ నాకు ఇంకా ఉంది. చూడబోతే లోక్‌సత్తా పుంజుకోవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రజారాజ్యం కాంగ్రెస్సుల మీద నాకు ఆశలు లేవు.

సుజాత said...

అబ్రకదబ్ర,
ఈ పథకం మీదే మహా కూటమి విజయావకాశాలు ఆధారపడి ఉన్నపుడు కొన్నాళ్లయినా అమలుపర్చకుండా చేతులెత్తేసే ఛాన్స్ ఏది? స్కూలు పిల్లలే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకొపోతే నిలదీస్తున్నారు.

సోమర్లుగా మారడమనేది ఖాయం, కుట్ర కాకపోతే కాకపోవచ్చు(BTW నాకు చరిత్ర అంటే ఇష్టం లేని సబ్జెక్టు, అందువల్ల కుట్రల గురించి రాయడం కూదా obviously చాతగాదు) గానీ!

నేనసలే కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుందో అని భయపడి చస్తుంటే మీరేమో తర్వాత రాజు గారి కళ్ళు నా బీరువా మీదా నగల మీదా అని భయపెట్టేస్తున్నారు.

(లోక్ సత్తా ప్రచారంలో కొంచెం బిజీగా ఉండటం వల్ల మహాకూటమిని విమర్శించడానికి, వ్యాఖ్యాతలకు జవాబివ్వడానికి ఆలస్యమైంది, క్షమాపణలు)

సుజాత said...

దిలీప్ గారు,
ఇతర దేశాల్లో విజయవంతంగా అమలు జరిగిన పథకాలన్నీ మన దేశంలో అమలు జరుగుతాయని మీరు నమ్ముతున్నారా? షరతులు విధిస్తారని, ఆ షరతులు నెరవేరితేనే నగదు బదిలీ చేస్తారని ఓట్లు వేయబోయే నిరుపేదలకు చెప్పారా? ఎంతమంది పేదలకు ఈ విషయం తెలుసు? ఖర్చులు ఎంత పెరిగినా కొన్ని రంగాల్లో శారీరక శ్రమ అనేది మన దేశంలో వీలు కాదు కదండీ! అమెరికాలో స్వంతగా ఇళ్ళు కట్టుకున్న వారిని నేనూ చూశాను. మా స్నేహితుడు(అమెరికనే) ఇల్లు కట్టుకుంటూ, కప్పు వేస్తూ తీయించుకున్న ఫొటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. అక్కడి పరిస్థితులు వేరు. ఖర్చు ఎంత పెరిగినా చచ్చినట్ట్లు ఇచ్చి చేయించుకోడం తప్ప సొంతగా చేసుకోలేని పనులు కొన్ని ఉన్నన్నాళ్ళూ ఇది తప్పదు మనకి.

అలాగే చంద్రబాబు చెప్పే థీరీలు చాలా బాగుంటాయి. కొంతవరకు మాత్రమే వర్కవుట్ అవుతాయి. ఆయన చేపట్టిన జన్మభూమిలో ఎన్ని లొసుగులున్నాయో ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను గానీ ప్రభుత్వ ఉద్యోగులని కదిలించి చూడండి.
లక్ష్య సాధన్లో నేరుగా ప్రజలని భాగస్వాములని చెయ్యడం అన్నమాట!...ఎప్పటికి జరుగుతుందండీ ఇది?

జన్మభూమి వంటి పథకాల వల్ల బాగుపడ్డ చెరువులూ నేను చూశాను. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చంద్రబాబు అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్నీ చూశాను.

"నేను గమనించిన చోటల్లా నాకు ఉపయోగం, ఉత్పాదకత కనపడింది."..ఇదేమాట నిన్న ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఉపాధి హామీ పథకం గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, ఆరోగ్యశ్రీ(వైద్యసేవల పరంగా), జలయజ్ఞం గురించి ఉద్దేశించి అన్నాడు. ఏం చెప్తాం చెప్పండి?

