November 30, 2009

ఎన్నో ప్రశ్నలు రేపే "సంస్కార"
సంస్కార అంటే ఇదేదో మనిషి మనసుకో, ప్రవర్తనకో సంబంధించిన సంస్కారం కాదు. ఒక మృతదేహం తాలూకు అంతిమ సంస్కారం! అవును, ఈ నవల అంతా ఒక శవం అంతిమ సంస్కారం చుట్టూనే తిరుగుతుంది.

కన్నడ నవలా సాహిత్యంలో ఒక సంచలనం రేపి గొప్ప అవార్డు సినిమా గా నిలిచిన ఒక గొప్ప నవల "సంస్కార"! .బ్రాహ్మల్లో తరతరాలుగా గూడు కట్టుకు నిలిచిపోయిన పలు ఛాందస భావాలను, మూఢాచారాలను నిశితంగా ప్రశ్నిస్తూనే తాను నమ్మినధర్మాలని  అన్నింటినీ పోగొట్టుకున్నానన్న భావనతో, చేసిన తప్పుని ఒప్పుకోనూలేకా,బ్రాహ్మణత్వానికి దూరమూ కాలేకా రెండు విరుద్ధ ధర్మాల మధ్య నలిగిపోయే ఒక బ్రాహ్మణుడి మానసిక సంఘర్షణకు అద్దంపట్టే నవల.
ఎన్నడో ఎవరో  పూర్వీకులు పెట్టిన ఆచారాలను పాటించడం వల్ల బ్రాహ్మణత్వం నిలుస్తుందా? అవి పాటించని నాడు అది లేకుండా పోతుందా? అన్న మీమాంస ఈ నవల్లో ప్రధానంగా కనపడుతుంది. చదివిన తర్వాత ఒక పట్టాన వదిలిపెట్టదు పాఠకుడిని! కొన్ని వందల ప్రశ్నలని రేపుతుంది.

ఈ నవలా రచయిత యు.ఆర్ అనంతమూర్తి కన్నడసాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ వేత్త,విమర్శకుడు కూడా!.జ్ఞానపీఠ,పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. మైసూరు యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పని చేశారు.

స్వయంగా బ్రాహ్మణుడైన అనంతమూర్తి సంస్కార నవల్లో బ్రాహ్మణ మూఢాచారాల్ని చీల్చి చెండాడటం చాలా మందికి   మింగుడుపడకపోయినా నవల మాత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. గిరీష్ కర్నాడ్ ప్రధాన పాత్రధారిగా సినిమాగా కూడా రూపొందింది.(నిజానికి ఈ సినిమా చూస్తే మరింత సమగ్రంగా రాయవచ్చనే ఉద్దేశంతో డీవీడీ కోసం ప్రయత్నించాను గానీ బెంగుళూరులో కూడా దొరకలేదు)
                                                  రచయిత అనంతమూర్తి


కర్నాటకలోని తుంగభద్రా నదీ తీరంలోని ఒక మధ్వ బ్రాహ్మణ అగ్రహారం దూర్వాసపురంలో నారాయణప్ప అనే బ్రాహ్మణుడి చావుతో ప్రారంభమవుతుంది ఈ నవల. అతడు నవల ప్రారంభంలోనే శవంగా మనకు పరిచయం అయినా కథ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది.

అగ్రహారంలో నివశించే బ్రాహ్మణులంతా యుగాలనాటి ఆచారాలను,పద్ధతులను నిక్కచ్చిగా పాటిస్తూ  బ్రాహ్మణ్యాన్ని నిలబెడుతున్నామని,తమ శాఖ కంటే ఇతర శాఖలు తక్కువ వారనే అహంకారంతో, ఇంకా చెప్పాలంటే అజ్ఞానంతో బతికేస్తూ ఉంటారు. తాము ఆ ఆచారాలను ఎందుకు పాటిస్తున్నారో వాళ్ళు ఆలోచించడానికి  కూడా ఆసక్తి చూపరు. పాటించకపోతే అది తమ సర్వనాశనానికి దారి తీస్తుందని భయం!

