మొన్నొక రోజు మా చిన్నత్త నళిని ఫోన్ చేసి వాళ్ళింటికి ఆహ్వానించింది. వాళ్ళబ్బాయి సంగీతం వినడానికి. నిజానికి నాకు వెళ్ళాలని లేకపోయినా ఆమె దగ్గర నావి రెండు పుస్తకాలుండిపోయాయి. అవి ఆవిడ ఎలాగూ తిరిగివ్వదు, నేను వెళ్లయినా తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్లింటికి వెళ్ళాను.
లోపలికెడుతుండగానే గదిలోంచి,గుండెలు జలదరించే బీట్ తో మ్యూజిక్ తారాస్థాయిలో వినపడుతోంది. లోపలి గదిలోంచి వాళ్ళ పుత్ర రత్నం కిరణ్, తలుపు తీసి నన్ను చూసి "హాయ్ వదినా" అంటూ ఆహ్వానించాడు.
"హాయ్ రా కిరణ్" అంటూ లోపలికి వెళ్ళేసరికి పక్క గదిలోంచి, కాలి మీద బూటు కాలు పడితే అప్రయత్నంగా వెలువడే కేకల్లాంటి కేకలు వినపడుతున్నాయి.
"ఆ కేకలేమిట్రా" అంటే వాడు మెరిసే ప్లాస్టిక్ చొక్కాని చూసుకుంటూ, నవ్వుతూ,
"పో వదినా, మేము ఒక ఆల్బం చేస్తున్నాం, దాని ట్రాక్ అది" అని వివరించాడు.
అంతలోంచి పై నుంచి నళిని ఆంటీ దిగొచ్చి, అందుకుంది.
"ఏమిటో నమ్మా, వాళ్ల నాన్న ఎంత చెప్పినా వినట్లేదు వీడు. "టోకీ" గారు వీడి వాయిస్ ని తెగ మెచ్చేసుకున్నారా, అప్పటినుంచీ ఆల్బం చేసే తీరాలని పట్టుకున్నాడు. ఎంత కష్టపడుతున్నాడో బిడ్డ..." అంది మురిపెంగా
వాడిలో "ఎన్రిక్ ఇగ్లేసియాస్" ని చూసుకుంటూ!
మీకేమీ అర్థం కావట్లేదు కదూ, నాకూ అంతే లెండి మొదట్లో! విషయమేమిటంటే ..
వాడు ఒక మొబైల్ ఫోన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఒక "కింగ్ ఆఫ్ ఇండియా" పాటల
కార్యక్రమంలో మూడు రౌండ్లు దాటాడు.
దానికి జడ్జీగా వచ్చిన "టోకీ" అనే సంగీత దర్శకుడు(పాపం వీళ్ళ నాన్నగారు పాత తరంలో మెలోడీ కి ప్రాణం పోసిన పాటలెన్నిటినో కూర్చిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు)
"సూపర్బ్, నీకు తిరుగు లేదు, నీకు మంచి ఫ్యూచరుంది, రెచ్చిపో" అనడంతో మనవాడు నిజంగానే చదువు చెట్టెక్కించి..(ఇంజనీరింగ్) వాళ్ళ నాన్న సొంత డబ్బులు (లేకపొతే వీడిని ఎవరు స్పాన్సర్ చేస్తారో)ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ ఆల్బం చేసే ప్రయత్నంలో ఉన్నాడు. దీనికి నళిని గారి సపోర్ట్ ఎంతైనా ఉందని నాకు తెలుసు.
ఇంతలో కిరణ్ నా గుండె గుభిల్లుమనే వార్త ఇంకోవార్త వినిపించాడు.
"మేమొక మ్యూజిక్ ట్రూప్ తయారు చేస్తున్నాం, మంచి పేరు కోసం చూస్తున్నాం
తెలుసా వదినా?"
"పెట్టండి, bad boys అనో, Road Romeos అనో, లేకపోతే Street hawkers అనో "
అన్నాను గొంతులో కసిని నవ్వు కింద మారుస్తూ!
వాడు అది గమనించకుండా "ఆ పేర్లతో ఆల్రెడీ ట్రూపులున్నాయి. అందుకే కొత్త పేరొకటి సెలెక్ట్ చేసాం" అన్నాడు.
గుండె చిక్కబట్టుకుంటూ.."చెప్పూ" అన్నాను.
వాడు కొంచెం సిగ్గుపడుతూ,"డర్టీ ఫెలోస్" అన్నాడు.
"ఎవరూ" అన్నాను అయోమయంగా!
"మేమే" అని అంతలోనే కంగారు పడుతూ సరిదిద్దుకుని.."అంటే...మా ట్రూపు పేరు" అన్నాడు.
"సూపర్ గా ఉందిరా పేరు. "ఒక్కడికీ వాయిస్ లేదు" అనో,
"సింగిల్ పాటతో చంపేస్తారు" అనో టాగ్ లైను పెడితే బాగుంటుందేమో ఆలోచించు" అన్నాను.
వాడు ఆలోచించబోయి,
నా మాటల్లో వ్యంగ్యం అర్థమైనట్టు "పో వదినా, నువ్వు!సరే ఆల్బం విందువు గానీ, రా" అని లోపలికి తీస్కెళ్ళాడు. ఆ రూమంతా ఆదిత్య 369 సినిమాలో టైం మెషీన్లా ఉంది. ఒక కంప్యూటర్, దానికి అనుసంధానించి కీ బోర్డు, వగైరాలు...స్పీకర్లు...వైర్లు, కేబుల్స్....!
ఆ తర్వాత నేను పడ్డ హింస చెపితే అర్థం కాదు. అనుభవించాల్సిందే!
పొద్దున్న నేను చిన్నత్త వాళ్లింటికి వెళతానంటే ఈయన జాలిగా ఎందుకు చూసారో నాకిప్పుడు అర్థమైంది.
