November 9, 2009

సరితా దేవి డైరీ-సరోజ డైరీ!


కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవలికను గుర్తు తెచ్చుకుని పంచుకునే ప్రయత్నమే ఈ టపా.




పది పన్నెండేళ్ళ వయసులోనే నవలలు చదివేసిన నాకు కుటుంబరావు గారి పరిచయం కేవలం పది పన్నెండేళ్ళ క్రితం జరగడం నాకే ఆశ్చర్యం! లోకం గొప్ప రచయితలుగా ముద్ర వేసిన కొందరు రచయితల రచనలు నన్ను అంతగా ఆకట్టుకోలేకపోవడం వల్ల గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫుట్ పాత్ మీద కుటుంబరావుగారి నవలలు కొనడంతో ఆయన రచనా ప్రపంచం తలుపు తట్టాను. ఆ నవలికలు నన్ను అద్భుత రస ప్రపంచంలోకి విసిరి కొట్టాయి. మిగిలిన సంపుటాల కోసం ఎంతగా ప్రయత్నించినా అప్పటికే విశాలాంధ్రలో స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు.



కానీ ఆశ్చర్యకరంగా రెండు నవలా సంపుటాలు హ్యూస్టన్ మీనాక్షి ఆలయం లోని పుస్తక విక్రయకేంద్రంలో దొరికాయి.



కుటుంబరావు గారి శైలి గురించి, ఆయన పాత్ర చిత్రణ గురించీ,ఇంకా రచనా చమత్కృతి గురించీ వారి శత జయంతి సందర్భంగా అనేక ఆన్ లైన్ పత్రికల్లోనూ, బ్లాగుల్లోనూ వ్యాసాలు వచ్చాయి. అందువల్ల మళ్ళీ ఇక్కడ దాన్ని నా దృష్టి కోణం నుంచి వివరించే ప్రయత్నం, చెయ్యను కానీ ఆయన రాసిన ఒక నవలికను పరిచయం చేయాలనుకుంటున్నాను.



ఆలిండియా రేడియో సీరియల్ గా ప్రసారం చేయడానికి డైరీ రూపంలో ఒక పెద్ద కథ రాయమని కుటుంబరావు గారిని కోరినపుడు ఆయన 'సరితాదేవి డైరీ"ని రాశారు. అది ప్రసారం కూడా అయిపోయాక కుటుంబరావు గారికి అది అసంపూర్ణంగా ఉన్నట్లు తోచింది. ఆయన మాటల్లో ఇలా అంటారు

"కథ అయిపోయింది, అయిపోలేదు కూడా! ఎందుకంటే కథ తాలూకూ చాలా విషయాలు ఈ డైరీలోకి రాలేకపోయాయి.కష్టపడి కథ ఆలోచించిన రచయిత దాన్ని పాఠకులకు(శ్రోతలకు)అందజేయలేకపోయిన రచయిత ఎంత ఆందోళన చెందుతాడో ఎవరైనా సులువుగా ఊహించవచ్చు! సరితా దేవి డైరీతో రేడియో మాసం దాటింది కానీ నా పని గడవలేదు.అందుచేత సరితా దేవి డైరీ కి అనుబంధంగా సరోజ డైరీ రాశాను"!



ఈ రెండు డైరీలలో వచ్చే పాత్రలతో తర్వాత ఆయన "కామినీ హృదయం" అనే నాటిక కూడా రాశారు.



ఒకే కథను రెండు వైపుల నుంచీ ఇద్దరు తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా అద్భుతంగా చెప్పిన కథే ఈ "సరితా దేవి డైరీ" సరోజ డైరీలు!

కథ విషయానికొస్తే ........


సరితాదేవి ఒక మధ్యతరగతి తల్లి. ఆడపిల్ల తల్లి!

కథ చాలా కాలం నాటిది కనుక ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన కూతురికి అప్పుడే పెళ్ళి చెయ్యాలని,గొప్ప వరుడిని తేవాలని ఆరాటపడే సగటు తల్లి! చాలా మంది మధ్యతరగతి వాళ్ళకుండే రోగం....అదే గొప్పింటివాళ్లతో పోటీ పడాలని,ఒక్కోసారి గెలవాలని కూడా అనుకునే అభిజాత్యపు రోగం అంతో ఇంతో సరితాదేవిక్కూడా ఉంది.



రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి అమ్మాయి సావిత్రి, సరితా దేవికూతురు సరోజా స్నేహితులు.ఇద్దరూ పెళ్ళికెదిగిన వాళ్ళే! ఈ నేపథ్యంలో సరితా దేవి తమ్ముడు వాసుతో పాటు ఢిల్లీ నుంచి మనోరంజన్ అనే అందగాడూ, మంచి ఉద్యోగస్తుడూ అందునా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలరూ వస్తాడు.

 ఇటు సరితాదేవి, అటు సావిత్రి తల్లీ అతడిని తమ తమ కూతుళ్లకు వరుడిగా చేసెయ్యాలని ఆరాటపడతారు.అతడు తిరిగి ఢిల్లీ వెళ్ళేవరకూ కూతురి పట్ల అతడికి ఆకర్షణ కలిగించాలని,సరోజను మిసెస్ మనోరంజన్ గా చేసెయ్యాలని సరితా దేవి చేసిన ప్రయత్నాలే ఆమె రాసుకున్న డైరీ!



మరో వైపు సరోజ మనో రంజన్ వైపు ఆకర్షితురాలవుతూనే,అతడిని ఇష్టపడుతూనే తన తల్లి చేసే "చవకబారు
ప్రయత్నాలు " తనకెంత చిరాకు పుట్టించాయో తన డైరీలో రాసుకుంటుంది.



సావిత్రితో మనోరంజన్ పెళ్ళి స్థిరమైపోయిందనే వార్త రూఢిగా తెలిశాక సరితాదేవి నిరాశలో కూరుకుపోతుంది.ఇది ఒక రకంగా ఆమెకు ఓటమి కూడా కదా సుశీల ముందు! ఆమె తమ్ముడు వాసు "సరదాగా నాల్రోజులు ఢిల్లీలో గడిపి వస్తుంది సరోజను పంప"మనడం,ఢిల్లీ వెళ్ళాక అక్కడ సరోజ, రంజన్ లు పెద్దవాళ్లకు తెలీకుండా వాసు సహాయంతో రిజిస్టర్ పెళ్ళి చేసుకోవడం కథలో చివరి ట్విస్టు!



మనో రంజన్ తనను ఇష్టపడుతున్నాడనీ, తననే పెళ్ళాడతాడనీ సరోజకు నిశ్చయంగా తెలుసు. మరో వైపు సావిత్రి తల్లి సుశీల చేసే ప్రయత్నాల మీద కూడ ఆమెకు అనుమానంగానే ఉంటుంది.
ఇంకో వైపు తల్లి! ఇలా నలుగుతూనే సరోజ ఈ కథంతా డైరీలా మనకి చెప్తుంది. తేదీల వారీగా రాసే డైరీల మీద కుటుంబరావు గారికి ఆట్టే నమ్మకం లేకపోవడం వల్ల సరితా దేవి, సరోజ... కథ చెప్పుకుంటూ వెళతారంతే!



రెండూ ఒకటే కథ అయినా ఎవరి వైపు నుంచి వారు చెప్పడం వల్ల రెండూ కొత్తగానే అనిపిస్తాయి పాఠకులకి!

ఇదొక అద్భుత రచనా ప్రక్రియ అనిపిస్తుంది చదువుతున్నంత సేపూ, ఒకటే కథ రెండు వెర్షన్లలో ఇంత ఆసక్తి కరంగా మలచడం !.

ఒక మధ్యవయస్కురాలైన తల్లి, ఒక యుక్తవయస్కురాలైన కూతురు ఈ ఇద్దరి మనస్థత్వాలను కొ.కు ఆవిష్కరించిన తీరు అద్భుతంగా తోస్తుంది.


సావిత్రి, తన తల్లి ఎంత చెప్తే అంతని, బుద్ధి మంతురాలనీ , తన కూతురు సరోజ మాత్రం పెంకిదనీ, తన మాట విని బాగుపడతామనే ఆలోచనే లేదనీ సరితాదేవి కంప్లెయింట్!

 మరో పక్క సరోజేమో "సావిత్రి వాళ్ళమ్మ మాట వింటుందనీ నేను వినననీ నా మీద కోపం!నేనూ విందునేమో అమ్మక్కూడా సుశీల గారికున్నంత నాగరికత ఉంటే! 'నేను నీకు అమ్మనని ఎప్పుడైనా అనిపిస్తుందిటే? నేనేం చెప్పినా నీ చెడు కోసమే చెబుతున్నాననుకుంటున్నావా?' అని నన్ను నిలవేస్తుంది. ఆవిడకర్థమయ్యేట్టు చెప్పడం నాకు చాత కావడం లేదు.ఆవిడ నా మీద ఆపేక్షతోనే చెబుతుంది.కానీ ఆవిడ చెప్పినట్లా చేస్తే నేను నవ్వులపాలైపోవలసిందే! ఆవిడ నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోలేదు. అటువంటి మనిషి ఆపేక్షకు విలువేమిటి?"అని ఆలోచిస్తుంది.



