March 31, 2009

"స్వర్ణసీమకు స్వాగతం"



మురికి ఓడుతూ, జనంతో క్రిక్కిరిసిపోయి,చెమటతో నిండిపోయిన బస్సు( (సిటీ బస్సు కాకుండా) మీరెప్పుడైనా ఎక్కారా? రకరకాల మనుషుల్ని ఇలా ఒకేసారి పరిశీలించే అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? అలాంటి బస్సు మీరు నిజంగా ఎక్కకపోయినా ఆ బస్సులో కూచునో, ఒంటికాలి మీద నిల్చునో చుట్టూ ఉన్న జనాల మనస్థత్వాలను పరిశీలించడానికి ఇక్కడో అవకాశం ఉంది. అదే "స్వర్ణసీమకు స్వాగతం" నవల చదవడం.



కొన్ని పుస్తకాలు చదివితే అంత త్వరగా మర్చిపోలేకపోవడం అటుంచి అవి మనల్ని కనీసం కొన్నాళ్ల పాటు వెంటాడతాయి. అలాంటి పుస్తకాల కోవలోకి వస్తుంది మధురాంతకం మహేంద్ర(శ్రీ మధురాంతకం రాజా రామ్ గారి కుమారుడు)రాసిన "స్వర్ణసీమకు స్వాగతం"! ఈ నవలిక నేను పదో క్లాసో, పన్నెండో క్లాసో చదూతూండగా ఆంధ్రజ్యోతి వారపత్రికలో ధారావాహిక గా వచ్చింది. 1996 లో నవలగా వెలువడింది.


ఈ ప్రపంచం ఒక ప్రయాణం. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరి దారి వారిది, ఎవరి గమ్యం వారిది. అందరూ ఒకేదారిలో వెళుతున్నా ఒక్కోసారి గమ్యాలు వేర్వేరుగా ఉంటాయి. ఈ ప్రయాణంలో ఒకరి సంక్షేమం, ఇంకొకరికక్కర్లేదు. ఒకరి బాగోగులు మరొకరికి పట్టవు.


ఈ ధోరణిలో ఈ  సమాజమే పెద్ద పర్తిగుంట బస్సుగా అవతరిస్తుందీ నవల్లో!చిత్తూరు జిల్లా కుప్పం బస్టాండ్ లో కథ మొదలవుతుంది. కథంటూ పెద్దగా ఏమీ ఉండదు. రచయిత చెప్పినట్లు యాంత్రిక నాగరికతా ప్రస్థానంలో మానవత్వం అనుభవిస్తున్న సంక్షోభాన్ని కుప్పం నుంచి పెద్దపర్తి గుంట చేరేలోగా కళ్లకు కట్టినట్లు వివిధ పాత్రల ద్వారా చూపించడమే ఈ నవల్లో మహేంద్ర చేసిన పని.



చిగుర్ల గుంట లో ఉన్న బంగారు గనుల మైనింగ్ కాంప్ లో వివరాలు సేకరించేందుకు వచ్చిన విలేకరి రమణమూర్తీ, జ్వరంతో ఉన్న బిడ్డను ఆస్పత్రిలో చూపించి తిరుగుప్రయాణంకోసం సుభద్ర, సుభద్ర వాలుచూపులకోసం పడిగాపులు గాసే వెంకటపతీ, తాగుబోతులు అత్తినీరాలు,సంపంగిగౌడు, చితికిపోయిన జమీందారు వసంతనాయని వారు,లీడరు అతని అనుచరులు, భాగ్యమ్మ, ఆమె ప్రియుడు వెంకటసామి...వీళ్లందరి గమ్యం పెద్దపర్తి గుంటే! మధ్యాహ్నం నుంచి ఎదురు చూసిన బస్సు సాయంత్రానికి గానీ రాదు. అది రాకముందు, వచ్చిన తర్వాత, బస్సెక్కాక, ప్రయాణంలో అందులోని ప్రయాణీకులు మానవ సమాజానికి ప్రతీకలుగా ఎలా ప్రవర్తిస్తారో రచయిత వర్ణించిన తీరు మహాద్భుతంగా ఉంటుంది.

నవలకు ముందు మాట రాసిన ఆర్. ఎస్. సుదర్శనం ఇలా అంటారు."ప్రగతి అంటే మిథ్య కాదు. అది పెద్దపర్తి గుంట బస్సు. అందరూ దాని కోసమే ఎదురు చూస్తారు. తొక్కిసలాటలో కండబలం కలవాళ్ళు సీట్లు సంపాదిస్తారు.కొందరు కిక్కిరిసి నిల్చుంటారు. మరికొందరు టాపు మీదైనా చోటు సంపాదిస్తారు.ఎక్కడ దిగవలసిన వాళ్ళు అక్కడ దిగిపోగా బస్సు గమ్యం చేరుతుందా లేదా ఎవరికీ పట్టదు".

