July 10, 2009
సానియా నిశ్చితార్థానికి మీడియా హడావుడి !
ఈ రోజు పొద్దుటినుంచీ పొరపాటున టీవీ పెట్టామా, ఒకటే గోల! ఈ రోజు సానియా మీర్జా నిశ్చితార్థం కాబట్టి తాజ్ కృష్ణ దగ్గర ఏం జరుగుతోందో తెలుసుకోవాలని మీడియా వాళ్లంతా అక్కడ పడిగాపులు కాస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ సమచారాన్ని, చూస్తున్నారో కూడా తెలుసుకోకుండా ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఒక పక్క ఇంకా ఆ పార్టీ జరుగుతూ ఉండగానే చిరాకుతో ఈ టపా రాస్తున్నాను.
"కరాచీ బేకరీలో కేకులు మాయం"
"షాపుల్లో నగలకు , బట్టలకు షార్టేజ్"
"పెళ్ళి కళ వచ్చేసిందే బాలా" ఇలాంటి చీప్ టైటిల్స్ పెట్టి ఇవాళ పొద్దుటినుంచీ ఊదరగొట్టేస్తున్నాయి అన్ని ఛానెల్సూ!
సాయంత్రానికి ఈ పైత్యం మరింత ప్రకోపించింది. మీడియాకు ప్రవేశం లేదని, ఇది ప్రైవేట్ వ్యవహారమని కుటుంబ సభ్యులు మొత్తుకున్నా, ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుని ఆ "ఫీల్ గుడ్" ఇన్ ఫర్మేషన్ ప్రేక్షకులకు అందించాలని వీళ్ళ తపన! సానియా, సోహ్రబ్ బట్టలు తెచ్చిన కార్లమీదకు ఎగబడి మొత్తానికి వాటిని దాచిన బాక్సులను కెమెరాలతో పట్టుకోగలిగారు.
ఏదో పేలుళ్ళ సంఘటన జరిగినట్లు, జాతీయ విపత్తు సంభవించినట్లు స్టూడియోలో ఉన్న న్యూస్ రీడర్లు
"అక్కడి తాజా పరిస్థితి ఏమిటి?"
అని ప్రతి ఐదు నిమిషాలకూ అడిగి తెలుసుకోవడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలీడంలా!
"వంటలేం చేశారు? ఎన్ని ఐటం లు ఉన్నాయి మెనూలో? ఏ యే రంగుల్లో సానియా బట్టలు డిజైన్ చేశారు? ఆ బట్టలు కనిపించాయా?ఇంతకీ పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటున్నారు? "ఇలాంటి చొప్పదంటు అనుబంధ ప్రశ్నలు!
ఇది కాక సానియాకు మనం అభినందనలు తెల్పాలంటే మెసేజ్ కి ఆరేసి రూపాయలు వదిలించుకుని ఎస్సెమ్మెస్ పంపే అద్భుత అవకాశం మనకి సొంతం!
సానియా "గొప్ప క్రీడాకారిణి" అయితే కావొచ్చు! ఆమె వివాహ నిశ్చితార్థం "వార్త" అయితే కావొచ్చు!మీడియాకి లోపలికి ప్రవేశం లేదని తెలిసీ, హోటల్ బయట పడిగాపులు కాస్తూ లోపల జరిగే తంతు ను ఊహిస్తూ, బయటి హడావుడిని ప్రేక్షకులకు ప్రతి నిమిషం ఎన్నికల ఫలితాల కంటే అన్యాయంగా అందించాలన్న అత్యుత్సాహం, కుప్పలు తెప్పలుగా పుట్టిన మీడియా ఛానెళ్ల మధ్య నెలకొన్న పోటీకి నిదర్శనంగా మిగిలింది ఇవాళ!
విషాదం ఏమిటంటే రెండు గంటల క్రితం కూకట్ పల్లి JNTU వద్ద బ్రేకు ఫెయిలైన లారీ పలు కార్లను ఢీ కొట్టి (ఇప్పటివరకూ)ఇద్దరి ప్రాణాలను అక్కడికక్కడే హరించి, మరి ఐదుగురి జీవితాలను ప్రాణాపాయ స్థితిలోకి విసిరి కొట్టిన హృదయ విదారక సంఘటన సానియా నిశ్చితార్థ హడావుడిలో కొట్టుకుపోయి చాలా సేపు కేవలం స్క్రోలింగ్ కి మాత్రమే పరిమితం కావడం! ఇప్పటికీ స్పష్టంగా అక్కడ ఏం జరిగిందో తెలీదు కానీ సానియా డ్రెస్సులు మాత్రం పింక్, బ్లూ, మరియు క్రీమ్ కలర్స్ లో ఉన్నాయని మాత్రం తాజా సమాచారం.
