నామిని నెంబర్ వన్ పుడింగా? ఏమో!  

Posted by సుజాత in


నామిని కొత్త పుస్తకం వచ్చిందనగానే ఆయన భాషలో చెప్పాలంటే ఆడెగిరి ఈడ దూకినంత పని చేసి ఆ పుస్తకం సంపాదించా!(నేను చదివేటప్పటికి మార్కెట్లోకి రాలేదు!ఇప్పుడు వచ్చేసి ఉండొచ్చు)కానీ ఈ పుస్తకంతో నామిని నా లాంటి అభిమానులకు ఇంకా చెప్పాలంటే వీరాభిమానులకు చాలా నిరాశ కలిగించాడు. (రచయితకూ అభిమానులకూ మధ్య ఉండే చనువు కొద్దీ "డు" అంటున్నా)

"నా ఇష్టం" తో వర్మ ఏమైనా inspiration ఇచ్చాడేమో గానీ ఇందులో నామిని తను చేసిన చెత్త పనులన్నీ "మొగలాయితనం"కింద లెక్కేసి చెప్పుకున్నాడు. నామిని పుస్తకాలన్నీ ఆయన జీవిత చరిత్రే! పచ్చనాకు సాక్షిగా,సినబ్బ కతలు,,మిట్టూరోడి కతలు ఇవన్నీ వరసగా పేరిస్తే నామిని జీవిత కథ సగం!ఆంధ్రజ్యోతి వీక్లీకి ఎడిటర్ అయిన తర్వాత నామిని కతేమయింది? ఆయన తిరప్తి పోయి ఏం చేశాడు? జీవనం ఎలా గడిచింది? ఈ ప్రశ్నలన్నింటికీ నామిని ఇందులో జవాబులు చెప్తాడు.

ఈ క్రమంలో నామిని కి సహాయం చేసిన వాళ్ళూ ,చెయ్యని వాళ్ళూ,చులకనగా మాట్లాడిన వాళ్ళూ,అందరి గురించీ రాశాడు. కొంచెం కూడా వెనకాడలా! ఇదంతా బాగానే ఉంది.

"నా జీవితంలో ఇలా జరిగింది" అని చెప్పడంలో తను చేసిన పనుల పట్ల confession ఉందా అనే మాటకు జవాబు దొరకదు.

అయితే కొంతమంది గురించి నామిని చేతికొచ్చినట్టు రాయడం నాకు నచ్చలా! ముఖ్యంగా ఇల్లేరమ్మ కతలు రాసిన సోమరాజు సుశీల గారి గురించి ఆయన ఈ పుస్తకంలో చాలా చోట్ల అనేక "విసుర్లు" విసిరారు! ఎందుకంటే ఆవిడ ఆంధ్ర జ్యోతి మూతపడి నామిని నిరుద్యోగిగా మిగిలినపుడు, కంప్యూటర్ కొనిమ్మని అడిగినపుడు "ఏనుగు పడిందండీ! ఏనుగే లేవాలి. ఎవరూ లేపలేరు" అన్నందుకు! అయితే అంతకు ముందు ఆవిడ చేసిన ఆర్థిక సహాయాన్ని కూడా నామిని ప్రస్తావించాడనుకోండి.

సుశీల గారి భర్త బూతులు తిట్టడం...ఇలాంటివి తెలుసుకోవాలని పాఠకులెవరూ అనుకోరు! అలాగే నామిని శ్రీమతి అత్తగారిని సరిగా చూడకపోవడం, ఆ వంక పెట్టుకుని ఆయన భార్యను కొట్టడం,మామగారి మొహం మీద ఉమ్మేయడం ఇలాంటి వాటిని "ఓపెన్ గా రాసుకున్నా"అనుకోడానికే కానీ పాఠకుల దృష్టిలో ఆసక్తి కరమైనవీ కాదు! ఇలాంటివి బలవంతాన పాఠకుల చేత ఎందుకు చదివించడం? "నా జీవితాన్ని నేను రాసుకున్నా" అని మొండికి తిరుక్కుంటే ఏం చేయలేం!

