బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో రెండు పాత ఫర్నిచర్, మరియు ఇతర పాత వస్తువులు అమ్మే షాపులు
ఉంటాయి. ఎప్పటెప్పటివో వస్తువులు. ఆ షాపులు చూస్తే నాకు విచారంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి మనింట్లోని సరికొత్త సోఫాసెట్ కూడా అక్కడి పా....త పడక్కుర్చీ అంత విలువ చెయ్యదు.అక్కడ ఒక నగిషీలు చెక్కిన పాత చెక్క పార్టిషన్ అడిగితే(నేను కాదు లెండి) 35 వేలు చెప్పారు ధర. మొన్నీమధ్య మా కాలనీలో ఒక బిల్డింగ్ లో తాపీ పని చేస్తూ అయిదో అంతస్థు నుంచి కాలు జారి పడి ఒక పనివాడు మరణిస్తే 'తాగి ఉన్నాడని" రాయించి అతని భార్యకు 15 వేలు ఇచ్చి ఊరికి పంపించేసారు. ఒక జీవితం కంటే విలువైనదన్నమాట ఆ చెక్క వస్తువు.
నాకు మ్యూజియాలు చూడ్డం ఇష్టం ఉండదు.(వేరే ఊళ్లనుంచి స్నేహితులు వచ్చినపుడు సాలార్జంగ్ మ్యూజియం కి తీసుకెడతాను కానీ నేను రెబెక్కా దగ్గరే ఉండి మొత్తం మీరు తిరిగి రండని వాళ్లను పంపుతాను.) ఆనాటి చరిత్రను తెలిపే వస్తువులు(పుస్తకాలు, వగైరా) తప్పించి, వాళ్ళే గిన్నెల్లో వొండుకున్నారో, కంచాల్లో తిన్నారో, ఏ చెప్పులు వాడారో తెలుసుకోవాలని ఉండదు. అందరూ ఇలా ఉండాలని రూలేం లేదనుకోండి.
ఇలా పాత వస్తువులు వేలం వేసి వాటిని లక్షల్లో కోట్లలో వేలం పాడినపుడు ఇంత విలువుందా వాటికి, ఇంత పాత వాటికి అని ఆశ్చర్యమేస్తుంది. ఎవరు వాడినవైనా సరే! పాత పెయింటింగ్స్,పాత హుక్కాలు, ఎవడో రాజు యుద్ధంలో వాడాడో లేదో తెలీని కత్తులు (టిప్పు సుల్తాను కత్తి ఒక పెద్ద జోకు నాకు)వీటన్నిటినీ కోట్లు పెట్టి వేలం పాడటం ఏమిటి? వాటి విలువ ఎంత? అది మామూలు మనుషుల లెక్కలో ఏ విధంగా లెక్క గడతారు?(పురావస్తు శాఖ లెక్కలు వదిలెయ్యండి).
మనుషుల పట్ల ఉన్న సెంటిమెంట్ వాళ్ళు వాడిన వస్తువుల మీద ఉండదా ఏమిటి? అన్నాడు మా అన్నయ్యొకడు ఈ విషయం ఎత్తితే! మనుషుల మీద సెంటిమెంట్ ఉంటే ఆ మనుషులు బతికినంత కాలం ఎలా జీవించారో, వారి ఆదర్శాలేమిటో,సమాజం పట్ల వారి దృక్పథం ఏమిటో,వారి సుగుణాలేమిటో...అవి కదా మనం అనుసరించాల్సినవి. వాళ్ళ చెప్పులూ,గిన్నెలూ, కళ్ళజోళ్ళూ భద్రపరుచుకుంటే వాళ్ళను గౌరవించినట్లా? సెంటిమెంట్ నిలుపుకున్నట్లా?
ఇప్పుడూ...నేనున్నానండీ!మా మేనత్త అంటే నాకెంతో ఇష్టం. ఆవిడ సుమంగళిగా పోయినపుడు ఆవిడ పట్టుచీరలు నాక్కూడా ఇవ్వబోతే తీసుకోలేదు. అంతంత భారీ పట్టుచీరలు నేను కట్టుకోలేను, బీరువాలో పెట్టి పూజించలేను. అందుకే వద్దన్నాను.
ఆవిడ నా పెళ్ళప్పుడు నాకో మాట చెప్పింది.
"అమ్మలూ,అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు" ఆవిడ మీద ఉన్న సెంటిమెంట్ తో నేను ఈ సూత్రాన్ని పాటించట్లా? అదీ సెంటిమెంట్ అంటే!
