September 3, 2009

ఇదే జీవితం! ఇదే శాశ్వతం!
మరణం ఒక యాక్సిడెంట్! ఎవర్ని ఎప్పుడు ఎలా ఎక్కడ వరిస్తుందో తెలీదు! రాష్ట్ర ప్రభుత్వాధిపతి, కాంగ్రెస్ ని కనుసన్నలలో నడపగలిగిన నేత, ఈ రోజు దిక్కులేని స్థితిలో ఒక మారుమూల కొండపై మృతదేహమై పడి ఉన్నాడు, గుర్తించలేని స్థితిలో!ఆయన ఇక భౌతికంగా సజీవంగా ఉండి ఉండరన్న సందేహం ప్రతి ఒక్కరి గుండెలో తొలుస్తున్నా, ఎక్కడో ఒక చిన్న ఆశ...క్షేమంగా తిరిగొస్తాడేమో అని! హెలికాప్టర్ శకలాలు కనపడ్డాయని తెలిసిన తర్వాత కూడా వీడని అర్థం లేని అత్యాశ!ఇదిలా ఉంటే:

రాష్ట్ర ముఖ్య మంత్రి కనపడకుండా పోయిన ఉద్విగ్న సమయంలో ముఖ్యమైన ప్రకటనలు చేస్తున్న ఆర్థిక మంత్రి పక్కన పైకి ఖరీదు అంతగా కనపడని అతి ఖరీదైన చీరెలో చెంపకు చెయ్యి చేర్చి హరి కథ వింటున్న భంగిమలో సాక్షాత్తూ రాష్ట్ర హోమ్ మంత్రిణి!సమర్థత కంటే రాఖీకే విలువెక్కువని నిరూపించిన సోదరి!

వీరవిహారం చేస్తూ నిమిషానికో కొత్త కథ వినిపిస్తున్న అసంఖ్యాక మీడియా ఛానెళ్ళు!

నిన్నంతా...వై యెస్ క్షేమంగా ఉన్నారని తలుస్తే Y అనీ, పోయారని భావిస్తే N అని ఎస్సెమ్మెస్ లు పంపాల్సిందిగా వీళ్ళ హోరు. మరో పక్కన ఆయన క్షేమంగా తిరిగి రావాలని పంపే విషెస్!(ఈ రోజేమో నివాళులు పంపే ఎస్సెమ్మెస్ లు)!

జీవితం ప్రచారాల సుడిగుండంలో చిక్కుకున్న చిల్లుపడవైపోయింది.

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి కాలి నడకన నల్లమల అడవుల్లో తమ నాయకుడి కోసం  వెదికే ప్రయత్నం చేస్తున్న అభిమానులు...!"ఆయనొచ్చాక ఏం మంచి జరిగిందని బాధ పడాలి, ఆయన పోతే? బియ్యం , సరుకులు రేట్లు పెరగడానికి ఆయనే కారణం" నిర్థారించేసిన ఎదురింటి ఎమ్మే ఎకనామిక్స్ గృహిణి!నిన్న మధ్యాహ్నం నుంచి జనమంతా టీవీలకే అతుక్కుపోయారని గ్రహించి, ప్రకటనలను ముమ్మరంచేసిన వ్యాపార వేత్తలు !"ముఖ్యమంత్రి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ..ఫలానా కాటరర్స్, పెళ్ళి, గృహప్రవేశం ఇతర శుభకార్యాలకు రుచికరమైన వంటలు లభించును....అంటూ!(ఇలాంటివే హాస్పటళ్ళు, స్కూళ్ళూ, రియల్ ఎస్టేట్లు...వగైరా)"ఎవరు ముందుగా హెలికాప్టర్ క్రాష్" వార్తను అందించారన్న దాని మీద టీవీ వార్తా ఛానెళ్ళ మధ్య పోటీ!"ఏవండోయ్, ఆయన పోయాడంటే రేపు కూడా సెలవేగా(ఈ రోజెలాగూ నిమజ్జనం వల్ల హాలిడే)! తర్వాత వీకెండ్! వరసగా మూడ్రోజులు! ఎటైనా వెళ్తేనో"అంటూ కన్ ఫర్మేషన్ కోసం ఫోన్ చేసిన కాలనీలోని మరో విద్యార్థి తల్లి..!


