October 26, 2008

ఆరోజులికముందు రావేమి నేస్తం!


పిల్లలకు ఇష్టమైన రెండు పండగలు చెప్పండంటే ఏం చెప్తాం...వినాయక చవితి, దీపావళి అని తప్పించి? పిల్లలందరూ కలిసి పార్టిసిపేట్ చేసి..అనుభవించి, ఆనందించే పండగలు ఈ రెండూ! కానీ మా చిన్నప్పుడు మేము జరుపుకున్న దీపావళికీ, ఇప్పుడు పిల్లలు జరుపుకుంటున్న దీపావళికీ పోలికే లేదు.


అసలు వినాయక చవితికి పత్రి "కొనడం" అనే concept ఏమిటో పెద్దయ్యాక నాకు చాల్రోజులు అర్థం కాలేదు. పిల్లలంతా కలిసి తోటల మీద పడి, చెట్లెక్కి అక్కడినించీ పడి...పత్రి సేకరించడం అన్నది ఇవాళ పల్లెటూర్లలో కూడా కనపడదు.


దీపావళి మందులు ఇంట్లో తయారు చేయడం అన్నది కూడా ఇవాళ టౌన్లలో, పల్లెటూర్లలో లేదు. ప్రతిదీ డబ్బు "పారేసి" కొనడమే!

నిన్న టపాసులు (పటాసులు అనాలా టపాసులే కరెక్టా) కొనడానికి వెళితే ధరల ధాటికి కళ్ళు తిరిగి వాటర్ బాటిల్ కొనవలసి వచ్చింది.(మళ్ళీ ఇదో ఖర్చు)
 కాకర పువ్వొత్తుల పాకెట్టు అనగా పన్నెండు కాకర పువ్వొత్తుల గల పాకెట్ అక్షరాలా 120 రూపాయలు. మతాబులు ఒక్కోటీ పదిహేను రూపాయలు.
 రెండు సెకన్లు వెలిగే చిచ్చు బుడ్డి ఒక్కోటీ పది రూపాయలు,
ఐదు సెకన్లు పని చేసేదైతే నలభై రూపాయలు.
మట్టి ప్రమిదలు ఒక్కోటి ఆరు రూపాయలు. అవి టెర్రకోటవైతే పదిరూపాయల నుంచి మొదలు ఒక్కోటీ!
కరెంట్ తీగలు, వెన్నముద్దలు చివరికి అగ్గిపుల్లలు కూడా భగ్గున మండిపోయే రేట్లోనే ఉన్నాయి.
ఇక 5 thousand waala, 10 thousand wala గురించి ఆలోచించే ధైర్యం వస్తుందా వీటి రేట్లు వింటుంటే! ఒక్క స్టాక్ మార్కెట్ తప్పించి అన్నీ పై పై కే! అసలు నిజంగా దీపావళి మందులు ఉత్పత్తి వ్యయం+లాభం కులుపుకుంటే కూడా ఇంతింత ధరలు ఉండడం న్యాయమేనా అనిపిస్తోంది నాకు!

కాసేపు చిన్నప్పటి రోజుల తల్చుకుని రిలాక్స్ అయితే తప్పించి ఈ ధరల షాక్ నించి తేరుకోవడం కష్టం!

చిచ్చు బుడ్లు,మతాబులు వగైరాలు బయట మార్కెట్లో కొనడం మా ఇంటా వంటా ఉండేది కాదు. మామయ్యలు, పిన్ని, పెద్దమ్మ(మేము ఆమ్మ అంటాం పెద్దమ్మను) మేనత్త అంతా ఒకే వూళ్ళో ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటంటే కజిన్స్ అందరూ తరచుగా కలుసుకోవడం ! ఇది వాళ్ల మధ్య ఎంతటి ప్రేమను, స్నేహ భావాన్ని, ఆప్యాయతల్ని పెంచి, పంచుతుందో ...నాకు బాగా తెలుసు.ఇప్పుడు మేమంతా ఎవరి జీవితాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా, అందరం  కలిసినపుడు ఒక్క సారిగా చిన్న పిల్లలమై పోయి..మా పిల్లల్ని కూడా మర్చిపోతాం. పైగా వాళ్లందరిలోనూ నేనూ, మా చెల్లి చిన్న పిల్లలం కావడంతో వాళ్ళు మమ్మల్ని ఇంకా పసివాళ్ళుగానే చూడ్డం భలే 'కిక్' ఇస్తుంది.


మా చిన్నన్నయ్య, వాడి వయసు కజిన్స్ దసరాకు ముందు నించే చిచ్చు బుడ్లు, మతాబులు,సిసింద్రీలు,తారాజువ్వలు,(అవ్వాయి చువ్వాయిలు),తాటాకు టపాకాయలు

తయారు చేయడం లో బిజీ అయిపోయే వాళ్ళు. "అంత శ్రద్ధ వాళ్ళు చదువు మీద పెట్టడం ఈ పాపిష్టి కళ్ళతో ఎప్పుడు చూస్తానో" అని మా అత్త వాపోతుండేది.