* * *
ఇప్పుడు రాత్రి prime time లో మనం ఏ తెలుగు చానెల్ పెట్టినా , ఇదే గోల!
ప్రతి చానెల్లో ఒక్కో మొబైల్ ఫోన్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసే పాటల
ప్రోగ్రాములు! "బోర్ ఆఫ్ ఆంధ్రా" అని ఒకడు పేరు పెడితే," సూపర్ లూజర్" అనే పేరుతో మరొకడు(ఈ మాత్రం క్లూ లు చాలవూ మీరు ఆ కార్యక్రమాల పేర్లు కనుక్కోడానికి?) మరో చానెల్లో " స ని ద ప మ " అనే పేరుతో!
సోనీ టీవిలో ఇండియన్ ఐడల్ జరిగినప్పటినుంచీ, మన వాళ్ళు కూడా
పిచ్చెత్తినట్టు ఈ కార్యక్రమాలకు ఆంధ్ర దేశం నిండా ఆడిషన్లు పెట్టి "సా పా సా" అనడం వచ్చిన వాళ్లందరినీ టోకున సెలెక్ట్ చేసి పారేసి, మన ఖర్మ కాల్చడానికి ప్లాను వేసేసారు.
ఈ కార్యక్రమాలకు జడ్జీలు గా వచ్చే "గాయ"కులు(నీ మణులు) బుద్ధ విగ్రహాలల్లే కూచుని అపశ్రుతులతో పాడిన వాళ్ళను కూడా "నీ గొంతు "యూనిక్" గా ఉంది. ఇలాంటి గొంతులు అందరికీ ఉండవు(అది నిజమేలెండి)
అని ఓ మెచ్చేసుకోవడం!
ప్రతి చానెల్లో ఈ ప్రోగ్రాములు ఉండటం వల్ల, పోటీ ఎక్కువై, ఎక్కువమందిని ఫిల్టర్ చేసే అవకాశం లేక కనపడిన వాళ్ళందరి చేతా పాడించెయ్యడం మొదలెట్టారు. ఆ పాట పాడిన వాళ్ళకు గాత్ర శుద్ధి లేదని, శ్రుతి అవుట్ అయిపోతోందని,తెలియడానికి సంగీతం తెలియక్కర్లేదు. కనీసం సినిమా పాటలు వినడం తెలిస్తే చాలు.
అయినా జడ్జీలు "I have no words. excellent" , "I'm speech less" అంటారు.
ఈ మధ్య మా స్నేహితుడొకరు(సంగీత దర్శకుడు)తను కూర్చిన పాటల ట్యూన్లు వినడానికి పిలిస్తే వెళ్లాము. అతను చెప్తే తెలిసింది. ఈ కార్యక్రమాల్లో పాడేవాళ్లందరినీ అలా మెచ్చేసుకోవాలని జడ్జీలకు ముందే నిబంధనట!
ఎందుకంటే ఎవర్నీ నిరాశపర్చకూడదట!
ఒక జాతీయ హిందీ చానెల్ పెట్టిన పాటల పోటీలో రన్నరప్ గా నిలిచిన నల్లాన్ చక్రవర్తుల వారి అబ్బాయి వారుణ్య, ఆ పోటీ తర్వాత ఎప్పుడైనా కాసేపు శాస్త్రీయ సంగీతం ప్రాక్టీస్ చేసుంటాడంటారా? చెమికీలు, అద్దాలు, పూసలు, కుందన్స్,బల్బులు వగైరాలు కుట్టిన మెరిసే చొక్కాలు వేసుకుని,స్టీలు బెల్టులు, పూసల గొలుసులు వేసుకుని ప్రస్తుతం పాటల ప్రోగ్రాములకు యాంకర్ గా చేస్తున్న అతడిని చూస్ట్తే ఎంత బాధ వేస్తుందో!
ఈ రోజు వారీ సంగీత హింసే కాక, కొన్ని చానెళ్ళు "ఒక్కతే" అని, "ఏడే స్వరాలు" అనే పేర్లతోనూ పాపం డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన ఒక గాయనిని యాంకర్ గా పెట్టుకుని వారాంతంలో కూడా టీవీ వైపు చూడాలంటే దడ పుట్టేట్లు చేస్తున్నారు.
కొన్ని చానెళ్ళలో అన్ని రౌండ్లూ ముగిసి, ఫైనల్ కి వచ్చే వాళ్ళు ప్రేక్షకుల SMS ల దయతో కాస్త మంచి వాళ్ళే మిగులుతున్నారు.కొన్నింటిలో అదీ లేదు. ఇంతా చేసి ఈ గాయనీ గాయకుల అంతిమ లక్ష్యం ..
"సినిమాల్లో పాడటం"! ఇంతవరకు గెలిచిన వాళ్లకు ఎంత మందికి సినిమా అవకాశాలొచ్చాయో అందరికీ తెలిసిందే!
సెమీ ఫైనల్స్ కి చేరిన వాళ్ల ఇంటికి చానెళ్ళ వాళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళి,వాళ్ల ఆవకాయ జాడీలు, సింకులో అంట్లూ,బాత్ రూములో బకెట్లు, ఇంటి ముందు ముగ్గూ, కుంపట్లో బొగ్గు,వాళ్ళ బొచ్చు కుక్కపిల్ల, దాన్ని ఆడించే పని పిల్ల,వాళ్ల తలుపు గొళ్ళెం, తోమని హారతి పళ్ళెం, అన్నీ పడేట్టు చిత్రీకరిస్తూ వాళ్ల ను ప్రోత్సహిస్తారన్నమాట.
ఇహ, వోడిన వాళ్ళు భోరున ఏడవటం! యాంకర్లు, జడ్జీలు.. వాళ్ళ చుట్టాలెవరో పోయినట్టు విషణ్ణ వదనాలు పెట్టుకుని వాళ్ల భుజం తట్టి "this is what life!(ఇదేనట జీవితం) నీ ఓటమి మరో గెలుపుకి పునాది" అని సోది ఓదార్పులతో కన్నీళ్ళు తుడవటం..ఇవన్నీ మనకి కూడా(ఎందుకు చూస్తున్నామురా దేవుడా అని) కన్నీళ్ళు తెప్పించే డ్రామాలు!