DRONA said...

manamandaramu chusamu kada..chandrababu garu cheppedokati..chesedokati...adikaram ragane kazanaku adikadayam kosam pannulu ruddi..tedlugu desam abhimaulaku (!) nagadu badali pathakam istadu..congress vallu jalayajnam to bada babulanu kotiswarulanu chestunte..babu garu andarini lakshadikarulanu chestaru mari..ika andhra rastramulo pane chesewallu dorakaremo mari.

oremuna said...

Finally here is my post on this topic.
Telugu
English

ఏకాంతపు దిలీప్ said...

అది మన విచక్షణ మీదే ఆధారపడుతుందండి... జన్మ భూమి ప్రాజాకర్షక పథకం కాదు, ప్రజావసర, ప్రజలని ఆలోచింప చేసిన పథకం...
చంద్రబాబు వ్యవస్థలని సమర్ధవంతంగా నిర్వహించడానికి ప్రయత్నించాడు అనేది తిరుగులేని నిజం..

ఆరోగ్య సేవే తీసుకుందాము... ఊళ్ళో పది మందికి ఉపయోగపడే పథకం అది... మిలిగిన 99% మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా? కాంగ్రెస్ వచ్చిన రెండో సంవత్సరం అనుకుంట... ప్రభుత్వ ఆసుపత్రుల ఖాలీ స్థాలలని కమర్షీల్ అవసారలకి లీజుకి ఇచేసారు... ఆవిధంగా ప్రభుత్వ ఆదాయం పెంచుకోడానికి ప్రయత్నించారు.. కానీ, పెరిగిన ఆ ఆదాయాన్ని అవే ఆసుపత్రులకి ఉపయోగించారా అంటే మనం గాల్లోకే చూడాలి... అదే చంద్రబాబు గతంలో ప్రభుత్వ ఆసుపత్రులని మెరుగుపరుస్తూ, ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు ప్రవేశానికి రెండు రూపాయల రుసుము కట్టాలన్నాడు... రెండు రూపాయల రుసుముకే అప్పుడు ప్రతిపక్షాలు నానా యాగీ చేసి పడేసాయి... చంద్రబాబు ప్రభుత్వ ఆసుపత్రులని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే, రాజసేఖరుడు వాటిని వదిలేసి ఆరోగ్య శ్రీ అంటూ ప్రజలని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడు...

పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో అవసరం కాదో, అక్కడ ప్రజలని, గోదావరి ఒడ్డంటా ఉన్న గోదావరి ప్రజలని, ఆ భారీ ప్రాజెక్టు ఎంత ప్రయోజనం ఒనగూరుస్తుందో బుద్ధిన్నవాడెవడైనా ఎప్పుడైనా చర్చ కి సిద్ధంగా ఉంటాడు... 1930 ల్లో బ్రిటీషు వాళ్ళు అధ్యనం చేసి వదిలేసిన ప్రాజెక్టు అది... భారీ ప్రాజెక్టు కన్నా, చిన్న చిన్న ప్రాజెక్టులు గోదావరి వెంబడా కట్టమని శాస్త్రవేత్తలు, పర్యావరణ పరిశీలకులు మొత్తుకుంటున్నారు... ప్రాజెక్టు ఒక విషయం అయితే, ఆ ప్రాజెక్టు కింద నీళ్ళు ఎలా తరలించాలనుకుంటున్నారో అది ఇంకా భయంకరమైన ఆలోచన... గోదవరి నీళ్ళని రాయలసీమ కి ఎత్తుకుపోయే భయంకరమైన కుట్ర ఉంది అందులో... ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యినా అవ్వకపోయినా లాభపడేది మాత్రం వై ఎస్ అనుయాయులు, కాంట్రాక్టరులు... ఆ ప్రాజెక్టుకి ఎమైనా హాని జరిగితే గోదావరి జిల్లాల్లో సగం నీట మునిగిపోతాయి... ఇది నాగార్జున సాగర్ కన్నా ఎంతో వైవిధ్యం గల పరిస్థితులు ఉన్నాయి...

