November 20, 2008

వృద్ధుల్ని మట్టుపెడదాం, రండి!

మొన్నామధ్య నవ్య వీక్లీ(ఆంధ్రజ్యోతి ప్రచురణ) దీపావళి సంచిక లో ఒక కథ చదివాను. చదివాక ఏం చెయ్యాలో తెలీలేదు.(పుస్తకం పక్కన పడెయ్యాలి అనకండి, విషయం అది కాదు)ఆ కథ పేరు "కిల్లింగ్ మెర్సీ"!
 మానవత్వానికి మచ్చ తెచ్చే ఆ కథని ఎలా యాక్సెప్ట్ చెయ్యాలో అర్థం కాక, పత్రిక ఎడిటరు గారికి ఒక ఉత్తరం రాసి పడేసాను.

"ఆర్యా, ఈ కథ ప్రచురించడం వల్ల మీరు పాఠకులకు ఏం చెప్పదల్చుకున్నారో పత్రికా ముఖంగా
తెలియజేయగలరు" అని! ఆ కథని మీకు ఇక్కడ  పరిచయం చేయబోతున్నా!


సుమధుర(పేరు చూడండి, ఎంత అందంగా ఉందో), మెర్సీ చిన్నప్పటినుంచీ స్నేహితురాళ్ళు. సుమధుర ఇంటిపక్కనే ఉండే మెర్సీ సుమధుర ఇంటి తోటలో పూసే గులాబీలంటే ఎంతో మోజు పడేది. పెద్దయ్యాక మెర్సీకి పెళ్ళై, భర్తతో ఊటీ వెళ్ళిపోయింది. మెర్సీ అత్త దయామయి కి మొగుడి ద్వారా సంక్రమించిన బోలెడు
ఆస్థి ఉంది. కొడుకూ కోడలు దగ్గరే ఉంది.

మెర్సీ, సుమధురా ఇద్దరూ రిటర్మెంట్ వయసు వాళ్లయ్యారు. సుమధుర వాళ్ళ నాన్నగారు స్థాపించిన అనాథ శరణాలయాలు నిర్వహిస్తూ ఉంది. ఆ శరణాలయాల పనుల మీద ఊటీ వెళ్ళి, మెర్సీని కలిసింది. మెర్సీ అత్తకి
అప్పటికి 89 ఏళ్ళు వచ్చాయి. ఆవిడ పనులతో విసిగిపోతున్నానని, ఎక్కడికీ వెళ్లడానికి కూడా పడటం లేదని మెర్సీ సుమధురతో వాపోయింది.పైగా ఆ ముసలావిడ ఆస్థి అంతా తన వద్దే ఉంచుకుని "ఇదిఓ అదిగో " అని కాలం
గడిపేస్తోంది తప్ప ఎంతకీ ఆస్థి కొడుక్కి ఇవ్వడం లేదు.  తొంభై దగ్గర పడ్డా జిహ్వ చాపల్యం చావలేదు.

మెర్సీ  విసుక్కుంటుందే కానీ ముసలావిడకు ఇష్టమని మాంసం కూరలూ అవీ చేసి పెడుతూనే ఉంటుంది. కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. కాకపోతే తనకు బ్రేక్ అనేదే లేకుండా పోయిందని స్నేహితురాలి దగ్గర తన గోడు వెళ్ళబోసుకుంటుంది.మెర్సీ భర్త కెన్నీ తన తల్లి తొభయ్యో పుట్టిన రోజు మరుసటి రోజే కాబట్టి, తమతో కూడా ఉండి పార్టీలో పాల్గొనాలని సుమధురని కోరాడు.

ఆ మరుసటి రోజు ఉదయం మెర్సీ తోటలో కూచున్న సుమధురకి మెర్సీ తన గులాబీలను
చూపిస్తూ "ఏమిటో సుమధురా, మీ తోటలో పూసినట్టు పూయవు నా గులాబీలు!రేకలు సమానంగా ఉండవు" అంటుంది.


