April 30, 2008

భళా భళీ నా బండీ

"మొగుడి దగ్గర తప్ప ఎంత కర్కోటకుడైన ట్రైనర్ దగ్గరైనా డ్రైవింగ్ నేర్చుకోవడం సులభం " అని నా ఫ్రెండ్ అనిత ఇచ్చిన స్టేట్మెంట్ నిజమే అని అంగీకరించాల్సొచ్చింది ఒకాదివారం ఉదయం!
శ్రీ శ్రీ ఒకసారి..'మీరు సిగరెట్ మానెయ్యొచ్చుగా" అని ఎవరో అడిగితే, 'సిగరెట్ మానెయ్యడం చాలా సులభం! నేను చాలా సార్లు మానేసాను" అన్నార్ట!నేనూ అదే కోవలో డ్రైవింగ్ చాలా సార్లు నేర్చుకున్నాను. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు మన పక్కనే ఉంటే ఎన్ని కిలోమీటర్లైనా, రోడ్డు ఎలా ఉన్నా కారు నడపాలనిపిస్తుంది. సొంత కారు, అదీ పక్కన తోడు లేకుండా బయటకు తీయాలంటే మాత్రం ఉహూ!
అసలు నేను మొదట డ్రైవింగ్ నేర్చుకుంది స్వరాజ్ మజ్దా లో! నేను మొదటి క్లాసుకి వెళ్ళినపుడు మారుతి రిపేర్లో ఉందని మెగాసిటీ డ్రైవింగ్ స్కూలు వాడు నాల్రోజులు స్వరాజ్ మజ్దా మీద క్లాసు తీసుకున్నాడు. తర్వాత మారుతి మీద! 'ఇక్కడ రైట్ తీసుకోవాలంటే స్టీరింగ్ ని మూడు చుట్లు తిప్పాలి. తిప్పారుకదా! ఇపుడు మళ్ళీ కారు సీదాగా రోడ్డు మీదకు రావాలంటే మళ్ళీ మూడు చుట్లు తిప్పాలి." అని చెప్పేవాడు. ఈ చుట్ల గొడవ అర్థం కాకముందే, నాకు లైసెన్స్ వచ్చ్చింది. దాంతో పాటే ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా! 'టెస్టింగ్' అంటే ఏమిటొ తెలియకుండానే! మెగాసిటీ వాళ్ళనడిగితే 'ఖైరతాబాద్ ఆర్టీయే వాళ్ళకి మెగాసిటీ స్టూడెంట్స్ ని ఆపేంత సీన్ లేదులే మీరు కానీండన్నాడు. ఇంతకీ నాకు డ్రైవింగ్ వచ్చిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం తేలకుండానే మేము డల్లాస్ వెళ్ళాము.
అక్కడ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినపుడు గర్వంగా నా ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసి చూపించగానే నాకు డ్రైవింగ్ నేర్పబోతున్న వాడు 'అయితే నేనేం చెయ్యా 'లన్నాడు. ఇదిక్కడ పని చెయ్దా అంటే, తెల్లబొయి, ఇదికూడా తెలీకుండా ఇంతదూరం వచ్చేశావా అన్నట్టు చూసి, ఇంటికెళ్లాక, దాంతో నేతిగిన్నె వెచ్చబెట్టుకోమన్న తరహాలో ఏదో సలహా ఇచ్చాడు.
రాత పరీక్ష బాగనే పాసై పూడ్చాను. టెస్టింగ్ దగ్గరకొచ్చే సరికి కొంత దూరం నడిపాక, make a right అని వాడనగానే, right only లేన్లోంచి ఏ మాత్రం సందేహించకుండా U తీస్కున్నాను.రెండో మాట లేకుండా వాడు 'నువ్వు లాభం లేదు పొమ్మ 'న్నాడు. ఖడ్గం సినిమాలో సంగీత లాగా 'ఒకే ఒక్క చాన్స్ ' అని బతిమాలినా , హ్రుదయం లేని బండ గాడిద, వీల్లేదన్నాడు.
లైసెన్స్ లేకపోయినా, ఇంటి చుట్టు పక్కల వీధుల్లో, పోలీసులు లేని చోట కారు నడిపే ప్రయత్నాలు సాగించే దాన్ని!
మూడేళ్లకి మళ్లీ ఇక్కడికొచ్చేసాక, మళ్ళి డ్రైవింగ్ నేర్చుకున్నాను. మన కార్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుందన్నాడు వాసు(మా వారు). గంటకి వంద రూపాయలిచ్చి మా కార్లోనే ఇన్ స్ట్రక్టర్ని పక్కన కూచో బెట్టుకుని పొద్దున్నే మణికొండ ప్రాంతాల్లోనూ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనూ కుడి ఎడమలు పిచ్చగా కన్ ఫ్యూజ్ అవుతూ ఎలాగో వారం రోజులు లాగించాను. డబ్బులెక్కువ అవుతున్నాయని ఆపేశాను. తర్వాత ఆదివారం వాసు 'పద కారు తీయమన్నాడు '. పార్కింగ్ లోంచి కారు బయటికి తీయడమంటె బ్రహ్మ ప్రళయమే నాకు. చీవాట్లు అక్కడినుంచే మొదలయ్యాయి.