June 18, 2008

అమ్మ, నాన్న, ఓ వృద్ధాశ్రమం

అమ్మ, నాన్న!కడుపులోంచి వొడిలో పడ్డప్పటి నుంచి బిడ్డలే ప్రాణం అమ్మకి. పొత్తిళ్లలోని పాపని, పెంచి ప్రయోజకుణ్ణి చేయడానికి అమ్మకి ఎంత టైము పట్టి ఉంటుంది? గాలికి పెరగలేం గా? పసితనంలో ఒకట్లు, రెండ్లు శుభ్రం చేయడాలు, అన్నం తిననని మారాము చేస్తే ఎత్తుకుని చందమామని చూపిస్తూ తినిపించడాలు! బిడ్డకి చిన్న సుస్తీ చేసినా అన్నం మానేసి కళ్లల్లో వొత్తులేసుక్కూచునే అమ్మ,పెద్దయ్యాక కూడ పిల్లలకోసం ఎన్నో త్యాగాలు చేసే అమ్మ(అవి త్యాగాలని ఆమె గుర్తించదు) !
మరి నాన్నో! ప్రయోజకులైన వ్యక్తులున్నారంటే వారి వెనక తండ్రుల శ్రమ, బాధ్యత, త్యాగం ఇవేవీ లేకుండానే తయారైపోతారా?(స్వయం శక్తితో పైకొచ్చిన వారు నూటికో కోటికో ఉండొచ్చు) మన పరీక్షల ఫలితాల కోసం మనకంటే టెన్షన్ గా ఎదురు చూసే నాన్న! మన విజయాలను తన విజయాలుగా చెప్పుకునే నాన్న! మన కోసం రెండు ఉద్యోగాలు చేసిన నాన్న! మన 'కంఫర్ట్స్ ' కోసం తన అవసరాలను వాయిదా వేసే నాన్న!
పై వాళ్ళిద్దరికీ పిల్లలెప్పుడూ 'బర్డెన్ ' కాదు! అనవసరపు 'లగేజీ ' కాదు! వారి సౌకర్యాల తర్వాతే తమ అవసరాలు!
మరి ఇప్పుడు మన జీవితాలు మన చేతుల్లో ఉన్నప్పుడు, అమ్మ, నాన్న మనకెందుకు 'బరువై 'పోతున్నారు? మన 'కుటుంబం 'లో వారికెందుకు చోటు లేదు? వీధికో బస్టాపులా గా ఏరియాకు నాలుగైదు వృద్ధాశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయి. అవేమైనా ఖాళీగా ఉన్నాయా అంటే ...లేవే?
భార్యా భర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో ఇంట్లో వృద్ధులుంటే వారి పరిస్థితి ఏమిటి? ఆరోగ్యం సరిగా ఉంటే సరే! లేనివారైతే? ఇద్దరిలో ఒకరు ఉద్యోగం మాని ఇంట్లో కూచోలేని పరిస్థితి అయితే? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వెలిసినవే 'రెటైర్మెంట్ హోం లు '!
ఇటువంటి పరిస్థితి లేని కుటుంబాల నుంచి కూడా వృద్ధులు స్వచ్చందంగా ఆశ్రమాల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి దాని వెనక ఏముంది? నిస్సందేహంగా పెద్ద వారికి కావలసిన ఆదరణ (వేళకు తిండి, పడక కాదు ఆదరణంటే) ఆ ఇంట్లో దొరక్కపోవడమే!
నాకు తెలిసిన ఒక రెటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు. భార్య పోయింది. పెద్ద కొడుకు ఉన్న ఇల్లు ఆయనదే! ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఒక ఫైన్ మార్నింగ్ 'నేను ఫలానా ఆశ్రమంలో చేరుతున్నానని ప్రకటించి వెళ్ళిపొయారు. అక్కడ ఆయన స్నేహితులున్నారు. కొడుకు, కోడలు వెర్షన్ల ప్రకారం ,చుట్టుపక్కల వాళ్ళ వెర్షన్ల ప్రకారమూ, కూడా ఆయనకు ఆ ఇంట్లో ఏ కష్టమూ లేదు.

