May 19, 2009

పాత పేపర్లతో పసి పిల్లలకు జీవితం!

పొద్దున్నే ఈనాడు పేపరు చూడకపోతే నాకు కాఫీ కూడా తాగాలనిపించదు. ఎంత చెత్తగా వార్తలు రాసినా సరే! దాని తర్వాత   Economic Times, Times of India, ఇవి కాకుండా ఆదివారం ఎడిషన్ కోసం ఆదివారం ఆంధ్ర జ్యోతి, సాహిత్యం పేజీ కోసం సోమ వారం సాక్షి..ఇలా నెల తిరిగే సరికి మా ఇంట్లో బస్తాడు పేపర్లు తయారవుతాయి. ఏం చెయ్యాలి వాటిని? "ఏం చెయ్యడమేం? అమ్మి పారెయ్యొచ్చుగా?" అంటారా!


నిజమే, కానీ చెప్పిన టైముకు డ్రెస్ కుట్టి డెలివరీ ఇచ్చే టైలర్ ని కానీ, పాత పేపర్లు సరిగా తూచే పేపర్ వాడిని కానీ మీరెక్కడైనా చూశారా? నేనైతే ఇంతవరకూ చూళ్ళేదు. కనీసం 30 కిలోల పేపర్లను కళ్లెదురు గానే పేపర్ల వాడు 10 కిలోలు లేక అంతకంటే తక్కువగా చూపించిన సందర్భాలు కోకొల్లలు.



దీన్ని ఒప్పుకోలేక నేను పాత పేపర్లను నెల నెలా మా పనమ్మాయి లక్ష్మికి ఇచ్చేయడం మొదలెట్టాను.'ఎన్ని కిలోల పేపర్లైనా ఎలాగూ అతడు తక్కువగానే తూస్తాడు. ఆ వచ్చే డబ్బులు ఆ అమ్మాయి తీసుకుంటుంది, ఇలాగైనా డుమ్మాలు కొట్టకుండా ఉంటుం'దనే ఆశతో!ఆ పిల్ల లైట్ తీసుకుందనుకోండి.


కొద్ది రోజులు ఇలా గడిచాక మా వాచ్ మన్ కి ఈ విషయం తెలిసింది."ప్రతి నెలా లక్ష్మికేనా మేడమ్, ఈ నెల నాకివ్వండి" అని అడిగాడు. సరే తీసుకోమని ఇచ్చేశాను.


ఇంకేముంది? ఆ రోజు సాయంత్రం కింద పెద్ద గొడవ వినపడి ఏమిటా అని కారిడార్ లోకెళ్ళి తొంగిచూస్తే లక్ష్మి, వాచ్ మన్ దెబ్బలాడుకుంటున్నారు.పేపర్ల గురించే అని అర్థమై సర్ది చెప్దామని కిందకెళితే

 "ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోతే తీసుకునే వాళ్లకుండాలి" అని లక్ష్మి నన్ను,వాచ్ మన్ ని కలేసి తిట్టింది.
 వాచ్ మన్ కూడా తగ్గకుండా  "మరదే, ఇచ్చే వాళ్లకు లేని నొప్పి నీకేంటి మధ్యలో"
అని నన్ను లక్ష్మి ని కలిపి చీవాట్లేశాడు.

అదండీ సంగతి!రెండు వైపులా నాకే తిట్లు, ఉత్త పుణ్యానికి పేపర్లు ఇచ్చి మరీ!

ఈ నేపధ్యంలో నాల్రోజుల క్రితం ఒక చిన్న బుక్ లెట్ చూశాను. అది Hyderabad Council of Human Welfare కి సంబంధించింది. ఇదొక స్వచ్ఛంద సంస్థ!వీధి బాలల పునరావాసానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థ! వీధి బాలలని, ఇతర దుర్భర పరిస్థితుల్లో ఉన్న పిల్లని వీళ్ళు తమ కార్య కర్తల ద్వారా గుర్తించి వారిని చేరదీస్తారు. ఒక తాత్కాలిక హోమ్‌లో వారికి నీడనిచ్చి తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే దిశగా వారికి చదువు సంధ్యలను కల్పిస్తారు. కౌన్సిలింగ్ ఇస్తారు. మానసిక వికాసానికి తగిన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తగిన వృత్తిని చేపట్టి, సమాజంలో గౌరవనీయ జీవితాన్ని గడిపే విధంగా వారికోసం పని చేస్తుందీ సంస్థ!పట్టణాల్లో ఉండే మురికివాడల్లోని స్త్రీలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవన స్థితిగతులను మెరుగుపరచే దిశగా కూడా HCHW పని చేస్తోంది.