అవన్నీ పక్కనపెడితే,పట్టుమని నాలుగేళ్ళు నిండని పసి మొగ్గల చేత ఈ పోటీల్లో little buds అనీ 'చిన్నారుల సరాగాలు అనే పేర్లతో పాడించడాన్ని నేనసలు సహించలేకపోతున్నాను. గంట ప్రోగ్రాం రికార్డింగ్ కి రోజంతా పట్టే సందర్భాలుంటాయి.
అలా పసి బిడ్డల్ని రోజంతా కూచో బెట్టి హింసించి పాడిస్తే తల్లి దండ్రులకు ఏం వొరుగుతుందో అర్థం కాదు. అంత చిన్న పిల్లల గొంతుల్లో మెలొడీని, శృతి, లయలు పర్ఫెక్ట్ గా ఉండాలని ఆశించలేం! అయినా ఆ పిల్లల కంటే ముందు తల్లుల(తండ్రుల పాత్ర తక్కువే ఈ ఆరాటంలో) టెన్షన్ చూడాలి!
చెపితే నమ్మరు(చూసి ఉంటే సరే), స ని ద ప మ కార్యక్రమంలో ఒక పదేళ్ళ పాప బాగా పాడుతున్నా కొన్ని చిన్న పొరపాట్ల వల్ల eliminate అయి తొలగవలసి వచ్చింది. వెంటనే వాళ్ళమ్మ ఘొల్లున ఏడుపు. "మా అమ్మాయి ఫైనల్స్ కి వెడుతుందని టోకీ గారు చెప్పారు. ఇక్కడ రాజకీయం జరిగింది. పిల్ల తెల్లవారుజామునే లేచి ప్రాక్టీస్ చేసింది..(ఎవరి కోసమో)" అని గోల గోల చేసింది. అందరూ ఆవిడను ఓదార్చడం!
ఇదంతా ప్రేక్షకులకు అవసరమా?ఆ తర్వాత (ఆ పాపను ఎంతగా హింసించారో), వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తిరిగి వచ్చి..పాడి నెగ్గింది ఆ రౌండ్! వాళ్ళమ్మ మళ్ళీ ఘొల్లుమంది....ఈ సారి ఆనందంతో!
ఈ చిట్టి మొగ్గల చేత "హుషారు గొలిపే "పాటల రౌండ్ లో పాడించే పాటలు వింటే జన్మ రాహిత్యం కలుగుతుంది.
"ఓరోరి యోగి .."(ఆ తర్వాత రాయలేను, క్షమించండి)
"వంగతోట మలుపు కాడ" ..ఇవీ!
"అబ్బో, ఈ పాటలకు పసి పిల్లలు రక రకాలు మూమెంట్స్ తో డాన్సాడుతుంటేనే చూసేశాం, పాట వినలేమా "అంటారా? సరే, అలాగే కానీండి!
న్యాయనిర్ణేతల గురించి రాయకపోతే నాకు నిష్కృతి లేదు. పాడిన ప్రతి వాళ్ళనూ యధాశక్తి మెచ్చుకోగలగడం వీళ్ల ప్రాథమిక అర్హత.భాష గురించి పట్టింపు లేదు. మొన్నొక కార్యక్రమంలో తెలుగు పాటలోని ఉచ్చారణా దోషాన్ని మలయాళీ మాల్గాడి శుభ పట్టుకుని చూపించేదాక ఎవరికీ తెలీకపాయె!
మరో పాటల కార్యక్రమంలో ఒక కుర్ర జడ్జీ చిరంజీవి పాట ఒక పాప పాడుతుంటే హుషారుగా లేచి కుర్చీ దిగొచ్చి డాన్సాడేశాడు, చిరు స్టెప్పులతోనే!
టోకీ గారికి ఆ సదరు స ని ద ప మ వాళ్ళు ఎంత డబ్బిస్తారో గానీ రోజుకొక సారి
" ఈ చానెల్ కి నేను రుణ పడ్డాను..పడ్డాను..పడ్డాను" అని చెపుతూనే ఉంటారు!
నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి..బాల సుబ్రహ్మణ్యం నిర్వహణలో జరిగిన
కార్యక్రమాల నాణ్యత ఇప్పుడు నడుస్తున్న వాటిలో ఒక్క దానికీ లేదంటే లేదు. గొంతు లో నాణ్యతను పట్టుకోగలిగే శాస్త్రీయ సంగీతం తెలిసీన న్యాయ నిర్ణేతలు ఉండేవారు బాలు ప్రోగ్రాముల్లో!
మన గురువు గారికి అసలే భాషంటే ప్రాణం,పట్టింపూనూ!!
"చాలా చక్కగా పాడావమ్మా "నా దేషం " అని ఒక్క విసురు విసిరితే ఇక జీవితాంతం "శ" కి "ష" కీ మధ్య తేడాని మర్చిపోలేరు ఎవరూ!
* * * *
కట్ చేస్తే....
మా కిరణ్ గాడి మూడో సెమిస్టరు తన్నేయడంతో వాళ్ళయ్య బెల్టు పుచ్చుకుని వెంట బడ్డాడు.(ఇదేదో మొదటే చేయవలసింది)దానితో వాడు ఆల్బంల గోల ( ప్రస్తుతానికి) వదిలి పుస్తకాలు పుచ్చుకుని స్టడీ రూములో సెటిలయ్యాడు.
* * *
తాజాకలం:నాకు విదేశాల్లో ఉండాలని కోరికేం లేదు గానీ, ఇలాంటి కష్టాలెదురైనప్పుడు మాత్రం తెలుగు టీవీ చానెళ్ళు చూడలేని ప్రవాసాంధ్రులందరి పట్లా అసూయతో రగిలిపోతుంటాను.
