ఎన్ని పత్రికలు చదివినా చందమామతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మాసిపోనిది, మరపురానిది అనిపిస్తుంది. ఎందుకంటే అది పిల్లలకే పరిమితమైన పత్రిక అని ఎప్పుడూ అనుకోను. ఏడేళ్ళ వయసులో ఎంత ఉత్సాహంతో చందమామ కోసం ఎదురు చూశానో, ఎంత ఇష్టంగా చదివానో ఈనాటికీ అదే ఉత్సాహంతో ఎదురు చూసి, అంతకు మించిన ఇష్టంతో చదువుతాను. అటువంటి చందమామతో మీ జ్ఞాపకాలేమిటి అని ఎవరైనా అడగాలే కానీ ఎగిరి గంతేసి మరీ చెప్పనా! అందుకే ఆన్ లైన్ చందమామ కోసం జ్ఞాపకాలు రాయమని రాజశేఖర్ రాజు గారు అడగ్గానే రాసి పంపాను. ! చందమామ పత్రికను తల్చుకోవడమంటే చుక్కల తీరంలో, వెన్నెల దారుల్లో రెక్కల గుర్రం ఎక్కి అందమైన బాల్యం లోకి పరుగులు తీయడమే! నా చందమామ జ్ఞాపకాలు ఇక్కడ ....!.
అక్కడ, ఫొటోలో ఉన్నది నా చందమామలతో మా పాప సంకీర్తన.
September 23, 2009
September 21, 2009
అలగకపోతే చూడాలి !
చీటికీ, మాటికీ అలిగి కూచునే వాళ్లని చూస్తే ఇదివరలో భలే కోపం వచ్చేది. ఇప్పుడు అలవాటైపోయింది....కోపం రావడం! మా అమ్మాయి నేను కొంచెం కంఠం గట్టిగా చేద్దామని అనుకుంటూ ఉండగానే "నువ్వు నన్ను తిట్టావు"అని మొహం అటు తిప్పేసుకుని కూచుంటుంది, స్కూలు బస్ రెణ్ణిమిషాల్లో వస్తుందనగా!
బీపీ పెరుగుతుందా పెరగదా?
పైగా "నీతూ వాళ్ళమ్మ .నీతూని ఏమీ అనదట ." అని ఇంకొకరిని తోడు తెచ్చుకుంటుంది. పాపం ఆ నీతూ వాళ్ళమ్మకు ఇహ ఆ ఓపిక కూడా లేదన్నమాట.
అసలు ఎవరైనా "అలక" ఎందుకు పూనుతారో, దీనెకేదైనా సైంటిఫిక్ కారణాలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని కోరిక నాకు! పైగా అలిగినపుడు ఆ కోపం "తిండి" మీద ఎందుకు చూపిస్తారా అని ఇంకో ఆశ్చర్యం!(చిన్నప్పుడు నేనూ అంతే లెండి)
మా ఇంట్లో ఎప్పుడూ ఎక్స్ కర్షన్ కి పంపించే వాళ్ళు కాదు. అన్ లెస్..ఇటీజ్ కొండవీడు లేక అమరావతి! ఇవి రెండూ దగ్గర కాబట్టి, సాయంత్రానికి ఇంటికొచ్చేస్తాం కాబట్టి! (ఇది తల్చుకుంటే కడుపు రగిలిపోతుంది నాకు. స్నేహితులందరితో కలిసి ఎక్స్ కర్షన్ కి వెళ్ళని జన్మా ఒక జన్మేనా అసలు?) ఒకసారి మా స్కూలు వాళ్ళు శ్రీశైలం టూర్ కి ప్లాన్ చేశారు. మామూలే! మా ఇంట్లో వద్దనేశారు.
"ఏమిటి మతిపోయిందా? శ్రీశైలమే? అంతా కొండ, అడవి,నీళ్ళూనూ! (ఇవి లేని చోటికి ఎవరైనా ఎందుకెళ్ళాలో మరి) మనమందరం కలిసి వెళ్దాం లే" అనేశారు.(ఇంట్లో వాళ్ళతోనా? ఛీ)
ఆ రోజంతా అలిగి కూచునున్నాను, అన్నం తినకుండా!ఇలాంటి సందర్భాల్లో అమ్మ మా తిక్క భలే కుదురుస్తుంది. శరన్నవరాత్రులు కావడంతొ అమ్మవారికి చేసే నైవేద్యం కాక, దానితో పాటు ఆవడలు చేసింది అసందర్భంగా! సందర్భం చూసుకోకుండా అలిగినందుకు చింతిస్తూ..భోజనాల టైముకు మామూలుగా ఉండే ప్రయత్నం చేశాను, అమ్మ గమనించకుండా కాజువల్ గా ఉండేలా జాగ్రత్త పడుతూ!!