అదండీ సంగతి!
July 8, 2009
వాల్డెన్ లో శరత్-చక్రపాణి
ఆ మధ్య ఒక బ్లాగులో అబ్రకదబ్ర గారు "నా ఫ్రెండ్ ఒకడు వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయన్నాడు"అని చెప్తే ఆ బ్లాగు ఓనరు "వాల్డన్ లో తెలుగు పుస్తకాలు దొరుకుతాయని చెప్పిన బడుద్ధాయెవరబ్బా"అని అడిగేశారు. కానీ రెండు రోజుల క్రితం నాకు అక్కడ దొరికిన పుస్తకాలు చూశాక వాళ్లని బడుద్ధాయిలంటే ఒప్పుకోవాలనిపించలేదు.
నేను వెళ్ళింది మరేదో పుస్తకం కోసం! వెదుకుతూ, వెదుకుతూ డీవీడీల కోసం చివరి లైన్లోకెళ్ళేసరికి ఒక రాక్ నిండా ఉన్న తెలుగు పుస్తకాల్లో నాకు "దేవదాసు" అన్న పుస్తకం కనపడింది. ఈ దేవదాసెవరా అని తీసి చూస్తే అది అక్షరాలా ప్రముఖ దర్శకుడు, రచయిత స్వర్గీయ చక్రపాణి బెంగాలీ నుంచి తెలుగులోకి అనువదించిన పుస్తకం! పైగా అందులో దేవదాసుతో పాటు ఆయన అనువదించిన మరో ఐదు శరత్ బెంగాలీ నవలలు కూడా ఉన్నాయి. దేవదాసు పక్కనే మరో సంపుటం "పల్లీయులు"అనే పేరుతో! ఒక్కక్షణం నా కళ్ళను నేనే నమ్మలేక పోయాను. చటుక్కున రెండు లాగేసుకుని ఒక పక్కన నిల్చుని మొత్తం తిరగేశాను. ఎప్పుడో 70 లలో మాసపత్రిక యువలో చక్రపాణి గారు అనువదించి ప్రచురించిన శరత్ నవలలు అన్నీ!
ఎప్పటినుంచో...ఎన్నేళ్లనుంచో ఈ నవలలకోసం (చక్రపాణి గారి అనువాదాల కోసం) చూస్తున్నాను. వేరే అనువాదాలు చదివినా శరత్ సాహిత్యం లోని "ఎసెన్స్" ని అంతగా అనుభవించలేకపోయానని నా ఫీలింగ్! చక్రపాణి అనువదించిన దేవదాసు నవల చదివాక అసలే చంద్రముఖి అంటే ఇష్టపడే నాకు "చంద్రముఖి జీవితం ఇలా అయిపోయిందేమిటి" అనే బాధ మొదలైంది. సినిమాలో కంటే ఉదాత్తంగా ,హుందాగా చిత్రించారు చంద్రముఖిని.చంద్ర దేవదాసు కోసం పడే బాధ పాఠకులుగా మనం కూడా పడి తీరాలనిపించేంత బావుంటుంది ఆ స్వేచ్ఛానువాదం. మూలం లో ఉన్న ప్రతి ముక్కనూ తెలుగులోకి దింపాలన్న ఉత్సాహం తో కాకుండా ఉదాత్తమైన శరత పాత్రలనీ,రచనలనూ నేటివిటీ చెడకుండా తెలుగుపాఠకులకు అచ్చతెలుగు శైలితో అందించాలన్న కోరికతో , ఇష్టంగా అనువదించిన రచనలు ఇవి. అందుకే ఇన్నేళ్ళయినా ఆ పరిమళం ఇంకా చెక్కు చెదరలేదు.
