July 8, 2010

లెక్కలొచ్చా మీకు?



లెక్కలంటే మీలో చాలామంది లాగే నాక్కూడా చచ్చేంత భయంగా ఉండేది చిన్నప్పుడు. పదో క్లాసు ఎప్పుడైపోతుందా లెక్కల బెడద వదిలించుకోవచ్చని ఎదురు చూసిన క్షణాలు బోల్డు.ఆల్ జీబ్రా కల్లో దెయ్యమల్లే వెంటబడి పీడకలలు తెప్పించిన రోజులు అసంఖ్యాకం! రైల్వే ప్లాట్ ఫాముల పొడవులు, వెడల్పులూ మనమెందుకు కొలవాలో,రైలెక్కేది మనం కానపుడు వాటి వేగాలు మనమెందుకు తెలుసుకోవాలో తెలీక బుర్ర వేడెక్కిపోయేది.అందుకే శేఖర్ పెద్దగోపు లెక్కల టపా .రాసినపుడు సంఘీభావం తెలుపుదామని వెళ్తే అక్కడ నాలాంటోళ్ళు బోల్డుమంది ఉన్నారని తెలిసి సంతోషపడ్డాను.



చాలా ఏళ్ళ క్రితం బాలజ్యోతి అని ఒక పిల్లల  మాస పత్రిక(ఆంధ్ర జ్యోతివాళ్లది)వచ్చేది. బోల్డన్ని మంచి కథలూ(అందులో రెంటాల గోపాల కృష్ణ గారు రాసిన బొమ్మలు చెప్పిన కథలు నా ఫేవరెట్ గా ఉండేది)అవీ ఉండేవి.అన్నింట్లోనూ అందరి హాట్ ఫేవరెట్ గా ఉండే శీర్షిక,అప్రతిహతంగా పాతికేళ్ళు సాగిన శీర్షిక ఒకటుండేది. అదే "మేథ మే ట్రిక్స్"! అవసరాల రామకృష్ణా రావుగారు నిర్వహించే పజిలింగ్ శీర్షిక!చక్కని చిక్కని చిక్కు లెక్కల్తో బుర్ర వేడెక్కిపోయే శీర్షిక! లెక్కలంటే భయం ఉన్నా,ప్రతి నెలా ఆ శీర్షికలో ఇచ్చే పజిల్స్ మాత్రం జుట్టు పీక్కుని అయినా సాధించే వాళ్లం!


శ్రీ రామకృష్ణా రావుగారు మెదడుకి మేతలాంటి అద్భుతమైన లెక్కల పజిల్స్ తో పాటు చక్కని జానపద కథని కలిపి మల్లెలు,మరువం కలిపిన దండలా ఒక నవల రాశారు.ఆ నవల గురించే నాలుగు మాటలు రాద్దామని!

ఇందులో మామూలుగా ఒక రాజకుమారి,ఆవిడని రాక్షసుడో మాంత్రికుడో ఎత్తుకుపోడం,వాడెవడో రాజకుమారుడొచ్చి కాపాడ్డం..ఇవేవీ ఉండవు. యండమూరి నవలల్లో హీరోయిన్ లాంటి ఒక తెలివైన రాకుమారి,అద్భుత శాస్త్రజ్ఞుడైన రాకుమారుడు ఉంటారు.

కథ కొద్దిగా అయినా చెప్పకుండా పరిచయాలు రాయడం నాకంతగా రాదు.చెప్తాను!:-(


ఒక రాజుగారికి పెళ్ళయి ఎన్నాళ్ళయినా పిల్లలు కలగరు.రాణీగారికి ఒక పిల్లి తల్లి(లేదా తల్లిపిల్లి) ఇచ్చిన శాపం కారణంగా! తర్వాత ఆ పిల్లి,  రాణిగారికి పిల్లలు కలుగుతారని శాపం సడలిస్తుంది కానీ కొన్ని కండిషన్స్ పెడుతుంది.