"గొడవలేమైనా జరుగుతాయేమో మేడమ్! ముఖ్యమైన సరుకులు పంపమంటారా? జీడిపప్పు ఫ్రెష్ గా వచ్చాయి, అవి కూడానా?" సూపర్ మార్కెట్ నుంచి మేనేజర్ ఫోన్!"హైదరాబాదులో ఇద్దరు పోయారట స్వైన్ ఫ్లూతో! ఎందుకైనా మంచిది, ఆ హోమియో మందేదో మీరు తెచ్చుకునేటపుడు మాక్కూడా తీసుకురండి ప్లీజ్" పక్కింటి నార్త్ ఇండియన్ మిశ్రా గారి వేడుకోలు!"బస్సులుంటాయా ఇవాళ! లేకపోతే ఆటోల వాళ్ళు దోచేస్తారు..."మధ్య తరగతి నిర్మల ఆరోపణ!

"అబ్బ, శ్రీశైలం రిజర్వాయర్ ఎంత బావుందో చూడండి,ఎప్పుడైనా తప్పక వెళ్ళాలి " టీవీలో గాలింపు చర్యలను చూస్తూ ఒక  ప్రకృతి ప్రేమికుడి  అభిలాష!


మొత్తానికి, ఇక ఆ మనిషి లేడు. ! మరణించాక కూడా 24 గంటల పాటు రాష్ట్ర ప్రజల్ని, సకల రక్షణ దళాలనూ పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రి నిష్క్రమించాడు.


చెరగని చిరునవ్వు, మిన్ను విరిగి మీద పడ్డా చలించని స్థిర చిత్తం ,అనుకున్నది ఆరు నూరైనా చేసి తీరే సంకల్ప శుద్ది ...వీటన్నింటినీ సొంతం చేసుకుని, కారణమేదైనా పేద ప్రేజల గుండెల్లో మాత్రం స్థానం సంపాదించాడన్నది కాదనలేని సత్యం!


ఇకపై ఆయన కనపడరంటే నమ్మడం, జీర్ణించుకోవడం కష్టంగానే తోస్తోంది. 


మనుషులంతా ఇంతే! పైకి ద్వేషించినా,విభేదించినా లోపల ఏదో ఒక మూల సాటి మనిషనే భావం ఉండకపోదేమో!

 "అయ్యో! " అనిపించకపోదేమో!

కంట ఒక కన్నీటి చుక్క రాలకపోదేమో!

విధానాలతో విభేదించినా, మనిషి గా విద్వేషాన్ని మూటగట్టుకోలేమేమో


ఎదిగిన పిల్లలు దుఃఖాన్ని తట్టుకున్నా, జీవితాన్ని పంచుకున్న సహచరి బాధను ఎవరు పంచుకుంటే తీరుతుంది?

కానీ......

ఈ రోజొక్కరోజే ఇదంతా! రేపటినుంచీ అంతా మమూలే!ఎవరి గోల వారిదే!


ఇదే జీవితం! ఇదే శాశ్వతం!

ఆయన జీవన సహచరికి నా సానుభూతి!

ఆయనతో పాటు విధి నిర్వహణలో అసువులు బాసిన శ్రీయుతులు సుబ్రహ్మణ్యం, వెస్లీ, భాటియా, రెడ్డి గార్ల ఆత్మలకు కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను.

21 comments:

మేధ said...

>> మనుషులంతా ఇంతే! పైకి ద్వేషించినా,విభేదించినా లోపల ఏదో ఒక మూల సాటి మనిషనే భావం ఉండకపోదేమో! "అయ్యో! "అనిపించకపోదేమో! కంట ఒక కన్నీటి చుక్క రాలకపోదేమో!
విధానాలతో విభేదించినా, మనిషి గా ద్వేషాన్ని మూటగట్టుకోలేమేమో
Thats true.. very very sad ending for a man like him..
ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ..

