October 30, 2012

ఇదిగిదిగో వేటూరి తొలి పాట




వేటూరి రాసిన తొలి సినిమా పాట చాలా రోజులుగా నెటిజన్లకు, అభిమానులకూ అందని పండుగానే మిగిలింది. "భారత నారీ చరితము.." అంటూ మొదలయ్యే ఈ పాట ఓ సీత కథ సినిమాలోది! అయితే ఈ పాట ఇన్నాళ్ళుగానూ ఆన్ లైన్లో ఎక్కడా వినపడదూ లేదు. కనపడనూ లేదు. ఆడియొ, వీడియో రెండూ లభ్యం కాకుండా పోయాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.




ఒకటి...సినిమా దాదాపుగా ఎక్కడా లభ్యం కాకపోవడం. లభ్యమైతే వేటూరి అభిమానులు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ పాటను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచే వారు. ఇంకోటి....సినిమాలో ఈ పాట రెండు భాగాలుగా..రెండు వేర్వేరు సన్నివేశాల్లో చిత్రీకరించడం వల్ల, ఈ రెంటినీ కలిపి పెట్టడం ఇబ్బంది కావడం మరో  సమస్య!!

ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్ళకు ఈ పాట ఆడియో వీడియోలు పట్ట గలిగాము! అది కూడా సినిమా వీడియో (వీసీడీ) దొరకడం వల్ల సాధ్యమైంది. మనీషా వీడియోస్ సంస్థ ఈ సినిమాని వీడియో గా అందించారు. సినిమా వేటూరి పాటతోనే మొదలవుతుంది కానీ,అన్నీ జర్కులూ,జంపులూనూ!  రెండు సన్నివేశాల్లో విడి విడిగా ఉండే ఆ పాటను అతికించి యు ట్యూబ్ లో పెట్టాల్సి వచ్చింది.



అంతే కాదు, పాట సాహిత్యం లో ఎలాంటి తప్పులూ పొరపాట్లు లేకుండా ఉండేందుకు గాను ఆ నాటి ఆ సినిమా పాటల పుస్తకాన్ని దొరక బుచ్చుకుని...ఒరిజినల్ సాహిత్యాన్ని కూడా సంపాదించాం!



పాట విషయానికొస్తే ఈ పాట ని ఓ సీత కథ (1974) సినిమా  కోసం వేటూరి తన తొలి పాట గా రాశారు. వేటూరి మరణానంతరం ప్రచురితమైన "వేటూరి నవరస గీతాలు" లో ఈ పాటను ప్రచురించి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచారు. ఈ పాటను పాడింది శ్రీమతి పి. లీల గారు!

పాట సాహిత్యానికి, రికార్డ్ అయిన నాటికీ కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. పాట మొదట్లో వచ్చే "యత్ర నార్యస్తు పూజ్యంతే" అనే మనువు కొటేషన్ పాట సాహిత్యంలో లేదు...రికార్డింగ్ లో కలిపారు. అలాగే "కీచక వధ" భాగంలో కూడా కొన్ని లైన్లలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి.

తన తొలి పాట గురించి వేటూరి ఏమన్నారో చూడండి (కొమ్మ కొమ్మకో సన్నాయి నుంచి ధారా వాహిక 2003 జులై హాసం పత్రిక నుంచి)






‘‘నా తొలి సినిమా పాటకు స్వరాలు దిద్దింది- మామ గారు శ్రీ మహదేవన్. ‘ఓ సీత కథ’ చిత్రంలో ‘భారతనారీ చరితము’ అనే మకుటంతో సాగే హరికథ అది.

ఆ సుముహూర్తమెటువంటిదో అది 25 వసంతాలపాటు పుష్ఫించి ఫలించింది. ఆయనతోనూ, ఆయన మానసపుత్రుడు శ్రీ పుగళేంది తోనూ నా అనుబంధాన్ని జీవితంలో మరపురాని మధురఘట్టంగా నిలిపింది.

నా తొలిపాట ట్యూన్ చేసిననాడే ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో తెలిసింది. అప్పటికి నాకు సినీ భాష అంతగా పట్టుబడలేదు. సంస్కృత సమాస భూయిష్ఠంగా రచన-

‘‘ భారతనారీ చరితము మధుర కథా భరితము
పావన గుణ విస్ఫురితము పతిసుతానుమతము సతము
శీల జ్యోత్స్నా పులకిత హేలా శారద రాత్రము
అతి పవిత్ర మఘలవిత్ర మీ ధరిత్రి కనవరతము ’’

అంటూ సాగింది.
దానిని అవలీలగా సంగీతీకరించిన క్షణాలు నేను మరిచిపోలేను. హరికథ అంటే ఏదో పురాణగాథ ఆధారంగా సాగే సంగీత సాహితీ రచన. ఇక్కడ అటువంటిదేమీ లేదు. స్త్రీ గొప్పతనం భారత స్త్రీ యొక్క విశిష్టత, పవిత్రత ఇందులో వస్తువు. సాంఘిక చిత్రం (ఓ సీత కథ) లో రాయాలి.