కాశీలో వేద వేదాంగాలు చదువుకుని మహాపండితుడైన ప్రాణేశాచార్యుల వారు ఆ అగ్రహారంలో నివశించడం వల్ల ఆ అగ్రహారానికి చుట్టుపక్కల ఎంతో గౌరవం. ఆయన ఇంద్రియాలను జయించి పుట్టుకతోనే రోగిష్టి అయిన ఒక స్త్రీని వివాహమాడి ఆమె సేవలో,వేదపఠనంలో కాలం గడిపే మహాపురుషుడు.

ఇతడికి పూర్తిగా వ్యతిరేకి భోగలాలసుడైన నారాయణప్ప. కుందాపురం నుంచి చంద్రి అనే వేశ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆమె సేవలోనే కాలం గడుపుతుంటాడు.అంతేనా? జంధ్యం తెంపి అవతల పారేసి ఇంట్లోని సాలగ్రామాన్ని ఎత్తి తుంగభద్రలో పారేస్తాడు.సాయిబుల కుర్రాళ్లని ఇంటికి పిల్చి బాతాఖానీ వేస్తాడు.

దేవాలయ కోనేట్లో చేపలు పట్టినవాళ్ళు రక్తం కక్కుకు చస్తారని అగ్రహారీకుల నమ్మకం! ఆ కోనేట్లో సాక్షాత్తూ బ్రాహ్మణుడైన నారాయణప్ప ముస్లిము లతో కల్సి చేపలు పట్టి తెచ్చి చంద్రితో వండించి భోంచేస్తాడు. దైవ పూజకై అగ్రహారీకులు పూలమొక్కలు పెంచితే ఇతడు మత్తెక్కించే పరిమళంతో మతులు  పోగొట్టే నైట్ క్వీన్ ఇంటిముందు పెచుతాడు.  అగ్రహారపు ఇతర కుర్రాళ్లను కూడా తనమార్గంలోనే పయనించేలా ప్రభావితం చేస్తుంటాడు.

ఒకరోజు ఉదయాన్నే నారాయణప్ప ఇంట్లో ఉన్న వేశ్య చంద్రి ప్రాణేశాచార్యుల వద్దకు పరుగున వచ్చి నారాయణప్ప చనిపోయిన వార్త చెప్తుంది. శివమొగ్గ నుంచి చంక కింద పెద్ద గడ్డతో వచ్చాడని, తీవ్రమైన జ్వరంతో రాత్రంతా బాధపడి ఉదయాన్నే మరణించాడని చెపుతుంది.

అగ్రహారమంతా ఉలిక్కి పడుతుంది. కులభ్రష్టుడైన నారాయణప్ప దహన సంస్కారాలు , ఉత్తర క్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రారు. నిజానికి నారాయణప్ప తోడల్లుడు లక్ష్మణా చార్యులు, జ్ఞాతి గరుడాచార్యులు అగ్రహారీకులే! అయినా చంద్రి చేతి వంటనుకూడా తినే నీచుడైన  నారాయణప్ప దహన సంస్కారాలకు వారు ముందుకు రారు.

 బతికున్నపుడు నారాయణప్ప చేసిన అప్రాచ్యపు పనులన్నీ ఒక్కొక్కరూ ఏకరువు పెట్టి అతడిని కాలిస్తే తమకూ పాపం చుట్టుకుంటుందంటారు..!అసలు నారాయణప్ప ప్లేగుతో మరణించాడనీ, అది వేగంగా వ్యాపించే అంటువ్యాధనే తెలీనంత అజ్ఞానం అగ్రహారీకులది.

ఇంతలో చంద్రి వీరందరికీ మతిపోయేలా తన వంటిమీదున్న బంగారాన్నంతా తీసి ప్రాణేశాచార్యుల ముందు కుప్ప పెట్టి,దహన సంస్కారాల ఖర్చులకు వాడాల్సిందిగా కోరుతుంది. ఈ దెబ్బకు తట్టుకోలేని అగ్రహారీకులు తమ సహజ ప్రకృతిని నగ్నంగా  ఆవిష్కరిస్తూ "ఎంత కాదనుకున్నా బంధుత్వం తెగుతుందా? బ్రాహ్మణ్యాన్ని వాడు త్యజించాడు కానీ వాడిని బ్రాహ్మణ్యం వదిలేస్తుందా"అంటూ మాటలు మొదలెడతారు. గరుడా చార్యులు సంస్కారాలకు ఒప్పుకుంటాడేమోఅని లక్ష్మణా చార్యులు, ఇతడు వప్పుకుంటాడేమో అని గరుడా చార్యులు  ఖంగారు పడుతుంటారు.


