June 17, 2009
క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!
వేసవి సెలవులు ముగుస్తుండగా మా కాలనీలో మాకు ఒక అద్భుతమైన అయిడియా వచ్చింది.
ఇక కొద్ది రోజుల్లో పిల్లలు ఎలాగూ స్కూళ్ళకు బయల్దేరతారు "Happy days are here again" అని పాడుకుంటూ! ఇప్పటికీ సమ్మర్ కాంపులతో బిజీగానే ఉన్నారు. కాసింత సరదాలూ, పాడూ ఏమీ లేకుండా అయిపోతున్నాయి వీళ్ళ జీవితాలు..అని కళాత్మకంగా ఒక క్విజ్ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నాం! (ఇల్లాంటి కళాత్మకాలోచనలు(సవర్ణ దీర్ఘ సంధి) నాకే వస్తాయని వేరే చెప్పాలిటండీ)!
ఈ ఆలోచన బయట పెట్టగానే పెద్దవాళ్లంతా
"మాకూ ఉండాల్సిందే క్విజ్! ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఉండేవి క్విజ్ లు! అంతకు ముందు సిద్దార్ధ బసు రోజుల్లో! మేమూ పాల్గొంటాం సీనియర్లు, జూనియర్లు,సబ్ జూనియర్లు ఇలా కేటగిరీలు ఉండాల్సిందే" నన్నారు.
మాకూ సరదా వేసి ఒప్పేసుకున్నాం! పేపర్ సెట్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు(పిల్లలకు మినహాయింపు) క్విజ్ లో పాల్గొనే అవకాశం లేదు. పదిమంది తెలివైన మేధావులు(ఇదేదో దుష్ట సమాసంలాగా ఉంది) కూచుని ప్రశ్నలు తయారు చేశాం. ఒక్కొక్కళ్ళూ సిద్ధార్థ బసు, అనితా బసుల్లాగా ఫీలవుతూ జాగ్రత్తగా ప్రశ్నావళి తీర్చి దిద్దాము!
ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉండగా క్విజ్ టైమూ, ఇండియా క్విజ్ కార్యక్రమాలు దూరదర్శన్లో వచ్చేవి చూడండి. సిద్దార్థ బసు నేతృత్వంలో! రాత్రి తొమ్మిదయ్యేసరికి హైదరాబాదు దూరదర్శన్ కార్యక్రమాలకు అసలు సేల్సు ఉండేవా బుధవారం రోజు?(బుధవారమేనా ఇంతకీ) అయినా మనవాళ్ళు ఎనిమిదిన్నరకే "Over to Delhi" అనే పాత బోర్డు పెట్టేసి చాపలు చుట్టి దుకాణం సర్దేసేవాళ్ళుగా? పిల్లలూ, పెద్దలూ అందరూ క్విజ్ టైమ్ కోసమే వేయికళ్ళతో ఎదురు చూస్తుండేవాళ్ళు. సిద్దార్థ బసు, పక్కనే చక్కని చిరునవ్వుతో ,మార్కులు వేస్తూ అనితా బసు..! ఒక్కోసారి సిద్ధార్ధ బసు స్థానంలో ఇంగ్లీషు వార్తలు చదివే భాస్కర్ భట్టాచార్జి క్విజ్ మాస్టర్ గా వచ్చేవాడు. ఆయన కర్లింగ్ హెయిర్ భలే ఉండేది.పిల్లలు సరైన సమాధానం చెప్పగానే భాస్కర్ చాలా స్టైలుగా "కొఱ్ఱెక్ట్"అనేవాడు గుర్తుందా?, "కరెక్ట్"అనడానికి! నాకైతే ఏ క్విజ్ ప్రోగ్రాం చూసినా క్విజ్ మాస్టర్ భాస్కర్ భట్టాచార్జి అంత సొగసుగా "కరెక్ట్"అనేవాళ్ళు ఆ తర్వాత ఇంతవరకూ కనపళ్ళా!
ఆ క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలు ఎక్కడినుంచి వచ్చేవాళ్ళో కానీ మెరికల్లాగా ఎంతటి ప్రశ్నలకూ ఇట్టే జవాబులు చెప్పేవాళ్ళు కాదూ! (అప్పుడూ సరిగ్గా ఇదే అనుకునేవాళ్లం)క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నల్ని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవడం, మర్నాడు కలిసిన స్నేహితులతో కలిసి వాటి జవాబులు అందరూ ఒకటే రాశారా లేదా అని సరి చూసుకోడం, ఒక ఫైలు తయారు చేయడం ఇదో పెద్ద అసైన్మంట్!