నలుగురిలో కూతురు అందంగా కనిపించాలని ఏ తల్లికైనా ఉంటుంది.ఇదే తాపత్రయం సరితాదేవి కూడా పడి సరోజ ను చిత్తం వచ్చినట్లు అలంకరించి మనోరంజన్ కి కాఫీలు, టీలూ అందించమంటుంది. సరోజేమో సహజంగా ఉండాలనుకుంటుంది.



"నన్ను ఉన్నట్టు ఉండనివ్వక ఏ రాధలాగో, మహాలక్ష్మి లాగో, అనసూయ లాగో చేస్తానంటుంది. నాకు చిరాకెత్తి 'నేనేం బట్టల దణ్ణెం అనుకున్నావా, నీకిష్టమైన చీరల్లా నా మీద వేసి చూడ్డానికి? అని అడిగేస్తాను. దాంతో ఆవిడకు కోపం వచ్చేస్తుంది"అని మనతో వాపోతుంది.



తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలని ఆ కాలంలోనే(ఎందుకంటే ఇప్పటికంటే అప్పటి ఆడపిల్లలు తల్లి చెప్పినట్లు వినేవాళ్లని కదా అందరం అనుకుంటాం) రచయిత ఎలా పరిశీలించారా అని ఆశ్చర్యం వేస్తుంది.



మనస్థత్వాలను కుటుంబరావు గారు మంచినీళ్ళ ప్రాయంగా అప్పటికప్పుడు విశ్లేషిస్తారని ఆయన రచనలు చదివిన వారికెవరికైనా అర్థం కావలసిందే! "తల్లి లేని పిల్ల" లో "మనుషుల సంస్కారం"అనే విషయాన్ని విశ్లేషించిన తీరు నేను ఎప్పటికీ అబ్బురపడే విషయమే! కొత్తకోడలు నవల్లో హనుమాయమ్మ గారి పాత్ర ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ దాదాపుగా కనపడే తల్లి పాత్ర!

ఈయన ఇన్ని రకాల మనుషుల్ని ఎప్పుడు చదవగలిగారని విస్మయం కలుగుతుంది. ఎందుకంటే ఒక రచనలో కనిపించిన మనో విశ్లేషణ మరో రచనలో కనిపించదు మరి! ఇటువంటి విస్తృత విశ్లేషణ అనేక కథల్లో, నవలల్లో, నవలికల్లో అసంఖ్యాకంగా చూడొచ్చు! ఎన్నని పేర్కొనగలం?



కుటుంబరావు గాని నవలల మీద పరిశోధన చేయదలిస్తే కొన్ని వందల అంశాల మీద వందల కొద్దీ చేయవచ్చు!



విశాలాంధ్ర  పబ్లిషింగ్ హౌస్ శ్రీ కేతు విశ్వనాథ రెడ్డి సంపాదకత్వంలో వేసిన సంపుటాలన్నీ చాలా రోజుల క్రితమే అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పుడు అడిగినా సరైన సమాధానం అక్కడ దొరకదు. "వస్తాయండీ" అనో "వేయాలని చూస్తున్నారండీ'అనో "చెప్పలేమండీ" అనో తప్పించి!



ఈ లోపు విరసం ఈ బాధ్యతను తీసుకుని "కొడవటిగంటి రచనా ప్రపంచం" పేరుతో ఆయన రచనలన్నింటినీ 16 సంపుటాలుగా అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టడం శుభపరిణామమే!



మార్చి నెలలో దీనిగురించి వేణువు బ్లాగులో కొడవటిగంటి రచనా ప్రపంచం పేరుతో ఒక టపా వచ్చింది. ఆ టపా ద్వారానే నేను ఈ సంపుటాలన్నింటికీ తెప్పించే ఏర్పాటు చేయగలిగాను. ఇప్పటికే నాల్గు సంపుటాలు అందాయి కూడా! ఈ కొత్త సంపుటాల్లో విశాలాంధ్ర సంపుటాల్లో లాగా ఫుట్ నోట్స్ లేవు. వివరాలు అవసరమైన చోట్ల ఆ ఫుట్ నోట్స్ ఉంటే బావుండనిపిస్తుంది. కానీ విశాలాంధ్ర సంపుటాల్లో అవి మరీ ఎక్కువై విసుగెత్తిస్తాయి, కథను పక్కదారి పట్టిస్తూ!



