January 31, 2011

మన తర్వాత...ఆస్తులు సరే,...మరి వీటి సంగతేంటి?




ఎంతో కొంత ఆస్తులూ పాస్తులూ సంపాదించిన వాళ్ళందరికీ వాటిని పంచుకోడానికి పిల్లలో చుట్టాలో ఉంటారు. నగలూ,డబ్బూ,స్థలాలూ పొలాలూ వీటన్నింటినీ క్లెయిం చేసుకునే వాళ్ళుంటారు. ఇంకా ఇంట్లో వస్తువులు తీసుకునే వాళ్ళుంటారు. మరి మనం పోగేసిన పుస్తకాలెవరు తీసుకుంటారు? ఎవరికి కావాలవి?

మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పటెప్పటివీ మాస పత్రికలూ(విజయ,యువ,జ్యోతి, వనిత, మహిళ మొదలైనవి)పాత నవలలూ,ఎప్పటివో డెబ్భైల్లోని వారపత్రికలూ, భారతులూ కట్టలు కట్టలు ఉండేవి.అప్పట్లో వాటి విలువ తెలీదు. తెలిసే సరికి అవి పర హస్త గతమైపోయాయి. మా అమ్మకు మరీ మొహమాటమెక్కువ!

నా సంగతే కాదు, మంచి పుస్తకాలు సేకరించి మంచి గ్రంథాలయాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్నవాళ్ళంతా ఈ సంగతి ఆలోచిస్తారంటారా? "నా తర్వాత నా లైబ్రరీ సంగతేంటి, ఎవరు చూస్తారు దాన్ని? ఈ పుస్తకాలన్నీ ఎవరు భద్ర పరుస్తారు?ఏం చేస్తారు వీటిని" అని మీలో ఉన్న పుస్తక ప్రియులంతా ఆలోచిస్తుంటారా?

అప్పుడప్పుడు ఈ ఆలోచన వస్తుంటుంది నాకు. మా పాప తెలుగు చదవగలిగినా ,నా పుస్తకాలన్నింటినీ తనూ అంతే శ్రద్ధతో ప్రేమతో కాపాడుతుందని నాకేం నమ్మకం లేదు. నాలాంటి సందేహం మనలో చాలామందికి ఉండొచ్చు!



ఆ మధ్య విజయవాడ వెళ్ళినపుడు వంశీ బుక్ స్టోర్స్ (వంశీ ప్రాచీనాంధ్ర గ్రంథమాల ) జగన్మోహన రావు(నాగేశ్వర రావు)గారితో మాట్లాడుతుంటే ఈ విషయమే ప్రస్తావించారు ఆయన. "కొంతమంది శోత్రియ బ్రాహ్మణ కుటుంబాల్లో ఎంతో అద్భుతమైన ప్రాచీన సంప్రదాయ సాహిత్యం ఉంటుందమ్మా! కానీ వాటిని అన్నాళ్ళూ కాపాడిన వ్యక్తులు పోయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి వాటి విలువ తెలీక ఎవరడిగితే వాళ్ళకిస్తారు. లేదా పాత పేపర్ల వాళ్ళకి కిలోల్లెక్కన అమ్మేస్తారు. లేదా "నాన్న గుర్తు" అనో "తాతయ్య జ్ఞాపకం" అనో దాన్ని చెదలు పట్టేదాకా దాచి, పొడి పొడిగా రాలిపోయాక చింతించి బయట పారేస్తారు తప్ప వాటిని అందరికీ అందుబాటులోకి తెద్దామనే ఆలోచన ఉండదు. ఆ ఆలోచన రావడానికి వాటి విలువ వాళ్ళకు తెలీదు" అన్నారు.


అలాంటి విలువైన పుస్తకాలెన్నో "స్క్రాప్" కింద రాజమండ్రి పేపర్ ఫాక్టరీకి తరలి పోతున్నాయని బాధపడ్డారు ఆయన. అందుకే పాత పేపర్లు కొనే హోల్ సేల్ వ్యాపారుల వద్దకు ఆయన తన కుర్రాళ్ళని పంపిస్తూ ఉంటారట...వాటిలో కల్సి విలువైన పుస్తకాలేమైనా తుక్కు కింద కలిసిపోతున్నాయేమో అని! ఈయన్ని చూసినపుడల్లా ఆశ్చర్యానికి గురైపోతుంటాను నేను,.

ఒక పాత పుస్తకాల వ్యాపారి దృక్పథం కంటే ఒక కళా ఖండాల సేకరణ కర్త ధోరణి కనిపిస్తుంది. ఎంతో మంది రచయితలతో పరిచయాలు. ఎన్నెన్నో పుస్తకాల గురించి అపారమైన అవగాహన, అభిరుచి! కేవలం పుస్తకాలు అమ్మడం, వాటి వివరాలు దగ్గర పెట్టుకోవడమే కాదు,శ్రద్ధగా చదువుతారు కూడానూ! మొన్నొకసారి నేనొక పుస్తకం అడిగితే "ఉందమ్మా నా దగ్గర, నేను చదువుతున్నాను,. వచ్చేవారం రండి" అని చెప్పారు.




అక్కడే ఉన్న మరి కొన్ని షాపుల వాళ్ళు కేవలం తమ దగ్గర ఉన్న పుస్తకాలు అమ్మడం తప్ప, ఆ పుస్తకం తాలూకు గత చరిత్ర,రచయిత తాలూకు వర్తమానం ఇవేవీ తెలుసుకోవాలనుకోరు. నిజానికి ఆ అవసరం వాళ్ళకి లేదు కూడానూ!



అలాగే వచ్చిన పుస్తకాలు వచ్చినట్లు కట్టలు కట్టలుగా పడేసి ఉంచడమే తప్ప,వాటిని బైండ్ చేసి, చక్కని ఫ్లోరసెంట్ ఆకుపచ్చ కాగితం అంటించి,దాని మీద పుస్తకం పేరు,రచయిత వివరాలు రాసి ఉంచడం, సబ్జెక్టుల వారీగా సర్ది ఉంచడం ఇవన్నీ జగన్మోహనరావుగారు చేసినట్లు ఇంకే షాపు వాళ్ళూ చేయడం గమనించలేదు. ఏ పుస్తకం ఎన్ని ఎడిషన్లు పడిందీ,ఏ ఎడిషన్లలో ఎక్కువ తప్పులున్నాయి,ఇలాంటి వివరాలు కూడా అలవోగ్గా చెప్పేస్తుంటారాయన!