ఈ కథకు కథానాయకుడు డెబ్భై అయిదేళ్ళు పైబడ్డ తిమ్మరాయప్ప. కథ అతనితోనే ప్రారంభమై అతనితోనే ముగుస్తుంది. పంటలు పండక, నీళ్ళకోసం సొరంగం లాంటి బావి తవ్వి,దానికోసం ఉన్న డబ్బంతా పోగొట్టుకుని,భూముల్ని పాడుబెట్టి,అప్పులపాలై, అందర్నీ పోగొట్టుకుని చివరికి తాకట్టు పెడదామని కుప్పం తీసుకెళ్ళిన మనవరాలి ఒక్క నగనీ, ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో ఇంటికి తిరిగొస్తూ కిక్కిరిసిన బస్సు ప్రయాణంలో పోగొట్టుకుని జీవచ్ఛవంలా విలపిస్తూ మిగులుతాడు. అతని బాధకి ప్రత్యక్ష సాక్షిగా ..నాగరిక సమాజంలో నలిగిపోతున్న రమణమూర్తి! ఇంతే... కథ!

మహేంద్ర కవిత్వం నేను చదవలేదు కానీ అతడు కవి అని చదివాను. సామాజిక స్పృహ గల అందరు కవుల్లాగానే అతడు కూడ యదార్థ జీవిత వ్యథార్థ దృశ్యానికి చలిస్తాడు, స్పందిస్తాడు. అతని స్పందనను అద్భుతమైన భావ వ్యక్తీకరణతో చిత్రిస్తూ సాక్షాత్తూ కుప్పం బస్టాండ్ లో ఒక పక్కన మనల్ని నిలబెడతాడు.



పల్లెల్లో ఉండే మురికి కూపాల్లాంటి డొక్కు బస్సులనూ,దుర్గంధపూరితాలైన బస్టాండులనూ,డ్రైవరు, కండక్టరు,ఇత్యాదులను మహేంద్ర వర్ణిస్తుంటే అవి మన కళ్లముందు నిలవాల్సిందే! ముఖ్యంగా పల్లెటూరు జనం బస్సులో చోటు సంపాదించడానికి పడే పాట్లను వీరోచిత కార్యంగా మహేంద్ర వర్ణిస్తాడు.


ఎంతోసేపు ఎదురుచూసాక వచ్చిన పెద్దపర్తిగుంట బస్సులో మనల్ని కూడా ఎక్కిస్తాడు రచయిత.కష్టపడి సీట్లు సంపాదించిన వెంకటసామి,సంపంగగౌడు, రమణమూర్తి మొదలైనా వారితో పాటు వృద్ధాప్యం వల్ల సీటు గాదు కదా రెండుకాళ్ల మీద నిలబడే చోటు గూడా సంపాదించడం కష్టమై ఊతకర్ర సాయంతో ఒంటికాలిమీద నిలబడ్డ తిమ్మరాయప్ప,లింగయ్య అనబడే అనుచరుడి సాయంతో నిలబడ్డ మాజీ జమీందారు కూడా ఎలాగో బస్సెక్కుతారు.

క్రిక్కిరిసిన బస్సు కుప్పం ఇరుకురోడ్ల గుండా ఊగిపోతూ ప్రయాణం ప్రారంభించడం నుంచి, పెద్దపర్తి గుంట చేరకుండానే ఆగిపోవడం దాకా జరిగిన ప్రస్థానాన్ని రచయిత చిత్రించిన తీరు అద్భుతంగా ఉంటుంది.


కండక్టరు చూడండి..."ఈ జనసంక్షోభంలో అతడు కొమ్మలమీదినుంచి దూకే కోతిలా, బొరియల్లో దూరే సర్పంలా,గాలిలో వలయాలు తిరిగే తూనీగలా ప్రయాణీకుల్లోకి ప్రవేశించాడు..ఆ సమయంలో సాగర మథనంలో హాలాహలంలా పుట్టుకొచ్చాడు.అతడు మనుషుల శరీరాల మధ్య పాతిపెట్టినట్టుగా ఇరుక్కుపోయి కండరాల మధ్య రక్తనాళంలా కదులుతున్నాడు.అత్యుష్ణ పూరితమైన పరిశ్రమలో పని చేస్తున్నట్లు అతడి శరీరం చెమటతో దొప్పదోగుతోంది.అతడు రెండు చేతుల్తోనూ జనాన్ని వెనక్కి తోసుకుంటూ జనజలధిని ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.ఒక చేత్తో క్రెడిల్ నుంచి టికెట్లను చింపుతున్నాడు. మరో చేత్తో నోట్లను లెక్కెడుతున్నాడు. ఒక చేత్తో టికెట్లను పంచ్ చేస్తున్నాడు. మరో చేత్తో చిల్లరడబ్బులను తోలు సంచీ లోంచి చిల్లర గలగరించి తీస్తున్నాడు. ..." పట్నం నుంచి పల్లెకు సాయంత్రం వేళ బయలుదేరిన ఎర్రబస్సులో మీరెప్పుడైనా ఎక్కి ఉంటే ఈ కండక్టరుని తప్పక మీకు తారసపడే ఉంటాడు కదూ!

