(నెరవేరని) నా కొత్త సంవత్సరం తీర్మానాలు!  

Posted by సుజాత in



ప్రతి ఏడాదీ డిసెంబర్ వస్తోందనగానే ఆలోచనలు మొదలవుతాయి, కొత్త కొత్త తీర్మానాలేం చేసుకోవాలా అని! అందునా ఇప్పుడు మరీ ఈ టీవీ ఛానెళ్ళు  ,వార్తా పత్రికలు   ఏం తీర్మానాలు చేసుకుంటే బావుంటుందో వాళ్లే చెప్పేస్తారు, కనీసం మన తీర్మానాలు ఆలోచించుకునే అవకాశం కూడా మనకివ్వకుండా!

వాళ్ళు చెప్పే తీర్మానాలు ఇలా ఉంటాయి...మచ్చుకు కొన్ని


1.పాజిటివ్ గా ఆలోచించడం


2.సహనం అలవర్చుకోవడం


3.ఈ ఏడాది కనీసం ఒకరికన్నా అవసరంలో సహాయం చేయడం


4. ఒక్కసారన్నా రక్తదానం చేయడం.


5. కోపం తగ్గించుకోవడం

6. డబ్బు ఖర్చుపెట్టేముందు అవసరమా?అని ఆలోచించడం!

ఇలా మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చి ఒకటి టిక్కు పెట్టమంటారు.


ఫర్గెటిట్! అన్నీ తూచ్ కొట్టాల్సినవే!



నిజంగా అయితే...సామాన్య జనం చేసే తీర్మానాలు కొన్ని చూద్దాం!


అన్నింటికంటే ప్రాధాన్యం ఉన్నది "బరువు తగ్గడం"(దీనికి మీలో ఎంత మంది వోటేశారో ఊహిస్తున్నా)

మంచి స్నేహితుల్ని సంపాదించుకోవడం

ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేలా కష్టపడి పని చేయడం

కారు కొనడం

ఇల్లు కొనడం


వీటిలో మాత్రం నేను ప్రతి ఏడాదీ మొదటి దానికే టిక్కెడతాను.ప్రతి ఏడాదీ తీర్మానాలు మార్చేస్తే ఏం బావుంటుంది లెద్దూ అని!



ఏమిటీ..అమలు చేయడమా? ఇదిగో....ఇలాంటి ప్రశ్నలేస్తేనే మరి.......!



నా ఫ్రెండ్స్ లో శ్రీలక్ష్మి అనే పిల్ల ఉండేది. అది ప్రతి యేడాదీ " ఈ ఏడాది నేను నర్సిమ్ములు ని పెళ్ళాడేస్తాను"అనేది. నర్సిమ్ములంటే వాళ్ల బావో, బాయ్ ఫ్రెండో అనుకునేరు.మా కాలేజీ రోడ్లో ఉండే మిర్చిబజ్జీల బండివాడు.ఆ బజ్జీలంటే అంత ఇష్టం దానికి!


దాన్ని పెళ్ళికూతుర్ని చేసిన రోజు సాయంత్రం వాళ్ల తమ్ముడు తెచ్చిన బజ్జీలు ఖాళీ చేస్తూ కూడా ఇదే డైలాగ్ చెప్పింది శ్రీలక్ష్మి! తీర్మానమంటే అలా ఉండాలి.ఎప్పటికీ నెరవేరకుండా!

తీర్మానాలు చేసుకునే వారు ప్రతి యేడాదీ మర్చిపోకుండా డిసెంబర్ చివరి వారంలో మంచి లెటర్ పాడ్ ఒకటి కొనో, లేక ఒక తెల్ల కాయితం మీదో తీర్మానాలు రాసుకోవడం మామూలే! జనవరి నెల మొదటి వారం తప్పకుండా పాటించడం మామూలే! రెండో వారం ఉత్సాహం తగ్గడం, మూడోవారం నీరసం రావడం..ఎలాగో లాక్కొచ్చి ఫిబ్రవరి నెలాఖరుకు పరుపు చుట్టేసి, డిసెంబర్లో చూద్దాం లెద్దూ అనుకోవడం...అన్నీ మామూలే!



నా తీర్మానమే చూద్దాం! పోయిన డిసెంబర్లో "అమ్మో! మళ్ళీ కిలో బరువు పెరిగాను. లాభంలేదు.జనవరి నుంచి రైస్ తగ్గించాలి.నెయ్యి మానేయాలి! పళ్ళు , జూసులూ ఎక్కువగా తీసుకోవాలి"అనేసుకున్నా గాట్టిగా!జనవరి మొదటివారమంతా చాలా సీరియస్ గా పుల్కాలు,పళ్ళు..ఇలా లాగించా!

