మొత్తానికి ఈ వీకెండ్ రోబో చూసేశాం! సెకండాఫ్ బోరు కొట్టింది. ఏదో కార్టూను సినిమా చూస్తున్నట్లుంది.సంకీర్తన మాత్రం బాగా ఎంజాయ్ చేసి తన ఫాన్స్ లిస్టులోరజనీ కాంత్ ని చేర్చింది (ఫేవరిట్లకీ ఫాన్స్ కీ ఇంకా తేడా తెలీదు. అందుకే రజనీ నా ఫేవరిట్ అనడం తెలీక రజనీ నా ఫాన్ అంటుంది). ఈ సినిమా చూస్తుంటే నా మెదడు లోని జ్ఞాపకాల పొరల తెరలు అలా అలా పుస్తకం పేజీల్లా టప టప మని తెరుచుకుంటూ వేగంగా వెనక్కి ప్రయాణిస్తూ వెళ్లి వెళ్ళి ఒక చోట చటుక్కున ఆగిపోయాయి.
అవును, 1984లో! అప్పుడు నేను స్కూల్లో నాలుగో అయిదో శ్రద్ధగా చదువుతూ ఇంట్లో అంతకంటే శ్రద్ధగా నవలలు చదువుతుండేదాన్ని! ఆ రోజుల్లోనే ఆంధ్ర జ్యోతి వారపత్రికలో శ్రీ మైనంపాటి భాస్కర్ గారు "బుద్ధి జీవి" అనే సీరియల్ రాశారు, ఒక రోబో ప్రధానాంశంగా! సైన్స్ నేపథ్యంతో సూపర్ హిట్ అయిన నవల అది. నచ్చిన సీరియల్స్ ని పుస్తకాలు గా బైండ్లు చేయించే అలవాటు ఉన్న మా ఇంట్లో ఆ నవల ఆ తర్వాత చాలా రోజులు ఉంది. ఇప్పుడు రచయిత వద్ద తప్ప ఎక్కడా లేదు.
పుస్తకం మీకెలాగూ దొరకదు కాబట్టి కథంతా ఇక్కడ చదవాల్సిందే! గత్యంతరం లేదు మరి!:-))
కథా కాలం 2050 ప్రాంతం!
సంజీవ్ అనే సైంటిస్ట్ ని ఆయన తయారు చేసిన నరహరి అనే రోబో హత్య చేసి పారి పోయిందని మీడియాలో బ్రేకింగ్ న్యూసు వస్తుంది. ప్రపంచాన్ని క్షణాల్లో నాశనం చేసే విషక్రిమిని తయారు చేస్తున్న జెనెటిక్ ఇంజనీర్ శోధన కూతురు అపురూప ఆ వార్తలు చూస్తూ "అమ్మో, అది ఎక్కడికి వెళ్ళుంటుంది" అని ఆశ్చర్యపోతుండగా సంజీవ్ గారి కొడుకు అజిత్ పోలీసులతో సహా వాళ్ళింటికే వచ్చి
"ఆ రోబో మీ అమ్మ ని కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానించాం. అందుకే వచ్చాం" అని అపురూపతో చెప్పి లాబ్ లోకి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ శోధన అపహరణకు గురైన ఆనవాళ్ళు కనిపిస్తాయి.
టీవీల్లో ప్రకటనలు..
ఆ తప్పించుకు పోయిన రోబోట్ కి తనలాంటి వాటినే అసంఖ్యాక రోబోలను తయారు చేసి వినాశనానికి ఊపయోగించగల శక్తి కూడా ఉంది కాబట్టి వెంటనే దాని ఆచూకీ తెల్సిన వారు తెలియజేయాలని!
దానితో అజిత్, అపురూప శోధనను, నరహరిని వెదకడానికి రెక్కలున్న ఫ్లయింగ్ కారులో బయలుదేరతారు. దార్లో వాళ్ళకు ఫ్లయింగ్ సాసర్ కనిపిస్తుంది. దాని వెంటబడి పట్టుకునే ప్రయత్నంలో దారి తప్పి మెకానికా దేశం సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మనుషులంతా ఒకే రకంగా ఉంటారు.పేర్లకు బదులు నంబర్లుంటాయి. ఒకటో నంబర్ వాడు మిగతా వాళ్ళందరినీ క్లోనింగ్ ద్వారా వృద్ధి చేసి వాళ్ళకు సొంత ఆలోచనలేవీ లేకుండా చూస్తూ తన బానిసలుగా వాడుకుంటూ ఉంటాడు. అక్కడ వీళ్ళు చావు తప్పి ఎలాగో తప్పించుకుని పారిపోతారు.