36 comments:
అమెరికా లోని తెలుగువారిని చూసి , అసూయ పడనవసరం లేదు. ఇక్కడి వాళ్లకు తెలుగు కార్యక్రమాలు చూపించటానికై పెద్ద పరిశోధక సంస్థలే పూనుకుని చాల Softwares తయారు చేశారు. ఈ సంస్థలలో 70 శాతం మంది భారతీయులే పనిచేస్తున్నారు. ఈ భారతీయులలో 70 శాతం తెలుగు వారే. వీరు మనకు ఇప్పుడు రక రకాల కేబుళ్ల ద్వారా మా,జెమిని, టి.వి 9, ఈనాడు ఇంకా జీ టీవి వగైరాలు చూపించేస్తున్నారు. నేను దర్సించిన అట్లాంటా,కొలంబస్ వగైరా పట్టణాలలో మన తెలుగు వారు ఈ కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నారు.
-cbrao
San Jose, CA.
ఈ హింసధ్వనుల బారినపడని ఛానల్ ప్రేక్షకులు లేరు. అన్నింటిలోనూ ఇదేగోల ఇదేతంతు.
మహానుభావుడు బాలసుబ్రమణ్యంగారు మొదలెట్టిన ‘పాడుతాతియ్యగా’,‘పాడాలనివుంది’కార్యక్రమాలతో ప్రస్తుతం పాడుతున్న నేపధ్యగాయక/గాయణీమణులొచ్చారు. ఆ తరువాత అందరూ మొదలెట్టి ఈ పాడేకార్యక్రమాల పాడెగట్టారు.
కానీ,నాకు ఇప్పటికీ నచ్చే కార్యక్రమం బాలసుబ్రమణ్యం ఈటీవీ కన్నడలో జరిపే "ఎదతుంబి హాడిదె" కార్యక్రమం. పిల్లలొచ్చినా,పెద్దలొచ్చినా పాటలమాత్రం వినసొంపుగా వుంటాయి. జడ్జీలు గౌరవప్రదంగా తమ నిర్ణయాల్ని చెబుతారు.సినీగీతాలకు సంబంధించిన చారిత్రాత్మక/వ్యక్తిగత విషయాలూ అనుభవాలూ తెలుస్తాయి.
బాగుంది మీ విశ్లేషణ
హింస ధ్వని ఒక రకం హింస ఐతే క్రైం న్యూస్ లు పెట్టే హింస ఇంకొక రకం. మొన్న రాత్రి అదేదో చానెల్ వాడు మహత్తరమైన, మహా రసవంతమైన కార్యక్రమం ఒకటి ప్రసారం చేసాడు, దాని పేరు "క్రైం ఫటాఫట్"... అంటే ఏంటో వాడి ఉద్దేశం... ఫటాఫట్ నేరాలు చేసి చకచక్ టీ.వీ వాళ్ళకి ఒక మాట చెప్పేస్తే వాళ్ళు ధనధన్ ప్రసారం చేసేస్తారు కాబోలు....
అద్భుతంగా వుందండీ మీ సంగీత ఘోష. చదువుతుంటే చూస్తున్నట్టే వుంది చిత్రహింస. నాక్కూడా అదే అనిపిస్తుంది ఈరోజుల్లో పిల్లలకి బాల్యం లేకుండా పోతోంది.
సీబీరావుగారు అన్నట్టు అమెరికాలోనూ ఇదే గోల.
హమ్మయ్య, నేనొక్కడినే ఈ బాధితుల కులంలో ఉన్నా అనుకున్నా. ఓ పాట పాడేసరికి కాబోయే బాలమురళీకృష్ణవి నువ్వే అని జడ్జీలు ఎత్తేస్తుంటే, చికాకుని అదుపులో పెట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలన్నిటిమీద స్వయంనిషేధం విధించుకున్నా. నానాటికి తీసికట్టు నాగంభొట్లు చందాన తయారయ్యాయి ఈ ప్రోగ్రాములన్నీ... పాపము శమించుగాక! ప్రతీ ప్రోగ్రాము చివర న్యాయనిర్ణేతలు ఫలితాలు ప్రకటించడం - వాటికి ఎమోషన్లు ఓవర్ డోసు - ఆ ఏడుపులు - హమ్మా... సుజాతగారూ వద్దు - ఆ ఎపిసోడులను నేను మనసులో కూడా రీప్లే చేసుకోలేను - మీరేమన్నా అనండి - ఇది మాత్రం నిజంగా నా "మనసులో మాట"
రావు గారు, మాలతి గారు
నేనేదో విదేశాల్లో ఉన్న వాళ్ళు సుఖపడిపోతున్నారని కుళ్ళుకున్నాను. ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది.
సుజాతా, మీ అసూయకి మేమర్హులం కానే కాము :)) సాటిలైట్ డిష్ ల పుణ్యమా అని ఈ హింస మా ఇళ్ళల్లో కూడా జరుగుతోంది.. గుడ్డిలో మెల్ల ఏంటంటే ఇక్కడ సర్వీస్ ని బట్టి లిమిటెడ్ ఛానెల్స్ వస్తాయి..
అయినా ఎక్కడ 'పాడుతా తీయగా' ఎక్కడ ఈ 'కాకిగోల '!! ఏదో పాటలంటే ప్రాణమని మంచి పాటలు పాడతారేమో అని కూర్చుంటే కళ్ళనీళ్ళొకటే తక్కువ.. చిన్నపిల్లలతో పిచ్చి పాటలు పాడిస్తుంటే అసలు ఎంత బాధేస్తుందో! పైగా ఒక్కోసారి సంగీతం రాని స్పెషల్ జడ్జీలను పిలుస్తారు.. వాళ్ళేమో ఏం కామెంట్ చేయాలో తెలీక "you sang better than the original singer!" అంటారు!!