వెనకాల పిల్లర్ చూసుకోవా అన్నాడు, గేటు దగ్గర హారన్ వేయాలన్నాడు, అలా బిగుసుకుపోయి రోబోట్ లాగా కూచుంటావేం అన్నాడు,ఎలాగో మియాపూర్ ఫ్లై ఓవర్ ఎక్కబోతుంటే, ఇదంతా హఫీజ్ పేట తల్లీ, రోడ్డు ఎవరు ఎప్పుడు ఎక్కడినుచి దాటతారో ఊహించడం బ్రహ్మక్కూడా తరం కాదు. జాగ్రత్తగా ఉండాలన్నాడు. రోడ్డు మీద ఉన్నంత సేపూ పళ్ళు పట పటా కొరుకుతూనే ఉన్నాడనుకోండి. 'అంటే నేర్చుకునే టపుడు కూడా ఇలాగే చంపుతారన్నమాట మీరంతా ' అన్నాడు. అదేమిటంటే, 'ఏముంది, రోజూ చూస్తూనే ఉంటాగా రోడ్లమీద! ఒక పక్క ఆఫీస్ కి టైం అయిపోతూ ఉంటే, మధ్య లేన్లో ఇరవైలో, ముప్ఫైలో నడుపుతూ ఉంటారు! స్పీడుగా తోల్లేరు, వెనక గింజుకునే వాడికీ దారీ ఇవ్వరు 'అని ఆడ డ్రైవర్లు అందరిమీదా కోపం పడ్డాడు. ఇంటికొచ్చి పార్క్ చేద్దామని ప్రయత్నిస్తుంటే....ఎంత హడావుడి చేశాడో తల్చుకుంటే ఒళ్ళు మండిపోతుంది. కారు రివర్స్ చేస్తుంటే..వెనక్కి చూస్తూ, ' పిల్లర్ పిల్లర్ పిల్లరుందక్కడ ' అని కేకలు! నాకిహ కోపం కట్టలు తెంచుకుని, కారు అల్లాగే వదిలి పారేసి,'ఇక 'నీ ' కారు ముట్టుకుంటే అడుగు ' అని వెళ్ళిపోయాను!
నెల్రోజులకల్లా వాసు ఆఫీస్ పని మీద ఒహాయో వెళ్ళినపుడు, అక్కయ్య వాళ్ళు వచ్చారని కారు తీశాను శిల్పారామం వెళదామని!వెళ్లడం జాగ్రత్తగానే వెళ్ళాం! వచ్చేటపుడు కొత్తగూడ క్రాస్ రోడ్స్ దగ్గర గచ్చిబౌలి నుండొస్తున్న ఆటో ఒకటి చాలా వేగంగా కారుని రాసుకుంటూ వెళ్ళిపోయింది. కారు వెనక పడనే పడింది స్క్రాచు! అప్పటికి కారు కొని ఏడాది కూడా కాలేదు! గుండాగిపోయింది. కార్లో వాళ్ళని అక్కడే పారేసి, మియాపూరు హ్యుండాయ్ సర్వీస్ సెంటర్ కి పరిగెట్టాను. అక్కడ తెలిసిన వాడినొకడిని పట్టుకుని పర్సనల్ గా డబ్బిచ్చి వాసు ఇంటికొచ్చేసరికి బాగు చేయించాను.
బెంగుళూరుకొచ్చాకయినా డ్రైవింగ్ చేద్దామనుకుంటే, ఇక్కడి ట్రాఫిక్ చూసి నేనే విరమించాను. యర్రంసెట్టి శాయి గారి హ్యూమరాలజీలో హైదరాబాదు ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్న పక్క పక్క బస్సుల వాళ్ళు పరిచయాలు పెరిగి పెళ్ళి సంబంధాలు కుదుర్చుకుంటారు! నిజానికది బెంగుళూరు ట్రాఫిక్ కి వర్తించాలి.
ఇక్కడికొచ్చాక మళ్ళీ కొత్త కారు కొందామని మా ఆయన స్కార్పియో వా ళ్ళకి ఫోన్ చేస్తే, టెస్ట్ డ్రైవ్ కని స్కార్పియో పట్టుకొచ్చారు. 'మీరు కూడా డ్రైవ్ చేస్తారా మేడం? ' అని వాళ్ళడగ్గానే నేను అనందంతో 'య్యెస్ ' అనబోతుండగానే ఈయన 'ఆగండాగండాగండాగండాంటూ అడ్డం పడి 'మా ఆవిడ ఫాం లో లేదు లెండి ' అని చెడగొట్టాడు.
ఇక్కడా కారింకా కొత్తదే! ముట్టుకోనివ్వడని తెల్సిపోయింది. అందుకే, నానో కోసం ఎదురు చూస్తున్నా! చిన్న కారయితే నా ఇష్టం వచ్చినట్టు నడుపుకోవచ్చు. (ఈ మాటక్కూడా, 'డ్రైవింగ్ రావడం ముఖ్యం గాని, చిన్నదైనా, లారీ అయినా ఒకటే అంటాడు..నాకు తెలుసు)
ఇంతకీ నా డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగం ఏమిటంటే, రైలుకో, బస్సుకో ఈ- టికెట్ బుక్ చేసినపుడు TTE కో, కండక్టరుకో ID Proof గా చూపించడానికే! ఎ ప్పటికైనా అది కేవలం డ్రైవింగ్ కోసం ఉపయోగపడుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుందని ఎదురు చూస్తున్నా!