కొంతమంది కొద్దిదూరంలో ఉన్న పారిజాతపురం అగ్రహారపు స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవాళ్ళు కాబట్టి వాళ్ళని ఈ సంస్కారాలు చేయమని అడిగి లేదనిపించుకుంటారు  ఇక ప్రాణేశాచార్యులు అడవిలో ఉన్న ఆంజనేయాలయంలో తాను దీక్షలో కూచుంటాననీ, ఆ స్వామి ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందేననీ స్పష్టం  చేస్తాడు.అంతా అంగీకరిస్తారు. 

ఇక్కడే కథ అనుకోని మలుపు తిరుగుతుంది. దీక్షలో కూచున్న ఆచార్యుల వారికి స్వామినుంచి ఎటువంటి సందేశమూ లభించదు. ఈ లోపు ఆకలికి తాళలేని చంద్రి తుంగభద్రలో స్నానమాడి అరటితోటలో పళ్ళు కోసుకుని అడవికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అపరాహ్నవేళ మరోసారి స్నానం చేసేందుకు  వచ్చిన ప్రాణేశాచార్యుల కాళ్ళమీద పడుతుంది చంద్రి..!

చిత్రంగా, పరమనిష్టా గరిష్టుడు, కఠోర తపస్సంపన్నుడు  అయిన ప్రాణేశుడు జీవితంలో తొలిసారి కలిగిన స్త్రీ స్పర్శ కు లొంగిపోతాడు. చంద్రి పరిష్వంగంలో కరిగి,  ఆమె  అందించిన సౌఖ్యానికి దాసోహమంటాడు.

ప్రాణేశాచార్యుల వారికి స్వామి సందేశం దొరకలేదని తెలుసుకున్న అగ్రహారీకులు ధర్మస్థల లోని మధ్వ గురువుల మఠాన్ని ఈ విషయంలో సంప్రదించేందుకు వెళతారు. చంద్రి లో తప్పు చేశానన్న అపరాథ భావన లేదు. ఇక అక్కడినుంచి వెళ్లిపోవాలన్న అభిప్రాయంతో ఒక సాయిబుల బండివాడిని బతిమలాడి అర్థ రాత్రి నారాయణప్ప శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి అతడిచేతే దహనం చేయించి మాయమవుతుంది.

 ఆ నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్కక్షణం తొట్రుపడినా "ఇతడు ఇప్పుడు బ్రాహ్మడూ కాదు, శూద్రుడూ కాదు. ఇతడొక ప్రాణం లేని శవం" అని సర్ది చెప్పుకుంటుంది. శవం ఉన్న ఇంటికేసి ఎవరూ   పోకపోవడం వల్ల ఈ  విషయం ఎవరికీ తెలీదు.

ఈ లోపు ప్లేగు అగ్రహారంలో వేగంగా వ్యాపిస్తుంది. ప్రాణేశాచార్యుల భార్య మరణిస్తుంది. మఠానికి బయలుదేరిన అగ్రహారీకుల్లో కొందరు మరణిస్తారు.

భార్యను దహనం చేసిన ఆచార్యులు అపరాధ భావనతో,ఇక సర్వం త్యజించిన శూన్యమైన మనసుతో  ఊరు విడిచి గమ్యం తెలీని ప్రయాణం సాగిస్తాడు. దారిలో అతడితో కలిసి నడిచిన పుట్టన్న,మనసులో మళ్ళీ కలకలం రేపిన పద్మావతి,అన్న సంతర్పణలో నానా జాతులతో,(అందులోనూ తను సూతకంలో ఉండగా ) కల్సి భోజనం....ఎదురు చూడని పరిస్థితుల మధ్య ప్రాణేశాచార్యులు తన తప్పుకి  ప్రాయశ్చిత్తం చేసుకునే ఉద్దేశంతో అగ్రహారంలో అందరి ఎదుటా తప్పు ఒప్పుకుని పాప  ప్రక్షాళనం చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చి, దూర్వాసపురం అగ్రహారం దారిపడతాడు.

