November 23, 2010

అనైతికం

 అనైతికం నవల గురించి రాయాలని ఎప్పటినుంచో అనుకున్నాను. సగం రాసి ఎక్కడో పడేశాను. అది నిన్న పాత ఫైల్స్ లొ కనపడి మొత్తం పూర్తి చేసి ఇవాళ బ్లాగులో పెడుతున్నా! :-))




నిస్సందేహంగా యండమూరి ఒక సంచలన రచయిత. (మంచి రచయితా కాదా అనేది మీరు చదివిన నవలలల్ని బట్టి మీరే నిర్ణయించుకోండి) కుటుంబ కథలే నవలలుగా చెలామణీ అవుతున్నరోజుల్లో ఒక ప్రభంజనం లా దూసుకొచ్చి సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అద్భుతమైన శైలి అతని సొంతం. సస్పెన్స్ తో వచ్చేవారం దాకా ఎదురు చూడ్డం లోని మజా మా తరం పాఠకులకు అనుభవంలోకొచ్చేలా చేశాడు.

ఎన్నో నవలలు రాసినా నాకు అన్నింటికంటే నచ్చేవి అనైతికం, వెన్నెల్లో గోదారి. రెంటి కథనాల్లోనూ చక్కని బిగి ఉంటుంది.అన్ని మూలల నుంచీ సూత్రాలను లాగి చక్కగా ముడివేసిన నేర్పు ఉంటుంది.

ఇతనివే కొన్ని నవలలైతే ఇప్పుడు చదువుతుంటే "ఒకప్పుడు ఎంతో ఉత్కంఠగా ఈ పుస్తకం ఎలా చదివానా?" అని గొప్ప సందేహం వచ్చే పుస్తకాలు కూడా ఉన్నాయి.ఉదా:రక్త సింధూరం,లేడీస్ హాస్టల్,అగ్నిప్రవేశం(ఇంకా ఉన్నాయి..)మొదలైనవి. అతడి శైలి మీద ఇష్టంతో ఒకప్పుడు కొనిపెట్టుకున్న నవలలు బుక్ షెల్ఫ్ లోంచి వెక్కిరిస్తుంటాయి నన్ను!

ఎవరికైనా కావాలంటే అవి ఇచ్చేస్తాను. ఎప్పటికీ..అచ్చంగా!

అనైతికం నవల ఆంధ్ర ప్రభ లో సీరియల్ గా వచ్చింది. అప్పుడు మొత్తం చదవకపోయినా తర్వాత నవల కొన్నాను.(దాన్ని మా ఆడపడుచు పట్టుకెళ్ళి పేజీలన్నీ ఊడగొట్టిన సంగతి ఇంతకు ముందొకసారి. రాశాను! తర్వాత మళ్ళీ ఇంకో కాపీ కొన్నాను)

ఒక మనిషికి సంబంధించి ఏది నైతికం?
ఏది అనైతికం?
దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎందుకు నిర్ణయించాలి? ఎవరికేది కావాలో వేరొకరు ఎందుకు నిర్ణయించాలి?
అసలు నైతికత వ్యక్తిగతమా? సామాజికమా?

ఇవన్నీ అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ప్రశ్నలే! మనకు నైతికమే అనిపించింది ఇంకొకరికి అనైతికంగా కనిపించవచ్చు! ఈ విశ్లేషణే ప్రధానంగా ఈ నవల సాగుతుంది.

మీలో చాలా మంది ఈ నవల చదివే ఉంటారు.అయినా పరిచయం రాసేటపుడు పాత్రల్ని పరిచయమో, విశ్లేషణో చేసి ఊరుకోకుండా కథ కూడా చెప్పడం నాకలవాటు కాబట్టి చెప్తాను.

ఈ నవల్లో ముఖ్య పాత్రలు మూడూ స్త్రీలే! ఈ ముగ్గురికీ బంధుత్వం ఉంటుంది. వీరు జీవితాలను కొంతమంది పురుషులు ప్రభావితం చేస్తారు. స్త్రీ వాదానికి వ్యతిరేకంగా రచించిన ఒక పుస్తకాన్ని నిషేధించాలని కోరుతున్న స్త్రీవాదుల లాయర్ గా లండన్ కోర్టులో షాంలా( శ్యామల)మనకు పరిచయమవుతుంది. ఆమె తన తల్లితో కలసి లండన్లో ఉంటుంది. తల్లి  డైవర్సీ! ఇక్కడ స్త్రీవాదం పై కొన్ని వాదప్రతివాదాలు నడుస్తాయి.