చాలా మంది రచయితలు రాసేయడమే తప్ప వాటిని భద్రపరుచుకోరు. (కొ.కు,దాసరి సుబ్రహ్మణ్యం,ఆరుద్ర ఇంకా అనేక మంది రచయితలు ఈ కోవలోకి వస్తారు)రచయితల వద్ద కూడా లేని వారి వారి పుస్తకాల జాడ జగన్మోహనరావు గారి దగ్గర ఉంటుంది. రచయితలే ఫోన్ చేసి "నా ఫలానా పుస్తకం మీ దగ్గరుందా" అని అడగడం నాకు తెలుసు.



తన దగ్గరకు పుస్తకాల కోసం వచ్చేవారిని చూసి వారి అనుభవాలేమిటో గ్రంథస్థం చేయాలనీ కోరికతో "గ్రంథ సేకరణ" చేసేవారి అనుభవాలను రికార్డ్ చేయడానికి ఒక పెద్ద పుస్తకం తయారు చేశారు. అందులో ఆయన దగ్గరికొచ్చేవారు తాము ఫలానా పుస్తకం కోసం ఎంత శ్రమపడిందీ,గ్రంథ సేకరణలో వారి అనుభవాలేమిటీ ఇలాంటి ఆసక్తికర విషయాలు రాస్తుంటారు.

ఇటీవల జగన్మోహనరావుగారికి మరొక ఆలోచన వచ్చింది.పుస్తక ప్రేమికులు వందల సంఖ్యలో పోగేసిన పుస్తకాల భవిష్యత్తు ఏమిటి? వీరి తర్వాత ఆ పుస్తకాలనెలా కాపాడాలి? అందుకే తన వద్దకొచ్చే వారి నుంచి మరికొన్ని వివరాలు సేకరించడం మొదలుపెట్టారు.ఇప్పటివరకూ వారి వద్ద ఎన్ని పుస్తకాలున్నాయి?ఏ యే పుస్తకాలు ఇంకా సేకరించాల్సి ఉంది? ఇంకా మొత్తం ఎన్ని పుస్తకాలు కొనే ఆలోచన ఉంది? మీ తర్వాత ఆ పుస్తకాలను ఏదైనా గ్రంథాలయానికి ఇచ్చే ఆలోచన ఉందా?

అరుదైన పుస్తక సంపద కొందరి వద్దనే కేంద్రీకృతమైపోగూడదనీ, అది పుస్తక ప్రేమికులందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన ఆకాంక్ష! అందుకే కథా నిలయం లాగా, ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు!

ఇంతటి శ్రద్ధ ఉండబట్టే కాబోలు గ్రంథాలయ ఉద్యమ సారథి వెలగా వెంకటప్పయ్య గారి అవార్డ్ ఆయనకు ఇటీవల ఇచ్చారు.

ఇలాంటి గ్రంథాలయం స్థాపించే ఆలోచన ఎవరికైనా ఉంటే నా వీలునామాలో ఆస్థీ పాస్తీ,కొంపా గోడూ,పొలమూ పుట్రా,నగలూ గిగలూ ఎవరికి రాసినా పుస్తకాలు మాత్రం వాళ్ళకే రాస్తా! పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండాలి! వాటికి మరణం ఉండకూడదు. మరణించే పరిస్థితిలో ఉంటే,తిరిగి ముద్రించే అవకాశం లేకపోయినా వాటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందించాలి.

మహా రచయితలు,కవుల పిల్లలకు ఎంతో కొంత సాహితీ సువాసనలు అబ్బి ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ తండ్రుల గ్రంథాలయాలను కొంత వరకూ కాపాడతారనుకుందాం! మరి వాళ్ళ పిల్లలు?
ఆ పిల్లల పిల్లలు?
ఆ తర్వాత తరం?
చెప్పలేం? ఏం చేస్తారో ఆ పుస్తకాలని!

అందుకే ఇంటి గ్రంథాలయాల వారసత్వాన్ని కాపాడి,అరుదైన పుస్తకాలను భద్రపరిచి ముందు తరాలకు అందుబాటులో ఉంచాలంటే జగన్మోహనరావు గారి మెదడులో మొలిచిన ఆలోచనకు ప్రాణం పోయాలి.అటువంటి లైబ్రరీ ఒకటి ఉండాలి.

ఇంతకీ మీ మీ లైబ్రరీల గురించి మీరేం ఆలోచిస్తున్నారు?



January 28, 2011

వచ్చేశాయి...అద్భుత జానపద నవలలు !




పుస్తకావిష్కరణ సభలంటే నాకు భయం! ఏం చేస్తాం పూర్వానుభవాలు ఆ విధంగా ఉన్నాయి మరి! కానీ, జానపద నవలా సమ్రాట్ దాసరి సుబ్రహ్మణ్యం గారి పుస్తకాలు మూడు ఒకేసారి ఆవిష్కరిస్తున్నామని ఆహ్వానం రాగానే ఎలాగైనా వీలు చేసుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నిన్న సాయంత్రం అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో జరిగింది ఈ ఆవిష్కరణ సభ! చందమామ పత్రిక మీద ప్రేమాభిమానాలతోనూ,జానపద సాహిత్యం మీద ఇష్టంతోనూ వచ్చినవారే సభికులంతా!పైగా ఈ సభలో ఊకదంపుడు ఉపన్యాసాలుండవని నిర్వాహకులు ముందే హామీ ఇవ్వడం తో వెళ్లడానికి సంకోచం లేకపోయింది.:-))


చందమామ, బొమ్మరిల్లు పత్రికల్లో ఎన్నో జానపద కథల్ని సీరియల్స్ ని అజ్ఞాతంగా రాసి మరణానంతరం అభిమానుల చొరవ వల్ల లోకానికి వెల్లడైన మహానుభావుడు శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం!

 ఒక కథో కవితో వ్యాసమో పత్రికల్లో పడితే మామూలు మనుషుల మైన మనం ఎంతోమందికి ఆ విషయాన్ని చెప్పుకుంటాం! లింకులు పంపుకుంటాం! ఆ విజయోత్సాహంతో కనీసం పది రోజుల పాటు తొమ్మిదో నంబర్ మేఘమెక్కి కూచుంటాం.(cloud 9  అని చెప్పాలనీ..) కానీ అసంఖ్యాక కథలూ, అద్భుతమైన సీరియల్సు, పుంఖానుపుంఖాలుగా సాంఘిక కథలూ రాసి కూడా జీవితమంతా తనెవరో ప్రపంచానికి తెలియాలన్న కోరిక లేకుండా జీవించిన మనిషి ఒకరుంటారని దాసరి గారి గురించి తెలుసుకునే దాకా నేను ఊహించలేదు. ఆయనకు అలా ఉండగలగడం ఎలా సాధ్యమైందో కూడా అంతు పట్టదు!


