August 25, 2009
నా ఆటోగ్రాఫ్ బుక్-స్వీట్ మెమొరీస్
నిన్న ఒక పుస్తకాల కొట్లో సెలోఫెన్ టేపు కొని వందరూపాయల నోటు ఇచ్చాను. బదులుగా కొట్టబ్బాయి ఇచ్చిన చిల్లరలో ఒక యాభై రూపాయల నోటు వెనక తెల్లని భాగంలో ఇలా రాసి ఉంది
"తెలియక కలిశాము, తెలిసి విడిపోతున్నాము. మరల ఎప్పుడైనా కనపడితే మాత్రం ఎవరని మాత్రం అడగకు ప్రియతమా" పాపం ఆ నోటు అందుకున్న ప్రియుడో, ప్రియురాలో ఈ మాటకు, నోటుకు కూడా పెద్ద విలువ ఇవ్వకుండా మార్కెట్లో మార్చేసినట్లున్నారు.
ఇంటికొచ్చాక, సరదాగా నా పాత ఆటోగ్రాఫ్ పుస్తకం తీసి చూస్తే కొంత మంది మిత్రులు రాసిన వాక్యాలు, మెసేజ్ లు భీభత్సంగా కనపడ్డాయి.
పదోక్లాసు అయ్యాక తలా ఒక కాలేజీ కి వెళ్ళిపోతాం కాబట్టి ఫేర్వెల్ పార్టీ కి వస్తూ దార్లో "స్టూడెంట్స్ ఫ్రెండ్స్"(ఇది మా వూర్లో చాలా పేరున్న పురాతన స్టేషనరీ షాపు) టోకున కొనేశాం ఆటోగ్రాఫ్ పుస్తకాలు! అప్పట్లో అమ్మాయిలు గులాబి రంగుని ఇష్టపడాలని తెలీకపోవడం వల్ల నచ్చిన డిజైన్లలో కొన్నాం! నా స్నేహితులంతా (ఆడపిల్లల స్కూలు) కవితాత్మకంగా ఉండాలని సినిమా పాటలన్నీ వెదికి కొన్ని లైన్లు బట్టీ కొట్టి వచ్చారు రాయడానికి.
ఎవరూ వేరే ఊరెళ్ళి చదివే సీన్ లేదు. ఇక విడిపోయే ఛాన్సెక్కడ? ఏదో ఒక రోడ్లో కనపడుతూనే ఉంటారుగా! అసలు సీట్లు దొరికితే అందరం ఒకే కాలేజీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నామాయె! అయినా కూడా ఎప్పటికైనా విడిపోతాం కాబట్టి, పోయాక మాకంటూ పదో తరగతి తీపి గుర్తులు ఉండాలని ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో మెసేజ్ లు రాసుకున్నాం.
అసలు ఆటోగ్రాఫ్ పుస్తకం ఏమిటో, ఎందుకో తెలీని వాళ్ళు కూడా ఉంటారని ఆ రోజే తెలిసింది. విమల అనే అమ్మాయి (ఇది భలే మొద్దు. వాళ్లకి రెండో పదో బస్సులుండేవి) తన మరో ఫ్రెండ్ పుస్తకంలో "టిట్ ఫర్ టాట్" అని రాసిచ్చింది. అవతలి పిల్ల మండిపడుతూ P.E.T రాజేశ్వరి టీచర్ గారికి ఫిర్యాదు చేసింది. ఆవిడ నిలదీస్తే విమల అమాయకంగా "అంటే ఏంటసలు! ఏదో ఎప్పుడూ వింటూ ఉంటాం కదాని రాశాను " అని చెప్పింది.
నాకో అమ్మాయి
"మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బ్రతుకంత కావాలి పూల తోట" అని రాసింది. "ఏ పాట?" అనడిగితే "నువ్వెప్పుడూ ఇంతే, నీకసలు కవితా హృదయం లేదు" అని తిట్టింది.
కొన్ని అద్భుత మెసేజ్ లు మీ కోసం..
"సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ"
"స్నేహబంధమూ ఎంత మధురమూ"
(ఇలా రాసిన వాళ్ళు పక్క వాళ్లకి ఒక్క మార్కు ఎక్కువొస్తే యూనిట్ టెస్టుల్లో కూడా రీ వాల్యుయేషన్ అడిగే రకాలు)
చాలా మంది "All that glitters is not gold" అని రాసిచ్చారు. మాథమాటిక్స్ ట్యూషన్ క్లాసులో కలిసే ఒక తెలుగు మీడియమ్ బాబు All that "glitters" అంటున్నాం కదా అప్పుడు glitters "is" కాకుండా glitters "are" అని ఉండాలేమోరా, నాకు డౌటుగా ఉందన్నాడు. అతడిపేరు శ్రీను!