అదిరింది. కేక కేక. అంటే మీ అందరికి కోపం గానీ... అటువంటి ప్రోగ్రాములని అంత సేరియస్ చూస్తారా ఎవరైనా.. etv సుమన్, ప్రభాకర్ ప్రోగ్రముల్లాగా కామెడి కళ్ళతో చూడాలి. సుజాత గారు మీ తరువాతి టపా డాన్సు ప్రోగ్రాముల మీద ఆశించా వచ్చా??
అందరకి ఒక విన్నపం.. మీరు ఏ ఎపిసోడ్ మిస్ అయినా ఫర్వాలేదు కాని... ఎలిమినేషన్ రౌండులు మాత్రం మిస్ అవ్వొద్దు.. భలే కామెడీని ఎంజాయ్ చేయ వచ్చు.
బాగుందండి......రాగంలోనే ఆ ' హింసని ' (హంసధ్వని) వినిపించారు..మీ ' హింసధ్వని ' లో. ఈ పోస్ట్ చూశాకైనా ఆ టి.వి. వాళ్ళు కొంచెం మారితే బాగుణ్ణు.
ఈ చిన్న పిల్లల విషయంలో మాత్రం టి.వి. వాళ్ళని క్షమించలేం. నిన్నటికి నిన్న వాళ్ళలో కొద్దిసేపు ఎంత టెన్షన్ బిల్డప్ చేసారో..మీ (మన) ' టోకీ ' గారు.. :-)
నిజమే మన తెలుగు ఛానెల్ వాళ్ళు టాలెంట్ కంటే పబ్లిసిటీ నే ఇష్టపడతారు... వీటికి తోడు ఆ ఎస్సెమ్మెస్ రిక్వెస్టులు.... హ్మ్ ఏం చెప్తాంలెండి వీక్షకులకి మత్తుమందుల ఎక్కిచేసారు ఇప్పటికే.
సుజాత గారు, మీరు అసూయ పడేంత అదృష్టవంతులం కాదు మేము. మాకు ఉన్నాయి, ఈ టీవి,మా టీవి, జెమిని, తేజ.
కొంతలొ కొంత ఈ పాటల programs better, dance competitions అయితె వికారం పుడుతుంది చూస్తుంటె.
నేను ఇన్ని రోజులూ అవి కామెడీ ప్రోగ్రాములు అని అనుకుని చూస్తూ ఉన్నా. WWE లాగా ఇక్కడ కూడా ఎవరెవరో వచ్చి నటిస్తున్నారేమో అని అనుకుంటున్నా.
http://www.flyyoufools.com/indian-tv-show-judge/
కృష్ణా రావు గారు,
మీరు మరీనండి, ఏదో పరువుగా బతికే వాళ్లని పట్టుకుని డాన్స్ పాపా డాన్స్ చూడమంటారా? ఆ ప్రోగ్రాములు చూస్తూ నా అయిదేళ్ళ కూతురు, నేనెదురు చూడని ప్రస్నలేమైనా వేస్తే నా గతేం కాదు. మీరన్నట్టు ఇక కామెడీ కళ్ళతో చూస్తా లెండి!
నిశాంత్ గారు,
ఒక్కో ఎస్సెమ్మెస్ కి ఆరేసి రూపాయలు పెట్టి మనం వాళ్ళకి వోట్లేయడం ఏమిటో, అసలు వేసే వాళ్ళు ఎలా , ఎందుకు వేస్తారో అర్థం కావట్లేదండి!
హంసధ్వని విఘ్నేశ్వరుడికి, (నాకు కూడా) ఇష్టమైన రాగం. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఈ సందర్భంలో అలా వాడాల్సి వచ్చింది.
రాణి గారు,
మేము డాన్స్ ప్రోగ్రాంస్ టైములో ఇల్లు తాళం వేసి పారిపోతున్నాం
ప్రదీప్ గారు,
అంతేలెండి పాపం, పాల్గొను వారు, జడ్జీలు కూడా అంతగా "జీవిస్తుంటే" కామెడీ అనుకోక ఏం చేస్తారు? చివరికి ఏది కామెడీయో కూడా తెలుసుకోలేనంతగా మన జీవితాల్ని ట్రాజెడీ చేసింది టివి.
లక్ష్మి గారు,
ఈ క్రైం న్యూస్ సంగతేంటో మీరు చూడాల్సిందే!
చివుకుల గారు,
మీ ఆవేదన నిజంగా అర్థం అయింది. బతికుంటే బలుసాకు తినొచ్చు. ఇక ఈ కార్యక్రమాలు చూడొద్దని బాలు మీద ఒట్టేసుకుందాం.
నిషి,
"కాకిగోల" ! సరైన పేరే పెట్టారు. "ఏదో పాటలంటే ప్రాణమని..." సరిగ్గ ఇక్కడే దొరికిపోతున్నాం వీళ్ళకి.
ఇంకో సంగతి..అన్నింటికంటే ఎక్కువగా దురినియోగమయ్యే పాట.."లలిత ప్రియ కమలం(రుద్రవీణ)" ! ఈ పాటంటే నాకు ప్రాణం. రక రకాలు "స్టోనుల్లో" ఈ పాట రక రకాలుగా విని, ఇప్పుడు చిత్ర, జేసుదాస్ పాడుతున్నా కూడా చెవులు మూసుకుని పారి పోతున్నా.
"ఈ చిట్టి మొగ్గల చేత "హుషారు గొలిపే "పాటల రౌండ్ లో పాడించే పాటలు వింటే జన్మ రాహిత్యం కలుగుతుంది.
"ఓరోరి యోగి .."(ఆ తర్వాత రాయలేను, క్షమించండి)
"వంగతోట మలుపు కాడ" ..ఇవీ!"
బాగా చెప్పారు - మొన్న ఒక రోజున ఆత్రేయ స్పెషల్ అని - యుగళ గీతాలు పాడిస్తే - ఎవరిని తిట్టాలో తెలియలెదో తెలియలేదు ..