వీరికీ పాత పేపర్లకీ సంబంధం ఏమిటనేగా ప్రశ్న!


ఈ సంస్థ ఇప్పటివరకూ శ్రేయోభిలాషులు, సహృదయుల విరాళాలతో నడుస్తోంది. అందువల్ల ఈ సంస్థ ఒక వినూత్న పద్ధతిలో విరాళాలు సేకరించాలని తలపెట్టింది. పాత వస్తువులను సేకరించడం.మన ఇంట్లో పోగుపడిన పాత వార్తాపత్రికలు, మాగజైన్లు,ఆటవస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్ మొదలైన వస్తువులను వీళ్ళు మన ఇంటికి వచ్చి సేకరిస్తారు. వాటిని రీ సైక్లింగ్ యూనిట్స్ కి పంపి తద్వారా వచ్చే డబ్బుని పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారు. హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతాలకు మాత్రమే ఇది  పరిమితం!


దీనికోసం ఈ సంస్థ ఆటో డ్రైవర్ని పంపిస్తుంది. అతడు మన ముందే మన ఇంట్లోని పాత పేపర్లను తూకం వేసి రిజిస్టర్ లో నమోదు చేసి మన సంతకం తీసుకుని (దుర్వినియోగం కావని మనకు నమ్మకం కలిగేందుకు) మరీ వాటిని తీసుకెడతాడు. నెల నెలా లేదా రెండు నెలలకోసారి....ఇలా ఇవ్వవచ్చు!ఎప్పుడైనా వారి రికార్డులను మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ పనంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.

ఇలాంటి సంస్థలకు సాయం చేయాలని మనసున్నా, ఒకోసారి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు! ఇంట్లోని పాత వస్తువులను వారికి డొనేట్ చేయడం ద్వారా కూడా వారికి సాయపడవచ్చని తెలిశాక అనేకమంది ముందుకువచ్చి ఈ సంస్థను ఆదరిస్తున్నారు, తద్వారా వీధి బాలల ను కూడా!


ఇటువంటి పనిలో పాలుపంచుకోవడం,పనికి రాని పాత వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయడం ...ఒక చిన్న కన్ సర్న్!
ఈ నెల నుంచి మా ఇంట్లో పాత న్యూస్ పేపర్లు,మాగజైన్లు,ఆటవస్తువులు,ఇంకా ఇతరాలు వీళ్లకే! మీరూ చేయికలపాలనుకుంటే వారి వెబ్ సైటు చూడండి.
http://www.hchw.org/

వారి ఫోన్ నంబర్లు 040-23526554 ,040-65505827

ఇలా చేశాక, ఒక చిన్న మంచి పని చేశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే చూడండి మరి!

25 comments:

శ్రీనివాస్ said...

వారు మాత్రమే కాదు యామిని ఫౌండేషన్ శ్రీనివాస్ గారు కూడా పాత పేపర్స్ తీసుకుంటారు ఆ డబ్బుతో వాళ్ళ ఫౌండేషన్ నడుపుకుంటారు.

ఈవిధం గా అయినా కొందరికి సాయం చేసే అవకాశం వస్తుంది

శేఖర్ పెద్దగోపు said...

చాలా మంచి విషయం గురించి చెప్పారండి. అభినందనలు.

సిరిసిరిమువ్వ said...

మంచి విషయం గురించి చెప్పారు, ధన్యవాదాలు.

Kathi Mahesh Kumar said...

హ్మ్ మంచి ఆలోచన. మంచి సమాచారం. అభినందనలు.

అనిర్విన్ said...

నాకు భయంగానే ఉంది, రాసేవాళ్ళకు బుద్ది లేకపోతే చదివేవాళ్ళకు లేదా అని మీ లక్ష్మి మమ్మల్ని దులిపేస్తుందేమో!

శ్రీనివాస్ పప్పు said...

మాదీ ఓ చెయ్యి కలుపుతామండీ..ధన్యవాదాలు తెలియచేసినందుకు...

Ramani Rao said...

ఇదేదో బాగుందే.. మా ఇంట్లో పాత సామాన్లు ఎక్కువండీ బాబు. ఫోన్ చేసి చూస్తాను. థాంక్స్ సుజాతగారు. మంచి విషయం చెప్పారు.

మేధ said...

చాలా మంచి ఆలోచన.. తెలియజేసినందుకు ధన్యవాదాలు.. ఇలాంటిది, బెంగళూరు లో కూడా వస్తే బావుండు.. మా ఇంట్లో కూడా అటూ-ఇటూ గా అడే పరిస్థితి.. :)

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

మంచి సమాచారం. మా ఇంట్లో కూడా 5 కిలోల పేపర్లు ఉన్నాయి. చిన్న పని అయినా మంచి పని చేసాం అన్న సంతృప్తి మిగులుతుంది.

