March 2, 2009

డబ్బు వల్లో చిక్కిన జీవితం!


మనలో చాలా మంది చిన్నప్పటి నుంచీ చూస్తున్న LIC వారి వ్యాపారప్రకటన ఒకటుంది. ఒకమ్మాయి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. పెళ్ళి ముగియగానీ టాపు లేని కార్లో వధూ వరులిద్దరూ అలా వెళ్ళిపోగానే వధువు తల్లి,(వితంతువు)మన వైపు తిరిగి ముసుగు సవరించుకుంటూ ఇలా అంటుంది.

"ఈ పెళ్ళి ఈ రోజు ఇంత బాగా జరిగిందంటే శర్మ (ఆమె పక్కనే టేబుల్ ఫొటోలో నవ్వుతూ ఉంటాడీయన) గారి ముందు చూపు వల్లే! ఆయన తీసుకున్న పాలసీ వల్లే పెళ్ళి ఖర్చులనీ గడిచాయి" ఇలాంటివే ఏవో మాటలు చెప్తుంది.

మా అమ్మ ఈ యాడ్ చూసి "ఛ, వెధవ సంత తీసెయ్యి, అన్నీ అపశకునం మాటలు" అనేది. మా నాన్న గారైతే "అదర్రా సంగతి! పాపం శర్మ గారు బతికుంటే ఆ పిల్లకు పెళ్ళి చేయలేకపోయేవాడే! చావటం వల్ల, మాత్రం డబ్బు సంపాదించి పిల్ల పెళ్ళి చేసాడు" అనేవారు.

మన చుట్టూ ఉన్న ఈనాటి ఆర్థిక వ్యవస్థను , మనుషుల్ని, మనుషుల్లో
జీవితం పట్ల వచ్చిన మార్పుని, ఒక పక్క సీరియస్ నెస్ ని, మరో పక్క అది లేకపోవడాన్ని గమనిస్తుంటే ఆలోచనలు చిక్కు ముళ్ళు పడ్డట్లు అయిపోతాయి.



జీవితంలో దేనికీ హామీ(గ్యారంటీ) లేదు.జీవితంతో సహా. ఇదే ఇన్సూరెన్స్ సంస్థల వ్యాపార సూత్రం. "నువ్వు పోతే ఏమి? నీ పెళ్ళాం పిల్లలకు డబ్బులొస్తాయిగా?" ఇంత డైరెక్ట్ గా కాదు గానీ ప్రతి ఏజెంటూ (సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనాలనుకుంటా ఇప్పుడు వీళ్లని కూడా) ఇదే మాట మాట్లాడతాడు. మనుషుల మనోభావాల(emotions)తో ఆడుకునే టీవీ ప్రకటనల తో వెంటనే పాలసీ కొనాలనేంత టెన్షన్ పుట్టిస్తారు.



ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వ్యాపార ప్రకటన చూడండి..!"నీ బంతి కనపడకపోతే పోనీలే, ఒకవేళ అసలు మీ నాన్నే కనపడకుండా పోతేనో" అని నాన్న స్నేహితుడు ఒక నాలుగేళ్ళ పిల్లాడితే అంటే వాడి
మనోభావాలెలా వుంటాయి?

అంతలో నాన్న వచ్చి "నాన్న కనపడకుండా

పోయినా, నాన్నే నీకు బంతి కొనిస్తాడులే(అతడు పోయిన తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుతో కొనే బంతి నాన్న కొన్నట్టేగా)" అంటాడు.ఆ ప్రకటన చూస్తుంటే గుండెలో ఒక రకమైన గాభరా బయలుదేరుతుంది ఎవరికైనా!



మరో కంపెనీ యాడ్ లో ఇర్ఫాన్ ఖాన్ వచ్చి "ఇవాళ పదివేలు సరిపోతాయి ఇంటిఖర్చులకి! రేపు లక్ష కూడా సరిపోదు, కాబట్టి పెన్షన్ ప్లాన్ ల కోసం వెంటనే వాళ్ళెవరికో ఫోన్ కలపమంటాడు. నాకైతే నిజంగానే ఈ వ్యాపార ప్రకటనలు చూస్తుంటే "అమ్మో, నిజంగా భవిష్యత్తు లో ఖర్చులు ఎలా?"అని గుండె దడ ప్రారంభమవుతుంది.

సరిగా ఇదే వాళ్ళకు కావలసింది.



ఇదివరలో ఎప్పుడో పాతరోజుల్లో LIC ఏజెంట్ల మీద బోల్డెన్ని జోకులు, కార్టూన్లు వచ్చేవి. యమ లోకానికెళ్ళినా ఈ ఏజెంట్లు వదలకుండా వెంట బడ్డట్టూ,పొద్దున్నే లేవగానే బాత్రూం దగ్గరే ఏజెంటు పాలసీ కొనమని గొంతు మీద కూచున్నట్టూ...ఇలా!