అక్కడ ఆయనకు కావలసింది తిండి, బట్ట మాత్రమే కాదు, తన మనుషులు కూడా! కోడలు తమ్ముడు చదువుకోడానికి సిటీకి రాగానే, ఆవిడ బాల్కనీ కి sliding glass shutters పెట్టించి దానికి 'గది ' కళ తెప్పించి ఈయన కోసం ఒక మడత మంచం కొని అందులో వేసింది. ఆయన తన గది వదిలి అందులో ఉండాల్సి వచ్చింది. పేపరు పొద్దున్నే ఆయన చేతికి రాదు. అందరూ ఆఫీస్ కి , స్కూళ్లకు వెళ్ళాక చదవాలి. ఇంట్లో వాళ్ళు(పిల్లలతో సహా) ఏ చానల్ పెడితే అదే చూడాలి! ఏదన్నా విషయంలో కల్పించుకుని మాట్లాడబోతే 'మీరూరుకోండి, మేము మాట్లాడుతున్నాంగా, అంతా చాదస్తం " అని ఈసడింపులూ! స్నానం పూజ అన్నీ అందరూ వెళ్ళాకే! ఎవరికీ అడ్డం కాకూడదన్న వాళ్ళ మనసులో భావాన్ని ఆయన ఎవరూ చెప్పకుండానే గ్రహించి తన అలవాట్లు మార్చుకున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా రెండో సారో, మూడో సారో కాఫీ తాగాలనిపిస్తే అడిగే స్వతంత్రం కూడా ఈయనకు లేకపోవడం! భార్య పోయిన మగాళ్ల దుస్థితి ఇక్కడ బయట పడుతుంది.
ఈ పరిస్థితిలో ఆయన తన మిత్రుడిని కలుసుకోడానికి ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి సాయంత్రం వరకూ అక్కడ హాయిగా గడిపి...వెంటనే ఒక నిర్ణయానికొచ్చారు. పొద్దున్నే వాకింగ్, కాఫీ, టిఫిన్, ధ్యానం,నాలుగైదు రకాల పేపర్లు, మంచి మిత్రులు, అందుబాటులో డాక్టరు! వృద్ధాప్యంలో ఇంతకంటే ఏం కావాలి? 'ప్రేమ? ' ! కరక్టే, ప్రేమ కావాలి! అది దొరకదని నిర్థారణ అయ్యాక, భౌతికం గా దొరికే మిగతా వాటితో తృప్తి చెందడం కరక్టేగా!

ఇంకొకరి విషయం! భార్యా భర్తా ఇద్దరూ డాక్టర్లు! కొడుకూ, కూతురూ ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో అమెరికాలో స్థిరపడ్డారు. డబ్బుతో పాటు ప్రేమ కూడా ఉంది వాళ్ళకి! కానీ ముసలావిడకి అక్కడి వాతావరణం పడకపోవడంతో ఇండియా వచ్చేసారు. ఇద్దరూ ఒంటరిగా ఉండలేకపోయారు..ఆరోగ్య కారణాల రీత్యా! అందుకే హోం లో చేరారు.వాళ్ళు దగ్గర లేరన్న చింత తప్ప పిల్లలకు వారి బాగోగుల గురించి చింత లేదు.ఇదొక పరిస్థితి!

ప్రేమాభిమానాలు పిల్లల దగ్గర లభిస్తే తప్ప, 'వృద్ధాప్యంలో కొడుకు దగ్గరే ఉండాలి ' అని నిర్ణయించుకోవడం, సమాజం ఏమనుకుంటుందో (కొడుకు గురించి) అనే ఒక false concernతోనో పిల్లల దగ్గర పడుండక్కర్లేదని నా అభిప్రాయం!

