అనుకున్నంతా అయింది.మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి రియాలిటీ షోల్లో అశ్లీల నృత్యాలు చేసే పిల్లల తల్లిదండ్రుల్ని ముక్క చీవాట్లు పెట్టారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రియాలిటీ షోలని నిలిపేయాలని ఛానెళ్ళకు వార్నింగ్ ఇచ్చారు. రోగం బాగా కుదిర్చారు.
మూడురోజుల క్రితం సాధన, మరికొన్ని ప్రజా సంఘాలు ఒక మంచి నిర్ణయం తీసుకుని పసి పిల్లల చేత ఐటమ్ సాంగ్స్ కి అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఛానెళ్ళ మీద కమిషన్ కి ఫిర్యాదు చేశారు.
ఒక తెలుగు ఛానెల్లో వస్తున్న "ఆట" జూనియర్స్ లో మొదటి ప్రైజు కొట్టేసిన పాపట, ఈ మధ్య ముఖ్యమంత్రి రోశయ్య గారిక్కూడా ఏదో సభలో తెగ ముద్దొచ్చేసింది.(రీతికో, గీతికో ఏదో ఉండాలి..పేరు)ఆ పాప వేసే స్టెప్పులూ, భంగిమలూ, మొహంలో చూల్పించే హావభావాలూ ఏ స్థాయిలో ఉంటాయో ఖర్మ గాలి ఒకరోజు చూశాను. మొమైత్ ఖానూ మరొకరూ మరొకరూ వచ్చి ట్యూషన్ చెప్పించుకోవాల్సిందే!
"ఆట" వచ్చే సమయానికి ఎవరింటికైనా పొరపాటున వెళ్ళామంటే అక్కడ మనల్ని పలకరించే దిక్కు కూడా ఉండదు. తల్లి దండ్రులూ, పిల్లలూ కూడా అందులో లీనమైపోయి చూస్తుంటారు.
ఈ కార్యక్రమానికి యాంకరూ, ప్రొడ్యూసరూ,డైరెక్టరూ, కాన్సెప్ట్ మేకరూ అయిన ఘీంకార్ మాట్లాడే తెలుగు వింటేనే డోకొస్తుంది. ఆ చెత్త తెలుగుతో ఆయన పిల్లల్ని ఉత్సాహ పరిచే తీరు చెప్పుకోదగ్గది.
ఘీంకార్ వేసే వెధవ్వేషాలూ,ఒక పక్కన కూచుని వెకిలి వాగుడువాగే మెంటార్లూ,ఇంత గరిష్ట స్థాయిలో అశ్లీల మైన స్టెప్స్ కంపోజ్ చేసిన కొరియోగ్రాఫర్లు, "నేనే గనక వయసులో ఉంటేనా, నీతో స్టెప్పులేయాలని ఉందే పాపా"(I'm sorry to write these words) అంటూ జడ్జి ప్లేసులో కూచుని వూగిపోతూ పిచ్చి వాగుడు వాగే ముసలి తొక్కులైన మాజీ డాన్స్ మాస్టర్లూ....
వీళ్ళు కాదు అసలు నేరస్థులు!
పిల్లలు ఇలాంటి అశ్లీలమైన డాన్సులు చేసైనా సరే చేసి టీవీ మీద కనపడితే చూసి తరించాలని కోరుకునే తల్లిదండ్రులు!
ఒక ఛానెల్లో జరిగిన ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో శోభానాయుడు గారు ఫోన్ చేసి "ఈ కార్యక్రమాలు విదేశాల్లో సైతం భారతీయ నృత్య కళ పరువు తీస్తున్నా"యని ఎంతో బాధపడ్డారు.
వాళ్ళు అభినయించే పాటల తాలూకు సాహిత్యం, దాని అర్థం బహుశా ఆ పిల్లలకు తెలీకపోవచ్చు.తెలిసే వయసొచ్చిన నాడు, తాము చేసిన నృత్యాలు ఎంత "బూతు"గా ఉన్నాయో తెలిసిన నాడు తల్లిదండ్రుల్ని అసహ్యించుకోక మానరు.ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.
