April 13, 2008

ఒక మంచి పుస్తకం..డాక్టర్ కేశవ రెడ్డి నవల 'మునెమ్మ '

డాక్టర్ కేశవ రెడ్డి గారు చాలాకాలం తర్వాత 'మునెమ్మ ' నవల రాశారు. ఈ నవల 2007 అక్టోబర్ నెల చతురగా వచ్చింది. కేశవరెడ్డి గారు అద్భుతమైన రచనలు చేసారు. సిటీ బ్యూటిఫుల్, అతడు అడవిని జయించాడు,రాముడుండాడు.రాజ్జివుండాది, మూగవాని పిల్లనగ్రోవి, చివరి గుడిసె, ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ మునెమ్మ.(ఇవి కాకుండా ఏమైనా ఉన్నాయేమో నాకు తెలియదు ) రాసి కంటే, వాసి ముఖ్యమని ఇలాంటి వాళ్ళ రచనల గురించే అంటారు కాబోలు.
రాయలసీమ మాండలికాన్ని తెలుగు సాహిత్యానికి పరిచయం చేసింది స్వర్గీయ పులికంటి క్రిష్ణారెడ్డి గారైతే, దాన్ని తెలుగు సాహితీ ప్రియుల ఇళ్ళలోకి సరఫరా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది నామిని, కేశవ రెడ్డి గార్లు.
ఇక మునెమ్మ నవల విషయానికొస్తే, కథాకాలం మొదటి ప్రపంచ యుద్ధం నాటిది. కథని ఒక పదేళ్ళ కుర్రా డు (మునెమ్మకు మరిది వరస) చెపుతూ ఉంటాడు. భర్త చావుకి కారణమైన కొంతమంది వ్యక్తుల ఆచూకీ కనుక్కుని, వారిని అంతమొందించడానికి బయలు దేరిన ఒక భార్య కధ. వినగానే, ఇదేదో ఫాక్షన్ సినిమాలా ఉంది గానీ...కాదు!
మునెమ్మ ఒక పాతికేళ్ళ పడుచు. రైతు భార్య. ఆమె భర్త జయరామిరెడ్డి తన బండికి కట్టే బొల్లి గిత్తను రక్తం కారేలా కొట్టడంతో కథ ప్రారంభమవుతుంది. అతడలా కొట్టడానికి కారణం ఏమిటంటే, గడ్డి కోస్తున్న మునెమ్మ వీపుమీద బొల్లి గిత్త రెండు కాళ్ళతో గీరడంతో, ఆమె రవిక చిరిగి పోతుంది. దానితో జయరాముడు అగ్గిరాముడై పోతాడు.
తల్లి, మునెమ్మ, ఎంత చెప్పినా వినక జయరాముడు దాన్ని మద్దిపాలెం పశువుల సంతలో తెగనమ్మి పారేసేందుకు మర్నాడే బయలు దేరతాడు. దారిలో పోటు మిట్ట గ్రామంలో, 'తరుగులోడు 'గా పేరుపడ్డ పశువుల దళారీతో కలిసి మద్దిపాలెం వెళ్ళాలని జయరాముడు నిర్ణయిస్తాడు. అప్పట్లో బస్సులూ, అవీ అరుదు గనక, కాలి నడకన బయలు దేరతాడు.
రెండు రోజులయ్యక, జయరాముడు లేకుండా, బొల్లి గిత్త ఒక్కటే రొప్పుకుంటూ ఇల్లు చేరుతుంది. దానితో, మునెమ్మ, ఆమె అత్త నిర్ఘాంతపోతారు. ఒక రోజంతా చూసినా జయరాముడు తిరిగి రాడు. పైగా ఆ రాత్రి మునెమ్మకి ఒక పీడ కల వస్తుంది. ఆ కలలో మునెమ్మ గిలక బావి నుండి నీళ్ళు తోడుతుండగా, బకెట్ కి బదులుగా జయరాముడి శవం పైకొస్తుంది. అతడి మెడకి బొల్లిగిత్త మెడలో ఉండాల్సిన వెంట్రుకల తాడు బిగించి ఉంటుంది.(ఆ తాడు మునెమ్మ వెంట్రుకలతో పేనిందే) దానితో జయరాముడు ఇక లేడని మునెమ్మ నిర్థారణకొస్తుంది. బారెడు పొద్దెక్కేదాక ఏకధాటిగా ఏడుస్తుంది. తర్వాత లేచి కర్తవ్య నిర్వహణకు సన్నాహమవుతుంది. జయరాముడి ఆచూకీ కోసం వూళ్ళోని మగవాళ్ళు ఎవరు వెళతామన్నా, ఒప్పుకోదు. 'కనబడకుండా పోయింది నా వాడేగదా, నేనే వెదకాల ' అని మరిదితో ( ఈ కథ చెప్పే కుర్రాడు) కలిసి బయలు దేరుతుంది.