ప్రతి సాహిత్యాభిమాని లైబ్రరీ లోనూ  ఉండదగ్గ ఈ పదహారు సంపుటాలూ ప్రీ-పబ్లికేషన్ ఆఫర్ కింద అసలు ధర కంటే తక్కువ ధరకే లభించే సదుపాయం కూడా ఉంది. ( నాకు అలాగే లభించాయి.) విరసం వేసిన సంపుటాలు కావలసిన వారు పూర్తి వివరాల కోసం "కొడవటిగంటి రచనా ప్రపంచం ". టపాలో చూడవచ్చు!

30 comments:

భావన said...

సుజాతా..., ఎప్పటి మాటే, చాలా బాగుంది మీ పుస్తక పరిచయం. ఈ పుస్తకం నేను కూడా చదివేను. అవును కోకు గారు అంత బాగా ఎలా విశ్లేషించే వారా మనుష్యులను అని ఎప్పుడూ అబ్బురం గానే వుంటుంది. ఒక్క కధ తీసుకుంటే చాలు ఒక పోస్ట్ రాయొచ్చు. మంచి పుస్తకం. మంచి పరిచయం..

Saahitya Abhimaani said...

బాగున్నదండి కొడవటిగంటివారి డైరి రచనా ప్రాభవం. డైరీలలోని విషయాలను, లేదా ఉత్తర రూపంలో వ్రాస్తూ కథలను నడపటం ఒక చక్కటి ప్రయోగం. అనేకమంది 1960-70లలో ఈ ప్రక్రియ వాడినా, కొడవటిగంటివారి ప్రావీణ్యం ముందు వీగి పొయ్యారు. మంచి నవలికలు పరిచయం చేశారు. ధన్యవాదాలు.

సరిగ్గా గుర్తు లేదు, గొల్లాపూడి మారుతీ రావుగారు అనుకుంటాను ఒక నవలలో, ఒక అధ్యాయం ప్రస్తుత కథ, ఆ తరువాతి అధ్యాయం ఫ్లాష్ బాక్, చివరకు రెండూ కలుపుతూ, నవలా రచనలో ఒక చక్కటి ప్రయోగం చేశారు.

కొడవటిగంటి వారి శత జయంతి సంవత్సరం సందర్భంగా, ఇలా అనేక వ్యాసాలు సాహిత్యం మీద అభిమానమున్న వారందరూ వ్రాయాలని నా ఆకాంక్ష.

Kathi Mahesh Kumar said...

మన తెలుగోళ్ళు నిజంగా గొప్పోళ్ళండీబాబూ! "గొప్పరచయిత" అని పట్టంగట్టేసికూడా సామాన్య పాఠకుడికి దూరం చెయ్యొచ్చన్న మహత్తరమైన ఆలోచన మనోళ్ళకే వస్తుంది. ఏదిఏమైనా ప్రభుత్వం పుణ్యమా అని తొమ్మిదోతరగతిలో కొడవటిగంటి గారి ‘చదువు’ నవల మాకు ఉపవాచకంగా ఉండేది. అప్పట్నించీ దొరికిన పుస్తకాలన్నీ చదివాను. ఇది నాకళ్లబడలేదండోయ్! ఇప్పుడు మీదగ్గరుందన్నారు..ఇక..ఇస్తే చదివి తరిస్తాం!

కొత్త పాళీ said...

చలంకి లాగానే కొకుని కూడా సభ్యప్రపంచం ఒక మూసలో, తమకి కన్వీనయెంతయిన మూసలో పోసేసి మూత కప్పేసి ఇక ఆయన విషయం మరిచిపోయిందనుకుంటా.
కానీ కొకు అంతకంటే తెలివైనవాడు. మూసలో వొదిగేవాడు కాదు. ఆయన పాత్రల్ని విశ్లేషించేవాడు అనేది తప్పుభావన. విశ్లేషణ చేసే బాధ్యత విమర్శకులది. కథని సృష్టించేవాడెప్పుడూ తన పాత్రల్ని విశ్లేషించడు. అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. వీలయితే వాటిల్లోకి పరకాయ ప్రవేశం చేసేందుకూ యత్నిస్తాడు. అదీనూ, మగాడు స్త్రీపాత్రగురించి రాయడమంటే .. అది భగీరధ ప్రయత్నమే. తెలుగు మగ రచయితల్లో ఆ గంగని నేలమీదికి దించిన భగీరథులు ముగ్గురే నాకు కనిపిస్తున్నారు .. గురజాడ, చెలం, కొకు! కొకు స్త్రీపాత్రల మీద ఎవరన్నా ఒక పీహెఛ్డీ సిద్ధాంతం రాయొచ్చు.
సుజాతగారూ, మంచి పరిచయం. అభినందనలు.