మొత్తం జలయఞం లో ఇప్పటి వరకూ నీళ్ళిచ్చిన పథాకాలలో చాలా మట్టుకు చంద్రబాబు హయాములో మొదలెపెట్టి పనులు పూర్తి చేసుకోబోతున్న, సగం పూర్తైన ప్రాజెక్టులు లాంటివే... కొబ్బరికాయ ఎవడు కొడితే ఫలం వాళ్ళదే అనడం వై ఎస్ ఆర్ వంతు...

చంద్రబాబు ప్రాజెక్టులు కట్టలేదు అని, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు అనే విజయవంతమైన, కుట్రపూరితమైన ఆరోపణ లో ఎంత నిజం ఉందో గణాంకాలు గమనిస్తే జనానికే తెలుస్తుంది... అసలు 7 ఏళ్ళు కరువుంటే ఏ ప్రభుత్వమైనా, ఎలాంటి బుద్ధి ఉన్నవాడైనా భారీ ప్రాజెక్టులు కట్టాలని అనుకుంటాడా? చంద్రబాబు హాయములో చిన్న నీటి ప్రాజెక్టులతో పాటూ, ఎలిమినెటి మాధవరేడ్డి, దుమ్ముగూడేం, స్రీరం సాగర్ ఎక్స్టెన్షన్ పనులు లాంటి కొంచెం పెద్ద స్థాయి ప్రాజెక్టులు కూడా చేపట్టాడు...

చివరగా నేను చెప్పేది చంద్రబాబు మొత్తంగా వ్యవస్థ గురించి ఆలోచిస్తే, రాజశేఖరుడు కొంత మందికి ఎక్కువ ప్రయోజనం కలిగించి ఆకర్షించి ఆ ఆకర్షణలో మిగిలిన వ్యవస్థ లోపాలకి ముసుగేసేట్టు ఉంటుంది... ఎంతగా కొల్లగొట్టాలనే ప్రణాలకిలు తను రూపొందించుకోకుంటే, ఐదేళ్ళల్లో ఇంత భూములని, గనులని, పవరు ప్రాజెక్టులని తనకి, తన అనుయాయులకి కట్టబెట్టాడో అర్ధమవుతుంది...

ఇక పోతే సోమరితనం పెరుగుతుంది అని నేను అనుకోవడం లేదు... గ్రామీణ ఉపాధి వేరు, ఇది వేరు... అక్కడ పనే చవకబారు పని ఇస్తున్నారు, ఎక్కువ చెల్లిస్తున్నారు... వ్యవసాయ కూలీ పనికో, తాపీ పనికో వెళ్ళకుండా ఆ పనికి వెళ్తున్నారు తక్కువ కష్టం కాబట్టి... అలాంటి ప్రత్యామ్నాయం లేకపోతే వ్యవసాయ కూలీ పనికే వస్తారు... కానీ తక్కువ కూలీకే పని చేస్తారని ఏమీ లేదు... పదేళ్ళ క్రితం రోజుకి 50 రూపాయల కూలీ అయితే వ్యవసాయ పనులకి అది ఇప్పుడు 150 నుండి 200 ఉంటుంది. (కోస్తా జిల్లాల్లో) గ్రీమీణ ఉపాధి వచ్చినతరవాత 300 వందలిస్తామన్నా చెయ్యడం లేదు... ఎందుకంటే తక్కువ పనికే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, దానితో పోల్చి కూలీని ఇంకా పెంచాలని... అదంతా నగదు బదిలీకి సంభంధం లేని సమస్య... అలాంటి గ్రామీణ ఉపాధి(చవకబారు) హామీ లేకపోతే, 200 నుండి 300 రూపాయలు తీసుకుని కూలీ పని చేస్తారు...

