September 5, 2008

రివర్స్ గేర్ సంగీతం!

ఇవాళ పొద్దున్నే చాలా bad mood లో నిద్ర లేచాను! మిశ్రా గారిని ఎలాగైనా ఇవాళ పట్టుకుని సాయంత్రం ఇంటికొచ్చే ఉద్యోగం లోకి మారతాడా, లేక కారు మారుస్తాడా, లేక కారు రివర్స్ గేరు ట్యూన్ మారుస్తాడా తేల్చెయ్యాలని నిర్ణయించుకున్నాను.


అర్థ రాత్రి రెండు గంటల సమయంలో ఎంత గాఢ నిద్రలో ఉంటాం? అంత అద్భుతమైన నిద్రలో కర్ణ కఠోరంగా "సారే జహాసే అచ్చా" పాట తాలూకు instrumental tune ఒక పావు గంటసేపు నాన్ స్టాప్ గా అదీ పెద్ద వాల్యూం తో వినిపిస్తే ఏమనిపిస్తుంది మీకు? నిద్రా భంగమవుతుందా లేదా? ఒళ్ళు మండిపోతుందా లేదా అసలు?

అసలేం జరిగిందంటే...

రాత్రి రెండున్నరకి డెలాయిట్ లో పని చేసే మిశ్రా గారు ఆఫీసు నించి వచ్చి కారు పార్క్ చేయడానికి నానా తంటాలూ పడుతున్నాడు. ఆయన పార్కింగ్ లాట్ ఏమో ఒక కార్నర్ లో ఉంది. అందువల్ల అక్కడ ఆయన ఒక ఇరవై సార్లు అంగుళం ముందుకు, నలభై సార్లు రెండంగుళాలు వెనక్కి ఈ నిష్పత్తిలో పావుగంట ప్రయత్నించి ఒకటి రెండు స్క్రాచులతో సఫలమయ్యాడు. ఈ రివర్స్ గేరు వేసినప్పుడు సారే జహాసె అచ్చా ట్యూన్ పెట్టుకున్నాడు చూడండి, విరక్తి పుట్టింది. పగలైతే అంతగా పట్టించుకోకపోదును.


ఈ రివర్స్ గేర్ ట్యూన్లు బలే తలనొప్పి! కారు తీసేటపుడు, పార్కింగ్ చేసేటపుడు రకరకాల పాటల ట్యూన్లు వినలేక విసుగేస్తుంది. రచనా పటేల్ అని మా పొరుగింటి పిల్ల కారు యూపీ లో కొన్నది కాబోలు, ఆవిడ రివర్స్ గేరు ట్యూన్ చూడండి!

"మేరే అంగనేమే తుమ్హారా క్యా కాం హై" ఈ అమ్మాయి చాలా ఈజీగా పార్క్ చేయదగ్గ స్థలంలో కూడా పాట మొత్తం పూర్తయ్యే దాకా పార్క్ చెయ్యలేదు. ఒకరోజు పట్టుకుని "నువ్వు పార్కింగ్ అన్నా నేర్చుకో, లేదా ఆ పాట పీకి పడెయ్యి" అని వార్నింగ్ ఇస్తే బబుల్ గమ్ము నవులుతూ విలాసంగా నవ్వుతోంది.

మరొకాయన కారు రాత్రి పదకొండింటికి "ఓం జై జగదీశ హరే" అని పాడుతుంది.

మరోక మూడు కార్లు ఎయిర్ టెల్ ట్యూన్!

మరొకరిది అజంతా గడియారాల పాట, మరొకటి టైటాను వారి పాట, ఇంకొకరిది పేరు తెలియని ఇంగ్లీష్ పాట.

మరో రెండు కార్లు "కూకు కుక్కు కూకు కుక్కు " అని తీతువు పిట్ట లాగా గంట సేపు కూసి గాని పార్కింగ్ లో కూచోవు.(ఇలా ఏ పక్షి కూస్తుందో సిబి రావు గార్ని అడిగి తెలుసుకోవాలి ఈ సారి)

"కొంచెం ఆ వాల్యూం తగ్గించుకునే ప్రయత్నం చేయండి సార్" అని పళ్ళు నూరుకుంటూ చిరునవ్వుతో ఒకళ్ళిద్దరిని అర్థిస్తే "పాసిబుల్ నహీ హై బోల్ రహా హై సుజుకి వాలా" అన్నారు .

