పొద్దున్నే ఈనాడు పేపరు చూడకపోతే నాకు కాఫీ కూడా తాగాలనిపించదు. ఎంత చెత్తగా వార్తలు రాసినా సరే! దాని తర్వాత Economic Times, Times of India, ఇవి కాకుండా ఆదివారం ఎడిషన్ కోసం ఆదివారం ఆంధ్ర జ్యోతి, సాహిత్యం పేజీ కోసం సోమ వారం సాక్షి..ఇలా నెల తిరిగే సరికి మా ఇంట్లో బస్తాడు పేపర్లు తయారవుతాయి. ఏం చెయ్యాలి వాటిని? "ఏం చెయ్యడమేం? అమ్మి పారెయ్యొచ్చుగా?" అంటారా!
నిజమే, కానీ చెప్పిన టైముకు డ్రెస్ కుట్టి డెలివరీ ఇచ్చే టైలర్ ని కానీ, పాత పేపర్లు సరిగా తూచే పేపర్ వాడిని కానీ మీరెక్కడైనా చూశారా? నేనైతే ఇంతవరకూ చూళ్ళేదు. కనీసం 30 కిలోల పేపర్లను కళ్లెదురు గానే పేపర్ల వాడు 10 కిలోలు లేక అంతకంటే తక్కువగా చూపించిన సందర్భాలు కోకొల్లలు.
దీన్ని ఒప్పుకోలేక నేను పాత పేపర్లను నెల నెలా మా పనమ్మాయి లక్ష్మికి ఇచ్చేయడం మొదలెట్టాను.'ఎన్ని కిలోల పేపర్లైనా ఎలాగూ అతడు తక్కువగానే తూస్తాడు. ఆ వచ్చే డబ్బులు ఆ అమ్మాయి తీసుకుంటుంది, ఇలాగైనా డుమ్మాలు కొట్టకుండా ఉంటుం'దనే ఆశతో!ఆ పిల్ల లైట్ తీసుకుందనుకోండి.
కొద్ది రోజులు ఇలా గడిచాక మా వాచ్ మన్ కి ఈ విషయం తెలిసింది."ప్రతి నెలా లక్ష్మికేనా మేడమ్, ఈ నెల నాకివ్వండి" అని అడిగాడు. సరే తీసుకోమని ఇచ్చేశాను.
ఇంకేముంది? ఆ రోజు సాయంత్రం కింద పెద్ద గొడవ వినపడి ఏమిటా అని కారిడార్ లోకెళ్ళి తొంగిచూస్తే లక్ష్మి, వాచ్ మన్ దెబ్బలాడుకుంటున్నారు.పేపర్ల గురించే అని అర్థమై సర్ది చెప్దామని కిందకెళితే
"ఇచ్చే వాళ్లకు బుద్ధి లేకపోతే తీసుకునే వాళ్లకుండాలి" అని లక్ష్మి నన్ను,వాచ్ మన్ ని కలేసి తిట్టింది.
వాచ్ మన్ కూడా తగ్గకుండా "మరదే, ఇచ్చే వాళ్లకు లేని నొప్పి నీకేంటి మధ్యలో"
అని నన్ను లక్ష్మి ని కలిపి చీవాట్లేశాడు.
అదండీ సంగతి!రెండు వైపులా నాకే తిట్లు, ఉత్త పుణ్యానికి పేపర్లు ఇచ్చి మరీ!