రాత్రికి దయామయి పుట్టినరోజు పార్టీ జరుగుతుంది.మెర్సీ కేకు తయారు చేస్తుంది. ముసలావిడ "ఇక చాల్లే" అని కొడుకు ఆపే వరకూ కేకు తింటుంది.

పార్టీ అయ్యాక కూడా "కేకుందా, అయిపోయిందా" అనడుగుతుంది.

ఆరోజు రాత్రే నిద్రలో దయామయి ప్రాణం విడుస్తుంది. అందరూ 'తొంభయ్యో పుట్టిన్రోజు కోసమే ఆగింది ముసలావిడ ప్రాణం" అని చెప్పుకుంటారు.సుమధుర ఊరెళ్ళిపోతుంది.

కొద్ది రోజుల తర్వాత మెర్సీ సుమధురకి 5 లక్షలకు చెక్కు పంపుతూ "అత్తమ్మకి బతికున్నన్నాళ్ళూ సేవ చేయగలిగాను. కంఫర్టబుల్ గా ఉంచగలిగాను, ఆవిడ ఆస్థిలో కొంత నీ అనాధ శరణాలయం కోసం
పంపుతున్నాను"అని ఉత్తరం రాస్తుంది.

అపుడు ఊటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా విప్పని తన ట్రావెల్ బాగ్ తెరుస్తుంది సుమధుర. అందులో ఒక పురుగుల మందు సీసా ఉంటుంది. పార్టీ రోజు రాత్రి అందరూ నిద్ర పోయాక, ముసలావిడ తిండిపిచ్చిని అడ్డం పెట్టుకుని సుమధుర ఒక కేకు ముక్క మీద పురుగుల మందు పోసి

"మీ కోసమే తెచ్చాను, తినండి" అని తినిపిస్తుంది. ఆవిడ తిని, తెల్లారే సరికి హరీ అంటుంది.

ఇదీ కథ!


ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలో, కనీసం ఏం ఆశించాలో(కథ చదివినందుకు మానసికానందమో, ఆవేదనో, ఆలోచనో ఏదో కలగాలి కదా) అర్థం కాలేదు నాకు. "కథని కథ లాగా చదవాలి '(సినిమాని సినిమాలాగా చూడమన్నట్టు)అనుకోవాలేమో మరి!

కథ సుమధురే నెరేటర్ గా 'నేను ' అని ప్రథమ పురుషలో సాగుతుంది.

తొంభై యేళ్ళ ముసలావిడ పట్ల సుమధుర భావాలెలా ఉంటాయో చూడండి.

ముసలావిడ ఏదో మాట్లాడుతూ ఉంటే "ఏమిటి మెర్సీ, ఆ "చెత్త వాగుడంతా" వింటూ
కూచోమన్నావా" అంటుంది కోపంగా!

మెర్సీ ఎంత చేసినా ముసల్ది తప్పులెంచుతూనే ఉండేదిట. కోడిగుడ్డుకి ఈకలు పీకే రకంట!

మెర్సీ వాళ్ళ అత్త మీద ఎక్సెస్ మెర్సీ చూపిస్తోందనిపించిందిట. అందుకే ఆ మెర్సీ ని కిల్ చేయాలని ముసలావిడకు పురుగుల మందు పట్టించిందిట.

పైగా చివరి వాక్యం చూడండి, "ఇప్పుడు మెర్సీ గార్డెన్ లో రోజెస్ తనిచ్చే ప్రేమతో చక్కగా వికసిస్తాయి" ట!

ముసలావిడ మీద అకారణ ద్వేషం పెంచుకుని పరలోక ప్రయాణం కట్టించిన
సుమధుర చేసే పనేంటో తెలుసా..అనాధ శరణాలయాలు నడపటం.  ఇంత "దయా హృదయురాలు" అలాంటి పనెలా చేస్తుందో మరి! వాళ్ల శరణాలయాల్లో కూడా ఎవరైనా తొంభై దగ్గర పడ్డ ముసలాళ్ళుంటే ఇలాగే గుటుక్కుమనిపిస్తుందో ఏమిటో!