అయితే...చందమామ అంటే పడి చచ్చే అభిమానులు (అభిమానులూ..ఏమీ అనుకోకండి..)ఊరుకుంటారా?ఆయన చరమాంకంలో ఆయన ఎక్కడుంటారో తెలుసుకున్నారు. కలుసుకున్నారు కూడా! ఆయన్ని నలుగురి మధ్యకూ తేవడానికి ఒప్పించేవారేమో కానీ ఈ లోపే ఆలస్యమై ఆయన దివికేగారు.

ఆ తర్వాత ఆయన జానపద నవలల్ని,ఇతర రచనల్ని  సేకరించడం,వాటిని తిరిగి అచ్చు వేయడం అభిమానులు చేసిన పని. ఇందులో పాలు పంచుకున్న వారి గురించి రాయాలంటే ఒక్కొక్కరికీ ఒక్కో టపా అవసరమవుతుంది. శ్రీ దాసరి వెంకట రమణ,శ్రీ వేణు,శ్రీ v3 రమణ, శ్రీ దాసరి రామచంద్ర రావు, శ్రీ వివిన మూర్తి, వసుంధర దంపతులు! ఇంకా మరెందరో!


అలా ...ఈ పుస్తకాలు సిద్ధం అయ్యాయి! వాటిని బాల సాహిత్య పరిషత్ నిన్న ఆవిష్కరించింది. వందల కొద్దీ కథలు చందమామకు రాసిన వసుంధర దంపతులు, బొమ్మరిల్లు సంపాదకుడు విజయబాపినీడు,వాసిరెడ్డి నారాయణ రావు ఆవిష్కర్తలు!


చెన్నై  నుంచి వచ్చిన ఆత్మీయ అతిథి(చందమామ అసోసియేట్ ఎడిటర్)  శ్రీ రాజశేఖర రాజు గారు!

1947 చందమామ తొలి సంచికలో కథ రాసిన శ్రీ అవసరాల రామకృష్ణా రావు గారు ఈ సభకు రావడం నాకు చాలా సంతోషన్నిచ్చింది. మేథ మే ట్రిక్స్ నిర్వాహకులుగా,గొప్ప లెక్కల మాష్టారుగా  నాకు ఆయనంటే ఎంతో గౌరవం. నిన్న పరిచయం చేస్తే నమస్కారం పెట్టి ఊరుకున్నాను.

 "మీరంటే నాకు అభిమానమండీ"అనో  "మీరు భలే రాస్తారండీ" అనో అంటే ఫూలిష్ గా ఉంటుందనిపించి...! ఆయన లెక్కల నవల  గణిత విశారద.గురించి నేను నా బ్లాగులో రాశాను కూడా!

ఇంకా ఈ సభకు ధనికొండ హనుమంతరావు గారి కుమారుడు శ్రీ ధనికొండ శ్రీధర్,చిత్రకారుడు శ్రీ చంద్ర, శ్రీ రామవరపు గణేశ్వర రావు,మంచిపుస్తకం సురేష్,గురు తుల్యులు శ్రీ వేదాంత సూరి ఇంకా అనేకమంది వచ్చారు.(వారిలో చాలామంది నాకు తెలీదు)


బ్లాగుల నుంచి భండారు శ్రీనివాసరావు,సీ బీ రావు,వేణు,జ్వాలా నరసింహారావు గార్లు వచ్చారు.

ఈ మంచి పుస్తకాలని బయటికి తీసుకొచ్చే బాధ్యత భుజాల మీద వేసుకుని, అనుక్షణం శ్రమించి,అందంగా ముద్రించి, కార్యక్రమంలో మాత్రం కనీసం వేదిక సమీపానికి కూడా  రాకుండా పుస్తకాలు సర్దుకుంటూ కూచున్న రచన శాయి గారిని చూస్తే ఏమనాలో తెలీలేదు. ఈయన కూడా దాసరి గారు లాంటి మనిషే అనిపించింది!
                                                                 చిత్ర కారుడు చంద్ర


ఎప్పటికీ దొరకవని అనుకున్న పుస్తకాలివి. వీటిని సాధించి అందరికీ అందుబాటులోకి తెచ్చింది వాహినీ బుక్ ట్రస్టు. మూడు పుస్తకాలూ కలిపి (అగ్నిమాల,మృత్యులోయ,దాసరి సుబ్రహ్మణ్యం కథలు)360 రూపాయలకే అందిస్తోంది.

మీ కోసమూ, పిల్లల కోసమూ కొని దాచుకోవలసిన పుస్తకాలు!


దాసరి సుబ్రహ్మణ్యంగారి ఈ మూడు పుస్తకాలూ వాహిని బుక్ ట్రస్ట్ వద్ద లభ్యం! ప్రముఖ పుస్తకాల షాపుల్లో కూడా!

మీలో ఎవరివద్దనైనా అలనాటి జానపద సాహిత్యం పాకెట్ పుస్తకాల రూపంలో ఉంటే వాటిని తిరిగి ముద్రించేందుకు బాల సాహిత్య పరిషత్ కృషి చేస్తుంది.!

పంచుకునే వారుంటే ముందుకు రండి


January 24, 2011

అయ్యో....భీమ్ సేన్ జోషి మరిక లేరు!


                                            photo:  from www.chembur.com


సరిగ్గా పదినిమిషాలైంది భీమ్ సేన్ జోషి మరణ వార్త టీవీ లో చూసి! :-(

మిలే సుర్ మేరా పాటతో  భారత దేశంలోని మారు మూల గ్రామాలకు   సైతం ఆయన స్వరం పరిచయమైంది. నిజానికి అంతకు ముందు సంగీత ప్రియులకు తప్ప ఆయనెవరో సామాన్యులకు అంతగా తెలీదు. మిలే సుర్ ..గీతాన్ని  టీవీలో చిన్నప్పుడు చూసి  "ఈయనెవరూ?అలా శూన్యంలోకి చూస్తూ పాడతాడేం?కెమెరా వైపు చూడొచ్చుగా  " అని నేను అన్నప్పుడు నెత్తి మీద  చిల్లు పడేలా మొట్టికాయ పడింది. వేసింది మా చిన్నక్క!

నిజమే!ప్రేక్షకుల్నీ,కెమెరానూ బాలమురళి పట్టించుకోవడం అక్కడక్కడా చూశాను గానీ ఈయనకు ఎక్కడా ఎప్పుడూ ఆ రెండూ(కెమెరా, ప్రేక్షకులూ) ఎదురుగా ఉన్నాయన్న స్పృహే కనపడదు. అందుకే చాలా ఫొటోలు extreme expressions తో కనపడతాయి ఆయనవి.