ఎంతో శారీక మానసిక శ్రమకు గురి చేసి గంటల కొద్దీ ప్రాక్టీస్ చేయించి..రెండు గుడ్డ ముక్కలు కట్టి చెత్త డాన్సులు చేయిస్తే తల్లిదండ్రులకు ఏం ఒరుగుతుంది?
ఏ పైశాచికానందం వాళ్ళచేత ఇంతకు ఒడిగట్టిస్తుందో మరి!
"మీరు చూస్తున్నారు కాబట్టి మేం చేస్తున్నాం"అనే చద్ది వాదనకు ఈ ఛానెళ్ళు ఇక చరమగీతం పాడితే మంచిది.
ఎందుకంటే మనసుల మీద, మానవ స్వభావం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే కార్యక్రమాలను ప్రేక్షకులు సహించరని ఇంతకు ముందే నేర వార్తలను సీరియల్స్ స్థాయిలో ప్రసారం చేసినపుడే తేలింది.
ఇప్పుడు ఇదీ! తీవ్ర స్థాయి నిరసన!
ఏ వూళ్ళో తల్లిదండ్రుల్ని ప్రశ్నించినా పిల్లలచేత చేయిస్తున్న అశ్లీల నృత్యాల పట్ల విచారాన్నీ,ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి ఆట కట్టే రోజొచ్చింది. ఖేల్ ఖతం!
కమిషన్ కి ఫిర్యాదు చేసిన ప్రజాసంఘాలను, దేవి ఇతర కార్యకర్తల్ని అభినందిస్తున్నాను.
చప్పట్లు!
ఈ మధ్య ఒక సెక్స్ వర్కర్ ఆత్మ కధ పుస్తకం మీద ఆంధ్ర జ్యోతిలో రంగనాయకమ్మ గారు రాసిన విమర్శ.హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో చదివాను.ఆ నేపధ్యంలో ఈ "యమకూపం" నవల గురించి రాయాలనిపించింది.
వ్యభిచారంలో దిగిన స్త్రీలంతా దాన్ని వృత్తిగానే భావించినా అది గత్యంతరం లేని పరిస్థితుల్లోనో, లేక హైటెక్ వ్యభిచారమైతే పని చేయడానికి ఒళ్ళు వంగకో, విలాసాలకోసమో చేస్తారు తప్పించి ఎవరూ సంతోషంతోనో "ప్రేమ పూర్వకంగానో" చేయరు!సరే, ఇక్కడ ఆ విషయాన్ని చర్చించడానిక్కాదు ఇది మొదలెట్టింది.
ఒక వేశ్యావాటికలోని జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు వర్ణించే రష్యన్ నవల "యమకూపం" గురించి నాలుగు పరిచయ వాక్యాలు రాద్దామని!
రష్యాలో జట్కా బండ్లవాళ్ళు, ఇతర దిగువ తరగతి జనం విచ్చలవిడిగా సంచరించే ఒక ప్రదేశం పేరు "యామ్ స్కాయా స్లోబోడా". దీన్ని క్లుప్తంగా "యామా" అని పిలుస్తుంటారు. ఇక్కడ ఉన్న ఒక వేశ్యా వాటిక గురించి రష్యన్ రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ రాసిన మహత్తర నవల "yama the pit! దీన్ని తెలుగులోకి 110% సరిపోయేలా "యమ కూపం" పేరు పెట్టి అనువదించిన వారు శ్రీ రెంటాల గోపాల కృష్ణ గారు. వీరి అనువాదాలు నాకు చాలా చాలా ఇష్టం.
ఈ నవల మొదటిసారి 1904లో వెలువడినపుడు రష్యాలో పెద్ద సంక్షోభం బయలుదేరింది.జార్ ప్రభుత్వం భయంతో వణికి చచ్చి,కుప్రిన్ మీద, అతని రచనల మీదా విరుచుకుపడింది.కుప్రిన్ ఈ రచన ద్వారా యువకుల మనసులో విషం గుమ్మరిస్తున్నాడని నిప్పులు కురిపిస్తూ,ప్రచురణాలయం మీద కూడా దాడులు చేసి ప్రతులను తగలబెట్టించింది. అవును, నిజం నిప్పులాంటిది కదూ మరి, మొహం పగలగొట్టినట్లు చూపిస్తే ఎదుర్కోవడం కష్టమే!