 కోమట్లబ్బాయి గుప్తా తో కల్సి సూరేకారం, గంధకం(రెండూ ఒకటి కాదు కదా) ఇంకా ఏవేవో సరుకులు తెచ్చి పడేసే వాళ్ళు. వాటిని డాబా మీద ఎండబెట్టడం! మా పని ఏమిటంటే ఎండబెట్టిన వాటికి వెధవ కాపలా కాయడం! కుమ్మరి బజారుకెళ్ళి చిచ్చుబుడ్లకోసం,మట్టి కంటైనర్లు(ముంతలంటే అర్థం కావొద్దూ)ఆర్డరిచ్చి తయారు చేయించేవాళ్ళు.


తయారు చేసేటపుడు ఎంత హడావుడి చేసేవాళ్ళో తల్చుకుంటే మండిపోతుంది. చిన్న పిల్లలమనే వంకతో మమ్మల్ని అటువైపు రానిచ్చేవాళు కాదు. మతాబులు చుట్టడానికి మాత్రం పేపర్లు కత్తిరించి ఇచ్చేవాళ్లం.వీళ్ళు తయారు చేసిన టపాసులని మేం దొంగిలించి  స్నేహితులకు కొన్ని ఇచ్చి వితరణ వెలగబెట్టేవాళ్ళం కూడా!చీపురు పుల్లలు లేకుండా తయారు చేసిన తారాజువ్వలు(వీటికి బోడి జువ్వలని పేరు)వెలిగించి వదిలేస్తే అవి దిక్కు తెలీకుండా పరిగెత్తేవి. అందుకే అన్నయ్యలు, ఇతర కజిన్స్ అందరూ పాంట్లు వేసుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళు.


పండగ లోపుగా ఎర్రని మందు బిళ్ళలు(ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి),వాటి రోల్స్ చిన్ని తుపాకుల్లో పెట్టి మధ్యాహ్నం ఎవరికీ మనశ్శాంతి లేకుండా "ఢాం ఢాం " అని పేల్చేస్తుండేవాళ్ళం. ఇవి కాకుండా నాన్నారు తెచ్చిన మందులు చేటల్లో న్యూస్ పేపర్లు వేసి ఎండబెట్టి వాటికి కాపలా కాయడం గొప్ప సరదా కలిగించే బాధ్యత.


పండగ సాయంత్రం నిమిషాల కొద్దీ చిచ్చు బుడ్లు పువ్వులు చిమ్ముతుంటే, వాటిని తయారు చేసిన కళాకారుల మొహం లో సంతోషం ఆ వెలుగులకు పదింతలు ఉండేది.కొన్ని మందులు దాచిపెట్టి కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ కాల్చేవాళ్ళం.


ఆ మధ్య అత్తయ్య కొడుకు  కలిసినపుడు "ఈసారి దీపావళికి చిచ్చుబుడ్లు తయారు చేద్దాం రా " అంటే వాడు మా వారివైపు చూస్తూ.."మీ ఆవిడకు భలే తింగరి అయిడియాలు వస్తాయండీ! రోజు ఇంట్లో కూడా ఇంతేనా" అనడిగాడు!ఫెస్టివ్ ఆఫర్ల గోల,వాకిలికి కట్టే మావిడాకుల నుంచీ మార్కెట్లో కొనాల్సిన దుస్థితి,"హాపీ దివాలీ " అంటూ పెదాల చివరినుంచీ రాలే పొడి పొడి శుభాకాంక్షలతో నార్త్ ఇండియన్ చెమికీలద్దుకున్న 'దివాలీ ' ని దివాలా తీసిన మొహాలతో (టపాసులు కొనే సరికి ఎలాగూ దివాలా తీసి ఉంటాం కదా) జరుపుకోడానికి సిటీలో పూర్తిగా అలవాటుపడిపోయాము.


అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

41 comments:

చైతన్య said...

దీపావళి శుభకాంక్షలు. నిజమేనండోయ్ సెన్సెక్స్ తప్ప అన్ని పై పైకే. మేము చిన్నప్పుడు 100 కు కొంటే అబ్బో చాలా వచ్చేవి. మరి ఇప్పుడో...!!!

kumar said...

చెట్లు, పుట్టలు తిరిగి పత్రి పట్టుకురావడం నాకు బాగా గుర్తుంది కానీ, టపాసుల్ని ఇంట్లో తయారు చేయడం అనేది అస్సలు తెలీకపోవడమే కాదు..చూడలేదు కూడా..వెరీ ఇంట్రస్టింగ్..

"ఎర్రని మందు బిళ్ళలు..వాటి రోల్స్ చిన్ని తుపాకుల్లో పెట్టి మధ్యాహ్నం ఎవరికీ మనశ్శాంతి లేకుండా.."

అస్సలిది ఒక్క కుదుపు నిచ్చింది నాకు...పూర్తిగా మరచి పోయానండి నేనీ ఙ్ణాపకాన్ని..ఆ తుపాకులు కొద్ది రోజులకి చిలుం(రస్ట్) పడితే కిరసనాయిలు వేసి తుడుచుకొని..అబ్బో..చాటల్లో ఎండబెట్టుకొని..కార్తీక దీపం దాకా దాచుకొని..ఇవన్నీ బాగా గుర్తుకొచ్చాయి.

