November 30, 2009

ఎన్నో ప్రశ్నలు రేపే "సంస్కార"




సంస్కార అంటే ఇదేదో మనిషి మనసుకో, ప్రవర్తనకో సంబంధించిన సంస్కారం కాదు. ఒక మృతదేహం తాలూకు అంతిమ సంస్కారం! అవును, ఈ నవల అంతా ఒక శవం అంతిమ సంస్కారం చుట్టూనే తిరుగుతుంది.

కన్నడ నవలా సాహిత్యంలో ఒక సంచలనం రేపి గొప్ప అవార్డు సినిమా గా నిలిచిన ఒక గొప్ప నవల "సంస్కార"! .బ్రాహ్మల్లో తరతరాలుగా గూడు కట్టుకు నిలిచిపోయిన పలు ఛాందస భావాలను, మూఢాచారాలను నిశితంగా ప్రశ్నిస్తూనే తాను నమ్మినధర్మాలని  అన్నింటినీ పోగొట్టుకున్నానన్న భావనతో, చేసిన తప్పుని ఒప్పుకోనూలేకా,బ్రాహ్మణత్వానికి దూరమూ కాలేకా రెండు విరుద్ధ ధర్మాల మధ్య నలిగిపోయే ఒక బ్రాహ్మణుడి మానసిక సంఘర్షణకు అద్దంపట్టే నవల.




ఎన్నడో ఎవరో  పూర్వీకులు పెట్టిన ఆచారాలను పాటించడం వల్ల బ్రాహ్మణత్వం నిలుస్తుందా? అవి పాటించని నాడు అది లేకుండా పోతుందా? అన్న మీమాంస ఈ నవల్లో ప్రధానంగా కనపడుతుంది. చదివిన తర్వాత ఒక పట్టాన వదిలిపెట్టదు పాఠకుడిని! కొన్ని వందల ప్రశ్నలని రేపుతుంది.

ఈ నవలా రచయిత యు.ఆర్ అనంతమూర్తి కన్నడసాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ వేత్త,విమర్శకుడు కూడా!.జ్ఞానపీఠ,పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. మైసూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.

స్వయంగా బ్రాహ్మణుడైన అనంతమూర్తి సంస్కార నవల్లో బ్రాహ్మణ మూఢాచారాల్ని చీల్చి చెండాడటం చాలా మందికి   మింగుడుపడకపోయినా నవల మాత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రధారిగా సినిమాగా కూడా రూపొందింది.(నిజానికి ఈ సినిమా చూస్తే మరింత సమగ్రంగా రాయవచ్చనే ఉద్దేశంతో డీవీడీ కోసం ప్రయత్నించాను గానీ బెంగుళూరులో కూడా దొరకలేదు)
                                                  రచయిత అనంతమూర్తి


కర్నాటకలోని తుంగభద్రా నదీ తీరంలోని ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారం దూర్వాసపురంలో నారాయణప్ప అనే బ్రాహ్మణుడి చావుతో ప్రారంభమవుతుంది ఈ నవల. అతడు నవల ప్రారంభంలోనే శవంగా మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది.

అగ్రహారంలో నివశించే బ్రాహ్మణులంతా యుగాలనాటి ఆచారాలను,పద్ధతులను నిక్కచ్చిగా పాటిస్తూ  బ్రాహ్మణ్యాన్ని నిలబెడుతున్నామని,తమ శాఖ కంటే ఇతర శాఖలు తక్కువ వారనే అహంకారంతో, ఇంకా చెప్పాలంటే అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు. తాము ఆ ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారో వాళ్ళు ఆలోచించడానికి  కూడా ఆసక్తి చూపరు. పాటించకపోతే అది తమ సర్వనాశనానికి దారి తీస్తుందని భయం!