స్త్రీ జాతి నైతికంగా పతనమైతే జాతి యావత్తూ ఎంత ఘోర విపత్తులు ఎదుర్కోవలసి వస్తుందో ఇందులో కుప్రిన్ చూపిస్తాడు.వ్యభిచారం ఎంత నీచమైనదో, దానివల్ల ఎంత తీవ్ర సమస్యలు తలెత్తుతాయో,జీవితాలు ఎలా సర్వ నాశనమవుతాయో కుప్రిన్ అద్భుతంగా చిత్రీకరించాడు.
రష్యన్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. దీన్నొక బూతు పుస్తకంగా అభివర్ణించింది.
కానీ ఈ నవల అప్పటికే ప్రజల చేతుల్లో పడింది.అక్కడినుంచి దేశ దేశాంతరాలకూ వ్యాప్తి చెందింది. ప్రపంచం నలుమూలల నుంచీ అనేకమంది పండిత పామరుల ప్రశంసలూ,విమర్శలు పొందింది. స్వయంగా అనేకమంది వేశ్యలు తమ దుర్భర జీవితాల్లోని విషాదాన్ని గుర్తించినందుకు పదే పదే కృతజ్ఞతలు తెల్పుతూ కుప్రిన్ కు ఉత్తరాలు రాశారు.1929 నాటికి ఈ నవల 20 ఇతర భాషల్లోకి అనువదితమై 30 లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి కూడా!
ఇందులో ప్రధానంగా నడిచే కథేమీ ఉండదు. యామా లో ఉండే మూడు ప్రధాన వేశ్యా కేంద్రాల్లో మధ్య రకం దాన్ని ఎన్నుకుని అక్కడి స్త్రీల దుర్భర జీవితాన్నీ, వాళ్ళు నిత్యం పడే హింసల్నీ,ఆ జీవితం తాలూకు విషాదాన్ని ప్రపంచ పాఠకులకు అందించే ఉద్దేశంతో కుప్రిన్ ఈ అంశాన్ని ఎన్నుకున్నాడు.
"అన్నా మార్కోవ్ నా" నడుపుతోన్న ఈ వేశ్యా వాటికలో ఉండే వేశ్యలు ల్యూబా,జెన్నీ,పాషా,టమారా,జోయా,న్యూరా, చిన్న మంకా, పెద్ద మంకా,నైనా, ఫెక్లూహ్షా వీళ్ళంతా అనేక దుర్భర పరిస్థితుల్లో గత్యంతరం లేక అక్కడికి చేరి గడుపుతున్నవారే!పగలంతా నిద్రపోయి సాయంత్రం లేచి తయారవడం.. వారికోసం వచ్చే మనుషుల్ని తృప్తి పరచి పంపడం..ఇదే వారి పని!
వారి నిత్య జీవితం! వీరిలో కొందర్ని తల్లిదండ్రులే దరిద్రాన్ని తట్టుకోలేక అమ్మేశారు.మరికొందరు ఎవరూ లేని అనాధలై సమాజంలో రక్షణ లేక ఇక్కడికొచ్చి చిక్కినవారు.
ప్రతి ఒక్కరి వెనుకా ఒక విషాద గాధ! వీరిలో ఒకమ్మాయి కి ఒక ప్రేమికుడు ఉంటాడు.ఇద్దరూ అనేకకారణాల వల్ల పెళ్ళి చేసుకోలేకపోతారు. ఆమె ఇక్కడ చేరుతుంది..కేవలం పొట్టపోసుకోడానికి!
ఆ ప్రేమికుడు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ అప్పుడప్పుడూ వచ్చి ఈమెను చూసి కాసేపు దుఃఖ పడి వెళ్ళిపోతాడు.
ఒకసారి ఒక విద్యార్థుల గుంపు సరదాగా ఈ వేశ్యావాటికకు వస్తారు. వారిలో లిఖోనిన్ అనే కుర్రాడు అ వేశ్యా జీవితాలు చూసి చలించిపోతాడు. ఈ సందర్భంగా అతడు అక్కడ ఉన్న ఒక జర్నలిస్టు తో జరిపే సంభాషణ ఈ నవలకు ప్రాణం వంటిది. ప్లాటోనోవ్ అనే ఆ జర్నలిస్టు వేశ్యల జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో, వారి ప్రమేయం లేకుండానే అవి ఎలా కొద్ది కొద్దిగా నాశనమై పోతాయో, చివరికి శక్తి ఉడిగిపోయాక వారి జీవితాలు ఎంత విషాద కరంగా వీధుల పాలై ముగుస్తాయో కళ్ళు చెమర్చేలా వివరిస్తాడు.