నగదు బదిలీ ద్వారా వాళ్ళకి భరోసా వస్తుంది.. కూలీ మీద ఆధారపడకుండా పిల్లలకి తిండి, వైద్యం, విద్య కల్పించవచ్చని... పథకం గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పుడు చుక్కా రామయ్య గారు ఈ పథకం మంచిది ఇది చాలా అవసరం అన్నారు, రాజకీయాలకతీతంగా దీన్ని సమర్ధించాలన్నారు... ఆ తరావాత నందన్ నీలేకని విశ్లేషిస్తూ చంద్రబాబు కి రాసిన ఉత్తరం చదివాను, అందులో కూడా మంచిదే అన్నారు... ఇంకా నిన్న అప్పా అనే స్వచ్చంద సంస్థ, రోజూ కూలీ కన్నా నిర్ణీత ఆదాయం ఉన్న వాళ్ళే మెరుగైన జీవనం గడుపుతున్నారు.. నగదు బదిలీ వల్ల చాలా ప్రయోజనాలు నెరవేరుతాయి అని... ఈరోజు అరున్ షౌరీ నగదు బదిలీ సమంజసమే అన్నారు... ఆ ముగ్గురు వ్యక్తులూ నేను గౌరవించి నమ్మే వ్యక్తులే, మేధావులు...

నెల నెలా అదాయం లేని ఎన్నో కుటుంబాలని ( సామాజిక వర్గాలకతీతంగా) చూసాను... నరసరావు పేట లాంటి ప్రాంతాల్లోని పల్లెటూల్లోనే ఐదెకరాల పొలం ఉన్నా, ప్రభుత్వ భంట్రోతు కి ఉన్న ఆర్ధిక, ఆరోగ్య భద్రత లేని కుటుంబాలు నాకు తెలుసు... ప్రస్తుత మాంద్యపు వాతావరణంలో ఇది అత్యవసరం... ఈ పథకం మూడు నుండి ఐదేళ్ళు అమలయితే చాలా జీవితాల్లో మార్పు వస్తుంది... ఆ తరవాత కూడా అమలయితే, వచ్చే తరపు సగటు ఆరోగ్యం, విద్యార్హతలు మెరుగుపడతాయి...

దీనితో పాటే ప్రజల్లో ఉత్పాదకత పెంచే చర్యలు తీసుకోవాలి... వాళ్ళకి శిక్షణ, ఉపాధి హామీ ద్వారా సంపాదనా మార్గాలు పెంపొందించాలి...

Praveen's talks said...

ప్రొడక్టివిటీ లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా ఇంటర్నెట్ కేఫ్ లో DTP ఆపరేటర్ కి నేనిచ్చే జీతం 1500. DTP వల్ల నాకు నెలకి వచ్చే ఆదాయం 3000. ఇతర పనులు నేనొక్కడినే చేస్తాను. ఆ పనులు చెయ్యడానికి నాకు అసిస్టంట్స్ లేరు కాబట్టి ఆ పనుల వల్ల వచ్చే ఆదాయంలో వాటా ఎవరికీ ఇవ్వలేను. DTPకి మాత్రమే ఒక అసిస్టంట్ ఉండడం వల్ల DTP వల్ల వచ్చిన డబ్బులలో కొంత భాగాన్ని జీతంగా ఇస్తున్నాను. ఊరికే కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి ఫ్రీగా ఇచ్చేస్తే ఎవరూ పని చెయ్యరు.

oremuna said...

ప్రవీణ్,

ఎర్ర ఝండాలు పట్టుకోని తిరగటం కాదు.
ముందు నీ దగ్గర పని చేసే వాళ్ల శ్రమ దోపిడీ ఆపు. నెలకు 1500! కూలికి వెళ్లినా అంతకంటే ఎక్కువ వస్తాయి కదా.