ఈ నేపధ్యంలో నాల్రోజుల క్రితం ఒక చిన్న బుక్ లెట్ చూశాను. అది Hyderabad Council of Human Welfare కి సంబంధించింది. ఇదొక స్వచ్ఛంద సంస్థ!వీధి బాలల పునరావాసానికి అవిరళ కృషి చేస్తున్న సంస్థ! వీధి బాలలని, ఇతర దుర్భర పరిస్థితుల్లో ఉన్న పిల్లని వీళ్ళు తమ కార్య కర్తల ద్వారా గుర్తించి వారిని చేరదీస్తారు. ఒక తాత్కాలిక హోమ్‌లో వారికి నీడనిచ్చి తమ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే దిశగా వారికి చదువు సంధ్యలను కల్పిస్తారు. కౌన్సిలింగ్ ఇస్తారు. మానసిక వికాసానికి తగిన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తగిన వృత్తిని చేపట్టి, సమాజంలో గౌరవనీయ జీవితాన్ని గడిపే విధంగా వారికోసం పని చేస్తుందీ సంస్థ!పట్టణాల్లో ఉండే మురికివాడల్లోని స్త్రీలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవన స్థితిగతులను మెరుగుపరచే దిశగా కూడా HCHW పని చేస్తోంది.
వీరికీ పాత పేపర్లకీ సంబంధం ఏమిటనేగా ప్రశ్న!
ఈ సంస్థ ఇప్పటివరకూ శ్రేయోభిలాషులు, సహృదయుల విరాళాలతో నడుస్తోంది. అందువల్ల ఈ సంస్థ ఒక వినూత్న పద్ధతిలో విరాళాలు సేకరించాలని తలపెట్టింది. పాత వస్తువులను సేకరించడం.మన ఇంట్లో పోగుపడిన పాత వార్తాపత్రికలు, మాగజైన్లు,ఆటవస్తువులు, ప్లాస్టిక్ బాటిల్స్ మొదలైన వస్తువులను వీళ్ళు మన ఇంటికి వచ్చి సేకరిస్తారు. వాటిని రీ సైక్లింగ్ యూనిట్స్ కి పంపి తద్వారా వచ్చే డబ్బుని పిల్లల సంక్షేమానికి వినియోగిస్తారు. హైదరాబాదు, సికింద్రాబాదు ప్రాంతాలకు మాత్రమే ఇది పరిమితం!
దీనికోసం ఈ సంస్థ ఆటో డ్రైవర్ని పంపిస్తుంది. అతడు మన ముందే మన ఇంట్లోని పాత పేపర్లను తూకం వేసి రిజిస్టర్ లో నమోదు చేసి మన సంతకం తీసుకుని (దుర్వినియోగం కావని మనకు నమ్మకం కలిగేందుకు) మరీ వాటిని తీసుకెడతాడు. నెల నెలా లేదా రెండు నెలలకోసారి....ఇలా ఇవ్వవచ్చు!ఎప్పుడైనా వారి రికార్డులను మనం కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ పనంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.
ఇలాంటి సంస్థలకు సాయం చేయాలని మనసున్నా, ఒకోసారి చేతిలో డబ్బు ఉండకపోవచ్చు! ఇంట్లోని పాత వస్తువులను వారికి డొనేట్ చేయడం ద్వారా కూడా వారికి సాయపడవచ్చని తెలిశాక అనేకమంది ముందుకువచ్చి ఈ సంస్థను ఆదరిస్తున్నారు, తద్వారా వీధి బాలల ను కూడా!
ఇటువంటి పనిలో పాలుపంచుకోవడం,పనికి రాని పాత వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయడం ...ఒక చిన్న కన్ సర్న్!
ఈ నెల నుంచి మా ఇంట్లో పాత న్యూస్ పేపర్లు,మాగజైన్లు,ఆటవస్తువులు,ఇంకా ఇతరాలు వీళ్లకే! మీరూ చేయికలపాలనుకుంటే వారి వెబ్ సైటు చూడండి.
http://www.hchw.org/
వారి ఫోన్ నంబర్లు 040-23526554 ,040-65505827
ఇలా చేశాక, ఒక చిన్న మంచి పని చేశామనే ఫీలింగ్ మీకు కలగకపోతే చూడండి మరి!