మరి మీ కారు పాడదా అని అడక్కండి, అక్కడికే వస్తున్నా!

కర్ణాటకలో కారు కొన్నప్పుడే మేము హ్యుండాయి షోరూం లో ఉన్న అన్ని ట్యూన్లు పరిశీలించి అన్నింటికంటే కొంచెం smooth గా ఉన్న Titanic theme tune ని ఎన్నుకున్నాం!

హైదరాబాదు వచ్చాక మా పార్కింగ్ లాట్ కొంచెం పక్కకే ఉండటం వల్ల, పార్కింగ్ సమయంలో మా accent కూడా పాడటం మొదలు పెట్టింది. "you too.." అనేసి ఊరుకోవాల్సి వచ్చింది.


ఈ పాట వల్ల నాకు మరో సమస్య కూడా వచ్చింది. ఐదో ఫ్లోర్లో ఉండే ఒక థాయిలాండ్ ఆయన కారుకి కూడా రివర్స్ గేరు ట్యూన్ టైటానిక్ పాటే! ఆయన ఆరింటికే ఇంటికొచ్చి కార్ పార్క్ చేస్తుంటే ఆ పాట విని నేను మాదే అనుకుని "అబ్బ, ఆరింటికి కూడా వస్తారా ఈయన " అనుకుంటూ కారిడార్లోకి వెళ్ళి చూసానొక రోజు. ఈయన కనపళ్ళేదు గానీ ఆయన పైకి వెళుతూ కనపడ్డాడు. అలా రెండు మూడు సార్లు జరిగింది.

అప్పటిగ్గానీ నేను మరో కారు ఇదే పాట పాడుతోందని గ్రహించలేకపోయాను. ఈలోపల థాయిలాండ్ బాబు కారు పార్క్ చేస్తూనే నేనొచ్చానా లేదా అని పైకి చూడ్డం మొదలెట్టాడు.


మేము టైటానిక్ ట్యూన్ సెలెక్ట్ చేసుకున్నపుడే "రాత్రి వేళల్లో ఆలస్యంగా వచ్చినపుడు ఈ ట్యూన్ ఆఫ్ చేసి, రివర్స్ చేసుకునే సదుపాయం ఉందా" అనడిగాము. షోరూం వాడు కొంచెం ఆలోచించి 'కావాలంటే ఏర్పాటు చెయ్యొచ్చ"న్నాడు. చెయ్యమన్నాం!ఒక చిన్న స్విచ్ ఏర్పాటు చేస్తానన్నాడు అతను.

కారు చేతికొచ్చాక ఆ స్విచ్ ఎక్కడుందని అడిగితే
"బోనెట్ లోపల ఉంటుంది సార్! కావాలనుకున్నపుడు బోనెట్ పైకెత్తి అది ఆఫ్ చేసి అప్పుడు కారు రివర్స్ చేసుకోవ"చ్చన్నాడు.
ఇదేమిటి నాయనా అంటే "అంతకంటే కుదరదు మేడం, అందుకే అక్కడ పెట్టాను" అన్నాడు.

అంత శ్రమ తీసుకోలేక ఇంతవరకు దాన్ని ఉపయోగించలేదు. కాకపోతే అదెక్కడుందో అని ముచ్చటపడితే ఒకరోజు మా వారు బోనెట్ పైకెత్తి చూపించారు.

అసలింతకీ ఈ సంగీతాలు లేకుండా కారు రివర్స్ చేసుకునే మార్గం లేదా! ఇదివరలో ఇవి ఉండేవి కాదుగా!

ఇదో పెద్ద సమస్యా అనకండి,30 కార్లున్న చోట ప్రతి పది నిమిషాలకొక సారి వివిధ రకాల గీతాలు నాన్ స్టాప్ గా వింటే అప్పుడు తెలుస్తుంది మీకు!

ఈ రోజు మిశ్రా సంగతి తేల్చాల్సిందే!

23 comments:

Kathi Mahesh Kumar said...