ఇంతకీ పార్ట టైమా? ఫుల్ టైమా ?

Praveen's talks said...

ఆమె చేసేది పార్ట్ టైమ్ జాబే. పదిహేను వందలకి ఫుల్ టైమ్ జాబ్ చెయ్యడానికి ఎవరూ రారు. నేను ఇతర పనులు చేస్తుంటాను, DTP వర్క్స్ మాత్రం DTP ఆపరేటర్ చేతే చెయ్యిస్తుంటాను. యజమానుల్లోనే కాదు, క్లైంట్స్ లో కూడా పేరాసైట్స్ ఉంటారు. ఒక NGO వాడు వచ్చి తన NGO కోసం ఒక వెబ్ సైట్ డిజైన్ చెయ్యమన్నాడు. కేవలం డిజైనింగ్ (హోస్టింగ్ కాకుండా) ఆరు వేలు అవుతుందని చెప్పాను. అతను మరీ కక్కుర్తికి పోయి రెండు వేలుకి చెయ్యమన్నాడు. సాధ్యం కాదని చెప్పాను. అతను హైదరాబాద్ వెళ్ళి చెయ్యించుకుంటానన్నాడు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి అతనికి ట్రైన్ చార్జిలు ఎంత ఖర్చవుతాయో, వెళ్ళిన తరువాత అక్కడ హొటెల్ చార్జిలు ఎంత ఖర్చవుతాయో నాకు తెలుసు కాబట్టి అతన్ని వదిలేశాను. ఆ NGO వాడి లాగ ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగేసే రకం మనుషులు కొందరిని చంద్రబాబు నాయుడు చూశాడు కాబట్టే అలాంటి అమాయకుల్ని బుట్టలో వేసుకోవడానికి మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టాడు.

గీతాచార్య said...

@praveentalks,

Cool.

phani raja sekhar said...

Sujatha mam hats off to your dare.what you said about the yellow C.M that is the right.

సూర్యుడు said...

తా మెచ్చింది రంభ, తా ములిగింది గంగ

మనకందరికీ ఏదో ఒక రాజకీయ పార్టీ నచ్చుతుంది, దాన్ని సమర్ధించటానికి ఓపికున్నవాళ్లు పుస్తకాలు వ్రాసేయగలరు. నచ్చనిదాన్ని ఏది చేసినా (రంధ్రాన్వేషకులు) చీల్చి చెండాడగలరు.

ఏ పార్టీ వచ్చినా చేసేదొకటే, నాకు పెద్దగా తేడా కనిపించలేదు. దోచుకునేవాళ్లు అస్మదీయులా, తస్మదీయులా అనేది మారుతుంది, అంతే ;)

HRUDAYA said...