బొల్లి గిత్త కొమ్ములకున్న మద్దిపాలెం సంత చీటీ ఆధారంగా వారి అన్వేషణ ప్రారంభమవుతుంది.
మొదట వాళ్ళు తరుగులోడిని కలుస్తారు. వాడు ఎటూ చిక్కకుండా సమాధానాలు చెపుతాడు. పైగా ' ఏవమ్మా, జయరాముడు పైకంతో మంచి గొడ్డుని పట్టుకున్నాడా...జల్సా చేస్తా వున్నాడా ' అని అడుగుతాడు కూడా! జయరాముడు బొల్లిగిత్తను సంత దాకా తీసుకెళ్లకుండానే, దార్లోనే అమ్ముడైపోయిందని చెప్తాడు. సంత చీటీ తమ దగ్గరున్న సంగతి చెప్పకుండా , వాడిచ్చిన సమాచారం ఆధారంగా ముందుకు సాగుతారు. ఒక పూట కూళ్ళ ఇంట్లో వారికి మరింత విలువైన సమాచారం లభిస్తుంది.
సంతలో మరికొంత మంది చెప్పిన విషయాల ఆధారంగా పశువైద్యుడి ఇంటికి వెళతారు. కాని అప్పటికే అతడు మరణ శయ్య మీద ఉంటాడు. వైద్యం చేస్తుంటే ఆవు కుమ్మిందని ఇంట్లో వాళ్ళు చెపుతారు. ఇప్పుడో, ఇంకాసేపట్లోనో అన్నట్లున్న అతడు, మునెమ్మ చేతిమీద బొల్లి గిత్త పచ్చ బొట్టు చూడగానే, వెర్రికేక పెట్టి ప్రాణం వదిలేస్తాడు.
జయరాముడి హత్యలో తరుగులోడికి, పశువద్యుడుకి భాగం ఉందని గ్రహిస్తుంది మునెమ్మ! అప్పుడు వెళుతుంది పోలీస్ స్టషన్ కి...ఏదైనా అనాధ శవం దొరికిందా అని తెల్సుకోవడానికి. ఒక రోజు ముందే జయరాముడి శవ దహనం జరిగిందని తెల్సుకుంటుంది.ఒక వెంట్రుకల తాడుతో జయరాముడి గొంతు బిగించి చంపారని తెలిసి వణికి పోతుంది. ఆ తాడుని జయరాముడే స్వయంగా మునెమ్మ తల దువ్వుకునేటపుడు రాలిన వెంట్రుకలతో పేనాడు.
మునెమ్మ బొల్లి గిత్తను తోలుకు రమ్మని మరిదిని పంపుతుంది. బొల్లిగిత్తతో పాటు తరుగులోడి ఇంటికి వెళుతుంది. తరుగులోడిని నిలదీసి, వాడు తనకేమీ తెలీయదని బుకాయిస్తుండగా , బొల్లి గిత్తను వదులుతుంది. అది ఉగ్రరూపం దాల్చి తరుగులోడి పేగులు తీసి కొమ్ములకు చుట్టుకోవడంతో కథ ముగుస్తుంది.
ఇక్కడ మీకు ఆసక్తికరంగా అనిపించిందో లేదో కాని, చదవడం మొదలెట్టాక ఆపకుండా చదివించే నవల ఇది. కేశవ రెడ్డి గారి శైలి అదే! అద్భుతమైన కథనం ఊపిరి తిప్పుకోనివ్వదు.
మునెమ్మ మనోభావాల చిత్రణ చదువుతుంటే, అతడు అడవిని జయించాడు లోని ముసలివాడి పాత్ర గుర్తొసుంది.ఆమె కర్తవ్య నిర్వహణ, అలుపెరుగని ప్రయాణం, పంది పిల్లల్ని కాపాడె ప్రయత్నంలో ముసలివాడు పడే తాపత్రయాన్ని గుర్తు చేస్తుంది.
'వదినా, జయరామన్న అంత్యక్రియలు ఎక్కడ చెయ్యా ల? " అని మరిది అడిగితే ' ఇప్పుడు నేనేం జేస్తున్నాను? ఆయన అంత్యక్రియలేగా! జయరాముడిని పడగొట్టిన వాళ్ళ నోట్లో రూకలు పడాల! ఆయన అంత్యక్రియలు పూర్తైనట్టే " అని మునెమ్మ చెప్పే మాటలు గగుర్పాటు కలిగిస్తాయి.
లైబ్రరీలో తప్పక ఉండవలసిన పుస్తకం ఇది. ప్రస్తుతానికి బయట దొరికే అవకాశం లేదు కాబట్టి, కావలసిన వారు చతుర సర్క్యులేషన్ డిపార్ట్ మెంట్ కి ఫోన్ చేయాల్సిందే! దొరికితే మాత్రం తప్పక చదవండి!