బస్సు బయలుదేరాక పరిస్థితి చూడండి.


"బస్సు మెయిన్ రోడ్డు దిగి పెద్దపర్తి గుంట మట్టిబాట లోకి వెళ్ళే లంబకోణపు మలుపు తిరగడానికి నానా యాతనలూ పడుతోంది. ఈ కార్యక్రమంలో యధావిధిగా మలుపులోని పెంకుటింటి తాలూకు మరో రెండు పెంకులు రాలి పడ్డాయి.ఇంటిగల వాళ్ళు వెలుపలికి వచ్చి ఈ బస్సులకెప్పుడు పోయే కాలం వస్తుందో కానీ తమ ఇల్లు కూల్చకుండా అవి నిద్రోయేటట్లు లేవని పాపాల భైరవుడు సత్తార్ సాహెబ్(బస్సు డ్రైవరు) ని అతడి సకల స్త్రీ జనాల శీలాలను శంకిస్తూ బూతులు తిట్టసాగారు.

"ఇంతలో ఒక స్త్రీ తనకు బస్సెక్కితే వాంతులవుతాయనీ,తనకు సీటు ఇవ్వని పక్షంలో ఎవరి మీదనైనా వాంతి చేసుకోగలననీ భయపెట్టసాగింది.కేవలం సీటుకోసమే ఆమె దొంగెత్తు వేస్తోందని కొందరు ఆమె కోరికను వీటోచేయ జూసారు గానీ ఆమెకు దగ్గరగా ఉన్నవారు ఆమె ముఖకవళికలను జాగ్రత్తగా పరిశీలించసాగారు."

ఇటువంటి అనేక విషమ పరిస్థితుల్ని దాటుతూ బస్సు ప్రయాణిస్తుంది. ఒకరి బాగు,సంక్షేమం మరొకరికి పట్టని ఈ ప్రయాణంలో చాలా మంది దిగిపోయాక పెద్దపర్తి గుంటదాకా పోని బస్సు ఒక ఇసగవాగులో దిగబడి ఆగిపోగా అందులో మిగిలిన ప్రయాణీకులు విలేకరి రమణమూర్తి, దగాపడ్డ వృద్ధుడు తిమ్మరాయప్ప.

బంగారు గనులు మైనింగ్ కాంప్ గురించి ఎటువంటి సమాచారమూ దొరకని రమణమూర్తి చివరకు ఆ బస్సులో మిగిలిన తిమ్మరాయప్ప మీదే ఆధారపడతాడు. అరిచి గీపెట్టి అధికార పక్షం తరహాలో "బంగారు గనులిక్కడ పడటం వల్ల మీ బతుకులు బాగుపడ్డాయి కదూ! మీకు జీవనోపాధి దొరుకుతోంది కదూ"అని అడుగుతాడు. దానికి తిమ్మరాయప్ప ఇచ్చిన సమాధానమే ఈ నవల ఆత్మ!



"ఈ నేల్లోనే మేము పుట్నాము. మా తాతల కాలం నుండీ ఈ నేలనే నమ్ముకోని బతకతా ఉండాము! కొందరు మనుషులు నేల్లోనే బంగారం దీస్తామని మా దగ్గర కూలిపన్లు సేయించుకుంటా ఉండారు. వాళ్ళు వచ్చిన కాణ్ణించి మా సేద్దాలు మూలపడిపోయినాయి. గెనిలో పని అంటే మిత్తవతో పోరినట్టే ఉండాది. ఆ గెన్లో పండే కష్టం బూమ్మీదనే పడితే రాజనాలు పండు.అయినా బంగారం మీద జనాలకెందుకింత బ్రెమో తెలవటం లేదు. అదేమన్నా కూట్లోకి వస్తాదా,కూర్లోకి వస్తాదా? సేతుల కష్టంతో వడ్లు పండించు, టెంకాయ చెట్లు బెట్టు,మామిడితోపులు పెట్టు, ఊరు నాడంతా పచ్చగ కళ కళ లాడతాది. గురిగింజంత బంగారం కొసం ఎకరాలు ఎకరాలుగా బీడుపెట్టేసినారు. ఈడకొచ్చిన ప్రతి మనిషీ ఈడ బంగారం దొరకతాదా అని అడగతాడే గానీ ఈడ తాగేదానికి నీళ్ళు దొరకతా ఉండాయా అని ఒక్కడైనా అడగతా ఉండాడా?భూమండలానికి సొరంగాలు యోజనాలుగా తవ్వి కేజీ ఎఫ్(kolar gold fields) కి దీసుకోని బోతా ఉండారే గానీ మంచినీళ్ళు తాగను సేదబావులు తవ్వాలని ఎవరైనా అనుకుంటా ఉన్నారా? నీటికరవు లేని కాలాల్లో పైర్లు పండే కాలంలో మా ఆడోళ్లంతా బంగారం నగలు దిగేసుకోనుండ్రి. " ఈ రకంగా సాగుతుంది తిమ్మరాయప్ప ఆవేదన.



