March 29, 2008

ఒక మంచి పుస్తకం

ఆ మధ్య నేను ఒక అద్భుతమైన పుస్తకం చదివాను. అది ఒక రష్యన్ పుస్తకానికి అనువాదం. కొన్ని పుస్తకాలను నేను ఒరిజినల్ కంటే అనువాదాలు చదవడమే ఇష్టపడతాను. ఉదాహరణకి మార్క్ ట్వైన్ టాం సాయర్ ఒరిజినల్స్ అన్నీ (సాక్షాత్తూ సెంట్ లూయిస్ లో, మిస్సిసిప్పి నది ఒడ్డున కొన్నాను)ఉన్నాయి. చదివాను. కానీ, వాటికంటే, నండూరి రామ్మోహన రావు గారి అనువాదాలు చదివినపుడు మాత్రమే నేను కూడా, టాంతోనూ, హక్ ఫిన్ తోనూ ప్రయాణించగలుగుతాను. అది అనువాదకుడి హస్త లాఘవం.
ఆయన తర్వాత అని చెప్పలేను గానీ, ఆయన వంటి మరో ప్రతిభాశాలి, మనల్ని పుస్తకంతో పాటు లాక్కెళ్ళిపోయే మరో అనువాదకులు స్వర్గీయ శ్రీ సహవాసి (సి.ఉమా మహేశ్వర రావు)గారు.
ఇకపోతే, నేను చదివిన పుస్తకం పేరు..'అల్లరి పిల్లలలో అద్భుత మార్పులు". రచయిత రష్యన్ విద్యా వేత్త ఏ.ఎస్.మకరెంకో. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసారు. అనువదించింది టి.ఎన్.వి. రమణ మూర్తి. పుస్తకం చదివి ఏడాది దాటినా, నా బ్లాగ్ మొదలెట్టింది ఈ మధ్యనే కావడం వల్ల, ఈ పుస్తకాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా!
ఈ పుస్తకం చూడగానే, పిల్లల్ని పెంచడంలో ఉపయోగపడే చైల్డ్ సైకాలజీ పుస్తకంగా భావించి నాకు , మా అయిదేళ్ళ పాపకు ఉపయోగంగా ఉంటుందని తీసుకున్నాను. కానీ మొదలు పెట్టాక, ఎంత అద్భుత వేగంతో నన్ను లాక్కు పోయిందంటే, పూర్తయ్యక గానీ, లేవలేకపోయాను. ఇది ఒక యదార్థ గాధ. రష్యాలో, 1920-30 మధ్య బాల నేరస్తుల పునరావాస కేంద్రంలో అనేకమంది పెంకె పిల్లలు, నేర స్వభావం కలిగిన పిల్లలు మకరెంకో శిక్షణ కింద మెరికల్లా ఎలా మారిందీ, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎలా నిలదొక్కుకున్నారన్నదీ ఈ పుస్తకం ఇతి వ్రుత్తం.
కధ విషయానికొస్తే, ఎటువంటి సదుపాయలుగానీ, తగినన్ని ఆర్థిక వనరులు గానీ లేని ఒక పిల్లల కాలనీలోకి మకరెంకో కొంతమంది వీధి బాలలతో, బాల నేరస్తులతో ప్రవేశిస్తారు. ఆ పిల్లలు కరడు గట్టిన మొండివాళ్ళు. దొంగతనాలకు అలవాటు పడ్డవాళ్ళు. మకరెంకోతో పాటు ఉన్నదల్లా, ఒక ముసలి అసిస్టెంటూ, మరో లేడీ టీచరూ! పిల్లలు కాలనీలోకి వస్తూనే, వీళ్ళ వస్తువులు దొంగిలిస్తారు. చుట్టుపక్కల గ్రామస్తుల వస్తువులు దొంగిలిస్తారు. వీళ్లను దారిలో పెట్టడం ఒక సమస్య కాగా, తగినంత రేషన్ కూడా ప్రభుత్వం సరఫరా చేయలేక పోవడం మరో సమస్యగా మారుతుంది.
దానితో వాళ్ళు కాలనీకి గల ఎకరాల కొద్దీ నేలలో వ్యవసాయం చేయాలని నిశ్చయించుకుంటారు. కానీ పనిముట్లు ఉండవు, గుర్రాలు ఉండవు. దగ్గరలోని గ్రామం నుండి ఒక కమ్మరిని పిలిచి పనిముట్ల తయారీలో శిక్షణ తీసుకుని, తామే ఒక కార్ఖానా ప్రారంభిస్తారు. కొండకి అవతల పక్క ఉన్న పాడుపడ్డ ఎస్టేట్ ను ప్రభుత్వ అనుమతితో తీసుకుని, కొత్త భవనాలను, ఇతరాలను వాళ్ళే సమకూర్చుకుంటారు. వ్యవసాయంలో వారిని ముందుకు నడిపించడానికి, షెర్రీ అనే నిపుణుడు వస్తాడు.
పిల్లల్లో 'మన ' అనే భావన కలిగాక, కాలనీ అభివ్రుద్ధిని ఎవరూ ఆపలేకపోతారు. రకరకాల పంటలు పండిస్తారు, పెద్ద పెద్ద కార్ఖానాలు నిర్మిస్తారు, గుర్రాలు కొనడమే కాక, గుర్రాల శాలను నిర్వహిస్తారు. పందుల పెంపకం చేపట్టి, ఒక పందుల నర్సరీని ఏర్పరుస్తారు. చుట్టు పక్క గ్రామాల్లోని సారా బట్టీలని మూయిస్తారు. నాటకాలు వేయడం ప్రాక్టీస్ చేస్తారు. చుట్టు పక్క గ్రామాల వాళ్ళు ప్రతి వారాంతం, వీళ్ళు ప్రదర్శించే నాటకాలు చూడనిదే ఉండలేని పరిస్తితికి వస్తారు. ఇవన్నీ చేస్తూ, ఉన్నత సాంకేతిక పరీక్షలో ఉత్తెర్ణులవుతారు. మధ్య మధ్యలో బయటినుంచి వచ్చే కొత్త పిల్లలను, వారిలోని నేర స్వభావాలను సంస్కారించే బాధ్యతను 'కమాండర్ 'లు గా పిలవబడే సీనియర్లు భుజాల మీద వేసుకుంటారు. రచయిత మక్సీం గోర్కీ మీద అభిమానంతో వాళ్ళ కాలనీకి 'గోర్కీ కాలనీ ' అని పేరు పెట్టుకుంటారు. ఈ కాలనీ ని గోర్కీ ఒకసారి సందర్శిస్తారు కూడా.
అంతే కాక, ఎక్కడో, వందల మైళ్ళ దూరాన అధ్వాన్న పరిస్థితిలో ఉన్న మరో కాలనీని సంస్కరిస్తారు కూడా. కానీ, ఇదంతా ఇక్కడ చెప్పినంత తేలికగా జరగదు. పిల్లలు వద్దన్న తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే, మకరెంకో సహనంతో వాళ్ళని దారిలో పెట్టిన విధానం చూస్తుంటే, ఆశ్చర్యంతో మతిపోతుంది.
ఈ పుస్తకం కేవలం చదవడమే కాదు. దాచుకోవలసిన పుస్తకం కూడా. ఎంత వుల్లాసంగా సాగుతుందంటే, ఆ కాలనీలో ఒక సభ్యుడిగా మనమూ ఉండి పరిశీలిస్తున్న అనుభూతి కలిగిస్తుంది ఈ పుస్తకం. అనువాదకుడికి సార్థకత అంతకంటే ఏముంది?
This is book is available in all Visaalaandhra stores, Navodaya kachiguda too! price:Rs.60/-

