February 24, 2011

బాపు మనసుకు శాంతి లభించు గాక !





రమణ లేని బాపు ! 

 అవును, ఇక బాపు .......రమణ లేని బాపు! 


పొద్దున్నే ఐదుంపావుకి చల్లని వేళ....పాటలు వింటూ వాకింగ్ కెళ్తుంటే అరిపిరాల గారి నుంచి వచ్చిన మెసేజ్ నిజంగా ఒక్క క్షణం అర్థం కాలేదు. "mullapudi venkata ramana no more" అని కనపడుతోంది ఫోన్లో! అర్థమైన మరుక్షణం మనసులోకొచ్చిన ఆలోచన

"మరి బాపు...? బాపుకెలా ఇప్పుడు? బాపు... బాపు"

ఎంతమంది అదృష్టవంతులుంటారిలా? బాపులా?.....రమణలా......!

సృష్టిలో తీయనిది స్నేహమే నని (ఆ మాటంటే వాళ్ళొప్పుకోరు.."తీయనిది  ఎందుకైందీ? మేం తీసేశాం" అంటారు) నిరూపించిన సజీవ సాక్ష్యాలు వాళ్ళు!

చిన్న నాటి స్నేహాన్ని ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా నిలుపుకునేవారుంటారేమో!

కాని ఒకటే మాటగా, ఒకటే జీవితంగా, ఒకటే ఆలోచనగా ఒకే చోట ఒకే వూర్లో కుటుంబాలతో సహా కల్సిపోయి విడదీయలేని జంటగా బ్రతికిన అరుదైన మనుషులు వాళ్ళు.

బుడుగు, రాధ, గోపాలం,బామ్మ, పంచవటి కాలనీ,.........మధ్య తరగతి సౌందర్యాన్ని తన కళ్ళతో.... బాపు కుంచెతో ఆవిష్కరించిన వాడు, ఏడుపదులు దాటిన వయసులో హైస్కూలు కుర్రాడిలా  కోతికొమ్మచ్చి ఆడుతున్నవాడు,ఎంత ఎదిగినా మధ్యతరగతిలో ఒదిగిన వాడు....

ఒక్కోసారి కొన్ని సంఘటనలు అలా జరిగిపోతుంటాయి. జీవితకాలం లేటైపోతుంటాయి. ఈ మధ్య శంకర్ గారి బ్లాగులో చదివినపుడు "అవును, ఇప్పటికే ఆలస్యం చేశా! ఈ సారి చెన్నై వెళ్ళినపుడు వీళ్ళిద్దరినీ చూడాలి" అనుకున్నాను!

చాలా చాలా ఆలస్యమైపోయింది. ఇక కలవాలని లేదు. రమణ లేని బాపునీ, బాపు లేని రమణ నీ ఊహించుకోలేం కదా!

మనం సరే,  బాపు?

ఏదో ఆలోచన బుర్రలో మెరిసిన క్షణాన "అది కాదు రమణా." అంటూ పక్కకి చూస్తారేమో!

రమణ గారి ఫోన్ కి రింగ్ చేసి "అరె....ఇక రమణ లేడుగా"అని ఉస్సురని కూలబడతారేమో!

అయ్యో, బాపు గారూ , ఎలా? ఎలా? ఎలా మీ బాధను పంచుకోవడం?

 వాళ్ళిద్దరినీ , ఒకే చోట వాళ్ళిద్దరినీ చూసినపుడు  నాకు ఈపాట.గుర్తొస్తూ ఉండేది

రమణ ఇక లేరు

బాపు మనసుకు శాంతి లభించు గాక !

February 19, 2011

మహా శివతాండవం-నయన మనోహరం




ఈ ఫిబ్రవరి నెల్లో చక్కని సంగీత నాట్య ప్రదర్శనలు చూసే అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది  నాకు ! Times Hyd festival తర్వాత నాట్య తరంగిణి వాళ్ళ ప్రదర్శనలు వరుసగా! మంచి తరుణం మించితే దొరకదు కాబట్టి పన్లు వాయిదా వేసి మరీ చాలా వరకూ అటెండ్ అయ్యాను. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియం లో రాజా రాధా రెడ్డి బృదం కూచిపూడి ప్రదర్శన "మహా నటం" రూపకం ....జరిగింది.



భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇలాంటి కళా ప్రదర్శనలని అప్పుడప్పుడూ చూస్తేనే గానీ సార్థకత లేదనిపించేంత అద్భుతంగా ఉంది.



అరవై పై బడ్డ రాజారెడ్డి గారి వేగం, అమితమైన ఎనర్జీ లెవెల్స్ అబ్బరపరిచాయంటే నమ్మండి. రాధారెడ్డి ఆహర్యంలోనూ, కదలికల్లోనూ వార్థక్యపు జాడలు అనివార్యమైనా....అద్భుతమైన అభినయం వాటిని దాదాపుగా మరుగు పరిచింది .





వాళ్ళ కుమార్తెలు యామిని, భావన మిగతా శిష్యులు శ్లోక వైద్యలింగం, అల్ల ఆర్థర్,అపర్ణ కృష్ణ,చిత్కళా బాలన్,నేహా కృష్ణ, షాం కె సంసి,జ్యోతి,...ఇక్కడున్న ఫొటోల్లో వీళ్ళంతా ఉన్నారు.