కానీ ఆవిడ పది నిమిషాలకోసారి 'అమ్మలేమో అలిగి కూచుందాయె, ఇవాళల్లా తిండి తినదు,!ఎంత మొండితనమో"అని ఎవరో ఒకరితో అంటూనే ఉంది.
"అలగడం నీ హక్కు! నీ హక్కుని పరిరక్షించడం మా బాధ్యత" అన్నట్లు ప్రవర్తించేది అమ్మ. అసలు బతిమాలేది కాదు.అంత స్ట్రిక్టు!
అసలావిడది స్టీవెన్ సీగల్ స్టైలు! ఏం జరిగిందో తెలిసే సరికి చెంప ఛెళ్ళుమనడం జరిగిపోయేది.(ఇదెప్పుడూ అన్నయ్యకే)
అమ్మాయిలెప్పుడూ నాన్న కూతుళ్ళు కాబట్టి నానగారు మాత్రం "అదెందుకు అలిగిందీ"అని అలక తీర్చే ప్రయత్నాలు మొదలెట్టేవారు. ఈ డిస్కౌంట్లు అబ్బాయిలకుండవు. అన్నయ్య కి కోపం వచ్చిందంటే చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు. ఒకసారి వాడు రాత్రియినా ఇల్లు చేరకపోయేసరికి నాకు అందమైన కలలొచ్చాయి కూడా!
వాడు అలా అలిగి వెళ్ళిపోయి ఏ వంతెన కిందో డబ్బు , రత్నాలు పంచుకుంటున్న దొంగల ముఠాలో చేరి పెద్ద "డాన్" అయిపోతాడు. ఈ లోపు నేనొక అందమైన పోలీసాఫీసరుని (ఎస్పీకి తక్కువ రాంక్ కాకుండా చూసి)పెళ్ళాడేస్తాను. ఒకరోజు నేను నాగదేవత గుడికి వెళ్ళి పాము తో పిచ్చాపాటీ మాట్లాడుతుండగా అన్నయ్య నన్ను గుర్తుపట్టి ఆ తర్వాత రోజు వచ్చే రాఖీ నాడు మా ఇంటికి ఒక బస్తాడు రత్నాలతో వస్తాడు.
అదే టైములో ఎస్పీ గారు....! ("ఈ సినిమామీరు చూశారు " కదూ )
ఇంత సస్పెన్స్ లో ఉండగా అమ్మ లేపేసింది. లేచి చూస్తే... మడతమంచం మీద ఉన్న ముసుగు వీరుడు అన్నయ్యే అని తెల్సి నిరాశపడ్డాను. ఆ తర్వాత వాడు అలకలు మానలేదు కానీ నా కల మాత్రం నిజం చేయలేదు.
మా అమ్మాయి ఏ యే మాటలకు అలుగుతుందో చూడండి!
"ఏమిటి, ఇంకా ఆ రెండిడ్లీ తినడం అవలేదా?"(రెండు ఇడ్లీ ఇచ్చి అప్పుడే ఇలా అడిగేస్తారా ఎవరైనా?)
"నీ క్లాసులో అనన్య భలే ముద్దుగా ఉంటుంది" (అంటే నేను ఉండననేగా?)
"హాండ్ రైటింగ్ ఇలా ఉందేమిటి?"(మొన్నేగా నా హాండ్ రైటింగ్ బావుందని మెచ్చుకున్నావూ?అప్పుడే ఇలాగంటావా?")
"త్వరగా నడువ్, బస్సొచ్చేస్తుంది"(అంటే నేను లేట్ మాస్టర్ అనేగా నీ భావం?")
"డ్రస్ ఎందుకు అంతలా మాసిపోయింది?"(అంటే? నాకు నీట్ నెస్ తెలీదనేగా?)
"ఈ ఫ్రాక్ వద్దు, ఆ జీన్సు వేసుకో" (అంటే నేను ఫ్రాక్ లో సిండరెల్లా లాగా ఉండననేగా?")