"వీరి జీవితంలోని భయంకరమైన నగ్న సత్యం ఇక్కడికి నన్ను ఆకర్షించింది.సత్యాన్ని దాచే ముసుగు లేదిక్కడ!అబద్ధం, ఆడంబరం, మోసం, డంబాచారం వీటికి ఇక్కడ తావు లేదు.వీరి బతుకుల్లో భ్రాంతి,పటాటోపం లేవు."నేనొక పడుపు కత్తెను.అందరికీ ఉపయోగకరమైన పాత్రను.నగరంలోని భోగాసక్తిని తీర్చడానికి దాచిపెట్టబడిన వస్తువును. రండి, సంతృప్తిగా తిరిగివెళ్లండి.కానీ ఇందుకు బదులుగా మీరు నాకివ్వవలసినవేవో తెలుసా! డబ్బు, జబ్బు, అవమానం, హింస"అంటుంది ప్రతి వేశ్య! ..
ప్లాటోనోవ్ మాటలు విన్న లిఖోనిన్ ఇంకా ఆలోచిస్తూ ఇలా అడుగుతాడు "అసలు ఈ వృత్తి ఎందుకొచ్చింది? దీనికి అంతు ఉందా?ఇది తరతరాల నుంచి వస్తోన్న సత్యమా? మానవులు అంతమైనపుడే ఇదీ నశిస్తుందా?"
దానికి ప్లాటోనొవ్ "ఇది ఎప్పుడు అంతమవుతుందో ఎవరూ చెప్పలేరు.కమ్యూనిస్టులు, సోషలిస్టులు అందమైన కలలు కంటున్నారు(ఇక్కడ అతని మాటల్లో వ్యంగ్యం గమనించాలి)!వారి కలలు నిజమైనపుడే ఇది అంతమవుతుందేమో! ఈ ప్రపంచం ఏ ఒక్కరిది మాత్రమే కాక అందరూ సమాన హక్కుతో అనుభవించినపుడు కూడా ఇది అంతం కావొచ్చు!ప్రేమ అనేది అందరికీ కోరినంతగా దొరికినపుడు,లేక మానవుడు యోగియై, మహర్షియై, దిగంబరుడై పాప రహితుడై పవిత్రుడైనపుడు ఇది నశిస్తుంది"అని నిర్వేదంగా చెప్తాడు.
లిఖోనిన్ చలించి పోయి అక్కడ ఉన్న ఒక వేశ్యను విముక్తురాలిని చేసి గౌరవనీయమైన జీవితాన్నివ్వాలనుకుంటాడు. వెంట తీసుకెళతాడు కూడా !.కానీ మిత్రుల నుంచి, ఇరుగుపొరుగువారి నుంచి ఎదురయ్యే అవహేళనను భరించడం కష్టంగా తోస్తుంది.చివరికామెను వదిలించుకోవాలనే ప్రయత్నంలో అబద్ధమని తెలిసినా తన మిత్రుడికీ, ల్యూబాకు సంబంధం అంటగట్టి ఆమెను వీధిలోకి గెంటేస్తాడు.
ఆదర్శం పటాటోపం ఇదీ!
ల్యూబా అనేక రకాలుగా గౌరవంగా బతికేందుకు ప్రయత్నించి వీలుపడక తిరిగి వేశ్యావాటికకే వచ్చి అన్నా కాళ్ళమీద పడుతుంది.ఎంత హీనమో చూడండి!
ఇలా ప్రతి ఒక్క జీవితమూ మురుక్కాలువ లాగే ఉంటుందిక్కడ! ఏ ఒక్కరి జీవితంలోనూ సంతోషం, నవ్వు, ప్రశాంతత అనే మాటే ఉండదు.జెన్నీకి ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధి పట్టుకుంటుంది.ఆమె మగాళ్లమీద కసితో తన వ్యాధిని దాచి ఎంతోమందికి సంక్రమింపజేస్తుంది. ఒకరోజు పరీక్షల కోసం డాక్టర్ వస్తున్నాడని తెల్సి బయటపడటం ఇష్టంలేక ఉరేసుకుంటుంది.
22 ఏళ్ల జెన్నీ! కాస్తో కూస్తో చదువుకున్న జెన్నీ చరిత్ర అలా ముగుస్తుంది.
వృత్తిలో మానియాక్ లా ప్రవర్తించే పాషాకు పిచ్చెక్కడంతో ఆమెను జైల్లో పడేస్తారు.టమారా ఎవరినో మోసం చేయబోయి జైలుపాలవుతుంది. అక్కడ అందరి జీవితాలూ ఇలాగే ముగుస్తాయి.సోల్జర్ల గొడవల్లో చిక్కి వేశ్యావాటికలు వీధుల్లో పడి వేశ్యలంతా చెట్టుకొకరు పుట్టకొకరుగా అయి మురికి చావుల పాలవుతారు.
చివరికి కొన్నాళ్ళకు యామా అనే పేరు కూడా లేకుండా పోతుంది.
ఈ నవల్లో వేశ్యా గృహాల్లో ఉన్న పరిస్థితుల్ని వాతావరణాన్ని కుప్రిన్ ఎలా వర్ణిస్తాడంటే ఒక్కోచోట వాంతొచ్చినంత పనవుతుంది.పగలంతా మర్యాదస్తుల మల్లే మసిలే కొందరు చీకటిపడగానే యామా వైపు పరుగులు తీయడాన్ని కుప్రిన్ గేలి చేస్తాడు.
ఒకసారి ఈ వృత్తి లోకి అతి నీచ కారణాల వల్లో, గతిలోకో ప్రవేశించిన వారు ఇక మామూలు జీవితంలొకి రావడానికి ఇష్టపడరనే సత్యం ఈ నవల్లో కనపడుతుంది. మామూలు మనుషుల్లో కలవడానికి వీరు చిన్నతనం ఫీలవుతారు.
వీరి జీవితం నిండా పేదరికం, నిరాదరణ,ప్రేమ రాహిత్యం,తాగుడు, తిట్లు, కొట్లాటలు, రోగాలు,హింస, చివరికి వృద్ధాప్యంలో దిక్కులేని చావులు!
ఇంత హృదయ విదారకమైన నవల ఇంతకు ముందు చదవలేదు.గౌరవనీయంగా పని చేసుకుని బతకగలిగే అవకాశం ఏ మాత్రమున్నా స్త్రీలు ఇటువంటి వృత్తిలోకి రావడానికి ఇష్టపడరని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ గోతి లోకి దిగుతారనీ రచయిత ఇందులోని పాత్రల ద్వారా చూపిస్తాడు.
ఇది అందరూ ఎరిగిన సత్యమే! ఎందరు ఆత్మ కథలు రాసినా ఇదొక వృత్తనీ, వారికి హక్కులుండాలనీ వాదించినా, "మాకు కావలసింది మీ, జాలి దయ కాదు, మమ్మల్ని అర్థం చేసుకోండి"అని డిమాండ్ చేసినా వీరి జీవితాల గురించి తెల్సిన తర్వాత వారికి దొరికేవి అవే..జాలి, దయ!
ఈ మధ్య స్వాతి వార పత్రికలో వంశీ దిగువ గోదావరి కథల శీర్షిక కింద "వాసంతి"అనే నటి గురించి రాస్తూ వాసంతి జీవితాన్ని పరిశీలిస్తుంటే "యామా ది పిట్" నవల గుర్తొచ్చిందని రాశాడు.
ఇతర భాషా నవలలు పాఠకులకు సరైన రీతిలో చేరాలంటే అనువాదం అద్భుతంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ నవల అటువంటి అద్భుత అనువాదంతోనే తెలుగులోకి వచ్చింది. స్వర్గీయ రెంటాల గోపాల కృష్ణగారు అనేక ఉద్వేగ భరిత సన్నివేశాల్ని, వేశ్యల మనసులోని దుఃఖాన్ని సైతం ఎంతో చక్కగా(ఇంతకంటే ఇక్కడ ఏం మాటవాడాలో తెలీడంలేదు) అనువదించారు. రోగాల పాలై ఆత్మహత్యకు సిద్ధమైన జెన్నీ అంతరంగాన్నీ,ల్యూబా అమాయకత్వాన్ని, పోలీసుల దుర్మార్గాన్నీ, యజమానుల దయా రాహిత్యాన్నీ..ఇలా చదువుతున్నంత సేపూ యామా కళ్ళ ముందే కనపడేంత ప్రతిభావంతమైన అనువాదం.