బాలమురళీ కృష్ణ, భీమ్ సేన్ జోషి ల అద్భుతమైన జుగల్ బందీ

తర్వాత తర్వాత , కర్ణాటక సంగీతం నేర్చుకునే రోజుల్లో ఆయన కచేరీలు విన్నపుడు  హిందూస్థానీ శైలి నచ్చేది కాదు. "బాలమురళి, సుబ్బులక్ష్మీ వీళ్ళే గొప్ప" అనుకునే దాన్ని! కానీ తర్వాత తర్వాత ఆయన కలెక్షన్లు కొనడం మొదలు పెట్టాను. అలా అలా హిందూస్థానీ అంటే ఇష్టపడటం అలవాటైంది.

భీమ్ సేన్ జోషి గురించి రాఘవేంద్ర స్వామి చరిత్ర లో ఒక అధ్యాయం ఉంటుంది..... అది ఎంతవరకూ నిజమో కానీ! గుర్తున్నంత వరకూ రాస్తున్నాను. భీమ్ సేన్ జోషి సంగీతం నేర్చుకుంటున్న రోజుల్లో కొన్నాళ్ళకు ఆయనకు ఏకాగ్రత లేకుండా పోయిందట. ఏది నేర్చుకోవాలన్నా విరక్తి కల్గేదట.అలా తిరుగుతూ తిరుగుతూ ఆయన మంత్రాలయం వచ్చారట. మఠంలో రాత్రి నిద్ర చేసేవారు. కొద్ది రోజులకే ఆయనకు రోజూ రాత్రి కలలో ఒక వృద్ధుడు కనపడి ఒక కొత్త రాగం బోధించేవారట. మెలకువ వచ్చాక కూడా ఆ రాగం, రాగ లక్షణాలు అన్నీ ఈయనకు బాగా గుర్తుండేవి. తెల్లవారుజామున తుంగభద్ర నదీ తీరానికి వెళ్ళి ఆ రాగాన్ని సాధన చేసే వారుట. సరిగ్గా అదే సమయానికి ఎక్కడినుచో ఒక కుక్క వచ్చి ఈయన సాధన చేస్తున్నంత సేపూ ఎదురుగా కూచుని, అపస్వరం పడగానే  తిరిగి  సరిగా పాడేవరకూ మొరుగుతూ ఉండేదిట. అలా ఎన్నో రాగాలను  సాక్షాత్తూ రాఘవేంద్ర స్వామి( వద్దనే జోషి  అభ్యసించారని  ఆ చరిత్ర చెప్తుంది.



భీమ్ సేన్ జోషి గారికి తొంభయ్యేళ్ళు! అయితే ఏం? ఇలాంటి అపురూప వ్యక్తులు ఒక రెండొందలేళ్ళు  జీవిస్తే మాత్రం ఏమి? వీళ్ళకు కూడా మామూలు మనుషుల్లాగే గరిష్టంగా వందేళ్ళేనా? ఎన్ని తరాలకు సరిపడా సంగీతామృతాన్ని పంచారో కదా! వీళ్ళకేమీ మినహాయింపులుండవా  ? అలా ఉంటే ఎంత బాగుండు !....బిస్మిల్లా ఖాన్ మరణించినపుడు కూడా ఇలాగే అనుకున్నాను నేను!

అత్యాశే కానీ అన్యాయం కాదుగా!








January 17, 2011

అనగనగా ఒక మంచు ఐరేంద్రి !




 ఏడుమల్లెలెత్తు రాకుమారి, ధీరుడైన ఒక యువకుడు,ఒక మాంత్రికుడు ఆవిడనెత్తుకుపోడం, లేదా  రాక్షసి ఆవిణ్ణి బంధించడం, మన యువకుడు అది దుష్ట శక్తి కాబట్టి దార్లో కనపడ్డ ఏ మునీశ్వరుడినో అడిగి ప్రాణాల రహస్యం తెలుసుకోవడం ...వాణ్ణి చంపి ఆవిణ్ణి రక్షించడం,పెళ్ళాడ్డం! ఎన్ని వేల కథలు చదివుంటాం? ఇక్కడా అదే కథ! కాకపోతే ఎప్పుడో మరణించిన మాంత్రికురాలు ప్రేతాత్మగా తిరిగి అవతరించి ఊరిమీద పడ్డం కొంచెం కొత్త!

ఈ మధ్య సినిమాలెక్కువయ్యాయి కాబట్టి, ఈ సీజన్ కి ఇదే లాస్టు సినిమా.. అని చెప్పుకుని కనుమ రోజు (మా అమ్మాయి కి చేసిన ప్రామిస్ ప్రకారం)ఐనాక్స్ లో  అనగనగా ఒక ధీరుడు సినిమాకెళ్ళాము!

కన్నీటి    బిందువు ఆకారంలో ఉండే (శ్రీలంకేమో) ఉండే రాజ్యం మీద ఎప్పుడో , తన వంశస్థురాలి మెడలోనే ఉండే ఒక లాకెట్ లో  ప్రవేశించి గుప్తంగా ఉండిపోయిన ఒక ప్రేతాత్మ ఐరేంద్రి తిరిగి పునరుత్తేజం పొంది లేచి, రాజ్యం మీద పడుతుంది. తన వంశంలో ఆఖరిదైన ప్రియను బంధించి రోజుకో రక్తపు బొట్టు ఆమెనుంచి తీసుకుని ఏ రోజుకారోజు జీవం పొందుతుంటుంది. ఆమె తిరిగి జీవశక్తి పొందాలంటే మోక్ష అనే పసి పిల్లను చంపి ఆమె రక్తాన్ని, ప్రియ రక్తాన్ని కలిపి తీసుకోవాలి. మరో పక్క ఐరేంద్రి ని అంతం చేయాలన్నా మోక్షకే సాధ్యం!

రాజ్యంలో ఐరేంద్రి అనుచరులైన సర్పాల బారిన పడి అచేతనంగా పడిపోయిన పిల్లలను రక్షించడానికి మోక్షను తీసుకుని అంధుడైన ఒక వీర యువకుడు ఆ రాజ్యానికొస్తాడు.

ప్రియకూ ఆ యువకుడికీ ఉన్న బంధం ఏమిటో,ఐరేంద్రి అసలు మళ్ళీ ఎలా పునరుజ్జీవం పొందిందో,మోక్ష ఐరేంద్రిని చంపగలిగిందా లేదా, వీరుడికి కళ్ళెలా పోయాయో, ఇవన్నీ తెరమీద చూడ్డమే మిగిలిన కథ!