నిజమేనండోయ్ ! ఈ గోల అర్థరాత్రుళ్ళుకూడా మొదలౌతుంటాయి. ఇంకానయం ఈ పాటలే పెట్టుకుంటున్నారు...అవే ఏ "దానవీరశూరకర్ణ" సినిమా డైలాగులో అయితే పరిస్థితికాస్త ఊహించండి.

ప్రతాప్ said...

ట్యూన్ ఎఫెక్టులు అదిరాయి.
నిజమే, ట్యూన్స్ ఎంత సున్నితంగా ఉంటే అంత బావుంటాయి. అయినా వాటిని వినాలంటే కొద్దిగా కష్టమే మరి.

cbrao said...

అయితే మీరు 24 గంటలు సంగీతంలో మునిగి తేలుతున్న, సంగీత బాధితులన్న మాట. మీ బాధను మరచుటకు ఆనంద భైరవి రాగమాలాపించి పాడండి.
ప. నీకే తెలియక పోతే
నేనేమి సేయుదురా

అ. లోకాధారుడవై నా
లోని ప్రజ్వలించు జాలి (నీ)

చ. ఎందెందు జూచిననెందెందు పలికిన-
నెందెందు సేవించిననెందెందు పూజించిన-
నందందు నీవని తోచుటందుకు నీ
పాదారవిందమును ధ్యానించిన-
దెందుకని త్యాగరాజ సన్నుత (నీ)

ముల్లోకములు నిండిన నీవే, నా లోని బాధను అర్థం చేసుకొనలేకపోతే, ఇంకెవ్వరికి నా మొర వినిపించను?

Purnima said...

నా కారంటే నాకు చిరాకొచ్చేది ఈ ఒక్క రివర్సు గేరు దగ్గరే!

కానీ తప్పదు కదా!

నిషిగంధ said...

అదీ ఇదీ అని లేకుండా అన్నిరకాల సంగీతారాధనలో మునిగి తేలుతున్నారన్నమాట :-) ఇంత ఇరిటేటింగ్ విషయాన్ని చెప్పడంలో కూడా మీ చతురత అదిరింది..

ఒకప్పుడు జనాలు పసిపాప ఏడుపు ట్యూన్ కూడా పెట్టుకున్నారు!! వాళ్ళ దగ్గరకెళ్ళి ఎగాదిగా చూసిరావాలనిపించేది..

మాగంటి వంశీ మోహన్ said...

:)..:)..:)..

సుజాత వేల్పూరి said...

మహేష్,
అలాంటి డైలాగులు పెడితే అప్పుడు నిజంగా నాలాంటి బాధితులుని పోగేసి ఉద్యమాలు నడుపుతాను నేను!

ప్రతాప్,
థాంక్యూ,!అసలు ఆ కాన్సెప్ట్ లో సున్నితత్వం ఎక్కడుంటుంది?

రావు గారు,


సంగీతం అంటే ప్రాణం ఇస్తాను గానీ ఇలా ప్రాణాలు మనం ఇవ్వకుండానే తోడేసే సంగీతాన్ని తట్టుకోవడం ఎలా? ఇంతకీ
మీ కారేపాట పాడుతుందో?

నేను "నానాటి బతుకు నాటకమూ" పాడుకుంటున్నాను!

సుజాత వేల్పూరి said...

నిషి,
భలే చెప్పారు! ఆ పసిపాప ఏడుపు మొదటి సారి విన్నపుడు ఎంతగా ఉలిక్కిపడి కలవర పడ్డానంటే చెప్పలేను.

ఎగా దిగా చూసి రావడం కాదు, పీక నొక్కాలనిపిస్తుంది.

వంశీ గారు,
ధన్యవాదాలు!

గీతాచార్య said...

"మరొకరిది అజంతా గడియారాల పాట, మరొకటి టైటాను వారి పాట, ఇంకొకరిది పేరు తెలియని ఇంగ్లీష్ పాట."

నా పాట 11,584 క్లిక్కులు.

బాగుంది రివర్స్ సంగీతం. మన డెవలప్మెంట్ రివర్స్ కాకుంటే చాలు.

బాగా నవ్వించారండీ!