ఈ నవల తెలుగు అనువాదం మూడో ముద్రణ 1979లో ఆదర్శ గ్రంథ మండలి విజయవాడ వారు వేసిన కాపీ నా వద్ద ఉంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో దొరికే పరిస్థితి లేదు.
ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉంటే మాత్రం తప్పక చదవండి!
మార్చి నుంచీ ఒంటిపూట బళ్ళూ, మధ్యాహ్నానికి ఇంటికొచ్చి పడి ఇక సాయంత్రం దాకా అమ్మని అది చెయ్యి, ఇది వండు అని పీక్కు తిని, ఏప్రిల్ నెల్లో హాయిగా పరీక్షలు రాసి, చివరి పరీక్ష రాసేసి వస్తూ వస్తూ ఒక రాయి సంపాదించి దాన్ని పరీక్షలు రాసిన అట్ట మీద ఎగరేసుకుంటూ ఇంటికొచ్చి, ఆ రోజు అత్యవసరంగా, అర్జెంట్ గా స్నేహితులతో అందుబాటులో ఉన్న చెత్త సినిమా అయినా సరే చూసేసి..ఆ మర్నాడే అమ్మమ్మ ఇంటికో, అత్త ఇంటికో చెక్కేయడం,తర్వాతి క్లాసులో ఏముంటుందో అన్న చింత లేకుండా జూన్ 12 వరకూ హాయిగా గడిపేయడం! ఈ రోజులన్నీ చరిత్రలో కలిసిపోయినట్టే!
గవర్నమెంట్ బళ్ళ సంగతి తెలీదు గానీ ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ మార్చిలోనే పరీక్షలు పెట్టేయడం,వెంటనే నాల్రోజుల్లో తర్వాతి క్లాసు సిలబసు మొదలెట్టేయడం!(మా పాప స్కూల్లో కూడా ఇదే పద్ధతి ఉంది కానీ మేమిద్దరం "తూచ్"కొట్టేసి రైలెక్కేశాం) ఇందుకోసం స్కూలు వాళ్ళ దగ్గరే చచ్చినట్టు నోట్ బుక్స్ తో సహా కొనాల్సి రావడం!కొన్ని స్కూళ్ళ వాళ్లయితే స్కూల్లో నోట్సులు కొనని పిల్లల పేర్లని రాసి పెట్టుకుని తర్వాత "బయటెందుకు కొన్నారు?" అని నిలదీస్తున్నారు కూడా!యూనిఫామ్ బయట కొనడానికి లేదు.
ఇక సిలబస్ విషయానికొస్తే అది స్కూలు స్కూలుకూ ఇంతింతై వటుడింతై అన్నట్లు విస్తరించి పోవడం తప్ప వేరే దారి లేదు.ఇందులో తల్లిదండ్రుల అరాచకం కూడా ఉందని ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నాను. మా కాలనీలో శ్రీమతి సుబుద్ధి(ఆమె అసలు పేరది కాదనుకుంటాలెండి, ఆవిడ పద్ధతులకు ముచ్చటేసి అలా పిలుస్తాను!ఆవిడేమీ అనుకోదు కూడా) అనే ఆవిడ వాళ్ళ పిల్లల్ని ఇప్పటికి నాలుగు స్కూళ్ళు మార్చింది. ఇంతా చేసి ఒకరు మూడో క్లాసూ,ఒకరు ఒకటో క్లాసూ చదువుతున్నారు.మొదట ప్లే స్కూలు ఒకటి నచ్చలేదని ఇంకోచోట వేశారు.(చేర్చడం కాదు, వేయడమే)!