ఒకాయనా ఐతే, ఇద్దరు చిన్నారులు యుగళ గీతం పాడిన తరువాత, పాడిన అబ్బాయితో "నువ్వు ఆ ఆమ్మాయి భుజాల వరుకు లేవు గానీ" అన్నాడు..ఆయన ఉద్దేశ్యమేమిటో
ఇలాంటి ఓ కార్యక్రమం లో ఓ సినీగీత దిగ్గజాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాను..
- ఊకదంపుడు
నిజంగా నాకీ గోలేమీ తెలీదు. అస్సలు నేను టీవీ లో స్పోర్ట్స్ చానెల్స్ తప్ప ఇంకేమి చూడను. అందుకు నేను చాలా అదృష్టవంతున్ని అన్నమాట.
అదేమిటో మీకు ద్విశ్రీలు, కిరణులు బాగా దొరుకుతారు. మీ అదృష్టాన్ని చూసి నేను బాగా కుల్లుకొంటున్నాను.
:-)
నాతో పోలిస్తే మీరంతా అదృష్టవంతులనే చెప్పాలి. మీ ఇంట్లో టీవీ, మీ చేతిలో రిమోట్ కాబట్టి చానెల్ మార్చేసి బ్రతికిపోవచ్చు. నా పరిస్థితి మరీ ఘోరం. బెంగుళూరులోని మా దిక్కుమాలిన ఏరియాలో, నాకు సహించే భోజనం లభించే ఒకే ఒక హోటల్ వాడు, ఈ హింస ప్రోగ్రాములు తప్పించి మిగతా ఏవీ పెట్టడు. జనాల పాటలు, జడ్జీల రొటీన్ రెస్పాన్సులు, ఓడిపోయినవారేదో జీవితాన్ని కోల్పోయినట్లు భారీ ఏడుపు మ్యూజిక్కులు, వాళ్ళవీ వాళ్ళ ఇంట్లోవాళ్ళ మొహాలూ స్లొమోషన్ లో జూమ్ చెయ్యటాలు, రోజూ ఇవి చూసీ చూసీ జీవితం మీద విరక్తి పుడుతోంది నాకు. ఆ హోటలు వాడు పెట్టే తిండేమోగానీ, ఈ హింసని తట్టుకోవటం కష్టంగా ఉంది.
నా coming soon టపాల లిస్టులోనుండి ఒకటి రద్దైపోయింది. పోయినవారమే ఇటువంటిది రాద్దామనుకున్నా కానీ నేనింత బాగా రాసుండేవాడిని కాదు.
అదృష్టవశాత్తూ నాకీ వెధవగోలతో పెద్ద సమస్య లేదు. మొన్నా మధ్య ఇండియా వచ్చినప్పుడు రెండు మూడు సార్లు ఈ కార్యక్రమాలు చూసి చిర్రెత్తింది. పాటల పోటీని అలాగే ఉంచక మధ్యలో ఏడుపులు, పెడబొబ్బల నాటకాలేమిటో నాకస్సలర్ధమవదు. ఇప్పుడు జీటీవీలోనో ఎక్కడో అంతర్జాతీయ సారేగామాపా (సరిగమప అనొచ్చుగా!) పోటీ అట ఒకటి జరుగుతుంది. పాకిస్తానీలు, ఎమిరేట్స్ వాళ్లు, ఇండియన్స్ .. ఇలా రకరకాల వాళ్లున్నారు. ఫైనల్‌లో ఎవరు గెలిచినా, ఫైనల్ కి వచ్చే వాళ్లలో మాత్రం ఒకడైనా ఇండియన్ ఉంటాడు చూడండి. ఒక్క ఇండియనూ లేకుంటే ఎస్సెమ్మెస్ బిజినెస్, యాడ్ రెవిన్యూ ఎలా వస్తుంది?
మరేదో పిల్లకాయల డ్యాన్సు పోటీలో రాఖీ రావంత్ ఒక న్యాయ నిర్ణేత. పిల్లల కార్యక్రమానికి ఆవిడ వేసుకొచ్చే అర్ధ నగ్న దేవతా వస్త్రాలు, నిండా పదేళ్లు లేని పసి పిల్లలు అర్ధం కూడా తెలీని వీర నాటు పాటలకి చేసే వెకిలి నృత్యాలు ప్రేక్షకుల్లో కూర్చుని ఆనందబాష్పాలు రాలుస్తూ చూసే తల్లిదండ్రులు .. ఏం చెబుతాం? ఇక రాఖీ గారు పిల్లల ప్రదర్శనతో సంబంధం లేకుండా చిత్ర విచిత్రమైన మార్కులేస్తూ వాటిని మరింత వింత వాదనలతో సమర్ధించుకునే తీరు చూడాలి. ఈ ఫార్సంతా సదరు టీవీ వారి స్క్రిప్టు ప్రకారమే జరుగుతుందని నా గాఠి నమ్మకం.
హ హ బాగుందండీ... బాలు గారి ప్రోగ్రాం ని గుర్తు చేసి మంచి పని చేసారు... ఇక మిగిలిన వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది... మీ కిరణ్ తాత్కాలిక విరామం ఇచ్చి ఉంటాడు వేసవి శలవల్లో మళ్ళీ ఓ సారి వాళ్ళ ఇంటికి వెళ్ళిరండి :-) మాకు మరో మంచి టపా దొరుకుతుంది నవ్వుకోడానికి...
వూకదంపుడు గారు,
ఆ సినీ దిగ్గజం కూడా ఏ ఫీలింగూ లేని గొంతుతో యథా శక్తి , ఆ పాడు వారిని మెచ్చుకుంటూనే ఉంటాడు చూసారా? అంతే కాదు..ఈ హుషారు గొలిపే పాటలు పిల్లలు పాడినపుడు కొంతమంది న్యాయ నిర్ణేతలు "ఇంకా expression ఉండాలి" అని చెప్పడం నాకు దిగ్భ్రాంతిని కలిగించిన విషయం!
