ఒక పుస్తకాన్ని "మంచి సాహిత్యం" లేదా క్లాసిక్ అని ఎలా నిర్థారిస్తాం?
పుస్తకంలోని విషయాన్ని బట్టా, అందులో రచయిత ఏం చెప్పాడా అనే దాన్ని బట్టా? పుస్తకం ఎంత ప్రజాదరణ పొందిందా అనే దాన్ని బట్టా?
పుస్తకంలో చదివించే గుణం ఉందా లేదా అనే దాన్ని బట్టా?
ఎన్నాళ్లయినా చెక్కు చెదరని దాని కాలాతీత "నాణ్యత" బట్టా?
ఎన్నో ఆలోచనల్ని రేపే దాన్లోని "విషయం" బట్టా?
జీవితంలోని కోణాల్ని అని స్పృశించిన తీరుని బట్టా? దేన్ని బట్టి నిర్ణయిస్తాం?
ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి మిగిలేది నిస్సందేహంగా ఒక క్లాసిక్! దాన్ని హేలీ గారు పుస్తకం .నెట్. లో పరిచయం చేసిన తీరు తెలిసిందే! దాని మీద నలుగురు నిరసన వ్యక్తం చేయడం, మరో నలుగురు ఆ నలుగురి మీదా నిరసన వ్యక్తం చేయడం అందరికీ తెలిసిందే!
ఒక పుస్తకాన్ని "ఇలా చదవాలి"అని చెప్పేందుకు సిలబస్ ఏమీ లేదు.కానీ పుస్తకం ద్వారా పాపం.......ఆ రచయిత ఏం చెప్పాలనుకున్నాడో కొంచెం అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలనుకుంటా!
అర్థం కానప్పుడు దాని జోలికి పోకుండా వదిలెయ్యాలి. ఆ రచననొక గొప్ప రచనగా యాక్సెప్ట్ చేసిన అసంఖ్యాక పాఠకుల దృక్కోణాన్ని అవహేళన చేయడానికి ప్రయత్నించకూడదు.
నిడదవోలు మాలతి గారి నిజానికీ ఫెమినిజానికీ ...కథ చదివి పాఠకులందరికీ ఏమర్థమైయిందో నాకూ అదే అర్థమయింది. మా కజినొకడు ఆ కథ చదివి "పాపం స్త్రీల విషయంలో సీతాపతి బహుళ ఆసక్తుల గురించి కూడా రచయిత్రి పట్టించుకోవద్దూ?" అన్నాడు. ఆడ్ మాన్ అవుట్ అన్నమాట! :-))
మాయాబజార్ మళ్ళీ విడుదలైంది. వెళ్ళి చూసి వచ్చాను.
"అబ్బ, ఏం సినిమా అది? ఒట్టి చెత్త! ఆ వెకిలి హాస్యం ఏమిటసలు? పాండవులు లేకుండా మహా భారతమేమిటి? ఘటోత్కచుడి వెకిలి హాస్యం చూడలేక చచ్చాను.తల్పం గిల్పం అదీ ఇదీ అంటూ పిచ్చి మాటలు!అసలు వాస్తవికతే లేదు!ఇంత బోర్ సినిమా నా జీవితంలో చూడలేదు"అని నా బ్లాగులో రివ్యూ రాస్తాననుకోండి! తిట్టడానికి తిట్లు కూడా దొరకనంత కోపం మీకు వస్తుంది కాదూ!
అదేమని ప్రశ్నించిన వారిని "కేవీ రెడ్డి గారు 'నువ్విలాగే చూడాలి' అని నాకు టైటిల్స్ లో చెప్పలేదు. అసలిది నాకూ కేవీ రెడ్డిగారికి జరిగిన సంభాషణ!మేమిద్దరం ఎలా మాట్లాడుకోవాలో మీరు చెప్తారేమిటి?"అని జవాబిస్తే? నా పిడివాదానికి నమస్కారం పెట్టి తొలగని వారెవరు అప్పుడు?
(కేవీ రెడ్డిగారూ, బాబ్బాబు క్షమించండ్సార్, మీ దగ్గరికొచ్చినపుడు కాళ్ళట్టేసుకుంటాను)
ఇంతే!ఇంతకంటే ఏమీ చెప్పక్కర్లేదనుకుంటాను.
అసలు ఒక విషయంలో స్పష్టత కావాలి.ఒక పుస్తకాన్ని ఎలా చదవాలి? ఆ పుస్తకానికి చదివించే గుణం లేదు. సరే! చదివించే గుణమే కావాలనుకుంటే ఏ సపరివార పత్రికో చదివి ఊరుకుంటే సరి! పుస్తకం మనకు అర్థం కానంత మాత్రాన రచయితకేమీ నష్టం లేదు. రచయిత ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం మన దౌర్భాగ్యమే! ఎంతసేపూ రచయిత పాఠకుడి స్థాయికి దిగి రాయడమే తప్ప పాఠకుడు రచయిత స్థాయికి ఎదగడం అంటూ జరక్కూడదా?