మా వూర్లో అందరూ చదువు,కళల పట్ల బోలెడంత ప్రేమ, ఆదరణ కలవారవటం చేత వివిధ క్లబ్బులు, కళా సాంస్కృతిక సంఘాల వాళ్ళు ఎప్పుడూ వ్యాసరచన,వక్తృత్వం,క్విజ్ పోటీలు పెట్టి యధాశక్తి మాకు బహుమతులిచ్చేస్తూ ఉండేవాళ్ళు.
ఒకసారి పది టీముల్తో హోరాహోరీ తలపడి చివరికి మిగిలిన రెండు టీముల్లో ఒకటి మా స్కూలు! ఒక్క ప్రశ్నా అవతలి టీముకు పోకుండా జాగ్రత్తగా జవాబులు చెప్పి ఇక్కడ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి రెండు టీములూ! మరి కాసేపట్లో బహుమతి ప్రదానం కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా వచ్చి ఉన్నారు. విజయాన్ని నిర్ణయించే చివరి రౌండ్ ప్రశ్న ఆయన్నే అడగమంటే ఆయన చాలా స్పాంటేనియస్ గా అవతలి టీము వైపు చూస్తూ
"నలుగురు పద్మశ్రీలు ఉన్న తెలుగు సినిమా పేరు చెప్పండి"అనేసి కూచున్నారు.
వాళ్ళు ఇటువంటి ప్రశ్న ఎదురు చూడకపోవడంతో పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో లెక్కెట్టే లోపు మాకు టైము కలిసి వచ్చింది. వాళ్ళు చెప్పలేకపోయే సరికి నేను, చిత్ర, రాజకుమారి కూడబలుక్కుని "మాయా బజార్"అని చెప్పేశాం!
(నిజానికి మాకూ కంగారు వేసింది కానీ అంతమంది హేమా హేమీలు ఉన్న సినిమాలో నలుగురు పద్మశ్రీలు ఉండకపోతారా అని చీకట్లో బాణం వేశామంతే! ).
ఆయన చల్లగా "తప్పు" అన్నారు.
"తెనాలి రామకృష్ణ రైటాన్సరు! రామారావు, నాగేశ్వర్రావు,భానుమతి, నాగయ్య..నలుగురు పద్మశ్రీలు"అని జవాబు కూడా చెప్పారు.
మళ్ళీ "టై" అని నీరసం వచ్చింది.
కానీ మాకు వెంటనే ఒక గొప్ప లాజిక్కు దొరికి "మేం ఒప్పుకోం! మీరు నలుగురు పద్మశ్రీలు "ఉన్న" తెలుగు సినిమా అన్నారు కానీ "నటించిన"అన్లేదు.అందుకని మేము రామారావు, నాగేశ్వర్రావు, రేలంగి,ఘంటసాల"అని లెక్కేశాం! ఘంటసాల సినిమాలో నటించకపోతేనేం, ఉన్నారా లేదా"అని వాదించాం ఉత్సాహంగా!
"నిజమే కదా" అన్నట్లు చూశారు నిర్వాహకులు ప్రైజు మాకే ఇచ్చేయలనే ఉత్సాహంతో! ప్రొఫెసర్ గారు మా లాజిక్ మెచ్చుకుని (మనసులో మాత్రం "వీళ్ళ మొహాలు ఈడ్చా! నా కొశ్చెన్ కే ఎదురా?" అనుకుంటూ)బహుమతి మాకు ప్రకటించారు. అలాంటి క్విజ్ లు ఎన్నో, లెక్కేలేదు. మా స్కూలు హెచ్చెమ్ రూములో మేం సంపాదించిన షీల్డులు లెక్కెట్టాలంటే ఒక పూట పడుతుంది.
మా కాలనీ క్విజ్ లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మరీ పేదగా అంటే పూర్ గా ఉందని చెప్పక తప్పదు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలంటే
"జపాన్ దేశం కరెన్సీ ఏది"
"ఈ రోజున డాలర్ కెన్ని రూకలు?గుప్పెడేనా?"
"
NDTV profit ఛానెల్లో పొద్దున్న ఎనిమిదింటికి వచ్చే అనలిస్ట్ ఎవరు?"
అని అడుగుతామేమో అనుకుని బాగా ప్రిపేర్ అయి వచ్చారు. కానీ పేపర్ సెట్టర్ ఎవరు మరి?అందుకే
"మీ దగ్గర్లోని పోస్టాఫీసు ఎక్కడుంది?"