నిస్సందేహంగా ఈ సినిమాలో నటనకు కొద్దిగా అవకాశం ఉంది ఐరేంద్రి పాత్ర వేసిన మంచు లక్ష్మికే! పెద్దగా అందచందాలు డిమాండ్ చేసే పాత్ర కాదు కాబట్టి మరింత బాగా రాణించింది ఈ పాత్రలో మంచమ్మాయి!(మంచు+అమ్మాయి)! ఆమెకు వేసిన మేకప్, మొహంలో ఆ కౄరత్వం,  ఇవన్నీ బాగా పండాయనే చెప్పాలి. అసలే విలక్షణమైన తెలుగు మాట్లాడుతుందాయె! డబ్బింగ్ ఆవిడే చెప్తుందంటే భయం వేసింది కానీ జీ టాక్ షో లోని "అసలు తెలుగుని" కాస్త నివారించి పాత్రకు తగ్గట్టు బాగానే చెప్పింది. అక్కడక్కడా "వివ్ రించి  షెప్పు"(వివరించి చెప్పు )  " కొండ్లూ, కోన్లూ(కొండలూ కోనలూ) అడువులూ తిర్గి ఖనిపెట్ట్ ండి" వంటి మాటలు మాత్రం తప్పించుకోలేం! కానీ అంతకంటే ఘోరంగా ఊహించుకుంటాం కాబట్టి రిలీఫ్ గానే ఉంది డబ్బింగ్! దీన్ని బట్టి అర్థమైందేమిటంటే ప్రయత్నిస్తే ఆ కృతకమైన భాషను వదిలించుకోగలదని!:-))


సినిమా మొత్తం మీద మార్కులెక్కువ పడేది లక్ష్మీ ప్రసన్నకే!

ఆమె చీటికీ మాటికీ చేసే వికటాట్టహాసాలు తెలుగు టీవీ ప్రేక్షకులకు అలవాటే కాబట్టి సినిమాలో వాటిని బాగానే ఎంజాయ్ చేశారు..పైగా పాత్రకి అవసరం కూడా కదా!

సిద్దార్థ పాత్ర చాలా లైట్ గా ఉంది. కోరమీసం లేనివాడిని తెలుగు ప్రేక్షకులు "ధీరుడిగా" ఎలా అంగీకరిస్తారసలు? అది పెద్ద లోపం! కొన్ని ఫైట్లు మినహా అతడి ధీరత్వాన్ని నిరూపించే దృశ్యాలేమీ ఉండవు.పైగా ఎప్పుడెప్పుడు సారా తాగుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. పోనీ అలాగని చిలిపిదనం ఉందాంటే అదీ లేదు.ధీరుడి పాత్రకు అల్లు అర్జున్ అయితే కొంచెం రొమాంటిక్ గా ఉండేదనిపించింది నాకు.(అందం సంగతి పక్కన పెట్టండి)

ఇక శృతి హాసన్ ఒక గాజు బొమ్మలా ఉంది! ఈ హీరోయిన్ల డైటింగ్ లేమో కానీ మరీ శవాకారాలు దాలుస్తున్నారు. మొహంలో కళా కాంతీ లేవు. గట్టిగా పట్టుకుంటే ఎముకలు విరిగి ఢామ్మని కిందపడుతుందేమో అన్నంత బలహీనంగా పాలిపోయి ఉంది. కొన్ని సార్లైతే ఆమె ధరించిన బరువైన దుస్తుల్ని కూడా మోయలేదేమో అన్నంతగా వంగిపోయింది(మోడల్ ఆ అయితే బాగా రాణిస్తుందేమో) మేకప్ కూడా అంతంత మాత్రంగా చేశారు. కళ్ళ నిండా కాటుక పెట్టి ఉంటే కాస్త బావుండేదనిపించింది. ఇంత లేత మొగ్గకి సునీత డబ్బింగ్ సరిగ్గా అమరలేదు. చిన్మయి చేతో సౌమ్య చేతో చెప్పిస్తే బాగుండేది. సునీత కమలిని లెవెల్లో హావభావాలు గొంతులో పలికించడం, శృతి నటనకు మాచ్ కాలేదు.

మొత్తం సినిమా లో గ్రాఫిక్స్ దాదాపు గంటంబావు సేపు ఉన్నాయి. గ్రాఫిక్స్  చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి నిజంగా! క్లైమాక్స్ లో ఐరేంద్రి మహా సర్పంగా మారే దృశ్యాలు చూపు తిప్పుకోనివ్వవు. (మహా సర్పానికి ఐరేంద్రి మొహం ఉంచితే బాగుండేది కానీ సర్పం మొహమే ఉంచేశారు) అలాగే ఐరేంద్రి నీటి కొలనులో దిగినప్పుడల్లా ఆమె కేశాలు సర్పిణి రూపం దాల్చి మాట్లాడ్డం,అలల్లా చుట్లు తిరుగుతూ సర్పాల్లా మెలితిరగడం..ఇవన్నీ చాలా బాగా నచ్చాయి నాకు!


అంతటి మహాసర్పంతో జరిగిన భీకర పోరాటంలో, (అదీ మంత్ర గత్తెతో )హీరో కి పెద్దగా దెబ్బలు తగలకపోగా చివరికి అతడు కొట్టిన ఒకే దెబ్బతో మంత్రగత్తె ఠప్పున నేలకూల్తుంది. తన మంత్రాలేవీ ప్రయోగించదు. హీరో హీరోయిన్లకు కుటుంబాలున్నాయో లేవో చూపించరు. గాలికి తిరుగుతుంటారు.  అలాగే కన్నీటి బిందువు ఆకారంలో ఉన్న రాజ్యాన్ని ఐరేంద్రి స్వాధీనపరుచుకుంటే ఆ రాజ్యం తాలూకు రాజు , మంత్రి ఏమయ్యారో చూపిస్తే బాగుండేది.  విలను రవి బాబు ఒక బలమైన త్రిశూలం లాంటి ఆయుధంతో హీరో రెండు కళ్ళలోనూ సుటీగా పొడిచేస్తాడు.(లేదా కళ్ళు పెకలిస్తాడు)కానీ తర్వాతి దృశ్యాల్లో హీరోకి చూపు పోయి అంధుడవుతాడే కానీ కళ్ళు మాత్రం ఏ మాత్రం దెబ్బ తినవు.చక్కగా పుచ్చ పువ్వుల్లా ఉంటాయి!

ఇలాంటి చిన్న చిన్న(?) లోపాలు తప్పించి ప్రకాష్ దర్శకత్వం బాగానే ఉంది

సినిమాలో హాస్యం కోసం చూడకూడదు. ఒక్క సీను బ్రహ్మానందంతో పెట్టి దాన్ని కాస్తా  అపహాస్యం చేసేశారు.  పాటలు బాగానే ఉన్నాయి. ఒకపాట లో హర్మోనియం వాడటం నాకు బాగా నచ్చింది.

మొత్తం మీద సినిమా బావుంది. పిల్లలు మరీ బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల సినిమాలు ఎంజాయ్ చేసే పెద్దాళ్ళు కూడా!
పైసా వసూల్ అనే అనిపించింది
భయపడకుండా హాయిగా చూసి రావొచ్చు  .