ఇంతలో బస్సు ఒక ఊరింకా రెండుమైళ్ళ దూరంలో ఉండగానే ఇసకవాగులో దిగబడి ఆగిపోతుంది. దిగి నడవక తప్పని ఆ చిమ్మ చీకటిలో కూడా ఆ వృద్ధుడు తన సర్వస్వాన్నీ దిగమింగి రాకాసిలా నోరుతెరుచుకుని చూస్తున్న బావిని రమణమూర్తికి చూపిస్తాడు. సంభాషణ ముగిసిన మరుక్షణంలో అతడు తన వద్ద మిగిలిన ఒక్క నగా బస్సులో పోగొట్టుకున్నానని గ్రహించి నెత్తీ నోరూ బాదుకుంటాడు.



రమణమూర్తి పరిస్థితి వర్ణనాతీతం! ఒకపక్క మట్టిలోనుంచి బంగారాన్ని వెలికి తీసి జనుల భవితవ్యాన్ని సుసంపన్నం చెయ్యాలన్న తపనతో వేలాది మంది కార్మికులు పని చేస్తున్న ఆ భూమిలోనే ఒక నిర్భాగ్యుడైన ముసలివాడు విగతజీవిగా మారిపోతున్న దృశ్యం అతన్ని దిగ్బ్రాంతి పరుస్తుంది.

ఆదిమ శిలా యుగం నుంచీ అంతరిక్షం దాకా విస్తరిల్లిన మానవ నాగరికతా ప్రస్థానానికి గమ్యం ఏమిటి?

ఈ నిరంతర స్పర్థాయుత క్షణ క్షణ సంఘర్షణామయ సతత అనిషిత అపాయకర సుదీర్ఘ పథంలో చివరకు దొరికేదేమిటి? అది మిగిలేదెవరికి? అన్న అంతుచిక్కని ప్రశ్నలతో నవల ముగుస్తుంది.



మహేంద్ర చిన్న వయసులోనే కాన్సర్ బారిన పడి మరణించకుండా ఉండి ఉంటే మరెన్నో ఆణిముత్యాలవంటి రచనలను అందించి ఉండేవాడు. తెలుగు పాఠకుల దురదృష్టం!

అభిరుచి గల పాఠకులు తప్పక చదవి తీరాల్సిన నవల. కానీ ఇది ఇప్పుడు విశాలాంధ్రలో దొరుకుతుందన్న నమ్మకం లేదు.రెండో ముద్రణ పడినట్లు లేదు.


"స్వర్ణసీమకు స్వాగతం"(నవల)
రచయిత: మధురాంతకం మహేంద్ర
ప్రచురణ "కథా కోకిల"
దామల్ చెరువు
చిత్తూరు జిల్లా

March 9, 2009

"వేలం" వెర్రి !

 



బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో రెండు పాత ఫర్నిచర్, మరియు ఇతర పాత వస్తువులు అమ్మే షాపులు

ఉంటాయి. ఎప్పటెప్పటివో వస్తువులు. ఆ షాపులు చూస్తే నాకు విచారంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనింట్లోని సరికొత్త సోఫాసెట్  కూడా అక్కడి పా....త పడక్కుర్చీ అంత విలువ చెయ్యదు.అక్కడ ఒక నగిషీలు చెక్కిన పాత చెక్క పార్టిషన్ అడిగితే(నేను కాదు లెండి) 35 వేలు చెప్పారు ధర. మొన్నీమధ్య మా కాలనీలో ఒక బిల్డింగ్ లో తాపీ పని చేస్తూ అయిదో అంతస్థు నుంచి కాలు జారి పడి ఒక పనివాడు మరణిస్తే 'తాగి ఉన్నాడని" రాయించి అతని భార్యకు 15 వేలు ఇచ్చి ఊరికి పంపించేసారు. ఒక జీవితం కంటే విలువైనదన్నమాట ఆ చెక్క వస్తువు.






నాకు మ్యూజియాలు చూడ్డం ఇష్టం ఉండదు.(వేరే ఊళ్లనుంచి స్నేహితులు వచ్చినపుడు సాలార్జంగ్ మ్యూజియం కి తీసుకెడతాను కానీ నేను రెబెక్కా దగ్గరే ఉండి మొత్తం మీరు తిరిగి రండని వాళ్లను పంపుతాను.) ఆనాటి చరిత్రను తెలిపే వస్తువులు(పుస్తకాలు, వగైరా) తప్పించి, వాళ్ళే గిన్నెల్లో వొండుకున్నారో, కంచాల్లో తిన్నారో, ఏ చెప్పులు వాడారో తెలుసుకోవాలని ఉండదు. అందరూ ఇలా ఉండాలని రూలేం లేదనుకోండి.



