August 27, 2008

నా ఓటర్ గుర్తింపు కార్డు- చిరంజీవి

ఇవాళ పొద్దున్న GHMC(Greater Hyderabad Municipal Corporation) ఆఫీసుకి వెళ్ళాను నా వోటర్ గుర్తింపు కార్డు విషయమై!ఇంతకు ముందు అది processingలో ఉండగా మేము బెంగుళూరు వెళ్ళిపోవడం జరిగింది. నా కార్డు ఒక్కటే పెండింగ్ అనుకుంటే మా వారి కార్డులో తండ్రి పేరు స్థానంలో అసలు ఆయన తండ్రి పేరు కాక వేరివరినో తండ్రిగా నిర్ణయించేసారు.

నా కార్డు జారీ, మా వారి కార్డులో మార్పు --ఈ రెండు విషయాలూ తేల్చాలని బయలుదేరాం! ఎప్పటిలాగానే ఆఖరు తేదీకి నాల్రోజులు ముందు!(ఈ నెల 31 ఆఖరు తేదీ) .

గచ్చి బౌలి మెయిన్ రోడ్ మీద, రోడ్డుకు కొంచెం దూరంగా అందంగా ఠీవిగా ఉంది భవనం! లోపలికి వెళ్ళాక "వోటరు గుర్తింపు కార్డు" పేరుతో కౌంటర్ ఏదీ కనపడలేదు. చివరికెవర్నో పట్టుకుని అడిగితే "ఆస్తిపన్ను" పేరుతో ఉన్న కౌంటర్లోకెళ్లమన్నాడు. అక్కడ మా చిరునామా వింటూనే
"మీ ఏరియా ఇప్పుడు సర్కిల్ 2 కిందకు వస్తుంది. ఇక్కడ కాదు! చందానగర్ లో ఉన్న ఆఫీసుకు పొ"మ్మన్నాడు రంగస్వామి. అప్పుడు టైము లెవెన్ పదిహేను!

"అమ్మో, నాకు మరో అరగంటలో ఇంటర్వ్యూలున్నాయి, నువ్వు ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళు, రేపు చూద్దాం " అని డబ్బులు తీసుకోకుండా సలహా ఇచ్చి తను ఆఫీసు కు వెళ్లాడు.

నాకు పనేం లేదు కనుక నేను చందా నగర్ GHMC ఆఫీసుకు వెళ్ళాను.

అక్కడ నాలాగే చివరి వారంలో వచ్చినవాళ్ళు వందమంది ఉన్నారు. అప్లికేషన్లు తీసుకునే అమ్మాయి, గుప్పెడు వేస్తే మానెడయ్యేట్టు మొహం చిరాగ్గా పెట్టుకుని,ఇచ్చిన వాళ్లని ఏదో ఒక వంక పెట్టి చీవాట్లేస్తూ రిసీట్లు వాళ్ళ మొహాన్న కొడుతోంది.
నా చిరునామా చెప్పగానే "ఇక్కడ కాదు ఇక్కడ కాదు! గచ్చ్చిబౌలియే వెళ్లాలి మీరు! వాళ్ళకు పనెక్కువై మా మీద తోస్తున్నారు! అక్కడికే పొండి" అంది.

ఎంత చెప్పినా వినలేదు. సరే పైన MANAGER అని బోర్డు కనపడి ఫస్ట్ ఫ్లోర్ కెళితే ఆయన ఇంకా రాలేదు.పన్నెండున్నరకి!
ఒక సీనియర్ క్లర్కు దగ్గరకెళ్ళి మళ్ళీ మొత్తం కథంతా చెప్పగా ఆయన కొంచెం దయగా ఓటర్లు లిస్టు తెప్పించి అందులో మా వారి పేరు చూసి
"ఇక్కడే ఇవ్వాలి మీరు! ఇంతకు ముందు enumeratorsఇచ్చిన రిసీట్ ఉందిగా! దాని కాపీ పెట్టి అప్లికేషన్, ఫొటోతో సహా ఇచ్చి వెళ్లండి" అన్నాడు.