January 5, 2011

ఒక అద్భుత నవల ఎమిల్ జోలా "భూమి"



 ఈ పుస్తకం కోసం దాదాపు పన్నెండేళ్ళు వెదికాను నేను.కొన్ని పుస్తకాల కోసం అలా వెదకాల్సి వస్తుంది మరి! అప్పుడెప్పుడో చదువుకునే రోజుల్లో ఈ పుస్తకాన్ని మా వూరి లైబ్రరీలో ఒక రోజు సగం చదివి మిగతాది రేపు చదువుదామని ఇంటికెళ్ళిపోయాను . మర్నాడు వచ్చి చూస్తే ఆ పుస్తకం కనపడలేదు. వేల పుస్తకాలుండే  మా లైబ్రరీని ఆసాంతం వెదికాను. ఎవరో నొక్కేసినట్లున్నారు. దొరకనే లేదు. ఆ తర్వాత ఎంత వెదికినా, ఎక్కడ వెదికినా దొరకలేదు.

 అప్పట్లో నేను చదివిన కాపీకి లైబ్రరీ సంప్రదాయం ప్రకారం ముందు పేజీ లేకపోవడంతో  పబ్లిషర్స్ ఎవరో కూడా తెలీలా! రచయిత, అనువాదకుడి పేరు ఆధారంగా వెదికాను.ఎన్నో పాత పుస్తకాల షాపులు తిరిగాను.లెనిన్ సెంటరంతా జల్లెడ పట్టాను. ఊహూ! ఆ పుస్తకాన్ని పబ్లిషర్స్ మళ్ళీ ముద్రిస్తారనే నమ్మకం లేదు. అది చదవకుండానే జీవితం ముగిసిపోతుందేమో అని దిగులు వేసింది. ఆ పుస్తకం సగమే చదివానన్న ఒక  ఖాళీతనం, శూన్యత్వం  అలా మనసులో ఒక మూల ఉండిపోయింది. చివరికి ఒక శుభ ముహూర్తాన,విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి "దొ..రి..కిం..ది , భూ.....మీ" అని చెప్పడంతో కథల్లో రాసినట్లు నా చెవులను నేనే నమ్మలేకపోయాను! చెక్కు చెదరని స్థితిలో చక్కగా నా చేతికొచ్చిన ఆ పుస్తకమే...  

"భూమి"..! 

ఎమిల్ జోలా రాసిన ఫ్రెంచ్ నవల. 

ఎమిల్ జోలా గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు! తెలీకపోతే గూగులించండి, టైమున్నపుడు. ఈ నవలకు సంబంధించి మాత్రం జోలా గురించి చెప్తాను. గ్రామీణ నేపథ్యంలో భూమి కోసం మనుషుల మధ్య, సొంత కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంఘర్షణ ని జోలా ఇందులో చిత్రించినట్లు  రైతు జీవన చిత్రణ ఇంకే ఇతర నవల్లోనూ కనపడదు. ఈ నవల రాయడానికి ఆయన గ్రామీణ నేపథ్యం ఉండాలని, అక్కడి మనుషుల్ని,పరిస్థితుల్నీ చదవాలని ఒక గ్రామంలో ఇల్లు కొనుక్కుని కాపరం పెట్టాడు. కొన్నాళ్ళయ్యాక అక్కడ మునిసిపల్ కౌన్సిలర్ గా కూడా పని చేశాడు. ఫ్రెంచ్ వ్యవసాయం మీద, రైతాంగ తిరుగుబాట్ల మీద పరిశోధన చేశాడు.కొడుకులు, మనవలు ఇలా వంశపారంపర్యంగా భూమిని పంచుకుంటూ పోతే అది ఎలా చీలికలైపోతుందీ,,దానివల్ల మానవ సంబంధాలెలా ప్రభావితమవుతాయీ ఇవన్నీ ఈ నవల్లో ఎంతో అద్భుతంగా ఆవిష్కృతమవడానికి ఆయన అధ్యయనమే కారణం! .పూసలలో దారంలా కథను అనుసరిస్తూనే అనేక సమస్యలు సాగుతాయి నవలపొడుగూతానూ! !


భూమి నవల్లో ఒక పరిపూర్ణమైన కథ కనిపిస్తుంది. ఒక పెద్ద కథ!

ఎంతో కొంత భూమి చేతిలో ఉన్న సంప్రదాయ వృద్ధ వ్యవసాయదారుడు పువాన్. భార్య రోజ్! వాళ్ళకి ముగ్గురు పిల్లలు ....జీసస్,బ్యుతో కొడుకులు కాగా, ఫానీ కూతురు! వృద్ధాప్యం మీద పడ్డ కారణంగా ఆయన తన భూమిని ముగ్గురు పిల్లలకూ పంచడంతో కథ ప్రారంభమవుతుంది. ముగ్గురిలో కొంత రౌడీ వేషాలున్న బ్యుతోకి ఈ పంపకాల వాటాలు నచ్చక అసలు భూమే తీసుకోనంటాడు. పెళ్ళీ పెటాకులూ లేకుండా ,తాగి జులాయిగా తిరుగుతుండే జీసస్ మాత్రం "దీన్ని అమ్మితే ఎన్నాళ్ళు తాగొచ్చా"అని ఆలోచిస్తూ ఇచ్చింది తీసుకుంటాడు. పువాన్ తమ్ముడు మోషేకి ఇద్దరు ఆడపిల్లలు. లిజా,ఫ్రాంస్వాజ్ లు! మోషే మరణించడంతో ఇద్దరూ కష్టపడి వాళ్ళకున్న కొద్ది భూమినీ సాగుచేసుకుంటుంటారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ.బ్యుతో లిజా ని గర్భవతిని చేసి వదిలేస్తాడు(యురోపియన్ సమాజంలో చెల్లెలు వరసైన స్త్రీతో సంబంధం పెట్టుకోవడం తప్పుకాదు)  

మరొక భూస్వామి కమతంలో పని చేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్ మీద ప్రేమ పెంచుకుంటాడు. కానీ గర్భవతి అయినా లిజాను పెళ్ళాడితే తను కూడా స్థిరపడవచ్చన్న  చిన్నపాటి స్వార్థంతో లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు ! అంతలో బ్యుతో వచ్చి లిజాను వివాహమడతానని  ఒప్పుకోవడంతో  తన పనుల్లో తాను పడతాడు జాన్! లిజాను పెళ్ళాడి వాళ్ళింట్లోనే కాపరం పెట్టిన బ్యుతోకి పదహారేళ్ళ ఫ్రాంస్వాజ్ ని సైతం సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. అతడిని  అసహ్యించుకుంటూ నిరంతరం తన్ను తాను రక్షించుకుంటుంది ఫ్రాంస్వాజ్! అతడు కనపడితే చాలు ఒళ్ళు మండిపోతుంది ఆమెకి!