17 comments:

Chandra sekhar said...

నమస్తే సుజాత గారు. బాగున్నాయి మీ కార్"కష్టాలు" మీరు రాసింది చదువుతుంటే చాలా నవ్వు వచ్చింది. ఎపుడో పదవ తరగతిలో చదివిన బారిస్తారు పార్వతీశం గుర్తుకువచ్చాడు. అయితె నాకు నచ్చే విషయం ఏంటంటే ఇన్ని కష్టాలు పడిన టాటా నానో డ్రైవ్ చేయాలన్న మీ కోరిక. మీ కోసం టాటా నానో త్వరగా రోడ్ మీదకు రావాలని కోరుకుందాం.

BHARAT said...

చంపేసారండి ....

నా కళ్ల లో నీళ్ల్లు తిరుగుతున్నయి .. ఆపీసు లో నవ్వ కుండా చేసిన నా ప్రయత్నం వళ్ల

9thhouse.org said...

మా ఆవిడకి కూడా ఇండియాలో డ్రైవింగు లైసెన్సు ఎప్పుడో వచ్చేసింది, డ్రైవింగు రాకుండానే. అక్కడ నేను కారు నడుపుతున్నప్పుడు ఎదురుగుండా లారీ వస్తుంటే కళ్ళు మూసుకునేది. నేనంటే భయం కొద్దీ ఇక్కడ డ్రైవింగు నేర్చుకుంటాను అని మాటవరసకి కూడా అనదు.

http://nagamurali.wordpress.com/2008/02/18/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b0%e0%b1%88%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%81-%e0%b0%9f%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%aa%e0%b0%be/

Kottapali said...