ఇలా పాత వస్తువులు వేలం వేసి వాటిని లక్షల్లో కోట్లలో వేలం పాడినపుడు ఇంత విలువుందా వాటికి, ఇంత పాత వాటికి అని ఆశ్చర్యమేస్తుంది. ఎవరు వాడినవైనా సరే! పాత పెయింటింగ్స్,పాత హుక్కాలు, ఎవడో రాజు యుద్ధంలో వాడాడో లేదో తెలీని కత్తులు (టిప్పు సుల్తాను కత్తి ఒక పెద్ద జోకు నాకు)వీటన్నిటినీ కోట్లు పెట్టి వేలం పాడటం ఏమిటి? వాటి విలువ ఎంత? అది మామూలు మనుషుల లెక్కలో ఏ విధంగా లెక్క గడతారు?(పురావస్తు శాఖ లెక్కలు వదిలెయ్యండి).



మనుషుల పట్ల ఉన్న సెంటిమెంట్ వాళ్ళు వాడిన వస్తువుల మీద ఉండదా ఏమిటి? అన్నాడు మా అన్నయ్యొకడు ఈ విషయం ఎత్తితే! మనుషుల మీద సెంటిమెంట్ ఉంటే ఆ మనుషులు బతికినంత కాలం ఎలా జీవించారో, వారి ఆదర్శాలేమిటో,సమాజం పట్ల వారి దృక్పథం ఏమిటో,వారి సుగుణాలేమిటో...అవి కదా మనం అనుసరించాల్సినవి. వాళ్ళ చెప్పులూ,గిన్నెలూ, కళ్ళజోళ్ళూ భద్రపరుచుకుంటే వాళ్ళను గౌరవించినట్లా? సెంటిమెంట్ నిలుపుకున్నట్లా?



ఇప్పుడూ...నేనున్నానండీ!మా మేనత్త అంటే నాకెంతో ఇష్టం. ఆవిడ సుమంగళిగా పోయినపుడు ఆవిడ పట్టుచీరలు నాక్కూడా ఇవ్వబోతే తీసుకోలేదు. అంతంత భారీ పట్టుచీరలు నేను కట్టుకోలేను, బీరువాలో పెట్టి పూజించలేను. అందుకే వద్దన్నాను.



ఆవిడ నా పెళ్ళప్పుడు నాకో మాట చెప్పింది.

"అమ్మలూ,అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం  అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు" ఆవిడ మీద ఉన్న సెంటిమెంట్ తో నేను ఈ సూత్రాన్ని పాటించట్లా? అదీ సెంటిమెంట్ అంటే!



గాంధీ మీద ప్రేమతో, ఆయన వస్తువులు విదేశీయులకు దక్కకూడదని మన ప్రభుత్వం బోలెడన్ని ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో చేసి, (ఎంత తీవ్రంగా అంటే వీళ్ళ ప్రయత్నాల వల్ల వాటి వేలం రేటు ఏకంగా మూడు లక్షల డాలర్ల వద్ద మొదలెట్టేంతగా)చివరకు విజయ్ మాల్యా గారు 9 కోట్ల 30 లక్షలు పెట్టి కొనడంతో ఊపిరి పీల్చుకుంది. అక్షరాలా తొమ్మిది కోట్ల ముప్ఫై లక్షలు! ఆ వస్తువులకు భౌతికంగా ఎంత విలువుందో నాకు తెలీదు.



కానీ గాంధీ మీద అంత ప్రేముంటే మనం దాచుకోవలసినవి చెప్పులూ, కళ్ళజోడూ కాదేమో అనిపిస్తోంది నాకు. ఆయన మనకోసం వదిలి వెళ్ళినవి చెప్పులూ, కంచమూనా ? అవి భౌతికంగా ఎవరైనా వదిలి వెళ్ళక తప్పదు. మన కోసం గాంధీ వదిలి వెళ్ళీన ఆదర్శాలు, అహింస, సత్య శీలం, నిరాడంబరత,వీటన్నిటికంటే "పదార్థ విలువ" తప్ప లేని తోలు చెప్పులు, ఇత్తడిగెన్నెకే విలువ ఎక్కువ.



9 కోట్ల 30 లక్షలతో విజయమాల్యా తల్చుకుంటే ఎన్ని పనులైనా చేసి ఉండొచ్చు. బెంగుళూరులోనే ఒక మురికివాడ ను అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఆయనకు ఆ మొత్తం ఒక లెక్కలోనిది కాదు. టిప్పు సుల్తాను ఖడ్గానికే కోటీ అరవై లక్షలు పెట్టిన దేశ ప్రేమికుడు కదా!



బీరు బాటిల్స్ తయారు చేసే ఒక కంపెనీ పేరు దాని యజమాని పేరు దేశవ్యాప్తంగా,ఇంకా మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల నోళ్ళలో పది రోజులు నానాలన్నా,ప్రైం టైం లో వార్తా ఛానెళ్లలో కనిపించి వినిపించాలన్నా (IPL టోర్నమెంటూ, మరియూ వేసవీ దగ్గర పడుతున్న కీలక సందర్భంలో) ఎంత డబ్బు ఖర్చవుతుందంటారు? పది కోట్ల కంటే ఎక్కువే అనుకుంటా!