కందకు లేని దురద కత్తి పీటకెందుకని....మెర్సీ కి లేని  కోరిక (ముసలావిడని చంపాలని ) ఈవిడకెందుకో! మెర్సీకి ఆవిడ మీద ద్వేషం ఏమీ లేదని ఆమె రాసిన ఉత్తరం చెప్తూనే ఉంది.

వయసు బాగా మీద పడ్డ వృద్ధులు ఏదో ఒక సొద చాదస్తంగా మాట్లాడుతూనే
ఉంటారు. వారిని అస్తమానూ కనిపెట్టుకుని ఉండటం కొంచెం కష్టమైన విషయమే!
 అందుకని "చంపేస్తే పోలా?" అనేసుకుంటే ఒక పనై పోతుందన్నమాట.

సినిమాల సంగతి నాకు తెలీదు కానీ సాహిత్య ప్రభావం సమాజం మీద ఎంతో కొంత ఉంటుందని నేను నమ్ముతాను. ఇలాంటి కథలు ఒక పదో పదకొండో వరసగా వచ్చాయంటే , ఎనభయ్యో, తొంభయ్యో దగ్గర పడ్డ వృద్ధులు ఇంట్లో ఉన్నవాళ్ళకో, లేదా ఏ ఓల్డేజ్ హోం లో అటెండెంట్స్ కో
"గుక్కెడు ప్రాణం ఎంతలో పోవాలి? చంపేస్తే ఎవరికి తెలుస్తుంది. ఎలాగూ ముసల్దేగా" అనిపిస్తే...దాని పర్యవసానం ఏమిటి?
హోం లో చేర్పించాలనుకున్న వాళ్ళు కూడా "ఎందుకూ, ఖర్చు, పీక నొక్కితే
ఫినిష్" అనుకుంటే సరి!
"నిజంగా అలాంటి కర్కోటకులుంటారా ఏమిటి లెద్దూ" అనకండి. ఈ ఫొటో చూడండి..

తల్లిని భారంగా భావించిన పుత్రుడెవరో ఈవిడకు పున్నామ నరకం బతికుండగానే చూపించదలచి గోనె సంచిలోకట్టి ముళ్లపొదల్లో పారేశాడు.


ఇలాంటి సాహిత్య ధోరణులు ప్రబలితే, ఆ తర్వాత మనకి ఎక్కడన్నా రోడ్డు పక్కన ఇలాంటి సంచులు కనపడితే దాటుకుని వెళ్ళేంత ధైర్యం వస్తుంది.

24 comments:

visalakshi said...

బాగా చెప్పారు .అసలు 89ఏళ్ళ వృద్ధురాలికి అంత జిహ్వ చాపల్యం ఉంటుందా ఉన్నా మితంగా ఆహారం తీసుకుంటారు.ఐనా రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడు.సుమధుర& కో కూడా రిటైరు అయి వయసుపై బడిన వాళ్ళే కదా. వాళ్ళకీ వృద్ధాప్యంలో ఈ పరిస్థితే వస్తే! ఓల్డ్ ఏజ్ హోంస్ కి అందుకే వెళుతున్నారేమో వృద్ధాప్యంలో చాలామంది తల్లి దండ్రులు .

లక్ష్మి said...

ఆ కథ చదివి ఏ విధంగా స్పందించాలో తెలియని స్థబ్దతకి లోను అయ్యాను. నిజంగానే చదివే వాళ్ళకి తప్పుడు సంకేతాలని ప్రసారం చేసినట్టుగా ఉంది.

ప్రపుల్ల చంద్ర said...

నిజజీవితం లో శాడిస్టులు చేసే హత్యలా ఉంది ( ఎవరో హాస్పిటల్లో ముసలివాళ్ళని చంపాడని ఎక్కడో చదివాను ). చిన్నపిల్లలు కూడా చదివే వీక్లీలలో ప్రచురించడం వల్ల వారికి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది.

