July 27, 2008

అల్లరా? అంత అదృష్టం కూడానా!

నా చిన్నప్పుడు స్కూళ్లలో (కనీసం నేను చదివిన స్కూళ్ళలో) ఒక రూలుండేది. "బాగా చదివే పిల్లలు అల్లరి చేయరాదు! చదువు రాని మొద్దులే అల్లరిలో ఫస్టుంటారు" అని!
అందువల్ల ఏడో క్లాసు వరకు చదివిన స్కూల్లో అల్లరికి అవకాశం దొరక్క ఊరుకున్నాను. పైగా ఆ స్కూలు మా ఇంటికి దగ్గరే! అందునా మా నానగారు మా స్కూలు ముందు నించే ఆఫీసుకు వెళ్ళేవారు. ఏమైనా అల్లరి చేసామంటే, ప్రభావతీ టాన్యా టీచర్ మా నాన గార్ని దార్లోనే ఆపి నివేదిక సమర్పించేసేది.
దానితో మా చిన్నన్నయ్యకి చేంతాడుతో వివాహం జరిగేది మంత్రోచ్చారణ  సహితంగా! వాతలు తేలేవి వీపుమీద! అవి చూసాక కూడా అల్లరి చేయడానికి మనకి గుండె ఇంకా మిగిలుంటేనా?

"నాన గారండోయ్, ఇంకెప్పుడూ అల్లా చెయ్యనండోయ్, నానగారండోయ్" అని వాడు బావి గట్టు చుట్టు పరిగెత్తడం ఇప్పుడు గుర్తొస్తే నాకు నవ్వాగదు.

హైస్కూల్లో బాగా అల్లరి చేయొచ్చని సర్ది చెప్పుకుని అల్లా కాలం గడిపేసాను.

అమ్మాయిల హై స్కూల్లో నన్ను చేర్చడానికి తీసుకెళ్ళినపుడు మా నాన్నగారిని చూస్తూనే హెడ్ మిస్ట్రెస్ వసుంధరా దేవి మేడం "రండి రావు గారూ, మీ మూడో అమ్మాయా? ఈవిడ కూడా 'పాడు ' పిల్లేనా " అని గౌరవంగా ఆహ్వానించింది. నాన్నగారు సంతోషించి.."అవునండీ, ఈ పాప సంగీతం కూడా ఫలానా వారి దగ్గర నేర్చుకుంటోంది, ఇష్టం వచ్చినట్టు వాడేసుకోండి దీని టాలెంటుని " అని భరోసా ఇచ్చేసారు.

మేడం గారు అదే స్కూల్లో చదివిన మా అక్కలిద్దర్నీ పొగడ్డం మొదలు పెట్టారు.
"ఏమి వినయం, ఎంత తెలివి, మర్యాదా..మీ ఇద్దరక్కలూ ఎంత మంచి పేరు సంపాదించారో తెలుసా? ఈ స్కూలు కోసం ఎన్నెన్ని బహుమతులు సంపాదించారో తెలుసా...? ఎంత నెమ్మదైన పిల్లలో తెలుసా?...తెలుసా తెలుసా తెలుసా..." ఇదే సరిపోయింది ఒక గంట.

"మీ మొహాలు ఈడ్చా, మిమ్మల్ని తగలెయ్యా,మీ దుంపలు తెగా " అని మా అక్కల్ని మనసులోనే శతమానం పెట్టాను.

"నానగారూ, ఈ స్కూలొద్దండీ" అనడానికి ఎంత ప్రిపేరైనా నోట్లోంచి మాట బైటికి రానిదే! అలా ఆ స్కూలుకి షీల్డులు, కప్పులూ సంపాదించే ఆస్థాన గాయనిగా సెటిలవ్వాల్సి వచ్చింది. అల్లరి చేయడానికి అవకాశం సృష్టించుకోలేక ఊరుకున్నాను.

ఈ లోపుగా NCC లో చేరి తురాయి టోపీ పెట్టుకుని కవాతు చేయడం, స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరి ముడులు వేయడం నేర్చుకున్నాను. దానితో "మంచి అమ్మాయి"గా పేరొచ్చింది. పాడు పేరు! అల్లరి చేస్తూ తిరిగే పిల్లల్ని చూస్తూ మనసులో ఎంత కుళ్ళిపోయానో, కుమిలిపోయానో ఎవరికి తెలుసు?

పదో క్లాసులో "ఇంకెలాగూ వెళ్ళీపోతాం గదా, ఈ ఏడాది చించెయ్యాలి, బాగా గోల గోల చేసెయ్యాలి"అనుకుంటుండగా ఆ మార్గాన్ని శాశ్వతంగా మూసేస్తూ నన్ను SPL చేసేసారు.జెండా ఎగరేయడానికొచ్చిన మునిసిపల్ కమిషనర్ కీ, చైర్మన్ కీ సెల్యూట్లు చేయడమే నా పనైపోయింది.