ఈ మధ్య కౌన్సిలింగ్ లు ఎక్కువై అలకలు తగ్గించింది కానీ, లేకపోతే రెండు సార్లు పిలిచినా నేను పలక్కపోతే అలిగేస్తుంది.
భయపెట్టి అలకలు మానిపిద్దామంటే కుదరదు. దెయ్యాలు, బూచాళ్ళు ఉండరని నేనే చెప్పాను. ఇక దేనికి భయపడుతుందీ? టీచర్లని చూపించి భయపెట్టడం నాకిష్టం లేదు.
తొమ్మిదో టీవీ లో క్రైం వాచ్ యాంకరంటే కూడా భయపడని పిల్లని ఏం చూపించి భయపెట్టాలో మరి!
ఇవాళ పొద్దున్నే అలిగి కూచుంది, ఎందుకంటే...Monday అంటే మంగళవారం కానందుకు! మంగళవారం దసరా సెలవులకు అమ్మమ్మ దగ్గరికి వెళ్తోంది మరి!

September 10, 2009
కుట్రాజకీయం
మనలో చాలా మందికి చరిత్ర అంటే అంతగా ఆసక్తి లేకపోవడానికి కారణం గణాంకాల ఆధారాలకు ప్రాముఖ్యం ఇచ్చి కేవలం ముఖ్యాంశాలనో, "పాజిటివ్" అంశాలనో తెలియజేస్తూ "సమాచారాత్మకం"గా ఉండటం కావొచ్చు! నేనైతే స్కూలు రోజుల్లోనే చరిత్ర అంటే బోరు కొట్టే సబ్జెక్టుగా నిర్ణయించేసుకుని మళ్ళీ దాని జోలికిపోలేదు. కానీ తర్వాతి కాలంలో సమాజానికి నిజంగా అవసరమైన ప్రపంచ చరిత్ర,ముఖ్యంగా వాస్తవాలను తెలియజేసే రాజకీయ, ఆర్థిక చరిత్ర,కూలంకషంగా చదవడం చాలా ముఖ్యమని గ్రహించాను.
అమెరికన్ పత్రికా రచయిత , Newyork Times పత్రికకు విలేకరిగా ఐదు ఖండాల లో 50 దేశాల నుంచి వార్తలను అందించిన స్టీఫెన్ కింజర్ రచించిన "Over throw"(America's Century of Regime Change from Hawai) " పుస్తకానికి రచయిత, ఉద్యమకారుడు,గుండె చప్పుడు బ్లాగర్ శ్రీ కొణతం దిలీప్ స్వేచ్ఛానువాదం కుట్రాజకీయం(అమెరికా దుర్మార్గాల శతాబ్ది అనే టాగ్ లైన్ తో) పేరుతో
ఈ మధ్యనే విడుదలైంది. నేను చదవడం ఈ ఉదయమే పూర్తయింది.
జాన్ పెర్కిన్స్ "confessions of an Economic hitman" పుస్తకాన్ని దిలీప్ "ఒక దళారీ పశ్చాత్తాపం"గా తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసినపుడు ఎంత ప్రజాదరణ పొందిందో, ఎంత సంచలనం సృష్టించిందో, ఎన్ని చర్చలకు పునాది వేసిందో అందరికీ తెలిసిందే!పుస్తకం విడుదలైన మొదటి రెండేళ్ళలోనే ఆరుసార్లు, మొత్తం మీద ఎనిమిది సార్లు పునర్ముద్రించారంటే ఆ పుస్తకానికి లభించిన ఆదరణ గురించి ప్రత్యేక వివరణ అవసరం లేదు.
దిలీప్ అనువదించిన ఈ రెండో పుస్తకం కూడా అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను వివరించే పుస్తకమే కాబట్టి ఒక రకంగా దీన్ని 'ఒక దళారీ పశ్చాత్తాపం' పుస్తకానికి కొనసాగింపుగానే భావిస్తున్నట్లు ప్రకాశకులు ముందుమాటలో పేర్కొన్నారు!