కాశీలో వేద వేదాంగాలు చదువుకుని మహాపండితుడైన ప్రాణేశాచార్యుల వారు ఆ అగ్రహారంలో నివశించడం వల్ల ఆ అగ్రహారానికి చుట్టుపక్కల ఎంతో గౌరవం. ఆయన ఇంద్రియాలను జయించి పుట్టుకతోనే రోగిష్టి అయిన ఒక స్త్రీని వివాహమాడి ఆమె సేవలో,వేదపఠనంలో కాలం గడిపే మహాపురుషుడు.

ఇతడికి పూర్తిగా వ్యతిరేకి భోగలాలసుడైన నారాయణప్ప. కుందాపురం నుంచి చంద్రి అనే వేశ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె సేవలోనే కాలం గడుపుతుంటాడు.అంతేనా? జంధ్యం తెంపి అవతల పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పారేస్తాడు.సాయిబుల కుర్రాళ్లని ఇంటికి పిల్చి బాతాఖానీ వేస్తాడు.

దేవాలయ కోనేట్లో చేపలు పట్టినవాళ్ళు రక్తం కక్కుకు చస్తారని అగ్రహారీకుల నమ్మకం! ఆ కోనేట్లో సాక్షాత్తూ బ్రాహ్మణుడైన నారాయణప్ప ముస్లిము లతో కల్సి చేపలు పట్టి తెచ్చి చంద్రితో వండించి భోంచేస్తాడు. దైవ పూజకై అగ్రహారీకులు పూలమొక్కలు పెంచితే ఇతడు మత్తెక్కించే పరిమళంతో మతులు  పోగొట్టే నైట్ క్వీన్ ఇంటిముందు పెచుతాడు.  అగ్రహారపు ఇతర కుర్రాళ్లను కూడా తనమార్గంలోనే పయనించేలా ప్రభావితం చేస్తుంటాడు.

ఒకరోజు ఉదయాన్నే నారాయణప్ప ఇంట్లో ఉన్న వేశ్య చంద్రి ప్రాణేశాచార్యుల వద్దకు పరుగున వచ్చి నారాయణప్ప చనిపోయిన వార్త చెప్తుంది. శివమొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్రమైన జ్వరంతో రాత్రంతా బాధపడి ఉదయాన్నే మరణించాడని చెపుతుంది.

అగ్రహారమంతా ఉలిక్కి పడుతుంది. కులభ్రష్టుడైన నారాయణప్ప దహన సంస్కారాలు , ఉత్తర క్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడాచార్యులు అగ్రహారీకులే! అయినా చంద్రి చేతి వంటనుకూడా తినే నీచుడైన  నారాయణప్ప దహన సంస్కారాలకు వారు ముందుకు రారు.

 బతికున్నపుడు నారాయణప్ప చేసిన అప్రాచ్యపు పనులన్నీ ఒక్కొక్కరూ ఏకరువు పెట్టి అతడిని కాలిస్తే తమకూ పాపం చుట్టుకుంటుందంటారు..!అసలు నారాయణప్ప ప్లేగుతో మరణించాడనీ, అది వేగంగా వ్యాపించే అంటువ్యాధనే తెలీనంత అజ్ఞానం అగ్రహారీకులది.

ఇంతలో చంద్రి వీరందరికీ మతిపోయేలా తన వంటిమీదున్న బంగారాన్నంతా తీసి ప్రాణేశాచార్యుల ముందు కుప్ప పెట్టి,దహన సంస్కారాల ఖర్చులకు వాడాల్సిందిగా కోరుతుంది. ఈ దెబ్బకు తట్టుకోలేని అగ్రహారీకులు తమ సహజ ప్రకృతిని నగ్నంగా  ఆవిష్కరిస్తూ "ఎంత కాదనుకున్నా బంధుత్వం తెగుతుందా? బ్రాహ్మణ్యాన్ని వాడు త్యజించాడు కానీ వాడిని బ్రాహ్మణ్యం వదిలేస్తుందా"అంటూ మాటలు మొదలెడతారు. గరుడా చార్యులు సంస్కారాలకు ఒప్పుకుంటాడేమోఅని లక్ష్మణా చార్యులు, ఇతడు వప్పుకుంటాడేమో అని గరుడా చార్యులు  ఖంగారు పడుతుంటారు.