ఎపుడైతే జీవిత భీమా ప్రైవేట్ రంగంలోకొచ్చిందో ఇహ ఈ ఏజెంట్లు అధునాతన వేషాల్లో(ఎల్ ఐ సి వాళ్లలాగా సామాన్యమానవుల్లా ఉండరు వీళ్ళు. కంపెనీ ఓనర్ అతగాడే అన్న ఫీలింగ్ రావాలి మనకి) బయలుదేరి మన జీవితాల్ని కబ్జా చేశారు.ఐటీ బూమ్ వల్ల పెరిగిపోయిన జీతాలు,ఖరీదైన జీవన శైలి, కార్లు, డీలక్స్ ఫ్లాట్లు, డ్యూప్లెక్స్ ఇళ్ళు... వీటన్నిటిమధ్యా మనిషిని ఆవరించి ఉండే "ఆరా" లాగా ఒక అశాంతి! ఒక అపనమ్మకం! ఈ రెండే భీమా కంపెనీల పెట్టుబడి.



జీవితానికి, వృద్ధాప్యానికి, ఆరోగ్యానికి,కారుకీ, ఇంట్లో వస్తువులకి,
ఇంటికీ, ఇంటికోసం తీసుకున్న లోనుకీ కూడా ఇన్సూరెన్స్. పిల్లల భవిష్యత్తు భద్రత కోసం ఒక లక్ష ప్లాన్లు ఉన్నాయి. చాలా పాలసీల్లో ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు, యాక్సిడెంట్ అయితే ప్రత్యేక క్లెయిము సదుపాయాలు ఉన్నాయి.

ఈ మధ్య పేపర్లో చదివాను. కుదిరిన పెళ్ళి ఏవిధంగా నైనా భగ్నం అయితే దానిక్కూడా భీమా చెల్లిస్తారట!

జీవితం ఎప్పుడు ఠప్ మంటుందో తెలీని గాలి బుడగ అనే విషయం పరమసత్యం! ఎప్పుడూ అందరికీ తెలిసిందే! కానీ ఇదివరకు జీవితాల్లో ఇంత అసంతృప్తి, అభద్రత లేవు. నాకు తెలిసి మా నాన్నగారికి 50 వేలకు ఒక్క LIC పాలసీ తప్ప ఇంకే రకమైన ఇన్సూరెన్సూ ఉండేది కాదు. అయినా ఎప్పుడూ భవిష్యత్తు ఎలా అని బెంగ పెట్టుకోలేదు.(పెద్దగా ఆస్తులు కూడా ఏమీ లేవు మరి). ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల పెన్షన్ వస్తుందన్న హామీ మాత్రం ఉండేది.



ప్రభుత్వ ఉద్యోగాలు కరువు కావడం, ప్రైవేటు ఉద్యోగాల జీతాల మీద ఆశతో పొలోమంటూ అందరూ అటువేపు పరుగులెత్తడం తో ఒకప్పుడు ఎగువ మధ్యతరగతి కి కూడా విలాసాలుగా ఉండే కారు, ఏసీ వంటివి మధ్య తరగతి వారికి కూడా అవసరాలుగా మారాయి. ఇల్లు నుంచి ఇంట్లో వాడే విద్యుత్ గృహోపకరణాల వరకూ ప్రతిదీ వాయిదాల్లోనో, అప్పుమీదో దొరకడం తో జీవన శైలి మారిపోయింది. భవిష్యత్తులో ఇటువంటి జీవితమో, ఇంతకంటే మెరుగైన జీవితమో కావాలి తప్పించి, సాదా సీదాగా గడిచే జీవన శైలి ఎవరికీ అఖ్ఖర్లేదు.



వైద్య ఖర్చులకోసం భీమా అనేమాట ఒకప్పుడు చెపితే నమ్మేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది. మా ఎదురింటి అమ్మాయికి   సిజేరియన్ ఆపరేషన్ కి అయిన ఖర్చు అక్షరాలా అరవై ఏడు వేల రూపాయలు. ఆమె భర్త పని చేసే కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి అంత బిల్లు దండుకున్నారు కానీ, ఒక ప్రసవానికి 67 వేల రూపాయలు నమ్మ దగ్గ విషయమేనా?