నేను ఫొటోలు వాళ్ళే తీస్తారనుకుని చేతులూపుకుంటూ వెళ్ళాను.ఇంతా చేసి వాళ్ల దగ్గర అప్లికేషన్లు లేవు. ఎదురుగా ఫొటోస్టాట్ వాడు ఒక్కోటీ నాల్రూపాయలకు(సింగిల్ పేపరే) అమ్ముతున్నాడు. ఒకటి తీసుకుని ఫొటోతో సహా ఇహ రేపు వద్దామని నిర్ణయించుకుని వస్తుండగా ఒక పాతికమంది తో ఒక గుంపు ఎదురైంది ఆఫీసు గేట్లోనే!

పక్కకు తప్పుకోబోతుండగా "ఏంది మేడం, ఇక్కడున్నరు?" అన్న గొంతు వినపడి చూస్తే...నిజమే, నన్నే!అడిగిన వ్యక్తి లావుగా , ఎత్తుగా ఉన్నాడు. మెడలో స్టీలు గొలుసు,చేతికి పంచలోహాలవో ఏవో కంకణాల్లాంటివి...! చూసిన గుర్తే కానీ ఎక్కడో అర్థం కాక, వెర్రి నవ్వొకటి నవ్వి
"వోటర్ ఐడీ కార్డు గురించి.." అన్నాను. ఎవరా అని ఆలోచిస్తూ!నేను గుర్తు పట్టలేదని అతడికి అర్థమైంది.

"నేను మేడం, సబ్జీ పాండు తమ్ముడిని,బిచ్చయ్యని" అన్నాడు.హమ్మయ్య! అవును, కూరలు, మినరల్ వాటర్ ఇచ్చే పాండు తమ్ముడు!
పలకరించాక "నువ్వేంటి, వీళ్లంతా ఎవరు?" అనడిగాను.
వాళ్ళందరినీ గర్వంగా చూసి "ప్రజారాజ్యం యూత్ వింగ్ మేడం" అన్నాడు.
"ప్రజా రాజ్యమా?" అని తెల్లబోతుండగా..
"ఔ మేడం, చిరంజీవి పార్టీ! పొద్దుగాల్నే వచ్చినం తిర్పతికెల్లి!ఇక్కడ వోటర్ ఐడి కార్డులిప్పించే పని నా మీద బెట్టిండు అన్న"
"అన్నా? చూశావా నువ్వు చిరంజీవిని?"
"ఔ మేడం! నేనైతే స్టేజీ కాణ్ణే ఉన్నా, బారికేడ్లు గూడెక్కినా! చెయ్యూపిండు నాదిక్కు జూసి"
పొంగిపోతున్నాడు బిచ్చయ్య!
త్రీడీ ఫొటోలాగా అందరూ ఇదే అనుకొని ఉంటారు.
"నన్నే చూసి నవ్వాడు, నాకే చెయ్యి వూపాడు,.."అని!

అదీ సంగతి! లోకల్ లీడరెవరో బిచ్చయ్యకు ఈ పని అప్పజెప్పాడు.కాసేపు శివమెత్తినవాడిలాగా సభ విశేషాలన్నీ నాకు వివరించాడు"నేను మొత్తం లైవ్ చూసాన్రా బాబూ" అన్నా వినిపించుకోకుండా!
నేను వచ్చిన పని కనుక్కుని, ఆగ్రహం చెందాడు."ఇటియ్యుండ్రి" అని నా అప్లికేషన్ లాక్కునాడు.
ఫొటోలేదని తెలుసుకుని లాక్కెళ్ళినంత పని చేసి వీధి చివర స్టూడియోలో పావుగంటలో ఫొటో రెడీ చేయించాడు, తన డబ్బుల్తోనే!
నా పాత రెసీట్ కాపీ చేయించి, అప్లికేషన్ సిద్ధం చేసి, మిగతా వాళ్లతో పాటు కలిపాడు.