 ఇదే కథ!


మరి తర్వాత ఏమవుతుంది? అగ్రహారీకులు ఆయన చేసిన తప్పుని అంగీకరిస్తారా? మధ్వ శాఖకే మణికిరీటమై భాసిల్లిన ఆయన పెద్దరికం ఈ దెబ్బతో కొట్టుకుపోయిందా? నిలిచే ఉందా?  ...ఎవరికీ తెలీదు. ఎందుకంటే  "ఆ తర్వాత...తర్వాత ఏమవుతుంది?"అన్న ప్రశ్నతోనే నవల ముగుస్తుంది.   

ఇది కన్నడ సాహిత్యంలో ఎంతో సంచలనం సృష్టించిన  నవల, సినిమా కూడా!  కన్నడ సినిమా గురించి చర్చ జరిగిన ప్రతి చోటా చోటు చేసుకునే సినిమా!


1970 లో దీన్ని తెలుగు నిర్మాత తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి(ఈయన తెలుగులో పెళ్ళినాటి ప్రమాణాలు, భాగ్య చక్రం వంటి సినిమాలు నిర్మించారు)దీన్ని సినిమాగా తీశారు. ప్రాణేశాచార్య పాత్రను గిరీష్ కర్నాడ్, చంద్రి పాత్రను స్నేహలతా రెడ్డి, నారాయణప్ప పాత్రను లంకేష్ పోషించారు. మొదట కుల విభేదాలను రేకెత్తించేదిగా ఉందన్న కారణంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాను నిషేధించినా తర్వాత విడుదలై జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న చిత్రం ఇది!    


నవల విషయానికొస్తే అద్భుతమైన అనువాదం ఊపిరి తిప్పుకోకుండా  చదివిస్తుంది. కథా కాలం ఇప్పటిది కాదు కాబట్టి ఆనాటి మూఢాచారాల్ని కొంత వరకూ అర్థం చేసుకోడానికి ప్రయత్నించవచ్చుగానీ వాటిని వారు  సమర్థించుకునే తీరు, ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. "మీ శాఖ  కంటే మా శాఖ గొప్పది"అని ఆ పేద బ్రాహ్మలు ఒకరినొకరు మోసం చేస్తున్నామని ఆత్మవంచన చేసుకోవడం జాలిని కల్గిస్తుంది.కానీ అది, ముఖ్యంగా ఆ అగ్రహారీకులకు struggle for existence! వారికి అంతకంటే మార్గం లేదు మరి!  జీవనోపాధే బ్రాహ్మణ్యమైనపుడు అది వారికి తప్పనిసరి!  

కుప్పలుగా చచ్చిపడే ఎలుకల్ని చూశాకైనా అది ప్లేగు అని గుర్తించకపోగా, వాటికోసం వచ్చే గద్దల్ని చూసి ఊరికేదో అరిష్టం వచ్చిపడిందంటూ శంఖాలు ఊదుతారు!

ఒకపక్క స్మార్తులు తమకంటే తక్కువ ఆచారాలు కలవారని నిరసిస్తూనే ఎవరికీ తెలీకుండా వారి ఇంట అటుకులు, ఉప్మా తినాలని ఉవ్విళ్ళూరతాడు దాసాచార్యుడు. అతడు తన ఇంట్లో తిని భ్రష్టుడైతే చూసి  ఆనందిద్దామనుకునే మంజయ్య!  

ఇలాంటి నగ్న చిత్రణ చాలామందికి మింగుడుపడక అనంతమూర్తిపై విమర్శల జల్లు కురిసింది.
ఇంతే కాక కర్ణాటక అగ్రహారీకుల జీవన శైలిని రచయిత బహిర్గతం చేసిన తీరు అనేక విమర్శలకు దారి తీసింది. 

రచయిత ప్రాణేశాచార్యుల అంతర్మధనాన్ని చిత్రించిన తీరు అబ్బురపడేలా చేస్తుంది.

చంద్రి సాంగత్యం ఏర్పడకముందు, ఏర్పడిన తర్వాత ఆ పండితాచార్యుడి ఆలోచనల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తుంది. రస రమ్య కావ్యాలను పురాణ కాలక్షేపం పేరుతో తాను చదివి వినిపిస్తుంటే విన్న యువకుల మానసిక స్థితి ఇప్పుడు తనకు అవగతమైందని భావిస్తాడు. 