గాంధీ మీద ప్రేమతో, ఆయన వస్తువులు విదేశీయులకు దక్కకూడదని మన ప్రభుత్వం బోలెడన్ని ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో చేసి, (ఎంత తీవ్రంగా అంటే వీళ్ళ ప్రయత్నాల వల్ల వాటి వేలం రేటు ఏకంగా మూడు లక్షల డాలర్ల వద్ద మొదలెట్టేంతగా)చివరకు విజయ్ మాల్యా గారు 9 కోట్ల 30 లక్షలు పెట్టి కొనడంతో ఊపిరి పీల్చుకుంది. అక్షరాలా తొమ్మిది కోట్ల ముప్ఫై లక్షలు! ఆ వస్తువులకు భౌతికంగా ఎంత విలువుందో నాకు తెలీదు.
కానీ గాంధీ మీద అంత ప్రేముంటే మనం దాచుకోవలసినవి చెప్పులూ, కళ్ళజోడూ కాదేమో అనిపిస్తోంది నాకు. ఆయన మనకోసం వదిలి వెళ్ళినవి చెప్పులూ, కంచమూనా ? అవి భౌతికంగా ఎవరైనా వదిలి వెళ్ళక తప్పదు. మన కోసం గాంధీ వదిలి వెళ్ళీన ఆదర్శాలు, అహింస, సత్య శీలం, నిరాడంబరత,వీటన్నిటికంటే "పదార్థ విలువ" తప్ప లేని తోలు చెప్పులు, ఇత్తడిగెన్నెకే విలువ ఎక్కువ.
9 కోట్ల 30 లక్షలతో విజయమాల్యా తల్చుకుంటే ఎన్ని పనులైనా చేసి ఉండొచ్చు. బెంగుళూరులోనే ఒక మురికివాడ ను అభివృద్ధి చేసి ఉండొచ్చు. ఆయనకు ఆ మొత్తం ఒక లెక్కలోనిది కాదు. టిప్పు సుల్తాను ఖడ్గానికే కోటీ అరవై లక్షలు పెట్టిన దేశ ప్రేమికుడు కదా!
బీరు బాటిల్స్ తయారు చేసే ఒక కంపెనీ పేరు దాని యజమాని పేరు దేశవ్యాప్తంగా,ఇంకా మాట్లాడితే ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల నోళ్ళలో పది రోజులు నానాలన్నా,ప్రైం టైం లో వార్తా ఛానెళ్లలో కనిపించి వినిపించాలన్నా (IPL టోర్నమెంటూ, మరియూ వేసవీ దగ్గర పడుతున్న కీలక సందర్భంలో) ఎంత డబ్బు ఖర్చవుతుందంటారు? పది కోట్ల కంటే ఎక్కువే అనుకుంటా!
ఏదేమైనా గాంధీ గారి వస్తువుల్ని తిరిగి దేశానికి తెస్తున్న "కింగ్ ఫిషర్" అధినేత శ్రీ విజయమాల్యా గారికీ జాతి రుణపడి ఉంటుంది.ఆ వస్తువుల్ని ఏ సబర్మతి ఆశ్రమంలోనో పెడితే, పిల్లలతో ఎప్పుడైనా వెళ్ళి(ఆ చుట్టుపక్కల వెకేషన్ పెట్టుకున్నపుడు) చూసి, "చూశారా, గాంధీ గారి గడియారమూ ,కళ్ళజోడూ, నమస్కారం చెయ్యండి" అని గౌరవం ప్రకటిద్దాం.(గాంధీ ఎవరో, జాతిపిత ఎందుకయ్యాడో మాత్రం చెప్పకుండా)
42 comments:
బాగా చెప్పారండి....నేనూ ఇలానే అనుకున్నాను...ఆ డబ్బేదో మురికి వాడను మార్చడానికి వుపయోగించ వచ్చుగా అని............మీ భావాలతో నేను ఏకీభవిస్తాను......
మద్యపానానికి వ్యతిరేకమైన గాంధీగారు...వారి వస్తువులను మద్యపానం తాయారు చేసే కంపెనీ వాళ్ళే కొనుక్కోవడం నిజం గా విడ్డూరం గా వుంది ....
మొన్న ఈ విషయం పేపర్ లో చదివి చాలా బాధగా అనిపించింది .. ఆ డబ్బులు పెడితే ఎన్ని కుటుంబాలు సంతోషం తో కళ కళ లాడుతాయో కదా అని..అసలు మన ప్రభుత్వం ఇంత యాగి చేయకుండా ఉంటే ఈ రోజు కొన్న ధర కంటే అతి తక్కువ ధరకు మనమే వీటిని సొంతం చేసుకునే వాళ్ళం .. ఏంటో అదేదో సినిమా గుర్తువస్తుంది నాకు .. అచ్చం ఇలాగే పాట పెంచి .. పరువు కోసం ముందు వెనుకలు ఆలోచించని విలన్ ను రెచ్చ గొట్టి అసలు ధరకంటే డబల్ ధరకు కొనేలా చూస్తాడు హీరో.. మనోళ్ళు ఇలాంటి సినిమాలు చూసైనా నేర్చు కోరు.. ప్లిచ్
చాలా ఆలోచనాత్మక టపా. మనుషులకన్నా, వారు మిగిల్చిన వస్తువులకన్నా వారి ఆలోచనలూ,ఆదర్శాలూ ఆచరించినప్పుడే వారికి తగిన గౌరవం.