చివరికి శ్యామల కేసులో ఓడిపోతుంది. ఇంతలో మరో పక్క తన తల్లి తండ్రులు విడిపోవడానికి కారణం తన పెదనాన్నతో తల్లికి గల అక్రమ సంబంధమే అని తెలుస్తుంది...తన సవతి తమ్ముడి ద్వారా!తల్లి మీద కోపంతో మండిపడుతూ తండ్రిని చూడ్డానికి ఇండియా బయలుదేర్తుంది.

ఇక్కడినుంచి ఆమె తల్లి అహల్య తన గతం మనకి చెప్పడం ప్రారంభిస్తుంది.వివిధ కారణాల వల్ల ఆమెకు తన భర్త అన్నతో(బావగారితో) శారీరక సంబంధం ఏర్పడుతుంది. అవి నవల్లో చదివితేనే బాగుంటుంది. చివరికి అది బయటపడి ఆమె విడాకులు తీసుకుంటుంది.

నవల్లోని మరో ముఖ్య పాత్ర అహల్య వదిన(అన్న భార్య)అచ్చమ్మ!(అవును అచ్చమ్మే)! దళిత స్త్రీ!ఒకతనితో ప్రేమ(అనుకుని)లో పడి రెండేళ్ళపాటు పెళ్ళి లేని సహజీవనం చేసి విడిపోయి అహల్య అన్నను పెళ్ళాడుతుంది.

శ్యామల తండ్రిని కలుసుకుందా? మామయ్య,అత్తల ను కలిసి తల్లి ఎందుకలా చేయవలసి వచ్చిందో తెలుసుకుందా? అపార్థం తొలగిపొయిందా? ఇవన్నీ నవల్లో చదివితే బావుంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నవలే కాబట్టి ముగింపు చెప్పడం లేదు.(దొరకని పుస్తకం అయితే కథ మొతం చెప్పేద్దును)

ఈ నవల ముందు మాటలో యండమూరి స్త్రీ వాదం గురించి కర్ర విరక్కుండా, పాము చావకుండా కొన్ని మాటలు రాశారు.అవి అప్రస్తుతం!నవలను పక్కనపెట్టి బోల్డంత చర్చకు దారితీసే వాక్యాలు అందులో ఉన్నాయిమరి!

పాత్రల వ్యక్తిత్వాలను తీర్చి దిద్దడంలో యండమూరిది అందె వేసిన చేయి. వాటి మనో భావాలను, ముసుగుల్లేని అంతరంగాలను,అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరిస్తాడు. అహల్య అత్తగారింట్లో వాతావరణాన్ని,జాణ లాంటి అత్తగారిని,పాఠకులు ఎగ్జైట్ అయిపోయేంత అద్భుతంగా చిత్రీకరించాడు.

యండమూరి నవలల్లో స్త్రీ పాత్రలు అద్భుతమైన తెలివితో, ఇనీషియేటివ్ గా, మేథస్సూ ఉట్టిపడుతూ ఉంటాయి.మరోపక్క స్త్రీ సహజమైన సున్నితత్వం, భావుకత, ప్రేమ వీటన్నితో పరిపూర్ణంగానూ ఉంటాయి.అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మవిశ్వాసం యండమూరి హీరోయిన్లకు పెట్టని ఆభరణం! అనూష,రమ్య, సౌదామిని,వైజయంతి,లక్ష్మి,ప్రవల్లిక,ప్రమద్వర,ఎవరినైనా తీసుకోండి!వీళ్లలోవాళ్ళే అహల్యా,అచ్చమ్మానూ!

యండమూరి వ్యక్తిత్వ వికాసం పుస్తకాల వైపు మళ్ళినా, నాకెందుకో వాటిలో లేని మనోవిశ్లేషణ అతని(కొన్ని)  నవలల్లోనే కనిపిస్తుంది. అతని పాత్రల స్వభావాలే పెద్ద పాఠాలు!  

ఈ నవల్లోని రెండు ముఖ్య పాత్రలు అహల్యా, అచ్చమ్మ ఇద్దరూ ఉన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళుగా రచయిత ఎస్టాబ్లిష్ చేస్తాడు. వ్యక్తుల సెక్స్ జీవితమే ప్రాతిపదికగా,వాళ్ళ ఇతర ప్రవర్తన వ్యక్తిత్వం ఏమీ అర్థం చెసుకోకుండానే (అర్థం చేసుకునే కెపాసిటీ లేకనొ)  వాళ్ళకు వ్యభిచారులనో,మరోటనో టాగులు  అంటగట్టే  మనస్తత్వం ఉన్నవాళ్ళకు ఈ నవల అర్థం కాదు.కాబట్టి అలాంటి ఆలోచనలుంటే ఈ నవల చదవకపోవడమే మంచిది.