అయినా, వేద వేదాంగాలు చదివిన పండితుడిగా తన పేరు చుట్టు పక్కల గ్రామాల్లో పరిచితం కాబట్టి ఎక్కడికెళ్ళినా ఎవరైనా తనను పడతారేమో’ అన్న శంకతో దాగి దాగి తన  అస్తిత్వాన్ని మరుగు పరచుకుంటాడు.

"ఇంతటి భయం నాకెప్పుడూ కలగలేదు.రహస్యం బయటపడుతుందేమో అని భయం! ఒకవేళ పడకపోయినా అబద్ధాన్ని బొడ్లో దాచుకుని ఈ మొహంతో అగ్రహారంలో ఎలా ఉండగలను"అని ప్రశ్నించుకుంటాడు.

మరోపక్క చంద్రితో తాను గడిపిన ఆ క్షణాలు దైవనిర్ణయాలు, అందులో తన ప్రమేయం లేదని సర్దిచెప్పుకోడానికి ప్రయత్నిస్తాడు. ఆ స్థితిలో నారాయణప్పను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. 

అడవిలో ఒక కాపు తన కూతురు బతుకు బాగుపడటానికి మంత్రం చెప్పమని అడిగినపుడు గ్రహిస్తాడు "తను బ్రాహ్మణ్యానికి దూరంగా పోతున్నా , అది తనను అంటిపెట్టుకునే"  ఉందని.

గుడిలో భోజనాల పంక్తిలో కూచుని ఇలా తర్కించుకుంటాడు..."ఈ భయం పోవడానికొకటే మార్గం! నారాయణప్ప దహనానికి నేనే బాధ్యత వహించాలి.ఏ అగ్రహారంలో నేను పెద్దగా నిలబడ్డానో, అదే అగ్రహారంలో బ్రాహ్మణ సమాజంలో నేను ధైర్యంగా నిలబడాలి. అందరి ముందూ 'ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఫలానా నిశ్చయానికి వచ్చాను!

 మీరిచ్చిన గౌరవాలు వదులుకుంటున్నాను, ఈ ఘనతను ముక్కలు ముక్కలుగా చించివేస్తున్నాను ' అని చెప్పాలి. ఏమని చెప్పాలి?  రోగిష్ఠి భార్యతో విసుగుపుట్టింది, చంద్రితో కలిశాను.సంత హోటల్లో కాఫీ తాగాను.కోడిపందాలు చూశాను.పద్మావతిని చూసి మోహపడ్డాను.భార్య పోయిన మైలలోనే దేవాలయంలో భోజనం చేశాను. నాతోపాటు కూచోమని బోయవాడిని ఆహ్వానించాను!..

కానీ నేనో అమోఘమూ, అభేద్యమూ అయిన సంపూర్ణ నిర్ణయానికి రావలసిందే! సూటిగా  మనుష్యుల కళ్ళలోకి చూడగలిగి ఉండాలి. అగ్రహారానికి మాత్రం వెళ్లాల్సిందే"

 అని.. ."పరంధామా, ఆ రోజు అడవిలో నా ప్రమేయం లేకుండా ఏ విధంగా నా నిర్ణయాన్ని విధించావో, అదే విధంగా ఈ రోజూ విధించు. జరగవలసినదేదో ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచే లోగా జరగనీ"అని దేవుడిని వేడుకుంటాడు.

నవల చదువుతున్నంత సేపూ అనేక ప్రశ్నలు చుట్టుముట్టి గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. చదివిన తర్వాత కూడా ఆ ప్రశ్నలు అనేక రూపాలు దాల్చి పాఠకుడి వెంటే తిరుగుతాయి. 


ప్రాణేశాచార్యుడితో పాటే మనమూ అడవిలో చెట్లూ పుట్టలూ దాటి ప్రయాణిస్తూ, అతడి అంతర్మధనంలో పాలు పంచుకుంటాం! జాలి పడతాం! బాధ పడతాం, పుట్టన్నతో మాట్లాడతాం, ఒకవైపు చంద్రి గురించి, మరో వైపు నారాయణప్ప మృతదేహం గురించి ఆలోచిస్తూ ఉంటాం! ఒక్కమాటలో చెప్పాలంటే పాఠకుడు ప్రాణేశుడిలో పరకాయ ప్రవేశం చేస్తాడు.

