ఏమిటో ఎండాకాలం రాగానే అంతా ఆవకాయ ఆవకాయ అని ఆవకాయ మానియా పట్టుకున్న వాళ్లలా కలవరిస్తున్నారు. కొత్తావకాయ మహారుచి, ఘాటూ కాబట్టి ఆవకాయ పెట్టిన కొత్తల్లో ఎన్ని వెరైటీలు చేసినా, ఎన్ని కూరలు చేసినా ఇంట్లో వాటికి సేల్సే ఉండవు. ఆ కొత్త మోహంలో మొదట మొదట లాగించేసినా వర్షాలు మొదలయ్యేసరికి ఆవకాయ డిమాండ్ కాస్తా ఢామ్మని పడిపోతుంది.
కానీ ఈ మాగాయ ఉందే..ఇది అలాక్కాదు!
మాగాయ పెట్టిన మొదటి రోజు నుంచి ఇంగువ ఘుమ ఘుమలతో ఎంత ఎంత పాత బడితే అంత రుచులూరుతూ, మతి పోగొట్టేస్తుంది. అందుకే నా వోటు మాగాయకే పడుతుంది.
గత రెండేళ్ళుగా నేను అమ్మ/అత్తల గైడెన్స్ తో ఆవకాయ మాగాయ సొంతగా పెట్టడం మొదలుపెట్టాను. నేను తప్ప మిగతా వాళ్లంతా(చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళూ కూడా) అమ్మ దగ్గర్నుంచో, అత్తల దగ్గర్నుంచో తెచ్చేసుకుని హాయిగా మింగుతున్నారు.
మా పెద్దక్క అంటుందీ (దీని కూతురికి పెళ్ళయి, దానికి కొడుకు కూడా పుట్టేసి ఇది అమ్మమ్మ కూడా అయింది) "ఎందుకే లేనిపోని లంపటం! హాయిగా అమ్మ పెట్టిస్తే తెచ్చుకోరాదూ! ఏమోనబ్బా, నాకైతే అమ్మ పెట్టిన రుచి రాదనిపిస్తుంది"(అంతా అవద్దం, పెట్టడానికి బద్ధకం).
నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని నిర్ణయించుకుని మా అత్తగారి పాదాలకు నమస్కరించి రెండేళ్ళ క్రితం ఆవకాయ పెట్టాను. అది సూపర్ హిట్టయి కూచుంది. దాంతో మా అత్తగారు/అమ్మగారు ఇద్దరూ అడ్వాంటేజ్ తీసుకుని "ఇంకేం, మాగాయ కూడా నాలుక్కాయలు పడేసెయ్, ఎందుక్కుదరదో చూస్తాం" అన్నారు.
పెట్టాను!
కుదిరింది!
అందువల్ల వీళ్ళిద్దరూ అందరికోసమూ ఆవకాయా, మాగాయా ఒక రెండొందల కాయలు పెట్టేసి నన్ను మాత్రం లిస్టు లోంచి తీసేశారు ."అబ్బే, అమ్మలు బ్రహ్మాండంగా పెట్టేస్తుంది ఆవకాయ" అని!
కాయలు తెద్దామని రైతు బజారెళ్దామంటే మా ఆయనకు ఇంతలావున కోపం వచ్చేసింది."అబ్బబ్బ, భలే చేస్తావు నువ్వు! అమ్మ ఇస్తే తీసుకోవచ్చు కదా!అక్కడ పార్కింగ్ దొరికి చావదు.కాయల సెలక్షన్ మనకు తెలీదాయె" అని విసుక్కున్నాడు. బాగా వెన్నపూస, నూజివీడు రసాలు వేసుకుని ఆవకాయ బుచ్చిబాబు లెవెల్లో గుండ్రాయంత ముద్దలు మాయం చేసేటప్పుడు ఈ విసుగుండదు మళ్ళీ!