 జీవితంలోని ఇతర సంఘర్షణల వల్ల ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఇలాంటి బంధాల మధ్య ఇరుక్కునే పరిస్థితి ఎవరికీ రాదనీ, అలా వచ్చిందంటే అది ఆడాళ్లు కొవ్వెక్కి చేసే పనే అని నిర్ణయించేసే వాళ్లకి ఏమని చెప్పగలం? ఎక్కడో యండమూరే అనుకుంటాను అన్నాడు, అవకాశం రానంత వరకూ అందరూ మాట్లాడే మాటలే ఇవి! నవల సీరియల్ గా వస్తున్నపుడే దీని మీద బోలెడు చర్చలు నడిచాయని గుర్తు!

మొదట్లో అహల్య కూడా భర్తను ఎంతగానో ప్రేమిస్తూ కోటి ఆశలతో అతనిజీవితంలోకి ప్రవేశిస్తుంది. కానీ పుట్టింట్లో అందర్నీ వదులుని అక్కడ అడుగుపెట్టిన ఆమెకు ఎదురైన పరిస్థితి ఏమిటి? చదువుకుని మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న ఒక ఆడపిల్ల ఎంతమాత్రమూ దిగమింగుకోలేని పరిస్థితులు అక్కడ ఎదురవుతాయి. అవి కావాలని తెలివిగా సృష్టించబడతాయి. పెళ్ళి రోజు నాడు సరదాగా భర్తతో కాసేపు కల్సి కబుర్లు చెప్పుకోవాలన్న చిన్న కోరిక కూడా  భగ్నమైపోతుంది,.... ఎవరికీ అదొక కారణమే అనిపించని అతి చిన్న సాకుతో! కానీ ఇలాంటివి మనసులో ఎంతగానొ గుచ్చుకుపోతాయి.

అటువంటి డెస్పరేట్ కండిషన్ లో ఆమె మానసిక పరిస్థితిని వాడుకుని ఆమె తెలివి తేటల్ని(యండమూరి హీరోయిన్లు భలే తెలివిగా ఉంటారు కదా) పొగిడి,తన జీవితలోని ప్రేమ రాహిత్యాన్ని ఆమె ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు ఆమె భర్త అన్న!

తనకు అతనితో సంబంధం ఇష్టమా కాదా అన్నది కూడా తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటుంది అహల్య! ఆమె మానసిక స్థితిని రచయిత చాలా బాగా చిత్రీకరిస్తాడు ఇక్కడ!

విషయం తెలియగానే తన జీవితం సర్వనాశనమైపోయిందని గోల చేసిన అహల్య భర్త(అహల్య భర్త,బావగారు పాత్రలకు పేర్లు కూడా ఉండవు ఈ నవల్లో) గొప్ప నీతిపరుడని మనం కూడా అయ్యో అని జాలిపడతాం! కానీ అహల్య తోడికోడలి చెల్లెలికి గర్భం రావడానికి కారణం అహల్య భర్తే అని తెలుస్తుంది !

మరీ ఎక్కువగా నీత్యుపన్యాసాలు ( నీతి+ఉపన్యాసాలు = యణాదేశ సంధి) దంచే వారి అసలు రంగులు ఇలాగే ఏడుస్తాయి.

అచ్చమ్మ సంగతికొస్తే ...... తెలివైనదైనా ఆడపిల్ల కావడంతో సురేష్ చూపించిన కన్ సర్నూ, అతడి లెక్కలేని తనమూ ,నిర్లక్ష్య ధోరణీ చూసి హీరో వర్షిప్ తో ప్రేమలో పడుతుంది. నవల చదువుతున్నపుడు మనకూ అతడు నచ్చుతాడు. తర్వాత వాడో పెద్ద అవకాశ వాదనీ వెధవనీ తెలుస్తుంది. అతడితో కల్సి జీవించి,అతడి గురించి మొత్తం తెలిశాక డిప్రెస్ ఐపోయి ఎలాగో బయటపడిన ఆమెను అహల్య అన్న శ్రీకాంత్ పెళ్ళాడతాడు.