కన్నడ సాహిత్యంలోనే కాదు మరే ఇతర భాషా సాహిత్యంలోనూ ఈ ఇటువంటి మీమాంసా విశ్లేషణ ప్రధానమైన నవల రాలేదేమో!

కేంద్ర సాహిత్య అకాడమీ ముద్రించిన ఈ నవల ను తెలుగులోకి అత్యంత ప్రతిభావంతంగా అనువదించింది శ్రీ ఎస్.ఎల్ శాస్త్రి.ఈ పుస్తకం  ప్రస్తుతం ప్రతిచోటా అందుబాటులో లేదు. కానీ డిసెంబర్ లో జరిగే హైదరాబాదు బుక్ ఫేర్ లో దొరికే అవకాశం  ఉంది. నాకు 2006లో అక్కడే దొరికింది.

చదవాలనుకున్నవారు పుస్తకాల సంతలో ప్రయత్నించవచ్చు.

41 comments:

వేణు said...

ఈ నవల గురించీ, సినిమా గురించీ చాలాకాలం క్రితమే తెలుసు. కనీసం నవల అయినా చదవాలని ఎందుకో నేను ప్రయత్నించలేదు. మీ నవలా పరిచయం చదివాక, ఈ పుస్తకం చదవాలనిపిస్తోంది!


మూఢాచారాలను విమర్శిస్తే... సంప్రదాయ వాదులకు మింగుడు పడకపోవటం సహజమే. దీనికి ఆంధ్రదేశమైనా, కన్నడదేశమైనా మినహాయింపు లేదు.

ప్రాణేశాచార్యుడు చివరకు నారాయణప్ప ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం.. అతని ఆలోచనల్లో వచ్చిన మౌలిక పరిణామానికి సూచన.

నవల గురించి శ్రద్ధగా, వివరంగా , ఆసక్తికరంగా రాశారు. ప్రత్యేకత ఉన్న ఈ పుస్తకాన్ని పరిచయం చేసినందుకు అభినందనలు!

ఈ నవల తెలుగు అనువాదం ముఖచిత్రం అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా ఉంది!

duppalaravi said...

చాలా వివరణాత్మకమైన అద్భుత పరిచయం. మిమ్మల్ని ఈ నవల ఎంతగా కదిలించిందో పరిచయ వ్యాసం చదివితేనే అర్థమవుతోంది. నేను కన్నడ మూలం చదవలేకపోయినా, ఏ. కె. రామానుజన్ గారి ఇంగ్లిషు అనువాదం చదివాను. తర్వాత తెలుగు అనువాదం కోసం ప్రయత్నించినపుడు, ఆర్ ఎస్ సుదర్శనం గారు దీనిని తెలుగులోకి అనువదించారని, కాని పుస్తకం విడుదల అయ్యేలోగానే ప్రతులన్నీ చెదలు పట్టి పోయాయని తెలిసి బాధపడ్డాను. కానీ, ఇప్పుడు సాహిత్య అకాడెమీ అనువాదం దొరుకుతోందని మీ వ్యాసం ద్వారానే తెలిసింది. అన్నట్టు ఈ నవల తెలుగు సినిమాగా వచ్చినపుడు కవి పఠాభి కూడా సాయపడ్డారు, ఎలాగన్నది గుర్తులేదు. సమకాలీన ఆణిముత్యం (కాంటెంపరరీ క్లాసిక్) అనదగ్గ ఈ నవల పరిచయం నిజంగా చాలా బాగుంది.

duppalaravi said...

సుజాత గారూ, మన్నించాలి, రెండోసారి వ్యాసం చదివినప్పుడు పఠాభి 'సంస్కార ' తెలుగు సినిమాకు నిర్మాత అని మీరు రాయడం బుర్రకెక్కింది. నా తొలి వ్యాఖ్యలో పఠాభి ఎలా సాయపడ్డారో నన్న సంగతి మీ వ్యాసం రెండోసారి చదివాక తెలిసింది. ధన్యవాదాలు.