 రాణిగారికి ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లకు లెక్కలంటే ఎంతో ప్రాణం.అందుకే పేరు శారద అయినా అందరూ గణిత విశారద అని పిలుస్తుంటారు.పెరిగి పెద్దయ్యాక పెళ్ళి చేసుకోమంటే లెక్కల్లో తనని ఓడించిన వాడినే పెళ్ళాడతానని చెప్పేస్తుంది.ఆమెకో ఇద్దరు చెలికత్తెలు. గిలిగింతా,చికిలింతానూ!వాళ్ళూ గణితంలో ఉద్దండులే!

చెలికత్తెలిద్దరి ప్రశ్నల్నీ దాటుకుని రాకుమారి వద్దకెళ్ళాలి.అక్కడ ఓడిపోతే సరాసరి విషమందిరంలోకి పంపి మరణ దండన విధిస్తారు!ఇవీ షరతులు! అలా చాలామంది వచ్చి కొన్ని లెక్కల్ని విప్పి,మరికొన్ని చిక్కుల్ని విప్పలేక విషమందిరంలోకి పోతారు,.


మరోచోట పెరుగుతున్న కథానాయకుడు (ఇతడి తల్లి రాకుమారి తల్లికి స్నేహితురాలే!వీరిద్దరి జననానికీ ఒక లింక్ ఉంటుంది కూడా)విజ్ఞానవర్మ జీవశాస్త్రంలో ఆసక్తి కొద్దీ ప్రయోగాలు చేసి మరణాన్ని జయించే సంజీవని కనిపెడతాడు.ఇతడి పక్కన చిన చిలిపిశ్రీ,పెను వెకిలిశ్రీ అనే బావామరుదులు శిష్యులు!

రాకుమారి చేతిలో చస్తున్నవారి సంఖ్య రాజుగారిని కలవరపెడుతుంది.ఇంతలో శారద చేతిలో హతుడైన పొరుగుదేశ యువరాజు తండ్రి ఆగ్రహించి వీరి రాజ్యం పైకి దండెత్తే  సన్నాహాలు చేస్తాడు.ఈ లోపు విజ్ఞానవర్మ రాజ్యప్రవేశం చేసి ఎవరికీ తెలీకుండా విషమందిరం నుంచి పొరుగు దేశ యువరాజునేకాక అందరినీ బతికిస్తాడు. దానితో శారద అతడిని ఎలాగైనా ఓడించి చంపాలనుకుంటుంది(మరోపక్క అతడి పట్ల ఆకర్షితురాలవుతూనే...)

చివరికి శారద,వర్మల మధ్య లెక్కల చిక్కులతో పోటీ జరుగుతుంది.వర్మ గెలుస్తాడు.ఇంతలో వర్మ అకాలమరణం చెంది కథ అనుకోని మలుపు తిరుగుతుంది.మలుపేమిటో,కథ సుఖాంతం అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ నవల తప్పక చదవాల్సిందే!

నాకు వారం పట్టింది పూర్తిచేయడానికి!ఎందుకంటే వీలైనన్ని పజిల్స్ సాల్వ్ చేసుకుంటూ చదివాను.కొన్ని నా వల్ల కాక వదిలేసి,రాకుమారి జవాబు కోసం వెదుక్కున్నాను.



కొన్ని పజిల్స్ సరదాగా!

1."ఒక మార్గశిర మాసంలో చెట్టుకు రెండు వందల చొప్పున మల్లె మొగ్గలుంటే ఐదు చెట్లకెన్ని మొగ్గలుంటాయి?"



2.అందమైన సరోవరంలో కొన్ని పద్మాలు కొన్నితుమ్మెదలూ ఉన్నాయి.రెండేసి తుమ్మెద లు ఒక్కొక్క పద్మం మీద వాలితే ఒక  పద్మం మిగిలిపోతుంది.అలా కాక ఒకే తుమ్మెద రెండేసి పద్మాల మీద వాలితే ఒక తుమ్మెద మిగిలిపోతుంది.పద్మాలెన్ని? తుమ్మెదలెన్ని?



3.ఎనిమిది నాలుగులు ఉపయోగించి ఎలాగైనా 500 తెప్పించాలి!