విజయమాల్యా ఈ వస్తువుల్ని "సారా డబ్బు"తో కొనడం ఒక పెద్ద జోకు.
లోకో భిన్నరుచి... అని అన్నారు.ఒక్కొక్కరికి ఒక అభిరుచి ఉంటుంది.అది ఎందుకు అని అడిగితే కారణం చెప్పలేం.రకరకాల వస్తువులు సేకరించి భద్రపరచుకోవడం దానిగురించి ఎంత ఖర్చు అయినా వెనుకాడని వాళ్ళున్నారు.మురికివాడను ఉద్దరించే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఉద్దరిస్తున్నారు.ఏ డబ్బు ఏ అవసరానికో దానిని సంపాదించిన వారికి తెలియదంటారా? ఇకపోతే మద్యం తయారుచేసే కంపెనీకి గాంధీగారి మీద గౌరవం ఉండడం మంచిదే కదా! మీరన్నట్లు వేలం వెర్రి అన్నది మాత్రం నిజం.ఒకే తల్లికి పుట్టినవాళ్ళమైనా నేను స్పూన్ కొంటే మామూలుది కొన్నాను మా అక్క
మాత్రం 20రు స్పూన్ ఎంతో కళాత్మకంగా ఉన్నది కొంది. అపుడే అనుకున్నాను మడిసై పుట్టాక కూసింత కలాపోసన ఉండాల అని..........
Ambika Soni tried to hijack the credit. She commented, it was government's game plan to push Maallya to bidding. Congress party uses Gandhi ji in posters, but not thought of worth buying these articles for India.
We need to appreciate Vijay Maalya's noble act. Should not bring into mind meaning less thoughts like; liquor money, should have fed slums etc.
Mallya did what he thought right with his own money. We do not have right to raise a question about it. All those questioning may do things that they like with thier own money.
నీహారిక గారు,
డబ్బు సమపాదించిన ప్రతి వారికీ దాని విలువ తెలుస్తుందంటే అంగీకరించలేను. కోట్లు సంపాదించే తల్లి దండ్రులు లక్షల్లో పిల్లలకు పాకెట్ మనీ ఇస్తుంటే వాళ్లకు డబ్బు విలువ తెలిసినట్లేనంటారా?
నేనూ కొన్ని వస్తువుల కోసం, ముఖ్యంగా పాత పుస్తకాల కోసం అయితే ఎంతైనా ఖర్చు పెడతాను. ఒక్కోసారి అంత 'సరుకు ' లేని పుస్తకాల కోసం కూడా ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలున్నాయి.
కళ గొప్పదే! కానీ జీవితం కంటే కాదు!
విజయ మాల్యా ఆ వస్తువుల్ని సారా డబ్బులు కాక,ఎయిర్ లైన్స్ డబ్బుతోనే కొన్నాడనుకుందాం. అయినా అది గాంధీ మీద అభిమానమా లేక మరోటా అనేది గట్టిగా చెప్పలేం!
"Congress party uses Gandhi ji in posters, but not thought of worth buying these articles for India."
అందుకే ఈ టపా!
"We need to appreciate Vijay Maalya's noble act. Should not bring into mind meaning less thoughts like; liquor money, should have fed slums etc."
విజయ మాల్యాను అభినందించాల్సిందే! కానీ ఇది కేవలం దేశభక్తి తో చేసిన పని మాత్రమేనా? ఏమో?
అసలు టపా ముఖ్య ఉద్దేశం విజయమాల్యాను విమర్శించడం కాదు."కింగ్ ఫిషర్" ప్రచార వ్యూహం" అన్నది నాకొచ్చిన (నిజం కావడానికి ఆస్కారమున్న) సందేహం మాత్రమే!
1857 విప్లవ వీరుడు తాంతియా తోపేను బ్రిటిష్ వారు ఉరితీసినపుడు అక్కడున్న ఆంగ్లేయులంతా ఆయన dead body మీదపడి తలమీద ఉన్న వెంట్రుకలన్నీ పీకేసుకున్నారు, ఆ చారిత్రక పురుషుడి జ్ఞాపకంగా వాటిని దాచుకోవటమే వారి ఉద్దేశ్యం. అదోరకం వెఱ్ఱి. బ్రిటిష్‌వారి పరిపాలనాకాలంలో మనం ఎన్నో పాశ్చాత్య పోకడలను వంటబట్టించుకున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి.