 రెండో వారానికి అన్నం లేకపోతే చచ్చిపోతాననిపించింది .

"పోన్లే, ఒకపూట పుల్కాలు తింటానూ"అని (నా అంతరాత్మకి) సర్ది చెప్పి  ఒకపూట హాయిగా అన్నం మొదలెట్టాను.

తర్వాత రెండు రోజులకి ....

సంక్రాంతికి చేసిన నేతి అరిసెలు,వెన్న కాచిన ఫ్రెష్ నెయ్యి రెండు కిలోలు ఊర్నుంచి రాగానే వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి చూస్తూ నరకమంటే ఎలా వుంటుందో తెలుసుకోగలిగాను! తర్వాత నా తీర్మానం మట్టిగొట్టుకుపోయిందని మీకు వేరే చెప్పాలా ఏమిటిలెండి!



మా అన్నయ్య 'పొద్దున్నే లేవగానే దుప్పటి  మడతపెట్టాలి" అనే తీర్మానం నా చిన్నప్పటినుంచీ చేస్తున్నాడు. అలాగే  వదిన "పొద్దున్నే ముఖం కడుక్కోగానే బొట్టుపెట్టుకోవాలి. నుదురు బోసిగా ఉండకుండా"అనే తీర్మానం పెళ్ళయిన ఏడాదినుంచీ(వాళ్ల పెళ్ళయి పదిహేడేళ్ళు) చేస్తోంది.ఇద్దరూ రెంటినీ అమలు చేయరు.



మా ఎదురింటివాళ్లబ్బాయి ఈ ఏడాదైనా పదోక్లాసు పూర్తి చేయాలని తీర్మానించాడు. వాళ్ళ నాన్నేమో ఎలాగైనా ఈ వయసులో టెన్నిస్ ప్లేయర్ కావాలని...(సడే సడే!ఇలాంటి తీర్మానాలు అసలు తీరేవేనా!)

నేను ప్రతి యేటా క్రమం తప్పక చేసుకునే తీర్మానాలు...



1.ప్రతి రెండు రోజూలకీ ఇల్లంతా డస్టింగ్ చేయాలి లేదా చేయించాలి.


2. నెలకోసారి కర్టెన్లు మార్చాలి.


3.చెల్లెలుతో పోట్లాడకూడదు(ఇది చిన్నప్పటినుంచీ వస్తోన్న తీర్మానం)

4.బద్ధకించకుండా చలికాలమైనా సరే వాకింగ్ కి వెళ్ళాలి.



5.రోజూ బద్ధకించకుండా ఇంగ్లీష్ పేపర్ కూడా చదవాలి.


6.వృధా ఖర్చులు పెట్టకూడదు(అసలు వృధా ఖర్చుల్ని ఇంకా నిర్వచించలేదు నేను)


7.క్రమం తప్పక డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి.  ఈయన గారి చేత చీవాట్లు తినకుండా కారు నడపాలి.


8.వార్డ్ రోబ్ లోంచి  వాడనిబట్టలు అన్నీ తీసి పెట్టాలి.


9. పనమ్మాయి సరిగా పనిచేయకపోయినా సహనంగా ఉండాలి.


10. పాపాయి తో గొడవ పడకూడదు.వాదన అసలే పెట్టుకోకూడదు.


11. పీజా హట్, డామినోస్ వాళ్ళ నంబర్లు నా ఫోన్ లోంచి తీసేయాలి.


12 .కాఫీలు తగ్గించాలి.



చూడ్డానికి అన్నీ తేలిగ్గానే ఉన్నాయి కదూ! ఒక్కటి కూడా పూర్తిగా ఆచరించిన పాపాన పోలేదు.

ఈ ఏడాది మాత్రం ఒకే ఒక తీర్మానం...టీవీ9 చూడ్డం మానేయాలి. అంతే ఇంకేమీ లేవు.


అదండీ సంగతి! మీకు కూడా పాటించాలనుకుని పాటించలేకపోతున్న తీర్మానాలు ఉండే ఉంటాయి.ఒకసారి గుర్తు తెచ్చుకోండి.



ఒక్కక్షణం ఆగండి,డామినోస్ వాడితో మాట్లాడివస్తా! నా తీర్మానాలు పాటించాల్సింది రేపటినుంచి కదా!