4.రెండు కుంచాల సెనగలు నానవేస్తే నాలుగు కుంచాలు అవుతాయి.రెండు నానేస్తే ఎన్ని అవుతాయి?:-))



5.పదిమంది గల కుటుంబంలో ఇద్దరు తాతలు,ఒక అమ్మమ్మ,ముగ్గురు తండ్రులు,ముగ్గురు కొడుకులు,ముగ్గురు కూతుళ్ళు,ఇద్దరు అత్తగార్లూ,ఇద్దరు మామగార్లూ,ఒక అల్లుడు,ఒక కోడలు,ఇద్దరు అన్నదమ్ములు,ఇద్దరు అక్కచెల్లెళ్ళూ ఉన్నారు!ఎలాగ?


ఇవి గిలిగింతా,చికిలింతా అడిగే ప్రాథమిక ప్రశ్నలు మాత్రమే! ఇంకా రాకుమారి అడిగే ప్రశ్నలు ఇవ్వలేదు.

ఇలాంటి మరెన్నో లెక్కలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి.అందుకే ఈ పుస్తకం పిల్లల నవల మాత్రమే కాదు,పెద్దలు చదివాక పిల్లలకు విడమర్చి చెప్పాల్సిన నవల.


ఈ నవల మొదట ముద్రణ పడింది 1973లో! కొన్నాళ్ళకి ఆ నవలని అందరూ మర్చిపోయారు! అయితే ఆ నవలను చదివి అప్పట్లో తెగ సంబరపడిన యల్లంరాజు శ్యామసుందర్ అనే ఎన్నారై గారు దాని మీద అభిమానంతో మళ్ళీ ముద్రించడానికి ముందుకొస్తే రచన శాయిగారు దాన్ని  సంపాదించి ముద్రించేశారు.

నూటపాతిక పేజీల ఈ మంచి నవల ధర కేవలం..కేవలం నలభై రూపాయలు!

నేను మాత్రం ఈ పుస్తకాన్ని కొనలేదు. దాసరి సుబ్రహ్మణ్యం గారి "ప్రత్యేక రచన"లో ఇచ్చిన ప్రత్యేక చందమామ పజిల్ సాల్వ్ చేసి బహుమతి గా సంపాయించుకున్నా!


పెద్దల్ని పిల్లల్ని కూడా అలరించే ఈ పుస్తకం

వాహినీ బుక్ ట్రస్ట్,


1-9-286/3,విద్యానగర్,హైద్రాబాదు వద్ద దొరుకుతుంది.వాహినీ బుక్ ట్రస్ట్ వారు పుస్తక ప్రియుల కోసం ఈ నవలను 30 రూపాయలకే అందిస్తున్నారు...పది రూపాయల ప్రత్యేక తగ్గింపుతో! కాపీలు అయిపోతే మళ్ళీ వేస్తారో లేదో,త్వర పడండి!

ప్రముఖ పుస్తక కేంద్రాలన్నింటిలోనూ కూడా లభ్యం!

July 2, 2010

నీ నగలను నువ్వే రక్షించుకో! !



నీ కొండకు నీవే రప్పించుకోమని ఏడుకొండల వాడిని అడిగే ఆనవాయితీ పోయి "స్వామీ , నీ నగలను నువ్వే కాపాడుకోవాలి , లే, లే !ఇహ నువ్వే రంగంలోకి దిగి ఒక్కొక్కళ్ళకీ నీ ఉగ్ర నరసింహావతారం కనీసం కల్లో అయినా చూపించి ఏదో ఒకటి చెయ్యి"అని వేడుకోవాల్సిన పరిస్థితి దాపరించింది.




అవి మామూలు నగలా? ఐదు వందల ఏళ్ళనాడు రాయలు దేవస్థానానికిచ్చిన నగలు! వాటికి బంగారం పరంగా పక్కన పెడితే పురావస్తు సంపదగా విలువ ఎంత ఉంటుందో టీటీడీ వాళ్ళు అంచనా వేయలేరా?



అసలు చివరి క్షణం వరకూ అవి లేవనే విషయమే దేవస్థానంలోవారికి సరిగ్గా తెలీదంటే ఎంత అలసత్వంతో కొట్టుమిట్టాడుతున్నట్లు వీళ్ళు? రాయలిచ్చిన నగలేవో, ఇతరులిచ్చిన నగలేవో అసలులెక్కలే లేవు.