9 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

baagaa vivariMcaaru

krishna rao jallipalli said...

కీశవ రెడ్డి గరి మునేమ్మ చదవలేదు కాని... అతడు అడవిని జయించాడు' ని చదివాను ఎప్పుడో. నోవేల్ బాగుంది... కాని విచిత్రం ఆ ముసిలాడు మాట్లాడేది రాయలసీమ యాస. కాని ఆలోచించేది మాత్రం అసలు సిసల్య్న తెలుగు బాష. ఆ ముసిలాడి కి అసలు సిసల్యన తెలుగు బాష ఉంటుందని తెలిసే అవకాసమే లేదు. మరి తెలియని యాస లో, బాషలో ఎలా ఆలోచిస్తాడు. మరి విచిత్రం.. నాకు జెర్మనీ బాష రాదు. ఆ బాషలో ఆలోచించలేను కదా. మరి మరి విచిత్రం ఏమిటంటే .. ఆ నవల కి పీఠిక (ముందు మాట) రాసినయన కూడా సమర్ధించడం. (విమర్శిస్తే పీఠిక ని ప్రచురించారు కదా) కొందరికి వెన్నేముకలు ఉండవు మరి.

sujatha said...

క్రిష్ణారావు గారు,
నిజానికి ముసలాడికి బదులుగా రచయిత ఆలోచిస్తాడు ఆ నవల్లో! పైగా శుద్ధ ఆంధ్ర వ్యావహారికం లో! ఈ solilloquy ని ప్రఖ్యాత ఆంగ్ల రచయిత Hemingwey నుంచి అరువు తెచ్చుకున్నానని కేశవ రెడ్డి చెప్పారు. నిజానికి, హెమింగ్వే రాసిన The old man and the sea చదివాక, అతడు అడవిని జయించాడు చదివితే, ముసలివాడి చుట్టూ ఉన్న పరిస్థితులు తప్ప, "ఇదే , అదీ" అనిపించక మానదు.

చదువరి said...