ఇక కాలేజీలో ప్లస్ టూ అయ్యాక కొందరు వేరే వూళ్ళకి, వేరే కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సందర్భం లో కూడా ఫేర్ వెల్ రోజు ఆటోగ్రాఫ్ పుస్తకాలెక్కడ ఉన్నాయో దుమ్ము దులిపి తీసుకెళ్ళాం, వీళ్లు రాసే గోల్డెన్ వర్డ్స్ కోసం!
మా క్లాసులోని 132 మందిలో భావ కవిత్వం రాయాలనే కోరిక ఎంతమందిలో అంతర్లీనంగా పాతుకుపోయి ఉందో ఆ రోజు బయట పడింది. కొందరు లాజికల్ గా, మరికొందరు మాథమాటికల్ గా మరికొందరు మరో "కల్ " గా రాశారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కూడా భీభత్స రస ప్రధానంగానే జరిగింది.(ఇప్పుడు చూస్తే అనిపిస్తోంది అలా)
పూజారి గారబ్బాయి గోపాల కృష్ణా చార్యులు ఇలా రాశాడు చాలా మందికి, నాతో సహా...
"Forget the word Gopal..!
Forget the word krishna..!
Forget the word charyulu...!
But don't forget Gopala krishna charylu"
అది చూసి అందరూ "ఓర్ని, గోపీ భలే రాశాడే"అని ఆశ్చర్యం పడ్డారు. ఈ గోపి ఇప్పుడు టెక్సాస్ లో ఉన్నాడు. ఆ మధ్య మెయిల్లో "నా ఆటోగ్రాఫ్ పుస్తకం దొరికింది గోపీ" అని తను రాసింది చెప్తే ఎంత సిగ్గుపడిపోయాడో తర్వాతి మెయిల్లో! "అబ్బా, నీకిదేం పాడు బుద్ధి? ఎప్పటెప్పటివో అన్నీ దాస్తావు" అని సరదాగా చిరాకు పడ్డాడు.
నాతో ప్రతి సబ్జెక్టులోనూ స్కూలు రోజులనుంచీ పోటీ పడుతుండే శ్రీధర్ "నువ్వు ప్రతి పరీక్షలోనూ తప్పాలి" అని రాసి, "ప్రతిపరీక్షలోనూ నాకంటే ఒక్క మార్కు నీకు తక్కువ రావాలి" అని నేను రాసేలా చేశాడు.
శ్రీధర్ ఇప్పుడు ఢిల్లీలో Ministrey of external affaris లో ఉన్నాడు.
ఎవరితోనూ మాట్లాడకుండా పుస్తకాల్లో తల దూర్చి అంతర్ముఖుడిగా ఉండే చంద్ర శేఖర్ అనే అబ్బాయి ఒక్కొక్కరికీ రాసిన వాక్యాలు చూస్తే కళ్ళు తిరిగాయి మాకు.
నా పుస్తకంలో ఇలా రాశాడు.
"పరిచయం అనే మొక్కకు స్నేహం అనే నీరు పోస్తే
మమతలనే రెమ్మలతో పెరిగి
అనురాగమనే పుష్పం పూసి, ప్రేమ అనే ఫలాన్నిస్తుంది"
మరొక అమ్మాయికో, అబ్బాయికో గుర్తు లేదు గానీ
"మనం ప్రేమించిన వారు దొరికితే అనురాగం వెల్లివిరుస్తుంది
మనల్ని ప్రేమించే వారు దొరికితే మమకారం మొగ్గలేస్తుంది
నిన్ను ప్రేమించిన వారు, నువ్వు ప్రేమించిన వారు ఒకరే అయి
నీ జీవితం నందనవనం కావాలని..."
ఇలాగే అందరి పుస్తకాల్లోనూ కవిత్వాన్ని ఇష్టం వచ్చినట్లు కుమ్మరించి పారేశాడు. ఎలాగో మేం తేరుకుని "అదిరిందయ్యా చంద్రం,, ఇంత కవివా నువ్వు? ఇవన్నీ ఎప్పుడు రాశావు?"అనడిగాం!
దానికి చంద్రం "ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర" ఒక ఫైలు తీసి "ఇందులోవే.." అని చూపించాడు.