రచయిత ఒక విషయాన్ని తనదైన శైలిలో ఒక పుస్తకాన్ని రాస్తాడు.అంతవరకే అతని బాధ్యత! పుస్తకంలోని విషయాన్ని దగ్గర కూచుని పాఠకుడికి బోధించాల్సిన అవసరం అతనికి లేదు.దాన్ని సక్రమంగా గ్రహించాల్సిన బాధ్యత, అవసరం పాఠకుడిదే! "ఒకటో అధ్యాయంలో హాస్యం ఉంటుంది,పదహారో అధ్యాయంలో జీవితం గురించిన విశ్లేషణ ఉంటుంది,ముప్ఫై రెండో అధ్యాయంలో ప్రణయం ఉంటుంది!వీటన్నింటినీ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోరా ప్లీజ్" అని రచయిత (ఏ పుస్తకంలో అయినా సరే, ఏ రచయిత అయినా సరే) అడగడు.
పుస్తకం అనేది రచయిత-పాఠకుల మధ్య జరిగే సంభాషణ కాదు. కేవలం రచయిత పాఠకుడితో మాట్లాడ్డమే!
వన్ వే!
ఆ సంభాషణ సారాంశం మనకెలా అర్థం అయిందనేది మన లోకజ్ఞానం స్థాయిని బట్టీ,సాహిత్యంతో మనకున్న పరిచయాన్ని బట్టీ,ఉంటుందనుకుంటాను.
అంతే తప్ప "రచయిత ఫలానా రకంగా చదవాలి అని నాకు చివరిపేజీలో చెప్పలేదు కాబట్టి అది నాకు సీ క్లాసు సినిమాలాగా కనపడింది" అంటే సరిపోదు.ఎలా చదవాలో,ఎలా రిసీవ్ చేసుకోవాలో పాఠకుడే అర్థం చేసుకోవాలి తప్ప రచయిత చెప్పడు.
పద్య సాహిత్యం నాకు అర్థంకాదు. అంతమాత్రాన దాన్ని నేను నిరసించను. కనీసం ఇతర్లు రాసిన వ్యాఖ్యానాలను బట్టి అర్థం చేసుకోడానికి,చదివి ఆనందించడానికి ఇష్టపడతాను.
ప్రతి పుస్తకానికీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకు అందకపోతే అందే పుస్తకాలనే చదవాలి మరి! అందని పుస్తకాల గురించి కనీసం అవహేళనగా మాట్లాడకుండా ఉండాలి! అది వెయ్యిమందికి ఒకరకంగా అర్థమై ఇద్దరికో ముగ్గురికో మరో రకంగా అర్థమైతే దానికి కారణాలేమిటో అన్వేషించాలి తప్ప హాస్యం పూత పూసిన నాలుగు అవహేళన మాటలు రాసి "నాకిలాగే అర్థమైంది మరి" అంటే ఎవరేం చెప్పగలరు?ఇలాంటి వాదాలకు అసలు సమాధానాలుండవు!
ఇదేమిటని ఆశ్చర్యపడ్డవాళ్లని "మీది ఈ కాలం కాదు.మీదంతా నాస్టాల్జియా" అంటారు .అక్కడికి ఈ ఆశ్చర్యపడ్డవాళ్ళు శతాధిక వృద్ధులైనట్టూ,వీళ్ళేమో నిన్నో మొన్నో పుట్టి తెలుగు సాహిత్యాన్ని ఇంతకు ముందెవరూ అర్థం చేసుకోని వినూత్న రీతిలో (అదీ నిజమేలెండి) అర్థం చేసుకుని ఆవిష్కరించినట్టూ!
ఈ లెక్కన బుచ్చిబాబు చైతన్య స్రవంతి కి ఏ గతి పడుతుందో!
క్లాసిక్స్ ని "మాకిలాగే అర్థమైంది, మేమిలాగే చదువుతాం" అంటూ అపహాస్యం చేసే ధోరణి ఇంకెంత దూరం పోతుందో, ఎన్ని పుస్తకాల్ని వరిస్తుందో వేచి చూద్దాం!
ఒకందుకు ఈ ధోరణిని అభినందించాలి. ఈ పుస్తకాలకు పాఠకులను పెంచుతున్నందుకు!
ఇంతే..నేను చెప్పాలనుకున్నది!