ఆయన పుస్తకాలు అమ్మడానికి ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని డబ్బులు సంపాదించాడో, ఆ డబ్బులతో రియల్ ఎస్టేట్లో దిగి ప్రస్తుతం కోటీశ్వరుడిగా ఎలా మారిపోయాడో చెప్పడం బాగానే ఉంది కానీ అందులో స్వోత్కర్ష పాళ్ళు మరీ ఎక్కువై పోయాయి.నామిని పుస్తకాల్లో ఉండే "చదివించే లక్షణం" ఈ పుస్తకంలో కనిపించలేదు కదా, మధ్య మధ్యలో "ఏందీ గోల" అని పుస్తకం వదిలేసి లేచెళ్ళిపోదామనిపించింది.

ఇహ ఇతర రచయితల పుస్తకాల మీద నామిని అమూల్యాభిప్రాయాలు చదివి తీరాలి. ఆ అభిప్రాయాలు చెప్పడంలో ఏదైనా హాస్యం,చమత్కారం ఉందేమో అని వెదకబోయాను కానీ...అబ్బే! కనపళ్ళా!

కేశవ రెడ్డి "ఇంక్రెడిబుల్ గాడెస్" అని రాయలసీమ పల్లెటూరి కథకు పేరు పెట్టడం,పులికంటి కృష్ణా రెడ్డి "కోటిగాడు స్వతంత్రుడు"అని పెట్టడం గానీ ఈయనకు నచ్చలేదు. పల్లెటూళ్ళ గురించి రాసే సాహిత్యమంతా చచ్చినట్టు ఆ మాండలికంలో ఉండి తీరాలట. కొటేషన్స్ లో ఉండే మాటలూ,(డైలాగులు),కొటేషన్స్ బయట ఉండే మాటలు(రచయిత నెరేషన్) రెండూవేర్వేరు గా ఉండకూడదట.

కేశవరెడ్డి గానీ,కారా,చాసో,ఎవరి రచనలనీ తను "మతింపు"చేయలా అని చెప్పుకోడం! ఇదివరలో ఇలాంటి మాటలు నామిని వాడలా! ఈ పుస్తకం రాసిన "పుడింగి నామిని"నాకు పూర్తిగా కొత్త!

"అమ్మ పైరుగాలిరా,అది మన ప్రాణవాయువురా"అని గజల్ శ్రీనివాస్ పాడితే..ఊహూ.."అవి పోయి పజ్యాలా"అనిపించిందిట. ఇహ వంశీ పసలపూడి కథలైతే "ఒట్టి పోరంబోకు కతలమాదిరిగా" అనిపించాయి నామినికి . ఆ కతల్లో మాటి మాటికీ వచ్చే ఇంటిపేర్లు తప్ప రంగు రుచి వాసన ఏవీ లేవుట. పుస్తకంలో చాలా భాగం ఇవే మాటలు!

"నేను డబ్బు కోసం పుస్తకాలు రాయలేదు"అంటూనే పుస్తకాల వల్ల ఎంత డబ్బు వచ్చిందో చెప్తాడు. చివర్లో చెప్పిన సాహిత్య బీరువా అయిడియా భరించలేకపోయాను నేను.అందరు రచయితలనీ ఎద్దేవా చేయడమే! గొప్ప పుస్తకాలుగా పేరు పడ్డవి మాత్రమే సాహిత్యం కాదు, అని నిష్టూరపడటం తెలుస్తోంది గాని అందులో వెక్కిరింపు పాళ్ళు ఎక్కువై వికటించింది.

అసలు నామిని ఉక్రోషం,కోపం ఎవరిమీదో ప్చ్ ....ఏదో, మామూలు పాఠకురాలిని....గ్రహించలేకపోయాను.!

ఈ పుస్తకం లక్ష్యమేమిటో ఆయన దగ్గరి స్నేహితులకు,గొప్ప విమర్శకులకు తప్ప అంతుపట్టదు.

ఏనుగు పడింది! ఏనుగే లేచింది. కానీ ఇలా పడి లేచిన ఏనుగులెన్నో ప్రపంచం నిండా చాలా ఉంటాయి. కానీ ఈ మాదిరి "తిమురు" తో ఘీంకరించవనుకుంటున్నా!

బహుశా ఈ పుస్తకం లో ఉన్న కంటెంట్ వల్ల కాబోలు బాపుని బొమ్మలేయమని అడిగినట్టు లేదు నామిని! ఒక్క బొమ్మకూడా లేదు.

ఇహపై ఇలాగే రాస్తే నామిని పుస్తకాల్ని అభిమానులు పక్కన పెట్టడానికి ఇదే మొదటి పుస్తకమవుతుంది.