రైతు బజార్లో తెల్ల జుట్టున్న వృద్ధ బామ్మలు బేరం చేస్తున్న మావిడ కాయల వాడి దగ్గరకెళ్ళిఒకావిడను పట్టుకుని " మామ్మగారూ, ఏవి కాయలు ఆవకాయకు శ్రేష్టమో, మరియు ఏవి మాగాయకు శ్రేష్టమో వివరింపవలసింద"ని కోరాను. అప్పుడామె ఈ విధంగా చెప్ప దొడగింది
"నీ మొహమే పిచ్చి తల్లీ! ఈ ఆవకాయ కాయ సెలక్ట్ చేయడం బ్రహ్మ తరం కూడా కాదు. వీడు తెల్ల గులాబీలంటాడా, ముక్కేమో వారానికే మెత్తబడుతుంది. ఒకే చెట్టు కాయలంటాడా, పోయినేడాది కాస్త బూజు కూడా వచ్చింది. కాబట్టి కళ్ళు మూసుకుని తీసుకో, ఆ పై నీ అదృష్టం! గత నలభై ఏళ్ళుగా ఇలాగే నెట్టుకొస్తున్నా"
ఎలాగో విజయవంతంగా ఆవకాయ పెట్టేశాను. మాగాయ ముక్కలు ఒక్క ఎండకే వడియాల్లా ఎండాయి. ఇంతలో మెంతిపిండి, ఆవపిండి కొలత మర్చిపోయాను. అత్తగారు ఈ ఎండల్లో ఢిల్లీ వెళ్ళారు(బాడ్ టేస్టు) . ఫోనేమో నాట్ రీచబుల్!
అమ్మనడిగితే "ఏమోనే,, నువ్వు ఆరుకాయలు పదికాయలూ పెడితే నాకెలా తెలుస్తుంది,కనీసం నూట యాభై కాయలకైతే చెప్తా కొలత" అంది. "ఏడిసినట్టుంది. ఇప్పుడు నూటయాభై కాయలు పెట్టమంటావా? ఈ పదికాయలకే ఇక్కడ పేగులు తెగేలా ఉన్నాయి"అని విసుక్కుని తృష్ణకి. మెయిల్ రాశాను.
ఆవిడేమో ఒక టీ గ్లాసు కోలత తీసుకోండి అన్నారు. టీ గ్లాసంటే? మా మావగారు గజం పొడుగు గ్లాసుతో తాగుతారు టీ! నేనేమో ఔన్స్ గ్లాసుతో తాగుతాను! అదే అడిగా "టీ గ్లాసంటే ...ఏదండీ?"అని!
తృష్ణ మనసులో "వెధవ డౌట్లు, ఏవీ తెలీదు, మళ్ళీ ఓ అని తయారైపోతారు ఆవకాయ మాగాయ అని"అనుకుంటూ "అదేనండీ, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో ఇచ్చే కప్ ఉంటుంది చూడండి, అందులో ముప్పావు వంతు" అని సౌమ్యంగా చెప్పారు.(జోక్కి రాశాలెండి, పాపం తృష్ణ ఏమి అడిగినా చక్కగా చెప్తారు విసుక్కోకుండా) !
అలా మాగాయ కూడా ఎలాగో విజయవంతంగా పెట్టేశాను. ఇంగువ పోపు పెడుతుంటే ఏదో బాంక్ క్రెడిట్ కార్డు ప్రమోషన్ కోసం వచ్చి బెల్లు కొట్టినబ్బాయి లోపలికి తొంగి చూస్తూ" something smells good and yummy here " అన్నాడు! అమ్మయ్య, ప్రజాభిప్రాయం బాగనే ఉంది.
ఎప్పట్లాగే మా ఇంటాయన ఆవకాయ కలుపుకుని "సూపర్ గా ఉందిరా" అన్నాడు. చెప్పాగా, తినేటపుడు విసుగుండదని!
నా ఊరగాయల సంగతి తెలిసి మా చెల్లెలు "నాక్కూడా ఒక డజను కాయలు మాగాయ పెట్టవే ప్లీజ్" అని అర్థించింది ఫోన్లో!
"రాంగ్ నంబర్" అని ఫోన్ పెట్టేశాను.
అమ్మో అమ్మో, మాగాయ కలిపిన రోజైతే ఏదో ఎండలో రాళ్ళెత్తే పని చేసినట్టు ఆదమర్చి నిద్రపోయాను. భవసాగరం ఈదడమంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలిసింది! పది కాయలకే ఇంత హడావుడైతే, పాపం వందల కాయలు ఎలా పెట్టేవాళ్ళో అమ్మావాళ్ళు అని ఆలోచించా మొదటిసారి ఆ రోజు!
ఈ పోస్టు SHANKAR.S.గారికి సరదాగా అంకితం !