ఇలా మరొక రెండు దేశాలు తప్పించుకుని వెళుతుండగా ఒక చోట,.... తప్పించుకు పారిపోయిన నరహరి వికృతాకారంతో ఎదురవుతుంది. దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా అది తప్పించుకుని కొండల్లోకి పారిపోతుంది. ఆ కొండ ఎక్కి ఇద్దరూ అటు దిగే సరికి వాళ్ళు ఎన్నడూ చూడని, ఊహించని దృశ్యం ఎదురవుతుంది. కొండల మధ్యలో నాగరికత వాసనలు అంటని ఒక బుల్లి అచ్చ తెలుగు పల్లెటూరు. వీళ్ళిద్దరినీ అంతా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
అక్కడ అందరికీ తల్లో నాలుకలా మెసలుతూ నరహరి! నరహరిని చంపబోతుండగా అందరూ అడ్డం పడి అజిత్ ని చీవాట్లు పెడతారు.
అప్పుడు నరహరి చెప్తాడు .."
నేను మనిషినే! రోబో ని కాదు" అని!
ఒకసారి సైన్సు కాంఫరెన్స్ జరుగుతున్న హోటల్లో దానికి హాజరైన ఆరుగురు సైంటిస్టులు హోటల్ యజమాని మోహన్ కి స్నేహితులవుతారు. వాళ్ళు ఇద్దరు ప్లాస్టిక్ సర్జెన్లూ,ఒక హార్ట్ స్పెషలిస్టూ,ఒక జనరల్ ఫిజిషియనూ,ఒక రాబొటిక్స్ స్పెషలిస్టూ! ఆ రోజు రాత్రి హోటల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మోహన్ ఎంతో శ్రమించి ఆ ఆరుగుర్నీ కాపాడి తను మరణిస్తాడు. అంత చక్కని ఆతిథ్యం ఇచ్చిన మోహన్ చావడాన్ని ఆ ఆరుగురూ జీర్ణించుకోలేక, అతడు బ్రెయిన్ డెడ్ కాలేదని నిశ్చయించి వెంటనే ఆర్టిఫిషియల్ గుండెతో పని మొదలు పెడతారు. ఎవరెవరివో అవయవాలు అమర్చి,ఫైబర్ గ్లాస్ చుట్టూ, దెబ్బ తిన్న మెడుల్లా ఆబ్లాంగేటా స్థానే ఒక చిన్న మైక్రో కంప్యూటరూ..ఇలా తిరిగి మోహన్ బతుకుతాడు.
"
నా కాళ్ళు నబూకా అనే నీగ్రోవి! నా గుండె రజియా అనే స్త్రీది. నా చేతులు హారిసన్ అనే వ్యక్తివి. నా శరీరంలోని కొన్ని గ్రంథులు రింకూ అనే చింపాంజీవి.ఈ నలుగురి పేర్లలోని మొదటక్షరాలు కలిపి నాకు "నరహరి" అని నామకరణం చేశారు డాక్టర్ సంజీవ్" అని చెప్తాడు నరహరి. ఇలా ఘోరంగా మారిపోయిన నరహరిని తమ కుటుంబ సభ్యుడి గా అంగీకరించక అతడి భార్యా బిడ్డలు వెళ్ళగొడతారు. ఎక్కడా దిక్కులేక వికారమైన స్వరూపంతో బతకలేక ఆ మారు మూల ఊరికి వచ్చి వాళ్ళలో ఒకడిగా పని చేసుకుంటూ బతుకుతున్నాడు నరహరి. అతడు మనిషని తెలిసిన అపురూప "
మరి సంజీవ్ తయారు చేసిన మరమనిషి మీరేనని, ఆయన్ని చంపి మీరు పారిపోయారనీ గగ్గోలుగా ఉంది"అని చెప్తుంది. అసలు సంజీవ్ మరణించిన సంగతే తెలీదు నరహరికి.
