జాకీర్ హుస్సేన్ అనేవాడు లేకపోతే భారతీయ సంగీతంలో తబలా అనేది కేవలం పక్క వాయిద్యంగానే మిగిలిపోయేదేమో!
ఢిల్లీ దూరదర్శన్ లేకపోతే ఇటువంటి కళాకారులు సామాన్య కళారాధకులకు ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోయేవారేమో!
రెండు దశాబ్దాల క్రితం దూర దర్శన్ ప్రభ వెలుగుతున్న రోజుల్లో తండ్రి ఉస్తాద్ అల్లా రఖాతో కలిసి జాకీర్ హుస్సేన్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన కార్యక్రమాలనెవరు మర్చిపోగలరు? అలల్లాగ అతని జుట్టు నుదుటిమీద పడుతుంటే అది దూరదర్శన్ కెమెరా స్లో మోషన్లో చూపి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన క్షణాలు ఎవరికి మరుపుకొస్తాయి?
తబలా అనేది కేవలం పక్క వాయిద్యం కాదనీ,దానితో అద్భుతాలు సృషించవచ్చనీ జాకీర్ నిర్ధారణ చేశాక,
అతని అభిమానిగా మారకుండా ఉండటం అసాధ్యమే అయింది.అందుబాటులో అతని కచేరీలు ఉంటే వెళ్ళకుండా ఉండటమూ అసాధ్యమే అయింది.
మొన్న జనవరి 16 శనివారం సాయంత్రం హైదరాబాదు ప్రేక్షకులు అతడి వేళ్ళు చేసే మాజిక్ కి కట్టుబడి బందీలై పోయేందుకు హోటల్ నొవోటెల్ ప్రాంగణంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కి పరుగు పరుగున వచ్చారు. వారిలో మేమూ!
ఈ కచేరీలో జాకీర్ తో పాటు ఆయన సోదరుడు తాఫిక్ ఖురేషి(Drums),సితార్ మేస్ట్రో నీలాద్రి కుమార్,సారంగి కళాకారుడు సాబిర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.
తాఫిక్ మొదటగా వచ్చి కేవలం నోటితో చేసే "హ" అనే శబ్దంతోనే ఒక పెద్ద కంపోజిషన్ దాదాపు ఇరవై నిమిషాల సేపు ఉచ్ఛ మంద్ర స్థాయిల్లో వినిపించి, అందులోంచి తేరుకునేలోపుగా ఉచ్ఛస్థాయిలో ఉంది భార్య గొంతనీ, మంద్రస్థాయిలో మొహమాటపడుతోంది భర్త గొంతనీ తేల్చి నవ్వించాడు. (మగవాళ్ళను నవ్వించడానికి ఇంతకంటే మంచి జోకు ఉంటుందా? )
రెండు మూడు జోకుల తర్వాత అతి సామాన్యంగా వచ్చి సారంగి తో రాగాలాపన మొదలుపెట్టిన సాబిర్ ఖాన్ మరి కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులను తనతో పాటు మరోలోకానికి తీసుకెళ్ళిపోయాడు.
అక్కడ, ఆ రసలోకపు తీరాల్లో అతని సారంగి తరంగాలు తప్ప మరేమీ లేవు. అసలు సారంగి వాద్యమే ఒక గొప్ప విషాదంలా, మనల్ని చుట్టేస్తూ ఏవేవో గతజన్మ స్మృతుల్ని శృతిచేస్తూ ఆనందమూ, దుఃఖమూ కలగలిసిన తీరాలకు తోడ్కుపోయేలా ఉంటుంది.
సాబిర్ ఖాన్ కుటుంబంలో సారంగి వాద్యం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం కాగా ఇతడు ఏడో తరం కళాకారుడట. పట్టుమని పాతికేళ్ళు లేని ఆ యువకుడి అసమాన ప్రతిభ చూసి నిజంగా కొద్దిగా ఈర్ష్య వేసింది.అతడి వాద్యంలో ప్రేక్షకులు ఎంతగా లీనమైపోయారంటే మధ్యలో నిశ్శబ్దంగా వచ్చి కూచుని తబలాతో శృతి కలిపేదాకా ఎవరూ జాకీర్ ని గమనించనే లేదు.
ఆ తర్వాత జాకీర్ చేసిన అద్భుతాలు ఎన్నని? సారంగికి పక్క వాయిద్యంలా ఉన్న తబలాకి కాసేపటికే సారంగి పక్క వాయిద్యంగా మరిపోయింది!అద్భుతమైన అతడి వేళ్ల కదలికలు సృష్టించిన మాయాజాలానికి అంతే లేకుండా పోయింది.
రాధాకృష్ణుల చిలిపి తగాదా,అడవిలో లేడిపిల్ల గంతులు,రుద్ర తాండవం,ట్రాఫిక్ జామ్ వంటి అనేకాంశాలను, సంఘటనలను, సంభాషణలను తబలా కంపోజిషన్ లో మలిచి వినిపించారు(ఇది ఆయన దాదాపు ప్రతి కచేరిలోనూ చేస్తారు)
రుద్రతాండవం లో తబలా మీద శంఖ ధ్వనిని సృష్టించి అబ్బురపరిచాడు.ప్రేక్షకులెవరూ ఇది ఊహించనిది కావడంతో ఆ శంఖ ధ్వనికి ఆడిటోరియమంతా "హా" అన్న శబ్దంతో ఒక్కసారిగా అబ్బురపడిపోయింది.
తరవాత వచ్చి కలిసిన నీలాద్రి కుమార్ సితారతో ప్రతి ఒక్కరి గుండెనూ మీటి మంత్ర ముగ్ధుల్ని చేశాడు.కొన్ని కొన్ని తారాస్థాయిల్లో... రసానుభూతి అంటే ఇదీ అని నిర్వచించిన అనుభూతి! రస సిద్ధి అంటే ఇదే అని నిశ్చయించిన అపురూప క్షణాలు. అతని ప్రతిభకు జాకీర్ సైతం తలవంచి అభివాదం చేశాడు.నీలాద్రి కుమార్ కూడా వారి కుటుంబంలో అయిదో తరం సితార ప్రవీణుడట.
చివర్లో నలుగురూ కలిసి సృష్టించిన ఫ్యూజన్ ఒక మధురానుభూతి. దాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం సాహసమే! విన్నవారికి అనుభవైకవేద్యం కావలసిందే తప్ప ఇంత బావుందని చెప్పడం పేలవంగా ఉంటుంది.
అద్భుతమై, రస ప్రవాహంలో తేలియాడించి ఉర్రూతలూగించిన ఆ సాయంత్రాన్ని పదిలంగా మదిలో దాచుకుని భారంగా తిరిగి రాక తప్పింది కాదు.... కళ్ళముందే మూడుగంటల కాలం మంచులా కరిగిపోగా!
కొసమెరుపు: "ఆ తబలా అంకుల్ జుట్టు "అపరిచితుడి" జుట్టులా ఉంది" అంటూ మా పాప కితాబిచ్చింది వస్తూ వస్తూ!
Note: ఫ్లాష్ ఉపయోగించకుండా ఫొటో తీయవలసి రావడంతో ఫొటోలు ఇలా చీకట్లో కాంతులీనుతున్నాయి.