కట్ చేస్తే
కాలేజీ....!

ఇక్కడ నా ఇంటరెస్ట్ ప్రకారమే నేను ఒక విద్యార్థి సంఘంలో చేరాను. సరి! బాధ్యతాయుతమైన విద్యార్థి సంఘ మెంబరుగా ఉన్నవాళ్ళు అల్లరి చేసేవాళ్ల పని పట్టాలే గానీ స్వయంగా వారల్లరి చేయలేరు అనే చేదు నిజం తెలిసే సరికి ఆలస్యమైపోయింది.పైగా కాలేజీలో నన్ను ఎవరూ కనీసం కామెంట్లు కూడా చేయకుండా మా అన్నయ్య ప్రతినిధులు మారు వేషాల్లో తిరుగుతుండేవాళ్ళు.

ఈ రెండు కారణాలవల్లనే అయిదేళ్లలో ఒక్క ప్రేమలేఖ కూడా అందుకోలేకపోయానని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాను.

డిగ్రీ ఫైనలియర్ లోకొచ్చాక,మా స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళే "ఈ సారి freshers Day కి కొంచెం హడావిడి చేద్దాం!కొత్తవాళ్లని కొంచెం అల్లరి పెడదాం!సరదాగా" అన్నారు.

ఉత్సాహం పొంగుకొచ్చి "వాకే" అనేసాను.
"ఎలా చేయాలో, ఏం చేయాలో ఇక్కడ మాట్లాడుకోవద్దు, గోడలకు చెవులుంటాయి" అన్నారు.
"మా ఇంటికెళదాం! మా అన్నయ్య కూడా ఊళ్లో లేడు" అన్నాను ఊరుకోకుండా!

మా ఇంటికెళ్ళి కొబ్బరి చెట్టుకింద కుర్చీలేసుకుని అందరం చర్చిస్తుండగా ఏదో పరిచితమైన శబ్దం విని ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగానే అన్నయ్య స్కూటర్ స్టాండేసి లోపలికొచ్చాడు.

నా పక్కన ఉన్న ఐదుగురూ స్ప్రింగుల్లాగా లేచి నిలబడి "నమస్తే అన్నయ్యా" అని ప్రమాదం లేని వరస కలిపారు ఎందుకైనా మంచిదని.

వాడు చిర్నవ్వి లోపలికెళ్లాడు.

"అమ్మలూ" అని లోపలినుంచి పిలుపు రాకముందే నేనే వెళ్లాను లేచి.

"ఎవరే వాళ్ళు, జులాయి వెధవల్లా ఉన్నారు?" అన్నాడు.

నిజానికి అన్నయ్యంటే వాళ్లకి హీరో వర్షిప్పు!

అందుకే వాళ్ల గుణగణాల్ని వర్ణిద్దామని షణ్ముఖి ఆంజనేయరాజు కి మనసులో నమస్కరించి "పతితులు కారు, నీ యెడల భక్తులూ" అని రాయబారం పద్యం అందుకోబోయాను గానీ శ్రుతి చాలక విరమించాను.
కానీ దాన్నే గద్య రూపంలో చెప్పాను.

"అన్నయ్యా, వాళ్ళు చెడ్డవాళ్ళేం కాదు, నువ్వంటే భలే గౌరవం " (పతితులు కారు, నీ యెడల భక్తులు)
"బాగా చదువుతారు కూడా!(శుంఠలు కారు, విద్యలన్ చతురులు)
"పాపం,మంచివాళ్ళు(మంచివారు...)

తర్వాత లైను నాకు గుర్తు లేదు.

"మొన్న మంగతాయారు ని ఈవ్ టీజింగ్ చేసిన సుబ్బారాయుడు గ్రూపుని చావగొట్టింది వీళ్ళే" (రణ శూరులు..పాండవులు)

వాడు ఈ గద్యాన్నంతా ఎగర గొట్టి "నేను స్నానం చేసి వచ్చేలోపుగా మంచిగా వాళ్లను పంపించెయ్" అని నిష్క్రమించాడు.
ఫ్రెషెర్స్ డే మామూలుగానే జరిగింది అల్లరీ పాడూ లేకుండా.
* * *

ఆ తర్వాత ఫిబ్రవరిలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున స్నేహితులతో కలసి కోటప్పకొండకి వెళ్ళాం! పండుగ రోజైతే చుట్టు పక్కల పల్లెటూర్లనుంచి ప్రభలూ, ట్రాక్టర్లు కట్టుకుని జనం ఎక్కువగా వస్తారని మాకు ఏకాదశి రోజే పర్మిషన్!