వేణు said...

కొ.కు. రచనల్లో ఒక ప్రత్యేకతా, విశిష్టతా ఉన్న నవలికను పరిచయం చేసినందుకు అభినందనలు! మీరు రాసిన తీరు చాలా బావుంది.

ఒకే కథను రెండు వైపుల నుంచీ, అది కూడా తల్లీ కూతుళ్ళ డైరీల ద్వారా చెప్పటం... రెండు వెర్షన్లలోనూ ఆసక్తి కరంగా మలచడం సాధారణ విషయం కాదు! కొ.కు. లాంటి చేయి తిరిగిన రచయితకు అది సులభ సాధ్యమేననుకోండీ.

మనస్తత్వ విశ్లేషణలో కొ.కు. ప్రతిభ అపారం. ఆయన రచనలెన్నో దీన్ని రుజువు చేస్తాయి!

కొ.కు. రచనల సంపుటాల గురించి చెప్పాలంటే... విశాలాంధ్ర ప్రచురణల కంటే మెరుగ్గా, ప్రామాణికంగా ఇప్పుడు వి.ర.సం. ప్రచురణలు వస్తున్నాయి. ఈ ‘కొడవటిగంటి రచనా ప్రపంచం’ సంపుటాలను సాహితీ అభిమానులు సద్వినియోగం చేసుకోవాలని నా అభిలాష!

Anonymous said...

మేడమ్,
పరిచయం చాలా బావుంది! ఈ పుస్తకాలు ఇప్పుడు లభించకపోవడం వల్ల చదిఏ అదృష్టం మా బోటి వారికి లేదని బాధ పడుతూ ఉండగా చివర్లో మీరు ఇచ్చిన సమాచారం సంతోష పరిచింది. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, పరిశీలించడానికి మహా రచయితల రచనలు పనికొస్తాయని ఇటువంటి రచయితలను చూసే అన్నారేమో!

Anonymous said...

సుజాత గారూ,
చాల్రోజులకి ఇటొచ్చాను. మంచి టపా చదివాను. కుటుంబరావు గారివి చదువు బాగానే దొరుకుతోంది ఎక్కడ బట్టినా! మిగిలిన పుస్తకాలేవీ దొరకడం లేదు.

అనుభవం అనే నవల ఒకసారి బంధువుల ఇంట్లో చదివాను. పార్వతి పాత్రను మల్చిన తీరు అద్భుతం! ఒక జీవిత కాలం పాటు ఒక స్త్రీ అనుభవాలను ఈ నవల్లో పొందుపరుస్తారు రచయిత.సంప్రదాయక కుటుంబంలో పుట్టి, పరిస్థ్తితుల వల్ల వ్యసన పరుడైన భర్తను కూడా కాదనుకుని ఉన్న ఒక్క కొడుకునీ తన చెప్పు చేతల్లో పెంచాలనుకుని ఆ కొత్త నెత్తురు తో జత పడలేక చివరి క్షణాల్లో "నిన్ను ఎట్లా పెంచాలో తెలీక దూరం చేసుకున్నాను "అని బాధపడుతుంది. చదివారా మీరు?

మొత్తానికి మంచి వార్తే చెప్పారు. పుస్తకాలు కొని పెట్టుకుని తీరిగ్గా చదివెయ్యాలి పరీక్షలయ్యాక.

సుజాత వేల్పూరి said...

మహేష్,
రచయిత నిజంగా గొప్ప వాడైతే అతన్ని పాఠకులనుంచి ఎవరూ దూరం చేయలేరు. పట్టాలు గట్టినంత మాత్రాన మామూలు రచయిత గొప్ప వాడూ అయిపోడు కదా!

చదువు నవల విశాలాంధ్రలో దొరుకుతూనే ఉందే! నా దగ్గరకూడా ఉంది. మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చదువుతాంటే మిగతావి కూడా ఇస్తా! కానీ చదువు కంటే ఆకట్టుకునే రచనలు కొ.కు వి చాలా ఉన్నాయి. నాకు చదువు కంటే తల్లి లేని పిల్ల, సవతి తల్లి ,మరి కొన్ని బాగా నచ్చాయి.

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారూ,
" కొకు అంతకంటే తెలివైనవాడు. మూసలో వొదిగేవాడు కాదు.భలే చెప్పారు సుమా! పాత్రలని విశ్లేషించడం విమర్శకుల పనే గానీ కొ.కు ఆ పని విమర్శకులకు చాలా తక్కువగా మిగిల్చారనిపిస్తుంది నాకు. మనుషులని, మనస్థత్వాలను ఆయన ముందే ఎవరి ఊహకూ అందనంతగా విశ్లేషించి పెట్టేసేవారు కదా! ఇదే నేను టపాలో కూడా చెప్పింది.

కొ.కు తన స్త్రీ పాత్రలని ఎంత సహజంగా వీలైతే అంత సహజంగా ఉంచారు. స్త్రీలకు తప్పనిసరిగా రచయితలు పెట్టే సౌకుమార్యపు ఆభరణాలేవీ ఆయన తొడగలేదు. వాళ్ళకూ అందరి మనుషుల మల్లేనే ఆశలూ, విజయకాంక్షా,భావోద్వేగాలూ ఉన్నవి ఉన్నట్లుగానే ఉంచారు.అందుకే ఆ పాత్రలు మిగతా రచయితల స్త్రీ పాత్రకలంటే భిన్నంగా ఉంటాయి.

కొత్త కోడలు లో హనుమాయమ్మ, కులం లేని పిల్ల లో శాంత, సవతి తల్లి లో వెంకమ్మ, రాజ్యం, తిమింగలం వేటలో ఇందిర..ఇవన్నీ అలా సహజాతి సహజంగా కేవలం మనుషుల్లా ప్రవర్తిస్తాయి.

మీ వ్యాఖ్య చదివాక కేవలం ఆయన సృష్టించిన స్త్రీపాత్రల మీద ఒక టపా రాయాలనిపిస్తోంది.

కార్తీక్ said...

sujatha gaaru

kottagaa mee blaaguku ravadam valla o manchi rachayitha gurinchi telusukune avakaaasamlabinchindi...

danyavadalandi...

www.tholiadugu.blogspot.com

రమణ said...

పుస్తక పరిచయం బాగుందండీ! కొత్తపాళీ గారి వ్యాఖ్య ఆసక్తికరం. రెండు సంవత్సరాల క్రితం ఆయన గురించి విన్నాను. కేవలం రెండు మూడు కధలే చదివాను. ఇక్కడ వ్యాఖ్యలు చూస్తుంటే కొకు గారి సాహిత్యం వెంటనే చదివేయాలనిపిస్తుంది. ధన్యవాదాలు. చదువు నవల జాలంలో దొరుకుతుందండీ. గ్రంధాలయాలకీ, పుస్తకాల షాపులకి దూరంగా ఉన్నవారు ఇక్కడ చదువుకోవచ్చు లేక దిగుమతి చేసుకోవచ్చు.

http://www.new.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data_copy/upload/0071/281&first=1&last=189&barcode=2990100071276

మురళి said...

చాలారోజుల క్రితం చదివానండీ... లీలగా గుర్తుంది... మళ్ళీ చదవాలి...

sunita said...

మంచిపరిచయం. నేను కూడా చదివాను.

నేస్తం said...

సుజాత గారు చక్కని పరిచయం.. వెంటనే తెచ్చుకుని చదివేయాలనేంత ఆశక్తి కలిగించారు.. హూం మరి ఎప్పుడు చదువుతానో ..

నిషిగంధ said...

మంచి పుస్తకానికి మంచి పరిచయం!!

"గొప్ప రచయితలంటే భయం ఏర్పడి ఆయన రచనల జోలికి పోలేదనుకుంటాను. "

ఇది నాకు కూడా పూర్తిగా వర్తిస్తుంది.. కొ.కు పుస్తకాలు ఎన్నోసార్లు ఎదురుగా కనబడుతున్నా చూడనట్టు పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు కోకొల్లలు.. కానీ విరసం వారి కధా సంపుటి (మొదటిది) ధైర్యం చేసి కొని చదవడం మొదలుపెట్టాక నాది ఎంత అపోహో అర్ధం అయింది!

సుజాత వేల్పూరి said...

భావనా,
నిజమే! ఒక్క కథ తీసుకుని ఒక పోస్టు రాసెయ్యొచ్చు! అంత stuff ఉంటుంది కథలో!

శివరామ ప్రసాద్ గారూ,
అసలు కుటుంబరావు గారికి ఎదురు లేదండీ! ఇంతే చెప్పగలను!

కొత్తపాళీ గారు,
ఇందాక చెప్పడం మర్చిపోయాను. గురజాడ, చలం, కొ.కు ఈ ముగ్గురు సృష్టించిన స్త్రీ పాత్రలూ సహజంగా మనుషులల్లే ప్రవర్తిస్తాయి, స్త్రీత్వం సౌకుమార్యం అంటూ ముసుగులేసుకోకుండా! అందుకే ఆ స్త్రీ పాత్రలు విడిగా, విశేషంగా కనిపిస్తాయి.

కిరణ్ కుమార్,

ధన్యవాదాలు!

నీలాంచల,
ధన్యవాదాలు! సమీక్ష రాయడంలో ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి కదండీ! అందరూ పాత్రల్ని విశ్లేషిస్తూ కూచోలేరు. సమీక్ష ఎలా రాయాలో ఇల్యా ఎహ్రెన్ బర్గ్ 'రచయితా- శిల్పమూ:" పుస్తకంలో రాస్తాడు. ఒకసారి ఆ పుస్తకం గురించి సమీక్ష రాస్తే సరి!:-))! అన్నట్లు అనుభవం నవల నాకూ నచ్చుతుంది.

వేణూ,
మీకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి నేను. మీ బ్లాగులో టపా చూడకపోతే పుస్తకాలు షాపులోకొచ్చాక కానీ కొనలేకపోయేదాన్ని కదా! వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చూద్దాం!

కార్తీక్, ధన్యవాదాలు! కుటుంబరావు గారి రచనలు వీలైనన్ని వెంటనే చదివేయండి మీరు!

వెంకట రమణ గారు,
కరక్టే!కొ.కు రచనలు ఎన్ని సార్లు చదివినా ఎప్పటికప్పుడు అప్పుడే చదివిన తాజా అనుభూతి కలుగుతుంది. చదువు నవల బయట కూడా దొరుకుతోందండీ! దొరకని వారు మీరిచ్చిన లింక్ ని ఉపయోగించుకుంటే బావుండు!

మురళి,
ఉందా మీ దగ్గర ఈ నవల? అయితే వెంటనే చదివేయండి!

సునీత,
ధన్యవాదాలండీ!

నేస్తం,
కావాలంటే చెప్పండి! ఎక్కడికైనా సరే పంపిస్తాను. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకి 'సదా మీ సేవ లో ' టైప్ లో నా దగ్గరున్న వాటిని పంచుతాను.

నిషి,
అమ్మ దొంగా, అప్పుడే విరసం వాళ్ల సంపుటాలు కూడా తెప్పించేసుకున్నారా?

kiranmayi said...

కో. కు పుస్తకాలు నేను చదవలేదు కాని మా నాన్న దగ్గర మూడు, నాలుగు volumes ఉండేవి (షార్ట్ స్టోరీస్ అనుకుంటా). నాన్న ఆఫీసు నించి వచ్చినతరువాత తీరికగా కాఫీ తాగుతూ, "కో. కు ఇటు పట్టుకురామ్మా" అనే వారు. ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు అడిగి తెచ్చుకోవాలి. ఎవరైనా కో. కు బుక్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు మా ఇంటిలో, ఈనాడు పేపర్ తో అట్ట వేసిన ఆ పుస్తకాలే గుర్తొస్తాయి. నా తీపి జ్ఞాపకం మళ్ళి నాకు గుర్తు చేసారు. ధన్యవాదాలు.

వేణూశ్రీకాంత్ said...

పరిచయం చాలా బాగుందండీ. మీరన్నట్లు ఒకే కధను రెండు నవలలుగా విభిన్న దృక్కోణాలలో ఆసక్తికరంగా వ్రాయడం ప్రత్యేకమే..

కొకు గారి ’చదువు’ రెండు నెలల క్రితం కొన్నాను కానీ ఇంకా చదవలేదు. ముందు అది పూర్తి చేసి ఈ సంపుటాల సంగతి కూడా చూడాలి, వివరాలు అందించినందుకు ధన్యవాదాలు.

తల్లీ కూతుళ్ళ మధ్య ఇలాంటి తరల అంతరాల గొడవలు ఇప్పటికీ ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయేమో కదా ? ఎప్పటికీ అంతే ఉంటాయేమో!!

సుజాత వేల్పూరి said...

కిరణ్మయి,
ధన్యవాదాలండీ!

వేణూశ్రీకాంత్,
అదే తమాషా! తల్లీ కూతుళ్ళ మధ్య ఈ అంతరాలు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఏ తరంలో అయినా తప్పవు.
కాకపోతే ఇవి తల్లీ కూతుళ్ళ మధ్య కాబట్టి పెద్దగా పట్టించుకోం! ఇదే అత్తాకోడళ్ళ మధ్య అయితే, ఇంతకంటే చిన్న చిన్నవే హై లైట్ అవుతాయి.

అడ్డ గాడిద (The Ass) said...

Have not much touch with Tel lit. Looking like he's an interesting read. The only telugu books I know a little are by chalam.

Is this a season of tel lit?
Many things on B&G, and here in ur blog? heyy u too be there in it. Am I right?

సుజాత వేల్పూరి said...

అ.గా గారు,
తెలుగు చదవడం వచ్చిన ప్రతి వ్యక్తీ తప్పక చదవాల్సిన సాహిత్యమండీ ఆయనది. ఆయన తెలుగువాడైపోవడం వల్ల అంతర్జాతీయ బహుమతులేవీ వరించలేదు. అలాంటి పురస్కారాలను ఆయన లక్ష్యపెట్టరు కూడాను!

మొన్న అక్టోబర్ 28 నాటికి కుటుంబరావు గారు పుట్టి వందేళ్ళయింది. ఆయన శతజయంతి సంవత్సరం ఇది. అందుకే ప్రతి చోటా ఆయన్న్ని తల్చుకోడం! (ఒక బ్లాగులో చదివినట్లు. శత జయంతి వచ్చే ఏడాది అయితే ఈ ఏడాది ఆయన్ని పట్టించుకునే వాళ్ళం కాదు)

కత పవన్ said...

చాలా మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు thanks

Anil Dasari said...

అంతర్జాతీయ బహుమతులు వరించకపోవటానికీ ఆయన తెలుగువాడవటానికీ సంబంధం లేదేమో. వాళ్లకర్ధమయ్యే భాషలోకి భావయుక్తంగా అనువదించాలి కదా. టాగోర్ గీతాంజలిని ఆయనే స్వయంగా ఆంగ్లానువాదం చేసుకోబట్టిగానీ, మరెవరో చేస్తే దానికి నోబెల్ దక్కే స్థాయిలో కుదిరుండేదనుకోలేం.

సుజాత వేల్పూరి said...

అబ్రకదబ్ర,
పాయింటే! కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే ఆయన ఇలాంటి పురస్కారాల్ని ఏమాత్రం లెక్క చేసే మనిషిలా అనిపించరు. రాసుకుంటూ పోవడమే తప్ప ఎన్ని పుస్తకాలొచ్చాయి, ఎవరు చదివారు అన్న లెక్క కూడా లేదు. అంత నిష్కామ కర్మ గా చేశారు ఆ పని!

హను said...

chala baga chepparu,nenu mumdu urgentgaa aa biook chadavali anipistumdi

వేణు said...

కొ.కు. నోబెల్ లాంటి పురస్కారాల్ని ‘ఏమాత్రం లెక్క చేసే మనిషిలా’ అనిపించకపోవటం మీకు విచారించాల్సిన విషయం అనిపిస్తోందా? నాకైతే సంతోషించాల్సిన సంగతి అనిపిస్తోంది.:)

తన రచనలు చిరస్థాయిగా నిలిచిపోవాలనే కోరిక ఏమీ లేకుండా, అసలు వాటి అవసరం ఈ సమాజానికి ఉండకూడదని ఆకాంక్షించిన గొప్ప రచయిత కొడవటిగంటి!

మాలతి said...

ఇవాళే చూస్తున్నాను. చాలా బాగుంది సమీక్ష. అభినందనలు సుజాతా.

Praveen Mandangi said...

నేను కొడవటిగంటి గారి నవలలు చదవలేదు కానీ అతను వ్రాసిన చరిత్ర వ్యాసాలు చదివాను. కొడవటిగంటి గారు వివిధ పత్రికలలో వ్రాసిన చరిత్ర వ్యాసాలని సేకరించి పుస్తక రూపంలో ప్రచురించారు.

సమీరా వైఙ్ఞానిక్ said...

Oh you read so many books. Nice habbit. నాకు కూడా ఇంటెరెస్ట్ ఉంది కానీ, ఇంటర్లో కుదరలేదు. ఇంజీ లో టైమే చాలదు. ఇక ఇప్పుడు చూడాలి.

Bharatheeyam said...

This sounds a lot like Pride and Prejudice by Jane Austen.

Post a Comment