ఇవాళ స్కూళ్ళు తెలిచే రోజు! కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మినహా, ప్రతి యేడూ ప్రభుత్వ పాఠశలలన్నీ తెరిచే రోజు! పిల్లలంతా ఆసక్తిగానూ, కొంచెం నిరాశగానూ (అప్పుడే సెలవులైపోయాయా అని) ఎదురు చూసే రోజు!
ప్రతి జూన్ పన్నెండునా స్నేహితులందరినీ మళ్ళీ కలుసుకోబోతున్నామన్న సంతోషంతో స్కూలుకి వెళ్ళేవాళ్ళం మేము! ఇప్పట్లాగా ఇన్ని కమ్యూనికేషన్లు అప్పుడు లేవు పదిహేను పదహారేళ్ళ క్రితం! అందువల్ల ఏప్రిల్ 23(చివరి పని దినం)న విడిపోతే మళ్ళీ జూన్ పన్నెండునే పునర్దర్శనం! పైగా సెలవులిచ్చిన రోజునే, (లేదంటే ఆ మర్నాడన్నా) మామయ్య వాళ్ళింటికో అమ్మమ్మ వాళ్ళింటికో చెక్కేస్తాం కదా!
స్కూలు పునఃప్రారంభం రోజు స్కూలంతా కొత్త కొత్తగా ఉంటుంది అది మన స్కూలే అయినా! అవే క్లాసు రూములు, వాళ్ళే టీచర్లు! అయినా సరే! టీచర్లు కనపడగానే 'అమ్మయ్య ' అనిపిస్తుంది. ఎందుకో కొంచెం భయం కూడా వేస్తుంది. ఆ రోజు టీచర్లందరూ కొత్త చీరలు (సెలవుల్లో కొన్నవి) కట్టుకొస్తారు! మనం మాత్రం యూనిఫాం లోనే వెళ్ళాలి. కొత్త అడ్మిషన్ వాళ్ళకి కొంచెం సడలింపు!
టీచరమ్మని వాళ్ళాయన బండి మీద దింపితే 'టీచరు గారికి కూడా మొగుడూ, పిల్లలూ ఉంటారా' అని తెల్లబోయే వాళ్ళం మేము!ఉంటారని అంతకు ముందు తట్టదు ఎంచేతో!
మా వూరి ఆడపిల్లల హైస్కూలు మేము చదువుకున్నపుడు(ఇప్పుడెలా ఉందో తెలియదు)మార్కుల్లోనూ, ఇతర extra curricular activities కీ చాలా పేరు పొందింది! టీచర్లు అంతా మమ్మల్ని స్నేహితుల్లాగానే చూస్తూ, తగిన క్రమశిక్షణలో ఉంచేవారు! పొరపాటున జడలు ముందుకు పడినా మా N.S టీచర్ జోసెఫిన్ గారు 'జెళ్ళు జెళ్ళు ' అని హెచ్చరిస్తూ ఉండేది! పైగా మా కాంపౌండులోనే బాయ్స్ హైస్కూలు మా పక్క బిల్డింగ్ లోనే ఉండేది!(ఈ హైస్కూల్లోనే నాయని సుబ్బారావు గారు హెడ్ మాస్టర్ గా పని చేసారు. వారి అమ్మాయి నాయని కృష్ణ కుమారి గారు మా నాన్న గారి క్లాస్ మేట్) అందువల్ల మమ్మల్ని టీచర్లు సొంత పిల్లలకంటే జాగ్రత్తగా చూసే వాళ్ళు!