"వోటర్ ఐడీ కార్డులకు ఎక్కడ అప్లయి చేయాలి"
"కరెంట్ బిల్లు కరెంటాఫీసులో కట్టాలా? ఈ-సేవా లోనా"
"సమీపంలో ఈసేవా కేంద్రం ఎక్కడుంది?"
"ఇక్కడినుంచి సికిందరాబాదు వెళ్ళు సిటీబస్ నంబర్ ఎంత"
"దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రి చిరునామా చెప్పుము"
"మోర్ సూపర్ మార్కెట్లో సోనా మసూరి రైస్ కిలో ఎంతకు దొరుకును?"
"మాదాపూర్ ఆంధ్రా బాంక్ శాఖ కొండాపూర్ లో ఎందుకుందో తెలుసా?(నల్లకుంట పోలీస్ స్టేషన్ అడిక్ మెట్ లో ఉన్నట్లు)
"రోజుకు టాంకర్ రు. 400 చొప్పున నెలకు 78 టాంకర్లు నీళ్ళు తెప్పిస్తే ఒక్కో ఫ్లాట్ కి ఎంత బిల్లు పడుతుంది?"
"మొబైల్ ఫోన్ చూడకుండా, మీరు గుర్తుంచుకున్న ఒక అయిదు ఫోన్ నంబర్లు చెప్పండి"
వంటి ఎదురు చూడని ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, కనిష్టమార్కులు తెచ్చుకుని దారుణంగా ఫెయిలై పూడ్చారు.
ప్రేక్షకుల్లోని వాచ్ మన్ లు మాత్రం ఈ ప్రశ్నలకు కు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా జవాబులు చెప్పేసి ప్రోత్సాహక బహుమతులు గెల్చుకుని ఇకపై తమను కూడా టీముల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రెండో మాట లేకుండా వాళ్ల డిమాండ్ ని అంగీకరించేశాం!
ఇకనుంచి వీలున్నపుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలని అనుకుంటూ ఆ సరదా నుంచి తేరుకోకముందే కొంపలు మునిగినట్లు మొన్న సోమవారం నుంచీ స్కూళ్ళు మొదలు! వీపున బస్తాలతో హమాలీల్లాగా పిల్లలు తయారు!
June 5, 2009
అలీస్క!ఎక్కడైనా కనపడిందా మీకు?
స్కూలు తెరిచే రోజులు దగ్గర పడ్డాయి కదాని నిన్న సంకీర్తన పుస్తకాల షెల్ఫ్ సర్దుతోంటే పైనుంచి జారి పడిందొక పసుపు పచ్చ అట్ట పుస్తకం! తిప్పి చూసి ఎంత ఆనందాశ్చర్యాల్లో మునిగానంటే ఆ పుస్తకం ఎవరికో ఇచ్చి మర్చిపోయాననో, ఎక్కడో పోగొట్టుకున్నాననో అనుకుంటున్నా ఇన్ని రోజులనుంచీ! మాస్కో "రాదుగ ప్రచురణాలయం" వాళ్ళు 1987 లో ప్రచురించిన "అలీస్క"!
ఈ "రాదుగ" వాళ్ళ పిల్లల పుస్తకాలంటే చాలా ఇష్టం నాకు! వాటిల్లో రష్యన్ నుంచి "ఆర్వియార్" అనువదించినవే ఎక్కువనుకుంటాను. ముఖ్యంగా ఈ పుస్తకాల్లో కథల సంగతి అలా ఉంచి ..వాటిలో బొమ్మలు....మంచుతో నిండిన మాస్కో వీధులూ,వాళ్ళ ఫర్ కోట్లూ,ఆకులు రాల్చే చెట్లూ, ఎర్రటి యాపిల్స్ తో నిండిన తోటలూ, వెడల్పాటి కిటికీలు, ఫైర్ ప్లేసులూ,పెద్ద పెద్ద టీ పాట్ లూ ఇవన్నీ భలే ఉంటాయి. ఒక్కసారిగా పుస్తకంలోంచి వెళ్ళి రష్యాలో వాలిపోవాలనిపించేంతగా! రాదుగ వాళ్ళు వేసిన అనేక పుస్తకాలు ఇప్పటికీ భద్రంగా అన్నయ్య దగ్గర ఉంటాయి. అక్కడికి వెళ్ళినపుడు చిన్నపిల్లలమైపోయి చదువుకోవాల్సిందే గానీ తెచ్చుకుని, మరీ తరచుగా పిల్లకాయలమైపోవడం కుదరదు... వాడు ఇవ్వడు!