శ్రీనివాస్ పప్పు said...

మా మామ్మ అంటూండేది వయసు కులుకా బాతు కులుకా అని..వయసుతోపాటు చాదస్తం పెరగడం అన్నది ఒక ప్రక్రియ.. అయితే ఇలా చంపుకుంటే పోతే మానవత్వమా నీ అడ్రస్ ఎక్కడ అని వెతుక్కోవాలేమో?

మేధ said...

ఆ కధా కమామిషు ఏంటో ఏమీ అర్ధం కాలేదు.. అసలు అలాంటి కధ ప్రచురించడంలో వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి..?!

Anil Dasari said...

రాసినావిడ/యన ప్రతిభ అంత మాత్రమే అఘోరించింది సరే, పత్రికలో వేసినాయన బుద్ధేమైందో!?! అంతకన్నా గొప్ప కధలు దొరకట్లేదేమో.

నేనొకప్పుడు కధలు వదలకుండా చదివేవాడిని. పదేళ్లుగా వాటిజోలికెళ్లటం తగ్గించేశాను - మీరుదహరించిన కధల్లాంటివి చదివీ చదివీ ..

Anonymous said...

కాస్తో కూస్తో పేరున్న పత్రికలో ఇంతపిచ్చికధ ఎలా వేసారు
బహుసా రికమండేషన్ అయ్యుండచ్చు
ఏడిటర్ కి లెటర్ రాసి మీరు మంచిపని చేసారు

నవకవిత said...

నిజమెనండి,నేడు పత్రికలన్ని సమాజ సేవ మరచిపోయి. తమ పత్రికలకు పనికి మాలిన హెడ్డింగులను పెట్టి ప్రజలలో లేని ఆలోచనలు కూడా రేకెత్తిస్తున్నాయి.

సుజాత వేల్పూరి said...

అన్నట్టు కథా రచయిత(త్రి) పేరు లోనే భలే ఐరనీ ఉంది. రచయిత్రో, లేక రచయిత కలం పేరో మరి..పేరు మాత్రం "సుగుణ".

నవకవిత గారు,
ఈ టపాలో పనికి మాలిన హెడ్డింగ్ సంగతి ఏమీ లేదండి, ఒక పనికిమాలిన కథ గురించి ఈ టపా!అయినా సమాజ సేవ పత్రికల బాధ్యత కాదండీ!వాళ్ళు సమాజ సేవ చేస్తూ కూచుంటే ఐనట్టే!

teresa said...

దారుణం! ఇంతకంటే ఏమనాలో తెలీడంలా :(

Sujata M said...

Disguisting. However, the auther must have tried to write a classy type story. But because of the negative plot, she couldnt make it.

Arvind Adiga did just that in White Tiger. He wrote about a killer justifying his act, while describing the extremity of the horrible country life in India.

These are just examples of extremities of human thinking. This story may not be a righteous work of art. But this could become a selling art, if it had been written in a language other than Telugu.

I part-agree with you on your points of supporting elderly and showing human concerns to them. Otherwise, this could be a perfect story of a confused or conflicted personality.

సుజాత వేల్పూరి said...

సుజాత,
నిన్ననే white Tiger వాల్డన్ లో తెచ్చానండి, చదవాలి.

మాలతి said...

సుజాతా, ఇలాటికథలు చదవలేకే నేనూ పత్రికలలో కథలు చదవడం మానేశాను. (అంటే నావయసువల్ల కాదు.) ఈనాటి పత్రికలూ, రచయితలూ షాక్ వాల్యూ కోసమే కానీ ఏదో సందేశం వుందని కాదు. maybe Sujata has a point. but it baffles me.

సుజాత వేల్పూరి said...

sujata,
I tried to understand the story in that angle too! But after reading the story again and again, I couldn't help writing this post. Here, the nerrator expressed her anger,towards the old lady through out the story.If she wants to justify her act of killing,(in such un avoidable condition) she should have been so kind to her istead of being rude, and should have felt little guilty while poisoning her.