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!  

Posted by సుజాత in


ఉపయోగకరమైన ఒక అంశం గురించి మనం చెప్పాలనుకున్న విషయం, సందేశం సూటిగా అవతలివారికి చేరితే ఎంత సంతృప్తిగా ఉంటుంది. పుస్తకాల సంతలో ఈ తెలుగు స్టాల్ ద్వారా ఈ అనుభూతి కల్గింది నాకు. ఈ తెలుగులో నాకు సభ్యత్వం ఏమీ లేదు. సెలవుల (ఎటన్నా పొదామంటే బస్సుల్లేవుగా మరి) కారణంగానూ,కొంచెం తీరిక ఉన్న కారణంగానూ స్టాల్ లో స్వచ్ఛందంగా పని చేయడానికి మూడు రోజుల పాటు వెళ్లగలిగాను.




ఎంతోమంది సందర్శకులు, ఎన్నెన్నో ప్రశ్నలు,ఆసక్తులు,అనురక్తులు,మరెన్నో..ప్రశంసలు!





అంతర్జాలంలో తెలుగు వెలగాలన్న లక్ష్యంతో ఈ తెలుగు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్ కి ఇంత ఆదరణ ఉంటుందని నేను ఊహించలేదు.



ఇంగ్లీష్ మీడియం చదువుల క్రీనీడలో తెలుగు మసకబారుతోన్న సంగతి గుర్తించి, వారి పిల్లలు తప్పకుండా తెలుగు నేర్చుకోవాలన్న కోరికతో తల్లిదండ్రులు స్టాల్ కి వచ్చి చాలా విషయాలు వాకబు చేయడం సంతోషాన్ని కల్గించింది.



పోయిన సారి స్టాల్ కి వచ్చినవారు మళ్ళీ ఈ సారి కూడా వచ్చి తాము బరహ, లేఖిని వంటి ఉపకరణాలను వాడుతున్న సంగతిని పంచుకున్నారు. బ్లాగులు రాయడానికి ఈ సారి ఎంతోమంది ఉత్సాహం చూపించారు. ఏం రాయాలి, కూడలిలో ఎలా చేర్చాలి అన్న విషయాలపై ప్రశ్నలు వేశారు.

కొంతమంది "లేఖిని ఎవరు తయారు చేశారు? ఇక్కడ వీవెన్ ఎవరు?"అని అడిగి తెలుసుకున్నారు.
అవును, వేలకొలది బ్లాగర్లను ఒకచోట చేర్చిన వీవెన్ గురించి అందరూ తెలుసుకోవల్సిందే!



తెలుగు సాఫ్ట్ వేర్లు, ఇతర సాంకేతిక విషయాలతో తయారు చేసిన సీడీలను ప్రత్యేకంగా అడిగి మరీ ఈ తెలుగు స్టాల్ నుంచి వందల కొద్దీ సందర్శకులు అడిగి తీసుకున్నారు. సీడీ కోసం కేవలం ఐదు రూపాయలు ఆపైన మాత్రమే సంస్థ విరాళం తీసుకుంటుందని తెలిసి తెల్లబోయిన వారున్నారు.
"మాతృభాషకోసం చేస్తున్న
ఈమంచిపని కోసం మీరు అడిగి మరీ తీసుకోవాలి విరాళం"అని ఉద్విగ్నంగా అన్నవారున్నారు.
"మీలాంటి వారు ఇప్పుడు తప్పక కావాలి"అని ప్రోత్సాహకరంగా మాట్లాడినవారూ ఉన్నారు.అందుకే ఐదు రూపాయల సీడీకోసం వందరూపాయలిచ్చి తీసుకున్నవారూ ఉన్నారు.





ఎంతోమంది ప్రముఖులు స్టాల్ కి వచ్చి అంతర్జాలంలో తెలుగును గురించిన వివరాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వారిలో మెజీషియన్ బి.వి.పట్టాభిరామ్ ,కవయిత్రి జయప్రభ,,శ్రీ బుద్ధ ప్రసాద్,సినీ రచయితలు సుద్దాల అశోక్ తేజ,భాస్కర భట్ల,సీనియర్ జర్నలిస్టు తెలికపల్లి రవి,మరెంతోమంది ఉన్నారు.



ఆసక్తి చూపిన వారి వివరాలను నమోదు చేసిన కాగితంలో "సలహాలు-సూచనలు"అన్న కాలమ్ కూడా ఉంది.అందులో శ్రీ పట్టాభిరామ్ "ఇంకా కావాలా?(సలహాలు?)"అని రాయడం చాలా సంతోషపెట్టిన విషయం!