సెక్సే ప్రాతిపదికగా పాతివ్రత్యాలను,పవిత్రతను నిర్ణయించుకుంటూ పోతే ఈ నవల్లో కనపడేవన్నీ అనైతిక కథలే!(గమనిక:ఈ నవల్లో సెక్స్ వర్ణనలూ,దృశ్యాలూ వగైరాలేవీ ఉండవు)  కానీ పాఠకులు దీన్ని అంతగా ఎందుకు ఆదరించారంటే స్త్రీ పురుష   సంబంధాల్లోని సంక్లిష్టతను,మనసు లోతుల్లో నైతికత ముసుగేసిదాచుకునే భావాలని యండమూరి ఇందులో దిగంబరంగా చూపించేశాడు. ఈ నవల రాయడంలో అతని ప్రతిభకు హాట్సాఫ్ చెప్తాను నేను!. (అతడి  చాలా నవలల విషయంలో తల పట్టుక్కూచుంటాను....అది వేరే సంగతి)


ఈ మధ్య నేనో కోర్సు చదవడం మొదలుపెట్టాను. అందులో భాగంగా ఎన్నో కేసులు పరిశీలించాల్సి వస్తుంది. కొంత వరకూ వివాహేతర సంబంధాలున్న కేసులు!

ఇవి సమాజంలో ఎంత మామూలైపోయాయంటే "పరిస్థితి ఇలా ఉందా? ఇంత సర్వ సామాన్యమైపోయిందా?"అని నిర్ఘాంత పోయేంత. మారిన జీవన ప్రమాణాలు,విధానాలు,పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి.

కానీ అలాంటి పరిస్థితులు ఎందుకేర్పడ్డాయి,కారణాలేమిటనే విషయం పరిశీలించాలి. ఆ బంధం లో " ప్రేమ" ఉందా లేదా అన్నది తప్పకుండా పరిశీలించాలి.  అహల్య సంబంధంలో ప్రేమ లేదు..లేదు..! భర్త మీద ఉన్న నిరాసక్తత, వ్యతిరేకత ఆ బంధానికి దారి తీస్తాయే తప్ప అందులో ప్రేమ,కంపాషన్  లేనే లేవు.


 అచ్చమ్మదీ, అహల్యదీ మాములుగా గడిచే సాధారణ   జీవితం కాదు.చాలా డెస్పరేట్ పరిస్థితిలో వాళ్ళు అలాటి పరిస్థితికి గురవుతారు.నవల చదువుతున్నంత సేపూ అహల్య, అచ్చమ్మల నిస్సహాయ పరిస్థితుల పట్ల పాఠకుడు చలించిపోతాడు. మనసున్న మనిషిగా స్పందిస్తాడు.

చివర్లో శ్రీకాంత్ అచ్చమ్మల కొడుకు హోమ్ సైన్స్ చదువుతూ ఉండటము,కూతురు ఇంజనీరింగ్ చదివి ఉండి కూడా  గృహిణిగా స్థిరపడాలని ఉందని చెప్పడమూ చాలా టచింగ్ గా అనిపిస్తుంది.

డబ్బు కోసం కాక మనసు పెట్టి రాస్తే యండమూరి మంచి నవలలు రాయగలడని చెప్పడానికి ఉదాహరణలు రెండు నవలలు! వెన్నెల్లో గోదారి,అనైతికం! (ఆనందోబ్రహ్మ కమర్షియల్ నవలే)

ఎవరి నైతికత పట్ల వాళ్లకి నిబద్ధత ఉంటే చాలని,వారితో సంబంధం లేనివాళ్ళకు వాళ్ళను ప్రశించే హక్కు లేదనీ యండమూరి గట్టిగా నొక్కి వక్కాణిస్తాడు ఈ నవల్లో!

అద్భుతమైన శైలీ ,కథనంతో చదివించే ఈ నవల అన్ని పుస్తకాల షాపుల్లోనూ లభ్యమే!


 ప్రస్తుతం ఈ నవల ఎవరికో ఇచ్చి ఉండటం వల్ల (రాజ్ కి అనుకుంటా) కవర్ పేజీ ఫొటో పెట్టలేకపొతున్నాను! పైగా కవర్ పేజీ అంత సెన్సిబుల్ గా కూడా ఉండదు లెండి! :-))

చదివిన వాళ్ళు మీకెలా అనిపించిందో చెప్పండి. చదవని వాళ్ళు చదివి చూడండి!

November 4, 2010

"వసుంధర" లో వైదేహీ శశిధర్, అడిలైడ్ శారద!

తెలుగు బ్లాగర్లకు అందరికీ తెలిసి వారే ఇద్దరూనూ! కమ్మని కవితల వైదేహీ శశిధర్, ఆలోచింపజేసే కథల అడిలైడ్ శారద! (నీలాంబరి  బ్లాగర్)



ప్రవాసాంధ్ర రచయిత్రుల గురించి  కేవలం ఆన్ లైన్ పాఠకులే కాక బయటి పాఠకులకు కూడా కూసింత చెప్పేటందుకు మొదలు పెట్టిన ప్రయత్నంలో మొదటి భాగం వైదేహి, శారదల పరిచయం!

ఎలా ఉందో చెప్పండి!

,