ఒక శతాబ్దం పాటు అమెరికా అనేక చిన్న దేశాల ప్రభుత్వాలను ఎంత హేయమైన పద్ధతుల్లో కుట్ర చేసి కూల్చివేసిందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందీ పుస్తకం! ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించడం,జాతీయ భావాలను కలిగి ఉండటం, అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు భంగం కలిగేలా తమ దేశ వనరులపై ఆయా దేశాలు హక్కులు కలిగి ఉండాలనుకోవడం ఇత్యాది కారణాలు ఈ కుట్రలకు మూలస్థంభాలు! ఎదురు తిరిగిన వారిని పదవీచ్యుతులను చేయడం, ఆయా దేశాల్లోని ప్రజలను, మత పెద్దలను,సంస్థలను,చివరికి పత్రికలను,మిలిటరీని కూడా డాలర్లు గుప్పించి కొనేసి కృత్రిమ తిరుగుబాట్లను లేవదీయడం, సందట్లో సడేమియా లాగా పరిస్థితులను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం, తనకు అనుకూలంగా ఉండే కీలుబొమ్మ కు ప్రభుత్వాన్ని కట్టబెట్టడం ఇదీ అమెరికా రాజనీతి!
హవాయి దీవులలో 1893 లో మొదలైన ఈ కుటిలమైన కుట్ర నిన్న మొన్న మన కళ్ళెదురు గా జరిగిన ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్ ప్రభుత్వాల కూల్చివేత వరకూ అప్రతిహతంగా ఎలా సాగిందో, ఎంత మందిని బలి కోరిందో, "నోరున్న వాడిదే రాజ్యం, డబ్బున్నవాడికే అది వీరభోజ్యం"అన్న కౄరమైన కఠిన సత్యాన్ని ఎలా అమలుపరిచిందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందీ పుస్తకం!
హవాయి,క్యూబా, ప్యూర్టోరికో,ఫిలిప్పీన్స్,నికరాగువా,హోండురాస్, ఇరాన్,గ్వాటెమాలా, దక్షిణ వియత్నాం,చిలీ,గ్రెనెడా,పనామా, ఆఫ్ఘనిస్తాన్,ఇరాక్ ...ఈ దేశాలలో కొన్ని చోట్ల రక్తం చిందకుండానూ, కొన్ని చోట్ల తిరుగుబాట్లు చేయించీ, మరి కొన్ని చోట్ల లాభం లేదనుకుంటే రక్తం వరదలై పారించి పంతాన్ని నెగ్గించుకుని ప్రభుత్వాల్ని పేకమేడల్లా కూల్చి వేయడానికి అగ్ర రాజ్యం చేసిన కుట్రలు చదువుతుంటే ఊపిరాడనంత ఆశ్చర్యం కల్గుతుంది.
మొదట్లో తన కుట్రలను బహిరంగంగానే కానిచ్చిన అమెరికా తర్వాత కాలంలో సోవియట్ రష్యా భయంతో రహస్యంగా కుట్రలను సాగించిన విధానాన్ని ఇరాన్, గ్వాటెమాలా,చిలీ, దక్షిణ వియత్నాం వంటి దేశాల ప్రభుత్వ విచ్ఛిన్నాల్లో చూడొచ్చు! సోవియట్ విచ్ఛిత్తి తర్వాత అమెరికాకు రహస్య చర్యలకు పాల్పాడాల్సిన అవసరం తీరిపోవడంతో ప్రత్యక్ష సైనిక చర్యలతో నిస్సిగ్గుగా విరుచుకు పడటాన్ని ప్రత్యక్షంగానే చూశాం!
ఈ పుస్తకంలోని ప్రతి కుట్ర కథా ఆద్యంతం ఆసక్తిగా, ఉత్కంఠగా చదివిస్తుంది.కొన్ని చోట్ల ఆశ్చర్యాన్ని,మరికొన్ని చోట్ల అమెరికా దుర్నీతి పట్ల అసహ్యాన్ని కల్గిస్తుంది. మరికొన్ని చోట్ల రక్తాన్ని మరిగిస్తుంది. ఉపోద్ఘాతం, ఉపసంహారం ఈ పుస్తకాన్ని సమతూకంలో నిలుపుతూ అద్భుతంగా అమిరాయి.
దిలీప్ గారి స్వేచ్ఛానువాదం ఎలా వుంటుందో మొదటి పుస్తకంతోనే రుజువైంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. యూనివర్సిటీ చరిత్ర క్లాసులో అనుభవజ్ఞుడైన అధ్యాపకుడు శ్రద్ధగా వివరిస్తున్న పాఠం లో లీనమై పోయిన విద్యార్థిలా ఫీలయ్యాను ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ!
అందరూ చదవాల్సిన ఈ పుస్తకం ఆగస్టు లో విడుదలైంది
ప్రతులకు సంప్రదించాల్సిన చిరునామా
వీక్షణం ప్రచురణలు
మైత్రి రెసిడెన్సీ,
3-6-394
స్ట్రీట్ నెం 3,హిమాయత్ నగర్
హైదరాబాద్-29
ఫోన్:66843495
ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ లభిస్తుంది.