ఏదేమైనా గాంధీ గారి వస్తువుల్ని తిరిగి దేశానికి తెస్తున్న "కింగ్ ఫిషర్" అధినేత శ్రీ విజయమాల్యా గారికీ జాతి రుణపడి ఉంటుంది.ఆ వస్తువుల్ని ఏ సబర్మతి ఆశ్రమంలోనో పెడితే, పిల్లలతో ఎప్పుడైనా వెళ్ళి(ఆ చుట్టుపక్కల వెకేషన్ పెట్టుకున్నపుడు) చూసి, "చూశారా, గాంధీ గారి గడియారమూ ,కళ్ళజోడూ,  నమస్కారం చెయ్యండి" అని గౌరవం ప్రకటిద్దాం.(గాంధీ ఎవరో, జాతిపిత ఎందుకయ్యాడో మాత్రం చెప్పకుండా)

March 2, 2009

డబ్బు వల్లో చిక్కిన జీవితం!


మనలో చాలా మంది చిన్నప్పటి నుంచీ చూస్తున్న LIC వారి వ్యాపారప్రకటన ఒకటుంది. ఒకమ్మాయి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పెళ్ళి ముగియగానీ టాపు లేని కార్లో వధూ వరులిద్దరూ అలా వెళ్ళిపోగానే వధువు తల్లి,(వితంతువు)మన వైపు తిరిగి ముసుగు సవరించుకుంటూ ఇలా అంటుంది.

"ఈ పెళ్ళి ఈ రోజు ఇంత బాగా జరిగిందంటే శర్మ (ఆమె పక్కనే టేబుల్ ఫొటోలో నవ్వుతూ ఉంటాడీయన) గారి ముందు చూపు వల్లే! ఆయన తీసుకున్న పాలసీ వల్లే పెళ్ళి ఖర్చులనీ గడిచాయి" ఇలాంటివే ఏవో మాటలు చెప్తుంది.

మా అమ్మ ఈ యాడ్ చూసి "ఛ, వెధవ సంత తీసెయ్యి, అన్నీ అపశకునం మాటలు" అనేది. మా నాన్న గారైతే "అదర్రా సంగతి! పాపం శర్మ గారు బతికుంటే ఆ పిల్లకు పెళ్ళి చేయలేకపోయేవాడే! చావటం వల్ల, మాత్రం డబ్బు సంపాదించి పిల్ల పెళ్ళి చేసాడు" అనేవారు.

మన చుట్టూ ఉన్న ఈనాటి ఆర్థిక వ్యవస్థను , మనుషుల్ని, మనుషుల్లో
జీవితం పట్ల వచ్చిన మార్పుని, ఒక పక్క సీరియస్ నెస్ ని, మరో పక్క అది లేకపోవడాన్ని గమనిస్తుంటే ఆలోచనలు చిక్కు ముళ్ళు పడ్డట్లు అయిపోతాయి.



జీవితంలో దేనికీ హామీ(గ్యారంటీ) లేదు.జీవితంతో సహా. ఇదే ఇన్సూరెన్స్ సంస్థల వ్యాపార సూత్రం. "నువ్వు పోతే ఏమి? నీ పెళ్ళాం పిల్లలకు డబ్బులొస్తాయిగా?" ఇంత డైరెక్ట్ గా కాదు గానీ ప్రతి ఏజెంటూ (సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనాలనుకుంటా ఇప్పుడు వీళ్లని కూడా) ఇదే మాట మాట్లాడతాడు. మనుషుల మనోభావాల(emotions)తో ఆడుకునే టీవీ ప్రకటనల తో వెంటనే పాలసీ కొనాలనేంత టెన్షన్ పుట్టిస్తారు.



ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాపార ప్రకటన చూడండి..!"నీ బంతి కనపడకపోతే పోనీలే, ఒకవేళ అసలు మీ నాన్నే కనపడకుండా పోతేనో" అని నాన్న స్నేహితుడు ఒక నాలుగేళ్ళ పిల్లాడితే అంటే వాడి
మనోభావాలెలా వుంటాయి?

అంతలో నాన్న వచ్చి "నాన్న కనపడకుండా

పోయినా, నాన్నే నీకు బంతి కొనిస్తాడులే(అతడు పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కొనే బంతి నాన్న కొన్నట్టేగా)" అంటాడు.ఆ ప్రకటన చూస్తుంటే గుండెలో ఒక రకమైన గాభరా బయలుదేరుతుంది ఎవరికైనా!