థాంక్స్...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

పిల్లలకు ఇష్టమైన రెండు పండగలు చెప్పండంటే ఏం చెప్తాం...వినాయక చవితి, దీపావళి అని తప్పించి? పిల్లలందరూ కలిసి పార్టిసిపేట్ చేసి..అనుభవించి, ఆనందించే పండగలు ఈ రెండూ!---
ఇవ్వాళ్టి పిల్లలు ఆనందంగా జరుపుకునే పండగ(లు)వారి పుట్టినరోజు మొదటిది,వాళ్ళ అన్నదమ్ముల,అక్కచెళ్ళెళ్ళ పుట్టినరోజులు రెండవది.ఇంట్లో జరిగే మిగతా ఫంక్షన్లు మమ్మీడాడీల పెళ్ళిరోజు,పుట్టినరోజులు,మూడోది,ఫ్రెండ్స్,క్లాస్మేట్ల ఫంక్షన్లు,న్యూయియర్స్ డే..
పండగలంటే ఏమిటో,ఎందుకు జరుపుకోవాలో పిల్లలకు తెలియజెప్పే వారు లేరు, ఆ జరుపుకోటానికి ఇంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలో మనకు వివరించేవారు లేరు.

సుజాత said...

రాజేంద్ర కుమార్ గారు,
మనసు కలచేసేలా ఉంది మీ వ్యాఖ్య!

Purnima said...

దీపావళి శుభాకాంక్షలు! :-)

సత్యప్రసాద్ అరిపిరాల said...

బాగా రాసారు.. ఇంకొంచెం వెనక్కి వెళ్తే గుమ్మటాలు, దివిటీలు కూడా వుండేవి... నరకాసురుణ్ణి తయారుచేసి కాల్చడం కూడా అపార్ట్‌మెంట్ జీవితాలకి ఒక పాత జ్ఞాపకం మాత్రమే..

ప్రతాప్ said...

ప్రతి పండగా నాకో జ్ఞాపకమే..
ఒక్క వినాయక చవితే కాదు, ఉగాదికి మామిడి తోటలోకి ఎవ్వరికి తెలియకుండా దూరడం,
జతగాల్లతో కలిసి వాగులవెంబడి, పుట్టల వెంబడి కావలసిన వాటికోసం వేట.. ఇవన్నీ మరిచిపోలేని జ్ఞాపకాలు.

నిజమే టపాకాయలు గుయ్యిమనే రేట్లలోనే వున్నాయి. కొనాలంటేనే భయమేస్తుంది. ఈ శుభసందర్భంలో నేనొక నిర్ణయం తీసుకొంటున్నాను, ఈ దీపావళిని నిశ్శబ్ద దీపావళిగా జరుపుకోవాలని.

@రాజేంద్రగారు నేనూ గమనించాను మీరు చెప్పింది నిజమే.

అరుణాంక్ said...

చాలా బాగా చెప్పారు సుజాత గారు .అ రోజులు ఎలాగూ రావు. ముందుంది ముసళ్ళ పండగ.

కంప్యూటర్ లో సాప్ట్ క్రాకెర్స్ ,చిచ్చు బుడ్లు ,అవైచువ్వలు కొన్నేమి ...అన్నీ కాల్చు కొనే రోజులు ముందున్నవి .


అరుణాంక్

aswin budaraju said...

దీపావళి శుభాకాంక్షలు! :-)

మేధ said...

దీపావళి శుభాకాంక్షలు...

రవి said...

దీపావళి శుభాకాంక్షలు. ఈ సారి నేనూ పటాకులు కొన్నాను. అయితే కాస్త బాధ. ఓ పక్క కనీసం తిండికి కూడా లేకుండా జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఇంత డబ్బు పోసి పటాకులు కొనుక్కోవడం. కన్వీనియంట్ గా మర్చిపొవాలి. తప్పదు.

సుజాత said...

రవి గారు, అలా ఆలోచిస్తే రెండు కూరలతో కడుపునిండా అన్నం తినడానికి కూడా గిల్టీగా ఫీలయ్యే పరిస్తితి ఉంది ఇప్పుడు. చేతనైనంతలో పంచుకోవడమే చేయగల పని.

గీతాచార్య said...

ఈవిల్ డేడ్ పార్ట్ - 2.

మళ్ళీ భయ పెట్టె ప్రయత్నమా? చిన్నప్పుడు బానే ఉంటుంది. ఇంటి ప్రక్కన కట్టేసిన గేదెల మీదకి నేల టపాకాయలు విసరటం (PETA వాళ్ళకి చెప్పొద్దని మనవి.), "రామాయణం" చూసి కొబ్బరి పుల్లలకి కాకర వత్తులు కట్టి బాణాలు వేయటం, కరెంటు ప్లగ్గులో అగ్గిపుల్లలు పెట్టి ఏమవుతుందో చూట్టం. చాలా బాగుండేది. ? :-)

"ఇల్లు పీకి పందిరేసి పాకా పాకా లాడితే...!" అదే దీపావళి అంటే.

దీపావళి శుభాకాంక్షలు.

గీతాచార్య said...

తుపాకులుంటే మనమే జేమ్స్ బాండ్ 007.

కత్తి మహేష్ కుమార్ said...

మీ టపా ఆలోచనాత్మకంగా వుంటే, రాంజేంద్రగారి వ్యాఖ్యలో ఒక కటికనిజం వుంది.

దీపావళంటే దీపాల పండగనుకోవడం మానేసి, డబ్బుపోసి సామాన్లు తగలెట్టె పండగగా మిగిలిపోయింది.

నెటిజన్ said...

మనసు కలచి వేసింది మీ టపా, రాజేంద్ర వ్యాఖ్య!

వికటకవి said...