రోజ్ మరణంతో (  రోజ్ మరణానికి కారణం బ్యుతోనే! తల్లితో దెబ్బలాడి ఒక్క తోపు తోయడంతో కిందపడి గాయాలపాలై మరణిస్తుంది ) ఒంటరి వాడైన పువాన్ కి ఒప్పందం ప్రకారం నెల నెలా ఇవ్వాల్సిన డబ్బు,ధాన్యం ఇవ్వడం మానేస్తారు జీసస్,బ్యుతోలు! ఫానీ తన వద్ద వచ్చి ఉండమంటుంది కానీ ఆవిడ పరిశుభ్రతా నియమాలు తట్టుకోలేక పారిపోతాడు పువాన్.అతడి దగ్గర మిగిలున్న కాస్త డబ్బూ కాజేయడానికి తన వద్దకు రమ్మంటాడు జీసస్.అతడి ఇల్లొక మురికి కూపం! అక్కడ ఉండలేకపోతాడు పువాన్.గతిలేక వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని భరించలేక బ్యుతో ఇంటికి చేరతాడు. అక్కడ అనుక్షణం బ్యుతో ఫ్రాంస్వాజ్ ని  లొంగదీసుకుని అత్యాచార ప్రయత్నాలు చేయబోవడం చూసి సహించలేకపోతాడు.

 ఆ పిల్ల పడే యాతన ఊరంతటికీ తెల్సు. ఇల్లంతా ఈ విషయమై గొడవలు, లిజాకి బ్యుతో చేతిలో తన్నులు! తన మొగుడితో గడపడానికి ఒప్పుకోమని చెల్లెలికి లిజా వేడుకోళ్లు. 

ఇహ బ్యుతో బాధలు పడలేక అతడిని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్ ని పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! మరదలు,ఆమె భూమీ తనకి దక్కకుండా పోయినందుకు పీక్కుంటాడు బ్యుతో!లిజా,ఫ్రాంస్వాజ్ ల మధ్య శతృత్వం ప్రారంభమవుతుంది.ఒకరికొకరుగా బతికిన ఆ ఇద్దరూ ఆస్థి వల్ల బద్ధ శత్రువులైపోతారు. ఫ్రాంస్వాజ్ గర్భవతి అవుతుంది. ఆమెకు పిల్లలు లేకుండా చేస్తే ఆమె భూమికి తామే వారసులమవుతామని లిజా, బ్యుతో ఆలోచించి ఒక మూఢ నమ్మకం ప్రకారం ఆమె పొట్టమీద శిలువ ఆకారంలో చేత్తో గీయాలని నిర్ణయించుకుంటారు.

ఒంటరిగా పొలానికొస్తున్న ఆమెను బ్యుతో అటకాయిస్తాడు.ఆమెపై అత్యాచారం చేసాడు.అందుకు లిజా సహకారం! 

అక్కాచెల్లెళ్ళ మధ్య భీకర పోరాటం! ఆవేశంలో లిజా  తోసిన తోపుకు  ఫ్రాంస్వాజ్ కొడవలిమీద పడుతుంది . ఈ ఘాతుకాన్నంతా గడ్డివాము వెనుకనుంచి పువాన్ చూస్తాడు. ఫ్రాంస్వాజ్ మాత్రం పట్టుతప్పి కొడవలిమీద పడ్డానని అందరికీ చెప్పి మూడురోజుల తర్వాత మరణిస్తుంది. ఆస్థి మొత్తం లిజా బ్యుతోలపరమవుతుంది. 

ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న బ్యుతో దంపతులు అతడినీ హతమారుస్తారు. 
జాన్ ఒంటరివాడైపోతాడు. ఫ్రాంస్వాజ్ ఆస్థి తనపేరుపై రాయనందుకు  నొచ్చుకున్నా, ఇక అక్కడ  ఉండబుద్ధి కాక యుద్దంలో  చేరేందుకు వెళ్ళిపోతాడు!

ఇంకా ఈ నవల్లో అనేక పాత్రలు కనిపిస్తాయి. పువాన్ సోదరి లగ్రాంద్,ఊళ్ళోని మరో భూస్వామి అలెగ్జీ, అతనిమీదా అతని కమతం మీదా పెత్తనం చెస్తూ పరాయి మగాళ్ల కోసం పాకులాడే దాసీ జాక్ లిన్, పట్నంలో వ్యభిచార గృహం యజమనిగా జీవితాన్ని గడిపే కూతురు ప్రభావం మనవరాలు మీద పడకుండా ఆ పిల్లను ఒకమేదకురలిగా పెంచే చార్లెస్, ఎలొదీ...ఇంకా ఊళ్ళోని పెద్దమనుషులూ..ఎన్నో పాత్రలు! అన్నీ పొలం చుట్టూనే తిరుగుతూ భూమికి సేవ చేయడానికి పరితపించే పాత్రలే! అంతే కాదు ..వీళ్ళు భూమి కోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. పగలూ కక్షలూ పెంచుకుంటారు. అత్యాచారాలకు, హత్యలకు పాలపడతారు. ఒక ఇంటిమనుషులే బద్ధ శత్రువులైపోతారు. అందరు కలిసినపుడు సంప్రదాయం ప్రకారం తాగి తందనాలాడతారు.  

ప్రతి పాత్రనూ ఎమిల్ జోలా తీర్చిదిద్దిన పనితనం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది.ఇక్కో పాత్ర మనోగతం ఆ పాత్ర చుట్టూనే నవలంతా తిరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది చదువుతుంటే. ఆస్థి పిల్లలకిచ్చి దిక్కులేని చావు చచ్చిన భూస్వామి పువాన్ లాంటి వృద్ధులు మన చుట్టూ ఉన్నారేమో అని వెదకబద్ధేస్తుంది.(పెద్దగా వెదక్కుండానే కనపడతారు)  తన పేరుమీద కొంతైనా ఆస్తి దాచుకోకుండా పిల్లలకు సర్వం సమర్పించే తల్లి దండ్రులకు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే గతి పడుతుందన్న సత్యం ఈ నవలలో పువాన్ కథ రుజువు చేస్తుంది.

ఫ్రాన్స్ లోని పొలాల వర్ణనా,ఆ వ్యవసాయ క్షేత్రాల వాతావరణం,వాళ్ళ తిండీ తిప్పలూ ఇవన్నీ కథ తాలూకు చిక్కని పరిమళాన్ని అద్దుకుని మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి.అదే సమయంలో యూరోపియన్ సమాజపు వావీ వరసలేని విచ్చలవిడి శృంగార సంబంధాలు వెగటు పుట్టిస్తాయి కొన్ని చోట్ల! 