మరే మన వేలితో మన కన్నే పొడవడం అంటే ఇదేనేమో.మన గాంధీ గారి సామాన్లు బాగా బలిసిన మనోడే తెల్లోడి దగ్గర్నించి డబ్బులిచ్చి కొనుక్కోడం భలే బాగుంది.అదే తెల్లోడి తెలివి.వాడి తెలివిని దెబ్బకొట్టడానికి మనోడు వాడి వ్యాపార చాణక్యాన్ని భలే వాడుకున్నాడు ఎంతయినా బీర్ కింగ్ ఫిషర్ కదా.
అది సరే కానీ మీ మేనత్త గారు చెప్పిన సలహా మాత్రం సూపర్ ఆచరించి నెగ్గుకొస్తున్న మీకు అభినందనలు...
చివర్లో మీరు చెప్పింది అక్షరాల నిజం. ఇక మాల్యా కొన్ని రోజుల పాటు మీడియాలో మారుమోగిపోతాడు. ప్రచారం ఆయనకు కొత్త కాకపోయిన ఇది ఇంకో రకమైనది
పప్పుగారు,
మేనత్త మేటరు జోకని మీకర్థం అయిందని నాకర్థం అయింది లెండి!
మరోసారి గాంధీ పేరుకి బ్రాందీ తోడైంది. అదొక అవినాభావ సంబంధం.
టపా బాగుంది. ఆలోచనాత్మకంగా ఉంది. అసలు గాంది గారి వస్తువులు ఆ తెల్లోడి దగ్గిరకి ఎలా చేరాయి?? ఎవరైనా తెలిస్తే చెప్పగలరు.
చక్కని విశ్లేషణ సుజాత గారు.
విజయ్ మల్యా పది కోట్లు పెట్టి కొన్నాడంటే వాటితో కనీసం పాతికకోట్ల బిజినిస్ చేస్తాడు. దానికి తోడు జాతిపిత పరిరక్షకుడు అని పబ్లిసిటీ కూడా.
ఈ సందర్భంగా ఒక అసందర్భ ప్రేలాపన: ఒకసారి వాషింగ్టన్ లో ఒక గ్యాలరీలో కొందరు ఒక పెయింటింగును గొప్పగా చూస్తున్నారు. మాకయితే ఎంత చూసినా ఏముందో అర్థం కాలేదు. దాని విలువ చెప్పేసరికి కళ్ళు తిరిగాయి. అందులో అక్కడక్కడా నల్లని మచ్చలు ఉన్నాయి, అది కూడా ఒక క్రమపద్దతిలో లేవు. దాన్ని బాగా పరిశీలించి నేను "దీన్ని మళ్ళీ సృష్టించడం చాలా సులభం. కాస్త ఆవు పేడను తీసుకొచ్చి ఫెడిల్మని తెల్ల బోర్డుకేసి కొట్టి వారం రోజుల తర్వాత చూస్తే సరిగ్గా ఇదే పెయింటింగ్ తయారవుతుంది, మిలియన్ డాలర్లకు అమ్మవచ్చు" అన్నాను.
ఈ "పాత/కళాత్మక వస్తువులు కొనడం" అన్నది పాశ్చాతులకు ఉన్న వెర్రిలో ఒకటి. కాబట్టి మనక్కూడా ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది తొందర్లో :)
ఆ వస్తువులు అమ్మినోడిని అభినందించాలి. ఆ వేలం డబ్బులో వచ్చిన డబ్బంతా ఇండియాలో ఉన్న పేదవాళ్ళకే వినియోగిస్తానని చెప్పాడు. ఇంకా కొన్ని గాంధీగారి వస్తువులు ఉన్నాయట, మన ప్రభుత్వం పేదలకోసం మరిన్ని మంచిపనులు చేస్తే అవి కూడా ఇచ్చేస్తాను అంటున్నాడు. http://timesofindia.indiatimes.com/India/Otis-offers-to-donate-more-Gandhi-items/articleshow/4238051.cms
చాలా బాగా రాశారు.
తెల్ల వాళ్ళ ను అనుకరించి తెచ్చిపెట్టుకున్న దరిద్రం ఇది. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టు, గాంధీ ని naked fakir అని తూలనాడిన తెల్ల వాళ్ళే, ఇప్పుడు ఆయన తాలూకు వస్తువులు వేలమేసి డబ్బులు దండుకోవటమేమిటి? వాటిని కరడుగట్టిని ఒక వ్యాపారవేత్త కొనడమేమిటి? చాలా అసహ్యంగా ఉంది.