సుజాత గారూ, ఓ విలువైన పుస్తకం సంగతి చెప్పినందుకు నెనరులు. ఆ చతుర కోసం వెతకాలిక. మీరిలా కలకాలం పుస్తకాల గురించి రాస్తూనే ఉండాలని నా కోరిక.
-----------
వెన్నెముకల గురించి...
రచనాశైలి నుండి వెన్నెముకల దాకా గెంతటం సముచితంగా లేదు.
-------------
కేశవరెడ్డి గారిని స్వయంగా కలిసిన కొత్తపాళీ గారు గతంలో పొద్దులో ఇలా వ్యాఖ్యానించారు: "..నిరాడంబరానికి నిర్వచనం లాగా ఉన్నారు. ఒక మామూలు ఫుల్ హాండ్స్ చొక్కా పేంటు, కాళ్ళకి సగం అరిగిపోయిన హవాయి చెప్పులు. పిట్టంత మనిషి.".... "ఆయన దగ్గర సెల్లు కాదు కదా, ఇంట్లో ఫోను కూడా లేదు!"

sujatha said...

చదువరి గారు,

కేశవ రెడ్డి గారిని ఒకసారి హైదరాబాదులో నేనూ కలిసాను. గొప్ప వాళ్లంతా అంతేనేమో! నామిని గారూ అంతే!చిరిగిన చొక్కా గూడా చూసుకోరు. హైదరాబాదులో ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నపుడు కుకట్పల్లి నుండి సెవెన్ సీటర్ ఆటోల్లో ఇరవై మందితో కలిసి కూచుని ప్రయాణించే వారు. ఖదీర్ బాబు దర్గా మిట్ట కతలు రాయడానికి, సోమరాజు సుశీల గారు ఇల్లేరమ్మ కతలు రాయడానికి వెనక నిలిచింది ఆయనే! నేను తిరుపతి వెళితే ఆయనను కలవకుండా రాను. పుస్తకాల గురించి మాట్లాడబోతే, 'ఎందుకబ్బా ఈడ గూడా ఆ గోల! ప్రభావతి వడలు చేస్తా ఉండాది పదండి తినేద్దాం ' అని ఆప్యాయంగా మాట్లాడతారు. ఆయన పుస్తకాలు చదవాలి మీరు !

sujata said...

సుజాత గారూ..

ఈ పోస్ట్ ఇంతకు ముందు చదివినా.. రెండో సారి చదివితే ఇంకా బాగుంది అనిపించింది. చతుర లో నెల నెలా చిన్న నవలలు వస్తాయి కదా. వాటిలో కొన్ని చాలా బావుంటాయి. వీటిని వీళ్ళు చక్కగా రెండు, మూడు కలిపి నవలల సంపుటి అచ్చు వేస్తే ఇంటి కోసం కొనుక్కోవడానికి బావుంటుంది కదా. అలా కాకపోయినా, ఎంపిక చేసిన కొన్నిటిని 'మిల్స్ అండ్ బూన్స్' వాళ్ల లా చిన్న నవలలుగా అచ్చు వేసి అమ్మితే, మిస్ అయిన వాళ్ళకు చాలా పనికొస్తాయి. మీరు ఎడిటరుగారు కదా.. కాస్త మాట్లాడండి వీళ్ళ తో!

కత్తి మహేష్ కుమార్ said...

మంచి నవలని పరిచయం చేసారు. కేశవరెడ్డిగారి ‘అతడు అడవిని జయించాడు’ని నేను హెమింగ్వేని చదవకముందే చదివాను.గ్రాడ్యూయేషన్లో Old man and the sea ని interpret చెయ్యడానికి నాకు ఎంతో ఉపయోగపడిన నవలగా చాలా బాగా గుర్తు.

ప్రస్తుతం ‘మునెమ్మ’ ఎక్కడ దొరుకుతుందో వెతకాలి.నిజానికి ఒక effective సినిమాగా తియ్యగలిగే కథ.

సుజాత said...

ఈ నవల కోసం మీరు చతుర ఆఫీసుకు ఫోన్ చెయ్యాల్సిందే! లేదంటే నా దగ్గర తీసుకుని చదవాల్సిందే మరి!

మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పారా సినిమా గురించి! తీస్తే మంచి ఆర్ట్ సినిమా అవుతుంది. కరక్టే!

రానారె said...

మీరు కథ చెప్పకుండా వుంటే బాగుండేది. :(

Post a Comment