ప్రతాప్,
మీరు అదృష్టవంతులే సుమా! మీకింకా మా ద్విశ్రీ గుర్తున్నాడా?
చైతన్య కృష్ణ గారు,
మీరు తిండినైనా సరే త్యాగం చేసి వేరే హోటలుకెళ్ళాలని ప్రార్థన. మీ మంచికే చెప్తున్నాను.
అబ్రకదబ్ర,
మీరూహించింది కరక్టే! ఈ ఫార్సులన్నింటికీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం సదరు చానెల్ వారిదే!
"సారేగామాపా" అని వినగానే మనకు నార్త్ ఇండియన్ కంపు గుప్పున కొట్టాలి. అందుకే అలా అంటారు.
వేణూశ్రీ....(కొత్తపాళీ గారినుంచి మీ పేరు షార్ట్ కట్ కాపీ కొట్టా)
ఒక్క సారికే నేనింకా కోలుకోలేదు బాబూ, మళ్ళీనా?
ఈ టపా ఎలా మిస్సయ్యానబ్బా.. యాస్ యూస్వల్ గా బాగుంది. "డర్టి ఫెల్లోస్" పేటంట్ రైట్స్ ఎంతకమ్ముతారు :)
దైవానిక,
నాకేం తెలుసండి? కిరణ్ గాడినడగాలి. టాగ్ లైనైతే నన్నడగాలి.
G. K. Chesterton మాటల్లో చెప్పాలంటే ఆ అద్భుతమైన ప్రోగ్రాం లో, అద్భుతమైన పిల్లలు, అద్భుతమైన సాహిత్యం కల, అద్భుతమైన సంగీతం కల, అద్భుతమైన ప్రతిభ కలిగిన, అద్భుతమైన సంగీత, అద్భుతమైన దర్శకుడు, అద్భుతంగా ఈర్ష్య, అద్భుతమైన పడేలాగా, అద్భుతంగా పాడుతారు.
ఆ అద్భుతమైన గాత్ర, అద్భుతమైన మాధుర్యాన్ని, ఆ అద్భుతమైన న్యాయ, అద్భుతమైన నిర్ణేతలు, అద్భుతమైన పాటగా, అద్భుతంగా మెచ్చుకుంటారు. ఆ అద్భుతమైన పిల్లలు, అద్భుతమైన వారి అద్భుతమైన తల్లితండ్రులు, అద్భుతంగా ఓవర్ అద్భుతంగా యాక్షన్ అద్భుతంగా చేస్తారు. ఆ అద్భుతాలకే అద్భుతమైన రేటింగులు అద్భుతమైన వస్తాయి. అద్భుతమైన చానల్ అద్భుతమైన వాళ్ళకి అద్భుతమైన పేరూ, అద్భుతమైన ప్రఖ్యాతులూ, అద్భుతమైన రెవెన్యూ...
G. K. Chesterton is hailed as a master of paradox, and an excellent essayist. ఆయన 'modest' అనే పదాన్ని ఎంతలా degrade చేశారో తన ఆవేదనని ఇలా వ్యక్తం చేశారు.
"The modest Japanese modest prime minister modestly used his modest towel, when he was around modest people".
పొగడటం సినీ జీవులకి వెన్న తో పెట్టిన విద్య. అందులోనూ ఈ మధ్య టోకీ గారు సినిమా అవకాశాలు లేక భట్రాజ విద్యలో మాస్టరీ చేసినట్టున్నారు.
పైది 'క' భాష లాగా 'అద్భుతమైన' భాష.
మీరు పెట్టిన మారు పేరు టోకీ బదులు 'తోకి' ఐతే ఇంకొంచెం బాగుండేదేమో.
ఓ! ఎక్స్ప్రెషన్ గురించి చెప్పాలా... అమ్మ బాబోయ్! ఆ ప్రోగ్రాములు చిన్న పిల్లలు కూడా చూసి తరిస్తున్నారు ఈ మధ్య. డాన్సింగ్ చానళ్ళు.
ఈటీవీ సీరియళ్ళకి 'విలియమ్స్ సిస్టర్స్' మందు దొరికింది కానీ ఈ హింసని తప్పించలేము.Child sentiment. "ఆ పిల్లలు ఎంత ముచ్చటగా 'పాడు'తున్నారో అని.
నేను చాలా అదృష్టవంతురాలిని.అవేవీ ఈ కళ్ళతో చూడట్లేదు.నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడిన ఒకేఒక్క విషయం టీవీ సీరియల్స్ చూడక్కర్లద్దని.ఇక్కడ కూడా పార్టీల్లో అదీ ఆ సీరియల్స్ గురించి,డాన్స్,పాటల పోటీల చర్చలే.ఇది కాదుగానీ అదేదో పనిలేని హీరోహిన్ల డాన్సు కాంపిటీషనటగా.దాని గుఇంచి ఎగ చెపుతారు.నిజం గా అంత బాగుంటుందా అది?మేము మొదట్లో మా-టీవీ పెట్టించుకున్నాము.అందులో కూడా సీరియల్సు మొదలు పెట్టాడని తీయించేసాను.ఇప్పుడు ప్రాణం చాల్లా హాయిగా వుంది.
అయితే నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట!!!
సుజాత గారు:
నేను రాద్దామనుకున్న విషయాన్ని మీరు తెరకెక్కించేసారు. కాబట్టి ఓ కామెంటేస్తున్నా.
మకు జీటీవి వస్తుంది. స.రె.గ.మ.ప చూస్తామ్ ఎంతో ఇష్టంగా. పోష్టులో మీరు పెట్టిన ఫోటో ఈ మధ్యనే అవుట్ అయిన ముంబయి పోరగానిది.