గాంధీగారు బ్రతికున్నప్పుడు ఎవరో విదేశీయుడు/రాలు కి స్వయంగా బహుమతిచ్చిన వస్తువులివి. ఇది సుమారు వందేళ్లనాటి మాట. ఇన్నేళ్లూ అవి సలక్షణంగా దేశం బయటే ఉన్నాయి. కాలక్రమంలో చేతులు మారి న్యూ యార్క్ లో ఓ ఆక్షన్ హౌస్‌కి చేరాయి. మన్దేశంలో ఇప్పుడు ఎన్నికల సీజన్ కావటం, కేంద్రంలో గాంధీ తోక తగిలించుకున్న కుహనా గాంధీల ఏలుబడి నడుస్తుండటం .. ఇదీ ఈ వేలంలో కేంద్ర ప్రభుత్వ ఆసక్తికి అసలు కారణాలు. ఎన్నికలప్పుడు గాంధీ గారి మీద ప్రేమ కారిపోతున్నట్లు చూపించుకోటానికి వచ్చిన అవకాశాలొదులుకుంటారా మన రాజకీయులు?
అసలు, ఆ వేలంలో పాల్గొనటానికి విజయ్ మాల్యా తప్ప మరే వ్యాపారీ దొరకలేదా కేంద్రానికి? దేశంలో ఆయన్ని మించిన ధనికులే లేరా? ఈ 'ఉపకారానికి' గానూ బదులుగా రేపు గాంధీ బొమ్మనో, పేరునో తన ఉత్పత్తుల పరోక్ష ప్రచారానికి వాడుకునే అనుమతేమన్నా ఇచ్చారేమో.
నాకు మరో అనుమానం కూడా ఉంది. విజయ్ మాల్యాని మించిన ధనవంతులు, వేలం పిచ్చిగాళ్లు ప్రపంచంలో మరెవరూ లేరా? మడొన్నా వంటి వాళ్ల లోదుస్తుల కోసం ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన ఘనులున్నారు. చూస్తుంటే విజయ్ మాల్యా పెద్ద పోటీయే లేకుండా గెలిచేసినట్లున్నాడు. అసలీ వేలమే పెద్ద నాటకమా?
EdO aMtarjaatIya "kuTra" uMDEuMTuMdi ;)
నాకైతే వాటిని సంపాదించి మనదేశానికి తిరిగి తెప్పించటంలో తప్పేమీ కనపడటంలేదు. ఎంతైనా మన జాతిపిత వాడిన వస్తువులు కదా..అవి మన జాతి సొత్తు..
ఎటొచ్చీ అర్ధంకాని విషయమేమిటంటే ఏ అంబానీ నో, ప్రేంజీ నో, లేదా ఏ రతన్ టాటా నో కాకుండా మాల్యా సాబ్ రంగంలోకి రావటం. ఈ విషయం లో ఆయన "ట్రాక్ రికార్డు" బావుందనిపించినా ఆయన ప్రధాన వ్యాపారాన్ని దృష్టి లో పెట్టుకొని ఆలోచిస్తే కొద్దిగా బాధ కలగక మానదు..
ఒకవేళ వేలం జరిగి, వాటిని ఇంకెవరో తెల్లోడు కొన్నాడనుకోండి, ఇక అప్పుడు మన సెంటిమెంట్లు ఇంతకంటే తీవ్రంగా విజృంభిస్తాయనటంలో సందేహం లేదు.. ప్రస్తుతానికి నేను ఆసక్తి గా ఎదురుచూస్తున్న విషయమేమిటంటే మన మాల్యా రాజావారు వాటినేమి చేయదల్చుకున్నారని..
@abrakadabra .. this does not sound sensible. Why would he (Gandhi) give away his personal things like eye glasses, and sandals?
మంచి విశ్లేషణ. పోనీ లెండి వేలం లో అధిక ధరలతో సొంతం చేసుకునే చాలా పనికి మాలిన వస్తువుల కన్నా ఇవి మెరుగు అని స్తిమిత పడటమే...
భలే చెప్పారండీ. నిజమే! గాంధీ వాడిన చెప్పులు, నెహ్రూ కాల్చి పారేసిన సిగరెట్టు పీక... ఇలాంటివాటికి ఇచ్చే విలువ ఆ వస్తువుని వాడిన మనిషి చేసిన పనులకీ వాటిని తెలుసుకోవడానికీ చాలా మంది ఎందుకు ఇవ్వరో అర్థమవ్వదు.