ఈ మధ్య వచ్చిన కొత్త చట్టం..వృద్ధులైన తల్లి దండ్రుల బాధ్యతను పిల్లలు తిరస్కరిస్తే 3 నెలలు జైలు తప్పదని హెచ్చరిస్తోంది! ఎంత మంది తల్లులు, తండ్రులు ముందుకు వచ్చి పిల్లల గురించి ఫిర్యాదు చేస్తారు? తల్లి దండ్రుల నుంచి ఆస్థులను పొందిన తర్వాత వారిని నిర్లక్ష్యం చేస్తే, తిరిగి వారినుంచి ఆస్థులను స్వాధీనం చేసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టం కల్పిస్తుందట! ఈ చట్టాన్ని ఎంతమంది తల్లి దండ్రులు ఉపయోగించుకుంటారో చూడాలి!
ఇక ప్రతి వృద్ధాశ్రమంలోనూ ప్రేమగా చూస్తారా, ప్రశాంత వాతావరణం ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టం! సిటీ మధ్యలో చుట్టూ పెద్ద స్థలం కూడా లేకుండా నడిపే ఆశ్రమాలున్నాయి.ఇక్కడ మనం 'పిండి కొద్దీ రొట్టె ' సామెత గుర్తు చేసుకోవాలి!

అయితే ఒక విషయం! ఎంత విశాలమైన ఆశ్రమం అయినా, ఎన్ని వసతులున్నా, డాక్టరు పక్కనే ఉన్నా పిల్లల (ప్రేమ పూర్వక)సాహచర్యం, సాన్నిధ్యాన్ని మించింది ఉంటుందా? కనీసం వొంట్లో నలతగా ఉన్నపుడైనా 'పిల్లలుంటే ఇప్పుడు ?' అనిపించదంటారా? (అక్కడ చేరిన పరిస్థితులేవైనా కానివ్వండి)

13 comments:

Kathi Mahesh Kumar said...

ఇది చాలా సున్నితమైన, అంతకన్నా క్లిష్టమైన (complex) సామాజిక సమస్య.రాబోయే కాలంలో ఈ సమస్య పెరిగేదేగానీ, తగ్గేది అస్సలు కాదు.

సమాధానం కోసం ఖండాంతరాలను చూడాలా, లేక మనదంటూ ఒక జవాబు దొరుకుతుందా అన్న విషయం కూడా అంతుచిక్కని ప్రశ్న ఇది.

వేగవంతమైన జీవితం,పని,డబ్బు సంపాదన, భార్యాపిల్లలపై వెచ్చించాల్సిన వనరులూ/సమయం ఇలాంటి ఎన్నో వత్తిళ్ళ మధ్య భవిష్యత్తును వెదుక్కుంటున్న మనకు,తల్లిదండ్రులు ఒక ‘పాస్ట్’అన్నది భయంకరమైన నిజం.

ఈ నిజాన్ని ఎంత గౌరవప్రదంగా అంగీకరించి, ఈ సమస్యకు పరస్పర ఆమోదయోగ్యమైన సమాధానాన్ని ముందుకు తీసుకురావడానికి, మీ ఆలోచన ఒక మెట్టవుతుందని ఆశిస్తాను.

అది తప్పా,ఒప్పా అని కాకుండా, ఇది తప్పనిసరైనప్పుడు ఎలా సామరస్యంగా ఎదుర్కోవాలి అనేదానిమీద చర్చ జరిగితే బాగుండునని కోరుకుంటాను.

సుజాత వేల్పూరి said...

మహేష్ గారు,
అవును, తప్పా ఒప్పా అని కాకుండా సామరస్యంగా దీనిమీద చర్చ జరగాలి!

మేధ said...

