January 24, 2009

"లలిత" ప్రియ కమలం విరిసినది....!

హైదరాబాద్ మొత్తం సంగీత వర్షంలో తడిసి ముద్దయి పరవశించింది. సంగీత ప్రియులంతా ఒక్క చోట కూడి కురిపించిన వేల వేల చప్పట్ల మధ్య సంగీతం నాట్యం చేసింది.




ఆయన కనపడగానే "అసలే కనులలో నీవు, ఆ పై కన్నీరు, తీరా దయ జేయగ నీ రూపు తోచదయ్యయ్యో" అన్నట్లు, దుఃఖమో, సంతోషమో, ఉద్విగ్నమో తెలియని స్థితిలో నీటితో కళ్ళు నిండిపోయి చూపు మసకేసిపోయింది.



ఆయన స్వరాన్ని వింటూ మైమరచి శిలలైపోయిన శ్రోతలకు రాల్గరిగించే అమరగానంతో జీవం పోసి,వారిని కరిగించి ప్రాణాలు తీసుకుని మళ్ళీ అమృతం పోసి అమరత్వాన్ని ప్రసాదిస్తూ, సంగీత రసాంబుధిని వేయి చేతుల కార్తవీర్యార్జునుడిలా ఈదుతూ, శ్రోతలని తనతో పాటు తీసుకెళ్ళి, ఆ స్వర రాగ గంగా ప్రవాహంలో తిప్పి తిప్పి మంత్ర నగరి సరిహద్దులకు విసిరి కొట్టాడా సంగీత మాంత్రికుడు.





(జేసుదాస్ గారు మీడియా కూడా తన కచేరీని రికార్డ్ చేయకూడదని నిబంధన విధించడంతో ఫొటోలు తీయలేకపోయాను. ఇది చివర్లో కచేరీ ముగిసాక మొబైల్ లో తీసింది).



లలిత కళా తోరణం ఈ సాయంత్రం పరవశించి పులకించి పోయింది.అద్భుతమైన సాయంత్రపు ఆవిష్కరణకు వేదికై నిలిచింది. శ్రీ జేసుదాస్ శాస్త్రీయ సంగీత కచేరీ హైదరాబాదు సంగీత ప్రియుల దాహాన్ని కొంత వరకు తీర్చింది.



సంగీత సరస్వతి సాక్షాత్కారం అంటే ఏమిటో అనుభవానికొచ్చింది. ఈ సంగీత సరస్వతి కా గురువాయూరప్ప దర్శనాన్ని తిరస్కరించింది? దురదృష్టం!అవును దురదృష్టమే....ఆ గురువాయూరప్పది! జేసుదాస్ పాటను వినలేకపోయాడు.



మధుర స్వరానికి మతం లేదు. సంగీతానికి కులం లేదు. జేసుదాస్ కచేరీ ముందు మాట్లాడిన రెండు మాటలు కూడా ఇవే! "మతాలన్నింటిలో దేవుడున్నాడు, కానీ దేవుడికి మతం లేదు. అందర్నీ ప్రేమించండి" ఇవే ఆయన మాట్లాడిన మాటలు.!



సరసాంగి రాగంలో వర్ణం తో మొదలు పెట్టి "హరివరాసనం" అన్న అయ్యప్ప పాటతో ముగిసిన స్వర రాగ గంగా ప్రవాహం రెండు గంటలు సాగింది. అతిథుల కోరికపై చిత్ చోర్ చిత్రంలోని "జబ్ దీప్ జలే ఆనా" కూడా పాడి వినిపించారు. ఆయన రామప్రియ రాగానికి, పంతువరాళి రాగానికి స్వరస్థానాల్లోని తేడాలు ఒక కీర్తన పాడుతూ వివరిస్తుండగా దగ్గర్లోని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక రైలు రెండు సార్లు రెండు శ్రుతుల్లో కూత పెట్టింది. వెంటనే జేసుదాస్ ఆ స్థాయిల్లోని తేడాలను రామప్రియ రాగం స్వరస్థానాలకు అన్వయించి చెప్పి రక్తి గట్టించారు.



చివరగా...శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి ఈ కచేరీలో నిజమైంది. సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.

35 comments:

Surabhi said...

You are so Lucky to be there. I envy you.
Incident of your daughter reminds me of my Son when he was 3 there were mixed collection of songs in my car and when he listened to one of yesudas song he asked me to replay and for many days that was the only song playing in my car. The song is
Kahaan Se Aae Badaraa
Ghulataa Jaae Kajaraa
Kahaan Se Aae Badaraa
Ghulataa Jaae Kajaraa

నేస్తం said...

"మతాలన్నింటిలో దేవుడున్నాడు, కానీ దేవుడికి మతం లేదు. అందర్నీ ప్రేమించండి" ఎంత గొప్పగా చెప్పారు.. ఆయన హరివరాసనం పాట వినకుండా యే స్వామి కొండకెల్లరేమో అంటే అతిశయోక్తి కాదు ..

నిషిగంధ said...

ఎంతటి మంచి అవకాశం! జేసుదాస్ అంటే మంద్రంగా వినిపించే ఆర్ధ్రత! ఆయన స్వరామృతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించిన మీరు ఎంతో అదృష్టవంతులు..

Uyyaala said...

జేసుదాస్ స్వర మాధుర్యం మీ అక్షరాలలో కూడా ప్రతిధ్వనిస్తోంది.
అదే సమయం లో ప్రెస్ క్లబ్ లో చిలుకూరి దేవపుత్ర నవల పంచమం ఆవిష్కరణ సభ జరిగింది.
వోల్గా గారు మాట్లాడుతూ ఇవాళ హైదరాబాద్ లో రెండు గొప్ప కార్యక్రమాలు జరుగు తున్నాయి అంటూ జేసుదాస్ సంగీత కచేరి గురించి ప్రస్తావించారు కూడా .
మీ పోస్ట్ చదివిన తరువాత ఎంత అరుదైన అవకాశాన్ని మిస్ అయ్యామే అనిపించింది.

సుజాత వేల్పూరి said...

సురభి గారు,
ఆ పాట నాకూ చాలా ఇష్టం. నిజానికి జేసు దాస్ పాడిన హిందీ పాటలన్నీ ఆణిముత్యాలు. మా కార్లో కూడా HMV వారి అన్ మోల్ రతన్ కలెక్షన్ మొత్తం ఉంటుంది. దూర ప్రయాణాలప్పుడు ఆయన పాటలు తోడుంటే ఎంత దూరమైనా తెలియదు.

నేస్తం...అవునండి, ఆ పాట వింటే ఆ అయ్యప్పే కొండ దిగి రావాలి.

నిషి,
అవును, అదృష్టమే! ముందు రవీంద్ర భారతిలో పెట్టారు ఈ కార్యక్రమం.అప్పుడు టికెట్స్ దొరకలేదు. టికెట్స్ కొనేవాళ్ళు వేలల్లో వస్తూ ఉండటంతో వేదిక మార్చారు. దానితో (అప్పుడు కూడా కష్టం మీద)టికెట్స్ సంపాదించగలిగాను.

ప్రభాకర్ గారు,
కొన్ని సార్లు ఇటువంటి మిస్సింగ్ లు తప్పవేమో కదా! మళ్ళీ ఎప్పటికో కదా ఆయన వచ్చి ఇక్కడ పాడబోయేది!

Kathi Mahesh Kumar said...

ప్రతిసంవత్సరం ఈ స్వరరాగ గంగా ప్రవాహం హైదరాబాద్ ని తడపాల్సిందే! అది జేసుదాసు నిష్టకు హైదరాబాద్-సికింద్రాబాద్ అదృష్టానికీ చిహ్నం. ఒకసారి ఈ గంగలో నేనూ మునిగితేలాను.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

మీ టపా చదువుతుంటే నేను కచేరీ లో ఉన్నట్టు గానే అనిపించింది. జేసుదాసు గారి గాత్ర మాధుర్యం మాత్రం మిస్. కోకిలమ్మలో సరితలా... పాట వినకపోయినా ఆనందించాను. ధన్యవాదాలు.

సుజాత వేల్పూరి said...

ఇదివరలో సిరివెన్నెల కృష్ణ మోహన్ గారు రాసిన ఒక టపాకి 'స్వర రాగ గంగా ప్రవాహమే" అని పేరు పెట్టిన సంగతి ఇప్పుడే వారి బ్లాగులో కామెంటుతూ చూశాను. అందుకే నా టపా శీర్షిక మారుస్తున్నాను.

హర్షోల్లాసం said...

మీకు సంగీతం లో కూడ ప్రావీణ్యం ఉందా అండి బాబోయి మీరు సర్వ సాచిలాగా వున్నారే :) నిన్న మా చెల్లేలు కూడ వెళ్ళిందిట, ఇంతకి రామప్రియ లో ఏ కీర్తన పాడారు?

శ్రీనివాస్ పప్పు said...

సంగీత సరస్వతి సాక్షాత్కారం అంటే ఏమిటో అనుభవానికొచ్చింది. ఈ సంగీత సరస్వతి కా గురువాయూరప్ప దర్శనాన్ని తిరస్కరించింది? దురదృష్టం!అవును దురదృష్టమే....ఆ గురువాయూరప్పది! జేసుదాస్ పాటను వినలేకపోయాడు.



మధుర స్వరానికి మతం లేదు. సంగీతానికి కులం లేదు. జేసుదాస్ కచేరీ ముందు మాట్లాడిన రెండు మాటలు కూడా ఇవే! "మతాలన్నింటిలో దేవుడున్నాడు, కానీ దేవుడికి మతం లేదు. అందర్నీ ప్రేమించండి" ఇవే ఆయన మాట్లాడిన మాటలు.!




చివరగా...శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి ఈ కచేరీలో నిజమైంది. సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.

సుజాత గారూ,

మీ వ్యాఖ్యానం ద్వారా మా జన్మ ధన్యం చేశారు.మమ్మల్ని జేసుదాస్ స్వరలాహిరి లో ఓలలాడించారు...సంతోషం...

సుజాత వేల్పూరి said...

హర్షోల్లాసం గారు,
పరిచయమే కానీ ప్రావీణ్యం లేదండీ నాకు! రామప్రియ రాగంలో జేసుదాస్ "కోరిన వరమొసగుమయ్య కోదండపాణి" పాడారు.

శ్రీనివాస్ గారు,
ధన్యవాదాలు! రెండుగంటలెలా కరిగిపోయాయో తెలీనే లేదంటే నమ్మండి.

పిచ్చోడు said...

సుజాత గారూ, ఎంత అదృష్టవంతులండీ మీరు!! ఆ మహానుభావుడి కచేరి వినే అదృష్టం జీవితంలో ఒక సారైనా వస్తుందో రాదో మాకు. మీ టపా ద్వారా ఆ కోరిక మరింత పెంచారు

Rajendra Devarapalli said...

మరొక్కసారి హైదరాబాద్ వాసులు తన్మయులయ్యారన్నమాట!
వారి గానామృతధారల్లో పరోక్షంగా వేలసార్లు,ప్రత్యక్షంగా రెండుసార్లు తడిచిముద్దయ్యే సుకృతం దొరికినవారిలో నేనూ ఒకడిని.చాలాకాలంపాటు మా యింటిలో కంప్యూటరు ఆన్ చెయ్యగానే నేను మొదటగా విన్న పాట,వారు పాడిన ‘ఆజ్ సె పెహలే ఆజ్ సె జాదా’చిత్ చోర్ లోది.జేసుదాస్ గారు" అతిథుల కోరికపై చిత్ చోర్ చిత్రంలోని "జబ్ దీప్ జలే ఆనా" కూడా పాడి వినిపించారు" అని అన్నారు.కానీ గతంలో అలా జరిగేదికాదు
కచేరి గురించి ఒప్పందం చేసుకునేటప్పుడే..శాస్త్రీయసంగీత కచేరీలో సినిమా పాటలు పాడనని,సినీ,లలితసంగీతకచేరీలలో శాస్త్రీయసంగీతాలాపన్ చెయ్యనని విస్పష్టంగా చెప్పేవారు.కొన్ని మినహాయింపులతో అనుకోండి.
సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.సరసాంగి వర్ణం గురించి ఎవరన్నా వివిరించి పుణ్యం కట్టుకుంటారా ప్లీజ్!సంకీర్తన కు సంగీతానికి ఉన్న బంధమేఅదికదా సుజాతగారు :)
ఇటీవల నవతరంగంలో ఒకవ్యాసానికి నేను రాసిన కామెంటు నుంచి కొంతభాగం మరలా ఇక్కడ,"1940,జనవరి10 న పుట్టిన జేసుదాస్ బాల్యం నుంచే సంగీతాభ్యాసం చేసిన సంగతి మనకు తెలిసిందే.కాకపోతే వారి నాన్నగారి పేరు అగస్టీన్ జోసెఫ్ భాగవతార్ అని కానీ ఆయన మళయాళశాస్త్రీయసంగీతకళాకారుడనీ,ప్రముఖరంగస్థలనటుడనీ చాలామందికి తెలియదు"
జేసుదాస్ గారి అధికారిక వెబ్ సైట్ http://www.yesudas.com/

సుజాత వేల్పూరి said...

రాజేంద్ర కుమార్ గారు,
విపులమైన వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదాలు. నాకిది మూడోసారి ఆయన కచేరీ లో శ్రోతగా ఉండే అదృష్టం దక్కించుకోవడం! పరోక్షంగా అయితే రోజూ ఆయన్ను పూజిస్తాం మా ఇంట్లో! అంత అభిమానం!జేసుదాస్ గారు "కచేరీ సంప్రదాయం ప్రకారం వర్ణంతో ప్రారంభిస్తున్నాను" అని చెప్పి సరసాంగి రాగంలో (ఆదితాళం) 'సరసాంగి నీ పై మరులు గొన్నది" అనే వర్ణం పాడారు. మా సంకీర్తనకు సంగీతం తో అటువంటి అనుబంధం ఉండాలనే నా ఆకాంక్ష కూడా. ఆమె ఏడుస్తుంటే నాకు సంతోషం కలిగింది. ఆపై మీ ఆశీర్వాదం!

సరసాంగి వర్ణం నేనూ ఇదే మొదటి సారి వినడం! అందువల్ల పండితులెవరైనా వివరిస్తే మీతో పాటు నేనూ ఆనందిస్తాను!జేసుదాస్ గారి గురించి మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు!

గీతాచార్య said...

అయ్యో! ఎంత ఛాన్స్ మిస్ అయ్యాము. మొత్తానికీ మీరు చూశారన్నమాట. సారీ. విన్నారు కదా.

సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు మీ బ్లాగ్ కి.

గీతాచార్య.

Unknown said...

ఏసుదాసుగారి కచేరి అయ్యి, దారిలో 'take away' dinner తీసుకుని, ఇంటి కి చేరి, తినడం పూర్తి చేసేసరికి 11.30 అయ్యింది. నేను office email చూసుకుందామని laptop on చేసుకుని కూర్చున్నాను. ఇంతలో లొపల్నుండి ఏలకులో, మిరియాలో పొడి చెస్తున్నట్లు 'టకా టకా ' అని చప్పుడు రావటం మొదలైంది. ఏమిటా అని లోపలికి వెళ్ళి చూస్తే, నా శ్రీమతి; computer మీద గబ గబా ఏమో type చెస్తోంది. 'ఏంట్రా?!' అంటే, "ఇప్పుదు మనం చూసి వచ్చిన ఏసుదాసు గారి program గురించి; urgent గా నా blog లొ పెట్టకపోతే నాకు నిద్ర పట్టదు అంది". తన వుత్సాహం, సంతోషం చూసి ఏమి అనలెక ఏదో వుడతా భక్తి (సహాయం) గా, మేము తేసిన ఒకె ఒక్క photo ని కొంచెం edit చేసి, చూడబుల్ (టింగ్లిష్) గా చెసి తను 'టకటకాయించడం' పూర్తయ్యేలోగా అందించాను.

నా శ్రీమతి తొందరలో program లోని కొన్ని విశేషాలు ప్రస్తావించడం మరచిపోయినట్లుంది:
- మా అమ్మాయి 'సంకీర్తన ', program మొదటి గంట లోనె 2,3 సార్లు కన్నీరు మున్నీరయ్యింది; 'నాన్నగారూ, ఆయన పాట వింటుంటే ఎందుకో, చాల ఏడుపు వచ్చేస్తోందీ అంటూ :-)
- ఏసుదాసు గారిని 'దాసేట్టణ్, అంటే 'పెద్దన్న ' అని అంటారట ఆయన సన్నిహితులూ, అభిమానులు
- ఏసుదాసు గారికి చిన్ననాట అన్నిరకాలుగాను ఎంతో సహాయ పడిన ఆయన స్నేహితుడు 'మత్తై' అనే వారట, 'నీ గొంతు సంగీతానికి పనికిరాకపొతే, ఈ ప్రపంచం లో ఎ గొంతూ సంగీతానికి పనికిరాదు అని. ఆయన నిజంగా మహనుభావుడు
- సుశీలగారు మాట్లాడుతూ, సంగీతం అంటె ఏసుదాసుగారి గొంతులోంచే రావాలి అన్నారు
....ఇంకా చాలా వున్నయండి అక్కడ విషయం, వెశేషాలూను.

ఇంతకీ నేను ఇంత పెద్ద comment పెట్టటానికి చాలా ముఖ్యమైన కారణం వుంది. ఏసుదాసుగారి program అని తెలిసినప్పట్నుండి, మెముండే కొండాపుర్ నుండి, రవీంద్ర భారతికి రెండు సార్లు (office ఎగ్గొట్టి మరీ) వెళ్ళి (imagine driving 20+ kms in a car during those peak hours of 10-11 am), అక్కడి జనాల్ని మంచి చేసుకొని (క్షమించండి), అసలు ధర కన్నా కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టి tickets సంపాయించుకొస్తే, నా శ్రీమతి గారు ఆ credit కూడా తనే తీసేసుకుంది [see her response to Nishiగారు "దానితో (అప్పుడు కూడా కష్టం మీద)టికెట్స్ సంపాదించగలిగాను"]...ఇది న్యాయమా అని బ్లాగ్ ముఖంగా ప్రశ్నిస్తున్నా?

ఈపాటికి నేనెవరో ...నా గోలేంటొ మీకు అర్థమయ్యే వుంటుంది ... నమస్తే

Rajendra Devarapalli said...

ఇంతకన్నా వివరంగా అధికారికంగా ఎవరు చెప్పగలరని ప్రశ్నిస్తున్నాశ్రీనివాస్ గారు :) :)

సుజాత వేల్పూరి said...

వాసు,
నేను నిద్ర పోయాక నువ్వు పని చేసుకుంటున్నావనుకున్నాను. ఇందా నువ్వు చేస్తున్న పని? మీరు సంపాదిస్తే ఒకటీ నేను సంపాదిస్తే ఒకటీనా? అందుకే మనిద్దర్నీ ఒకటిగా చూపిద్దామని అలా రాశానంతే! ఏమైనా, అమ్మో, నీతో జాగ్రత్తగా ఉండాల్సిందే!

రాజేంద్ర కుమార్ గారు, ఇక నేనేం చెప్పను?

సుజాత వేల్పూరి said...
This comment has been removed by the author.
ఉమాశంకర్ said...

నేను జేసుదాస్ గారి సినిమా పాటలు చాలా విన్నాను. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తు ఉంటాయి.

శాస్త్రీయ సంగీతం నాకంతగా తెలీదు అంటే ఆ రాగాలూ, వర్ణాలూ లాంటివి. తెలుసుకోవాలనే ఓపిక లేకున్నా, అస్వాదించి ఆనందించే స్వార్ధం మాత్రం నా సొంతం. సంస్కృతశ్లోకం విని, ఒక్క అక్షరం అర్ధం కాకున్నా కూడా పులకించిపోతాను, అలానే ఈ సంగీతం కూడా...

"నగుమోమూ.. కనలేని .." అనగానే మనసెక్కడికో వెళ్ళిపోతుంది.. ఏ రాగమయితే నేమీ ..ఏ వర్ణమైతే నేమి..

Unknown said...

అమ్మో సుజాతగారు ఏసుదాస్ కచ్చేరి లో పాటలు వినగానే మీ వారి లోని అంతరాత్మ ధైర్యం గా మీరు ఏ వూరు వెళ్ళకుండానే బయటకోచ్చేసి నిజాలు చెప్పించేసిన్డి.చూస్తుంటే నిషి గారికి తన కష్టం తెలియాలన్న తపన కూడా ఇంచుక గోచరించు చున్నది గమనించ ప్రార్దన ,నే ఇంక నే వెళ్లి వచ్చెద నారాయణ , నారాయణ .

Bhãskar Rãmarãju said...

సుజాత గారు:
>>చివరగా...శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్న నానుడి ఈ కచేరీలో నిజమైంది. సరసాంగి వర్ణం ఆయన పాడుతుండగా ఆశ్చర్యంగా వింటున్న నా అయిదున్నరేళ్ల కూతురు వెక్కి వెక్కి ఏడవటం మొదలు పెట్టింది.నాకు ఎందుకో అర్థం కాక బుజ్జగించి అడిగితే "ఆ పాట వింటుంటే ఊరికే ఏడుపు వస్తోంది. ఏదోగా ఉంది,ఏమిటో తెలియడం లేదు" అని చెప్పింది.
సంగీతానికి అంతటి శక్తి ఉందా? అని అడిగేవాళ్లకి ఇదో ఉదాహరణ. మావాడికి సంగీతం, కనీసం ఆ మార్గంలోకి నెట్టాలి అని నా కోరిక. మరి వాడు ఇంకా పిల్లోడేగా, అందుకే నేనుజేరాను, తబలా బడిలో. పిల్లపుట్టక ముందుదాకా బాగానే సాగినా ఇప్పుడే తబలా అటకెక్కేసింది. మీ టపా చదివాక మళ్లీ దింపి, సుత్తిపెట్టి శృతి చేసి దాద్ర మళ్లీ మొదలుపెడదాం అనుకుంటున్నా (ధా ధి న ధ తి న)

నిషిగంధ said...

:))) శ్రీనివాస్ గారు.. నాకైతే 'సంపాదించగలిగాము ' అనే కనిపించిందండి..

మొన్న కామెంట్ రాస్తూ మీ పాప పేరు గుర్తు రాక తెగ కొట్టుకున్నా.. సంగీతానికే సంబంధించినది అని గుర్తుంది కానీ అదేంటో తట్టలేదు.. ఇక మర్చిపోను :-)

GIREESH K. said...

ఏకాంతంలో జేసుదాసు పాటల్ని మించిన కంపెనీ ఇంకోటిలేదు. అదృష్టవంతులు మీరు, ఇంతమంచి అవకాశాన్ని పొందినందుకు!

సుజాత వేల్పూరి said...

రవి గారు...నారద వేషమా....:)!

నిషి, హమ్మ, థాంక్యూ!

భాస్కర్ గారు,
నేనూ ఇందుకే మళ్ళీ కీ బోర్డులో చేరాను. లాభం లేదు, మీరు ఇండియా వచ్చినపుడు మనం కచేరీ ఇవ్వాల్సిందే, బ్లాగర్లందర్నీ పిలవాల్సిందే!

గిరీష్ గారు,
మీరన్నది 100 శాతం నిజం! ఏకాంతం..జేసుదాస్ మంచి కాంబినేషన్!

శ్రీనివాస్ పప్పు said...

వామ్మో బ్లాగర్లందందర్నీ పిలవాలా?అదీ మీ సంగీత కచేరీకి?ఏంటి తల్లీ ఇంత కోపం మా మీద.కొంచం దయ చూపించండి.హా హతవిధీ విధి వక్రించడమంటే ఇదేనేమో?..

Bhãskar Rãmarãju said...