ఈ పంక్తులు భలే నచ్చాయండీ నాకు:
"అమ్మలూ,అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు" ఆవిడ మీద ఉన్న సెంటిమెంట్ తో నేను ఈ సూత్రాన్ని పాటించట్లా? అదీ సెంటిమెంట్ అంటే!
మంచి టపా.. నవ్విస్తూనే ఆలోచింపచేశారు. మీకు పెద్దల యెడల ఉన్న గౌరవ మర్యాదలు అమోఘం :) (అది జోకని నాక్కూడా అర్ధమయింది.. అయినా కూడా నవ్వాను) అసలు వేలం అంటేనే 'పేరు పిచ్చి' ఉన్నవాడి పిచ్చి ని కాష్ చేసుకోవడం అనిపిస్తుంది నాకు..
Ulallalla leyo ...
100% కరక్ట్ అండీ. గాంధీ వాడిన వస్తువులూ, గాంధీ ఉత్తరాలూ కొనుక్కునే వారు ఉన్నారంటే ఆశ్చర్యకరం. మార్టిన్ లూథర్ కింగ్ - 3 గారిని చూసినా ఆశ్చర్యం కలిగింది. అయితే, మీడియాలో ఈ వస్తువులు ఎవరో 'విదేశీయులకు వెళిపోతాయనే తీవ్ర బాధ' ప్రచారం అయ్యేసరికీ మన మాల్యా గారు ఈ అవకాశాన్ని బాగా కేష్ చేసుకున్నారు. ఖర్చు పెట్టిన డబ్బు కన్నా ఎక్కువ విలువ గల ప్రచారాన్నే అందిపుచ్చుకున్నారు - అదీ ఎన్నికల సీసన్ లో !
"ఆ వస్తువుల్ని ఏ సబర్మతి ఆశ్రమంలోనో పెడితే, పిల్లలతో ఎప్పుడైనా వెళ్ళి(ఆ చుట్టుపక్కల వెకేషన్ పెట్టుకున్నపుడు) చూసి, "చూశారా, గాంధీ గారి గడియారమూ ,కళ్ళజోడూ, నమస్కారం చెయ్యండి" అని గౌరవం ప్రకటిద్దాం."
వ్యాసం మొత్తం ఒక ఎత్తు. ఇది మాత్రం ఒక ఎత్తు.
అయినా నాకో డౌట్... మన ప్రాచీన (సంవత్సరం దాటిందల్లా) సంపదని మనం దక్కించుకోవటం, (ఎవరు చేసినా ఎలాంటి డబ్బు అయినా... ఎందుకంటే డబ్బు మద్యం వాళ్ళ వచ్చినా ఆ డబ్బు మద్యం అమ్మలేదే. మనిషేగా అమ్మింది) మీద ఎందుకీ సెటైర్?
కాకపోతే "మనుషుల మీద సెంటిమెంట్ ఉంటే ఆ మనుషులు బతికినంత కాలం ఎలా జీవించారో, వారి ఆదర్శాలేమిటో,సమాజం పట్ల వారి దృక్పథం ఏమిటో,వారి సుగుణాలేమిటో...అవి కదా మనం అనుసరించాల్సినవి." ఇది మాత్రం బాగా చెప్పారు.
"అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు"
అక్షరలక్షలు చేసే మాటలు అవి.
మీ పచ్చడి బాంది. (మీ బ్లాగు మీద వచ్చిన సమీక్ష). బ్లాగు పెట్టి సంవత్సరం ఐన సందర్భంగా శుభాకాంక్షలు.
మీ జోకు బాంది కానీ, నేను న్డేది అలాగే. ఇంకా పెళ్లి కాలేదనుకోండి. అయినా నేను చేసేది అలాగే మరి. అయ్యాక.
"మనుషుల మీద సెంటిమెంట్ ఉంటే ఆ మనుషులు బతికినంత కాలం ఎలా జీవించారో, వారి ఆదర్శాలేమిటో,సమాజం పట్ల వారి దృక్పథం ఏమిటో,వారి సుగుణాలేమిటో...అవి కదా మనం అనుసరించాల్సినవి." ఆలోచించాల్సిన విషయమే...
"అత్తారింట్లో దేనికీ వాదనలు పెట్టుకోకూడదు. అన్నింటికీ చిర్నవ్వుతూ ఉండాలి. కానీ మనం అనుకున్నదే చెయ్యాలి. తర్వాత అవతలి వాళ్ళు ఎంత గింజుకున్నా మళ్ళీ చిర్నవ్వుతూ ఉండాలి. దీనికి తిరుగులేదు" దీనికి అబ్బాయిల side నుంచి anti pattern ఏంటబ్బా....?
మంచి టపా. ధన్యవాదాలు.