ఇంతలా పెరిగిన వైద్యఖర్చుల కోసం కొంత సొమ్ము భీమా కట్టడానికి ప్రతి నెలా పక్కన పెట్టాల్సిందే! పెన్షన్ ప్లాన్ల కోసం కట్టాల్సిన వార్షిక ప్రీమియమ్ రెండులక్షలతో ప్రారంభం(పదేళ్ళ తర్వత నెలకు పదివేలు పెన్షన్ కావాలంటే) అవుతుందంటే ఎంత సంపాదించాలో చూడండి.


పిల్లల చదువుల ఖర్చు సరే సరి! వేలు దాటి లక్షల్లోకి ఎప్పుడో చేరింది. కాబట్టి వాళ్ళు పుడుతూనే ఇన్సూరెన్స్ పాలసీలు కొనేస్తున్నారు. పదో క్లాసు, ప్లస్ టూ,ఇంజనీరింగ్ ఇలా వివిధ వాయిదాల్లో డబ్బు చేతిలో ఉండడానికి వీలుగా పాలసీలు!



కొంతమంది చేతుల్లో అయితే ఇలా వివిధ అప్పు వాయిదాలు, ఇన్సూరెన్స్ ప్రీమియం లు కట్టి నెలాఖరుకి క్లాస్ ఫోర్ ఉద్యోగిలా చేతిలో పైసా లేని స్థితిలో ఉంటారు.ఎప్పుడో రాబోయే ఖర్చులకోసం పాటుపడుతూ ఇప్పుడు బికారుల్లా నిలబడేవాళ్ళు నాకు పదుల సఖ్యలో తెలుసు.


అందువల్ల కనీస మొత్తం అయినా చేతిలో నగదు అంటూ ఉండాల్సిందే! లేదంటే అతి త్వరగా నగదుగా మార్చుకోగలిగే బంగారమైనా సరే చేతిలో ఉండాలి!కొన్ని పాలసీలు ఇచ్చే ఆఫర్లు చూస్తుంటే "క్లెయిమ్ చేసినపుడు అసలు నిజంగా ఇంత డబ్బు ఇస్తారా లేక లొసుగులేమైనా పెడతారా" అని అనుమానం వస్తుంది.

ఆఖరి పోరాటం నవల్లో CBI అధికారి ప్రవల్లిక ఒక డైలాగ్ అంటుంది. "ఏదో గొప్ప ఉద్యోగం అనుకుంటారు కానీ ఒక్కోసారి ఈ ఉద్యోగం వదిలేసి ఏ పల్లెటూరికో పోయి నాలుగు కోళ్ళు, మేకలు పెంచుకోవడం నయమనిపిస్తుంది" అని!ఒక్కోసారి పల్లెల్లో, టౌన్లలో ఉన్నదానితో తృప్తిగా బతుకుతూ లోన్ల బరువు లేకుండా హాయిగా జీవించే వారిని చూస్తే అదే నిజమనిపిస్తుంది.

వెనకాల డబ్బేమీ లేకుండా, కేవలం ఉద్యోగాలను నమ్మి పెద్ద పెద్ద లోన్లు
తీసుకుని,పదేసి ఇన్సూరెన్స్ పాలసీలకు సిద్ధమైపోయి, ఖరీదైన జీవన శైలిని బలవంతంగా అలవర్చుకుని,దానికి అలవాటు పడి ప్రస్తుత ఆర్థిక మాంద్యం దెబ్బకు విల విలాడుతూ చేతిలో డబ్బు లేక,ఏమి చేయాలో తెలీక దిక్కుతోచక నిలబడ్డ వాళ్ళు ఎంతమందో!



అందుకే ప్రతి ఒక్కరూ వీలైనంతగా నగదు జాగ్రత్త పరుచుకోవాలండి!లేదంటే బంగారమైనా! నగలైనా, బిస్కెట్లైనా కూడా పర్లేదు. లాభమే కానీ నష్టం లేదు.అవసరమైనపుడు "అయ్యో అలాగా" అనే సానుభూతి కంటే నగదే ఉపయోగపడేది.

ఇంత సొద ఎందుకు రాశానటే మిత్రుడొకరు ఫోన్ చేసి తన పాలసీ వివరాలు పంపుతున్నాననీ,దయచేసి ప్రీమియమ్ నా కార్డు ద్వారా ఆన్ లైన్ కట్టేయమనీ, లేదంటే పాలసీ మురిగిపోతుందనీ అర్థించారు.చేతిలో డబ్బు లేదు.!అదీ సంగతి!



ఆ పని చేసి, ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఆలోచిస్తూ కూచుంటే మనసులో
మెదిలిన దాన్ని మాటల్లో పెట్టాను.

డబ్బే కాక, డబ్బు లేకపోవడం అనే విషయాన్ని అనుభవంలోకి తెస్తున్న ఆర్థిక వ్యవస్థకు, మాంద్యానికి జై!