మీ బ్లాగు గురించి ఈనాడు పత్రికలో చదివి....చూడటం జరిగింది....ముందుగా మీరు రాసిన 'సోమరితనానికి హామీ' ఆర్టికల్ నే చదవటం జరిగింది....దానిపై నా అభిప్రాయం చెబుదామని అనిపించి ..
ముఖ్యంగా మన రాష్ట్రం లోనే వ్యక్తి వాదం అనేది విపరీతంగా పెరిగి పోయింది....ఇంతకు ముందు గ్రామాల్లో మా ఊరికి ఏం చెస్తారు అని అడిగే ధొరణి నుంచి ప్రస్తుతం నాకు వ్యక్తిగతంగా ఏం ఇస్తావ్ అని అడగటం ప్రారంభం అయ్యింది.....ప్రజలు సమూహాలకు సంబంధించిన సమస్యల పట్ల స్పందించకుండా ఉంటె ఎవ్వరికి లాభం ఆలోచించండి....అందుకె చాల ముందు నుంచే అన్ని ప్రభుత్వాలు చాల తెలివిగా ఈ వ్యక్తిగత లబ్ది పొందే పథకాలను యెప్పటినుండో ప్రవేశ పెట్టయి....రెండు రూపాలకు కిలో బియ్యం దగ్గర నుంచి ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వరకు అన్ని వ్యక్తికి లబ్ది చేకూర్చేవే.....
ఈ రకంగా ప్రజలను మభ్య పెట్టి ,వారి దృష్టిని మళ్ళించి ఈ రొజు అందరు కలసి తమ ఉమ్మడి సమస్యల పైన కలసి ఉద్యమించని విధంగా తయారు చెయ్య బడ్డారు....ప్రజలు యెన్నడూ సోమరి పొతులు కారండి....ఈ ప్రభుత్వాలు ఇచ్చే నామ మాత్రపు సహాయం తొ వాళ్ళేమి రెండు పూటల తిండి కూడా తినడం లెదు.....వాళ్ళను అలా తయారు చెయ్యటానికి పని చెస్తున్న వాళ్ళ తెలివి తెటలను చూస్తే మనం చాల ఆశ్చర్య పోతాం.....ఏం నష్టం జరుగుతుందో తెలెసే లోపల ..మహా విధ్వంసం జరిగి పొతున్నది....ఈ రోజు ఏన్ని సమస్యలున్నయి అందరికి ఉమ్మడిగా...కాని ఎక్కడ కలసి పని చేస్తున్నం చెప్పండి....దీని వల్ల ఎవ్వరికి లబ్ది చేకూరుతున్నది ...నీళ్ళు రావు,కరెంట్ ఉండదు, అభివ్రుద్ధి పేరిట భూమి లాక్కుంటారు......విద్య ,వైద్యం అందుబాటులొ ఉండవు, ధరలు విపరీతంగా పెరిగి పొతాయి.....అయినా ఎవ్వరు కూడా సమూహంగా వీటి పై నిలదీద్దాం అని ముందుకు రారు.....ఇలా తయారు చెయ్యబడ్డారు ప్రజలు....మీరు చెప్పిన 2000 ల పథకం వీటన్నిటికి పరాకాష్టగా చెప్ప వచ్చు.....ఈ రోజు రాష్ట్రం లో అభివృద్ధి పేరిట దాదాపు కోటి మంది నిరాశ్రయులయ్యారు...కాని విచిత్రం ....దీని పట్ల కనీస ప్రతిఘటన కూడా లేక పోయింది మన దగ్గర...ఇలాంటి స్థితి తీసుకు రావడానికి ఎంత "కష్ట పడ్డారొ" కదా మన పాలకులు...!...

Praveen's talks said...

అదేదో సినిమాలో కమీడియన్ అంటుంది "మేము ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగేస్తాం" అని. అలాంటి వాళ్ళు కొందరైనా లేకపోతే చంద్రబాబు నాయుడు మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టడు.

Praveen's talks said...

ఉచిత డబ్బులు స్కీమ్ ని జనం నమ్మలేదు. బియ్యం ధరలు, పప్పుల ధరలు తగ్గించడం చేతకానివాడు ఫ్రీగా డబ్బులు ఇవ్వగలడంటే ఎవరు నమ్ముతారు? కొన్ని చోట్ల తెలుగు దేశం కార్యకర్తలు జనాన్ని నమ్మించడానికి దొంగ బ్యాంక్ అప్లికేషన్ పత్రాలు ముద్రించి జనం చేత అప్లికేషన్లు నింపించారు. మరి కొన్ని చోట్ల దొంగ ATM కార్డులు కూడా పంచారు. అయితే కాంగ్రెస్ ఇరిగేషన్ ప్రోజెక్టుల అజెండాతో ముందుకి వెళ్ళడం వల్ల గెలిచింది. ఫ్రీ డబ్బులు స్కీమ్ ని జనం అంత సులభంగా నమ్మరు అని ఋజువైయింది.

Post a Comment