నెలకు రెండు సార్లన్నా (హీనపక్షం ఒకసారన్నా) పుస్తకాల షాపింగ్ కి వెళ్ళే నాకు ఈ పుస్తకాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలీదు.( మీకెవరికైనా తెలుసో లేదో కానీ) ఎందుకంటే ఇంతకు ముందు చక్రపాణీయం అనే స్మృతి సంచిక వేసిన సందర్భంలో, చక్రపాణి శత జయంతి సంచిక తో పాటు ఈ నవలలు కూడా వేయాలనే ప్రయత్నం ఉందని నాలుగేళ్ల క్రితం వెలగా వెంకటప్పయ్య గారు ఒక ఉత్తరంలో అన్నారు. నా దగ్గర పాత యువలున్నాయేమో అని వాకబు చేశారు కూడా!
నా స్కూలు రోజుల్లో మా ఇంట్లో ఎప్పటివో పాత యువలుండేవి.వాటిలో చక్రపాణి అనువదించిన శరత్ బెంగాలీ నవలలు, కథలు ప్రచురించేవాళ్ళు. రాముడి బుద్ధిమంత తనం, పరిణీత,సుభద,బడదీదీ, (మనలో మనమాట, బడదీదీ అంటే బాటసారి అని అర్థం అనుకునే దాన్ని) .మొదలైన నవలలు అన్నీ ఆ పాత యువల్లోనే చదివాను. ఆ తర్వాత అవన్నీ పాత పుస్తకాలతోపాటు పోయాయి.
పరిణీత నుంచి
ఆ విలువైన సాహిత్యం కోసం ఆ తర్వాత ఎంతగానో ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు.చివరికి ఇన్నాళ్లకు అనుకోకుండా..అదీ వాల్డెన్ లో ..మొత్తం పన్నెండు నవలలూ దొరికాయంటే అదృష్టాన్ని నమ్మక ఏం చెయ్యాలంటారు? ఆ నవలలు ------
దేవదాసు
శ్రీవారు
నవ విధాన్
బడదీది
సుభద
కాశీనాథ్
పరిణీత
జ్ఞానద
సవిత
పల్లీయులు
బిందుగారబ్బాయి
రాముని బుద్ధిమంత తనం
శరత్ రచనలకు చక్రపాణి చేసిన అనువాదం ఎంత సహజంగా ఉంటుందంటే వాతావరణాన్ని,పేర్లను బట్టి తప్ప అవి బెంగాలీ నవలలని కనుక్కోవడం కష్టం!మరో పక్క బెంగాలీ సువాసనలు వెదజల్లుతూనే ఉంటాయి. అందుకే వాటికోసం అంతగా అన్వేషించాను.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు రాసిన శరచ్చంద్ర లోకం అనే సుదీర్ఘ వ్యాసం నుంచి కొన్ని భాగాలను ముందుమాటగా ప్రచురించడం ఈ సంపుటాలకు మరింత విలువను,శోభను చేకూర్చింది. శరత్ వ్యక్తిత్వాన్ని,సున్నితమైన భావాలతో ఉన్నతంగా ప్రవర్తించే స్త్రీ పాత్రల విశ్లేషణ, రచయితలకు ఆయన ఇచ్చిన సూచనలు,రచనల్లో వాతావరణం ఇవన్నీ ఆ వ్యాసంలో చదవగలం! చదివి తీరాలనిపించే వ్యాసం అది!
ఇంకో విశేషమేమిటంటే యువ లో ఈ నవలలను ప్రచురించినపుడు ప్రముఖ చిత్రకారులు స్వర్గీయ వడ్డాది పాపయ్య గారు గీసిన చిత్రాలను యధా తథంగా ఈ సంపుటాల్లో తిరిగి ప్రచురించడం.
ప్రచురించింది ఎవరంటే:-
1908లో జన్మించిన చక్రపాణి గారి శత జయంతి సందర్భంగా ఈ సంపుటాలను చక్రపాణి గారి కుటుంబసభ్యుల సౌజన్యంతో నవరత్న పబ్లికేషన్స్ విజయవాడ వారు ప్రచురించారు. పాత యువలను సేకరించింది శ్రీ వెలగా వెంకటప్పయ్య గారైతే తన వద్ద ఉన్న పాత యువలను తెచ్చిచ్చి సహకరించింది ఈపురు కు చెందిన జి.చంద్రశేఖర రావు గారు.