23 comments:

ఉమాశంకర్ said...

కరెక్టు గా చెప్పారు. డబ్బు సంపాదించడమొక్కటే సరిపోదు ప్రస్తుత పరిస్థితుల్లో.. దాని తెలివిగా వివిధ రూపాల్లోకి మార్చుకోవాల్సిందే..ఒకప్పుడు మంచి ఉద్యోగమొస్తే జీవితాంతం భరోసా అన్నట్లుండేది.. ఇప్పుడలా కాదు..

భవిష్యత్ భయాన్ని భూతద్దంలో చూపి వర్తమానం లో డబ్బులు దండుకొనే బిజినెస్ ఈ ఇన్స్యురెన్స్.. నా తరువాత నావాళ్ళెలా? అనే భయమున్నంత కాలం దీనికి ఢోకా లేదు.. అయితే దీన్ని నేను తప్పు పట్టను..ఎటొచ్చీ మనం మన ఆదాయం దృష్టిలో ఉంచుకొని నేలవిడిచి సాము చేయకుంటే ఏ సమస్యా ఉండదు..

ఇక ఏజెంట్ల గురించి..అందరూ కాదు గాని చాలా వరకు ఏజెంట్లు ఫోన్లు చేసీ చేసీ చంపేస్తారు.. తెల్సిన నంబరు ఐతే ఫోనెత్తరని వేరే ఫోన్ల నుంచి ఫోన్ చేసి విసిగించారు నన్ను ఒక నెలపాటు. ఒక కుర్ర ఏజెంటయితే .. నాకు ఇంటరెస్టులేదు బాబూ అని చెపితే ఆయన "టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లెం? అని అడిగేసాడు నా బీపీ ఇంకా పెరిగిపోయేలా.ఒకఏజెంటు నాకు రోజుకి దాదాపు పది సార్లు ఫోన్ చేసేవాడు కానీ ఎంత చక్కగా మాట్లాడే వాడంటే "నో" చెప్పటానికి చాలా కష్టపడాల్సి వచ్చేది.ఏతావాతా నంబరిచ్చి నేను తప్పు చేసానని అనుకున్నానేగానీ వారినెప్పుడూ తప్పు పట్టలేదు..వారి ఉద్యొగం అదే కదా....

krishna rao jallipalli said...

GOOD POST. ఆదాయానికి మించిన ఖర్చులు ఆఖరకి అవి పొదుపు పదకాలలో పెట్టుబడి పెట్టడం అయినా సరే పెట్ట కూడదు. కచ్చితంగా జేబులో కొంత డబ్బులు ఉండేలా చూసుకోవాలి. (IMMEDIATE LIQUIDITY). LIC POLICIES లో కొంచంలో కొంచం MONEY BACK BETTER. ఇక ఏజెంట్స్ సంగతి అంటారా... వాళ్ళ PROFESSION వారిది. అవసరం, తప్పక కట్టగలను అనే నమ్మకముంటే తప్ప OLBIGATION కోసం POLICIES తీసుకోకూడదు. ఒక AGENT నన్ను తెగ ఇబ్బంది పెడుతుంటే.. బాబూ నేను POLICY తీసుకోవడం వలన నీకు ఎంత COMMISSION వస్తుందో అంత COMMISSION నేను నీకు ఇస్తాను కాని నన్ను వదిలెయ్యి అని చెప్పాల్సి వచ్చింది మరి.

జీడిపప్పు said...

Simply Superb Article
ఇప్పటికయినా మనవాళ్ళు కళ్ళు తెరిచి నిజ ప్రపంచంలో బ్రతుకుతారని ఆశిద్దాం.
అన్నట్టు దీనికొక పరాకాష్ట - ఆ మధ్య ఒకసారి నేను చూసిన ఒక Ad - plan for your funeral from now and save big bucks అని. నాకయితే దిమ్మ తిరిగింది. దానికొక వెబ్‌సైటు, కమ్యూనిటీ కూడా ఉంది! http://www.funerals.org/. తొందర్లో మనదేశంలో కూడా వస్తుందిలెండి... మనవాళ్ళు శవరాజకీయాల్లో నిష్ణాతులు కదా... ఐడియా ఇస్తే చాలు, అల్లుకుపోతారు.

ఆఫీసుకు వెళ్ళడానికి ఏ షర్టు వేసుకోవాలో వెళ్ళేముందు 5 నిమిషాలవరకు ఆలోచించను... అలాంటిది చచ్చిన తర్వాత గురించి ఆలోచించాలంట.. కెవ్‌వ్‌వ్‌వ్ కేక :)

కొత్త పాళీ said...