అన్నింటితో పాటు రాయలవారిచ్చిన నవరత్న కిరీటాలు, వెండి పళ్ళాలూ మొత్తం కరిగించి పోశారట! ఏవి కరిగించారో తెలీదు. ఎంత కరిగించారో తెలీదు!


 అసలేమీ తెలీదు! ఎవ్వరికీ తెలీదు.


నలభై ఏళ్ళక్రితమే కరిగించినా ఫొటోలు తీసే చివరిక్షణం వరకూ, ఎవ్వరి వద్దా ఏ సమాచారమూ లేదు.సెబాసో!

నేనేం చెప్పేది? అని ఒకడు, నాకేటి తెలుసు ?అని ఒకడు !ఎంత బాధ్యతా రాహిత్యం!

అసలు నగలు కరిగించిన విషయం రికార్డుల్లో ఉందో లేదో స్పష్టత లేదు. పైగా పాత రికార్డులన్నీ కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయనీ వాటిలో వివరాలన్నీ ఉన్నాయని చెప్తున్నారు. అంటే అందులో రాయలు సమర్పించిన నగల వివరాలుండే ఉంటాయిగా!



దీనికి వ్యతిరేకంగా డాలర్ శేషాద్రి వారేమో "రాయలు ఇచ్చిన నగల ఆనవాళ్ళే లేవు.వాటిని గుర్తు పట్టలేం! 500 ఏళ్ళ నాటి నగలు కద, పాడైపోతాయి"అని సెలవిస్తున్నారు. వీరి "అనుభవం" దృష్ట్యా ఆ మాటలకు విలువ కట్టాలి!



నగలు కరిగిస్తే విలువైన వజ్రాలు, మణులూ,మాణిక్యాలూ ఏమయ్యాయి?



పైగా "కరిగించి ఉండొచ్చు"


"తాపడానికి వాడారేమో"


"రికార్డుల్లో లేకపోవచ్చు" అని అన్నీ అనుకోళ్ళే!

ఈనాడు లో శ్రీధర్ కార్టూన్ భలే వేశాడు,చూడండి





ఒకపక్క తొమ్మిదో టీవీ వాళ్ళు తిరుమల ను కాపాడుకోడానికి "సోనియా గాంధీ" గారికి ఈ మెయిల్స్ పంపాలని చెప్తూ కామెడీ చేస్తున్నారు.:-))

మరోపక్క టీటీడీ వాళ్ళు ఈ ట్రాజెడీ ని నిన్ననే బయట పెట్టారు.


ఇందులో ఎవరి బాధ్యతెంతో ఎప్పటికి తేలేను?

రెండు రోజుల్లో అందరం ఎవరి గొడవల్లో వాళ్ళుపడి పోతాం! దీనికి ఫాలో అప్ ఎప్పుడు?


టీటీడీ లో ఉన్నత స్థాయి నుంచి చిరుద్యోగుల వరకూ ఎవరికీ ఆ కొండమీద దేవుడనే వాడొకడున్నాడని నమ్మకమే లేనట్టుంది.

ఇప్పటికైనా కళ్ళు తెరిచి స్వామి నగల్ని కాపాడుకోకపోతే కొన్నాళ్ళకి ఇదిగో, పైన ఫొటోలో ఉన్నట్లు శ్రీవారిని చూపించి, "ఏమో, ఆ సర్వాంతర్యామే నగలన్నీ ఎవరికో ఇచ్చాడేమో, ఆయన లీలలు తెలియతరమా" అని చెవిలో పూలు పెట్టేగల్రు!


కనీసం నిజాం నగలను అప్పుడప్పుడూ ఏ తాజ్ కృష్ణలోనో ప్రదర్శనకు పెట్టినపుడన్నా చూస్తాం!


రాయలవారు సమర్పించిన అపార సంపద మాయం! కనీసం ఫొటోల్లో అయినా చూడలేం!


గోవిందా గోవిందా!