Anonymous said...

అదేదో టీవీలో పాటల్ని తిరగేసి పాడే కార్యక్రమం ఒకటొచ్చేది రివర్సు గేరని. అది కూడా మీరు చెప్పిన రివర్సు గేరు సంగీతంలానే చిరాకు తెప్పించేది.

మహేష్, కర్ణ డైలాగులకేమండి, బానే ఉంటాయి గదా! కాకపోతే ఆ కారువాడు ఆపకుండా వెనక్కే పోతూ.. ఉంటే బాగుంటుంది. కానీ మిశ్రా గారి లాగా ముందుకీ వెనక్కీ షంటుతూ ఉంటే.. "ఆ" "చార్యదే" "వా ఏ" "మంటివే" "మంటివి" అంటూ పద్యాలని కూడా చూడకుండా చంపేసి, మనకి జీవితమ్మీద విరక్తి కలిగిస్తారు. :)

సుజాత వేల్పూరి said...

అవునండీ, మీరు చెపితే గుర్తొస్తోంది ఆ రివర్స్ గేర్ పాటల ప్రోగ్రాం!

కర్ణ డైలాగులు నా చిన్నప్పటి నుంచీ (ప్రతి టీ స్టాలులోనూ వుంటాయి కదండి మనవైపు, పైగా మా ఇంట్లో కూడా ఉండేది ఆ కాసెట్) వినీ వినీ చెవులు తుప్పు పట్టాయి.

అలా ఆ కారు డైలాగులు అయ్యే దాకా వెనక్కే పోతూ ఉండాలాలంటే ఏ కర్ఫ్యూ రోజునో (గచ్చి బౌలి ఎక్స్ ప్రెస్ హై వచ్చాక అయితే ఇంకా బెటరు) పెట్టుకోవాలి కార్యక్రమం!

Anonymous said...

సుజాత: అలా ఆపకుండా వెనక్కి పోతూ ఉంటే దేనికోదానికి గుద్ది సంగీతం ఆగిపోతుంది. లేదూ, దేనికీ గుద్దలేదనుకోండి.. అలా పోయి పోయి మనకు వినబడనంత దూరం పోతారు గదా!!! ఏం జరిగినా మనకు బాధ తప్పుద్ది. :)

Unknown said...

హహహ... అవునవును. ఏడో అంతస్థులో ఉండడం వల్ల ఇలాంటి వాటికి బలికాకుండా తప్పించుకుంటున్నాను నేను.
టూటూటుటుటూ.. టుటుటుటుటూటూటు... అనే రివర్సు సంగీతం నేను ఎక్కువగా వినేది మా కారుతో సహా. (అబ్బా)

సుజాత వేల్పూరి said...

చదువరి గారు,
అవునండి, మీరు చెప్పింది పాయింటే! రెంటిలో ఏది జరిగినా మనకు బాధ తప్పుతుంది.

cbrao said...

మా కారు రివర్స్ చేసే సమయంలో, ఆలాపిస్తూంది నిశ్శబ్ద సంగీతం. శ్రీమతి రమణ కు, నిశ్శబ్దంగానే కారు వెనక్కుతీయటం అలవాటు. కాని సికందరాబాద్ లో, ఏ మార్కెట్ స్ట్రీట్ కో వెళ్లినప్పుడు, కారు వెనక్కు తిప్పే సమయంలో, రివర్స్ సంగీతం ఉంటే బాగుంటుందనిపిస్తుంది. మన దేశం లో జనాభా ఎక్కువ, కారుని చూసి కూడా తప్పుకోరు కొంతమంది. అలా, కొన్ని సార్లు నిశ్శబ్దం, సశబ్దమయితే బాగుండుననిపిస్తుంది. నేనుండేది పెంట్ హౌస్ లో కాబట్టి, ఈ కారు రివర్స్ సంగీతాలు, నన్ను బాధించవు. మొన్నటి దాక వచ్చే పోయే విమానాల శబ్దంతో, హడావుడిగా వుండే పర్యావరణం, విమానాశ్రయం ఊరు బయటకు మారటంతో ఆ శబ్దాలు తగ్గాయి. కాని వచ్చే పోయే విమానాలు చూడటం లో ఉండే సరదా కూడా దూరమయ్యింది. కిందగా ఎగురుతున్న విమానం చూసే సమయంలో నేను, పిల్లలు సమానంగా ఆనందిస్తాము.