ఫ్రాంస్వాజ్ తనకంటే పదిహేనేళ్ళు చిన్నదన్న ఎరుకతో ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఆమ పట్ల తన ప్రేమను తెలియపర్చాలన్న జాన్ తహతహ చాలా సున్నితంగా కనిపిస్తుంది. మరో వైపు  జీవితంలో అనుక్షణం అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యాచారం జరిపిన క్షణాల్లో ఫ్రాంస్వాజ్ పరవశించి ఆనందించడం పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది. బ్యుతోని తాను తీవ్రంగా అసహ్యించుకున్నప్పటికీ తాను ప్రేమించింది అతడినే అని  గ్రహించి సిగ్గుతో కుంచించుకుపోతుంది.   తన ఆస్థిని సైతం జాన్ పేరుమీద రాయక తన చావుకి చారకురాలైన అక్కకే వదిలి పోయి అందరిలోకీ ప్రేమాస్పదురాలిగా మిగిలిపోతుంది.

అడుగడుగునా స్వార్థపరులైన మనుషులు .రైతుల మొండితనం, మూర్ఖత్వం,స్వలాభం,కృతఘ్నత, కుట్ర   ,మోసం,దగా ఇలాంటి వాటినన్నిటినీ వాళ్ళ కఠోర శ్రమ,కటిక దారిద్ర్యాల వెలుగులో సరిగ్గా అర్థం చేసుకోవాలని ముందుమాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాటన్నిటికీ ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ గుణాల ఆధారంగా వాళ్ళని అసహ్యించుకోకూడదంటాడు.
వాళ్ళని "చెడ్డవాళ్ళు" గా కాక మామూలు మనుషులుగా అర్థం చేసుకోవాలంటాడు

ఈ నవలకోసం జోలా అనేక విషయాలపై సేకరించిన నోట్సు  కట్టలు కట్టలుగా  పారిస్ నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉందట!

ఎమిల్ జోలా రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నవల ఒక్కటీ ఒక ఎత్తు! ఆయన అభిమాన రచన కూడా!

భూమే ఈనవల్లో నాయకుడు,నాయిక,ప్రతినాయిక,అన్నీ!దాని చుట్టూ పాత్రల్లనీ తిరుగుతాయి తప్ప వాటి కంటూ ఇతరత్రా సాధించాల్సిన జీవన సాఫల్యమంటూ ఏమీ కనపడదు.రుతువులు,పంటలు,ఊడ్పులు,కోతలు,నూర్పిళ్ళు, అతివృష్టి,అనావృష్టి..ఆధునిక పరికరాలవల్ల జీవనోపాధి కోల్పోయే కూలీలు ...సర్వం ఈ నవల్లో అత్యద్భుతంగా వర్ణితమవుతాయి.  

ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని పుస్తకాల్లో ఈ నవలకు తప్పక చోటు దొరుకుతుంది. సహవాసి గారి అనువాదం సంగతి మళ్లీ మళ్ళీ చెప్పడం అబ్బురపడటం అనవసరం! కానీ చెప్పకుండా ఉండలేనంత సహజత్వం, అందం! ! 

అచ్చతెలుగు గ్రామీణ పదాలు, మాండలికాలు ఫ్రెంచ్ నవల అనువాదంలో వాడుతూనే కథ నేటివిటి ఏ మాత్రం చెడకుండా తీర్చి దిద్దడం చూస్తే  సాక్షాత్తు అనువాదకుడే ఫ్రాన్స్ వెళ్ళొచ్చి ఈ నవల రాసాడా అనిపించక మానదు. బాటిల్స్ అనేమాట వాడాల్సిన చోటల్లా అనువాదకుడు "బుడ్లు" అనేమాట వాడతాడు. అలాగే "ఇటు వచ్చేతలికి(వచ్చేసరికి)" "పడ్డ"(గేదె) ,"మూడడుగులకోతూరి ( మూడడుగులకోసారి)..ఇలా అనేక పచ్చి తెలుగు పదాలు తగులుతుంటాయి. స్వేచ్చానువాదం లో రారాజు సహవాసేనని ఒప్పేసుకుంటూ  ఇంకోసారి టోపీలు తీసేస్తున్నా!

అయితే ఈ నవల వెలువడిన 50 ఏళ్ళ తర్వాత ఎమిల్ జోలా  అల్లుడు నవల్లో వర్ణితమైన గ్రామానికి వెళ్ళాడట. ఆ నవల్లో ఉన్నవన్నీ స్వార్థం మూర్తీభవించిన పాత్రలు కాబట్టి,వాటికి మోడళ్ళు ఆ గ్రామస్థులే కాబట్టి వాళ్ళేమైనా నొచ్చుకున్నారేమో అని విచారించాడు. ఆ నవల గ్రామస్థులందరికీ పరిచితమే! కొట్టిన పిండే !

అయితే వాళ్ళు తమ పల్లెను, పల్లీయుల్ని దారుణంగా పోల్చాడని కించిత్తైనా ఎమిల్ జోలా మీద కోపం తెచ్చుకోలేదట. కానీ ఎవరికి వారు ఆయా పాత్రలతో తమను మాత్రం పోల్చుకోకుండా "ఫలానా చెత్త పాత్ర మాత్రం..అదిగో ఆయనదే"అంటూ ఇరుగు పొరుగుల్ని మాత్రం చెత్త పాత్రలతో ఇట్టే పోల్చేశారట.

ఈ నవలను  1983 లో వేసింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. మళ్లీ ఇంతవరకు వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలీదు. కాని ఇలాంటి అత్యద్భుతమైన  పుస్తకాలను మళ్లీ మళ్లీ  జన బాహుళ్యంలోకి   తీసుకొచ్చి పాఠకులకు  ఉత్తమప్రపంచ సాహిత్యాన్ని అందుబాటు లో ఉంచాల్సిన బాధ్యత మంచి పబ్లిషర్లు తీసుకోవాలి  . వాటికి  పాఠకాదరణ  తప్పకుండా ఉంటుంది కూడా. వనవాసి నవల కు లభించిన ఆదరణే  ఇందుకు తార్కాణం!

ప్రస్తుతం  ఈ పుస్తకం బయట ఎక్కడా లభ్యం కావడం లేదు.  అప్పట్లో కొని దాచుకున్న వారి వద్ద తప్ప! 

నా కలెక్షన్లో ఉన్న ఒక అద్భుతమైన నవల ఎమిల్ జోలా భూమి! దొరికితే మాత్రం చదివే అవకాశం వదులుకోవద్దు!