ఖైరతాబాద్ దగ్గర ఓ 50 కొట్లు పెట్టి టపాసులు అమ్మే షాపులు గుర్తున్నయ్యా ఎవరికైనా. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్లై ఓవర్ వచ్చింది. వంద రూపాయలకి (అప్పట్లో మా లెవల్ కన్నా ఎక్కువనుకోండి, కానీ పోరాడి పోరాడి కొనిపించేవాళ్ళం) పెద్ద బ్యాగుడు వచ్చేవి. కాకపోతే, ఈ తరం వాళ్ళు ఇలానే అనుకుంటారేమో, మరో 25 ఏళ్ళ తర్వాత, ఇవ్వాళ వాళ్ళు చేసుకుంటున్నదే అసలు సిసలు దీపావళి అన్నట్లు :-)

pappu said...

అబ్బో..మాకయితే తిప్పుడు పొట్లం కూడా ఉండేది.దాన్ని మధ్యాహ్నానికల్లా బుట్టలో దాంత్లొ చిత్రీ పట్టిన వడ్రంగి పొట్టు వేసి కొంచం ఉప్పు ఇంకా ఎవో కలిపి తయారు చెసేది మా మామ్మ(నాయనమ్మ)..అది సాయంత్రానికల్లా రాజుకుని రెడీ అయితే..దిబ్బూ దిబ్బూ దీపావళి అమావాస్య..మళ్ళీ వచ్చే నాగుల చవితి అని దివిటీ కొట్టడం..అంతే వెంటనే స్వీట్ నోట్లో పెట్టుకోడం తిప్పుడు పొట్లం పట్టుకుని ఊరి మీద పోటీలు పడడమే ఒక గంట ఫుల్ల్ స్వింగ్ అన్నమాట...అందులోంచి నిప్పు రవ్వలు ఎగుర్తుంటే నక్షత్రాల్లా ఉందేవి ...తర్వాత టపాకాయలు ఇంక ఒకటి తర్వాత ఒకటి... భలే మజా.....అది దీపావళి అంటే.....

krishna rao jallipalli said...

RAVI GAARU..ఓ పక్క కనీసం తిండికి కూడా లేకుండా జనం ఆత్మహత్యలు చేసుకుంటుంటే మనం ఇంత డబ్బు పోసి పటాకులు కొనుక్కోవడం. కన్వీనియంట్ గా మర్చిపొవాలి. తప్పదు....
నిజమే కాని దానికి కారణం మనం కాదుగా. వింటే బాధగానే ఉంటుంది. దీనికి సమాదానాలు చెప్పాల్సింది, బాద్యత వహించాల్సింది, పాలకులే గాని మనం కాదుగా. కాకపోతే ఎవరకి వీలు అయినంతలో వారు ఇతరులకు సహాయం చేసి ఉపశమనం పొందటం అనేది ఒక్కటే మార్గం.

pappu said...

అబ్బో..మాకయితే తిప్పుడు పొట్లం కూడా ఉండేది.దాన్ని మధ్యాహ్నానికల్లా బుట్టలో దాంత్లొ చిత్రీ పట్టిన వడ్రంగి పొట్టు వేసి కొంచం ఉప్పు ఇంకా ఎవో కలిపి తయారు చెసేది మా మామ్మ(నాయనమ్మ)..అది సాయంత్రానికల్లా రాజుకుని రెడీ అయితే..దిబ్బూ దిబ్బూ దీపావళి అమావాస్య..మళ్ళీ వచ్చే నాగుల చవితి అని దివిటీ కొట్టడం..అంతే వెంటనే స్వీట్ నోట్లో పెట్టుకోడం తిప్పుడు పొట్లం పట్టుకుని ఊరి మీద పోటీలు పడడమే ఒక గంట ఫుల్ల్ స్వింగ్ అన్నమాట...అందులోంచి నిప్పు రవ్వలు ఎగుర్తుంటే నక్షత్రాల్లా ఉందేవి ...తర్వాత టపాకాయలు ఇంక ఒకటి తర్వాత ఒకటి... భలే మజా.....అది దీపావళి అంటే.....

చంద్ర మోహన్ said...

నేను విజయవాడలో ఉన్నంత వరకు (2004 దాక) భాస్కర రావుగారని మా డీలరొకరు స్వయంగా తయారుచేసిన చిచ్చుబుడ్లను బహుమతిగా ఇచ్చేవారు. ఇళ్ళల్లో టపాకాయలు చేస్తారని అప్పుడే నాకు తెలిసింది. ఐతే మా పిల్లలప్పుడు బాగా చిన్నవాళ్ళు కావడంతో వారికి తెలియదు. ఇప్పుడు టపాకాయలు ఇంటిలో చేస్తారంటే మావాడు నమ్మడం లేదు.

రాజేంద్ర గారన్నట్లు పుట్టినరోజులు కాక పిల్లలు జరుపుకొనేవి 'ఫ్రెండ్ షిప్ డే', 'మదర్స్ డే' ... ఇలా రకరకాల 'దినాలే'.

ఐనా సరే, మీకు దీపావళి శుభాకాంక్షలు!

సుజాత said...