మరో కంపెనీ యాడ్ లో ఇర్ఫాన్ ఖాన్ వచ్చి "ఇవాళ పదివేలు సరిపోతాయి ఇంటిఖర్చులకి! రేపు లక్ష కూడా సరిపోదు, కాబట్టి పెన్షన్ ప్లాన్ ల కోసం వెంటనే వాళ్ళెవరికో ఫోన్ కలపమంటాడు. నాకైతే నిజంగానే ఈ వ్యాపార ప్రకటనలు చూస్తుంటే "అమ్మో, నిజంగా భవిష్యత్తు లో ఖర్చులు ఎలా?"అని గుండె దడ ప్రారంభమవుతుంది.

సరిగా ఇదే వాళ్ళకు కావలసింది.



ఇదివరలో ఎప్పుడో పాతరోజుల్లో LIC ఏజెంట్ల మీద బోల్డెన్ని జోకులు, కార్టూన్లు వచ్చేవి. యమ లోకానికెళ్ళినా ఈ ఏజెంట్లు వదలకుండా వెంట బడ్డట్టూ,పొద్దున్నే లేవగానే బాత్రూం దగ్గరే ఏజెంటు పాలసీ కొనమని గొంతు మీద కూచున్నట్టూ...ఇలా!



ఎపుడైతే జీవిత భీమా ప్రైవేట్ రంగంలోకొచ్చిందో ఇహ ఈ ఏజెంట్లు అధునాతన వేషాల్లో(ఎల్ ఐ సి వాళ్లలాగా సామాన్యమానవుల్లా ఉండరు వీళ్ళు. కంపెనీ ఓనర్ అతగాడే అన్న ఫీలింగ్ రావాలి మనకి) బయలుదేరి మన జీవితాల్ని కబ్జా చేశారు.ఐటీ బూమ్ వల్ల పెరిగిపోయిన జీతాలు,ఖరీదైన జీవన శైలి, కార్లు, డీలక్స్ ఫ్లాట్లు, డ్యూప్లెక్స్ ఇళ్ళు... వీటన్నిటిమధ్యా మనిషిని ఆవరించి ఉండే "ఆరా" లాగా ఒక అశాంతి! ఒక అపనమ్మకం! ఈ రెండే భీమా కంపెనీల పెట్టుబడి.



జీవితానికి, వృద్ధాప్యానికి, ఆరోగ్యానికి,కారుకీ, ఇంట్లో వస్తువులకి,
ఇంటికీ, ఇంటికోసం తీసుకున్న లోనుకీ కూడా ఇన్సూరెన్స్. పిల్లల భవిష్యత్తు భద్రత కోసం ఒక లక్ష ప్లాన్లు ఉన్నాయి. చాలా పాలసీల్లో ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు, యాక్సిడెంట్ అయితే ప్రత్యేక క్లెయిము సదుపాయాలు ఉన్నాయి.

ఈ మధ్య పేపర్లో చదివాను. కుదిరిన పెళ్ళి ఏవిధంగా నైనా భగ్నం అయితే దానిక్కూడా భీమా చెల్లిస్తారట!

జీవితం ఎప్పుడు ఠప్ మంటుందో తెలీని గాలి బుడగ అనే విషయం పరమసత్యం! ఎప్పుడూ అందరికీ తెలిసిందే! కానీ ఇదివరకు జీవితాల్లో ఇంత అసంతృప్తి, అభద్రత లేవు. నాకు తెలిసి మా నాన్నగారికి 50 వేలకు ఒక్క LIC పాలసీ తప్ప ఇంకే రకమైన ఇన్సూరెన్సూ ఉండేది కాదు. అయినా ఎప్పుడూ భవిష్యత్తు ఎలా అని బెంగ పెట్టుకోలేదు.(పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు మరి). ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల పెన్షన్ వస్తుందన్న హామీ మాత్రం ఉండేది.



ప్రభుత్వ ఉద్యోగాలు కరువు కావడం, ప్రైవేటు ఉద్యోగాల జీతాల మీద ఆశతో పొలోమంటూ అందరూ అటువేపు పరుగులెత్తడం తో ఒకప్పుడు ఎగువ మధ్యతరగతి కి కూడా విలాసాలుగా ఉండే కారు, ఏసీ వంటివి మధ్య తరగతి వారికి కూడా అవసరాలుగా మారాయి. ఇల్లు నుంచి ఇంట్లో వాడే విద్యుత్ గృహోపకరణాల వరకూ ప్రతిదీ వాయిదాల్లోనో, అప్పుమీదో దొరకడం తో జీవన శైలి మారిపోయింది. భవిష్యత్తులో ఇటువంటి జీవితమో, ఇంతకంటే మెరుగైన జీవితమో కావాలి తప్పించి, సాదా సీదాగా గడిచే జీవన శైలి ఎవరికీ అఖ్ఖర్లేదు.



వైద్య ఖర్చులకోసం భీమా అనేమాట ఒకప్పుడు చెపితే నమ్మేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది. మా ఎదురింటి అమ్మాయికి   సిజేరియన్ ఆపరేషన్ కి అయిన ఖర్చు అక్షరాలా అరవై ఏడు వేల రూపాయలు. ఆమె భర్త పని చేసే కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి అంత బిల్లు దండుకున్నారు కానీ, ఒక ప్రసవానికి 67 వేల రూపాయలు నమ్మ దగ్గ విషయమేనా?