శరత్ సాహిత్యాభిమానులు, అందమైన అనువాదాలను ఇష్టపడే వారు తప్పక కొని దాచుకుని కొంచెం కొంచెంగా ఊరించుకుంటూ చదువుకోవలసిన అపురూప నవలలు ఈ రెండు సంపుటాల్లోనూ ఉన్నాయి. మొదటి పేజీల్లో చక్రపాణి జీవిత విశేషాలు, చివర్లో శరత్ బాబు ఇల్లు, ఆయన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలు కూడా!
ఆశ్చర్యపడవలసిన ఒకే విషయం ఈ పుస్తకాలు తెలుగు పుస్తకాలమ్మే షాపుల్లో కనపడకపోవడం. (కనీసం నాకు!)
ఎప్పటినుచో ఎన్నోరకాలుగా ప్రయత్నిస్తున్న పాత యువలు ఎక్కడా దొరక్కపోయినా,నేను కలలు కంటున్న శరత్-చక్రపాణి ల నవలలు ఒకేసారి ఒకే చోట దొరకడం--- చాలా గొప్పగా అనిపించిన క్షణం !
ఈ సంపుటాలు కావసిన వారు వాల్డెన్ లో కొనవచ్చు.అక్కడ దొరకలేదంటే నవరత్న పబ్లికేషన్స్, రహమాన్ వీధి, విజయవాడ వారిని సంప్రదించవచ్చు. నాలుగు వందల పేజీల ఒక్కో సంపుటం ధర రెండు వందల రూపాయలు!
June 17, 2009
క్విజ్ టైమూ, సిద్దార్థ బసూ, నేనూ!
వేసవి సెలవులు ముగుస్తుండగా మా కాలనీలో మాకు ఒక అద్భుతమైన అయిడియా వచ్చింది.
ఇక కొద్ది రోజుల్లో పిల్లలు ఎలాగూ స్కూళ్ళకు బయల్దేరతారు "Happy days are here again" అని పాడుకుంటూ! ఇప్పటికీ సమ్మర్ కాంపులతో బిజీగానే ఉన్నారు. కాసింత సరదాలూ, పాడూ ఏమీ లేకుండా అయిపోతున్నాయి వీళ్ళ జీవితాలు..అని కళాత్మకంగా ఒక క్విజ్ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నాం! (ఇల్లాంటి కళాత్మకాలోచనలు(సవర్ణ దీర్ఘ సంధి) నాకే వస్తాయని వేరే చెప్పాలిటండీ)!
ఈ ఆలోచన బయట పెట్టగానే పెద్దవాళ్లంతా
"మాకూ ఉండాల్సిందే క్విజ్! ఎప్పుడో కాలేజీ రోజుల్లో ఉండేవి క్విజ్ లు! అంతకు ముందు సిద్దార్ధ బసు రోజుల్లో! మేమూ పాల్గొంటాం సీనియర్లు, జూనియర్లు,సబ్ జూనియర్లు ఇలా కేటగిరీలు ఉండాల్సిందే" నన్నారు.
మాకూ సరదా వేసి ఒప్పేసుకున్నాం! పేపర్ సెట్టర్లకు, వారి కుటుంబ సభ్యులకు(పిల్లలకు మినహాయింపు) క్విజ్ లో పాల్గొనే అవకాశం లేదు. పదిమంది తెలివైన మేధావులు(ఇదేదో దుష్ట సమాసంలాగా ఉంది) కూచుని ప్రశ్నలు తయారు చేశాం. ఒక్కొక్కళ్ళూ సిద్ధార్థ బసు, అనితా బసుల్లాగా ఫీలవుతూ జాగ్రత్తగా ప్రశ్నావళి తీర్చి దిద్దాము!
ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఉండగా క్విజ్ టైమూ, ఇండియా క్విజ్ కార్యక్రమాలు దూరదర్శన్లో వచ్చేవి చూడండి. సిద్దార్థ బసు నేతృత్వంలో! రాత్రి తొమ్మిదయ్యేసరికి హైదరాబాదు దూరదర్శన్ కార్యక్రమాలకు అసలు సేల్సు ఉండేవా బుధవారం రోజు?(బుధవారమేనా ఇంతకీ) అయినా మనవాళ్ళు ఎనిమిదిన్నరకే "Over to Delhi" అనే పాత బోర్డు పెట్టేసి చాపలు చుట్టి దుకాణం సర్దేసేవాళ్ళుగా? పిల్లలూ, పెద్దలూ అందరూ క్విజ్ టైమ్ కోసమే వేయికళ్ళతో ఎదురు చూస్తుండేవాళ్ళు. సిద్దార్థ బసు, పక్కనే చక్కని చిరునవ్వుతో ,మార్కులు వేస్తూ అనితా బసు..! ఒక్కోసారి సిద్ధార్ధ బసు స్థానంలో ఇంగ్లీషు వార్తలు చదివే భాస్కర్ భట్టాచార్జి క్విజ్ మాస్టర్ గా వచ్చేవాడు. ఆయన కర్లింగ్ హెయిర్ భలే ఉండేది.పిల్లలు సరైన సమాధానం చెప్పగానే భాస్కర్ చాలా స్టైలుగా "కొఱ్ఱెక్ట్"అనేవాడు గుర్తుందా?, "కరెక్ట్"అనడానికి! నాకైతే ఏ క్విజ్ ప్రోగ్రాం చూసినా క్విజ్ మాస్టర్ భాస్కర్ భట్టాచార్జి అంత సొగసుగా "కరెక్ట్"అనేవాళ్ళు ఆ తర్వాత ఇంతవరకూ కనపళ్ళా!
ఆ క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలు ఎక్కడినుంచి వచ్చేవాళ్ళో కానీ మెరికల్లాగా ఎంతటి ప్రశ్నలకూ ఇట్టే జవాబులు చెప్పేవాళ్ళు కాదూ! (అప్పుడూ సరిగ్గా ఇదే అనుకునేవాళ్లం)క్విజ్ మాస్టర్ అడిగే ప్రశ్నల్ని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవడం, మర్నాడు కలిసిన స్నేహితులతో కలిసి వాటి జవాబులు అందరూ ఒకటే రాశారా లేదా అని సరి చూసుకోడం, ఒక ఫైలు తయారు చేయడం ఇదో పెద్ద అసైన్మంట్!
మా వూర్లో అందరూ చదువు,కళల పట్ల బోలెడంత ప్రేమ, ఆదరణ కలవారవటం చేత వివిధ క్లబ్బులు, కళా సాంస్కృతిక సంఘాల వాళ్ళు ఎప్పుడూ వ్యాసరచన,వక్తృత్వం,క్విజ్ పోటీలు పెట్టి యధాశక్తి మాకు బహుమతులిచ్చేస్తూ ఉండేవాళ్ళు.
ఒకసారి పది టీముల్తో హోరాహోరీ తలపడి చివరికి మిగిలిన రెండు టీముల్లో ఒకటి మా స్కూలు! ఒక్క ప్రశ్నా అవతలి టీముకు పోకుండా జాగ్రత్తగా జవాబులు చెప్పి ఇక్కడ కూడా సమ ఉజ్జీలుగా నిలిచాయి రెండు టీములూ! మరి కాసేపట్లో బహుమతి ప్రదానం కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా వచ్చి ఉన్నారు. విజయాన్ని నిర్ణయించే చివరి రౌండ్ ప్రశ్న ఆయన్నే అడగమంటే ఆయన చాలా స్పాంటేనియస్ గా అవతలి టీము వైపు చూస్తూ
"నలుగురు పద్మశ్రీలు ఉన్న తెలుగు సినిమా పేరు చెప్పండి"అనేసి కూచున్నారు.
వాళ్ళు ఇటువంటి ప్రశ్న ఎదురు చూడకపోవడంతో పద్మశ్రీ అవార్డులు ఎవరెవరికి వచ్చాయో లెక్కెట్టే లోపు మాకు టైము కలిసి వచ్చింది. వాళ్ళు చెప్పలేకపోయే సరికి నేను, చిత్ర, రాజకుమారి కూడబలుక్కుని "మాయా బజార్"అని చెప్పేశాం!
(నిజానికి మాకూ కంగారు వేసింది కానీ అంతమంది హేమా హేమీలు ఉన్న సినిమాలో నలుగురు పద్మశ్రీలు ఉండకపోతారా అని చీకట్లో బాణం వేశామంతే! ).
ఆయన చల్లగా "తప్పు" అన్నారు.
"తెనాలి రామకృష్ణ రైటాన్సరు! రామారావు, నాగేశ్వర్రావు,భానుమతి, నాగయ్య..నలుగురు పద్మశ్రీలు"అని జవాబు కూడా చెప్పారు.
మళ్ళీ "టై" అని నీరసం వచ్చింది.