వెల 40 రూపాయలు మాత్రమే
September 9, 2009
ఇంకా పాడాలా?
సినిమా గాయకుల్లో నాకు శ్రీమతి పి.సుశీల గారి స్వరం అంటే చెప్పలేనంత అభిమానం! ఆరాధన,ఇష్టం, పిచ్చి! శాస్త్రీయ సంగీతాన్ని కొన్నాళ్ళు నేర్చుకున్నా, నాకు అటువైపు కంటే పాత సినిమా పాటల మీద మనసు పీకుతూ ఉండేది,(ఇప్పటికీ అనుకోండి)! దానికి ఇతోధికంగా దోహదం చేసింది విజయవాడ ఆలిండియా రేడియో! వాళ్లెప్పుడూ పా........త పాటలు తప్ప కొత్త పాటలు వెయ్యకూడని కంకణం కట్టేసుకుని ఉంటారు రెండు చేతులకీ!
అలా పాత సినిమా పాటల మీద వ్యామోహం పెంచుకుని ఆనాటి సుశీల గారి పాటలు విని(ఈనాటికీ) పరవశించడం జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.నా శాస్త్రీయ సంగీత సాధన చెట్టెక్కడానికి సుశీల గారే కారణం అని ఆరోపించడానికి కూడా సిద్ధమే!
పాత తెలుగు సినిమా పాటల్లో జానకి కి అంత ప్రాధాన్యం లేకపోవడం వల్లనో, మంచిపాటలు ఆమెకు దక్కకపోవడం వల్లనో ఇళయరాజా శకం వచ్చేదాకా జానకిపాటలు అంతగా నచ్చేవి కాదు. మొత్తం మీద ఇద్దర్లో ఎవరికి వోటంటే నిస్సందేహంగా నా వోటు సుశీలకే!
మహా కవి కాళిదాసు సినిమాలో జయ జయ జయ శారదా పాట వింటే సరస్వతి లేచి పరిగెత్తుకుంటూ వస్తుందేమో అనిపిస్తుందిప్పటికీ!
రాజేశ్వర రావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల స్వరంలో ప్రాణం పోసుకున్న అమృత ధారలు కోకొల్లలు. ఆమెకు పెద్దగా పోటీ లేకపోవడం వల్ల,ఆమె గొంతులో ఉన్న క్వాలిటీ మిగిలిన గాయనీమణుల గొంతుల్లో లేకపోవడం వల్ల కాబోలు కొన్ని వేల పాటల్ని అలవోకగా పాడి తెలుగు సినీ సంగీత సామ్రాజ్యానికి దశాబ్దాల పాటు మహరాణిగా వెలుగొందారు సుశీల!
ఆమె స్వరంలో ఉన్న మాధుర్యం మెత్తదనం, మృదుత్వం,సౌకుమార్యం, భావ ప్రకటనా సామర్థ్యం,..అనితర సాధ్యం! సుశీల గారి పాటల్లో నేను ప్రాణాలిచ్చేపాటలు కొన్ని....(కొన్ని మాత్రమే)
కనరాని దేవుడే కనిపించినాడే.(రంగుల రాట్నం)
ఏమని పాడెదనో ఈ వేళ.(భార్యా భర్తలు)
మోగింది వీణ పదే పదే .(జమీందారు గారి అమ్మాయి)
జోరు మీదున్నావు తుమ్మెదా. (శివరంజని)
లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. (కళ్యాణి)
ఇంకా అనేకం, సమయానికి గుర్తు రావు కానీ!
సుశీల గారి తర్వాత స్థానం జానకి కే! లతా మగేష్కర్ పాత హిందీపాటలన్నా సుశీల గారి తెలుగుపాటల స్థాయిలోనే మనసు పారేసుకుంటాను.
ఇక విషయానికొస్తే....
వృద్ధాప్యం ఎవరినైనా జయించి తీరుతుంది, మనసును కాకపోయినా , కనీసం శరీరాన్ని!
లతా మంగేష్కర్, సుశీల, జానకి వీళ్లంతా తెలుగు సినీ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించి,సంగీత ప్రపంచాన్ని జయించినవారే! సందేహమే లేదు. కానీ వీరు వృద్ధాప్యం తమ స్వరంలో ప్రవేశించి దాన్ని జయించిందన్న కఠిన సత్యాన్ని అంగీకరించకపోవడం ఆశ్చర్యాన్ని, ఒకింత బాధను కల్గిస్తుంది నాకు!