కొంతమంది కొద్దిదూరంలో ఉన్న పారిజాతపురం అగ్రహారపు స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ సంస్కారాలు చేయమని అడిగి లేదనిపించుకుంటారు  ఇక ప్రాణేశాచార్యులు అడవిలో ఉన్న ఆంజనేయాలయంలో తాను దీక్షలో కూచుంటాననీ, ఆ స్వామి ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందేననీ స్పష్టం  చేస్తాడు.అంతా అంగీకరిస్తారు. 

ఇక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. దీక్షలో కూచున్న ఆచార్యుల వారికి స్వామినుంచి ఎటువంటి సందేశమూ లభించదు. ఈ లోపు ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్రలో స్నానమాడి అరటితోటలో పళ్ళు కోసుకుని అడవికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అపరాహ్నవేళ మరోసారి స్నానం చేసేందుకు  వచ్చిన ప్రాణేశాచార్యుల కాళ్ళమీద పడుతుంది చంద్రి..!

చిత్రంగా, పరమనిష్టా గరిష్టుడు, కఠోర తపస్సంపన్నుడు  అయిన ప్రాణేశుడు జీవితంలో తొలిసారి కలిగిన స్త్రీ స్పర్శ కు లొంగిపోతాడు. చంద్రి పరిష్వంగంలో కరిగి,  ఆమె  అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

ప్రాణేశాచార్యుల వారికి స్వామి సందేశం దొరకలేదని తెలుసుకున్న అగ్రహారీకులు ధర్మస్థల లోని మధ్వ గురువుల మఠాన్ని ఈ విషయంలో సంప్రదించేందుకు వెళతారు. చంద్రి లో తప్పు చేశానన్న అపరాథ భావన లేదు. ఇక అక్కడినుంచి వెళ్లిపోవాలన్న అభిప్రాయంతో ఒక సాయిబుల బండివాడిని బతిమలాడి అర్థ రాత్రి నారాయణప్ప శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అతడిచేతే దహనం చేయించి మాయమవుతుంది.

 ఆ నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్కక్షణం తొట్రుపడినా "ఇతడు ఇప్పుడు బ్రాహ్మడూ కాదు, శూద్రుడూ కాదు. ఇతడొక ప్రాణం లేని శవం" అని సర్ది చెప్పుకుంటుంది. శవం ఉన్న ఇంటికేసి ఎవరూ   పోకపోవడం వల్ల ఈ  విషయం ఎవరికీ తెలీదు.

ఈ లోపు ప్లేగు అగ్రహారంలో వేగంగా వ్యాపిస్తుంది. ప్రాణేశాచార్యుల భార్య మరణిస్తుంది. మఠానికి బయలుదేరిన అగ్రహారీకుల్లో కొందరు మరణిస్తారు.

భార్యను దహనం చేసిన ఆచార్యులు అపరాధ భావనతో,ఇక సర్వం త్యజించిన శూన్యమైన మనసుతో  ఊరు విడిచి గమ్యం తెలీని ప్రయాణం సాగిస్తాడు. దారిలో అతడితో కలిసి నడిచిన పుట్టన్న,మనసులో మళ్ళీ కలకలం రేపిన పద్మావతి,అన్న సంతర్పణలో నానా జాతులతో,(అందులోనూ తను సూతకంలో ఉండగా ) కల్సి భోజనం....ఎదురు చూడని పరిస్థితుల మధ్య ప్రాణేశాచార్యులు తన తప్పుకి  ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతో అగ్రహారంలో అందరి ఎదుటా తప్పు ఒప్పుకుని పాప  ప్రక్షాళనం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చి, దూర్వాసపురం అగ్రహారం దారిపడతాడు.