ఈ తెలుగు సభ్యులు కృపాల్ కశ్యప్, చక్రవర్తి,నాగమురళి,సతీష్ ఈ స్టాల్ విజయానికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగాలు, బాధ్యతలు వారికున్నా ఒక మాతృభాషా వికాసానికై నెలకొల్పిన ఒక లాభాపేక్ష లేని సంస్థ కొసం ఒక పది రోజులపాటు పక్కనపెట్టి, పూర్తి సమయాన్ని స్టాల్ కోసం కేటాయించిన ఈ నలుగురూ అభినందనీయులు.





వీరితో పాటు స్టాల్ కోసం అంతర్వాహిని బ్లాగర్ రవిచంద్ర కూడా గరిష్టంగా తన సమయాన్ని కేటాయించారు.కేవలం బ్లాగులు చదివి, ఈ తెలుగు స్టాల్లో పని చేయడానికి గుంటూరు నుంచి వచ్చిన డాక్టర్ కౌటిల్య ను విస్మరించలేం!ఎంతైనా అభినందనీయులు. ఇంకా శ్రీహర్ష, హరివిల్లు శ్రీనివాస రాజు, శ్రీనివాస కుమార్(జీవితంలో కొత్తకోణం) నందం నరేష్,విజయ్ శర్మ,వరూధిని,పి.ఎస్.ఎం లక్ష్మిగార్లు కూడా స్టాల్ కోసం తమ సమయాన్ని కేటాయించారు. (ఇంకా ఎవరినైనా మర్చిపొతే తిట్టొద్దు! చెప్పండి చాలు)



స్టాల్ ని సందర్సించిన బ్లాగర్లు ఎంతోమంది.



తెలుగు వారందరికీ తెలుగు రావాలి! తెలుగు అందరిదీ కావాలి.



మా తెలుగు తల్లికి మల్లెపూదండ!

విజ్ఞానం......కొంటారా కేజీల్లో?  

Posted by సుజాత in

మొన్నొక రోజు బుక్ ఫేర్ కి వెళ్లానా పుస్తకాలు కొనుక్కుందామని..! అక్కడ ఒక స్టాల్ ముందు ఈ ఫ్లెక్సీ వేలాడదీసి ఉంది. పెద్ద బాల శిక్ష గురించిన ఒక ప్రకటన!






ప్రకటనేమో అచ్చతెలుగు పెద్ద బాల శిక్షకి! అది తెలుగు వారి "మెగా" పెద్ద బాల శిక్ష అట.



అది పక్కన పెడితే కేవలం Rs.116 లకే "ఒకటిన్నర కేజీల విజ్ఞానం" అట! కవర్ పేజీ మీద ఉన్న సరస్వతి సిగ్గుతో తల దించుకోవాలన్నమాట ఈ ఒక్క మాటకీ!



పుస్తకం ఒకటిన్నర కేజీల బరువుందనీ, అంటే ఎక్కువ పేజీలున్నాయనీ చెప్పాలనీ ప్రకాశకుల అభిప్రాయం అనుకుంటాను!



అందువల్ల అత్యుత్సాహంతో అందులో ఉన్న విజ్ఞానమంతా కూడా కలిపి కేవలం ఒకటిన్నర కేజీలు "మాత్రమే"నని వంకాయల లెక్కో ఉల్లిపాయల లెక్కో వేసి తేల్చారు.



విజ్ఞానం ! కేజీల్లెక్కన!




సిగ్గేస్తోంది తెలుగు పుస్తకాలమ్మే వారి తెలుగు పరిజ్ఞానానికి, సృజనాత్మక ఆలోచనలకీ!

గమనిక: ఫొటో బాగా రాలేదు కదూ! తీసింది నేను కాదులెండి! :-))

ఆంధ్రులు ఈ రాష్ట్ర ప్రజలు కాదా?  

Posted by సుజాత in

మొన్న బంధువుల ఇంట్లో వ్రతానికి వెళ్ళి తారనాక వైపునుంచి రావలసి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం! కార్ల మీద రాళ్ళు విసిరారు అల్లరి మూకలు తెలంగాణా విద్యార్థుల పేరుతో! వారిలో విద్యార్థులెంత మందో బయటివారెంత మందో నాకు తెలీదు. కానీ నా కారు బయటి రాష్ట్రం రిజిస్ట్రేషన్ తో ఉండటం వల్ల మాత్రం బతికి బయటపడిందని అనిపిస్తోంది.నిన్న ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్ల నంబర్ ప్లేట్లన్నిటిమీదా రంగు పూసి TG అని రాశారట ఆందోళన కారులు! అలాగే ఆంధ్రా బాంక్ పేరును కూడా "తెలంగాణా బాంక్"అని మార్చారట. సిటీ సెంట్రల్ లైబ్రరీ పేరుని "వట్టికోట ఆళ్వారు స్వామి లైబ్రరీ" గా మార్చేశారట!