Bravo! Fantastic narration!!

రాధిక said...

వరూధినిగారి ప్రహసనంలానే వుంది ఇది కూడా. ఎక్కువగా నిర్లక్ష్యంగా బండిని తోలేది ఆడవాళ్ళేనట.ఆ మాటంటూనే మావారు నాకు డ్రైవింగు క్లాసు మొదలుపెట్టారు.చిన్న చిన్న విషయాలకే పెద్దగా క్లాసు తీసుకునే ఆయన ఈ విషయంలో మాత్రం చాలా సం యమనం పాటించారు.కారును గెరేజ్ లో పెట్టేటప్పుడు రెండు వైపులా పెద్ద చొట్టలు పెట్టినా కిమ్మనకుండా ఆయన వేరే కారు కొనుక్కుని ఆ డొక్కు కారు నాకిచ్చేసారు.లైసెన్సు వచ్చిన ఆరోనెలలోనే ఇంకో చిన్న యాక్సిడెంటు కూడా చేసాను.అలా రెండు యాక్సిడెంట్లు,నాలుగు రిపేరులతో కాలం గడిచిపోతుంది.

రానారె said...

:)

"మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చుకదా?"
"డ్రైవింగ్ సులభమే నేను చాలాసార్లు నేర్చుకున్నాను."

"ఓహో మీరు నిత్యవిద్యార్థినులన్నమాట"
"... అనుకోండి"

"సిసలైన విద్యార్థి లక్షణం అదే"
"బాగా చెప్పారు"

"ఈ విద్య కూడా దానం చేసే కొద్దీ పెంపొందుతుంది"
"ఏమిటి?"

"చిరాకు"
"..."

"ఎవరికని అడగరే?"
"ఎందుకులెండి, క.చిం.కా.మీ.పడుతుంది"

సిరిసిరిమువ్వ said...

బాగుంది. ఏదైనా నేర్చుకునేటప్పుడు దెబ్బలు తగిలితే అది త్వరగా వస్తుందంటారు,స్కూటర్ అయితే మనకి, కారు అయితే కారుకి :)).

'మధ్య లేన్లో ఇరవైలో, ముప్ఫైలో నడుపుతూ ఉంటారు! స్పీడుగా తోల్లేరు, వెనక గింజుకునే వాడికీ దారీ ఇవ్వరు'.....మగవాళ్ళంతా ఇలానే ఆలోచిస్తారన్నమాట.

మాలతి said...

భళా భళీ..
ఇదేదో సినిమా డైలాగు కాబోలు. నాకు తెలీదు కనక మీ వాక్యమే వాడేసుకున్నాను. మామూలుగా డ్రైవింగు చేసేవారెనరికీ వేరేవాళ్లు చేస్తే నచ్చదు లెండి.
పాపం, శ్రీనివాసుగారు. :)

మొత్తంమీద బాగుంది సుజాతా.

Anonymous said...

'మా ఆవిడ ఫాం లో లేదు లెండి '

మీ ఆయన మంచి చతుర్లే..

భారత్ సంగతి తెలీదు గానీ. అమెరికాలో మాత్రం ఆడవాళ్ళు నడిపినంత క్రేజీ గా ఎక్కడా నడపరు.

-- విహారి

సుజాత వేల్పూరి said...

@చంద్ర శేఖర్ గారు,
@భరత్ గారు,
మురళి గారు
@కొత్త పాళీ గారు,

థాంక్యూలండీ!

రాధిక గారు,
వరూధిని గారెవరు? ఆమె కూడ ఇదే సబ్జెక్టు మీద రాశారా? పోన్లెండి, మొత్తం మీద నడుపుతున్నారు కదా! నేను సిటీలో నడపను గానీ, long drive కి ఎప్పుడైనా వెళ్ళినపుడు, హై వే మీద ఏదో కొంచెం ప్రయత్నిస్తాను.
రానారె గారు,
నేను శ్రీనివాస్ నాకు తీసుకునే క్లాసుల్లో కొన్ని దాచి కొన్ని మాత్రమే రాశాను.ఎందుకంటే 'క.చిం.కా.మీ పడుతుందనే!