ఏదొ ఒక సన్మాన సభలోనో, సంగీత కార్యక్రమం లో న్యాయనిర్ణేతలుగా వచ్చినపుడో నిర్వాహకులు పాడమని అడిగినపుడు వీరు పాడాలని ప్రయత్నిస్తే శ్రోతలకు(లేదా వీక్షకులకు)ఆ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.
దానికి ఇంకో కారణం కూడా ఉంది.తమ అభిమాన గాయనీమణుల మీద అవధులు లేని అభిమానంతోనో, సభా మర్యాద కోసమో ఇప్పటికీ సంగీత దర్శకులు, సభ నిర్వాహకులు "ఆమె స్వరంలో ఇంకా మాధుర్యం లేశమైనా తగ్గలేదు"అని ఇచ్చే మొహమాటపు స్టేట్ మెంట్స్ వారి ఆత్మవిశ్వాసాన్ని "బూస్టప్" చేస్తుండవచ్చు!
ఆమధ్య జానకి గారు ఒక స్టేజ్ మీద సిరి మల్లె పూవా. పాట పాడడానికి ఎంతో ప్రయాస పడటం చూసి చెప్పలేనంత విచారం వేసింది.నిజానికి కళ్ళు ముసుకుని ఆ పాట వింటుంటే పదహారేళ్ళ శ్రీదేవి ఊహల్లోకి పరుగెత్తుకు రావలసిందే! కానీ ఆమె ఆనాటి "స్థాయి"(pitch)ని అందుకోలేకపోయారు.
లతా మంగేష్కర్ పరిస్థితీ ఇదే! అలాగే ఆశా భోంస్లే ఈ మధ్య చందమామ సినిమ కోసం పాడిన నాలో ఊహలకు. పాట వింటే ఆమె స్వరంలో మార్పు గమనించవచ్చు.
ఈ మధ్యనే ఒక టీవీ ఛానెల్లో గాయని, యాంకర్ సునీత "ఝుమ్మంది నాదం" అనే కార్యక్రమాన్ని సుశీల గారితో నిర్వహించడం చూశాను.(ఈ కార్యక్రమం పేరు కూడా సుశీల గారి సూపర్ హిట్ పాటే) అందులో శ్రీమతి సుశీల "ఏమని పాడెదనో" పాట పాడి వినిపించారు. (ఒరిజినల్ పాట పైన విన్నారుగా)
ఎంతో అద్భుతమైన పాట! చక్కని భావ ప్రకటన, అతి చక్కని సింపుల్ గమకాలతో అందంగా సుశీల గారు పాడిన పాట!
సుశీల ఈ పాటను "సరిగా" పాడాలని ఎంత ప్రయత్నించినా, ప్రయాస పడినా శ్రుతి, లయ తప్పనే తప్పాయి! . ఊపిరి తీసుకోడానికి మధ్యలో ఆగి,ఎలాగో మేనేజ్ చేయవలసి వచ్చింది, ఆర్కెస్ట్రా ఎంతగానో సహకరించినా!
అంతకు ముందే ఒరిజినల్ పాట చూసి ఉండటంతో ఈ పాట విని మనసు వికలమైపోయింది.
సునీత అతిశయోక్తులతో అ పాటను మెచ్చుకుని మళ్ళీ మళ్ళీ పాడించింది.
నా బాధాపూర్వక వినతి ఏమిటంటే
"మీరంతా ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఏలి, అభిమానుల్ని పాదాక్రాంతుల్ని చేసుకున్నవారు! అమృతాన్ని తాగి మాకు పంచిన వారు! వయసు పైబడ్డ కారణంగా, వృద్ధాప్యం మీ స్వరం పై తన ప్రభావాన్ని నిస్సంకోచంగా చూపిస్తోందని గ్రహించండి. మీరు ఒకప్పుడు కర్ణపేయంగా పంచిన మధుర స్వరాలను మా మనసులో, ఊహల్లో, మా చెవుల్లో నిలిచిపోనివ్వండి! ఆ పాటలను ఇపుడు మళ్ళీ పాడాలనే ఉత్సాహంతో, మా కలలను చెదరగొట్టకండి!