Sujata said...

I think this is a emergency situation and Rosayya is now acting CM. Also he is an experienced politician and a genuine congress figure. It is not in the scope of Sabita Reddy to take the lead in this situation, keeping in the political and protocol demands.

I am very sorry for the scrolling commercials you mentioned here. Very sorry for YSR.

Enaganti Ravi Chandra said...

పిడుగు లాంటి వార్త. గుండెను పిండేస్తోంది.

కత్తి మహేష్ కుమార్ said...

హ్మ్మ్ నిజమే ఇదే జీవితం.

కొండముది సాయికిరణ్ కుమార్ said...

అప్పుడు ఇందిరాగాంధీ, తర్వాత ఎన్.టి.ఆర్., ఇప్పుడు వైయస్సార్. వీరిపైన నాకు ఏనాడు సరైన అభిప్రాయం లేదు. కానీ, వీరి మరణవార్త మాత్రం కంట తడి పెట్టించింది. ఎందుకో మాత్రం చెప్పలేను. ఆంధ్ర రాజకీయాలను ఈమధ్య కాలంలో ఇంతలా ప్రభావితం చేసిన నాయకుడు లేదనేది యథార్ధం. రాబోయే సంవత్సరాల్లో కేంద్రంలో కూడా మంచి నేత అవుతాడనుకున్న వ్యక్తి ఇక లేరనుకుంటే నిజంగానే బాధగా ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్ కు నా ప్రగాఢ సంతాపం.

Rays said...

ప్రజలందరూ కొన్ని రోజుల్లొ ఇది మర్చిపోవచ్హు కాని ఆయన సహధర్మచారిణి కి ఉండే గుండె కోత ఎవరూ తీర్చలేనిది........


May his soul rest in peace....

తృష్ణ said...

"ఈ రోజొక్కరోజే ఇదంతా! రేపటినుంచీ అంతా మమూలే!ఎవరి గోల వారిదే!

ఇదే జీవితం! ఇదే శాశ్వతం! "

yes,this is the ultimate truth...may his soul rst in peace!!

బొల్లోజు బాబా said...

yes it is unfortunate to lose a politician with human touch.

may his soul rest in peace

bollojubaba

మురళి said...

చాలా విషాద వార్త.. ప్చ్..

శేఖర్ పెద్దగోపు said...

ఏంటోనండీ...ఏం రాయలో కూడా అర్ధం కావట్లేదు. ఇప్పుడే ప్రమాద ఘటన సన్నివేశాలు చూశాను. మీరన్నట్టు ఇదే జీవితం..ఇదే శాశ్వతమేమో!

గీతాచార్య said...

No comment on media. It never deserves such attention. మీరు మీడియా గురించి చెప్పగానే నవ్వలేక చచ్చాను. అసలొకటి ఉందంటూ పట్టించుకోవటం అవసరమా? వాళ్ళ గురించి ఆలోచించటం అవసరమా?... బ్రే......క్ తరువాత.

చేవెళ్ళ చెల్లెమ్మ గురించి మీ వ్యాఖ్యలతో ఏకీభవించలేను.

"ఆయనతో పాటు విధి నిర్వహణలో అసువులు బాసిన శ్రీయుతులు సుబ్రహ్మణ్యం, వెస్లీ, భాటియా, రెడ్డి గార్ల ఆత్మలకు కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను."

RighttO. First we must do it.

అబ్రకదబ్ర said...