దాంట్లో పత్రికల్లో వచ్చే భావకవితల పేపర్ కటింగ్స్ రెండు మూడు కట్టలున్నాయి. వాళ్ల అన్నయ్య రాసినవి కూడా అందులో ఉన్నాయిట. ఆ ఫైలు వాళ్ల అన్నయ్యదే!
చంద్ర శేఖర్ ఇప్పుడు గుంటూర్లోనో, ఒంగోలు లోనో కామర్స్ లెక్చరర్!
మరికొంతమంది రాసిన ఆణిముత్యాలు చూడండి..
"love is like a flower, but friendship is like a sheltering tree"
వివేకానందుడి "Arise, awake, and stop not till the goal is reached" అనే వాక్యాన్ని కనీసం పది మంది రాశారు తమ స్వంత కవితా స్ఫూర్తి మీద నమ్మకం లేక!
రాజ శేఖర్ అనే కుర్రాడు
W words
A Action
T your Thinking
C Character
H Heart
అని రాశాడు ఎక్కడనుంచి పట్టి తెచ్చాడో గానీ!
మరొక హాస్య ప్రేమికుడు...
"Observe -Four
choose -Three
Love -Two
marry - One,," అని అబ్బాయిలకూ, అదే వూపులో అమ్మాయిలకూ రాసి చీవాట్లు తిన్నాడు!
"Life is not a bed of roses" అని ఒకరూ,
"To gain something, you have to lose something" అని ఒకరూ,
"ఓర్పు కన్నా సముద్రం చాలా చిన్నది"అని ఒకరూ
"If you turn your face towards sun, you can't see your shadow" అని మరొకరూ,
ఇలా ఏదో ఒక సందేశం ఇవ్వకపోతే లాభం లేదన్నట్లు చాలా చాలా రాశారు.
తిరుమల గుప్తా అనే షరాబు గారబ్బాయి వెరైటీగా
"ఎందుకొచ్చిన చదువులు? అందరూ తలా ఒక బిజెనెస్ చేసి బాగా డబ్బు సంపాదించండోయ్" అని రాశాడు.(ఇతడు ఇంటర్లో ఉండగానే షేర్లలో డబ్బు పెట్టి లాభాలు గడిస్తుండే వాడు) అప్పట్లో అది మాకు హృదయం లేని బండగాడిద రాతలా అనిపించినా ఇప్పుడు చూస్తే
"తిరుమల బాగానే చెప్పాడు" అనిపిస్తుంది. తిరుమల ఇప్పుడు మా వూర్లోనే బంగారు నగల షాపు పెట్టి మూడు బిల్డింగులు కట్టాడు. షాపుకు వెళ్తే, స్నేహితులన్న చిన్నపాటి కన్ సర్న్ కూడా లేకుండా కమ్మగా కబుర్లు చెపుతూనే మాక్కూడా 16% వేస్టేజ్ వేసుకుంటాడు. టూ ప్రాక్టికల్!
ఇంటర్లో అనుకుంటా, సుభాష్ అనే అబ్బాయి కి ఈ పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వమంటే...మొత్తం తిరగేసి..
"My sincere advice ..., please do not keep this book with you" అని రాసిచ్చాడు.
టీచర్లు,లెక్చరర్లు రాసేవాటికి పెద్ద ప్రాధాన్యం లేదు. ఎంచేతంటే వాళ్ళెప్పుడూ "wish you all the best" అనో,
"wish you success in your life" అనో రాస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ చదివేలా ఉండవు. కవి, రచయిత నాగభైరవ కోటేశ్వర రావు గారు మాత్రం (సందర్భం గుర్తు లేదు ఎప్పుడో),
"దీపం నీ ధ్యేయం" అని రాసి అర్థం కాకుండా సంతకం పెట్టారు.
డిగ్రీలోకొచ్చాక, ఇక వీటిమీద ఆసక్తి పోయింది. ఆ మధ్య Planet M లోనో , లాండ్ మార్క్ లోనో ఎస్సెమ్మెస్ ల పుస్తకం చూశాను. అలాగే ఆటోగ్రాఫ్ పుస్తకాల్లో రాయడానిక్కూడా అప్పట్లో ఏవైనా పుస్తకాలుండి ఉంటే నా ఈ తీపి జ్ఞాపకాల పుస్తకంలో ఇంకొంచెం బెటర్ మెసేజ్ లు ఉండేవేమో గానీ అవి వీటంత మధురంగా ఉండేవి కాదేమో!
"