నిజమే.
మొదట్లో వాణిజ్య నౌకల మీద పెట్టిన పెట్టుబడికి ష్Yఉరిటీగా మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు మన సర్వావస్థల్నీ చుట్టేసుకుని సర్వాంతర్యామి ఐపోయింది.
వ్యాపారాలన్నిట్లోకీ అస్సలు అవసరం లేని వ్యాపారమిది. మీరింకా భయం గురించే మాట్లాడుతున్నారు. వైద్య బీమా వాంటి రంగాల్లో బీమా ఉండడం తప్పనిసరి.

Bhãskar Rãmarãju said...

మీరు ఒకవైపు దరువు మాత్రమే చెప్పారు. నేను మీకు మద్దెల దరువు గురించి చెప్తా వినండి:
కర్మకొద్ది అమెరికాకి వచ్చిపడితే, ఇక్కడ జీవిత బీమా అలా ఉంచి, కారుకి, ఆరోగ్యానికి బీమా కనీసపక్షం వెయ్యిడాలర్లు అవుతున్నది. ఇది ఓ వైపు మోత. ఇంకోవైపుది,బామ్మరిదో, తమ్ముడో అన్నో, బావో, స్నేహితుడో, నాన్న స్నేహితుడో ఓ యల్.ఐ.సి ఏజెంటు. నీకేమిరా ఓ పాలసీ తీస్కో అని ఓ కాయితంముక్క చేతిలో పెడతాడు. యన్.ఆర్.ఐ లకి ప్రత్యేకమైన ప్యాకేజీ, సంవత్సరానికి ఓ రెండులక్షలో ఎంతో కట్టు అంటాడు. అదీ సంగతి. దీన్నే మద్దెలదరువు అంటారు. సరే యల్.ఐ.సి అయితే ప్రభుత్వరంగ సంస్థ. మ్యాక్స్ న్యూయార్కు, యే.ఐ.జి లాంటివాటికి ఆ కనీస భరోసాకూడాలేదు.
ఇన్సూరెన్సు మంచిదే, ప్రతీవాడు చేస్కోవాల్సిందే. కానీ దీంట్లో మోసాలు కూడా చాలా ఉన్నాయి.

సరే కొసమెరుపు:-
మా సూరిగాడు పుట్టినప్పుడు మేము చెన్నపట్ణంలో ఉండేవాళ్లం. మాకు కార్పోరేట్ హెల్త్ ప్లాన్ ఉండేది (నెలకి జీతంలోంచి ఓ అయిదువేలు దానికి కట్టేస్తుంది కంపెని మన ప్రమేయంలేకుండా). కాన్పుకి వెళ్ళాం. అక్కడి క్లర్క్ బిల్లు ప్రిపేర్చేస్తుంటే చూసా, మామూలుగా, అతిసాధారణ కాన్పుకి అయ్యే ఖర్చు ఐదువేలు, ఏసీ రూము గట్రా అయితే తొమ్మిది వేలు. నా అప్ప్లికేషను మీద "హెల్త్ ఇన్సూరెన్సు" అని రాసి, బిల్లు ముప్పైతొమ్మిదివేలకి వేసారు. వాళ్లు వాళ్లు కుమ్మక్కు అవుతారు.
ఇదీ మోసం అంటె.

చివరగా - ఈమధ్య మనకి కూడా ఆరోగ్య బీమాలు ఎక్కువ అవుతున్నాయ్. ఇక ముందు ముందు ఆరోగ్య బీమా లేకపోతే ఆరోగ్యసమస్యలకి అయ్యే ఖర్చు భరించటం కష్టం అవుతుందేమో!!

Anil Dasari said...

సెంటిమెంటల్‌గా ఆలోచిస్తే ఏమిటిదంతా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే .. తప్పవు కదా ఇవన్నీ.

Rajendra Devarapalli said...

. మా ఎదురింటి అమ్మాయికి సిజేరియన్ ఆపరేషన్ కి అయిన ఖర్చు అక్షరాలా అరవై ఏడు వేల రూపాయలు. ఆమె భర్త పని చేసే కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కాబట్టి అంత బిల్లు దండుకున్నారు కానీ, ఒక ప్రసవానికి 67 వేల రూపాయలు నమ్మ దగ్గ విషయమేనా?..........గత ఫిబ్రవరి నెలాఖరులో విశాఖపట్నం ఎ.యం.జి వారి హాస్పిటల్లో పురుడుపోసుకున్న మా తెలిసినవారమ్మాయి కోడలుకు సదరి సిజేరియన్ కి అయిన ఖర్చు,అక్షరాలా రూ.36,000లు.ఇక దీన్నిబట్టి మీ హైదరాబాద్ లో అదేదో కార్పోరేటు ఆసుపత్రిలో ఆమాత్రం అవ్వకపోతేనే ఆశ్చర్యపోతాన్నేను :(

సుజాత వేల్పూరి said...