సుజాత వేల్పూరి said...

గీతాచార్య,
మీరు చెప్పేదాకా నా బ్లాగు సందర్శకుల సంఖ్య 11 వేలు దాటి పన్నెండు వేల దిశగా పోతోందని నేను గమనించలేదు. థాంక్యూ!

ప్రియ said...

ఈ సంగీతం గోల నేనూ పడ్డానండీ. కాకపొతే ఇప్పుడు లోన్దొంలో మా రూములు సెపరేటు గా ఉన్నాయి.

కాకపొతే ఎంత గోలైనా భరించొచ్చు కానీ మన సారే జహాసే అచ్ఛా ని రివర్స్ లో వాడటం ఏమన్నా బాగున్నాడా?

"దొర్లే బఠానీ గింజ" ని గీతాచార్య గారిని వ్రాయమన్నాను. (వారు అడిగితె). మొదలైంది.
http://annisangathulu.blogspot.com/2008/09/blog-post_5094.html

మీ టెంప్లేట్ బాగుంది. ఎక్కడ దొరుకుతుందో చెపుతారా?

హర్షోల్లాసం said...

@సి.బి.రావు గారు నీకే తెలియక పోతే చాల బాగుంది.మీకు సంగీతం లో ప్రవేశం వుందా?
@ సుజత గారు :)

Anonymous said...

మీ మిశ్రుడు కొద్దో గొప్పొ నయం, కారు వెనక్కి మళ్లించేటప్పుడే కారు చేత శబ్దం చేయిస్తున్నాదు. నేనుండే చోతా పరమ మిశ్రులున్నారు, ఆఫీస్ నుంచి ఒంటిగంటకి రెండింటికి వచ్చి గేటు బయట నుంచి ఆపకుండా హారన్ మోయిస్తూ ఉంటారు, ఎవరో ఒకరు వచ్చి తీసేదాకా, హారన్ వినపడిన వాడు వచ్చి తీయటనికి సమయం పడుతుందని ఇంగితం ఉండదు - ఇక ఇతరుల నిద్రాభంగం గురించి ఏమి ఆలోచిస్తారు .

సుజాత వేల్పూరి said...

ఊ.దంపుడు గారు
అవునండి, ఇలా ఆపకుండా హారన్ మోగించే వాళ్లకు చూస్తే కూడా ఏమి చెయ్యాలో చెప్పలేనంత కోపం వస్తుంది. ఎవరి కోసం మోగిస్తున్నారో తెలీక అందరూ బయటికి రావాలన్న మాట. అదేదో మన తలలో మోగుతున్నట్టే ఉంటుంది ఈ హారన్ గోల!కొందరికి కామన్ సెన్స్ అనే పదార్థం ఉండదేమో బుర్రలో అనిపిస్తుంది !

వేణూశ్రీకాంత్ said...

బాగుందండీ మీ రివర్స్ గేర్ టపా, శీర్షిక చూసి కొంప దీసి ఆ టీవి ప్రోగ్రాం గురించి వ్రాయడం లేదు కదా అనుకున్నా, ఎపుడో ఓ 5 నిముషాలు చూసినా ఆ కార్యక్రమం అలా గుర్తుండి పోయింది, పాపం మీ మిశ్రా గారు పార్కింగ్ రాక మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పర్లేదు కానీ ఊ.దం. గారి మిశ్రా లాంటి వాళ్ళని కొట్టినా తప్పులేదు.

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియడం లేదు. సెలవుల నుంచి వచ్చాక పాత టపాలన్నీ చూసి మరీ అన్నింటికీ వ్యాఖ్యలు రాస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్! నేనైతే ఇలా చేయలేననుకుంటా! మీ ప్రతి వ్యాఖ్యకూ వందేసి ధన్యవాదాలు.

Anlogue Boy said...

Dear sujatha...

i view your established or posted blog.. it's simply super...

thank you

best wishes.,..... with wants more postings.......

Post a Comment