మాస్కో "రాదుగ" ప్రచురణాలయం వాళ్ళ పుస్తకాలు భలే ఆకర్షణీయమైన తెలుగు ఫాంట్ తో, మంచు కురిసే రష్యా అందాల్ని ఆవిష్కరిస్తూ, బోలెడంత ముద్దొస్తూ ఉంటాయి. రాదుగ ప్రచురణాలయం మూత పడిందని తెలిసినపుడు వాళ్ళ పుస్తకాలన్నీ చదువుతూ పెరిగిన మేము(నేను, నా కజిన్సూ)
"రాదిక నీ కోసం చెలీ..."రాదుగ" వసంత మాసం! ఇక రాదుగా"అని విషాద గీతాలు పాడేసుకుని సరిపెట్టుకున్నాం!అప్పటివరకూ వచ్చిన పుస్తకాలేవీ జాగ్రత్త కూడా పెట్టుకోలేదు. అలా పోగొట్టుకున్నదే
ఉక్రేనియన్ జానపద గాథలు పుస్తకం.
పోగొట్టుకున్నది వెదుక్కోడానికేగా! అందుకే అప్పటినుంచి పట్టు వదలని విక్రమార్కుడి చెల్లెల్లా విశాలాంధ్ర బ్రాంచీలన్నీ వెదికాను.
వాళ్ళకు నా కంటే నిర్లక్ష్యం!
"మా దగ్గర లేదు. ఎక్కడ దొరుకుతుందో మాకు తెలీదు పొండెహె"అని భలే మర్యాదగా చెప్పారు.
అలాగే నేను గత పదిహేనేళ్ళుగా వెదుకుతున్న మరో అద్భుతమైన పుస్తకం ఫ్రెంచ్ రచయిత ఎమిల్ జోలా రాసిన "ఎర్త్" కి సహవాసి గారి అత్యద్భుత అనువాదం "భూమి" నవల. అది మా వూరి లైబ్రరీలో చదివాక ఎలాగైనా సంపాదించాలనుకున్నాను.హైద్రాబాదు బుక్ ట్రస్ట్ వారు 1983లో వేశారు దాన్ని. వాళ్ళ దగ్గర అడిగితే "మా వద్ద కూడా ఒకటే కాపీ ఉంది.జిరాక్స్ కాపీ కావాలంటే ఓకే"అన్నారు.కానీ నాకు ఫొటోస్టాట్ కాపీల మీద అంతగా ఆసక్తి లేక ఊరుకున్నాను. ఒరిజినల్ నా లైబ్రరీలో ఉండాలనే స్వార్థం!
విజయవాడ లెనిన్ సెంటర్ లో కూడా రెండు మూడు సార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్కడ అరుదైన పుస్తకాలు లభించే వంశీ బుక్ స్టోర్స్ యజమాని జగన్మోహనరావు(నాగేశ్వర రావుగా అందరికీ పరిచితులు)గారు కూడా "అవెక్కడ దొరుకుతాయమ్మా! లాభం లే"దన్నారు.
ఇక్కడ రెండు ముక్కలు ఆయన గురించి చెప్పుకోవటం విధాయకం! పాత పుస్తకాలమ్మే షాపులు ఎన్నైనా ఉండొచ్చు కానీ సాహిత్యాభిరుచి ఉండి,అరుదైన పుస్తకాలు ఆసక్తి ఉన్నవాళ్ళకు అందుబాటులోకి తేవాలన్న తపన ఆయన ఒక్కరిలోనే కనిపిస్తుంది.ఏ పుస్తకం గురించి అడిగినా దాని పూర్వ చరిత్ర మొత్తం చెప్పగలరు.ఎంతోమంది వారికి కావలసిన అరుదైన పుస్తకాల గురించి అక్కడికి వస్తుండటమే కాక "మొన్న అడిగిన పుస్తకాలు వచ్చాయా"అని ఫోన్లు చేస్తూ ఉంటారు.
గ్రంథ సేకరణ చేసేవారి అనుభవాలను ఆయన గ్రంథస్థం చేసే పనిలో ఉన్నారు.
చివరికి ఆ రెండు పుస్తకాలు,...... ఏవి?....ఉక్రేనియన్ జానపద గాథలు, మరియు "భూమి" చక్కటి చెక్కుచెదరని స్థితిలో(వంశీ స్టోర్స్ లో కాకపోయినా)లెనిన్ సెంటర్లోనే నాకు దొరికాయి.
దొర్లే బఠానీ గింజ
రైతు కొడుకు ఇవాన్,
వింత చేతి గొడుగు
శ్రీమాన్ మార్జాలం,
చక్రవర్తి అయిన సింహం,
నక్కచెల్లి-తోడేలు అన్న,
లైమ్‌చెట్టూ-ఆశపోతు ముసలావిడ ఇంకా మర్చిపోయిన అనేక కథలు ఈ ఉక్రేనియన్ పుస్తకంలో ఉన్నాయి.
"ప్రపంచంలో ఉన్న కథలన్నీ చెప్పేశాను, ఇక నా వల్ల కాదు నీతో" అని మా అమ్మాయితో గొడవ పడుతున్న శుభవేళ ఈ పుస్తకం దొరకడం అదృష్టమే!
"భూమి" అయిపోతుందేమో అన్నంత అపురూపంగా రోజుకోపేజీ చదువుతున్నాను.(మళ్ళీ ఇంకో ఎడిషన్ పడకపోతే ఇక అది నాకు ఎప్పటికీ దొరకదనే నమ్మకంతో ఉన్నాగా మరి ఇప్పటివరకూ) అది ఎలాగూ ఎవరికీ దొరకదు కాబట్టి చదవడం పూర్తయ్యాక ఇక్కడే దానిగురించి రాస్తాను.
ఇంతమంచి అరుదైన విలువైన పుస్తకాలు దొరికేందుకు సహకరించిన మంచి మిత్రులకు బోల్డన్ని థాంక్యూలు!