కొత్త యూనిఫాం కుట్టించుకోవడం ఒక పెద్ద పండగలా ఉండేది మాకు!ఇప్పట్లా స్కూల్లోనే అమ్మేవాళ్ళు కాదు! బయటే కుట్టించుకోవాలి!కొత్త షూలు కొనుక్కోవడం, వాటిని మొదటి నెలరోజుల పాటు రోజూ అవసరమున్నా లేకపోయినా పాలిష్ చేయడం..సాక్సులు ఉతకడం బలే సరదాగా ఉండేది!ఇక లేపాక్షి నోట్సులు కొనుక్కోవడం మరో సరదా! అవి బాయ్స్ హైస్కూలు స్టాఫ్ రూం దగ్గర దగ్గర అమ్మేవాళ్ళు! 200 పేజీల ఒక్కో నోట్సు ఒక రూపాయి తొంభై పైసలు! (నిన్ననే మా పాపకి 180 పేజీల నోట్సు 23 రూపాయలు పెట్టి తెచ్చాను) దాని మీద నంది బొమ్మ ఉండేది. పుస్తకాలకు బ్రౌన్ కలర్ కవర్లు వేయాలనే నిబంధన ఉండేది కాదు. నా ఫ్రెండ్స్ కొందరు సితార, జ్యోతి చిత్ర మొదలైన పుస్తకాల్లోంచి కలర్ ఫుల్ గా సినిమా బొమ్మల కవర్లు వేసుకొచ్చేవాళ్ళు! అలాంటివి వేస్తే మా నాన్న గారు చంపి ఉప్పు పాతర వేస్తారు కాబట్టి నేను, మా చిన్నన్నయ్య, మా చెల్లెలు చచ్చినట్టు బ్రౌన్ కలర్ అట్టలు వేసుకునేవాళ్లం మనసులో ఏడుస్తూ!
సెక్షన్లు చేయక ముందు అందరం కలిసి ఒక పెద్ద హాల్లో కూచునే వాళ్ళం! మా ఫ్రెండ్స్ అందరం ఒకే సెక్షన్లో ఉండాలని 'మమ్మల్ని విడగొట్టద్దని ముందే క్లాస్ టీచర్ ఎవరో కనుక్కుని ఆవిణ్ని బెదిరిస్తూ వేడుకునే వాళ్ళం! 'నోళ్ళు ముయ్యకపోతే మాళ్ళు పగుల్తాయి '(ఇది మా జోసెఫిన్ గారి డవిలాగే, నాకు గుర్తుంది)అని ఏ మాటా ఇవ్వకుండానే మా గుంపుని ఒకటే సెక్షన్లో వేసేవారు! టెంత్ క్లాసులో మాత్రం అందరం బి సెక్షను, లెనినా మాత్రం ఏ సెక్షన్లో పడటంతో అది వెక్కి వెక్కి యాడవటం మొదలు పెట్టింది, ఒక రోజంతా! దానితో దాన్ని మళ్ళీ మా సెక్షన్లో వేసారు. పిల్లల మనో భావాలకు, భావోద్వేగాలకు అంత విలువ ఇచ్చేవాళ్ళు మా బంగారు టీచర్లు!
సెక్షన్లు చేయగానే మేము 80 శాతం పైగా మార్కులు ఎవరు సంపాదించగలరో వారికి మా గ్రూపులో ఉదారంగా చోటిచ్చే వాళ్ళం!ఇహ అప్పటి నుంచే పోటీ మొదలు! కానీ మా మీద ఎటువంటి వత్తిడీ ఉండేది కాదు! ట్యూషన్ కి కూడా వెళ్ళే అవసరం మాకెప్పుడూ రాలేదు. అంత బాగా ఉండేవి పాఠాలు! స్కూలునీ, చదువునీ ఇష్టమైన పనిగా నిర్వహించాం అప్పుడు!
ఈ ఏడాది కొన్ని ప్రైవేటు స్కూళ్ళు మే చివరి వారంలోనే స్కూళ్ళు మొదలెట్టేశాయి మండుటెండల్లో! 'ఇంట్లో కూచుని ఏం చేస్తారు పిల్లలు? కాస్త సిలబస్ అన్నా కవర్ అవుతుంది, మొదలెట్ట 'మని తల్లి దండ్రులే అడిగారని వాళ్ళు చెపుతున్నారు. ఆరో క్లాసు నుంచే IIT కోచింగ్ ఇచ్చే కొన్ని స్కూళ్ళైతే అసలు వేసవి సెలవులివ్వడానికే ఆసక్తి చూపించట్లేదు! ఏ మాత్రం సిగ్గు పడకుండా 'ఆరో తరగతి నుంచే చదివే ప్రతి పాఠం వెనకా IIT ఆశయం, రాసే ప్రతి టెస్టు లోనూ IIT కోణం అని FM రేడియోలో కూడా ఊదరగొట్టేస్తున్నారు! ఎంతమంది గొర్రెలమంద లాంటి పేరెంట్స్ లేకపోతే వాళ్ళకంత ధైర్యమొస్తుంది?