ఆదివారంపూట ఓ ప్రోగ్రాం: పేరు - Ekse badhkar ek. పోయినేడాది లిటిల్ ఛాంప్స్ స.రె.గ.మ.ప లో పాల్గొన్న పిల్లలు, వాళ్లకి పెయిర్ గా రకరకాల సీరియళ్లలో నటించే పిల్లలు. ఈ కార్యకరమం చూస్తే - తల్లితండ్రులు పిల్లల మీద ఇంత ఒత్తిడిని దేనికి పెడుతున్నారా అని జాలేసింది, చిరాకేసింది, కోపమొచ్చింది. దీంట్లో ఒక పిల్ల - నాగిన్ అనే సీరియల్లో నాగిన్ - జుడ్జ్ అన్నూ కపూర్ ఈ పిల్ల డాన్సేసిన ఓ ఇటం పాట ని జడ్జ్ చేస్తూ "అమ్మాయ్!! బాగా వేసావ్!! అదిరింది!! ఐతే నీ వయసుకి అంత expressionఅవసరం లేదు" అని.
చిన్నప్పుడే అంత "గుర్తింపు" కోసంపాకులాట దేనికి? నాకు అర్ధం కాలా.
ఇక్కడ నేను గమనించిన విషయం : స.రె.గ.మ.ప లాంటి రియాలిటీ షోస్ కావొచ్చు ఏదైనా కావొచ్చు, పాల్గొనేవాళ్లు బాలలు కావొచ్చు పెద్దోళ్లు కావొచ్చు - గెలిస్తే గంతులెయ్యటం ఓడిపోతే అక్కడికక్కడే కిందపడి దొర్లి ఏడవటం.
నాకు గుర్తుండి, నేను ఏనాడు ఇట్టాంటోటికోసం ఏడవలా. నా చిన్నప్పటినుంచీ. మరిప్పుడు ఎందుకిలా? మనం మన మానసిక పఠుత్వాన్ని కోల్పోతున్నామా? పట్టణవాసం కారణమా? చదువులు ఓ కారణమా? ఉమ్మడి కుటుంబాలు లేకపోవటామా? పిల్లలు తమభావాలని "వెంట్" చేసుకోలేక పోవటామా? లేక మన, వాటిని తొక్కేసి - Do as I say - పోకడా?
నేను పెద్దగా టి వి చూడను, ఇండియా లో నైనా , అమెరికా లో అయినా.. సో బాగా అదృష్టవంతుడినే.. అప్పుడప్పుడూ జనాలు చెబితే విని అసలు ఈ ప్రోగ్రాంస్ ఏంటి అని నెట్ లో ఆట ప్రోగ్రాం కొన్ని బిట్స్ చూసా.. పరమ చెత్తగా నూ అసహ్యం గాను వూంటె మళ్ళి ఎప్పుడూ వాటి జోలికి వెళ్లలేదు.
"సెమీ ఫైనల్స్ కి చేరిన వాళ్ల ఇంటికి చానెళ్ళ వాళ్ళు కెమెరాలు పట్టుకుని వాళ్ల ఆవకాయ జాడీలు, సింకులో అంట్లూ,బాత్ రూములో బకెట్లు, ఇంటి ముందు ముగ్గూ.." ఆ సీన్లని ఫన్నీగా కళ్లముందు నిలిపారు. ఎక్సెలెంట్ పోస్ట్. ఇలాంటి సంగీతోద్ధరణ ప్రోగ్రాముల పట్ల ఎంత కడుపు మండితే అంత వ్యంగ్యం పలికించగలిగారో! nice one.
గీతాచార్య,
మీ కామెంట్ అద్భుతంగా ఉంది!
రాధిక,
అభినందనలు! అదృష్టవంతులు!
శ్రీలేఖ,
అవునండి, చెప్పుకోం గానీ మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైన వ్యాఖ్యలు చూసారుగా! ఒక్కరు బయటికి వస్తే అందరూ తోడవుతారు.
భాస్కర్ గారు,
మీరూ రాద్దామనుకున్నారా! అబ్రకదబ్ర కూడానంట. అంటే ఎంతమంది కసి తో రగిలిపోతున్నారో కదా! మొదటి అడుగు నేను వేసానన్నమాట.
పరిస్థితిని డ్రమటైజ్ చెయ్యడానికి ఈ ఏడుపులూ, పెడబొబ్బలూ!
దీనికి మీరు చెప్పినవన్నీ కారణాలే! ముఖ్యంగా చివరిది.."Do as I say ! అంతే కాదు, తల్లి దండ్రులు చిన్నప్పుడు ఏదో చేసేద్దామనుకుని, అవి కార్య రూపం దాల్చక, ఇలా పిల్లల ద్వారా తీర్చుకుంటారు అనే వాదన కూడా వినపడుతోంది ఈ మధ్య!కొంతవరకు అదీ నిజమే! తల్లి దండ్రులూ వత్తిడి అంతా ఇంతా కాదు. నా చుట్టు పక్కలే ఉన్నారు ఇలాంటి పేరెంట్స్ !పిల్లలు టీవీలో కనపడితే చాలు!
నిరంజన్ గారు,
మంచిపని!ఇలాంటివి చూడకపోవడమే మంచిది.
శ్రీధర్ గారు,
రియాలిటీ పేరుతో పాడేవాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడ్డం ఏమిటో నాకర్థం కాదు.నిజంగా వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి(వాళ్ళు ఏ గోదావరి మధ్య లంకలో ఉన్నా సరే) మరీ చిత్రీకరించడం అవసరమా అనిపిస్తుంది. రాను రాను జీవితాల్లో సహజత్వం తొలగిపోతోందనిపిస్తోంది.
sujatha Garu, maa office lo aithe prati roju lunch hour lo yekanga veeti meeda charcha... veedi ki vote veyyali .. vaadiki vote veyyali ani. Indulo maa M.D arguments simha bhagaanni akramistai... Naake mo ascharyamestundundi, vellanta inta serious ga ilanti programs choostara ani? yedi yemaina meeru cheppindi matram nooti ki nooru paallu nijam :)
Thankyou ma'am for dropping in to my post.(regarding Harika's act)
Post a Comment