ఇంతలా పెరిగిన వైద్యఖర్చుల కోసం కొంత సొమ్ము భీమా కట్టడానికి ప్రతి నెలా పక్కన పెట్టాల్సిందే! పెన్షన్ ప్లాన్ల కోసం కట్టాల్సిన వార్షిక ప్రీమియమ్ రెండులక్షలతో ప్రారంభం(పదేళ్ళ తర్వత నెలకు పదివేలు పెన్షన్ కావాలంటే) అవుతుందంటే ఎంత సంపాదించాలో చూడండి.


పిల్లల చదువుల ఖర్చు సరే సరి! వేలు దాటి లక్షల్లోకి ఎప్పుడో చేరింది. కాబట్టి వాళ్ళు పుడుతూనే ఇన్సూరెన్స్ పాలసీలు కొనేస్తున్నారు. పదో క్లాసు, ప్లస్ టూ,ఇంజనీరింగ్ ఇలా వివిధ వాయిదాల్లో డబ్బు చేతిలో ఉండడానికి వీలుగా పాలసీలు!



కొంతమంది చేతుల్లో అయితే ఇలా వివిధ అప్పు వాయిదాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం లు కట్టి నెలాఖరుకి క్లాస్ ఫోర్ ఉద్యోగిలా చేతిలో పైసా లేని స్థితిలో ఉంటారు.ఎప్పుడో రాబోయే ఖర్చులకోసం పాటుపడుతూ ఇప్పుడు బికారుల్లా నిలబడేవాళ్ళు నాకు పదుల సఖ్యలో తెలుసు.


అందువల్ల కనీస మొత్తం అయినా చేతిలో నగదు అంటూ ఉండాల్సిందే! లేదంటే అతి త్వరగా నగదుగా మార్చుకోగలిగే బంగారమైనా సరే చేతిలో ఉండాలి!కొన్ని పాలసీలు ఇచ్చే ఆఫర్లు చూస్తుంటే "క్లెయిమ్ చేసినపుడు అసలు నిజంగా ఇంత డబ్బు ఇస్తారా లేక లొసుగులేమైనా పెడతారా" అని అనుమానం వస్తుంది.

ఆఖరి పోరాటం నవల్లో CBI అధికారి ప్రవల్లిక ఒక డైలాగ్ అంటుంది. "ఏదో గొప్ప ఉద్యోగం అనుకుంటారు కానీ ఒక్కోసారి ఈ ఉద్యోగం వదిలేసి ఏ పల్లెటూరికో పోయి నాలుగు కోళ్ళు, మేకలు పెంచుకోవడం నయమనిపిస్తుంది" అని!ఒక్కోసారి పల్లెల్లో, టౌన్లలో ఉన్నదానితో తృప్తిగా బతుకుతూ లోన్ల బరువు లేకుండా హాయిగా జీవించే వారిని చూస్తే అదే నిజమనిపిస్తుంది.

వెనకాల డబ్బేమీ లేకుండా, కేవలం ఉద్యోగాలను నమ్మి పెద్ద పెద్ద లోన్లు
తీసుకుని,పదేసి ఇన్సూరెన్స్ పాలసీలకు సిద్ధమైపోయి, ఖరీదైన జీవన శైలిని బలవంతంగా అలవర్చుకుని,దానికి అలవాటు పడి ప్రస్తుత ఆర్థిక మాంద్యం దెబ్బకు విల విలాడుతూ చేతిలో డబ్బు లేక,ఏమి చేయాలో తెలీక దిక్కుతోచక నిలబడ్డ వాళ్ళు ఎంతమందో!



అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంతగా నగదు జాగ్రత్త పరుచుకోవాలండి!లేదంటే బంగారమైనా! నగలైనా, బిస్కెట్లైనా కూడా పర్లేదు. లాభమే కానీ నష్టం లేదు.అవసరమైనపుడు "అయ్యో అలాగా" అనే సానుభూతి కంటే నగదే ఉపయోగపడేది.

ఇంత సొద ఎందుకు రాశానటే మిత్రుడొకరు ఫోన్ చేసి తన పాలసీ వివరాలు పంపుతున్నాననీ,దయచేసి ప్రీమియమ్ నా కార్డు ద్వారా ఆన్ లైన్ కట్టేయమనీ, లేదంటే పాలసీ మురిగిపోతుందనీ అర్థించారు.చేతిలో డబ్బు లేదు.!అదీ సంగతి!



ఆ పని చేసి, ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆలోచిస్తూ కూచుంటే మనసులో
మెదిలిన దాన్ని మాటల్లో పెట్టాను.

డబ్బే కాక, డబ్బు లేకపోవడం అనే విషయాన్ని అనుభవంలోకి తెస్తున్న ఆర్థిక వ్యవస్థకు, మాంద్యానికి జై!