దానికీ భాషేమిటి? నోరు తిరిగినా చెవిలోకి ఎక్కినా అర్థం కాదే..! అయినా ఆ రచనను అంగీకరించిన దర్శకుడి ధైర్యం ఎంత గొప్పది..! మామ ఆ రచనని కాంభోజి, కేదారం మొదలైన రాగాలలో పదిహేను నిముషాలలో స్వరబద్ధం చేసిన తొలి అనుభవం మరువలేను- ఈ పాటను శ్రీమతి పి.లీల గానం చేశారు. ఈనాటికీ అది చెవులకు చెందినట్లు వినిపిస్తూ వుంటుంది.

అటు తర్వాత ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో అన్ని పాటలూ నేను రాయడం, ఆయన స్వరపరచడం ఎన్నెన్నో మధురానుభూతులను కలిగించింది.

పాటల రచయితగా నా ఎదుగుదలకు పునాదులు వేసిన గురువులలో ఒకరు మహదేవన్.
... సినీ కవిగా అప్పుడే కళ్ళు తెరుస్తున్న చిన్నవాడిని తల్లిలా కడుపులో పెట్టుకుని, తండ్రిలా కాపాడిన ఉత్తమ కళా సంప్రదాయానికి చెందిన మహా వ్యక్తి మహదేవన్. ’’

అదీ సంగతి! ఇన్నాళ్ళకి..వేటూరి తొలి పాట ఏదని వెదికే వారికి ఇక పై ,వీడియో యూ ట్యూబ్ లో దొరుకుతుంది...

వేటూరి అభిమానులూ.....ఆనందించండి...నాతో కలసి!! :-)





11 comments:

  1. wow.. thank you so much andee ;)
    ఇంతకీ ఈ మిషన్ లో పాల్గొన్న మిగిలిన వారెవరూ?

    ReplyDelete
  2. వావ్ సుజాత గారూ మీకు లెక్కకుమించిన ధన్యవాదాలు.ఈ పోస్ట్ మన వేటూరి సైట్ లో పెడతాను(మీ అనుమతితో),వేటూరి లో ఒక సిరీస్ అవుతోంది అదయ్యాక

    ReplyDelete
  3. చాలా శ్రమించారు. పాటని సాహిత్యం సహా.. అందించినందుకు చాలా చాలా ధన్యవాదములు.

    ReplyDelete
  4. మిషన్ లో పాల్గొన్న మిగిలిన వారెవరూ__________
    రాజ్, ఇంకెవరూ..వేణు గారే :-))

    ReplyDelete
  5. మీకు వేణు గారికి కూడా ధన్యవాదాలు సుజాత.

    ReplyDelete
  6. భళిరే! సుజాత గారూ!
    మీ కృషి అద్భుతం! ఇంకా ఈ పాట జ్ఞాపకాలు, "ప్రభ" నర్తనాన్ని, లీల గాన సుధలను మా మనసులలో మలయానిల వీచికలను వీస్తూన్నవి.
    : (Konamanini)
    :

    ReplyDelete
  7. ఇంత అద్భుతమైన పరిశోధన చేసిన సుజాతగారి బృందానికి వేనవేల అభినందనలు. పోస్టర్, వీడియో, సాహిత్యం, వేటూరిగారి "మనసులో మాట" ఇలా అన్నీ ఒకేచోట అందించిన మీ కృషికి శెహభాష్.

    ReplyDelete
  8. వ్యాఖ్యలు రాసిన బ్లాగ్ మిత్రులందరికీ ధన్యవాదాలు! ఈ టపా కి క్రెడిట్ మొత్తం శ్రీ సి.హెచ్ వేణు గారిదే! నేను టపా మాత్రం రాసానంతే

    ReplyDelete
  9. So now with all the efforts of Sujatha garu & Co, Junta can relax, sit back and watch Veturi's first song.
    Great job guys!!
    Incidentally,Subha who peformed in that harikadha is daughter of maverick director and choreographer vedantham raghavayya who directed classics like devadas and suvarna sundari.

    ReplyDelete
  10. ఇది వేటూరికి మీరిచ్చిన గొప్ప నివాళి. ఇంత ఫలవంతమైన పని చేపట్టి సాధించినందుకు అభించందనలు. మాకు అరుదైన పాట అందుబాటులో తెచ్చినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete