October 19, 2009

మీకు "ళ" గుణింతం వచ్చా?

ఆ మధ్య ఒకరోజు మా ఎదురింటావిడ బోల్డన్ని నగల్తో కారు దిగి లోపలికొస్తూ పలకరింపుగా నవ్వితే ఎలాగూ ఇంటికొచ్చేసింది కదాని "ఏమిటి విశేషం" అన్నాను.(వెళ్ళేటపుడైతే ఎక్కడికి అని అడక్కుడదంటారుగా)


'పెల్లికెల్లొస్తున్నాను" అంది. "ఎక్కడికీ"అని రెట్టిస్తే మళ్ళీ అదే చెప్పింది. 'ఎవరి పెళ్ళి"అనడిగితే

"మా మురలీ లేడూ,  వాడి పెల్లాం చెల్లెలిది" అని చెప్పింది. ఆవిడనని లాభం లేదు. తెలుగు దేశంలోని తెలుగు వాళ్లలో(బయట కూడా ) "ళ" పలకని వాళ్ళు కోకొళ్ళలు..ఛ..కోకొల్లలు!

వీళ్ళలో ఈ తరం పిల్లలు ఎక్కువ శాతమైతే ప్రాంతాన్ని బట్టి కూడా "ళ" ని "ల"అని పలకాలి కాబోలనుకునే వారు మరికొందరు!ఈ తరం వాళ్లలో ప్రైవేటు న్యూస్ ఛానెళ్ళలో వార్తలు చదివే సీతాకోక చిలకలు అగ్రస్థానంలో ఉంటారు.వరదలు తగ్గాక అక్కడి ప్రజల పరిస్థితుల గురించి ఒక ఛానెల్ లో న్యూస్ రీడర్ ఇలా చదివింది"వాల్లు నిర్భాగ్యులు! ఊల్లకు ఊల్లు ముంచేసిన వరద తాకిడికి సర్వం కోల్పోయిన వాల్లు! కల్ల ముందే కుల్లిపోతున్న కలేబరాల ను చూసి కల్ల నీల్లు పెట్టుకుంటూ, ఆకలికి ఆగలేక కుల్లి కుల్లి ఏడుస్తున్న పిల్ల గాల్లను చూసి నిస్సహాయులై మల్లీ తిరిగి చూడని అధికార్ల అలసత్వం మీద ఆగ్రహాన్ని వెల్ల గక్కుతూ..." అసలేమైనా బోధపడిందా? ఇది తెలుగా?

ఆమెకు "ళ" పలకదని గ్రహించిన సబెడిటర్లు పాపం ఈ పేరాలో ఇన్ని "ళ"లు లేకుండా చూసుకోవద్దూ!"మల్లీ ఊల్ల మీద పడ్డ నీల్లు"(వరదల సందర్భంగా)


"కల్ల నీల్లు పెట్టుకున్న తెలుగు తమ్ముల్లు"


" టిటీడీ ఆధ్వర్యంలో పెల్లిల్లు."

"రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు" (రాష్ట్రంలోని పేదలందరికీ ఒకటే ఇల్లు కాదులెండి, పక్కా "ఇళ్ళు" అని వారి ఉద్దేశం)

"బాలగోపాల్ లాంటి జనహితం కోరే వాల్లు"


ఒకటేమిటి.."ళ"పలకాల్సిన ప్రతిచోటా శక్తి వంచన లేకుండా "ల"పలుకుతారు! అసలు ఇంకో ఆణిముత్యం చదవాలి మీరు! "డెడ్ బాడీ నుంచి కల్లు తీసిన యాంకరమ్మ". గురించి చదివారా? కల్లు, సారాయి కాదులెండి, పాపం ఐ బాంక్ వాళ్ళు "కళ్ళు"తీసుకున్న వైనం గురించి చెప్పబోయింది పాపాయి!

మీలో "ళ" గుణింతం ఎంతమందికి వచ్చు? రాయడం కాదు, చదవడం!


ఈ మధ్య ఒక సినిమా చూశాను టీవీలో! సినిమా పేరు అబద్ధం  ! దర్శకుడు బాలచందర్. ఇద్దరు హీరోల్లో ఒకడు ఉదయ్ కిరణ్! అసలు ఉదయ్ కిరణ్ పేరు తల్చుకోగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏమిటి? "ఈ పెద్దోల్లున్నారే"అన్న పేడి డైలాగేగా! ఇందులోనూ అదే పాత్ర అయ్యవారిది. హీరోయిన్ వెంటపడి వేధిస్తూ ఫొటో తీస్తుంటే తెలివి గల ఆ పిల్ల "కొంచెం వెనక్కి వెళ్ళి తియ్యి" అని ఉదయ్ వెనక ఉన్న పదడుగుల గోతిలో పడేలా చేస్తుంది. అప్పుడు హీరో  "గీతా(నిజంగా ఆ అమ్మాయి పేరు ఇది కాదనుకుంటా ! అది రాధ అయ్యుంటే రాదా..అంటాడుగా హీరో! అది రాయడం ఇష్టం లేక...) ప్రేమని నీ చుట్టూ తిరుగుతుంటే నన్ను "పాతాలం" లో పడేశావేంటి"అనడుగుతాడు.హీరోవిను వాడిని  "అది పాతాలం కాదురా ఫూల్! పాతా"ళం"! "ళ"  పలకటం రాదు, మళ్ళీ తెలుగు వాడినని సొల్లు కబుర్లు చెప్తావు. ముందు "ళ"నేర్చుకోరా గాడిదా"  అని  పిచ్చి తిట్లు తిట్టి వెళ్ళిపోతుంది. ఇలాంటి దృశ్యం ఒకటి తెలుగు సినిమాలో  ఉంటుందని నేనెప్పుడూ కల కూడా కనలేదు. (అది తమిళ సినిమా, తెలుగులోకి డబ్ చేశారు. ఈ లెక్కన "ళ" పలకడం రానివారు తమిళనాడులో కూడా ఉన్నారన్నమాట )

 ఒకరోజంతా హీరో ఆ గోతిలోనే ఉండి "ళ" ప్రాక్టీస్ చేసి మొత్తం "ళ" లు ఉండే పాట పాడతాడు. ఆ పాట
 ఇక్కడ వినండి..(ఆ మాటకొస్తే ఈ పాటలో కూడా తప్పులున్నాయి. అనవసరమైన చోట  కూడా  "ళ" ఉపయోగించారు ఈ పాటలో)"ళ" పలకవలసిన చోట "ల" పలుకుతుంటే చాలా చిరాకేస్తుంది.


ఇలా "ళ" పలకడానికి బద్ధకించే వాళ్ళు నిత్యం తారసపడుతూనే ఉంటారు. (అవును బద్ధకమే, ఆ అక్షరం మన అక్షరమాలలో ఉన్నపుడు, దానికి "ల" కీ తేడాని స్పష్టంగా చిన్నపుడు నేర్చుకున్నపుడు పలకడం 'రాదు"అంటే ఎందుకొప్పుకోవాలి?)"కుల్లు మోతు వాల్లు"


"కల్లెం లేని గుర్రం"


"యాపిల్ పల్లు"


"పల్లు రాలగొట్టిన యువతి"(ఈ పళ్ళు వేరు)


"మల్లీ మల్లీ చెప్పినా లాభం లేదు"


"గులాబి ముల్లు"(సింగిల్ ముల్లు కాదు, ముళ్ళు)


"మురలీ రవలి"


"జీవన సరలి"


"చోల రాజుల నాటి శాసనం"


"వీధికెక్కిన ఇల్లాల్లు(ఇల్లాళ్ళు)

 "లలిత కలలు" (లలిత కన్న కలలు అని అర్థం చేసుకోవాలా?)
ఈ మధ్య ఒకచోట "ముల్లు" అని ఉండాల్సిన చోట "ముళ్ళు"అని ఉండటం చదివి తెల్లబోయాను. చాలా మంది జర్నలిస్టులు కూడా ఆర్నెల్లు అని రాయడానికి  "ఆర్నెళ్ళు" అని రాస్తారు."మౌలిక" అని రాయాల్సిన చోట "మౌళిక" అనీ  "మెలకువలు"అని రాయాల్సిన చోట "మెళకువలు" అనీ రాయడం చాల చోట్ల గమనించవచ్చు!ఒరియా వాళ్ళను ఎప్పుడైనా గమనించారా?వీళ్ళలో దాదాపు చాలా మందికి "ష" పలకడం రాదు. స్టేసన్, ఎమోసన్,ఎగ్జామినేసన్,కరప్సన్...ఇదీ వరస!

దీపక్ మహాపాత్రో అనే ఒక ఫ్రెండ్ ని అడిగితే  "మాకసలు "ష" లేదు"అన్నాడు.  ఉదయ్ సాహు అనే మరో పొరుగాయన అతడిని సమర్థించాడు. (ఎంతవరకు నిజమో నాకు తెలీదు!ఒరియా అక్షర మాల లో ఉందో లేదో తెలిసిన వారు చెప్పాలి)ఇలా అక్షర మాలలో లేని అక్షరాలు పలకలేని వారిని క్షమించవచ్చు. హిందీ మాతృభాష గా గల వారు "ళ"సరిగా పలకలేదంటే ఒప్పుకోవచ్చు గానీ "ళ"పలకడం రాని దక్షిణభారతీయుల్ని చూస్తే ఏమనాలో అర్థం కాదు.ఇక "శ"ను "ష"లాగా పలికేవాళ్ళను లెక్కపెట్టలేం కాబట్టి వాళ్లగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..!"షిల్పం'

"షషి"


"షరం" (హిందీ సిగ్గనుకునేరు...శరం అని చదూకోండి)

"దేషం"


"దోష"(దోశ)


"దషదిషలు"


"విషాల హృదయం"(భలే కామెడీ కదూ..విషాల..)

వీటికి మీరు కూడా మీకు తట్టిన కొన్ని పదాలు కలుపుకోండి!భాషను ఎవరైనా సరే ఖూనీ చేయడం సహించకూడని విషయం!  అందునా, ప్రజా జీవితంలో, ముఖ్యంగా మీడియా లో ఉండే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నా అభిప్రాయం! . ఎందుకంటే జబర్దస్తీగా మన జీవితాల్లోకి చొచ్చుకొచిన మీడియా ఛానెళ్ల ప్రభావం రేపటి పౌరులమీద తప్పకుండా ఉంటుంది కాబట్టి! ఎంతసేపూ 'ఎవరు ముందుగా వార్తను అందించారన్న పోటీయే తప్ప ఎంత ప్రామాణికమైన భాషను ఉపయోగిస్తున్నామన్న స్పృహే లేకుండా పోయింది ఎలక్ట్రానిక్ మీడియాలో!"ఇలాంటి సంకర మైన భాషను వినలేకపోతున్నాం! ఇటువంటి అపభ్రంశపు తెలుగు మాకొద్దు!   దీనివల్ల మా పిల్లలకు మాతృభాష మీద విరక్తి కలుగుతోంది. నష్టం కలుగుతోంది ...చర్యలు తీసుకోండి"అంటూ హైకోర్టులో ఒక PIL వేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా?


నాకైతే నమ్మకం లేదు! మీకో?

68 comments:

Bhardwaj Velamakanni said...

LOL ... good one!


ల & ళ బాగానే ఉంది గాని, శ బదులు ష తరచుగానే వాడుతూ ఉంటారు - ఉత్తర భారత ప్రభావం వల్ల.

భాస్కర రామి రెడ్డి said...

ఏమోళమ్మ, నాకెందికీగోళ అసలే నాకు ల పలకాలంటే బ"ద్ధ"కమే:)

చిలమకూరు విజయమోహన్ said...

ముందు చదువు నేర్పే ఉపాధ్యాయులకొస్తే కదా పిల్లలకొచ్చేది.మాకు శ,ష,స లు ళ,ల లను తెలుగు ఉపాధ్యాయులు ప్రత్యేకించి చెబుతూ ఎలా పలకాలో బాగా చెప్పేవారు.ఇక టీవీ సీతాకోకచిలుకల తెలుగు ఉచ్చారణ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

KumarN said...

ఫైనుంచి, కింది దాకా నవ్వుతూ చదూతూ వస్తున్నాను, నా నవ్వాగి పోయింది, మీరు "శ"-challenged వాళ్ళకి వాతలు పెట్టడం మొదలెట్టగానే. నేను ఆ handicapped people లో ఒకణ్ణి కాబట్టి.

some of your observations are very sharp..

"రాష్ట్రంలోని పేదలందరికీ పక్కా ఇల్లు"...that was a good one.

aswin budaraju said...

ళ తో పాటు శ షాలు
షనివారం షుక్రవారం అని అనటం కూడా నేను విన్నా

మేధ said...

ఈ మధ్య ఇలా మాట్లాడడం బాగా ఎక్కువయ్యింది.. ఒక్క ఉదయకిరణేంటి, అందరు కుర్ర హీరోలు దాదాపు అటూ ఇటూ గా ఇలానే ఉన్నారు.. అల్లు అర్జున్ మాట్లాడేది వింటుంటే శివ శివా అని చెవులు మూసుకోవాలనిపిస్తుంటుంది..
మొన్న వరదలప్పుడు ఇంకా ఘోరం.. అయినా మాకు "ళ" పలకడం రాదు అంటే ఎట్లా, ఇంగ్లీష్ లో ఎన్ని రకాల స్లాంగులు ఉన్నాయో అన్నీ తెలుసుకోవడంలా.. అలాంటిది మన భాష మాత్రం మనకి అనవసరం..
అయినా తెలుగుకి పట్టిన తెగులు గురించి మాట్లాడుకుంటే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది...

వేణు said...

టపా వ్యంగ్యంగా, చమత్కారంగా బావుంది. అభినందనలు!

న్యూస్ ఛానెళ్ళ ‘బాష’ గురించి తల్చుకుంటే ‘కల్ల నీల్లు’ వచ్చేస్తాయి. మీరు చాలా ఉదాహరణలు చెప్పారు. ఇంకా ‘కోకొళ్ళలు’ దొరుకుతాయి.

విచిత్రం ఏమిటంటే... ఇలాంటి భాషపై విరక్తి కలగటం తగ్గిపోయి, దీనికి క్రమంగా మనం అలవాటు పడిపోతున్నాం!

వేణూ శ్రీకాంత్ said...

హ హ వండర్‍ఫుళ్ :-) టపా అదరగొట్టారు... శ ని ష గా పలికే వాళ్ళను చూస్తే నాకు వెంటనే సినిమా తాగుబోతుల భాష గుర్తొస్తుంది. కానీ మీరన్నట్లు టీవీ భాష ప్రభావం ఇప్పటి చిన్నారులపై ఉండక మానదు. వరదల పై రాసిన పేరా సూపరు :-)

శ్రీనివాస్ said...

ళెస్స ఫలికితిరి

అప్పుడెప్పుడో దూరదర్శన్ లో షరీఫ్ అనే వాడు షాషణ షబ షమావేసాలు అని అని

నాలోనేను said...

మన భాష ఎంత తప్పుగా మాట్లాడితే అంత గొప్ప అని చలామణీ చేయిస్తున్నారల్లే ఉంది. దానికొక ఫాషన్ అని పేరు.
అసలు అలా మాట్లాడేవాళ్ళందరీ జాబితా ఒకటి తయారు చేసి "భాష రాని భాషాలు" అని అంతర్జాలంలో ఉంచి అభాసు పాలు చెయ్యాలని నాదో చిన్న సూచన. ఏమంటారు?

లలిత said...

'ళ 'బదులూ ల పలికేది ఎక్కువ తెలంగాణా లోనే అని నా అనుమానం.
అయినా మీరెంటండీ .....టి.వి.లో వార్తలు చూస్తూనేవుండాలికాని .....వింటూపోతారా

మైత్రేయి said...

"ళ" కంటే "ష" తోనే ఎక్కువ సమస్య గా ఉన్నదండి. మరీ వినలేక పోతున్నాం.
మానసా ఆచార్య అని ఒక ఆమె R టీవీ లో తెలుగు మీద క్విజ్ చేస్తారు. మొత్తం చాలా చక్కగా ఉంటుంది ఆమె "ష' తో తెగ బాధగా ఉంటుంది. షాంతి , షనివారం అంటూ
అలాగే జయసుధ వత్తులు లేకుండా పలకటం లో ప్రసిద్ధి చెందారు. "బాద" , "రాదా" అంటూ

అబద్దం సిన్మా మీరన్నట్లు తమిళ్ లోనించి డబ్ అయింది. వాళ్లకు ఒక ప్రత్యేకమైన 'ళ' ఉన్నది వాళై పళం , తమిళ్ లో లా . వాళ్ళకు ఆ 'ళ' అంటే పిచ్చి. ఆ 'ళ' మరే భాషలోను లేదు. అది మన 'ళ' కంటే కొంచం వేరు. ఇంగ్లీష్ లో zh అని వ్రాస్తారు. ఆ ళ మీదే ఆ పాట ఉన్నది [:)] . అది తప్పు పలికితే వాళ్లు క్షమించరు.

కన్నగాడు said...

నిజమే చాలా మంది తప్పుగా పలికే మొదటి రెండక్షరాలలో ళ, శ ఉంటాయి(అసలు పలకడమే కాదు రాయడం కూడా ఎంత కష్టమో చూడండి చలికి వంకర్లు తిరిగినట్టు), నిజానికి పలకలేరు పలకలేరు అని చాలా మంది రాసారు కాని ఎలా పలకాలి అని కన్ ఫ్యూజన్.
నాకు గుర్తుండీ మా టీచరమ్మ షే(సే), ష, స లుగా చెప్పినట్టు గుర్తు, ఆంగ్లంలో అయితే ఎలా పలకాలి అనే దాన్ని రాసి చూపగలరు కాని మనకా సౌలభ్యం లేదు. ప్చ్.

te.thulika said...

:) బాగుంది ల,ళ, శ, ష - భలే నవ్వు హాహాహా

LBS said...

[ళ] - నాలుక కొసని నోటి లోపల పైభాగానికి తాకించి [ల] పలకడానికి ప్రయత్నిస్తే వచ్చే ధ్వని.

[శ] - రెండు పెదవుల మధ్య స్వల్పంగా ఈల వేసినట్లు చేసే ధ్వని. ఇది పూర్తిగా [స] గానీ [ష] గానీ కాదు. మధ్యస్థంగా ఉంటుంది.

-- తాడేపల్లి

గీతాచార్య said...

"ఈ పెద్దోల్లున్నారే"అన్న పేడి డైలాగేగా
*** *** ***

ఓ పాపం అందుకేనా చిరంజీవి కూతురినివ్వంది? :-డ్

Srujana Ramanujan said...

:))

Srujana Ramanujan said...

" "ళ" పలకని వాళ్ళు కోకొళ్ళలు..ఛ..కోకొల్లలు!"

Really itz beautiful way of writing. Felt like in that scene. కళ్ళకు కట్టినట్లు. చాలా సహజంగా. Twain like

వీవెన్ said...

:)

ష్రీను అనడం మొదలవలేదా?

సుజ్జి said...

:))

హరే కృష్ణ . said...

వాళ్ళని కెలకడం ఇప్పుడు అవసరమంటారా ..ఒరిస్సా బొర్డర్ లో ఉన్న బ్లాగర్ల దండయాత్ర లకు సెలవు ఇచ్చినట్టు చేసారు..ఆ moderatione మిమ్మల్ని కాపాడాలి ..Amen

తెలుగు కి తెగులు పట్టిస్తున్న ప్రజలకు కళ్ళు తెరిపించేలా
a very nice పొస్ట్..good luck

అబ్రకదబ్ర said...

భాషా ద్రోహుల ముచ్చట్లు భళే భళే. అయితే అరుదుగా దీనికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించేవాళ్లూ ఉంటారు. 'వెళ్లుళ్లి', 'పిళ్లి' .. ఇలా పలికేవాళ్లూ నాకక్కడక్కడా కనపడ్డారు!

ఈ పిల్ ఐడియా ఏదో బాగానే ఉంది. మరి, 'విలేఖరి' అంటూ సాక్షాత్తూ పత్రికలోళ్లే రాసేస్తుంటే ఎవరి మీద పిల్లెయ్యాలి? ఇప్పుడదెంత సాధారణమైపోయిందంటే, 'విలేకరి' అని సరిగా ఎవరన్నా రాస్తే అదే తప్పు అనుకునేంత! 'శాఖాహారం'తోనూ అదే గొడవ.

@మైత్రేయి:

'అళగన్', 'వాళైప్పాడి' వగైరా పదాల్లోని 'ర'కీ, 'ళ'కీ మధ్యరకంగా పలికే అక్షరం గురించే కదా మీరు చెబుతున్నది. అది తమిళులొక్కరికే సొంతం కాదండీ. గ్రీకు భాషలోనూ ఆ అక్షరం ఉన్నట్లుంది. ఆ మధ్య హిస్టరీ ఛానల్లో గ్రీస్ గురించిన ఓ కార్యక్రమంలో ఆ విషయం గమనించాను. ఒకరకమైన చీజ్ పేరులో ఆంగ్ల 'r' అక్షరాన్ని వాళ్లు అచ్చం తమిళ 'zh' లా పలుకుతున్నారు.

Srinivas said...

నాకేమీ నవ్వు రాలేదు.
"ళ" బదులు "ల" వాడినప్పుడల్లా నాకు పుట్టుకొచ్చే కంపరమంతా మళ్ళీ గుర్తు చేశారు. మీడియా ఈ విషయంలో ఇంత ఉదాసీనంగా ఉండడం క్షమార్హనీయం కాదు. ఇంకొన్నేళ్ళకు "ళ" కు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందేమో!
ఈ విషయంలో మీరు గొంతెత్తినందుకు సంతోషం. దీని నిడివి మరి కాస్త పెంచి ఏ ఆదివారపు ఎడిషన్‌లోనో వచ్చే మార్గం చూడండి.

kiranmayi said...

మీ పోస్ట్ చూసి పొద్దున్నే పిచ్చ పిచ్చ గా నవ్వా. మా ఆయనకీ (ఆయన మాతృభాష తమిళం) explain చేశా. పొద్దున్నే ఇద్దరం నవ్వుకున్నాం. కాకపోతే నేను ఎంజాయ్ చేసినంత ఆయన "వరద" వార్తల్ని ఎంజాయ్ చెయ్యలేదు. భాష రాదుగా!!! మీ పోస్ట్ కి వచ్చిన కామెంట్స్ లో కొన్నింటితో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ముఖ్యంగా "ళ" ని "ల" అని పలకటం తెలంగాణా లోనే చాల ఎక్కువ. సరే, వాళ్ళు పలకటం, పలకకపోవటం అటుంచండి. అది వాళ్ళిష్టం. నాకు తిక్క ఎందుకొస్తుందంటే "శ" ని నేను "శ" అంటే నవ్వుతారు. ఎందుకో నాకర్ధం కాదు. పైగా నాతో ఏదైనా మాట్లాడుతుంటే, ఎక్కడైనా "ష" వచ్చినా కాని కావాలని "శ" అని పలకటం. మీరు వ్రాసిన phrases అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. చిన్నపుడు మా తెలుగు టీచర్ అన్నారు "నీరు" అనే పదం singular. కాకపోతే ఆపదానికి plural కూడా "నీరు", "నీళ్ళు" కాదు అని. కాని అందరు మరి "నీళ్ళు" అంటారు. నాకు మాచెడ్డ confusion గా ఉందనుకోండి.

భాస్కర్ రామరాజు said...

భాషాస్వరూపం, రచనాశైలి విషయమ్లో కొన్ని సూచనలు -
ణ, ళల కింద ఒత్తులుగా 'న' 'ల'లు రాస్తే చాలు. ఉదా - వాణ్ని, నీళ్లి, పెళ్లి. వాణ్ణి నీళ్ళు పెళ్ళి అనే రాయాల్సిన పని ల్యా.
*సురభి పెద్ద బాల శిక్ష - బిడ్డిగ సుబ్బరాయన్* నుండి.

సుజాత said...

భరద్వాజ్,
"శ" బదులు "ష"వాడటం దాదాపుగా ఉత్తర భారత ప్రభావమే! కానీ హిందీలో కూడా 'శ" "ష" విడిగా ఉన్నా ఈ పరిస్థితి సంభవిస్తూ ఉండటమే ఆశ్చర్యం!

థాంక్యూ!

భాస్కర్ రామి రెడ్డి గారు,
కమ్మని కవిత్వం వర్షిచే బ్లాగుల వాళ్ళు కూడా భాష విషయంలో బద్ధకం అంటే ఒప్పుకునేది లేదు!

విజయమోహన్ గారు,
గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నారు మీరు! ఏమిటి, టీచర్లకు కూడా రాదా సరిగ్గా ఈ అక్షరాలను పలకడం?

KumarN,
మీకు నవ్వు ఆగిన చోటే నాకు మొదలైంది! ఇంతమందిని పట్టేసుకున్నాను కదాని! :-))

అశ్విన్ బూదరాజు,
అవునండీ, నేనూ విన్నాను!

సుజాత said...

మేథ,
కుర్ర హీరోలంతా ఇలానే ఉన్నారు. నితిన్ భాష వింటే సునాయాసంగా చచ్చిపోవచ్చు. అసలు సీరియస్ నెస్ లేకుండా పోయింది భాష విషయంలో!

ఆంగ్లం లో శ్లాంగులు పనికొస్తాయి కాబట్టి నేర్చుకుంటారు. తెలుగు మాట్లాడకపోతే ఇంట్లో తల్లిదండ్రులే గొప్పగా భావిస్తున్న రోజుల్లో ఎవరినని ఏం లాభం?

వేణూ,
ఇలా సంకరమైపోయిన భాష గురించి అప్పుడప్పుడన్నా ఇలా మాట్లాడుకోకపోతే మీరన్నట్లు కొన్నాళ్లకి అలవాటు పడిపోతాం! అలవాటు పడటం కూడా సహజమే! బ్రాహ్మడు-నల్లమేక కథలాగా ప్రతి చోటా పరిస్థితి ఇలాగే ఉన్నపుడు వినీ వినీ కొంతకాలానికి అదే సరైనదని మనల్ని మనమే నమ్మించుకుంటాం!
రోజూ చచ్చేవాడికోసం ఏడ్చేదెవరు చెప్పండి?

వేణూ శ్రీకాంత్,
థాంక్యూ! సినిమా తాగుబోతుల భాష! కోపంలో నాకు తోచలేదు గానీ సూపర్ గా వర్ణించారు మీరు!

శ్రీనివాస్,
థాంక్యూ! నాక్కూడా గుర్తుంది, షరీఫ్ భాష! ఇప్పుడు లేరనుకుంటాను ఆ బాచ్!

సుజాత said...

@ నాలోనేను ,
మరే!ఈ ఫాషన్ పేరుతో భాష సగం చస్తోంది.భాషకీ ఫాషన్ కీ సంబంధం లేదని వీళ్లకెవరు చెప్తారో!మీరు చెప్పిన అభాసు ప్లాన్ లో ఈ టపా కూడా ఒక భాగమే అనుకోండి. న్యూసు రీడర్ల విషయంలో! :-))

మైత్రేయి గారు,
మీ అబ్జర్వేషన్ బావుంది. ఇదివరలో ళ కి ఇంత దుస్థితి ఉండేది కాదు. శ బదులు ష అనే అక్షరానికైతే దాదాపు అందరూ ఆ తేడాని మర్చిపోయి అలవాటు పడ్డారు. అంత ఘోరం! జయసుధ సంగతి చెప్పక్కర్లేదు. అదేమిటో ఆమెకెప్పుడూ "భార్యా భర్తలు", సుఖ దుఃఖాలు వంటి కఠిన(ఆమెకు) పదాలు తరచూ దొర్లే డైలాగులే వస్తాయి (పాత్రను బట్టి), మన ప్రాణాలు తీయడానికి

తమిళ "ళ " విషయం నాక్కొంచెం ఐడియా ఉంది. zh వాడటం గురించి కూడా! భాష లో తప్పులుంటే క్షమించడానికి వీల్లేదు. నిజమే! భాష ఒక సంస్కృతి ప్రతి రూపం!

కన్నగాడు గారు,
కొన్ని భాషలకు కొన్ని ప్రత్యేకతలుంటాయి. అలాంటిదే మన "ళ"! పలికి చూపించడం తప్ప రాసి చూపించి డెమో ఇవ్వలేం! అయినా మీ సందేహానికి తాడేపల్లి గారు సమాధానం ఇచ్చారు చూడండి!

మాలతి గారు, :-)

గీతాచార్య,
:-)! పాపం, అందుక్కాదులెండి, ఆ కథ వేరు!

Srujana,
థాంక్యూలు!

వీవెన్ గారు,
ష్రీను అనడం ఎప్పుడో మొదలైంది. అలవాటు కూడా అయింది.

నా బ్లాగులో ఇన్నాళ్ళకి మీ మొదటి వ్యాఖ్య! పండగ చేసుకోవాలి నేను వెల్లి...అయ్యో, వెళ్ళి!

సుజ్జి,
:-))

సుజాత said...

హరే కృష్ణ,
మీ హింట్ అర్థమైంది! అమ్మో పొరపాటు చేశానా ఒరియా వాళ్ళ పేరెత్తి? మిస్టర్ బీన్ ని అయినా ఒప్పించవచ్చుగానీ...!

థాంక్యూ!

అబ్రకదబ్ర,
విలేకర్లు రాసే తప్పులు మామూలు మనుషుల కంటే చాలా ఎక్కువ!జిల్లా పేపర్లలో వీళ్ల బండారాలు భలేగా బయటపడుతుంటాయి. వాళ్లని ఏమీ చెయ్యలేం!శాఖాహారం విషయం కూడా నవ్వొస్తుంది. మరీ స్వచ్ఛమైన తెలుగు రాసేస్తున్నాం అనుకుంటారేమో అలా రాసేవాళ్లు!

పిల్ జనాంతికంగా వేసేద్దాం, కానీ మీడియా వాళ్లకు సింహ భాగం వర్తించేలా!

శ్రీనివాస్ గారు,
ఏడవలేక నవ్వుతూ రాసిన టపా ఇది! మీకు కంపరం కలగడమే సహజం! ఈ విషయంలో ఇంతమంది నాకు తోడు ఉన్నారని తల్చుకుంటేనే సంతోషంగా ఉంది.

భాస్కర్ గారు,
అలా రాయడం కరక్టే కాకుండా కన్వీనియెంట్ గా కూడా అనిపిస్తుంది!

సుజాత said...

లలిత,
ప్రాంతాన్ని బట్టి ళ ని ల అని పలకాలి కాబోలనుకునేవారు అని రాసింది ఇందుకే ! తెలంగాణాలో ళ ని ఎక్కువమంది ల అనే పలుకుతారు. ఇక న్యూస్ విషయమంటారా...ఏమిటోనడీ వినడం కూడా అలవాటు అయిపోయింది. బాడ్ హాబిట్!

కిరణ్మయి,టపా నచ్చినందుకు థాంక్యూ!
శ ని శ అని పలికితే కాదు ష అని పలకాలని నన్ను సరి చేసిన వారు కూడా ఉన్నారు.

నీరు కి ఏకవచనం,బహువచనం అంటూ లేకపోయినా "నీరు ప్రవహిస్తోంది" అని "నీళ్ళు ప్రవహిస్తున్నాయి" అని వాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది నాక్కూడా!

సుజాత said...

ఇంత బిజీ జీవితాల్లో కూడా భాష గురించి కాస్త సీరియస్ గా ఆలోచించేవారున్నారని ఈ టపా వ్యాఖ్యాతల్ని చూస్తే అర్థమైంది. చాలా సంతోషం!

ఒక్క ళ మాత్రమే కాదు, ణ ని న అని పలికే వారు కూడా కోకొల్లలే! తెలంగాణా అనే మాటని తెలంగాణా లో "తెలంగానా'అనే పలుకుతారు నూటికి తొంభై మంది, ప్రత్యేక తెలంగాణా వాదులతో సహా! ఇది శోచనీయం!

మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా దుర్గం చెరువు కి వెళ్ళే రోడ్డులో లోక్ సత్తా పార్టీ కార్యకర్త ఒకరు (పేరు తెలీదు) ఒక హోర్డింగ్ ఏర్పాటు చేశారు. అందులో ఇలా ఉంది "అధికారం మనది(ప్రజలది), అయినా "అనిగి మనిగి" బతుకుతున్నాం" !

"అణిగి మణిగి" కాదట

తప్పు ఎవరు చేసినా తప్పే!

ఇలాంటి జాడ్యాలు పిల్లలదాకా పాకకుండా జాగ్రత్త తీసుకోవడమొక్కటే ప్రస్తుతం మనం చేయాల్సిన పని!

వెంకటరమణ said...

:-)

కత్తి మహేష్ కుమార్ said...

హేమిటో! ఈ మధ్య భాషా దోషాల్ని యద్దేచ్చగా క్షమించే విశాలత్వాన్ని అలవర్చుకోవాల్నుకుంటున్నాను మరి.

భైరవభట్ల కామేశ్వర రావు said...

ఈ టపా చదువుతూ ఉంటే చిన్నప్పుడు ఎవరో పాడగా విన్న యీ పాట గుర్తుకువచ్చింది:

భారతదేశం ఒకటే ఇల్లు
భారతజాతికి మీరే కల్లు

అయినా, మరి కొన్నాళ్ళల్లో మీరిలా "తెలుగువాళ్ళు 'ళ' బదులు 'ల' పలుకుతున్నారే" అని బాధపడే రోజులు పోతాయిలెండి!

Ruth said...

అదేంటి? మీరంతా ఇలా ఆవేశపడిపోతున్నారు? నేనీమధ్య చూసిన ఒక తెలుగు వాచకం లో అసలు ళ అనే అక్షరం లేదు. ఎందుకు లేదు అని అడిగితే, అది తీసేసారు అని చెప్పారు. ఋ, ౠ లాగే, ళ ని కూడా తీసేసారంట (మీ పిల్లలెవరైనా చిన్న క్లాసెస్ లో ఉంటె ఒకసారి చెక్ చెయ్యండి.) ఇదే కాదు, క్ష, ఱ కూడా తీసేసారంట. అవన్నీ గ్రే కలర్ లో ఉన్నాయి.
ఇక తమిళ్ విషయానికి వస్తే, వాళ్ళకున్న భాషాభిమానంలో ఒక్క శాతం ఉన్నా, మన తెలుగు గురించి ఇలా బ్లాగుకునే అవసరం ఉండేదికాదేమో !

సుజాత said...

మహేష్,
అందుకేనా, కామెంట్ కూడా తప్పుల్తో రాశారు? ఇలా అయితే మీతో గొడవ పెట్టుకోక తప్పదు.

కామేశ్వర రావు గారు
మీరు రాసిన లైను "పిల్లల్లారా పాపల్లారా' పాటలోదనుకుంటాను!

అంటే ళ ని అంతా త్వరలో మర్చిపోక తప్పదంటారా? అప్పుడు కూడా నాలాంటి మొండివాళ్ళు ఒకరో ఇద్దరో మిగిలే ఉంటారనుకుంటాను!

Ruth

మీ అనుభవమే నాక్కూడా ఉంది. మా పాప (ఒకటో తరగతి)తెలుగువాచకంలో, క పక్కన సున్నా పెడితే (పూర్ణస్వరం) ఏమవుతుందో, క పక్కన రెండు సున్నాలు(విసర్గ) ఏమవుతుందో లేదు.వట్రసుడి (కృ రాయడానికి ) లేదు. కూడా లేదు. (ఋ,ౠ లు చాలా వాచకాల్లో లేవు). ఇదేమిటని అడిగితే వాళ్ల స్కూలు అవే పుస్తకాలు ఫాలో అవుతుందనీ, వీటిని విడిగా నేర్పిస్తామని చెప్పారు.మొహం ఎలా పెట్టాలో కూడా అర్థం కాలేదు.

బొల్లోజు బాబా said...

చాలాబాగుంది పోస్టు.

అప్రస్తుతమైనా చిన్న సందేహం

వత్తు ళ ఎలా వ్రాయాలి?

ళ్ళ లేదా ళ్ల (ఉదా: నీళ్ళు నీళ్లు)

చిన్నప్పుడు స్కూలులో మొదటిదే నేర్చుకొన్నట్లు గుర్తు. కానీ ఇప్పటి ప్రింటులో రెండూ కనపడుతున్నాయి.

ఒక వేళ రెండూ కరక్టయితే వాటి వాడుకలో ఏదైనా సూత్రం ఉందా?

బొల్లోజు బాబా

వేణు said...

బొల్లోజు బాబా గారూ,

వత్తు ళ అంటే - ‘ళ్ళ’యే కదా. వత్తు ల అంటే- ల్ల. ఈ రెండూ వేర్వేరు అయినప్పుడు ‘ళ్ల’ అని రాయటం ఎందుకనే ప్రశ్న సరైనదే.

నీళ్ళు అనే మాటను ‘నీళ్లు’ అని రాసినా ఉచ్చారణలో పెద్దగా తేడా ఉండదు.

పత్రికల్లో హాండ్ కంపోజింగ్ ఉన్న రోజుల్లో ‘ళ్ళు’ అని రాస్తే కింద వరసలోని అక్షరాల మీదకి వచ్చేది. ఉచ్చారణలో కూడా తేడా రావటం లేదు కదా అని సౌలభ్యం కోసం ‘ళ్లు’ వాడటం మొదలెట్టారు. హాండ్ కంపోజింగ్ పోయినా పత్రికల్లో రాసేవారికి అదే అలవాటై కొనసాగుతోంది.

ఇప్పటి పత్రికల్లో నీళ్ళు, నీళ్లు అని రెండు రకాల రూపాలూ కనపడటానికి ఇదే కారణం.

తార్కికంగా చూస్తే- 'నీళ్ళు' అనే రాయాలి మరి!

అన్నట్టు- అసలు ‘నీరు’ అనే మాటను ‘నీళ్ళు’ అని తప్పుగా రాస్తున్నారనే వాదన కూడా ఈ టపా వ్యాఖ్యల్లో వచ్చింది.

‘వేన్నీళ్ళకు చన్నీళ్ళు’ అనే ప్రయోగం కూడా ఉంది కదా మరి?

బొల్లోజు బాబా said...

వేణు గారు
థాంక్సండీ

నీళ్లు అనే పదంతో బ్రౌన్ నిఘంటువులో 121 ఎంట్రీలు ఉన్నాయి

వెన్నెల said...

సుజాత గారు ల,ళ ,స,శ,ష ల సంగతి గురించి నాలాంటి అజ్ఞానులకి అర్దమయ్యెటట్టు బాగా తెలియ చెప్పారు.
మరి అలాగే "న" "ణ" ల గురించి కూడా చెబితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే "ణ" ఏడుస్తుంది తెలుగు లిపిలో "నా'స్తానం' ఎక్కడా అని.?

సుజాత said...

వెన్నెల గారు,
ణ వాడకం కూడా "న" తో రిప్లేస్ అయిపోవడం నెమ్మదిగా జరిగిపోతోంది. పైన ఒక కామెంట్ లో రాశాను చూడండి, తెలంగానా, అనిగి మనిగి అనే మాటలని ఉదాహరిస్తూ! అలాగే కల్యానం, ప్రానం, ప్రయానం,అనుశక్తి(అణు శక్తి)..ఇలా మాట్లాడేవాళ్లు కూడా ఉన్నారండీ! ఏం చేయగలం, ఇలా చెప్పుకుని తృప్తి పడటం తప్ప?

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

[ణ] - నాలుక కొసని నోటిలోపల పైభాగానికి తాకించి లొట్టవేస్తున్నట్లుగా కదిలించి [న] ని పలకడానికి ప్రయత్నిస్తే పుట్టే ధ్వని.

మన విద్యావిధానంలో English Phonetics ని ఒక భాగంగా చేశారు. The Hindu పత్రికవాడైతే ప్రతి కాలేజిలోను అదేదో కార్యక్రమం పెట్టి మఱీ English phonetics ప్రచారం చేస్తున్నాడు. విదేశీ phonetics సరే ! మన మాతృభాష phonetics సంగతేంటనే ఆలోచన ఎవరికీ ఉన్నట్లు కనిపించడంలేదు. తెలుగు మనకి ఎంత మాతృభాషయినా మన ఇష్టమొచ్చినట్లు పలక్కూడదనే జ్ఞానం విద్యావంతులక్కూడా లేదు. Bad pronunciation and spelling are indicative of poor and imperfect education అంటాడొక ఆంగ్ల నిఘంటుకారుడు. మాతృభాషలో ఎడాపెడా తప్పులు రాసి పలికేవాళ్ళక్కూడా ఈ మాట వర్తిస్తుంది.

నా అభిప్రాయంలో - ఖూనీ అయిపోతున్న తెలుగక్షరాలు, మనం ఎంతగా విదేశీ వ్యామోహంలో కూఱుకుపోయి స్వభాషా పరిజ్ఞానాన్ని చిన్నచూపు చూస్తున్నామనే దానికి తార్కాణాలు.

SIVA said...

Sujatagaroo,

Sometime back there was a discussion on Radio plays. At that time I informed you that All India Radio is presently selling CDs Kanyasulkam and Varavikrayam Plays. Just visit the website by clicking on the following link and you will be pleasantly surprised to find these two plays available there:

http://www.andhranatakam.com/Audios.html#kanyasulkam

I hope you would enjoy listening to these old Radio Plays.

భాస్కర్ రామరాజు said...

మీరు సరిగ్గా గమనించక పోయినా తప్పుదిద్దుకుంటున్నా -
*సురభి పెద్ద బాల శిక్ష - బిడ్డిగ సుబ్బరాయన్* నుండి.
బూతు బూతు
*సురభి పెద్ద బాలశిక్ష - బిడ్డిగ సుబ్బరాయన్* నుండి.
ఇది కరెక్టు.

సుజాత said...

శివ రామ ప్రసాద్ గారూ,
నేనే మీక్ ఒక విషయం మీ బ్లాగుకొచ్చి చెప్పాలనుకుంటునే అశ్రద్ధ చేశాను. దసరా సెలవులకు మా వూరు వెళ్ళినపుడు విజయవాడ రేడియో స్టేషన్ కి వెళ్ళానండీ!( మీరు చెప్పినట్లు అక్కడ ఆర్కైవ్స్ సేల్స్ కౌంటర్ లో ఉన్న శ్రీనివాస్ గారు పరవాలేదు. పాత వాటి గురించి కొంచెం సమాచారం ఇవ్వగలిగారు.)అక్కడ కన్యాశుల్కం, పాండవోద్యోగ విజయాలు, కృష్ణ శాస్త్రి లలిత గీతాలు ఇంకా మరి కొన్ని కార్యక్రమాలు సీడీలు కొన్నాను.

ఈ విషయంలో మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా చాలదు.
గుర్తు పెట్టుకుని మళ్ళీ నా బ్లాగుకొచ్చి చెప్పినందుకు మరీ మరీ ధన్యవాదాలండీ!

సుజాత said...

భాస్కర్,
మీరు చేసింది ఎంత సూక్ష్మ సవరణ అంటే మీరు కరెక్ట్ చేశాక కూడా "రెండూ ఒకేలా ఉన్నాయి కదా"అని స్పెల్లింగ్ మిస్టేక్ కోసం వెతికాను. భాస్కర్ గారికి జై!

వేణు said...

భాస్కర్ రామరాజు గారూ,

మీరు కోట్ చేసిన రచయిత ఇంటి పేరులో పొరపాటు దొర్లిందండీ. ఆయన పేరు బుడ్డిగ సుబ్బరాయన్. బాల సాహిత్యంలో కృషి చేసిన ఆయన ఇటీవలే చనిపోయారు.

కొత్త పాళీ said...

సెబాషో!
వొల్లు కుల్లబొడిచేసి కల్లు పీకేశ్శారుగా! :)
మొన్న నా బ్లాగులో పెట్టుకున శ్రీపాద కథ ఆడియో ఓం ప్రథమంలోనే నేను శ ని ష గా పలికానని శ్రోతలు అభియోగాలు మోపి నా శుద్ధ ఉచ్ఛారణా హృదయాన్ని చాలా గాయపరిచారు!

సుజాత said...

కొత్తపాళీ గారూ,
అబ్బబ్బ, చెవులు చిల్లులు పడుతున్నాయి! అన్ని "ల" లా?

గీతాచార్య said...

ల ళ శ ష హేమిటో ఈ మాయ. అందమైన అక్షరాలు అవి. అసలు తెలుగుకే ఉన్న ప్రత్యేకత అవి. వాటికే మంగళం పాడి మన ప్రత్యేకతని దెబ్బేసుకుంటూన్నాం

భాస్కర్ రామరాజు said...

వేణు -
అవును!! నిజమే..ఐతే ఇది టిపో. ఏమైనా తప్పు తప్పే.

శేఖర్ పెద్దగోపు said...

బాగుందండీ...కొన్నాళ్ళు పోతే అక్షరమాలలో అక్షరాల సంఖ్య 52 కంటే తక్కువైపోతాయేమో!!

anveshita said...

ఇప్పుడు అర్థమౌతోంది... సంస్కృతం ఎలా కనుమరుగయ్యిందో!!!!

anveshita said...

ఈ సందర్భంగా వారంవారం ప్రసారమయ్యే లక్ష్మీ టాక్ షో గురించి గుర్తు చేస్తే తప్పులేదనుకుంటున్నా....

ఇంకో ప్రశ్న.. ని... ఉంకో ప్రశ్న గా పలకడం ఆవిడకే చెల్లు

భావన said...

కొంచం లేట్ గా వచ్చినట్లున్నాను. :-( ఎందుకులెండీ ఈ బాధ లు మొదలు పెడతారు. స ను శ కలిపేసి కంది పచ్చడి చేసి ష చేసి, జ ను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పలికి, చ ను వాళ్ళ కు తోచినట్లు వత్తి, ఈ మధ్య న మన నేస్తం క్రికెట్ గురించి ఏదో "గృహ హింసా చట్టం" తేవాలి అన్నారు , అది కాదు కాని ఈ "పద హింసా చట్టం" కోసం ప్రయత్నిస్తే పోతుంది అనుకుంటా..

jeevani said...

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని

అడ్డ గాడిద (The Ass) said...

LOL

Vamsi Krishna said...

sujatagaaru,

good article.....

Though i am ashamed to say this, as a matter of fact, I had to struggle a lot to figure out where/when to use 'La' and 'la'. Of course, I have learned it...but, some how (I have to curse myself for this) faded from my memory..
It would be great if you can take a class on it in a post:D.... Perhaps it would be more constructive criticism:).

--Vamsi

Vasu said...

ఈ టపా చూడగానే నేను నా శ్రీమతిని మొదటి సరి కలిసిన సందర్భం గుర్తొచ్చింది. అప్పుడు సరిగ్గా వీటి గురించి గంట కి పైగా మాట్లాడుకున్నాం (నేనే మాట్లాడుతూ ఉన్నాను :) ).

మీరు చెప్పిన అబద్దం లో పాట బావుంటుంది. అలాటిదొకటి తియ్యాలని అవిడియా తమిళ దర్శకుడికి వచ్చింది కానీ మనకి లేదు.

కొన్నాళ్లు అయితే ళ, ణ, శ తెలుగు వచాకాలలో ఎలాగూ ఉండట్లేదు, వాడుక లో కూడా ఉండవేమో.

'శ' 'ష' విషయం - తెలుగు ని అంత స్పష్టంగా పలికే బాలూ గారు కూడా శ ని ష అని పలుకుతరెందుకో నాకర్థం కాదు.

ఇక్కడ కామెంట్లలో ఒక విషయం తెలిసింది నాకు - ళ కి వత్తు కింద ల సరిపోతుందని. థాంక్సులు.

neelaanchala said...

కత్తిలాంటి పోస్టు! చాకుల్లాంటి కామెంట్సూ!
భీభత్సం!

Praveen Sarma said...

"ఱ" గుణింతం కూడా రాని వాళ్ళు ఉన్నారులెండి.

పవన్ said...

దిని బట్టి నాకు అర్ధం అయింది ఏమనగా

తేలిసిన తెలుగు సినిమా అంత
తేలియని తేలుగు సిరియాల్ అంత అని..హుమ్

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

సుజాత గారూ నమస్కారం.
పద్యాలతో కామెంట్లు వేసి మీకు చికాకు కలిగిస్తునానేమో తెలియదు.

మీరు చెప్పిన విషయం మీ అంత బాగా కాకున్నా నేను కూడా ఎప్పుడో ఎక్కడో చెప్పినట్లు గుర్తు.

అచ్చులందున ఌఌలయ్యొ నంతరించె
ళ ణ లు రూపొందెనింపుగా లనలుగాను
బండిరా వ్రాయకున్న నిబ్బందిలేదు
తెలుగు వృక్షమ్ము కక్కటా తెగులుబట్టె

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ said...

సుజాత గారూ నమస్కారం.
పద్యాలతో కామెంట్లు వేసి మీకు చికాకు కలిగిస్తునానేమో తెలియదు.

మీరు చెప్పిన విషయం మీ అంత బాగా కాకున్నా నేను కూడా ఎప్పుడో ఎక్కడో చెప్పినట్లు గుర్తు.

అచ్చులందున ఌఌలయ్యొ నంతరించె
ళ ణలు రూపొందెనింపుగా లనలుగాను
బండిరా వ్రాయకున్న నిబ్బందిలేదు
తెలుగు వృక్షమ్ము కక్కటా తెగులుబట్టె

సుజాత said...

కామేశ్వర శర్మ గారూ అంత మాట అనకండి. పద్యాలు రాసేంత పాండిత్యం నాకు ఎలాగూ లేదు. మీరు నా బ్లాగులో రాస్తే చదివి సంతోషించడం నా అదృష్టం అనుకుంటాను

Praveen Mandangi said...

ఇదంతా ఫోనాలజీకి సంబంధించిన సమస్య. నిన్న పేరు భాస్కరరావు గారనే తెలుగు పండితులుగారు ఈ విషయం నాకు చెప్పారు. నేను తరువాత వివరంగా చెపుతాను కానీ ఈ లింక్ చదవండి: https://plus.google.com/111113261980146074416/posts/R4oTchiGXjN

Mediocre to the Core said...
This comment has been removed by the author.
Mediocre to the Core said...

ఏదో blogosphereలో చలామణీ అవుతున్న అజ్ఞాత తెలుగు మనిషినైన నన్ను, కడుపుబ్బ నవ్వించి నా చేత తెలుగులో కోమెంటించేంత పని చేసారు. ధన్యవాదాలు. మరొక్క మాట- మీరు ఇచ్చిన లింక్ పనిచేయకపోతే, అబధ్ధం పాటకోసం గూగుల్లో వెతికితే నేను సరైన స్పెల్లింగ్ ఇంగ్లీషులో వ్రాస్తే "అందమైన అబధ్ధం" అనే సినిమా అని వచ్చింది. తర్వాత స్పెల్లింగ్ మారిస్తే మీరు చెప్పిన పాట దొరికింది. వత్తులు అంటే "దీపానికి వాడుకునేవి" అనుకుంటారేమో భవిష్యత్తులో! హతవిధీ!ఆ సంకెల చూసుకోండి!
https://www.google.co.in/search?q=abaddam+songs+la&oq=aba&aqs=chrome.1.69i57j69i59l2j69i60l3.2967j0j7&sourceid=chrome&es_sm=93&ie=UTF-8

Post a Comment