ఇదెక్కడి చోద్యం! ఆంధ్రా బాంక్ తెలంగాణా లో ఉన్న బ్రాంచ్ లన్నింటికీ ఇదే గతి పట్టిస్తారా అయితే? మరి తెలంగాణాలో ఉన్న మిగతా రాష్ట్రాల బాంకులకు ఈ పేరు మార్పు వర్తిస్తుందా లేక "ఆంధ్రా" బాంక్ కేనా?



వీరి ఉద్యమ లక్ష్యం ఏమిటి? వీళ్ళు అనుసరిస్తున్న ద్వేష పూరిత వైఖరేమిటి? ఉద్యమ లక్ష్యం తెలంగాణా సాధన అయితే దానికి హైదరాబాదులో ఉన్న ఆంధ్రుల్ని ద్వేషించడమా మార్గం?  హైదరాబాదు అభివృద్ధిలో సింహ భాగం పోషించి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రులు ఈ రోజు ఎంతటి అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారో కూకట్ పల్లి, దిల్ సుఖ నగర్, S.R వంటి చోట్ల ఉన్న ఆంధ్రుల్ని చూస్తే తెలుస్తుంది.తెలంగాణా కావాలని కోరుతున్నవారంతా , హింసలో పాలు పంచుకోకపోయినా "హింస వద్దు!మన మార్గం ఇదికాదు"అని మాత్రం దాన్ని ఖండించకపోవడం గమనార్హం!



అసలీ "ఆంద్రోళ్ళ" కాన్సెప్ట్ ఏమిటి? ఆంధ్రులెవరు? ఈ రాష్ట్ర ప్రజలు కాదా?  వారికి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇష్టమైతే అక్కడ, ఎక్కడ అనుకూల పరిస్థితులుంటే అక్కడ నివసించే హక్కు ఉందా లేదా?  తీవ్రవాదులకు కూడా యధేచ్చగా హైదరాబాదులో సంచరించే స్వేచ్ఛ ఉందే! వీరికెందుకు లేదు?



"ఆంధ్రా వాలో భాగో"...ఎంత అవమాన కరంగా ఉంది ఈ నినాదం! అదేమంటే "అది భూ కబ్జా దారులకే వర్తి"స్తుందని సవరణ. "ఆంధ్రా వాళ్లని తరిమి కొట్టండి" అని విద్వేషపూరితమైన పిలుపునిచ్చాక, ఆవేశాలను రెచ్చగొట్టాక "కుంజరః" టైపులో పెట్టిన ఈ "భూకబ్జా దారులు మాత్రమే" టాగ్ లైన్ ఎవరికి వినిపిస్తుంది.?



హైదరాబాదులో చెలరేగుతున్న విధ్వంస కాండను, హింసను ప్రేరేపిస్తున్నదెవరు? పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే తెలంగాణా తల్లి ఆనంద భాష్పాలు రాలుస్తుందా? "హింసా మార్గం విడనాడండి"అని నోటితో చెప్తూ చేతులెత్తి నమస్కరిస్తూ నమస్కరిస్తూ మరో వైపు కనుసైగతో "రెచ్చిపొమ్మని" ఆదేశాలిస్తున్న రాజకీయ నాయకుల కుటిలనీతిని ఎలా అర్థం చేసుకోవాలి?



బుద్ధిలేని నాయకుల ఆదేశాలను కళ్ళుమూసుకుని ఆచరించేవాళ్ళు తెలంగాణా విద్యార్థులా?


స్కూలు బస్సుల్ని తగలెట్టడం,ఆర్టీసీ బస్సుల్ని ధ్వసం చేయడం, ఆంధ్రా ప్రజల ఆస్తుల్ని బుగ్గి చేయడం, "ఆంధ్రా"  పేరున్న ప్రతి బోర్డునీ పీకి అవతల పారేసి ఆస్తుల్ని ధ్వంసం చేయడం,....
 ఇదేనా ఉద్యమ రూపం? ఇదేనా తెలంగాణా సాధనకి మార్గం?