తర్వాత గచ్చిబౌలి బొటానికల్ గార్డెన్ దగ్గర్లో ఉన్న ఒక స్కూల్లో వేశారు.ఇది వర్కింగ్ మదర్స్ పాలిటి వరం లాంటి స్కూలు! పిల్లలకు ఐదారు క్లాసుల దాకా పరీక్షలుండవు.హోమ్ వర్క్ అసలే ఉండదు.పైగా కోకాపేట కనకం ("తులసి" సినిమా చూశారా?)లాగా బాగా "రిచ్చి"అయి ఉండాలి ఇక్కడ చదవాలంటే!ఈ స్కూల్లో సిలబస్ బాగా హెవీగా ఉంటుందని పేరు.ఆ స్కూల్లో సిలబస్ చాలేదని సుబుద్ధి వాళ్ళని తర్వాత ఏడాది గల్లీ పబ్లిక్ స్కూల్లో పడేసింది.ఇక్కడ ఇంకా ఎక్కువట సిలబస్!(ఆ పిల్లల స్కూలు బాగ్ లు చూసి తీరాలి) ఎంత ఎక్కువ సిలబస్ ఉంటే అంత తెలివిగా, చురుగ్గా గా తయారవుతారట పిల్లలు ఆమె ప్రకారం!సబ్జెక్ట్ అంతా మెదడుతో కూరాలి, పొట్టు పొయ్యిలో పొట్టు కూరినట్టు!
హైటెక్ సిటీ,గచ్చిబౌలి పరిసరాల్లో ఈ ఏడాది కుప్పలు తెప్పలుగా కొత్త స్కూళ్ళు అత్యాధునిక హంగుల్తో లేచాయి.వాన కురిసిన మర్నాడు పుట్టగొడుగులు కూడా ఇంతగా లేవవు.ప్రతి స్కూలూ ఇంటర్నేషనల్ స్కూలే! "ఇంటర్నేషనల్"అంటే ఏమిటో వాళ్ళనే అడగాలి! రోడ్ల పక్కన "ఫలానా బ్రదర్స్" వారి బట్టలషాపుల హోర్డింగ్ లతో సమానంగా,ఇంకా చెప్పాలంటే వాటిని మించి స్కూళ్ళ హోర్డింగులు! సిటీ నిండా,ఇంకా చెప్పాలంటే రాష్ట్రం నిండా ఇదే పరిస్థితి!
ఇక స్టేట్ సిలబస్ అనుసరించే ప్రైవేట్ స్కూళ్ళ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. "టాలెంట్ స్కూలు"అని ఒకరూ ,"కాన్సెప్ట్ స్కూల్" అని ఒకరూ పేర్లు హంగూ ఆర్భాటాలతో పెట్టేసి పిల్లల్ని ఎంతగా తోమేస్తారంటే... పీల్చి పిప్పి చేయడమే! పదో క్లాసు డే స్కాలర్స్ కి తెల్లవారు జామున రెండింటికి ఇంటికి ఫోన్ చేసి లేపేస్తారు చదువుకోడానికి. ప్రతి అరగంటకీ చేస్తుంటారు..నిజంగా చదువుతున్నారా, నిద్దరోతున్నారా అని తెలుసుకోడానికి! అదొక హింస!
చాలామందికి తెలుసోలేదో,పదో తరగతి పరీక్షల్లో 500 నుంచి 580 వరకూ సంపాదించే విద్యార్థులున్న ఈ స్కూళ్ళలో చాలా వాటిలో తొమ్మిదో తరగతి పేరుకు మాత్రమే! తొమ్మిదో క్లాసు నుంచే పదో తరగతి సిలబస్ చెప్పి, దాన్నే మళ్ళీ పదో తరగతిలో కూడా రుద్దితే 599 వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు కదూ!
ఆరోక్లాసు నుంచే IIT గుదిబండను పిల్లల మెడలకు కట్టి ఈడ్చుకెళ్ళే ఈ స్కూళ్ళు నిస్సిగ్గుగా టెక్నో స్కూల్స్ అనీ అదనీ ఇదనీ, రాష్ట్రంలోని పిల్లలందర్నీ దేశంలోని IIT ల నిండా కూరడమే తమ లక్ష్యమనీ చెప్పుకుంటుంటే వాళ్ళకేమో గానీ వేరే ఛాయిస్ లేని సమాజంలో బతుకుతున్నందుకు తల్లిదండ్రులు మాత్రం సిగ్గుపడే రోజు త్వరలోనే ఉంది.