తన పక్కనున్న సబ్ లీడర్లకు "గీ మేడం ఇల్లు మా షాప్ దగ్గర్నే ఉంటది! మస్తు మంచిది మేడం"అని పరిచయం చేసాడు(వాళ్లన్న ఎంత ధర వేసుకున్నా నేను దెబ్బలాడను మరి)
గుంపంతా ఒకేసారి చిరంజీవి అనుకూల నినాదాలు చేస్తూ ఒకేసారి వెళ్ళి అప్లికేషన్లు ఇచ్చారు. ఇందాకటి అమ్మాయి విసుక్కునే చాన్స్ లేక ఓపిగ్గా రసీదులు ఇచ్చింది.
నన్నేదో అడగాలనుకుని 'ప్రజారాజ్యం యూత్ వింగ్' తరఫు మనిషిని అని తెలుసుకుని విరమించింది.
"థాంక్యూ బిచ్చయ్యా" అనగానే కొంచెం నసుగుతూ....
"పర్లేదు మేడం, మీరు మాత్రం అన్నయ్యకే వోటెయ్యాలి, సారుతో గూడా ఏపియ్యాలి" అన్నాడు.
"ఓ అదా, దాందేముంది, వేస్తాం లే! ఇంకా చాలా రోజులున్నాయిగా ఎలక్షన్లు" అన్నాను.
"ఔ మేడం,ఎందుకు అడుగుతున్ననంటే మీ కారు మీద లోక్ సత్తా స్టారు స్టిక్కరుండేటిది కదా మేడం, అప్పుడు?"
అదిరిపోయాను.
మా పాత కారు మీద, అవును....ఉండేది! నాకే గుర్తు లేదు.
"నాంపల్లి గ్రౌండ్స్ లో మీటింగ్ కి రమ్మని అప్పుడు మీరు మమ్మల్ని పిలిస్తిరి గదా
" దేవుడా, వీడిని కూడా పిలిచానా?"

"ఓ, అదా బిచ్చయ్యా, మేము ఆ తర్వాత ఇక్కడ లేము కదా! ఇప్పుడు కారు మీద లేదు ఆ స్టిక్కర్, చూడు"
"సరే మేడం, సరే మేడం" సిగ్గుపడిపోయాడు ఆ సంగతి అడిగినందుకు.

నేనే గాక, మా కాలనీలో ఉన్న నలభై అపార్ట్ మెంట్ల వాళ్ళ చేతా వోట్లేయించాలట చిరంజీవి పార్టీకి!"కార్డు రాగానే చెప్తాం మేడం, వచ్చి తీసుకొండ్రి" అని భరోసా ఇచ్చాడు.
"అక్కా, మర్చిపోకక్కా" అని వచ్చేటప్పుడు సడన్ గా నాకు తమ్ముడై పోయి వోట్లు అర్థించాడు.

చిరంజీవి సంతోషాంధ్ర ప్రదేశ్ తెస్తాడో లేదో నాకు తెలీదు గానీ , నాకు మాత్రం వోటర్ ఐడీ కార్డు ఇప్పించాడు. వోటెయ్యాల్సిందే! ఇహ తప్పదు!

21 comments:

cbrao said...

తన వాలంటీర్ల సేవతో, ఎంతోమంది నగుమోము పై చిరునవ్వులు పూయించాడు కదా, చిరంజీవి. సంతోషాంధ్ర ప్రదేష్ ఎంత దూరంలో ఉంది?

Sujata M said...

చిరు కార్డు వచ్చిందన్న మాట. చాలా బావుంది సుజాత గారు. జర్నలిస్టు చాయలు కనిపిస్తున్నాయి ! ఎప్పట్లాగే అదిరింది.

Anonymous said...

తమ్ముడైపోయాడూ... ఇంకా చాలానే చూడాలనుకుంటా మున్ముందు

Kathi Mahesh Kumar said...

మొత్తానికి మూలాలదగ్గరే ఓటర్లని ఆకట్టుకుంటున్నారన్నమాట. మంచి వ్యూహం. మొత్తానికి మీకు ఓటర్ ఐడి వచ్చింది సంతోషం...ఇక మిగిలింది సంతోషాంధ్రప్రదేశే!

Srividya said...

:) :)

సూర్య రమేష్ said...

బాగుందండి, స్క్రీన్ ప్లే బాగుంది

చంద్ర మోహన్ said...

ఇంత కష్టపడి ఓటరు కార్డు తెచ్చుకొనేవారుంటే సంతోషాంధ్రప్రదేశ్ ఎంతోదూరంలో లేదనిపిస్తోంది. ఇంతకీ మీ కార్డు వచ్చిన సంతోషంలో మీవారి కార్డుగురించి మరిచిపోయినట్లున్నారు. దాని గతేమయిందో చెప్పారు కాదు:-)

రానారె said...

భలే రాశారండి. నిజంగా జరిగిందేననుకుంటా!?