అనూరాధ , నేస్తం గార్లు, కొత్తపాళీ గారు చెప్పినట్లు గాంధీ కి బ్రాందీ కీ ఒక అవినాభావ సంబంధం. అది ఇక్కడ కూడా పని చేయడం విడ్డూరం.
చైతన్య, మహేష్,కృష్ణా రావు,మురళి,రవి,వేణు, సరస్వతీ కుమార్,సుజాత,సృజన గార్లు ..
ధన్యవాదాలు.!
కొత్తపాళీ గారు,
మరే, బాగా చెప్పారు!
అబ్రకదబ్ర,
ఓట్లు రాలడానికి అవకాశం ఉన్న ఏ చిన్ని అవకాశాన్నీ వదులుకోదు కదా కాంగ్రెస్ పార్టీ!(అన్ని పార్టీలదీ అదే దారైనా, జనం దృష్టి వెంటనే పడేట్టు చేయడం కాంగ్రెస్ వారి చమత్కారం) నేను ఇది ఎన్నికల స్టంటే అనుకుంటున్నా!
రాఘవ గారు,
ధన్యవాదాలు!మీకు ఆ పంక్త్లు నచ్చినందుకు ..! సరదాకి రాశాను గానీ ఎప్పుడూ చిర్నవ్వులు మనమే నవ్వుతుంటే కొన్నాళ్ళకి మనకంటే ముందు ఎగస్పార్టీ వాళ్ళు నవ్వడం మొదలు పెట్టేస్తారు.
ఉమా శంకర్ గారు,
జాతి పిత వాడితే? చెంబు, కంచం ఇవన్నీ ఎవరు వాడినా ఒకటేగా? కంచానికీ, చెంబుకే విలువ గానీ గాంధీ సిద్ధాంతాలనీ, ఆదర్శాలనీ ఏ గంగలో వదిలిందీ కాంగ్రెస్ పార్టీ? కానీ ఆయన పేరు మాత్రం లేకుండా బతకి బట్టగట్టలేరు!
"ట్రాక్ రికార్డ్" ప్రయోగం బాగుందండీ!మాల్యా గారు వాటిని తెచ్చి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారట.
జీడిపప్పు గారు,
మీ అసందర్భ ప్రలాపం బాగుంది. మోడరన్ ఆర్ట్ గాలరీలు ఎపుడైనా మూడ్ బాగా లేనపుడు చూడ్డానికి వెళితే కాసేపు నవ్వుకోవచ్చు.కొన్ని బొమ్మలు సరిగా పెట్టారా, తిరగేసి పెట్టారా కూడా కనుక్కోవడం కష్టమేనంటే నమ్మండి! పాత వస్తువులు కొనడం అనే హాబీ మన వాళ్ళకు అంటుకుంది. ఇక విజృంభించడమే తరువాయి.
మురళీకృష్ణగారు,
ధన్యవాదాలు!
అబ్బయిల వైపు నుంచి side pattern ఎవరూ ఎమీ చెప్పలేదు మరి. సరదాగా తీసేసుకున్నారు.(బతికాను)
అయ్యోనాకామెంటేది. అనూ గారి తర్వాత రాసానే. ఎవరూ స్పందించలేదని నేను స్పందించిన తర్వాత మీ టపా చూసి కామెంటేసా. నాటపా 'ముంబై ముచ్చట్లు – గాంధీగారి వస్తువులు' వీలుచేసుకు చూడండి .
@కొత్తపాళీ:
అది నేను ఈ మధ్యనే (ఈ వేలం విషయం బయట పడిన సందర్భంలో) ఏదో తెలుగు వార్త్తా పత్రిక/పోర్టల్ లో చదివిన విషయం. నిజమే, నేను అందులో ఎంత నిజముంటుందో ఆలోచించలేదు. కాకపోతే, వాటిలో ఒకట్రెండు వస్తువులు (గడియారం లాంటివి) ఆయన బహుమతిచ్చేసినవే కావచ్చు.
సత్యసాయి గారు, అనూ గారి తర్వాత మీ కామెంట్ రాలేదే? ప్రతి కామెంటూ జాగ్రత్త గా చదువుతాను కూడాను!
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఇప్పుడే మీ టపా చూసి వస్తున్నాను. అక్కడ రాయడం మర్చిపోయాను, పుల్లలతో మీరు సృజించిన గాంధీ అద్భుతంగా ఉన్నాడు. మా కాలనీ వేసవి శిబిరంలో ఈ పుల్లలతో గాంధీ తయారీని చేర్చుకోవచ్చా?
డమ్మీ/పెట్టుడు గాంధీల కన్నా అసలీ గాంధీ గారి ఆ పాత వస్తువులే నయం. వాటిల్లో అయినా ఒరిజినాలిటీ ఉంటుంది. వీళ్ళ కసలు అన్నీ కాపీ రాజకీయాలే కదా.