9 comments:

రాధిక said...

మీ టపాలు కూడలిలో వస్తున్నాయండి.నేను కూడలి నుండే వస్తున్నాను.[తెలుగువాడిని గారి బ్లాగులో రాసారుగా ఎందులోనూ లిస్ట్ అవ్వట్లేదని.అందుకే తెలియపరుస్తున్నాను]
వీలయితే వర్డ్ వెరిఫికేషన్ తీసేయరా?కామెంటు రాయడనికి కష్టం గా వుంటుంది.

నాగరాజా said...

నెనరులు (థాంకులు).

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

మంచి పుస్తకం పరిచయం చేశారు సుజాత గారు.సారాంశం చదువుతుంటే వి.శాంతారామ్ దో ఆంఖే బారా హాత్ సినిమా మదిలో మెదిలింది.రాధిక గారు చెప్పినట్లు మీరు ముందా word verification తీసెయ్యండి.కావాలంటే కామెంట్ మోడరేషన్ పెట్టండి.

sujatha said...

Radhika gaaru,

I've just seen koodali. thanks

ravi said...

సుజాతగారూ, చాలా మంచి పుస్తక పరిచయాన్ని రాశారు. మకరెంకో పుస్తకాన్ని తొలిసారి చదివినప్పుడు నేనూ అంతే ఇంప్రెస్ అయిపోయాను. దీనిని మన సిలబస్ లో ఒక పాఠ్యాంశంగా పెడితే బావుంటుందని నా కోరిక. అన్నట్టు టెట్సుకో కురియనాగి "రైలు బడి" (తెలుగు అనువాం ఎన్. వేణుగోపాల్) చదివారా? దాని గురంచి కూడా ఒక పరిచయం రాయడానికి ప్రయత్నించండి.

నమస్తే

- దుప్పల రవికుమార్

sujatha said...

రవి గారు,

ధన్యవాదాలు! రైలు బడి నా దాగ్గర రెండు పుస్తకాలున్నాయి.ఒకటి వేణు గోపాల్ గారు అనువదించింది, మరోటి వాసిరెడ్డి సీతా దేవి గారు అనువదించింది.(నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసింది) ఆ బుక్ చదువుతున్నపుడు, నేనే టోటో చాన్ గా మారిపోయాను.(ఎవరైనా మారతారేమో కదూ) ఆ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా పరిచయం చెయ్యాలండీ! ప్రయత్నిస్తాను.

prasanthi said...

ఈ పుస్తకం గురించి మా బాబాయి గారు చెప్తే తనకి నేను బహుమతిగా ఇచ్చాను. కానీ చదవలేదు. మీరు చదివిన మంచి పుస్తకాలన్నిటినీ పరిచయం చేయండి.

S said...

Interesting theme!
మంచి పుస్తకం గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.
(ఇంతకీ...ఎస్ అంటే ఎవరో అనుకునేరూ... నేనే ప్రశాంతి చెప్పిన సదరు సౌమ్యాని...)

sujatha said...

సౌమ్య గారు,

మీ బ్లాగ్ చూసానండీ! చాలా బాగుంది. పుస్తకాలు బాగా చదివే వాళ్ళంటే, నేను వాళ్ళకు వీర ఫాన్ అయిపోతానంటే నమ్మండి.

Post a Comment