 ఇదే కథ!


మరి తర్వాత ఏమవుతుంది? అగ్రహారీకులు ఆయన చేసిన తప్పుని అంగీకరిస్తారా? మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో కొట్టుకుపోయిందా? నిలిచే ఉందా?  ...ఎవరికీ తెలీదు. ఎందుకంటే  "ఆ తర్వాత...తర్వాత ఏమవుతుంది?"అన్న ప్రశ్నతోనే నవల ముగుస్తుంది.   

ఇది కన్నడ సాహిత్యంలో ఎంతో సంచలనం సృష్టించిన  నవల, సినిమా కూడా!  కన్నడ సినిమా గురించి చర్చ జరిగిన ప్రతి చోటా చోటు చేసుకునే సినిమా!


1970 లో దీన్ని తెలుగు నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి(ఈయన తెలుగులో పెళ్ళినాటి ప్రమాణాలు, భాగ్య చక్రం వంటి సినిమాలు నిర్మించారు)దీన్ని సినిమాగా తీశారు. ప్రాణేశాచార్య పాత్రను గిరీష్ కర్నాడ్, చంద్రి పాత్రను స్నేహలతా రెడ్డి, నారాయణప్ప పాత్రను లంకేష్ పోషించారు. మొదట కుల విభేదాలను రేకెత్తించేదిగా ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను నిషేధించినా తర్వాత విడుదలై జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న చిత్రం ఇది!    


నవల విషయానికొస్తే అద్భుతమైన అనువాదం ఊపిరి తిప్పుకోకుండా  చదివిస్తుంది. కథా కాలం ఇప్పటిది కాదు కాబట్టి ఆనాటి మూఢాచారాల్ని కొంత వరకూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించవచ్చుగానీ వాటిని వారు  సమర్థించుకునే తీరు, ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. "మీ శాఖ  కంటే మా శాఖ గొప్పది"అని ఆ పేద బ్రాహ్మలు ఒకరినొకరు మోసం చేస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడం జాలిని కల్గిస్తుంది.కానీ అది, ముఖ్యంగా ఆ అగ్రహారీకులకు struggle for existence! వారికి అంతకంటే మార్గం లేదు మరి!  జీవనోపాధే బ్రాహ్మణ్యమైనపుడు అది వారికి తప్పనిసరి!  

కుప్పలుగా చచ్చిపడే ఎలుకల్ని చూశాకైనా అది ప్లేగు అని గుర్తించకపోగా, వాటికోసం వచ్చే గద్దల్ని చూసి ఊరికేదో అరిష్టం వచ్చిపడిందంటూ శంఖాలు ఊదుతారు!

ఒకపక్క స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవారని నిరసిస్తూనే ఎవరికీ తెలీకుండా వారి ఇంట అటుకులు, ఉప్మా తినాలని ఉవ్విళ్ళూరతాడు దాసాచార్యుడు. అతడు తన ఇంట్లో తిని భ్రష్టుడైతే చూసి  ఆనందిద్దామనుకునే మంజయ్య!  

ఇలాంటి నగ్న చిత్రణ చాలామందికి మింగుడుపడక అనంతమూర్తిపై విమర్శల జల్లు కురిసింది.
ఇంతే కాక కర్ణాటక అగ్రహారీకుల జీవన శైలిని రచయిత బహిర్గతం చేసిన తీరు అనేక విమర్శలకు దారి తీసింది. 

రచయిత ప్రాణేశాచార్యుల అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అబ్బురపడేలా చేస్తుంది.

చంద్రి సాంగత్యం ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత ఆ పండితాచార్యుడి ఆలోచనల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. రస రమ్య కావ్యాలను పురాణ కాలక్షేపం పేరుతో తాను చదివి వినిపిస్తుంటే విన్న యువకుల మానసిక స్థితి ఇప్పుడు తనకు అవగతమైందని భావిస్తాడు. 

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు.

"ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని ఈ మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలను"అని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. 

అడవిలో ఒక కాపు తన కూతురు బతుకు బాగుపడటానికి మంత్రం చెప్పమని అడిగినపుడు గ్రహిస్తాడు "తను బ్రాహ్మణ్యానికి దూరంగా పోతున్నా , అది తనను అంటిపెట్టుకునే"  ఉందని.

గుడిలో భోజనాల పంక్తిలో కూచుని ఇలా తర్కించుకుంటాడు..."ఈ భయం పోవడానికొకటే మార్గం! నారాయణప్ప దహనానికి నేనే బాధ్యత వహించాలి.ఏ అగ్రహారంలో నేను పెద్దగా నిలబడ్డానో, అదే అగ్రహారంలో బ్రాహ్మణ సమాజంలో నేను ధైర్యంగా నిలబడాలి. అందరి ముందూ 'ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఫలానా నిశ్చయానికి వచ్చాను!

 మీరిచ్చిన గౌరవాలు వదులుకుంటున్నాను, ఈ ఘనతను ముక్కలు ముక్కలుగా చించివేస్తున్నాను ' అని చెప్పాలి. ఏమని చెప్పాలి?  రోగిష్ఠి భార్యతో విసుగుపుట్టింది, చంద్రితో కలిశాను.సంత హోటల్లో కాఫీ తాగాను.కోడిపందాలు చూశాను.పద్మావతిని చూసి మోహపడ్డాను.భార్య పోయిన మైలలోనే దేవాలయంలో భోజనం చేశాను. నాతోపాటు కూచోమని బోయవాడిని ఆహ్వానించాను!..

కానీ నేనో అమోఘమూ, అభేద్యమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావలసిందే! సూటిగా  మనుష్యుల కళ్ళలోకి చూడగలిగి ఉండాలి. అగ్రహారానికి మాత్రం వెళ్లాల్సిందే"

 అని.. ."పరంధామా, ఆ రోజు అడవిలో నా ప్రమేయం లేకుండా ఏ విధంగా నా నిర్ణయాన్ని విధించావో, అదే విధంగా ఈ రోజూ విధించు. జరగవలసినదేదో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచే లోగా జరగనీ"అని దేవుడిని వేడుకుంటాడు.

నవల చదువుతున్నంత సేపూ అనేక ప్రశ్నలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. చదివిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అనేక రూపాలు దాల్చి పాఠకుడి వెంటే తిరుగుతాయి. 


ప్రాణేశాచార్యుడితో పాటే మనమూ అడవిలో చెట్లూ పుట్టలూ దాటి ప్రయాణిస్తూ, అతడి అంతర్మధనంలో పాలు పంచుకుంటాం! జాలి పడతాం! బాధ పడతాం, పుట్టన్నతో మాట్లాడతాం, ఒకవైపు చంద్రి గురించి, మరో వైపు నారాయణప్ప మృతదేహం గురించి ఆలోచిస్తూ ఉంటాం! ఒక్కమాటలో చెప్పాలంటే పాఠకుడు ప్రాణేశుడిలో పరకాయ ప్రవేశం చేస్తాడు.

కన్నడ సాహిత్యంలోనే కాదు మరే ఇతర భాషా సాహిత్యంలోనూ ఈ ఇటువంటి మీమాంసా విశ్లేషణ ప్రధానమైన నవల రాలేదేమో!

కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించిన ఈ నవల ను తెలుగులోకి అత్యంత ప్రతిభావంతంగా అనువదించింది శ్రీ ఎస్.ఎల్ శాస్త్రి.ఈ పుస్తకం  ప్రస్తుతం ప్రతిచోటా అందుబాటులో లేదు. కానీ డిసెంబర్ లో జరిగే హైదరాబాదు బుక్ ఫేర్ లో దొరికే అవకాశం  ఉంది. నాకు 2006లో అక్కడే దొరికింది.

చదవాలనుకున్నవారు పుస్తకాల సంతలో ప్రయత్నించవచ్చు.

November 23, 2009

వోట్లు- చెప్పరాని పాట్లు!

"చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?"


"మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు"


"అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి"


"అవకాశం మీది. ఓటు వేయండి. సమర్థులను ఎన్నుకోండి"


"సామాన్యుడి చేతిలో పాశుపతాస్త్రం వోటు"


ఊహూ! ఎంత మంది ఎన్ని రకాలు గా చెప్పినా హైద్రాబాదు వోటరు చెవికెక్కలా!



విద్యాధికులైన వోటర్లు ఎక్కువగా కేంద్రీకృతమైన డివిజన్లలో నిజంగానే చోద్యం చూస్తూ ఇంట్లో ఉండిపోయారు కానీ పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓట్లు వేసిన వారే తక్కువ! హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న వార్డుల్లో పోలింగ్ 30 శాతం దరిదాపుల్లో ఉందంటే వోటరు మనోగతం ఏమనుకోవాలి?



నిరాసక్తతా?

బద్ధకమా?


నిర్లక్ష్యమా?


నిర్వేదమా?



ఇతర కారణాలు...



లాంగ్ వీకెండా?

ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్స్ "మనం ఇక్కడ వోటేస్తే మనకు ఒరిగేదేం ఉందిలే"అనుకోడమా?



దాదాపు 40 ఖరీదైన అపార్ట్ మెంట్ భవనాలు  ఉన్న కాలనీలో(ఖరీదైన అని ఎందుకు వాడానంటే అంతా అధికంగా చదూకున్నవాళ్ళే ఇక్కడ ఉండేది అని చెప్పడానికి) అరవై డెబ్భై ఓట్లున్న ఒక్కో బిల్డింగ్ నుంచీ పోలయిన ఓట్లు ఆరు-ఏడు..మాగ్జిమమ్ 10 దాటలేదు ఒక డివిజన్లో!



కొంతమంది లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుని జామ్మని వెళ్ళిపోయారు. మరికొంత మంది ఇంట్లోనే ఉండి కూడా దగ్గర్లోని పోలింగ్ స్టేషన్ కి రావడానికి "అబ్బ,పోనిద్దూ" అని బద్ధకించారు.



మరోపక్క ఉత్సాహంగా ఓట్లు వేయడానికి వచ్చిన వారికి ఎదురైన చేదు అనుభవాలు..

.వాళ్ళ పేర్లు జాబితాలో లోనుంచి సడన్ గా మాయమైపోవడం,

ఫొటోలు ఎవరివో ఉండటం వల్ల పోలింగ్ అధికారులు అంగీకరించకపోవడం,

లిస్టులో పేర్లున్నా కార్డు చేతికి రాకపోవడం!

 పేర్లలో భయంకరమైన తప్పులు, (కొన్ని చోట్ల మరీ ఘోరంగా) ఉండటం !


కొంతమంది చదువుకున్నవాళ్ళు కూడా , జాబితాలో పేరుంటే  ఫొటో ఐడీ ఏదైనా సరే పనికొస్తుందని తెలీక చేతులూపుకుంటూ వచ్చి వెనక్కి పోవడం!

--------------

ప్రతి ఎన్నికల ముందూ ఓటర్ల లిస్టుని తప్పకుండా "అప్ డేట్" చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కి ఉందా లేదా నాకర్థం కావడం లేదు.

ఒక పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే..రెండేళ్ళ క్రితం ఇల్లు ఖాళీ చేసి దేశమే వదిలి వెళ్ళిపోయిన అనేకమంది పేర్లు భద్రంగా జాబితాలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడినుంచి వేరే చోటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ జాబితాలో పేరు నమోదు చేయించుకున్న తర్వాత కూడా వాళ్ల పేర్లు ఇక్కడ అలాగే ఉన్నాయి.