అప్పుడెప్పుడో ఎవరో స్నేహితులు నాకు "what to expect when you are expecting" అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు! ఆ పుస్తకాన్ని నేను ఆ తర్వాత అనేకమందికి ఇచ్చాను ఉపయోగపడుతుందని. కొన్నేళ్ళుగా అది నా దగ్గర కనపడటం లేదని గ్రహించి చివరిసారిగా ఎవరికిచ్చానా అని చాలా సేపు ఆలోచించగా ఒక ఫ్రెండ్ భార్యకు ఇచ్చినట్లు గుర్తొచ్చింది. నాలుగేళ్ల క్రితం ఆమెకి అవసరమైనపుడు !
ఫోన్ చేసి అడిగితే "అవును నా దగ్గరే ఉంది" అని ఒప్పుకుంది.
"మరి తిరిగివ్వాలని తెలీదా?" అనడిగితే "sorry! any way, I'm thinking to plan my second baby. let it be with me. I will give you later on, may be next year.ok?" అంది. చివరికెలాగో చీవాట్లు పెట్టి పుస్తకం వెనక్కి తెప్పించాను మరో ఫ్రెండ్ కోసం!
ఇలాంటి వాళ్ళు నా సర్కిల్లో బోలెడు మంది ఉన్నారు. పుస్తకాలు పట్టుకెళ్లడం, తిరిగి ఇవ్వకపోవడం,కవర్ పేజీలు నలిపేసో, చించేసో ఇవ్వడం, కుట్లు వూడగొట్టి ఇవ్వడం, చదువుతున్న పేజీని గుర్తుగా మడతలు పెట్టడం, పేజీ తిప్పేచోట చివరల్ని మెలికలుగా మడిచెయ్యడం, పుస్తకాన్ని మడిచి చదవడం...ఇలా చేసి పుస్తకాన్ని సగం చంపేసి ఇవ్వడం..ఇదీ వీళ్లపని. కొంతమంది అయితే అసలు పుస్తకం తీసుకున్న సంగతే మర్చిపోయి, నేను అడిగినపుడు "ఓ, అది మీదా? (నాది కాక? పుస్తకం కొన్న వెంటనే పేరు రాసేస్తాను నేను) ఎవరిదా అని ఆలోచిస్తున్నాను" అని అయిష్టంగా ఇచ్చారు.కొందరైతే అదీ లేదు. ఎంచక్కా వాళ్ల లైబ్రరీలో దాచుకున్నారు.
నేను స్కూలు చదువులో ఉన్నపుడు మా మావయ్య(అమ్మ వాళ్ల అన్నయ్య) వాళ్ళిల్లు మా ఇంటిపక్కనే ఉండేది. మధ్యలో ప్రహరీ గోడ కూడా ఉండేది కాదు. మా స్కూల్లో బహుమతులుగా పుస్తకాలిచ్చే మంచి అలవాటుండేది. బహుమతి రాగానే పరుగెత్తుకెళ్ళి మావయ్యకు చూపించడం నాకలవాటు.
"అదీ! అమ్మలు (నేను) అంటే అల్లా ఉండాలి. ఏదీ ఆ పుస్తకం ఇలా ఇవ్వు, నేను చదివి నీకిస్తాను" అని తీసుకునేవాడు మావయ్య. నవలలూ, కావ్యాలూ..ఇలాంటివే కాక డిక్షనరీలు, జీవిత చరిత్రలూ కూడా ఇలాగే తీసుకునేవాడు.
కొన్నాళ్ళయ్యాక అడిగితే "ఎక్కడే అమ్మలూ, టైము దొరకట్లేదు(ఆయన ఆర్డీవో గా పని చేసేవాడు)ఇంకా అవలేదు. అవగానే ఇస్తాను" అనేవాడు. చదువులో పడి మర్చిపోయేదాన్ని నేను కూడా!కప్పులూ, షీల్డులూ తెస్తే అంతగా సంతోషించేవాడు కాదు మావయ్య.