ముసలావిడది చెత్త వాగుడు
ఆవిడ ఆస్థి ఇంకా కొడుక్కి ఇవ్వలేదు
కోడల్ని పీడించుకు తింటోంది
ఒకటే తిండి పిచ్చి
ఆవిడకు తన(సుమధుర) ఆర్ఫనేజ్ కి డబ్బివ్వడానికి కూడా మనసు లేదు...

ఇలాంటి భావాలు నెరేటర్ మనసులో ఉన్నాయని కథ స్పష్టం గా చెపుతున్నపుడు మీరన్న కోణంలో అర్థం చేసుకోవడానికి వీలవలేదు. ఎందుకంటే ఈ టపా రాసే ముందు ఆ వైపు నుంచి కూడా చాలా ఆలోచించాను.

Sujata M said...

Ok sujata garu

May be.. you are right. Because I felt it is one-sided view, I wrote the above comment.

I agree to the shock-value-thing Malati garu was referring to. I hope I didnt hurt u.

సుజాత వేల్పూరి said...

sujata gaaru,
you did not hurt me at all! There is nothing to get hurt! I just wanted to tell you that I tried to think on the other side too!

I have that story with me. when we meet some time, you read it and then we will disuss again....ha ha !

Bhaskar said...

This story reminds me the role of Kamal Hasan played in "Erra Gulabi". Sumadhura is going to kill all those abandoned people whom she is managing in Orphanage, if they are useless and irritating her.

Please save them from Sumadhura and save people from this writer.

Thank for writing this post, the title suited well.

వేణూశ్రీకాంత్ said...

ఆ మాత్రం విచక్షణ లేని వ్యక్తిని ఎడిటర్ కుర్చీలో కూర్చోపెట్టిన వాళ్ళని అనాలండీ... అసలు వాళ్ళు కనీసం synopsis అన్నా చదువుతారో లేదో ప్రచురించే ముందు అని అనుమానం వస్తుంది.

సుజాత వేల్పూరి said...

వేణూ శ్రీకాంత్,
అలా ఒక్క మాటలో ఎడిటరు ని తిట్టలేం! అక్కడున్నది సాక్షాత్తూ శ్రీరమణ గారు. బహుశా ఈ కథను పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయన ఊహించి ఉండరు. నెగటివ్ సంకేతాలు పాఠకులకు అందే సూచనలున్నాయని అనుకుంటే ఆయన ప్రచురించే వారు కాదేమోలెండి!Or..the story would have been approved when some other incharge was there.

రాధిక said...

ఏమనాలో తెలీడంలా :(

గీతాచార్య said...

If art is 'a selective recreation of reality according to the artist's metaphysical value judgements', then what about the values, and judgements of that author?

I have seen some 4 or five such (not this negative) stories in reputed magazines.

గీతాచార్య said...

You could have avoided that picture. But it's appropriate to the post.

Raj said...

sujaatha gaaru,

inthaki meeru emi cheppaali anukunnaa ee tapa dwaara???

ilaanti oka rachana nenu chadivaanu. adhi tappu ala cheyyakudadhu ani cheppa dalachukunnaara?

aa writer oka vedhava ani cheppa dalachukunnaara?

leka meeru evaru ilanti panulu cheyyodhu ani maaku chepthunnaara??

సుజాత వేల్పూరి said...

Raj,
టపా మొత్తం చదివాక కూడా కూడా దీని ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానో అర్థం కాలేదా మీకు? క్లియర్ గానే ఉందే! ఎవరు ఎలా చెయ్యాలనేది ఎవరూ judge చేయలేరు. కానీ సమాజం ఇలా ఉండకపోతే బాగుండు అని కోరుకోవడం మన చేతుల్లో విషయం కదా! అలాగే ఈ కథ నాలో ఎంత జుగుప్సను నింపిందో తోటి బ్లాగర్లతో పంచుకోవాలనుకోవడమే ఈ టపా ఉద్దేశం.

Post a Comment