అంతెందుకు కొంతమందికి ఒకే జాబితాలో ఒక్కొక్కరికి మూడేసి వోట్లు ఉన్నాయి. మా వాచ్ మనే అందుకు సాక్ష్యం! అతనికి, అతని భార్యకు కలిపి 6 వోట్లు ఉన్నాయి...ఒకటే జాబితాలో! ఇక పేర్లలో, ఫొటోల్లో అవకతవకలకు అంతే లేదు! అదొక మహా సముద్రం!


ఒక ఇంట్లో అద్దెకున్నవాళ్ళకు, ఇంటి వోనర్లకు కూడా అదే చిరునామా మీద వోట్లు జారీ!


నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరగకముందున్న పాత కార్డులను మార్చుకోవాలని చా.....లా మంది ఓటర్లకు తెలీదు. ఆ కార్డులను గుర్తించి వాటి స్థానే కొత్త కార్డులను జారీ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది కాదా? ఎన్నికలప్పుడు ఊదర గొట్టడం తప్పించి రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకపోవడం న్యాయంగా ఉందా?



ఒక వృద్ధాశ్రమానికి చెందిన అనేకమంది వృద్ధులు ఎంతో బాధ్యతతో ఉత్సాహంగా వోటు హక్కు వినియోగించుకోడానికి వస్తే ...వారి దగ్గరున్నవి పాత గుర్తింపు కార్డులు. అంత శ్రమ పడి చేతి కర్ర సహాయంతో  మరీ వచ్చిన వారిని "మీ పేర్లు జాబితాలో లేవు పొండి" అని చెప్పడం ఎంత బాధాకరం! వారు ఓపిగ్గా "ఇంతకు ముందు ఇవే కార్డులతో వేశాం వోట్లు! మేము వెదుక్కుంటాం"అని జాబితా తీసుకుని వెదుక్కుంటుంటే చూడ్డం ఎంత బాధాకరం!


ప్రతి జాబితాలోనూ సగానికి సగం బోగస్ వోట్లు!


ఈ లెక్కన నిజమైన genuine వోటర్ల జాబితా ఎప్పటికి తయారవుతుంది? అసలు అది జరిగే పనేనా?


ఇలాంటి వాతావరణంలో ఏ మాత్రం నిజాయితీ లేని, నిజం కాని వోటర్ల జాబితాలతో జరిగిన ఎన్నికలకు విలువ ఎంత? ఈ ఎన్నికల ఫలితాలకు మాత్రం విలువ ఎంత?

వోట్లు అడుక్కోడమే కానీ ఇంతవరకూ ఏ పార్టీ అయినా వీటిమీద దృష్టి పెట్టిందా?





కేవలం శాశ్వత చిరునామా కోసం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఓటర్ ఐడీ కార్డుని ఉపయోగించుకుంటున్న విద్యాధికుల ఉదాశీనతను ఏమని వర్ణించాలి?


ప్రభుత్వం మారాలనీ, బాగుపడాలనీ, సామాన్యుల వెతలను పట్టించుకోవాలని డిమాండ్ చేసే హక్కు ఇటువంటి ఉదాసీన ప్రజలకెక్కడిది ?వోటు తప్పకుండా వేయాలనే బాధ్యత తెలియని వాళ్లకు   నిలదీసే హక్కు మాత్రం ఎక్కడినుంచి వస్తుంది?

ఇదంతా ఎవరి బాధ్యతా రాహిత్యానికి చిహ్నం? దీనివల్ల చివరికి నష్టపోయేదెవరు?


ఏమిటో, ఇవాళ నాకన్నీ ప్రశ్నలే!

November 9, 2009

సరితా దేవి డైరీ-సరోజ డైరీ!


కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.




పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.



కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.



కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.



ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!



ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.



ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........


సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.



రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!



మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.



సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!



మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!



రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.


సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.



నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.



"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.



తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?



కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!



విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!



ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!



మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!



ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!