వికటకవి గారు,
ఖైరతాబాదు లో ఇప్పుడు అంత చోటు మెయిన్ రోడ్ మీద ఎక్కడా లేదు. నిన్న అటు వెళ్ళినా ఎక్కడా ఒకే చోట అన్ని షాపులు కనపళ్ళేదు. బంజారా హిల్స్ లో ఎల్వీ ప్రసాద్ రోడ్లో మాత్రం ఒకే చోట బోలెడు షాపులు పెట్టి టపాసులు అమ్మడం చూశాను. వంద రూపాయల మందులంటే కార్తీక పౌర్ణమి దాకా కాల్చడానికి సరిపడేన్ని..అప్పుడు! ఇప్పుడు..పైన చెప్పిన రేట్లు మళ్ళీ చూడండి..!

గీతాచార్య,
పేట లో అందరికీ, ముఖ్యంగా బాపూ బాల విహార్ చుట్టుపక్కల వాళ్ళకి తప్పక చెప్పాల్సిందే james bond సంగతి!

రాధిక said...

నావీ అచ్చూ మీ జ్ఞాపకాలే.మేము సిసింద్రీ లు చాలా చాలా చేసేవాళ్ళం.చేసినవి ట్రయల్స్ అని చెప్పి సగం పండగకి ముందే కాల్చేసేవాళ్ళం.మేము పెద్దయ్యేకొద్దీ చేసే సరదా తోపాటూ కాల్చే సరదా కూడా పోయింది.మీ టపా జ్ఞాపకాలనే కాదు ఆలోచనలనూ లేపింది.

Niranjan Pulipati said...

మంచి జ్ఞాపకాలు.. చిన్నప్పుడు దీపావళి అంటే ఆ సందడే వేరు. ఇప్పుడు అసలు ఒక దీపావళి ఏంటి ఏ పండుగలూ సరిగా జరగటం లేదు, ఏదో తూ తూ మంత్రం గా చేసుకోవటం తప్ప..

మీకూ దీపావళి శుభాకాంక్షలు..

రిషి said...

చిన్నప్పటి దీపావళి జ్ఞాపకాలు గుర్తుచేసారండీ...మేమైతే టపాకాయలు కాల్చడం అయిపోయాకా ఎవరింటిముందు ఎక్కువ కాయితాలూ కాలిపోయిన మతాబులు వున్నాయో అని చూసుకుంటూ వెళ్ళేవాళ్ళం. చిన్న చిన్న సరదాలు చిన్నతనంలోనే..మళ్ళీ లేవు. ఊద్యోగాల పేరుతో ఎక్కడోవుంటూ ..ఇంట్లో దీపావళి ఎలా జరుపుకుంటున్నారో అనుకుంటూ .. :(

cbrao said...

కొద్ది రోజుల క్రితం చికాగో పట్టణం లో Navy Pier లో Fireworks display చూశా.మనోహరం. పండగకు టపాసులకు డబ్బు ఎందుకు ఖర్చు చెయ్యటం? నేనయితే, మా డాబా మీద నుంచి చూస్తే, హైదరాబాదు పండగంతా ఎదురే ఉంటుంది.ప్రస్తుతం ఇక్కడ హాలోవిన్ పండగ సంబరాలు చూస్తున్నా డెన్వర్ లో.

సూర్యం said...

మీ టపా జ్ఞాపకాలను తట్టి లేపింది. పత్రి కోసం చెట్ల వెంబడి తిరిగేవాళ్లం. పండుగ వస్తే చాలు అమ్మని, అక్కని సతాయించి మరి పెద్ద పెద్ద రంగుల ముగ్గులు ఇంటి ముందు వేయించేవాళ్ళం. అది ఎవరు తొక్క కుండా కాసేపు కాపలా ఉండేవాళ్ళం. టపాసులంటారా.. ఎవరి ఇంటి ముందు శబ్ధం ఎక్కువ వస్తే వాళ్ళు ఎక్కువ కాల్చినట్టు. టాపాసులు ఇంటిలో తయారు చెయ్యడం కాస్త కొత్తగా ఉంది. మీ తపా చూసాకే తెలిసింది.

గీతాచార్య said...

మీరు ఏమి చెప్పినా ముందు గొపీ చంద్ గారు "ఆ అబ్బాయి స్కూలు కి రోజూ వెళ్తున్నాడా?" అనే అడుగుతారు.

అంత ఫేమస్ నేను రెగ్యులర్ గా బడికి వెళ్ళటంలో.
PETA వాళ్ళకి చెప్పనందుకు నెనెర్లు.

ravigaru said...

సుజాత గారు మా చినప్పటి దీపావళి పండుగని జ్ఞాపకం చేసారు. సిసింద్రిల లో సురాకారం గంధకం బొగ్గు తగు పాళ్ళలో కలిపి కురడానికి ముందు టెస్టింగ్ ఒకటి. అది దుసుకుంటూ పొతే ఓకే ,తుస్సు మంటే మళ్లి పాళ్ళు మార్చాలి.మళ్లి ఆ సిసింద్రిలకి కొబ్బరి పుల్ల కట్టి తారా జువ్వల ఫీలింగ్.హైదరాబాద్ లో నాకు తెలిసి కుండ చుచ్చు బుడ్లు ,తాటాకు టపాకాయలు, సిసింద్రీలు చూద్దామన్న కాన రావు. మన జ్ఞాపకాలలో తప్ప.పెల్చకుండానే టపాసులు కొంటునప్పుడే తారాపధానికి దూసుకు పోతున్నాయి. ఇప్పటికే ప్రమిదలలో వెలిగే సిరీస్ bulbs వచ్చేసాయి భవిష్యత్తు లో లో మంటే రాని e తారాజువ్వలు వచ్చినా ఆశ్చర్యం లేదు.