మీ అభిప్రాయాలు చూస్తుంటే ఇంకా గాభరాగా ఉంది నాకు.
జీడిపప్పు గారు, షర్టు సంగతి సరే, ఏది వేసుకున్న తేడా రాదు. మరి భవిష్యత్తు మాటేమిటి? నిజంగానే మీరు ఇన్సూరెన్స్ ని సీరియస్ గా తీసుకోరా?

కొత్తపాళీ గారు,

మీరంటే ఎప్పటినుంచో అమెరికాలో ఉన్నారు కాబట్టి వైద్య ఖర్చుల కోసం ఇన్సూరెన్స్ మీకు కొత్త విషయం కాదు. కానీ ఇక్కడ, మధ్య తరగతి ప్రజలకు ఇదో కొత్త కాన్సెప్టు. ఇప్పుడంటే కంపెనీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది కానీ రిటైర్ అయ్యాక వైధ్య ఖర్చులకు ఇన్సూరెన్స్ కొనుక్కోక తప్పదన్నమాట. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి అప్పుడే కొనాలి. అప్పటి రేట్లెలా ఉంటాయో మరి! ఆలోచిస్తుంటే నిజంగానే భయంగా ఉంది.

అబ్రకదబ్ర,
నిజమే! జీవితంలో మరీ ప్రాక్టికాలిటీ ఎక్కువై పోయి సెంటిమెంట్ అనేది లేకుండా పోతుందేమో అని కంగారుగా ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఇదంతా రాసినా నేనూ కడతాను ఏడాదికి ఆరేడు ప్రీమియాలు.

Anonymous said...

అన్ని రంగాల్లోనూ డబ్బు ఒక వెడ్జి లాగా మనిషిని సహజ సుఖాల నుండి దూరం చేస్తోంది.

అభివృద్ధి --> సామాజిక అసమానతలు, మానసిక వత్తిడులు + పర్యావరణ కాలుష్యం --> రోగాలు, కొత్త రోగాలు, మరిన్ని రోగాలు --> అధర్మాసుపత్రులు --> అనారోగ్యం మీద పెరిగిపోయే ఖర్చులు (వ్యాపారావకాశాలు) --> బీమా

ముందు అనారోగ్యాన్ని ఖాయపరచుకుంటున్నాం. ఆపైన బీమా కోసం వెంపర్లాడుతున్నాం.

వైద్యబీమా కాదు మనక్కావలసింది, ఆరోగ్య బీమా! ప్రభుత్వం చెయ్యాలాపని.

Anonymous said...

సాధారణ సహజ జీవన శైలికి దూరమవడం వల్ల మనిషి మనశ్శాంతికి కూడా దూరమవుతాడు. దీనితో భవిష్యత్తు పట్ల అభద్రత పెరిగి ప్రాక్టికల్ దృష్టితో తన పై ఆధార పడ్డ వారికోసం ఇన్సూరెన్స్ పాలసీల మీద ఆధార పడక తప్పదు. ఇటువంటి బలహీనతలను ఆసరాగా తీసుకుని భీమా కంపెనీలు బోలెడన్ని పథకాలను ప్రవేశపెట్టాయి.

నగదు నిల్వ చేసుకోవడం అన్న పాయింట్ తో ఏకీభవిస్తాను నేను. ఇది అందరికీ తప్పనిసరి.

Kathi Mahesh Kumar said...

ఇన్సూరెన్స్ పాలసీలను భద్రత స్థాయిని దాటి ఒక వ్యాపారంగా ఎప్పుడైతే అమెరికన్లు గుర్తించారో, అప్పట్నుంచీ మొదలయ్యాయి ఈ తిప్పలు. మనమూ గుడ్డిగా ఫాలో అయిపోయి ఈ చక్రంలో చిక్కుకుపోయాము. ఇక తప్పదు.

Bhãskar Rãmarãju said...

On March 1, 2009, the federal government agreed to provide an additional $30 billion to A.I.G. and loosen the terms of its huge loan to the insurer, even as the insurance giant reported a $61.7 billion loss, the biggest quarterly loss in history.

సుజాత వేల్పూరి said...

ఉమా శంకర్ గారు,
నేల విడిచి సాము చేయకూడదండి, అది మాత్రం నిజం! చేతిలో డబ్బు అత్యవసరం అయినపుడు పొదుపు పథకాల్లో డబ్బు ఇరుక్కుపోయి ఉంటే కష్టం కదా!