మాలో మా జూనియర్లు కూడా ఉన్నారు.
సగం మెట్లెక్కాక(అప్పుడు ఘాట్ రోడ్డు లేదు) ఏదో బయటి ఊరునించి వచ్చిన ఒక ఏడుగురు అబ్బాయిల కాందిశీకుల బృందం కనపడింది. దాంతో మా జూనియర్ పిల్లకాయలు వాళ్లని ఏడిపించడం మొదలుపెట్టారు.
మేము, అనగా సీనియర్లం వారిద్దామనుకుని కూడా "పోన్లెద్దూ, పిల్లలు సరదా పడుతున్నారు " అనే ఫాల్స్ వంకతో, వాళ్లని కళ్ళతోనే ప్రోత్సహించాము.

కాందిశీకులు కాసేపు భరించి, సహనం చచ్చి ,ఎదురు తిరిగి మాటకు మాటా బదులివ్వడం మొదలు పెట్టారు.

ఇంతలో ఒక మీసాల పల్లెటూరి పెద్దాయన మా మధ్యలోకొచ్చి..

"ఏందబ్బాయ్ మీరు, సదూకోలా? ఆడకూతుళ్ళు కనపడితే సాలంట్రా? ఇట్టయితే ఎట్ట? ఇదాకట్నించీ సూత్తన్నా,వొరె వొరె , ఏమి సతాయిత్తన్నారూ? మిమ్మల్ని పొయిలో బెట్టా!ఇంగా ఈణ్ణే ఉన్నారంటే చెమడాలెక్కదీస్తా" అని పాపం వాళ్లని తిట్టి తరిమేసాడు వాళ్ళు చెప్పేది వినిపించుకోకుండా!

"ఏందమ్మాయ్ మీరు గూడా? పెద్దోళ్ళేరి? కిందనే ఉండారా ? లేగదూడల్లాగా పరిగెత్తుకొస్తే ఇగో, ఇట్టనే జరిగేది? ఈడనే కూకోని, అమ్మోళ్ళు వొచ్చేదాకా ఆగి,కలిసి ఎక్కండి. ఒంటిగా ఒద్దు తల్లా! దొంగెదవలుంటారు, సీతాకోకచిలకల్లాగా చల్లగా నవ్వుతున్నారే,నవ్వుతానే ఉండాలమ్మా మీరు?" అనేసి గబగబా కొండెక్కడానికి ముందుకెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో అల్లరి బంద్!

ఇక ఇన్నేళ్ళు గడిచాక ఇప్పుడు అల్లరి ఏం చేస్తాం? మా పాపతో పాటు ఇంటిదగ్గర పిల్లల్ని పోగేసి చల్లని సాయంత్రాలు ఇసుక కుప్పలమీద పిచ్చుక గూళ్ళు కడుతూ,బంక మట్టి తో బొమ్మలు చేస్తూ...వాళ్ల కేరింతల్లో పాలు పంచుకోవడమే ఇప్పుడు నేను చేసే అల్లరి!

(ఇవాళ పని మీద గుంటూరు వచ్చి, ఇక్కడన్నా నెట్టు స్పీడుగా ఉంటుందేమో ననే ఆశతో శంకర్ విలాస్ రోడ్లో ఓవర్ బ్రిడ్జి (దీన్ని ఫ్లై ఓవర్ అనొచ్చని నాకు హైదరాబాదు వచ్చాక తెల్సింది)దాటాక ఉన్న ఒక ఇంటర్నెట్ కెఫేకి వచ్చాను. చూస్తే కూడలిలో నేను చదవాల్సినవి కోటి టపాలున్నాయి! హారి భగవంతుడా...ఎంతటి లీలలయ్యా నీవి!
ఇది చాలదన్నట్టు జ్యోతిగారి బ్లాగులో ఈ పక్షం విషయం అంటూ "మీరెప్పుడైనా అల్లరి చేసారా"(మీ మొహానికి అదొక్కటే తక్కువ) అనే ఇన్ విజిబుల్ టాగుతో కనపడింది.

సరే, రేపటి వరకూ గుంటూర్లోనే గా ఉంటాను, కాసేపు టైము తీసుకుని రాసేద్దాం, మళ్ళి హైదరాబాదు వెళ్ళేటపటికి ఎప్పుడవుతుందో అని ఇన్ స్టంట్ గా రాసేసా ఈ టపా! తప్పులు మీరే లెక్కెట్టాలి!