"అలీస్క" ఒక గుంటనక్క పిల్ల కథ! పెంపుడు జంతువులతో ఉండే అనుబంధం గురించి ఆర్మీలో పని చేసే ఒక నర్సు ద్రూనినా ఆలిస్ తన స్వీయానుభవాలతో రాసిన చిన్న పుస్తకం ఇది.
అసలు మొదటిసారి నేను చలం "బుజ్జిగాడు" చదివినపుడు ఒక పక్షితో ఇంత అనుబంధం ఎలా పెంచుకున్నారా అని చాలా ఆశ్చర్యపోయాను. దానితో మాట్లాడ్డం, దాని మనసులో భావాలను చదవడం,దాన్ని ఇంట్లో ఒక మనిషిలా చూడ్డం, దాని గురించి ఇంట్లో అందరూ మాట్లాడుకోవడం, కంప్లయింట్స్ చేసుకోవడం చాలా తమాషాగా అనిపించింది.
సరే, అలీస్క విషయానికొస్తే...
ద్రునినా అనే ఒక నర్సు తన పదహారేళ్ల కూతురు అల్యోనాతో కలిసి పెంపుడు జంతువులమ్మే సంత లాంటి ప్రదేశానికి వెళ్తుంది, ఒక కుక్కను తెచ్చుకుందామనే ఉద్దేశంతో! అక్కడ వాళ్ళకు ఒక మూలగా నాగరిక ప్రపంచాన్ని చూసి భయంతో వణుకుతూ కూచున్న ఒక గుంటనక్క పిల్ల కనపడుతుంది. ఎవ్వరూ దాన్ని కొనడానికి ముందుకురారు. అల్యోనా ఒక అల్సేషియన్ కుక్కతో పాటు దాని కూడా ఇంటికి తీసుకెళదామని గొడవ చేయడంతో ద్రూనినా ఆ నక్క పిల్లను కొంటుంది.దానికి అక్కడే "అలీస్క" అని పేరు పెట్టేస్తారు .
ఇంటికొచ్చాక ఇక కష్టాలు మొదలవుతాయి. అది అడవి జంతువు కావడంతో వీళ్ళనెవ్వరినీ "యాక్సెప్ట్" చెయ్యదు. దానిష్టం వచ్చినట్లు అది ఉంటానంటుంది, తింటానంటుంది.అర్థ రాత్రి (నక్క కదా మరి) నానా అల్లరీ చేసి ఆడుకుంటానంటుంది.బాత్ రూములో పెట్టి తలుపేస్తే అక్కడి సకల వస్తువులూ కింద పడేసి సర్వనాశనం చేస్తుంది.అల్సేషియన్ కుక్క "వినీ" తో శతృత్వం ఒకటీ! అలీస్క ఆ ఇంట్లో ద్రునినా ని మాత్రమే విపరీతంగా ప్రేమిస్తుంది. మిగతా వారిని దగ్గరకు కూడా రానివ్వదు.
ఇంటిల్లిపాదీ దానికి తిండిపెట్టడం, స్నానం చేయించడం,జ్వరం వస్తే దానికి తెలీకుండా దానికి మందులివ్వడం,అది పాడు చేసిన వస్తువుల్ని విసుక్కోకుండా సర్దుకోడం ఇవన్నీ ఇష్టంగా ప్రాక్టీస్ చేస్తారు.
ఇక ఇరుగుపొరుగులు వీళ్ళను వింతగా చూడ్డం మొదలుపెడతారు.అడవి జంతువుని, అందునా నక్కను పెంచుతున్నందుకు. అదీగాక దాని ఘాటైన "జూ" వాసన ఇంట్లో అందరికీ పట్టుకుని, బయటికెళ్ళినా వీళ్ళకు ఒక వింత "గుర్తింపు"తెచ్చిపెడుతుంది. భారతీయ మిత్రులెవరో బహుమతిగా ఇచ్చిన అగరొత్తుల్ని ఇంట్లో వెలిగించి కొంత తెరిపిన పడతారు. వాటికి ద్రునినా భర్త "యాంటీ ఫాక్సిన్" (నక్క వాసనకు విరుగుడు) అని పేరుపెడతాడు కూడా!ఇరుగుపొరుగులు అలీస్క గురించి పూర్తినిరసన వ్యక్తం చెయ్యకముందే, అదృష్టవశాత్తూ, వసంత కాలం రావడంతో పల్లెటూళ్ళో ఇల్లు తీసుకుని కొన్నాళ్ళు గడపడానికి ద్రునినా కుటుంబం వెళుతుంది.