మహేష్ గారు చెప్పినట్లు ఇది చాలా సున్నితమైన, అతి క్లిష్టమైన సమస్య.. సమస్య ఎవరి కోణంలొ విన్నప్పుడు, వాళ్ళ వాదన కరెక్టేమో అనిపిస్తుంది.. భార్యా, భర్త ఇద్దరూ ఉన్నప్పుడు కనీసం ఓపిక ఉన్నంతవరకూ విడిగా ఉండి, కాస్తైనా మనశ్శాంతి గా ఉంటారు.. అలా కాకుండా ఒక్కళ్ళే ఉంటే చాలా కష్టం...
దీంట్లో మళ్ళీ ఇంకో విషయం కూడా ఉంది.. పిల్లలకి పేరెంట్స్ ని ఉంచుకోవడం ఇష్టం ఉండదు (రకరకాల కారణాలు).. అలాగని వాళ్ళు వృధ్ధాశ్రమానికి వెళతాము అంటే, మా పరువు పోతుంది అని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటారు.. (ఇలాంటివి నేను చాలా చూశాను!).... అలా ఆ పెద్దవాళ్ళు రెండు రకాలుగా నలిగిపోతుంటారు...
ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే, మొదట్లో వృధ్ధాశ్రమం బానే ఉన్నా, కాలం గడిచేకొద్దీ, పిల్లలు దగ్గర లేరనే బాధ ఎక్కువవుతూ ఉంటుంది..
కోడలు అత్తగారిని అమ్మలాగా చూడకపోయినా, మనిషిగా గౌరవించగలగాలి, అలానే అల్లుడు తన దగ్గర ఉన్న అత్తమామలని ఎవరూ లేని దిక్కు లేని వాళ్ళుగా కాకుండా, తన వాళ్ళలాగా చూసుకోగలగాలి.. ఇలా జరగాలని ఆశించడం దురాశేమో....

Sujata M said...

సుజాత గారూ.. హాయ్. మంచి విషయం రాసారు. ఇందులొ రెండు పార్స్వాలు ఉన్నాయి. ఇది పిల్లలకు కూడా టైట్ రోప్ వాక్ అని గ్రహించాలి. జీవితం అంతా ఎవరికి వారు అడ్జస్ట్ అవుతూ బ్రతకటం ఉంటుంది. దీని బదులు, ఇంట్లొనె ఎవరికి వారి స్పేస్ ను మొదటె నిర్ణయించుకుంటే మంచిది. మొహమాటం - చేటు చేసె అవకాసాలు ఎక్కువ.

రాఘవ said...

ఈ దుస్థితి కొడుకూ కోడలూ ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల మాత్రమే కాదని నిక్కచ్చిగా చెప్పగలను. కాలం గడిచే కొద్దీ మనుషుల మధ్య బంధాలు తగ్గుతున్నాయా అనిపిస్తోంది, ఈ ధోరణి చూస్తూంటే. దీనికి మారుతూన్న జీవనవిధానం ఒక కారణమైతే కావచ్చేమో కానీ అదే పూర్తిగా కారణం కాదు.

నాకు ఆశ్చర్యం వేసే విషయం... ఇన్ని వేల సంవత్సరాలుగా లేని (బయటకి కనబడేటంతటి పెద్ద) సమస్య గత పదేళ్ళుగా ఎందుకింతగా వేళ్ళూనుకుంది? అని.

ఆశ్రమాలలో చేర్పించే పిల్లలు "మన తల్లిదండ్రులకి వచ్చిన పరిస్థితి తర్వాత తర్వాత మనకే వస్తే మనం ఎలా స్పందిస్తాం?" అన్నదాని గురించి ఆలోచిస్తే చాలా మటుక్కు దీనికి పరిష్కారం దొరకచ్చేమో!? అలాగే వారంతట వారే వెళ్ళి ఆశ్రమాలలో చేరిన తల్లిదండ్రులు ఎందుకు అలా చేశారో అర్థం చేసుకోవాల్సిన కనీస బాధ్యత వారి వల్ల మనిషిగా పుట్టినందుకు వారి పిల్లలు గుర్తించాలి. లేకపోతే మనిషిగా పుట్టినా వాళ్ళ జన్మ పశుతుల్యమే.

వేమనయోగి అన్నట్టు "తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా?"

రవి said...

ఇది చాలా సున్నితమైనది. సుజాత గారు చెప్పినట్టు తప్పొప్పులెవరివి అన్న పంథాలో కాకుండా సమస్య ను ఎలా పరిష్కరించాలి అన్న చర్చ అవసరం. దానికి కొడుకులు ఎదుర్కుంటున్న సమస్యలు కూడా ఏమిటి అన్న విషయం గమనించాలి.

రాఘవ గారు అన్నట్టు ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇది జెనెరేషన్ గాప్ వల్ల వచ్చిన సైడ్ ఎఫ్ఫెక్ట్. ఓషో అనే ఆయన ఓ చోట అంటాడు " This is the first generation in india, which could offord generation gap" అని .