ఇన్ని హంగులున్నా, తల్లిదండ్రుల కంట్రిబ్యూషన్ లేకుండా పిల్లల్ని పూర్తిగా స్కూలుమీదే వదిలేస్తే కుదరదని ముందే డిస్ క్లైమర్ పెట్టేస్తాయి.ఏనుగులా ఉండే మా పొరుగింటావిడ వాళ్ళమ్మాయి పదోక్లాసు పరీక్షలయ్యేసరికి పీనుగులా తయారైంది. పిల్లల సంగతి ఇహ చెప్పక్కర్లేదు. అంతంత సిలబస్ చదవలేక, ఎవరికీ చెప్పుకోలేక స్తబ్ధుగా మారిపోతున్నవాళ్ళెంతమందో!
పైగా ఈ ఆర్భాటాల స్కూళ్లలో చాలావాటికి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నడిపించేస్తున్నారని నిన్నటినుంచీ NTV ఘోషిస్తోంది.నిజమే! స్కూలుకు మంచి పేరుందా లేదా అనే చూస్తాం కానీ, ఆ స్కూలుకు అనుమతి ఉందా అనే విషయం అడగాలని ఒక్కశాతం తల్లిదండ్రులకు కూడా తోస్తుందని అనుకోను.
కొన్ని ఖరీదైన ప్రైవేటు స్కూళ్ళలో జరిగే తంతు ఒకటి చూడండి!(మా ఫ్రెండ్ చెప్పింది)విద్యా సంవత్సరం ముగుస్తోందనగా ఆ స్కూల్లో చదువుతున్న తల్లిదండ్రులకు ఒక నోట్ పంపిస్తారు యాజమాన్యం వారు.
"వచ్చే విద్యా సంవత్సరం నుంచి మా స్కూల్లో ఫలానా IGCSC సిలబస్ పరిచయం చేస్తున్నాం! ఇది చాలా తెలివైన పిల్లలకే! మీ పిల్లాడు చాలా చాలా తెలివైన వాడు, షార్పూ కాబట్టి(నిజానికి పిల్లలు అలా లేకపోయినా సరే నోట్ వస్తుంది తల్లిదండ్రులకు) ఈ సిలబస్ లో చదివితే ఇంకా ఇంకా షార్పవుతాడు.(ఎంత షార్ప్ అంటే పొరపాటున వాడిని ముట్టుకుంటే కసుక్కున గుచ్చుకునేంత), కానీ...ఈ సిలబస్ లో చదవాలంటే ఇప్పుడు మీరు కడుతున్న ఫీజు కంటే 46 వేల రూపాయలు (మాత్రమే)అదనంగా కట్టాల్సి ఉంటుంది. త్వరపడగలరు. పరిమిత కాల ఆఫర్" అని!
ఒక పక్క పిల్లవాడు పదునెక్కుతాడంటే సంతోషమే గానీ, మళ్ళీ అరలక్ష గుమ్మరించాలంటే కష్టమే! ఇప్పటికే కొన్ని స్కూళ్ళు మందకొడి విద్యార్థులకు అబాకస్ అనీ అదనీ ఇదనీ అదనపు క్లాసులు పెట్టి అదనంగా వసూలు చేస్తున్నారుట.
ఇక ఫీజుల సంగతి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది.మనకు బీపీ రాకుండా ఉంటుంది. ఈ ఖర్చుల గురించి అప్పుడెప్పుడో ఒకటపా.రాశాను. సంవత్సరం మధ్యలో అకస్మాత్తుగా ఫీజులు రెట్టింపు చేసి పారేసే స్కూళ్ళు బోలెడు.
ఈ పరిస్థితి అంతా మారాలంటే ఏం చేయాలి?
ఒక్కసారిగా కాకపోయినా కాలక్రమేణా అయినా మంచి మార్పు ఈ స్కూళ్ళలో, వారి యాజమాన్యాల్లో రావాలంటే ఎలా?
అసలు సాధ్యమేనా?
లేక నానాటికీ తీసికట్టేనా?
దీనికోసం ఒక ఉద్యమం జరగాలా?
ఇంకా లోతుగా ఆలోచిస్తుంటే పిచ్చెక్కేలా ఉంది!ఆపేస్తాను!