సెలవులూ, ఆటలూ,వెన్నెలా, అమ్మమ్మ గారి ఊరూ, తాతయ్యతో షికార్లూ కాలవలో స్నానాలూ, ఆరుబయట వేసవి నిద్రలూ ఇవేవీ అక్కర్లేదన్నమాట పిల్లలకి! వాళ్ల మనసుల్నీ, ఆలోచనలనీ,సృజనాత్మకతనీ, చివరకి వాళ్ళ మనసుల్లోని ప్రేమని కూడా చంపి IIT గోతిలో పాతిపెట్టడానికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు సిద్ధం! వారికి పలుగు పారా అందించడానికి వేలకొద్దీ తల్లిదండ్రులు సిద్ధం!
రండి, చూడండి, కూకట్ పల్లిలో, దిల్ సుఖ్ నగర్లో...గుంటూర్లో, విజయవాడలో .. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా..వీరే...వీరే!
చదువులా...చావులా ఇవి?
7 comments:
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసారు...
ప్చ్.. నిజమే. బంగారు రోజులు అవి. లేపాక్షి పుస్తకాలు కొనడం, వాటికి అట్టలెయ్యడం, రంగు రంగుల లేబిళ్ళు అతికించడం భలే సరదాగా ఉండేది.
bhale gurtu chesaaru. ippudu aaro taragati nuche IIT foundationata. papam ippati pillalu.
కొన్ని మనసు అడుగులో ఫెట్టి మర్చిపోయిన మడతల్ని విప్పి చుపింఛారు.
నిజమే టీచర్లకి వాళ్ళ ఇల్లూ,మొగుళ్ళు ప్రపంఛం ఉంటాయని మొదట తట్టదెందుకో?
నాకైతే IITలో చదవడానికి రెండు సంవత్సరాల ముందు వరకూ (అంటే ఇంటర్ మొదటి సంవత్సరం వరకూ) అసలు IIT అనేది ఒకటి ఉండి ఏదిసిందనే తెలియదు. అల్లాంటిది ఇప్పుడు మా ఊళ్ళో నేను చదివిన స్కూల్లోనే ఇంకా ఏడో క్లాసు కూడా అవ్వదు, IIT foundation కోర్సు. బొడ్డూడనివాడి దగ్గర్నుంచీ మొదలు... ఏరా/ఏమ్మా పెద్దాయ్యాక ఏం చేస్తావూ అంటే ఈ మధ్య తరచుగా వినబడుతున్న సమాధానం -- IIT! అసలు రామయ్యగారు (ఆయనొక్కడే కాదు కదా ప్రపంచంలో ఉన్నది, ఐనా సరే) IIT కోచింగ్ ఇస్తుంటే, ఆయన పెట్టే టెస్ట్‌కి కోచింగిచ్చే సెంటర్లూ, ఈ సెంటర్లలో సీటుకోసం కోచింగిచ్చే స్కూళ్ళూ... ఓహో, అద్భుతం.
ఆడుతూ పాడుతూ చదివిన చదువుకీ నేడున్న పరిస్థితులలో నిత్యం ఒత్తిడితో చదివే చదువుకీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని అందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాలి.
maa bangaaru teecharlu..!
Enta chakkani maata annaru sujatha gaaru. Nijangaane individual space kosam ee rojuna potlaadukovaalsina paristhiti. Adakkundaane manasu lo maata itte artham cheskune vaari pempakam lo peragadam adrustamein..!
Summer saayantraalu...current pote adi vache lopu pillalaki annalu kalipi petteyatam...ee rojuna vere desam lo okkallamein vandukuni tintonte anipistundi ammumma muddalu pedtonte toduga enni chetulochevo ani..!
pindarabosinatlunna vennello aadukunna gnapakam undi ..aa vennela aatalaki current ravatam oka disturbance...aa ventane nidra pommanamane pilupu vastundi...peratlo padukunevallam...andaram pillalam oka pakkana ammumma tatayyalaki maatram manchaalu...memu padukunte late ga bhojanam chese pedda valla maatalu...chukkala velugu peratlo..spastanga kanapadevi...aa okka vesavi selavula voorintato samvatsarapu chaduvoo chadivevallam...
chaala mandi teachers perlu inkaa gnapakam unnayante...adi nijanga valla aatmeyate...
enni gurtuku chesaarandi...! ee roje mee blog lo 3-4 posts chadivaanu...chaala mandi comments choosanu...oka taanlo mukkalu anedi ammumma ...alage unnaru andaru chaala nachindi...
Arvind
Wonderful, Superb
Hi
Post a Comment