రానారె said...

ఈ పరిస్థితి ఈమధ్య కాలం లోనే ఎందుకు విషమిస్తోందంటే - నాకు తోచిన కారణం - ఒక్క మాటలో చెప్పాలంటే ఇటీవలే మనదేశంలో బలపడుతున్న కాపిటలిజం. ముందు ప్రజాక్షేమము, ఆ తరువాతే ప్రగతిమార్గము అనే సంప్రదాయ బాటను వదిలి, ముందు ప్రగతిమార్గము, తరువాతే ప్రజాక్షేమము అనే బాటను పడుతున్నాము. మన ప్రభుత్వాలు కనీసావసరాలనన్నింటినీ క్రమంగా వ్యాపారీకరించి, మన చింతనలో వ్యాపారాత్మక ధోరణిని పెంచి, మనడానికి మరో మార్గం లేకుండా చేస్తున్నాయి. విద్య, వైద్యం, ఆహారం, చివరకు రైతులకు సాగునీరు కూడా కొనవలసిన 'సరుకులు' గా మారుతున్నాయి. ఈ వ్యాపారీకరణ మార్పు వేగంగా జరుగుతోంది. కుటుంబ బంధాలు ఆ మార్పు ప్రభావానికి ఇదివరకటి కంటే ఎక్కువగా లోనవుతున్నాయి. ప్రశాంతమైన low profile జీవన శైలిని గురించి మాట్లాడేవారు చేతగానివారుగా గుర్తింపబడుతున్నారు. సన్యాసులు కూడా నేడలా జీవించడం లేదు. అందుకు తగిన వనరులు కూడా లేకుండా పోతున్నాయి. సుఖమయ భౌతిక జీవనాన్ని నిర్మించుకోవడానికి అధిక సంపాదనే మార్గం, ఆ మార్గంలో మనశ్శాంతి కరువవుతున్నా గుర్తించి ఆలోచించే తీరికలేని బిజీ జీవితం, జీవిత లక్ష్యాలు. ఈ లక్ష్యాలెందుకోసం? భవిష్యత్తులో సుఖమయ జీవితం కోసం. ఎప్పుడొస్తుందా భవిష్యత్తు? వృద్ధులమయ్యాకే! అప్పటికి పిల్లలు పెరిగి వుంటారు. వారి లక్ష్యాలు వారికుంటాయి, వారి భవిష్యత్ నిర్మాణంలో వారు తీరికలేకుండా శ్రమపడుతుంటారు. అప్పుడిక ఇంత శ్రమా పడిన పెద్దలకు వృద్ధాశ్రమమే కదా ఆశ్రయం! పిల్లలమీద కొంత ప్రేమ పెంచుకోవచ్చునేమో గానీ వృద్ధాప్యంలో వారు ఆదరిస్తారనే ఆశలు పెంచుకోవడం ఈ పరిస్థితుల్లో మూర్ఖత్వమే.

Kathi Mahesh Kumar said...

@రనారె గారు ఇంత సూక్ష్మంగా చెప్పిన తర్వాత నా అంగీకారం తెలపకుండా ఆగలేను.చాలా విశ్లేషణాత్మకంగా మూలకారణాన్ని ఆవిష్కరించడంతో పాటూ,సమాధానాన్ని కూడా సున్నితంగా సూచించారు. వారికి నా అభినందనలు.ఈ విషయాన్ని ఎన్నుకున్నందుకు మళ్ళీ సుజాత గారికి నా నెనర్లు.

కొత్త పాళీ said...