Shashank said...

ఇలాంటి ఒక సంస్థ ఉందని నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళకి చెప్త. వీధి బాలలకు ఇలంటి మంచి చేస్తున్నారంటే వాళ్ళకి జోహార్లు.

భావన said...

చాలా బాగుందండి ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ లాగా అక్కడ కూడా అన్నమాట.. బాగుందన్నందుకు మీ లక్ష్మి " రాసే వాళ్ళకైనా వుండాలి దాన్ని బాగుందనే వాళ్ళకైన వుండాలి బుద్ది" అని దులిపి పెడుతుందేమో..

వేణు said...

హైదరాబాద్, సికిందరాబాద్ ల్లో 40 వేల మంది పిల్లలకు వీధులే నివాసాలని తెలిసి, ఎంత బాధగా ఉందో! ఈ సంస్థ వెబ్ సైట్లోని కంటెంట్ తెలుగులో కూడా ఇవ్వగలిగితే ఇంకా ప్రయోజనం ఉంటుంది.

ఇలాంటి సంస్థల సేవాకార్యక్రమాలు వీధిబాలలకు ఎంతో కొంత సాయపడతాయనటంలో సందేహం లేదు. ఈ వీధిబాలల సమస్యకు మూలాలు సమాజంలో ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవటం ముఖ్యం.

భావన said...

చాలా బాగుందండి ఇక్కడ సాల్వేషన్ ఆర్మీ లాగా అక్కడ కూడా అన్నమాట.. బాగుందన్నందుకు మీ లక్ష్మి " రాసే వాళ్ళకైనా వుండాలి దాన్ని బాగుందనే వాళ్ళకైన వుండాలి బుద్ది" అని దులిపి పెడుతుందేమో..

పానీపూరి123 said...

good info...

Anil Dasari said...

సాల్వేషన్ ఆర్మీ లాంటి ఐడియా అన్నమాట. బాగుంది.

మీరు చెప్పిన సంస్థవాళ్లు పాత పేపర్లే కాక పాత వస్తువులూ తీసుకుంటారన్నట్లున్నారు. కొందరు వ్యాఖ్యాతలు గమనించినట్లు లేరు. టపా శీర్షిక ప్రభావం :-)

sunita said...

అలాగే పాత ఫ్రాకులు,దుప్పట్లూ, యెల్లారెడ్డి గూడాలో స్టేట్ హోంలో తీసుకుంటారు. అక్కడ అనాధపిల్లకోసం.

Anonymous said...

"ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోతే తీసుకునే వాళ్లకుండాలి" అని లక్ష్మి నన్ను,వాచ్ మన్ ని కలేసి తిట్టింది.
వాచ్ మన్ కూడా తగ్గకుండా "మరదే, ఇచ్చే వాళ్లకు లేని నొప్పి నీకేంటి మధ్యలో"
తిట్లు బాగా తిన్నా మంచి సమాచారం అందిచ్చారు..

ఈవిధం గా అయినా కొందరికి సాయం చేసే అవకాశం వస్తుంది...అభినందనలు.

పరిమళం said...

చాలా మంచి సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు సుజాతగారు..

Bhaskar said...

Thank you so much for the idea

ప్రియ said...

చాలా గొప్ప విషయం చెప్పారు. నాకా అవకాశం లేకుండా చూసి. ;-)

చాలా రోజులైంది ఇటు వచ్చి. మొత్తం చూస్తానిప్పుడు.

Unknown said...

Thanks Sujatha garu :)

రాఘవ said...

పాత పేపర్లు ఎమో కాని దాదాపు 1,2 సంవత్సరాల కిందట ఈనాడు ఆదివారం బుక్ లో హైదరాబాద్ అశోకనగర్ లోని civils training institutes గురించి coverpage story వచ్చింది ఆ ఎడిషన్ కోసం వెతుకుతున్నా can any body help me in dis context..??

గీతాచార్య said...

.










We have no chance. :-(D

సుజాత వేల్పూరి said...

రాఘవ గారు, నాకో మెయిల్ కొట్టండి .gulabi98@gmail.com కి!

మాలతి said...

బాగుంది. మరి లక్ష్మీ, వాచ్ మన్ వూరుకున్నారా ఇలా వేరేవారికి పాతపేపర్లు ఇచ్చేస్తే. మరో సందేహం, స్వయంగా అచ్చేసుకున్న పుస్తకాలు కూడా చెల్లకపోతే ఇలాగే ఇచ్చేయొచ్చేమో :)

Post a Comment