లచ్చిమి said...

మా వూర్లో ఇప్పటికీ చేస్తున్నారు టపాసులు ఇంట్లోనే
చిచ్చు బుడ్లు,మతాబులు ,సిసింద్రీలు ,పేక బాంబులు ,పురుకోస బాంబులు ,ఇంకా తారా జువ్వలు
బోల్డు చేస్తారు ఇలా
మా తమ్ముడు కూడా చేస్తాడు ఇవన్నీ :):).
సిసింద్రీలు ఎక్కడ ఇళ్ళలోకి దూరిపోతాయో అని తాటాకు ఇళ్ళు వున్నవాళ్ళు నీళ్లు పెట్టుకుని కాపలా కూర్చోవడం అదంతా ఒక తీయని కల
ఇప్పుడన్నే డాబాలే గా

అందరికీ దీపావళి శుభాకాంక్షలు

విరజాజి said...

అయ్యో.. మీరలా పాత వజ్రాల మెరుపుల దినాల్ని గుర్తు చెయ్యకండీ !! మనసు లాగేత్తది... లాగేత్తది ... లాగేత్తది !! మా అమ్మ చిచ్చుబుడ్లు, మతాబాల స్పెషలిస్ట్. అప్పుడప్పుడూ ఆ దినుసులు ఎండబెట్టేటప్పుడు చినుకులు పడేవి. అప్పుడు అవన్నీ తీసి లోపల పెట్టడం, మళ్ళీ ఎండబెట్టడం.... భలే సరదా రోజులు. తలచుకోవడమే తప్ప ఇంకేం చెయ్యగలం?

దీపావళి నించీ మొదలయ్యే కార్తీక మాసం లో కనీసం సోమవారాలైనా చీకటి తో నిద్రలేచి, మా బావి దగ్గర స్నానం చేసి, దీపాలు వెలిగించేవాళ్ళం. మా అమ్మమ్మ, నాయనమ్మ ఆ నెల మొత్తం కార్తీక స్నానాలు చేసేవాళ్ళు.

మరో ముఖ్యమైన పని కూడా దీపావళి కల్లా మా నాన్న చేసేవారు. ఆకాశదీపం పెట్టడానికి కర్ర పుల్లలని ఒక మంచి షేప్ లో తయారు చేసి, రంగు కాగితాలతో అందంగా అలంకరించి దానిలో ఒక బల్బు ఎరేంజ్ చేసి, ఎత్తులో వేలాడదీసే వారు. రోజూ రాత్రి పూట కాసేపు ఆ లైట్ వేసేవాళ్ళం.

ఇప్పుడు పెద్దలకే చాలా విషయాలు తెలీవు. ఇక పిల్లలకి ఏమి చెప్తారు? మనమే మన పిల్లలకి అన్నీ నేర్పలేకపోతున్నామన్నది చెప్పడానికి చేదుగా ఉన్నా, చాలా పచ్చి నిజం.

ప్రతాప్ said...

అందరికి ఒక వార్త, సనత్ నగర్ లో చాలా(???) తక్కువకి పటాసులు/టపాసులు దొరుకుతున్నాయి. నేను స్వయంగా వెళ్ళి చూసాను కూడా. ఎవరన్నా కొనాలి అనుకొన్న వాళ్ళు అటు వెళ్ళి కొనుక్కోవచ్చు. స్టార్ ఫైర్ వర్క్స్ అని దాని పేరు. అక్కడ కూడా చిరంజీవి సినిమా రోజు ఉండేంత పెద్ద క్యూ ఉంది. ముందరే చెబుతున్నాను వెళ్ళి నన్ను తిట్టుకోవద్దు.

అబ్రకదబ్ర said...

>> "చీపురు పుల్లలు లేకుండా తయారు చేసిన తారాజువ్వలు (వీటికి బోడి జువ్వలని పేరు) వెలిగించి వదిలేస్తే అవి దిక్కు తెలీకుండా పరిగెత్తేవి. అందుకే అన్నయ్యలు, ఇతర కజిన్స్ అందరూ పాంట్లు వేసుకుని జాగ్రత్తగా ఉండేవాళ్ళు"

:-)

టపాసులు, పటాసులు రెండూ కరెక్టే.

ఇంట్లో తయారు చేసే అలవాటు లేదు కానీ నేను బజార్లో కొన్నవే కాల్చేవాడిని. హైస్కూలు రోజుల తర్వాత టపాసుల మీద ఆసక్తి పోయింది. నావరకూ దీపావళికన్నా సంక్రాంతి అంటే ఎక్కువ సరదాగా ఉండేది. సంక్రాంతికి ముందు నెల రోజుల్నుండే భోగి మంటల కోసం తుప్పలు కొట్టి కలప పోగెయ్యటం, వీధిలో అమ్మలక్కలు ముగ్గులు పెడుతుంటే వాటికోసం రాత్రిళ్లు ప్రత్యేకంగా లైట్లు సిద్ధం చెయ్యటం, ఉదయాన హరిదాసుల హడావిడి .... దీపావళికి ఇప్పటికీ ఎంతో కొంత పాత రూపు ఉంది. సంక్రాంతి సరదాలైతే పూర్తిగా కనుమరుగైపోయినట్లున్నాయి.

బొల్లోజు బాబా said...