నేను డిగ్రీ ఫస్టియర్ లో ఉండగా మావయ్య పోయాడు. హైదరాబాదులో ఉన్న వాళ్ళబ్బాయి, ఇల్లు అద్దెకిచ్చేసి వెళ్లాలని వచ్చి, "అమ్మలూ, కొంచెం ఇల్లు సర్దడానికి సాయం చేద్దువు రా" అని పిలిస్తే నేనూ, చెల్లాయీ వెళ్లాము.మావయ్య పుస్తకాల బీరువా సర్దుతుంటే మూర్ఛ వచ్చింది నాకు.
ఒక పుస్తకం మీద "అమ్మలు జ్ఞాపకంగా" అని రాసి ఉంది. ఆ తర్వాత తీస్తున్న కొద్దీ వస్తున్నాయి అమ్మలు జ్ఞాపకాలు.
మొత్తం పదిహేడు!అచ్చంగా అన్నీ నావే! ఇంకా .......
"జానకి జ్ఞాపకంగా" -రెండు
"సుబ్బారావు జ్ఞాపకంగా" -మూడు
"శాస్త్రి జ్ఞాపకంగా" -రెండు
"కృష్ణారెడ్డి జ్ఞాపకంగా"-నాలుగు
"శాఖా గ్రంథాలయం జ్ఞాపకంగా" - పన్నెండు
ఇలా రకరకాల మనుషుల, సంస్థల జ్ఞాపకాలుగా వారి నుంచి నొక్కేసిన పుస్తకాలన్నీ బయటపడ్డాయి.
బీరువా తలుపు లోపల వైపు 'గ్రంథ చౌర్యం తప్పు కాదు." అని రాసి ఉన్న పోస్టరు కనపడింది.
"ఒరేయ్ ప్రసాదూ, మీ నాన్న చూడరా" అని నేను ఆక్రోశిస్తే,వాడు విరగబడి నవ్వుతూ
"నాకెప్పుడో తెలుసు మా నాన్న సంగతి! అందులో నీకేం పుస్తకాలు కావాలో తీసుకో" అన్నాడు.
నా పుస్తకాల వరకూ నేను తీసుకున్నాను. మిగిలిన పుస్తకాలు తీసుకుంటే మావయ్య ఆత్మ పైకి పోకుండా నా చుట్టూనే తిరుగుతుందేమో అని భయం వేసింది.
ఆ (నా)పుస్తకాల్లో "చాసో కథలు" అనే అద్భుతమైన పుస్తకం ఉంది. దాంట్లో మావయ్య అండర్ లైన్లు చేయని కథ లేదు. సొంతగా వ్యాఖ్యలు రాయని పేజీ లేదు.పైగా అన్నీ రెడ్ ఇంకు, గ్రీన్ ఇంకు పెన్నులతో! ఆఫీసులో కూడా చదివేవాడేమో! విసుగేసి కొత్త కాపీ కొనుక్కుని పాత కాపీకి అట్టవేసి "మావయ్య జ్ఞాపకంగా" అని రాసి పెట్టుకున్నాను.
ఆ తర్వాత చాలా రోజులు నాకు తెల్లవారుజామున ఒక కల వస్తూ ఉండేది. నేను మావయ్యకు ప్రైవేటుచెప్పేస్తున్నట్లూ, మావయ్య నా ముందు తల దించుకుని చేతులు కట్టుకుని నిలబడ్డట్లూ! ఈ ఒక్క కోరికా మాత్రం తీరకుండా ఉండిపోయింది!, (నేను వెళ్ళి మావయ్యను కలిస్తే తప్ప తీరేది కాదు!).అలా, చచ్చి....(నా చేతిలో) బతికిపోయాడు మావయ్య!
అప్పటినుంచీ అమ్మ ఎప్పుడైనా "మా పుట్టిల్లు..."అని ఏదైనా మాట్లాడబోతే
"ఆపవోయ్! మీ పుట్టిల్లు గొప్ప మీ అన్న అమ్మలు పుస్తకాలు నొక్కేసినపుడే హుష్ కాకి అయిపోయింది" అని నాన్నారు అడ్వాంటేజ్ తీసుకోడం మొదలెట్టారు.