ఆయన మృతి లోటే. ఐతే ఆ తర్వాత జరగాల్సిందేమిటనేది బుర్రతో ఆలోచించాలి - సెంటిమెంట్లు నిండిన గుండెల్తో కాదు. ఇప్పుడు జరుగుతున్న తంతు చూడండి - కడప జిల్లాకి వైఎస్ పేరు పెట్టాలనో మంత్రి ప్రతిపాదన. జిల్లాల పేర్లు మార్చుకుంటూ పోటం అవివేకం. జలయజ్ఞం ప్రాజెక్టులకి ఆయన పేరు పెట్టటం మరింత సముచితం కాదా? కొడుకుని ముఖ్యమంత్రిని చెయ్యాలని మంత్రివర్గం పట్టుదల! ఇంకా రాచరికంలోనే ఉన్నామా మనం? రోశయ్యని ముఖ్యమంత్రిగా ఎందుకు కొనసాగించకూడాదు? కులాల లెక్కల్నుండి బయట పడరా అవకాశం వచ్చినప్పుడు కూడా?

గీతాచార్య said...

If jagan's sensible enough, he will become a Sonia Gandhi. Sacrifice the CM post ;-)

సుజాత said...

గీతాచార్య,
మీరు మీడియాను చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు.మీరనుకుంటున్నంత అల్లాటప్పాగా లేదు మీడియా! ఆక్టోపస్ లాగా అది ప్రజాభిప్రాయన్ని ఎలా కబళిస్తోందో తెలియాలంటే మీరు కొద్ది రోజులు సెలవు పెట్టి మరీ మీడియా ఛానెళ్ళను పరిశీలించాలి. మీడియాను గురించి చదవగానే నవ్వు రావడం అన్నివేళలా మంచిది కాదేమో ఆలోచించండి!

ఈ రోజు జగన్ పేరుని ప్రముఖంగా పైకి తీసుకొచ్చింది ఒక రకంగా మీడియానే! కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ఏమిటో తెలీయకుండానే (ఫైనల్ గా జగన్ పేరే వస్తుందనూకోండి) భావోద్వేగాలతో కొట్టు మిట్టాడుతున్న జనాన్ని" జగన్ నాయకుడు గా వస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు కదూ"అని,ఇంకా అంత్యక్రియలు కూడా జరగకముందే ఒపీనియన్ పోల్స్ నిర్వహించి జనాన్ని రెచ్చగొట్టి జనం చేత నినాదాలు చేయించిన మీడియా సిగ్గులేని తనాన్ని ఇవాళ జనం చూశారు. మీడియాను పట్టించుకోకుండా వదిలేయాలనడం "ఈజీ గోయింగ్" ఆలోచనతో పరిస్థితిని తేలిగ్గా తీసుకుని మాట్లాడటమే అవుతుంది. ఇది సీరియస్ గా ఉండాల్సిన తరుణం!

చేవెళ్ళ సోదరి పై నాతో ఏకీభవించకపోతే మానె, ఎందుకు విభేదిస్తున్నారో చెప్తే తెలుసుకుంటాగా!మీరు మరీ!

@అబ్రకదబ్ర,

వారసత్వ రాజకీయాలు మనకు ఇవాళ కొత్తా? నెహ్రూ పోతే ఆయన కూతురు, ఇందిర పోతే ఇందిర కొడుకూ ఆయన పొతే ఆయన భార్యసాక్షాత్తూ ప్రధాని అంతటి మనిషి!

రామారావు పోతే చంద్రబాబు,ఆయన తర్వాత వారసత్వానికి వందమంది రెడీ!

"ఇంకా రాచరికంలోనే ఉన్నామా మనం?" ----అసలు మనం ప్రజాస్వామ్యంలో ఎప్పుడున్నామో చెప్పండి?
"కులాల లెక్కల్నుండి బయట పడరా అవకాశం వచ్చినప్పుడు కూడా?"

అవకాశం రానిస్తారా? వస్తే నిలవనిస్తారా? ఈ లెక్కలు ఇప్పుడు తేలేవి కాదులెండి! మన తర్వాత మూడు జనరేషన్లు అయ్యాక అప్పుడేమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి!(మీ ఆవేదన అర్థం చేసుకోగలను)

గీతాచార్య said...

సుజాత గారు,

మీరు కాస్త తొందర పడ్డారు.