అర్థం లేని ఆవేశంతో ప్రాణ త్యాగాలకు ఒడిగడుతున్నవార్ని తురుపు ముక్కల్లా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారన్న సంగతి పసి పిల్లవాడికి కూడా అర్థం అవుతుందే!
నిన్న మరణించిన శ్రీకాంత్ గురించి ఇవాళ మట్లాడుతున్నారు. నాల్రోజుల క్రితం మరణించిన కానిస్టేబుల్ గురించి ఈ రోజు ఎవరైనా మాట్లాడుతున్నారా? మరో రెండు రోజుల తర్వాత శ్రీకాంత్ గురించీ ఎవరూ మాట్లాడరు.

మిగిలుండేది మాత్రం శ్రీకాంత్ తల్లి కడుపు కోతా, కానిస్టేబుల్ భార్య గుండె కోతానూ! వారి పైన ఎనలేని సానుభూతి ఉన్నా,బాధ కలుగుతున్నా, వారి త్యాగానికి విలువ ఎంత ?,ప్రయోజనం నెరవేరిన తర్వాత వారిని గుర్తు పెట్టుకునే వారెంతమంది అనే ప్రశ్నలు  ఉదయిస్తున్నాయి.

 వీరికి నా విన్నపం! దయచేసి ప్రాణాలు తీసుకోకండి. కుటుంబసభ్యులంకు తీరని దుఃఖాన్ని మిగల్చకండి. ఇది సరైన దారి కాదు.



తెలివైన వారెప్పుడూ ప్రాణాలు తీసుకోరు!
ఒక్కటే జీవితం! పోతే తిరిగి రాదని వారికీ తెలుసు.

తెలంగాణా కావాలన్న నినాదంతో హైదరాబాదులో హింసా మార్గంలో చిందులు తొక్కుతున్న యువరక్తానికి, యువక రత్నాలకు నా విన్నపం ఒక్కటే!

"బాబూ, వివేకంతో ఆలోచించి తెలంగాణాకు అడ్డుపడుతున్నదెవరో తెలుసుకోండి. దశాబ్దాలుగా తెలంగాణా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలూ, ఎంపీలూ, మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధానమంత్రులు తెలంగాణా సమస్యల్ని పట్టించుకోకుండా ఏం చేశారో నిలదీయండి.

 కె సి ఆర్ రాకముందు మనలో ఉన్న ఈ ఆవేశమంతా ఏమైపోయిందని ఆలోచించండి.ఇన్నాళ్ళూ ఎవర్నీ ప్రశ్నించకుండా కూచున్నందుకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది రాజకీయ నాయకులు ఆడుతున్న వికృత క్రీడ అని గ్రహించండి.అంతే కానీ అర్థం లేని ఆవేశంతో ఆంధ్రా వాళ్ళని ద్వేషించడం తగని పని"



కెసీఅర్ ప్రాణానికి ప్రమాదమేం లేదని అందరికీ తెలుసు.అయినా "కేసీఆర్ కి ఏదైనా జరిగితే రక్తపుటేరులు పారిస్తాం"అని ప్రతిజ్ఞలు ఎటు చూసినా! హైదరాబాదు వాసులకు ఎంత ఆందోళన కలిగిస్తుందిది?



ఒకవేళ తెలంగాణా ఏర్పడి, హైదరాబాదు అందులో భాగంగా ఉంటే మాత్రం,ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యం దృష్ట్యా హైదరాబాదులోని ఆంధ్రుల రక్షణ గురించి ఆందోళనగానే ఉంది నాకు!

ఆలిండియా రేడియో ఆర్కైవ్స్ సీడీలు  

Posted by సుజాత in


పుస్తకాలు మరియు స్నేహితురాళ్ళూ అంటూ హుషారుగా మొదలై జోరుగా పరుగులెడుతోన్న యూత్ ఫుల్ బ్లాగులో ఈ మధ్య ఏమీ రాయడం లేదని నిన్న మా సత్యాన్వేషి ఫోన్ చేసి ఖోపం పడ్డాడు నా పైన!




అందుకే ఆ మధ్య ఆలిండియా రేడియో స్టేషన్లో నాకు దొరికిన ఆర్కైవుల సీడీల గురించి చిన్న టపా ఒకటి అందరితో పంచుకున్నాను. మీక్కూడా ఆ సీడీల గురించి చదవాలని, స్వంతం చేసుకోవాలని ఉంటే...చూడండి ఇక్కడ...!.