సమస్య చాలా సున్నితం, క్లిష్టం - ఇది నిజం.
@రాఘవ - సమస్య ఇప్పుడెందుకు తలెత్తింది అంటే తలిదండ్రులు ఉద్యోగస్తులై ఉండి ఉద్యోగాలనించి రిటైరవడం అనేది ఇటీవలే విస్తృతంగా జరుగుతోంది. భూస్వామ్య వ్యవస్థలో పేట్రియార్క్ మేట్రియార్కులు తుదివరకూ వారి వారి సామ్రాజ్యాల్ని పాలిస్తూనే ఉండేవారు. కింది తరంవారు తిరుగుబాటు చేసో, మోసం చేసో అధికారం హస్తగతం చేసుకున్న దృష్టాంతాలూ లేకపోలేదు (జగదేక వీరుని కథలో రామారావు తమ్ముడు తండ్రిని అంటాడు - ముసలాళ్ళే చచ్చేదాకా రాజ్యం చెయ్యాలంటే ఇంక మేమెప్పుడు చెయ్యాలీ?).
నిత్యావసరాలు సమస్య కాని కుటుంబాల్లో పెద్దవారికి కావలసింది ముఖ్యంగా వారి వ్యక్తిగత అభిప్రాయాలకీ అభిరుచులకీ గౌరవం, కొంత ఆప్యాయత.

Anil Dasari said...

ఈ సమస్యలో అత్తాకోడళ్ల కలహాల కోణం గురించి ఎవరన్నా ఆలోచించారా? (మహిళలందరూ నామీద దాడి చెయ్యుద్దు)

సుజాత వేల్పూరి said...

మేథ,
చివరికి తల్లిదండ్రులను దిక్కు లేని వాళ్ళుగా చేయకపోతే చాలు అనుకుంటే దురాశ అనుకునే స్థితి మనది!చూసారా, పరిస్థితి ఎలా పరిణమించిందో!

సుజాత గారు, హాయ్,
హగ్గిచ్చేసుకోండి, HYD వచ్చేసారుగా, నేనూ!

రాఘవ గారు,
మనం వృద్ధులయ్యాక మన సంగతి ఏమిటి అంటే,'ఓకే, మాకు పిల్లల మీద ఆశలేమీ లేవు, మేము హోం కి వెళ్లడానికి రెడీ" అనేస్తున్నారండి ఇప్పటి కొడుకులు, కోడళ్ళు. "మీ అయ్యకు నువ్వు తీసిన గొయ్యి నీకు నేను తియ్యలి కదయ్యా' అని వీళ్ళ పిల్లలూ పాడినా 'ఓకే' అనేస్తారు.

రవి,
దీనిమీద ఇంకా చర్చ జరగాలి, మీరు కరక్టే!

రానారె,
మీరు కరక్టుగా పట్టుకున్నారు! వ్యాపారీకరణ పెరగడం, చివరకు కుటుంబాంకి కూడా అది సోకడం విషాదం!మీరు low profile జీవితం గురించి మాట్లాడే వారు చేతగాని వారుగా పరిగణించబడుతున్నారు...అన్నారే, జీవిత సత్యం చెప్పారు.

కొత్తపాళీ గారు,
వ్యక్తిగత అభిరుచులకు గౌరవం, కొంత ఆప్యాయత. అవి ఇవ్వడానికి....అంత టైము లేదు పిల్లలకు.

అబ్రకదబ్ర,
నిజమే! అత్తాకోడళ్ళ కలహాలు కూడా ఈ సమస్యకు కొంత వరకూ కారణమే! కానీ అవి ఇదివరకటి తరాల్లో కూడా ఉన్నాయి కదా, ఎందుకంటే అత్త, కోడలు యూనివర్సల్ కారెక్టర్లు కదా! మరి వృద్ధాశ్రమాలకు ఈ సమస్యకు ఇవాల్టి రోజుల్లో అంతగా ముడిపెట్టలేం!

ఈ మధ్య బ్లాగుల్లో, ఏం మాట్లాడాలన్నా, భయంగానే ఉంది. ప్రాంతీయత ఆధారంగానో, జెండర్ మూలంగానో తీవ్ర వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుకేనా ముందుగానే ఆడాళ్లంతా దాడికి దిగకూడని చెప్పి మరీ కామెంటారు.

geethoo said...

Great thoughts. Sujatha garu, I have few ideas on old-age home concept. I would like to meet you in person. Actually I live in USA and we are coming back permanently to Hyd next year.
intha manchi abhipraayaalu vunna group of people oka platform lo vunte..great. I can do something for the society ani chinna excitement.
I will be in touch

Unknown said...

sir excellent ga chepparu

Post a Comment