పప్పు గారన్నట్లు ఉప్పుమూటలు ఒక గొప్ప అనుభవం.
రాజేంద్ర గారి కామెంటు బరువుగా ఉంది.

ఈ దీపావళికి యానాంలో చవకగా లభిస్తున్నాయని నిన్న వెళ్ళి అక్కడి ధరలకు కూడా కళ్ళు తిరిగి పడి, ఏవో కొన్ని సామాన్లు కొనుక్కొని వచ్చాం.
మతాబులు మాత్రం మందు పాకెట్టు, గుల్లలు కొనుక్కుని నిన్నంతా శ్రమించి కూరుకున్నాం. ఆ పనిచేస్తున్నంత సేపు, మా అబ్బాయి అమ్మాయిలతో కొన్ని జ్ఞాపకాలు నెమరేసుకొన్నాను. చూడాలి ఎలా కాల్తాయో.

పి.ఎస్.
పైగా వాళ్లందరిలోనూ నేనూ, మా చెల్లి చిన్న పిల్లలం కావడంతో వాళ్ళు మమ్మల్ని ఇంకా పసివాళ్ళుగానే చూడ్డం భలే 'కిక్' ఇస్తుంది. మంచి పాయింటిది.
నేను మాఇంట్లో చిన్నవాడిని. నేను కూడా అలాంటి కిక్ ను ఎంజాయ్ చేస్తాను.
ఓ సారి మా అమ్మాయి అడిగింది, మీ వాళ్ల వద్ద నువ్వు ఇంకా అలా ఎందుకుంటావు అని. అదే నమ్మా రోల్ ప్లే అంటూ ఓ పెద్ద సైకాలజీ ప్రొఫెసర్ లా క్లాసు పీకా తప్పో ఒప్పో తెలీదు కానీ.

బొల్లోజు బాబా

సుజాత said...

కుమార్ గారు,
చిన్నప్పటి ఏ జ్ఞాపకాన్నీ మర్చిపోకుండా దాచుకోవాలండీ! కొన్నాళ్ళకి పండగలన్నీ కనుమరుగైతే మిగిలేవి మన జ్ఞాపకాలే!

సత్యప్రసాద్ గారు,
దివిటీలు, గుమ్మటాలు బహుశా మా కంటే ముందు జెనరేషన్ వాళ్ళవనుకుంటా!

మహేష్,
"దీపావళంటే దీపాల పండగనుకోవడం మానేసి, డబ్బు పోసి సామాన్లు తగలేసే పండగ గా మిగిలిపోయింది."....ఇదీ కటిక నిజమే!

pappu గారు,
తిప్పుడు పొట్లం గురించి మా గుంటూరు వాళ్లకి తెలీదు! లేదా దాని పేరు మరోటేదైనా అయి ఉండాలి మా వూర్లో! తోటాలనో మరో పేరుతోనో పిలిచే వాళ్ళనుకుంటా. కానీ అవి అర్థ రాత్రి దాటాక కానీ ఆడటానికి పర్మిషన్ ఉండేది కాదట. మీది గోదావరి జిల్లనా? తిప్పుడు పొట్లం గురించి మా వారు చెప్పారు...మీ వ్యాఖ్య చదివాక.

కృష్ణా రావు గారు,
"ఎవరికి వీలైనంతలో వారు సహాయం చేసి ఉపశమనం పొందటమే వీలైన మార్గం.." నేనూ అదే అనుసరిస్తాను.

చంద్ర మోహన్ గారు,
ఇళ్లలో 'టపాకాయలు"(ఢామ్మని మోగేవి) కాదు గానీ పూలు చిమ్మే మతాబాలు, చిచ్చు బుడ్లు వంటివి చేయడం అక్కడక్కడా ఉన్నదే!

రాధిక,
థాంక్యూ! పెద్దయ్యాక కాల్చే సరదా దాదాపు అందరికీ పోతుంది. పిల్లల సరదా కోసం తప్ప నాకసలు టపాసులు కొనాలనే ఉండదు.

నిరంజన్ గారు,
థాంక్యూ!

రిషి,
భలే చెప్పారు! పొద్దున్నే వాకిలి చిమ్మేటపుడు, కాలకుండా మిగిలిన టపాసులు ఏవైనా ఉన్నయేమో అని వెదకటం ఒక సరదా జ్ఞాపకం!


రావు గారు,
మనం MAYTAS కి వెళ్ళాక డాబా ఎక్కితే కూడా ఊరంతా ఇంకా వివరంగా దీపావళి చూడొచ్చేమో కదా!

సూర్యం గారు,
థాంక్యూ!

ravigaru,
టెస్ట్ రౌండ్లు కూడానా? హైదరాబాదులో సగం మంది ఆంధ్రా వాళ్ళే అయినా చాలా చాలా కానరావు లెండి! బాగున్నాయి జ్ఞాపకాలు.

లచిమి, మీ తమ్ముడు కూడా దీపావళి సామాన్లు చేస్తాడంటే
అభినందించాల్సిన విషయమే!

విరజాజి గారు,
మీరు మరి కొన్ని జ్ఞాపకాలను లేవగొట్టి, తీయని బాధ కలిగించారు.

ప్రతాప్ గారు,

ఆలస్యమైపోయింది. కొనేశాం అన్నీ!

సుజాత said...