ప్రమథ గణాల ప్రణతులు, మనోహరమైన ప్రకృతి మధ్య  పార్వతీ శంకరులుగా రాజా రాధా రెడ్డి అపూర్వంగా నాట్యం చేశారు. శివుడు గా రాజారెడ్డి అరగంట సేపు చేసిన తాండవం ఆడిటోరియాన్ని ముందు పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంచినా ఆ తర్వాత కరతాళ ధ్వనులతో నింపేసింది. ఎక్కువ చెప్పడం కంటే..... ఫొటోలు చూడండి!





ఆ బ్రహ్మకుమార్ ఆడిటోరియం కాస్త జనాలకు తెలిసే చోట, కాస్త ఊరిమధ్యలోనూ ఉంటే ఇంకా ఎక్కువమంది వచ్చేవారేమో! ఆడిటోరియమ్ లో వెనుకవరసలన్నీ ఖాళీగా ఉండిపోవడం ఆశ్చర్యపరిచింది. 



విదేశీ నృత్యప్రదర్శనలకిచ్చిన కవరేజ్ వార్తా పత్రికలు కూచిపూడి ప్రదర్శనకివ్వకపోవడం కొంచెం అసంతృప్తిని మిగిల్చిన విషయం!

February 8, 2011

బజే సర్గమ్ ....భారతీయ కళలు,సంస్కృతి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టే గీతం


మిలే సుర్ మేరా ఐక్యతా గీతం తర్వాత దూరదర్శన్ బంగారు రోజుల్ని గుర్తుకు తెచ్చే మరొక గీతం "బజే సర్ గం"! మీలో చాలామంది చూసే ఉంటారు.

వీలైనంత మంది భారతీయ సంగీత కళాకారుల,నాట్యకారుల సేవలని ఇందులో ఉపయోగించుకున్నారు.గీతం ఉద్దేశం కూడా వివిధ కళలకు ఆలవాలమైన భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో,చెప్పడమే! దానివల్ల ఐక్యత వెల్లివిరియాలనే!

మొదలే తండ్రీ కొడుకులు అల్లా రఖా,జాకీర్ హుస్సేన్ ల తో అద్భుతంగా ప్రారంభమయ్యే ఈ పాటలో ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్,మల్లికా సారాభాయి,స్వప్న సుందరి,ప్రతిమా గౌరి బేడి, కవితా కృష్ణ మూర్తి,భీమ సేన్ జోషి,బాల మురళి,హరిప్రసాద్ చౌరసీయా,పండిట్ రవిశంకర్, పండిట్ శివకుమార్ శర్మ ఇంకా అనేకమంది కళాకారులు పాలు పంచుకున్నారు.




భరతనాట్యం,కూచిపూడి,మోహినీ అట్టం,కథాకళి,ఒడిస్సీ,మణీపురి నాట్యరీతులు,వీణ,వయొలిన్,సారంగి,కర్ణాటక హిందుస్థానీ గాత్ర సంగీతాలు, అన్నీ ఈ గీతంలో ప్రతిబింబిస్తాయి.

బాలమురళి మిలే సుర్ మేరా లో తమిళ గీతం ఆలపించినా ఇందులో మాత్రం

 "నలుదెసల రాగముదయించెను
గజ్జెలు ఘల్లన లయగ పలికెను 
గొంతులెల్ల భావముగ పాడెను
ఇది దేశ రాగ భావ సమ్మేళనం" అంటూ భావయుక్తంగా పాడి,ముక్తాయింపుగా వయొలిన్ మీద ఒక చెణుకు విసురుతారు చూడండి!  అద్భుతం నిజంగా



అయితే ఈ గీతం మిలే సుర్ పాటలాగా జనంలోకి చొచ్చుకుపోలేకపోవడానికి కారణం ఇందులో జన జీవిత రీతులు కాక,కళా రూపాలు మాత్రమే చోటు చేసుకోవడమే అనుకుంటాను.

అయితేనేం, ఈ గీతాన్ని చూస్తుంటే మన కళా వారసత్వం,భిన్నత్వం,ఔన్నత్యం ఇంకెక్కడా లేవంటే లేవని గర్వపడేలా కళ్ళు చెమరుస్తాయి.

భీమ్ సేన్ జోషి స్వరంలో పరవళ్ళు తొక్కిన గమకాలు,బాలమురళి గొంతులో పలికిన భావాలు,రవిశంకర్ సితార ఒలికించిన హొయలు,...ఎంత గొప్పగా ఉన్నాయో ఆస్వాదించండి.

హరిప్రసాద్ వేణువు నుంచి వెలువడే ఆ తరంగాలు మన హృదయాలలోకి ప్రవహిస్తుంటే "మురళీ ధరా నీ స్వర లహరులలో మరణమైనా మధురమురా" అనిపించక మానదు

ఈ కళలన్నీ భారత దేశ సంప్రదాయమనే సాగరంలో కలిసే నదులే అన్న సందేశం ఈ పాటలో ఉంటుంది. అందుకేనేమో ఈ పాటని "దేశ్" రాగంలో రూపొందించారు.

ప్రతి కమర్షియల్ ఛానెల్ లోనూ కనీసం వారానికి రెండు సార్లైనా ఈ గీతాలు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేస్తే ఎంత బాగుంటుంది!అలా చేసి తీరాలని ఒక జీవో నో పాడో తెస్తే ఎంత బాగుంటుంది!

ఒక్కసారి ఈ పాటను అవలోకించి చెమర్చిన కళ్ళతో భారతీయ సంగీత, నాట్య రీతులకు  సలామ్ కొట్టండి