కృష్ణా రావు గారు,
ఆబ్లిగేషన్ కి పోయి పాలసీలు మాత్రం చచ్చినా తీసుకోకూడదండీ! మా ఏజెంట్ టార్గెట్ పూర్తి చేయడానికి నేనొక పాలసీ అలాగే తీసుకున్నాను.

భాస్కర్ గారు,
మీకు రెండు వేపులా తప్పదన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అంటే బిల్లు రెండింతలు వేయడం సర్వత్రా ఉన్నదే! మీరు చివర్లో చెప్పిన వార్త మొన్న CNBC లో చూశాను.


రాజేంద్ర గారు,
ఇంతింత డబ్బు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం జీతాల్లోంచి కట్ కావడమేమిటో, దాన్ని బట్టి అనవసరమైన టెస్టులు అవీ ఆస్పత్రుల వాళ్ళు చేయడమేమిటో, డబ్బు చెట్లకు కాసినట్టు వసూలు చేయడమేమిటో...అంతా అయోమయమే!

చదువరి గారు,
మీరు చెప్పిన సమీకరణంలోచి ఇక బయటికి వచ్చే అవకాశం లేనట్లే! ఇదొక vicious circle లా తయారైంది.


నీలాంచల, మహేష్ కుమార్ గార్లు,
మీతో ఏకీభవిస్తున్నాను.

శ్రీనివాస్ said...

అణా కి మానిక బియ్యం వచ్చినప్పుడు జీవించాం ఈనాడు ఆర్ధిక మాంద్యం లోను జీవిస్తున్నాం .. రేపేదైనా జీవిస్తాం ..

కాకా పొతే రెండు కూరలు బదులు పచ్చడి వేసుకుని అంటే తేడా :P

పసి వాడిని సంబంధం ఎకుండా మాటాడి ఉంటె మన్నించండి .. మనసులో పెట్టుకోకండి :D

సుజాత వేల్పూరి said...

శ్రీనివాస్,
పసివాడివైనా జీవిత సత్యం చెప్పావు(పసి వాడిని అన్నారు కదాని ఏకవచనంలోకి దిగాను)! అవును, ఏమైనా జీవించడం మానం కదా!

కొత్త పాళీ said...

రాసేమాట .. అందులోనూ క్లుప్తంగా రాయడానికి ప్రయత్నిస్తే, ఎలా అపార్ధాలకి దారి తీస్తుందో ..
ఇందాక రాసిన వ్యాఖ్యలో
"వైద్య బీమా వంటి రంగాల్లో బీమా ఉండడం తప్పనిసరి."
నా ఉద్దేశం అమెరికాలో బతికే వాళ్ళకి ఈ విషయంలో ఛాయిస్ లేదు. చచ్చినట్టు బీమా తీసుకుని తీరాల్సిందేనని. ఒకేళ బీమా లేకపోతే మనం దివాలా తీశామన్నమాటే.

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారు,
నేనేమైనా తప్పుగా రాశానా కొంపదీసి? మీరు చెప్పిందే నేనూ అన్నాను అనుకుంటున్నాను. అమెరికాలో బతికే వాళ్లకి మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోతే దివాలా తీసినట్లే అన్న సంగతి నాకు అనుభవంలోకి కూడా వచ్చింది.
అదే ఇక్కడ పరిస్థితి వేరు. మధ్య తరగతి వాళ్ళు జబ్బు చేసినపుడు ఆస్పత్రికి పరిగెత్తడం తప్పించి, భీమా అనేది ఉందని చాలా మందికి తెలీదు. తెలిసినా "అనారోగ్యం మనకి రాదు" అన్న ధీమా ఉంటుంది కాబట్టి భీమాకి కట్టే డబ్బు(టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా) వృధా అనుకుని దాని జోలికి పోరు. అదీ నేను చెప్పాలనుకున్నది.

Bhãskar Rãmarãju said...

సుజాత గారు:
>>తెలిసినా "అనారోగ్యం మనకి రాదు" అన్న ధీమా ఉంటుంది కాబట్టి భీమాకి కట్టే డబ్బు(టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా) వృధా అనుకుని దాని జోలికి పోరు.
మిమ్మల్ని తప్పుపడుతున్నా అనుకోకండి. భీమా కాదు, బీమా .

మధురవాణి said...