ఏ స్టేజ్ మీదో మిమ్మల్ని పాడమని అభిమానులో, నిర్వాహకులో కోరితే స్వరం సహకరించడం లేదని చెప్పి సున్నితంగా తిరస్కరిస్తే మీ గౌరవం హెచ్చుతుందే గానీ తగ్గదు!మీ అద్భుతమైన గళంలో ఈ అనూహ్యమైన మార్పును అభిమానులు ఊహించుకోలేరు మరి!"
"జీవితపు చివరి క్షణాల వరకూ పాడుతూ ఉండాలనే" కోరిక గాయకులందరికీ ఉండొచ్చు కానీ(వృద్ధాప్యం మీద పడ్డాక) అందులోని సాధ్యా సాధ్యాలను, అభిమానుల మనోభావాలను కూడా పట్టించుకుంటే బాగుంటుందేమో!
ఝుమ్మంది నాదం వీడియో క్లిప్పింగ్ నా దగ్గరుంది. కానీ అదొక బాధాకరమైన అనుభవం! దాన్ని అందరితో పంచుకోవడానికి కూడా మనస్కరించక ఇక్కడ అప్ లోడ్ చేయలేదు!
ఈ గాయనీమణుల మీద నాకెలాంటి ఫిర్యాదూ లేదు. హద్దులు లేని అభిమానంతో రాసిందే ఈ టపా!
September 3, 2009
ఇదే జీవితం! ఇదే శాశ్వతం!
మరణం ఒక యాక్సిడెంట్! ఎవర్ని ఎప్పుడు ఎలా ఎక్కడ వరిస్తుందో తెలీదు! రాష్ట్ర ప్రభుత్వాధిపతి, కాంగ్రెస్ ని కనుసన్నలలో నడపగలిగిన నేత, ఈ రోజు దిక్కులేని స్థితిలో ఒక మారుమూల కొండపై మృతదేహమై పడి ఉన్నాడు, గుర్తించలేని స్థితిలో!
ఆయన ఇక భౌతికంగా సజీవంగా ఉండి ఉండరన్న సందేహం ప్రతి ఒక్కరి గుండెలో తొలుస్తున్నా, ఎక్కడో ఒక చిన్న ఆశ...క్షేమంగా తిరిగొస్తాడేమో అని! హెలికాప్టర్ శకలాలు కనపడ్డాయని తెలిసిన తర్వాత కూడా వీడని అర్థం లేని అత్యాశ!
ఇదిలా ఉంటే:
రాష్ట్ర ముఖ్య మంత్రి కనపడకుండా పోయిన ఉద్విగ్న సమయంలో ముఖ్యమైన ప్రకటనలు చేస్తున్న ఆర్థిక మంత్రి పక్కన పైకి ఖరీదు అంతగా కనపడని అతి ఖరీదైన చీరెలో చెంపకు చెయ్యి చేర్చి హరి కథ వింటున్న భంగిమలో సాక్షాత్తూ రాష్ట్ర హోమ్ మంత్రిణి!సమర్థత కంటే రాఖీకే విలువెక్కువని నిరూపించిన సోదరి!
వీరవిహారం చేస్తూ నిమిషానికో కొత్త కథ వినిపిస్తున్న అసంఖ్యాక మీడియా ఛానెళ్ళు!
నిన్నంతా...వై యెస్ క్షేమంగా ఉన్నారని తలుస్తే Y అనీ, పోయారని భావిస్తే N అని ఎస్సెమ్మెస్ లు పంపాల్సిందిగా వీళ్ళ హోరు. మరో పక్కన ఆయన క్షేమంగా తిరిగి రావాలని పంపే విషెస్!
(ఈ రోజేమో నివాళులు పంపే ఎస్సెమ్మెస్ లు)!
జీవితం ప్రచారాల సుడిగుండంలో చిక్కుకున్న చిల్లుపడవైపోయింది.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి కాలి నడకన నల్లమల అడవుల్లో తమ నాయకుడి కోసం వెదికే ప్రయత్నం చేస్తున్న అభిమానులు...!
"ఆయనొచ్చాక ఏం మంచి జరిగిందని బాధ పడాలి, ఆయన పోతే? బియ్యం , సరుకులు రేట్లు పెరగడానికి ఆయనే కారణం" నిర్థారించేసిన ఎదురింటి ఎమ్మే ఎకనామిక్స్ గృహిణి!
నిన్న మధ్యాహ్నం నుంచి జనమంతా టీవీలకే అతుక్కుపోయారని గ్రహించి, ప్రకటనలను ముమ్మరంచేసిన వ్యాపార వేత్తలు !
"ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ..ఫలానా కాటరర్స్, పెళ్ళి, గృహప్రవేశం ఇతర శుభకార్యాలకు రుచికరమైన వంటలు లభించును....అంటూ!(ఇలాంటివే హాస్పటళ్ళు, స్కూళ్ళూ, రియల్ ఎస్టేట్లు...వగైరా)
"ఎవరు ముందుగా హెలికాప్టర్ క్రాష్" వార్తను అందించారన్న దాని మీద టీవీ వార్తా ఛానెళ్ళ మధ్య పోటీ!
"ఏవండోయ్, ఆయన పోయాడంటే రేపు కూడా సెలవేగా(ఈ రోజెలాగూ నిమజ్జనం వల్ల హాలిడే)! తర్వాత వీకెండ్! వరసగా మూడ్రోజులు! ఎటైనా వెళ్తేనో"అంటూ కన్ ఫర్మేషన్ కోసం ఫోన్ చేసిన కాలనీలోని మరో విద్యార్థి తల్లి..!
"గొడవలేమైనా జరుగుతాయేమో మేడమ్! ముఖ్యమైన సరుకులు పంపమంటారా? జీడిపప్పు ఫ్రెష్ గా వచ్చాయి, అవి కూడానా?" సూపర్ మార్కెట్ నుంచి మేనేజర్ ఫోన్!
"హైదరాబాదులో ఇద్దరు పోయారట స్వైన్ ఫ్లూతో! ఎందుకైనా మంచిది, ఆ హోమియో మందేదో మీరు తెచ్చుకునేటపుడు మాక్కూడా తీసుకురండి ప్లీజ్" పక్కింటి నార్త్ ఇండియన్ మిశ్రా గారి వేడుకోలు!
"బస్సులుంటాయా ఇవాళ! లేకపోతే ఆటోల వాళ్ళు దోచేస్తారు..."మధ్య తరగతి నిర్మల ఆరోపణ!
"అబ్బ, శ్రీశైలం రిజర్వాయర్ ఎంత బావుందో చూడండి,ఎప్పుడైనా తప్పక వెళ్ళాలి " టీవీలో గాలింపు చర్యలను చూస్తూ ఒక ప్రకృతి ప్రేమికుడి అభిలాష!
మొత్తానికి, ఇక ఆ మనిషి లేడు. ! మరణించాక కూడా 24 గంటల పాటు రాష్ట్ర ప్రజల్ని, సకల రక్షణ దళాలనూ పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి నిష్క్రమించాడు.
చెరగని చిరునవ్వు, మిన్ను విరిగి మీద పడ్డా చలించని స్థిర చిత్తం ,అనుకున్నది ఆరు నూరైనా చేసి తీరే సంకల్ప శుద్ది ...వీటన్నింటినీ సొంతం చేసుకుని, కారణమేదైనా పేద ప్రేజల గుండెల్లో మాత్రం స్థానం సంపాదించాడన్నది కాదనలేని సత్యం!
ఇకపై ఆయన కనపడరంటే నమ్మడం, జీర్ణించుకోవడం కష్టంగానే తోస్తోంది.
మనుషులంతా ఇంతే! పైకి ద్వేషించినా,విభేదించినా లోపల ఏదో ఒక మూల సాటి మనిషనే భావం ఉండకపోదేమో!
"అయ్యో! " అనిపించకపోదేమో!
కంట ఒక కన్నీటి చుక్క రాలకపోదేమో!
విధానాలతో విభేదించినా, మనిషి గా విద్వేషాన్ని మూటగట్టుకోలేమేమో
ఎదిగిన పిల్లలు దుఃఖాన్ని తట్టుకున్నా, జీవితాన్ని పంచుకున్న సహచరి బాధను ఎవరు పంచుకుంటే తీరుతుంది?
కానీ......
ఈ రోజొక్కరోజే ఇదంతా! రేపటినుంచీ అంతా మమూలే!ఎవరి గోల వారిదే!
ఇదే జీవితం! ఇదే శాశ్వతం!
ఆయన జీవన సహచరికి నా సానుభూతి!
ఆయనతో పాటు విధి నిర్వహణలో అసువులు బాసిన శ్రీయుతులు సుబ్రహ్మణ్యం, వెస్లీ, భాటియా, రెడ్డి గార్ల ఆత్మలకు కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.