మరి సంజీవి ని ఎవరు చంపారు? తన తల్లి శోధన ఏమైంది? ఆమె సృష్టించిన విషక్రిమి ఎక్కడుంది? అపురూపకన్నీ ప్రశ్నలే! నరహరిని అక్కడే వదిలి తిరిగి బయలు దేరతారు.
ఈ కొద్ది రోజుల సాహచర్యంలో అజిత్ అపురూపల మధ్య ప్రేమ భావం అంకురిస్తుంది. నిజానికి అపురూపకి ప్రేమ, పెళ్ళి... ఇవంటే ఏమిటో తెలీదు. ఆమె తల్లి శోధన కూడా ఒక స్పెర్మ్ బాంక్, ఒక టెస్ట్ ట్యూబ్, ఒక ఇంకుబేటర్--ఈ మూడిటి సాయంతోనే అపురూపను తన కూతురిగా సృష్టించుకుంది తప్ప పెళ్ళి చేసుకుని కనలేదు. ఇప్పుడీ కొత్త భావం ఆమెకు ఎంతో తీయగా అనిపిస్తుంది.
దార్లో అజిత్ టైమ్ మెషీన్ ఎక్కితే ఎలా ఉంటుందో అపురూపకు ఒక సిములేషన్ మెషీన్ ద్వారా చూపిస్తాడు. కొన్ని శతాబ్దాల తరవాత మనిషి ఒక మాంసం ముద్దలా తయారైపోతాడు అంటూ ఆ దృశ్యాన్ని చూపిస్తాడు. కాసేపట్లో అలాంటి మాసం ముద్ద లాంటి జీవి ఒకటి ఫ్లయింగ్ సాసర్లో వచ్చి నిజంగానే వాళ్ల ఎదురుగా నిల్చుంటుంది. ఎవరు ఏ భాషలో మాట్లాడినా అర్థం చేసుకోగలిగే ఆ గ్రహాంతర వాసి స్నేహ సందేశాన్ని మోసుకొస్తుంది!
"
మీ భూమి కంటే కోట్ల సంవత్సారల ముందే మా గ్రహం పుట్టింది. సైన్సులో విపరీతమైన అభివృద్ధిని సాధించాం! రోబొట్స్,సాటిలైట్స్,జెనెటిక్ ఇంజనీరింగ్, అణుశక్తి ఇలా ఒకటేమిటి అన్నింటినీ వినాశనానికే వాడాం! చివరికి ఇలా రూపం లేని జీవులుగా మిగిలాం! భూమి ని నాశనం చేసే విషక్రిమి ఏదో తయారవుతోందని అంతా భయపడుతున్నారు. అసలు మనిషి కంటే విషక్రిమి ఎవరు? మనిషి కంటే మారణాయుధం ఎవరు? ఇంత స్వార్థం ఎవరికుంది?సైన్సు మనిషికి మంచి చెయ్యాలే కానీ ముంచెయ్య కూడదు"
ఇలా చెప్పి ఆ బుద్ధి జీవి "
అన్నట్లు అజిత్, ఆ విషక్రిమి ని ఎక్కడ దాచావు? బయటికి తీయ్, చూస్తాను" అని అడుగటంతో అజిత్ నిశ్చేష్టుడైపోతాడు.
ఇక చేసే ది లేక తన ముంజేతిని ఒక స్క్రూ లా తిప్పి ఊడదీసి, మణికట్టు లోపల దాచిన చిన్న కాప్స్యూలు తీసి ఇస్తాడు.
అవును, అజిత్, మనిషి కాదు! సంజీవ్ తయారు చేసిన రోబో అజితే!
మనిషిలా కనపడేదీ, మానవ స్వభావాన్నీ, భావోద్వేగాల్నీ అనుభవించగలిగే ఒక రోబోట్ అజిత్! ఇంతలో ఆ కాప్యూలును మింగేస్తుంది ఆ బుద్ధి జీవి. "మరేం పర్లేదు ,ఇలాంటి వాటిని హరాయించుకునే దశలో ఉన్నాం మేము" అంటుంది.