@సిరిసిరి మువ్వ గారు,
నేనూ అదే అనుకుంటున్నానండీ! ఆడ డ్రైవర్ల మీద నాకు తెలిసి చాలా మందికి సదభిప్రాయం లేదు.

@ మాలతి గారు,
ఇది పాత సినిమాలోదే! దండమూడి రాజగోపాల్ క్రిష్ణ పాండవీయం సినిమాలో భీముడిగా, బకాసురుడి దగ్గరకు వెళ్ళేటపుడు పాడే పాట. అయినా మీరు 'పాపం శ్రీనివాసు ' అంటారేమిటి? ఇంత గ్రుహ హింస రాసినా నా మీద జాలి కలగలేదా?
@ విహారి గారు,
ఎంతైనా గోదావరి, ముఖ్యంగా పశ్చిమ గోదావరి వాళ్ళకి కొంచెం చతురత్వం ఎక్కువే అని ఒప్పేసుకున్నాను.(ఏదో ఆర్గ్యుమెంట్ కోసం గుంటూరే గొప్ప అని వాదించినా)డ్రైవింగ్ విషయం లో ఆడవాళ్ళు యూనివర్సల్ గా ఒక్కటే అని శ్రీనివాస్ స్నేహ వర్గంలో కూడా ఒకటే చింతిస్తుంటారు.

Kathi Mahesh Kumar said...

బాగు..బాగు. ట్రాజడీ లోనే కామెడీ ఉంటుంది కామోసు.ఐనా నానో కారు మీద మీ ఆశ, టాటావారికి ఖచ్చితంగా తెలియ జెప్పాలి.

దైవానిక said...

బెంగుళూరులో కారు నడపడం కంటే కాలినడక బెటరేమో ఆలోచించండి :)

KK said...

ఇంత మంచి టపా ఈ మధ్యకాలంలో చూడలేదు. ఫ్లో ఎంతో బాగుంది. ప్రతి వాఖ్యమూ ఎంతో నవ్వు తెప్పించింది. బెంగుళూరు వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కడైనా నానో కనపడితే మాత్రం వళ్ళు కాస్త జాగ్రత్తగా పెట్టుకుని నడవాలని నిర్ణయించుకున్నాను. :)

-నువ్వుశెట్టి బ్రదర్స్

సుజాత గారు! ఓ విజ్ఞప్తి, మీరు కూడా గూగులోళ్ళకే పెద్ద పీట వేసి, వర్డ్ ప్రెస్ వాళ్ళు కామెంట్ ఇవ్వకుండా నిరోధించకండి. ఇప్పటికే సగం బ్లాగుల్లో వర్డ్ ప్రెస్ బ్లాగర్లు వ్యాఖ్యలు వ్రాయాలన్నా వ్రాసే వెసలు బాటు లేదు.

మధురవాణి said...

సుజాత గారూ..
త్వరలో మీ కోసం నానో కారు బుకింగ్స్ మొదలవుతాయంటా.. మరి మీ వారిని సన్నద్ధం చేయండి కొనడానికి ;)

sivaprasad said...

ఈయన 'ఆగండాగండాగండాగండాంటూ అడ్డం పడి 'మా ఆవిడ ఫాం లో లేదు లెండి ' అని చెడగొట్టాడు.
meeko goodnews nano car vachhindi kada. eppudu tisukontaru

nuthakkis said...

Sujatha gaaru.. super raasarandi.. too much undi, nenu ma srivariki chadivi mari vinipinchi.. potta pagilee laa navvukunam..

Tulasi said...

mee friend cheppindhi nootiki nooru pallu nijamandi... ma friend okati nannu driving nerchukomani roju class teesukuntunte bharinchaleka, maa varini porapatuna driving nerpamani adiganu... adagga adagga konnallaki oka class teesukunaru... hammo yenni kekalo... ika maaa vari kekalaki bhayam vesi India vachinappudu yedina driving school lo join ayyi nerchukundamani decide ayyanu. "mogudi daggara driving nerchukovadam nijjam ga chala kastamandi"

Post a Comment