అబ్రకదబ్ర,
హైస్కూలు దాటాక ఇలాంటి సరదాలన్నిటికీ నెమ్మదిగా దూరమవడం సహజమనుకుంటా...పెద్దవాళ్లమయ్యామనే ఫీలింగ్ తో!

నాకు భోగి టపా రాయడానికి బోలెడన్ని జ్ఞాపకాలు రెడీ చేసారు మీరు!

సంక్రాంతి ఇప్పుడైనా పల్లెల్లో అలాగే ఉందండీ! ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలతో! కాకపోతే ఇదివరకున్నంత మంది హరి దాసులు మాత్రం ఇప్పుడు నిజంగానే లేరు. హరి దాసు పాటతో చలి చలి ఉదయాన్నే నిద్ర లేవడం ఒక మధురానుభూతి.

బాబా గారు,
మా అమ్మాయి కూడా ఇదే ప్రశ్న నన్నడిగింది.."నువ్వు ఇంత పెద్దగా "అమ్మ" అయినా కూడా నిన్ను మామయ్యలు 'చిన్ని, అమ్మలు, కొండ అని పిలుస్తారెందుకూ" అని! నేను అడ్వాంటేజ్ తీసుకుని కొంచెం గొప్పలు చెప్పుకున్నాను లెండి!

మొత్తానికి మతాబులు తయారు చేసారన్నమాట. కుళ్ళుగా ఉందండి!

సిరిసిరిమువ్వ said...

చిన్ననాటి జ్ఞాపకాలని భలే కదిపారుగా.
తిప్పుడు పొట్లాం అంటే పూల పొట్లాం, ఇంట్లోనే చేస్తారు. ఇది తిప్పటం ఓ పెద్ద ఆర్ట్, పోటీలు జరిగేవి, మగపిల్ల్లతో పోటీ పడి మరీ తిప్పేవాళ్ళం. చిచ్చుబుడ్లు, మతాబులు ఇంట్లోనే చేసేవాళ్ళు.
దీపావళి రోజు మా ఊరి మొత్తానికి మా ఇంటి ముందు నరకాసురుడిని దహనం చేసేవాళ్ళం. ఆ సాయంత్రం అంతా దాని ముస్తాబు తోటే సరిపోయేది. గోగు పుల్లలతో బొమ్మ చేసి, మా నాన్నవి పాత పాంటు షర్టు (దీని కోసమే అని మా అమ్మ కాస్త మంచివి దాచి ఉంచేది) తొడిగి దాన్ని ముస్తాబు చేయటం, అది కాలుతూ ఉంటే మగ పిల్లలు దాని మీద నుండి దూకటం, ప్రసాదంగా మా అమ్మ అందరికి బెల్లం వెన్నపూస పెట్టటం....... ప్చ్....మళ్ళీ మా ఊరిలో దీపావళి ఎప్పుడు జరుపుకుంటామో!!
ఇక్కడేవీ ఆ సంబరాలు? వేలు పోసి టపాసులు తేవటం ఓ గంటలో కాల్చేయడం, భయంకరమైన మోతలతోటి దీపావళి అయ్యిందనిపించుకోవటం....

లలిత said...

మీరంతా చేయని పని ఒకటి మా ఇంట్లో దీపావళికి మేం చేసాం .
మా పిల్లలతో దివిటీలు కొట్టించా .
దివ్వీ దివ్వీ దీపావళీ,
మళ్ళీ వచ్చే నాగులచవితీ

సుజాత said...

వరుధిని గారు,
మీరు మరికొన్ని జ్ఞాపకాలను తట్టి లేపారు. నరకాసురుడి బొమ్మను చేయడం వగైరాలు!

లలిత గారు,
భలే మంచి కబురు చెప్పారు. ఇలా చెయ్యలని నాక్కూడా ఉంటుంది. ఎలా చెయ్యాలో తెలియదు. గోగు పుల్లలతో దివిటీలు చేస్తారనుకుంటా కదా! ఈ సారి నేను కూడా చెయ్యాలి.

వేణూ శ్రీకాంత్ said...

మంచి టపా మిస్ అయ్యానండీ... కానీ Better late than never అన్నారు కదా... చాలా జ్ఞాపకాలని కదిల్చారు.. చాలా సంతోషం.... నేనీ రోజు మళ్ళీ ఓ సారి దీపావళి చేసుకున్నా :-)

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

చాలా బాగుంది పండగ జ్ఞాపకం.

దీపావళి పండగకు నెల్లాళ్ళ ముందునుంచీ తారాజువ్వల తయారీలో తలమునకలుగా ఉండేవాడిని.నేను వేసుకున్న లుంగీ బనియన్లు అసలు ఏరంగో తెలియకుండా చూడటానికి నల్లగా కనిపించేవి. నేను బోడి జువ్వలు చేసి ఇస్తే మా అమ్మా చెల్లీ వాటికి పుల్లలు కట్టేవారు.
దీపావళి పండగను చే(చూ)సుకుని దాదాపు ఇరవైరెండేళ్ళయింది. మీ ఆర్టికల్ ఎన్నో జ్ఞాపకాలను వెలికితెచ్చింది సుజాతగారూ.

అప్పట్లో ఈ ముచ్చటకూడా జరిగిందోసారి

పండగ పదినాళ్ళుండగ
బండెడుగా తెచ్చుకున్న బాణాసంచా
నెండేయగ నగ్గి తగిలి
డండం డడడం డడండ డండం డడడం

Post a Comment