వాళ్ళ గురించి ఆలోచించటం అవసరమా?... బ్రే......క్ తరువాత. "బ్రేక్ తరువాత". Under line this point madam. అంటే నేను చెప్పాల్సింది ఇంకా ఉందనేగా...? :-)

I'm in no way playful nor am taking the issue in a lighter way. I'm really serious regarding my comments on media. I'l tell my reasons 2maro. Am now in a hurry.
I'm really serious regarding my comments on media. Will be back.

అయ్యో నేను ఇంకా దిగబదకుండానే మీరు క్లాసు మొదలెట్టేస్తే ఎలా?

sunita said...

>> మనుషులంతా ఇంతే! పైకి ద్వేషించినా,విభేదించినా లోపల ఏదో ఒక మూల సాటి మనిషనే భావం ఉండకపోదేమో! "అయ్యో! "అనిపించకపోదేమో! కంట ఒక కన్నీటి చుక్క రాలకపోదేమో!
విధానాలతో విభేదించినా, మనిషి గా ద్వేషాన్ని మూటగట్టుకోలేమేమో
అక్షర సత్యాలు.
సుజాత గారూ, ఎందుకో ఈ చావుని జీర్ణించుకోలేక పోతున్నాను.
అంతా కళ్ళ ముందే జరుగుతున్నా ఇంకా చెయ్యూపుతూ ఆ ముఖం కనిపిస్తుంది అని ఆశ.

సుజాత said...

అవును సునీత గారు,

మూడు రోజుల నుంచీ ఈ విషాదమంతా లైవ్ లో చూస్తున్నా, మళ్ళీ ఇవతలకి వచ్చి ఆయన ఇక లేడు అనుకోగానే అదేదో అప్పుడే కొత్తగా విన్న వార్త లాగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఆ డైనమిజం మనం ఇంతకు ముందు ఎక్కడా చూసి ఉండకపోవడం వల్ల అనుకుంటా, తెలీకుండానే అభిమానం పెంచుకున్నట్లున్నాం!

raja said...

Why all of you are blaming YS Jagan as CM, Leader means he must attract the people-like chiru,and have incredible potentiality to rule-like chandra babu, must have knowledge over the administration - like jp, and must have human touch like- NTR, YSR... Show me one leader in AP congress like that- DS, KK, Rosaiah,- are these people leaders? although Rosaiah has great skills, he can't command the party and the total congress leaders - I'm not sure about Jagan like he is chandra babu or jp or ysr.. but he had immense fan power .. after all he will learn..
Making Leaders is not a simple issue.... it is not one day activity...

హరే కృష్ణ . said...

good analysis..ముంబై లొ కూడా 26/11 తర్వాత రొజు లోకల్స్ office లు యధావిధిగా నడిచాయి spirit of ముంబై అని media హడావుడి చేసినా ..
**ఈ రోజొక్కరోజే ఇదంతా! రేపటినుంచీ అంతా మమూలే!ఎవరి గోల వారిదే!
so true

జాన్‌హైడ్ కనుమూరి said...

may be i am responding late

జీవితం ప్రచారాల సుడిగుండంలో చిక్కుకున్న చిల్లుపడవైపోయింది

శ్రీధర్ said...

ఇలాంటి సందర్భం లో టీవీ ఛానళ్ళు చేసిన హడ వుడి అంతా ఇంతా కాదు.
దాదాపు ౩౦౦ కి ఫై చిలుకు ప్రజలు ఈ వార్తా విని గుండె పోటుతో మరణించారని ఒక సమాచారం. దీనికి పూర్తీ బాధ్యత టీవీ చానెల్స్ దే!
ఇక నేను చుసిన ఐ-న్యూస్ మాత్రం పరమ అధ్వాన్నం!! అడగరాని ప్రశ్నలడిగి తెగ బాధ పెట్టి విసిగించారనుకోండి.
ఎప్పుడు మారుతారో!! ఏమో!!

Post a Comment