బాగుంది, సుజాతా, అసలవిన విలువలు వదిలేసి కృత్రిమంగా వస్తువులకి రూపాయల్లోనూ, డాలర్లలోనూ విలువ కట్టే విధానం ఇప్పుడే వచ్చిందనుకుంటాను. మంచి టపా.
ఎప్పట్లానే మంచి సబ్జెక్ట్.. మంచి టపా!!
నేను నీహారిక గారితో ఏకీభవిస్తాను.. 'వేలం' వెర్రి కీ, కళాపోషణకీ ముడిపెట్టలేము..
విజయ్ మాల్యా ఆ వస్తువులు కొనడం వెనకాల నాకైతే మార్కెటింగ్ స్ట్రాటెజీ నే కనిపిస్తుంది.. ఎందుకంటే అతనిలాంటి బిజినెస్ మైండ్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ రేపు, ఎల్లుండికి సంబంధించిన వ్యాపార వ్యూహాత్మక రచనలోనే మునిగి ఉంటారు.. అంతేకానీ ఇవాళ నాకు చాలా డబ్బుంది, ఇప్పటికిది చాలు.. కాస్త ప్రజాసేవ చేద్దాం అనుకోరు.. of course it is an unwanted tendency.. but it is what it is!
మాల్యాని అస్సలు వెనకేసుకు రావడం లేదు గానీ ఈ ఉదాహరణతో అసలు కళాభిమానులని ముడిపెట్టడం బాలేదని విన్నవించుకుంటున్నాను :-))
నిషిగంధ,
ధన్యవాదాలు! టపాలో నేను చెప్పదల్చుకుంది"గాంధీ ఆదర్శాలు మనకు అక్కర్లేదు, అవెప్పుడో మర్చిపోయాం! కానీ ఇప్పుడు కోట్లు పెట్టి చెంబూ, చెప్పులూ కొనడానికి మాత్రం సిద్ధం" ఇదీ! కానీ వ్యాఖ్యతల చర్చ మరోవైపు మళ్ళింది.
విజయమాల్యా కొనడం మాత్రం మార్కెటింగ్ తప్ప మరొకటి కాదు. ఇది కూడా నా టపాలో చెప్పాలనుకున్నదే!
ఇప్పుడే నిర్ణయించుకున్నా, టపా చదివాక వెంటనే కామెంట్ రాసి గానీ మిగతా వారి అభిప్రాయాలు చదవకూడదని! వరుసగా ఇన్ని కామెంట్స్ చదివేసరికి బుర్రలో అసలు మీరు చెప్పిన విషయం వెనక్కి వెళ్ళిపోయింది :(
మనకి గాంధీ గారొద్దూ, వారి పద్ధతులూ ఒద్దు. వారి కళ్ళజోడు కావాలి. ఎందుకంటే We are short sighted in many aspects. Especially on terrorism. (ఐ బాబోయ్! తప్పు సెప్పీసినానేటి కదూ. ఆయన పద్ధతొకటి పాటిస్తున్నాం. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపటం. అన్నింట్లో కాదులెండి. Terrorism విషయంలో).
వారి కర్ర కావాలి. ఎందుకంటే ఎదుటి వాడి బుర్ర బద్దలు కొట్టేటందుకు. (ఈడ్నా తప్పైపోనాది మారాజా... మనం వాడేవి గన్నులే కదా. ఆంగ్ల పిక్చరు లో చీమలొచ్చినా గన్నే శరణ్యం కదా వారికి. తెలీదా? సినేమాలు సూడలేదేంటి?)
వారి బుక్కొకటి కావాలి. కొటేషన్లు కొట్టేటందుకు. (చాలా కొటేషన్లు కొట్టేసేవే కదా. :-)).
అసలు సంగతి మర్చేపోయాను. వారి నామధేయం కూడా కావాలన్డోయ్...!!!??? లేందే దేశానికి ప్రధాని ఎక్కడ నుండీ వస్తాడు. ఫాఫం ప్రజలీ ఆ మాత్రం సత్తా కూడా లేదు. మన్మోహనుడు చేసినా మనం చేయలేమాయే. (Seriously regretted. He was an essential person, and his guts are the reason for some development).
ఇన్ని జరిగి పోనాక... విజయ్ మాల్యా పాపం ఏదో పబ్లిసిటీ కోసం చేస్తే తప్పేటీ అంట. అః తప్పేటీ అంట.
SERIOUSLY, your views and presentation style are so cool. A wonderful post after a long time.
What u said to Nishigandha is right. Many people missed the point. They only 'seen the upper layer.
ramayanam lo pidakala veta....
I like your responses...
Post a Comment