GIREESH K. said...

ఈ ఐడియా బాగుందండీ! ఈ ఓటరు కార్డుల విషయం మా సుందరానిక్కూడా చెప్పాలి.....

సుజాత వేల్పూరి said...

రావు గారు,
ఐడీ కార్డు ఇప్పించగానే వచ్చేస్తుందా సంతోషాంధ్ర ప్రదేశ్? infront there is crocodile festival! నాది కాదు, చిరంజీవి డైలాగే! ఏం చేసినా అభిమానులు చెయ్యాల్సిందేనండి!

అశ్విన్,
అవునండి, బిచ్చయ్య ఉండేది రోడ్డవతలే! తప్పదు, చాలా చూడాలి!

మహేష్,
మూలాల దగ్గర పట్టేస్తే ఎక్కువరోజులు మర్చిపోకుండా ఉంటారనేమో!

సుజాత వేల్పూరి said...

సుజాత గారు,
శ్రీవిద్య,
సూరజ్

థాంక్స్!

సుజాత వేల్పూరి said...

చంద్రమోహన్ గారు,
అవునండీ, మర్చే పోయాను. "చద్దన్నం తిన్నమ్మ.."టైపులో! తనే వ్యక్తిగతంగా వచ్చి ఇవ్వాలన్నారు అప్లికేషన్!

నిజానికి మా కాలనీ అసోసియేషన్ మా అందరి కార్డులు ప్రాసెస్ చేసినపుడు మేము బెంగుళూరులో ఉన్నాము. అందువల్ల ఇప్పుడు విడిగా అప్లయ్ చేయాల్సి వచ్చింది.

రానారె,
నిజంగానే జరిగింది.

గిరీష్ గారు,
సుందరం తొందర పడాలి మరి! ఈ నెలాఖరు వరకే అవకాశం!

సుజాత వేల్పూరి said...

GHMC ఆఫీసు పక్కనే చిరంజీవి పార్టీ వాళ్ళు కౌంటర్ తెరిచి అప్లికేషన్ కాపీలు ఉచితంగా (ఎందుకంటే GHMC వాళ్ల దగ్గర అయిపోయాయి మరి) ఇస్తున్నారు.(ఫొటోస్టాట్ వాడి పొట్ట కొట్టి)

ప్రతాప్ said...

జై చిరంజీవ.

కల said...

నాకు ఇంకా వోటు హక్కు రాలేదు. హ్హి హ్హీ.

భరత్ said...

సుజాత గారు,
బాగుంది, ఇంకా చాల వ్రాయాలి అనుకున్నా కానీ టైం సరిపోక బాగుంది అనే మాట తో సరిపెడుతున్న.

-- said...

house painting, no festival ;)

గీతాచార్య said...

నాకు ఓటరు కార్డ్ లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు మరి.

మీ తమ్ముదేమన్నా నాకు ఇప్పించగాలడా? కాకపొతే మీ ఊరు కాదు నాది. ఇప్పటికైతే చెన్నై లో ఉన్నా.
:-)

తమాషా అనుభవం.

అయినా నేను ఓటు వెయ్యను. ఎందుకంటే నేను వేస్తె నా పేరుతో వేరేవాళ్ళు వెయ్యలేరుగా......!!!

సుజాత వేల్పూరి said...

గీతాచార్య గారు,
నా మొదటి(ఓటు హక్కు వచ్చాక) వోటే నేను వెయ్యలేదు. ఎందుకో తెలుసా! మీ వూరే మా వూరు! నేను వెళ్ళే సరికి ఎవరో నాకు శ్రమ ఇవ్వడం ఇష్టం లేక ఆ పని చేసి పెట్టేశారు.

Unknown said...

భలే! చిరంజీవిని ఇలాంటి వ్యూహం కోసం మెచ్చుకోవాల్సిందే.
అందరికీ లాభకరం. ఇటు జనాలకు వోటరు ఐడీలొస్తాయి. అటు ఆయనకి ఓట్లు.

Vinay Chakravarthi.Gogineni said...

@sujata

ivvaka pote ivvaledani edupu...vallu istunte potostat vadi pottakotti antam..alagaina vallu potostat chese kada ichhedi.....evaro okaru batukutunnaru kada.............

Post a Comment