అక్కడ అలీస్క కు పూర్తి స్వేచ్ఛ దొరుకుతుంది. పెద్ద ఇల్లు, చుట్టూ చెట్లూ ఇలాంటి వాతావరణంలో అదీ వినీ స్నేహితులైపోతాయి.అక్కడికి వచ్చే ప్రతి చిన్న జంతువుతోనూ అలీస్క స్నేహం చేయాలనే ప్రయత్నిస్తుంది. ద్రునినా తో షికార్లు చేస్తుంది. హాయిగా గడిపేస్తుంది.
ఇంతలో, ద్రునినా కుటుంబం పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది.ఇంతకుముందు జరిగిన అనుభవాల దృష్ట్యా అలీస్కను తీసికెళ్ళే విషయమై ఆలోచనలో పడుతుంది ద్రునినా! చివరికి ఆ ఇల్లుగల ముసలావిడ పాషా మామ్మ సంరక్షణలో అలీస్కను వదిలి ప్రయాణమవుతారు.బోలెడు జాగ్రత్తలు చెపుతారు కూడా!
మూడువారాల తర్వాత తిరిగి వచ్చి చూస్తే అలీస్క ఉండే చిన్న గది ఖాళీ!
"పారిపోయింది జిత్తులమారి నక్క! అబ్బ, ఎంత యాతన పడ్డారు దానితో? అదేమిటీ ఏడుస్తున్నారూ పీడా విరగడైందని సంతోషించక" ఈ ధోరణిలో పాషా మాటలు!
ద్రునినా నిర్ఘాంత పడి, బాధపడి,దుఃఖ పడి, ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాతి వసంత కాలంలో మళ్ళీ పల్లెటూరికి వెళ్ళినపుడు అలీస్క తిరిగి వస్తుందేమో అని ఆశతో చూస్తారు గానీ అలీస్క ఇంకెప్పటికీ తిరిగి రాదు.
పుస్తకం పూర్తయ్యాక అలీస్క ఎక్కడికిపోయిందా అని చాలా సేపు ఆలోచించబుద్ధేస్తుంది.
ద్రునినా ఆ గుంటనక్క పిల్ల మీద ఎంత ప్రేమ పెంచుకుందో వర్ణించే వాక్యాలు పుస్తకం నిండా ఎక్కడబడితే అక్కడ కనపడతాయి.
తన కూతురు అల్యోనా ని అలీస్క దగ్గరికి కూడా రానివ్వకపోవడం చూసి "ఏమో, అల్యోనా వల్ల దానికేమి కష్టం కలిగిందో!అది పచ్చికబయళ్ళలో తిరుగుతున్నపుడు "ఇలాగే ఉండే ఏ పిల్ల అయినా దానిపట్ల కౄరంగా ప్రవర్తించిందేమో"అనుకుంటుంది.
రోగులకు సేవ చేసి అలసి సొలసి ఇల్లు చేరినపుడు, అడుగుల చప్పుడు వినడంతోనే
ఎగిరి తన వొళ్ళోకి దూకి ప్రేమతో చికాకుపెట్టినపుడు ఆమెలో సంతోషం ఉరకలు వేస్తుంది.
గర్వం, స్వాతిశయం, తన మీద తనకు అదుపు, స్వతంత్ర భావన ..ఇవన్నీ అలీస్కలో ద్రునినాకు కనపడతాయి.
అలీస్క కనపడకుండా పోయాక,ఒక తెల్లవారుజామున మంచులో కనపడిన నక్క అడుగుజాడలు చూసి అలీస్క అడుగులేమో అనుకోడానికి కూడా ఆమె మనసు ఒప్పుకోదు.
"అది వేరే జంతువే అయి ఉండాలి.అంతే కావాలి. అంతులేని వొంటరితనంతో చుట్టుపక్కలనే తచ్చాడుతూ ఉండే జంతువుని గురించి ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది. నాకు తప్ప ఎవళ్ళకీ అక్కర్లేని జంతువు. నేను స్నేహం చేసుకోవడం వల్ల,నా బాధ్యత కిందికి వచ్చి,నేను కాపాడలేకపోయిన జంతువు ఒంటరిగా ఉండిపోయిందనే ఊహే భయంకరంగా ఉంటుంది.అలీస్క..ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు. ఎక్కడికి పోయిందో తెలీదు.మార్చి నెలలో ఆ మంచులో పడిన అడుగు జాడలెవరివో నాకెప్పటికీ తెలీదు" అని తనను తాను నమ్మించుకోడానికి ప్రయత్నిస్తుంది.
ఈ పుస్తకం విశాలాంధ్రలో దొరుకుతుందనుకుంటాను ఇప్పటికీ!