ఈ మధ్య పిల్లల పార్కులో రాంచీకి చెందిన ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ పరిచయం అయ్యారు. మార్క్ ట్వైన్ పుస్తకాల గురించి మాటల్లో వచ్చి "నా దగ్గర మొత్తం కలెక్షన్ ఉంది"(ఇది నేను సెయింట్ లూయిస్ లో టామ్ సాయర్, హకల్ బెరీ ఫిన్ ఆడిపాడిన మిస్సిసీప్పి నది ఒడ్డున ఉన్న ఆర్చ్ మ్యూజియంలో సగర్వంగా కొనుక్కున్నాను)అని నోరు జారాను.
ఇంకేముంది? ఇవ్వాల్సి వచ్చింది.
అది తీసుకున్నాక ఆయన చెప్పా పెట్టకుండా ఊరికెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలీదు, పుస్త్తకం గురించి వాళ్ళ కోడల్ని అడిగితే బాగుండదేమో!పైగా పోతే పోనీ అనుకోడానికి అది నేను మార్క్ ట్వైన్ వాళ్ల ఊళ్ళో కొనుక్కున్నాను. తర్వాతెప్పుడో మూడునెల్లకి వచ్చి "ఇక్కడే ఉందమ్మా పుస్తకం, అదితి ని అడిగి తీసుకోవలసింది" అన్నాడనుకోండి. అది తిరిగి చేతికొచ్చేదాకా మనసు మనసులో లేదనుకోండి!
ఆ పుస్తకంతో పాటు మార్క్ ట్వైన్ దే "Mark Twain's selected sketches and short stories-(limited edition) " కూడా కొన్నాను. అది ఈ మధ్య ఒక బ్లాగరు మిత్రుడికి ఇచ్చాను. అదెప్పుడొస్తుందో అని బెంగ. అది ఇంకో కాపీ సెయింట్ లూయిస్ వెళ్ళినా దొరకదు.(గీతాచార్య ఈ టపా చదవకపోతే బాగుండు). బెంగుళూరు బ్లాగర్ మిత్రుడొకరు తను తీసుకున్న పుస్తకాలను జాగ్రత్తగా అట్ట వేసి మరీ అప్పగించారు. (బ్లాగర్లు మంచివాళ్ళు)
యండమూరి నవలల్లో నాకు "అనైతికం" బాగా నచ్చుతుంది.మా బంధువుల్లో నాలాగే ఒకావిడకి ఈ నవల బాగా నచ్చేసి తీసుకెళ్లారు. ఇష్టం కొద్దీ మళ్ళీ మళ్ళీ చదివే ప్రాసెస్ లో పుస్తకం మొత్తం చచ్చి ఊరుకుంది. పుస్తకం కావాలని అడిగితే "అది కొంచెం కుట్లూ అవీ ఊడిపోయిందోయ్, బైండ్ చేయించి ఇస్తాను" అంటారు. ఇవ్వరు! ఏదో పాత పుస్తకాలైతే తప్పనిసరై బైండ్ చేయించుకోవాలి కానీ కొత్త పుస్తకాలు బైండ్ చేయించి, చదివేటపుడు నానా ఇబ్బందులూ పడటం నాకిష్టం ఉండదు. దాని కోసం చింతించి, ఆపై కొంచెం నువ్వులతో నీళ్ళు కలిపి చెయ్యి కడుక్కుని కొత్త కాపీ కొన్నాను.
మరొక సారి నేను జాగ్రత్తగా దాచి ఉంచిన ఎప్పటిదో 1995 నాటి ఇండియా టుడే సాహిత్య వార్షిక సంచిక ని ఒక స్నేహితుడి భార్య మా ఇంటికి వచ్చినపుడు తీసుకున్నారు. ఆవిడ వచ్చే సమయానికి నేను అందులో కుప్పిలి పద్మ రాసిన కథ ఒకటి వందోసారి చదువుతున్నాను.