సుజాత గారూ..
భలే భలే టాపిక్స్ చర్చకు తీసుకొస్తారండీ మీరు ;)
చాలా అవసరమైన విషయాన్ని చర్చించారు. కానీ.. ఈ విషయాల్లో మీ అందరితో పోలిస్తే.. నేను ఇంకా LKG లోనే ఉన్నానపిస్తుంది. ఇప్పటిదాకా ఏ భీమాలు, పాలసీలు కట్టలేదు. అసలు వాటి గురించి కనీస అవగాహన కూడా లేదు.
చిట్స్ గురించే మా నాన్న నాలుగైదు సార్లు చెప్పినా ఇప్పటికీ సరిగ్గా అర్ధం కాలేదు.. ఎంత చురుకైన బుర్రో కదా ;)

ఇక్కడ జర్మనీ లో మాత్రం ఆరోగ్య భీమా లేకుండా ఎవరూ ఉండకూడదు. 100% mandatory. అది చూపిస్తేనే వీసా ఇస్తారు. డాక్టర్ కూడా అది ఉంటేనే మనల్ని చూస్తాడు.

మీ బ్లాగు మొదలయ్యి ఒక సంవత్సరం అయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు. నేను గానీ.. బ్లాగ్ అవార్డ్స్ లాంటివేమన్న పెడితే మొదటి బహుమతి మీకే.. ఊరికే మాటవరసకి చెప్తున్నాను అనుకునేరు. నిజ్జంగా నిజం.. ఒట్టు.. మీరెప్పుడు పోస్ట్ రాస్తారా అని చూస్తూ ఉంటాను నేను. అసలు నాలాంటి పిల్లకాయలకి (బ్లాగ్లోకంలో) మీ లాంటి వారే కదా స్ఫూర్తి :)
ఇంతగా నచ్చడానికి కారణం.. మీ టపాల్లో ప్రతిబింబించే మీ ఆలోచనా విధానం, మీ వ్యక్తిత్వమే కారణం.
ఏదో ఒక రోజు మిమ్మల్ని నేరుగా కలుస్తానండోయ్ ;)

సుజాత వేల్పూరి said...

భాస్కర్ గారు,
నిజమే! బీమా నే కరక్టు! పొరపాటున టైప్ చేసాను.

మధురవాణి,
ఏదో ఉన్న దానితో జీవితం గడిచిపోతుందనే భరోసా ఇవాల్టిరోజుల్లో లేదు. తప్పకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి, జాగ్రత్త పడాల్సిందే! పెళ్ళి కానంత వరకూ మనం అంతగా వీటిగురించి ఆలోచించం గానీ మనకంటూ ఒక స్వంత కుటుంబం ఏర్పడ్డాక ఇలాంటివి వద్దనా బోలెడు అయిడియాలు వచ్చేస్తాయి.

మీరు ఇండియా వచ్చాక తపాకుండా కలుద్దాం లెండి.

శ్రీనివాస్ పప్పు said...

ఇన్స్యూరెన్స్ గురించే నేను రాసిన ఈ కింద పోస్ట్ చదవండి కాసేపు...

http://pappusreenu.blogspot.com/2009/01/blog-post_22.html

Anonymous said...

ఒక్కోసారి పల్లెల్లో, టౌన్లలో ఉన్నదానితో తృప్తిగా బతుకుతూ లోన్ల బరువు లేకుండా హాయిగా జీవించే వారిని చూస్తే అదే నిజమనిపిస్తుంది.

ఇది ఒకప్పుడు నిజమేమో కాని ఇప్పుడు కాదండీ సుజాతగారూ పసువులకి ఇన్సూరెన్సె కడుతున్నాం. మీరు వస్తువులకి లోన్లు తీసుకుంటే మేము పంటలకి లోన్లు తీసుకుంటాం. ఇంకా మోపెడ్ లు సెల్ ఫోన్లు లాంటివి అవసరం లేనివరికి కూడా సులభ వాయిదాలమీద అంటూ తగిలించి పోతున్నారు . నకిలీ ఏజంట్ట్ల కి ఇన్సూరెన్స్ పోలసీలు కట్టిమోసపోయినవారు గ్రామాల్లో ఎందరో.
ఇక మీరు చెప్పిన ఆ పిల్లాడు_ బాలు ఏడ్ చూస్తే నాకు మనసులో కెలికినట్టవుతుందండి. సున్నితమైన మనో భావాలతో వ్యాపారం చేస్తున్నారు . మన ఇళ్ళల్లో సరదాకి కూడా చావు మాట ఎత్తనివ్వరు పెద్దవాళ్ళు . అపశకునం అని వారిస్తారు . వీళ్ళేమో రోజూ మన చావును మనకు గుర్తుచేస్తూ వుంటారు." కలికాలం "

Anonymous said...

మనసులో మాట
chaala,chaala baavundhi

Post a Comment