పప్పు యార్: చిన్న సవరణ. బ్లాగరులందర్నీ కాదు, కేవలమ్, నిన్ను మాత్రమే పిల్చి, తలుపులకు తాళాలు వేయించి, తీన్తాళ్ తో కుమ్మేయడమే :):)

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు,
వద్దు,ఆయన్ని పిలవొద్దు ! మన సంగీతం వినాలంటే(పప్పు గారు, నిజంగానే)ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి.పప్పు గారికి ఆ అదృష్టం లేదని బాధపడేలా చేద్దాం!

పైగా మా కచేరీ ఫ్రీ కాదు, పరిగెత్తుకుంటూ రాడానికి! టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. పల్నాడా మజాకా?

శ్రీనివాస్ పప్పు said...

అదేదో సినిమాలో శ్రీలక్ష్మి చెప్పినట్లు ఒక పక్కన బాలమురళీకృష్ణ,మరోపక్కన భీంసేన్ జోషినో ఇంకెవర్నో పెట్టి కచ్చేరి అంటుంది అలాగుంది ఇప్పుడు పరిస్థితి..పైగా పల్నాడట కూడానూ.పల్నడా?పలాయనమా?వా..సంకట్ కాల్ మే బాహర్ జానా...

సుజాత వేల్పూరి said...

పప్పుగారు,
ముందు మీకసలు టికెట్ దొరకనివ్వండి! :)అయినా మా హాలుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండవు. వచ్చారంటే మొత్తం పూర్తయ్యేదాకా ఉండాల్సిందే!

Anil Dasari said...

కాలేజి రోజుల్లో మద్రాస్ మ్యూజిక్ అకాడెమీలో ఏవో పురస్కారాల సందర్భంగా జేసుదాస్ కచేరీ చూశాను. ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాత ఎస్పీబీ. ఆయనా పన్లో పనిగా రెండు మూడు పాటలు (నేపధ్య సంగీతం లేకుండానే) పాడేశాడు. ఇద్దరు గంధర్వ గాయకుల ప్రతిభ ప్రత్యక్షంగా చూసిన ఒకే సందర్భమది. తర్వాత బాలు కార్యక్రమాలు మరిన్ని చూసినా, జేసుదాస్‌వి చూసే అవకాశం రాలేదు. మీ టపా ద్వారా నన్ను పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లి నాటి కార్యక్రమం గుర్తు చేశారు. ధన్యవాదాలు.

Vinay Chakravarthi.Gogineni said...

jesudas garu frequent ga chennai narada gana sabhalo kacheri chestaru........akkada attend ayyamante...inka chala old actors gani...manm choodavachhu.asalu enta mandi vastaro but..allari cheyaru.... chennailo kachereelu ekkuva.

sriram velamuri said...

సుజాత గారూ,ధన్యొస్మి,అద్భుతం గా రాశారు.ఆయన అపర త్యాగరాజస్వామి.2001 లో మా ప్రకాశం జిల్లా లో కాకర్ల అనే చిన్న కుగ్రామం లో ఆయన కచేరి ఏర్పాటు చేశారు.ఆ ఊరు త్యాగయ్య గారి జన్మస్తలం అని ఒక నమ్మకం.శ్రోతల సంఖ్య 100 కి మించలేదు.కానీ ఆయనలోఅదే తన్మయత్వం,ఏకధాటిగా 3 గంటలు పాడారాయన.త్యాగరాజస్వామి పై గల భక్తి....thanku for speking on GREAT MAN

సుజాత వేల్పూరి said...

Sriram garu,
sorry for the late response! Thanks very much for the kind comment.

Manasa Chamarthi said...

సుజాత గారూ :

మీ మనసంతా అక్షరాల్లో పెట్టి ఎంత బాగా రాశారు. ఆయన ప్రోగ్రాం ఒక్కటి కూడా వినలేకపోయామే అన్న మా బాధను మరిపించేలా, మా కళ్ళు మీవిగా చేసుకుని ఆ సంగీత సామ్రాట్ గురించి ఆపేక్షగా మీరు రాసిన విథానం బాగా నచ్చింది.

How much I wish you write more often..

- Manasa

Post a Comment