ఇల్లంతా తిరిగి చూస్తూ పుస్తకాన్ని గొట్టంలా చుట్టేసిందామె! నా ప్రాణం గిలగిల్లాడిపోతోంది. అలా చెయ్యొద్దని చెప్తే బాగోదేమో! కాసేపయ్యాక వాళ్ళ బాబు ఏదో అల్లరి చేస్తే ఆ గొట్టంతో రెండు దెబ్బలు వేసింది. ఇంటికెళ్ళాక దానితో ఇంకా ఏమేమి చేస్తుందో అని ఊహించడానికే భయం వేసి
"అది ఇప్పుడు దొరకదండీ, కొంచెం జాగ్రత్తగా ఉంచండి"అని చెప్తుండగానే ఆవిడ
"కొత్త ఇష్యూ దార్లో కొనుక్కుంటాలెండి" అని కొంచెం కోపంగా పుస్తకం ఇచ్చేసింది.
దశాబ్దం పై నాటి అపురూప సంచికకూ, మార్కెట్లో ఉన్న ఫ్రెష్ రాజకీయ వార్తల సంచికకు ఆమెకు తేడా తెలియనందుకు సంతోషిస్తూ అందుకున్నాను.
అలాగే నాకో కజిను ఉన్నాడు. వాడిసంగతి ఎన్నాళ్లకూ అర్థం కాదు. ఒక పక్క విశ్వనాథ వారంటే ప్రాణం, ధర్మారావు మన సంస్కృతికి ప్రతిరూపం,వారినెవరైనా ఒక్కమాటంటే ఊరుకోనంటాడు. మరోవైపు శ్రీ శ్రీ కవిత్వం వింటే రక్తం పరుగులెత్తుతుంది, నిషా ఎక్కుతుందంటాడు. ఈ వైరుధ్యం ఏమిటో మరి! ఇంతా చేసి ఈ ఇద్దరి పుస్తకాలూ నా దగ్గరినుంచే నొక్కేసాడు.వేయిపడగలు నాకు నచ్చలేదు కాబట్టి పోయినా ఓకే!ఖడ్గసృష్టి, మహా ప్రస్థానం? ఇప్పటికి పది సార్లైనా కొనుంటాను. అన్నిసార్లు పోయాయి అవి!అమృతం కురిసిన రాత్రి ఒక నాలుగు సార్లు!
ఇంత జరిగినా, ఎవరైనా 'ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అనడిగితే "ఓ యెస్" అని ఇచ్చేస్తా! ప్చ్! కొన్ని జీవితాలింతే అనుకుంటా!
ఎక్కడో చదివాను"fools lend books, and only greater fools return them" అని! నా విషయానికొస్తే నేను రెండూనూ!
ఎవరి దగ్గరైనా తీసుకున్న పుస్తకాల విషయంలో ఇంత అలసత్వంతో, నిర్లక్ష్యంతో ఉండేవారిని ఏం చెయ్యాలో నాకు తోచదు. మీకేమైనా తోస్తోందా?
తిరిగే కాలూ తిట్టే నోరూ... అని సామెత! రెండోదాని విషయం వదిలేస్తే మొదటి విషయం ప్రకారం ఏడాదికి కనీసం 3 వెకేషన్లు (వారానికి తక్కువ కాకుండా) తీసుకోడం మా ఇంటి సంప్రదాయం! అలా వెళ్ళొచ్చాక ట్రావెలాగులు ఇంతకు ముందు రాసి ఒకట్రెండు సార్లు పత్రికలకు పంపాను. ఆ తర్వాత రాయడం విసుగొచ్చి మానేసాను. ఈ మధ్య వెళ్ళొచ్చిన "కెమ్మణ్ణు గుండి" గురించి మాత్రం రాసి కౌముదికి పంపాను.
మే నెల సంచిక ఇవాళే విడుదలైంది. వీలు చేసుకుని యాత్రా స్పెషల్ పేజీకెళ్ళి చూడండి...!
అక్కడ ఫొటోల్లో ఉన్నది మిత్రులు నాగరాజు, అపర్ణ, వాళ్ళ పిల్లలు భువి, హర్ష!