కానీ మాకు వెంటనే ఒక గొప్ప లాజిక్కు దొరికి "మేం ఒప్పుకోం! మీరు నలుగురు పద్మశ్రీలు "ఉన్న" తెలుగు సినిమా అన్నారు కానీ "నటించిన"అన్లేదు.అందుకని మేము రామారావు, నాగేశ్వర్రావు, రేలంగి,ఘంటసాల"అని లెక్కేశాం! ఘంటసాల సినిమాలో నటించకపోతేనేం, ఉన్నారా లేదా"అని వాదించాం ఉత్సాహంగా!
"నిజమే కదా" అన్నట్లు చూశారు నిర్వాహకులు ప్రైజు మాకే ఇచ్చేయలనే ఉత్సాహంతో! ప్రొఫెసర్ గారు మా లాజిక్ మెచ్చుకుని (మనసులో మాత్రం "వీళ్ళ మొహాలు ఈడ్చా! నా కొశ్చెన్ కే ఎదురా?" అనుకుంటూ)బహుమతి మాకు ప్రకటించారు. అలాంటి క్విజ్ లు ఎన్నో, లెక్కేలేదు. మా స్కూలు హెచ్చెమ్ రూములో మేం సంపాదించిన షీల్డులు లెక్కెట్టాలంటే ఒక పూట పడుతుంది.
మా కాలనీ క్విజ్ లో పిల్లల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మరీ పేదగా అంటే పూర్ గా ఉందని చెప్పక తప్పదు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలంటే
"జపాన్ దేశం కరెన్సీ ఏది"
"ఈ రోజున డాలర్ కెన్ని రూకలు?గుప్పెడేనా?"
"
NDTV profit ఛానెల్లో పొద్దున్న ఎనిమిదింటికి వచ్చే అనలిస్ట్ ఎవరు?"
అని అడుగుతామేమో అనుకుని బాగా ప్రిపేర్ అయి వచ్చారు. కానీ పేపర్ సెట్టర్ ఎవరు మరి?అందుకే
"మీ దగ్గర్లోని పోస్టాఫీసు ఎక్కడుంది?"
"వోటర్ ఐడీ కార్డులకు ఎక్కడ అప్లయి చేయాలి"
"కరెంట్ బిల్లు కరెంటాఫీసులో కట్టాలా? ఈ-సేవా లోనా"
"సమీపంలో ఈసేవా కేంద్రం ఎక్కడుంది?"
"ఇక్కడినుంచి సికిందరాబాదు వెళ్ళు సిటీబస్ నంబర్ ఎంత"
"దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రి చిరునామా చెప్పుము"
"మోర్ సూపర్ మార్కెట్లో సోనా మసూరి రైస్ కిలో ఎంతకు దొరుకును?"
"మాదాపూర్ ఆంధ్రా బాంక్ శాఖ కొండాపూర్ లో ఎందుకుందో తెలుసా?(నల్లకుంట పోలీస్ స్టేషన్ అడిక్ మెట్ లో ఉన్నట్లు)
"రోజుకు టాంకర్ రు. 400 చొప్పున నెలకు 78 టాంకర్లు నీళ్ళు తెప్పిస్తే ఒక్కో ఫ్లాట్ కి ఎంత బిల్లు పడుతుంది?"
"మొబైల్ ఫోన్ చూడకుండా, మీరు గుర్తుంచుకున్న ఒక అయిదు ఫోన్ నంబర్లు చెప్పండి"
వంటి ఎదురు చూడని ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, కనిష్టమార్కులు తెచ్చుకుని దారుణంగా ఫెయిలై పూడ్చారు.
ప్రేక్షకుల్లోని వాచ్ మన్ లు మాత్రం ఈ ప్రశ్నలకు కు మంచి నీళ్ళు తాగినంత ఈజీగా జవాబులు చెప్పేసి ప్రోత్సాహక బహుమతులు గెల్చుకుని ఇకపై తమను కూడా టీముల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రెండో మాట లేకుండా వాళ్ల డిమాండ్ ని అంగీకరించేశాం!
ఇకనుంచి వీలున్నపుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోవాలని అనుకుంటూ ఆ సరదా నుంచి తేరుకోకముందే కొంపలు మునిగినట్లు మొన్న సోమవారం నుంచీ స్కూళ్ళు మొదలు! వీపున బస్తాలతో హమాలీల్లాగా పిల్లలు తయారు!
Subscribe to:
Posts (Atom)