అపురూప కు మతి పోతుంది.
ఆ తర్వాత అపురూపకు స్పృహ వచ్చాక .......
"
సంజీవ్ గారి కొడుకు ఆధ్యాత్మికత లో పడి ఎటో వెళ్ళిపోతే అతడి లాగే కనపడేలా నన్ను తయారు చేసి అతడి పేరే నాకు పెట్టారు సంజీవ్. లోకానికంతటికీ నేనే అతడి కొడుకుగా తెల్సు. కానీ దురదృష్ట వశాత్తూ ఆయన కంటే నా మేథస్సు ఎక్కువని రెండు మూడు సందర్భాల్లో రుజువైంది. ఒక మేజర్ సమస్యను ఆయన సాల్వ్ చేయలేక సతమవుతుంటే నేను నేను పరిష్కరించాను. అది ఆయన అహాన్ని దెబ్బ తీసింది.
నన్ను నాశనం చేయాలని సంకల్పించారు. అంతకు ముందే ఈ విషక్రిమి తయారీలో మీ అమ్మగారున్నారని సంజీవ్ నాతో చెప్పడం వల్ల ఆ విషక్రిమిని ఎలాగైనా నాశనం చేయాలని నేననుకుని మీ అమ్మను కిడ్నాప్ చేశాను. విషక్రిమిని నా స్వాధీనం చేసుకున్నాను! ఈ లోపు తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేని సంజీవ్ ఆత్మహత్య చేసుకున్నారు" అని చెప్తాడు అజిత్!
తమ కళ్యాణమెలాగూ సాధ్యం కాదని తెలుసుకున్న ఆ మనిషీ, మెషినూ కలిసి చేతులు కలిపి సైన్సును మానవ కళ్యాణానికే తప్ప వినాశనానికి ఉపయోగించరాదనే సందేశాన్ని ప్రచారం చేసేందుకు బయలు దేరతారు.
ఈ నవలకు ఆంధ్రజ్యోతి నిర్వహించిన సైన్స్ ఫిక్షన్ నవలలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇందులోని చాలా విషయాలు ఇప్పుడు ఒక మౌస్ క్లిక్ దూరంలోనే దొరకొచ్చు కానీ 1984లో ఇంత చక్కని నవల రాయడం ఎంత గొప్ప విషయమో అనిపిస్తుంది. రోబో సినిమాలోని సందేశమే ఇక్కడానూ! సైన్సును పెడదోవలు పట్టించి వినాశనానికి ఉపయోగించొద్దని!
భవిష్యత్తులో ఈ విశ్వం ఎలా ఉండబోయేదీ రచయిత ఊహించిన తీరు అద్భుతంగా తోస్తుంది. అడుగడుగునా కనపడే ఫ్లయింగ్ ఆబ్జెక్టులూ, అజిత్ తో పాటే తిరుగుతుండే కేటూ (k2) అనే బుల్లి రొబొట్, అకస్మాత్తుగా కొండల మధ్య పల్లెటూరూ, నవలంతా చాలా ఆహ్లాదంగా నడుస్తుంది. సీరియల్ కావడంతో వారం వారం పత్రిక కోసం ఎదురు చేసేలా ఉండేది.
ఇంగ్లీషులో ఇలాంటి సైన్స్ ఫిక్షన్స్, అందునా రోబొట్ కథాంశంగా ఎన్నో నవలలు వచ్చి ఉండొచ్చు, కానీ అంతకు ముందు గానీ ఆ తర్వాత కానీ ఈ అంశంతో కథ వచ్చినట్లు నాకైతే తెలీదు మరి! అచ్చు మనిషిలాగే ఉండే రోబోట్, మనిషి లాగే ఆలోచించగలిగే రోబోట్ ఈ నవల్లో ప్రత్యేకం! ఇన్నేళ్ళ తర్వాత రోబో సినిమాలోనూ అదే ప్రత్యేకం!
నవసాహితి పబ్లిషర్స్ వేసిన ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు! దొరికితే మాత్రం తప్పక చదవండి.