Indian Minerva said...

(తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో)ఇదెక్కడ దొరుకుందో చెప్పగలరా? కనీసం ఏ e-snips link ఐనా ఫర్వాలేదు.

Praveen Sarma said...

నేను వ్రాసిన "విమోచనం" కథలో హీరో వేశ్యని పెళ్ళి చేసుకుంటాడు. అది కూడా దొమ్మరి కులానికి చెందిన వేశ్యని పెళ్ళి చేసుకుంటాడు. http://streevadam.co.cc/mag/node/12 ఈ కథ పై కూడా విమర్శలు వచ్చాయి. మూఢాచారాలని నమ్మేవాళ్ళు బ్రాహ్మణులైనా, శూద్రులైనా ఆధునిక ఆలోచనలని అర్థం చేసుకోరు. "విమోచనం" కథని కత్తి మహేష్ గారు కూడా విమర్శించారు.

లలిత said...

పుస్తకం చదవటం మాట అటుంచండి , మీ ఈ విశ్లేషణే నన్ను చాలా కాలం వెంటాడేట్టుంది ..ఆర్ట్ సినిమాలాగా! ఇటువంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు ఓపట్టాన మామూలు మనుషులం కాలేము. అందుకే నాకు భయం

సుజాత said...

ప్రవీణ్ శర్మ,
సంస్కార నవల్లో వాతావరణం, context పూర్తిగా వేరు. బ్రాహ్మణ అగ్రహారాల గురించి రాసిన కథ! అక్కడ ఉండే మూఢాచారాలు మీరు పేర్కొన్న మూఢాచారాలు కావు! అవి మీకర్థం కావు, కనీసం నవల చదివే వరకు! చదివాక ఈ విషయం మీద రాయండి.

సుజాత said...

రవి కుమార్ గారు,
పట్టాభిరామిరెడ్డి గారి భార్య కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సినిమాలో! చంద్రి పాత్ర వేసిన స్నేహలత గారే రెడ్డి గారి శ్రీమతి

LBS said...

The story line is not at all impressive. Nothing new or creative about it. ఈ నవలలోని అగ్రహారాలూ, ఆ సమాజమూ చనిపోయి శతాబ్దాలో, దశాబ్దాలో అవుతున్నది. ఇప్పుడు ఆ బ్రాహ్మలూ లేరు, ఇపుడు దాన్ని రాయడమూ అసందర్భమే, ప్రశంసించడమూ అసందర్భమే. నవల రాసినాయన పెద్ద మేధావేమీ కాదని మాత్రమే చెప్పగలను. మూఢాచారాలు సమాజంలో అని వర్గాల్లోను ఉన్నాయి. కేవలం బ్రాహ్మల్లోనే కాదు. బ్రాహ్మలతోను, నాగరిక సమాజంతోను సంబంధం లేని గిరిజన గూడేల్లో కూడా వాళ్ళ ఆచారాలు వాళ్ళకున్నాయి. అలాగే తెల్లవాళ్ళలో కూడా వాళ్ళ మూఢాచారాలు వాళ్ళకున్నాయి. ఎవఱూ ఎవఱినీ విమర్శించే పరిస్థితి లేదు.

--తాడేపల్లి

sunita said...

చాలా వివరణాత్మకమైన అద్భుత పరిచయం. ఈ సినిమా గురించీ చాలాకాలం క్రితమే తెలుసు. నవల నేను చదవలేదు కానీ నేషనల్ టీవీలో ఎప్పుడో చూచిన గుర్తు. అదీ ముక్కలు ముక్కలు గా. పరిచయం చాలా బాగుంది. ఈమధ్యలో ఇంత తులనాత్మక పరిచయం ఏ పుస్తకం గురించీ చదివిన గుర్తు లేదు. చాలా బాగా రాసారు.

సుజాత said...

తాడేపల్లి గారు,
కథ మీకు నచ్చకపోవడం మీ అభిరుచిని బట్టి ఉండొచ్చు! ఎప్పుడో అంతరించి పోయిన వాటిగురించి ఇప్పుడు రాయడమూ చదవడమూ అనవరమూ, అసందర్భమూ అయిన పక్షంలో మనం చాలా చాలా వాటిని వదిలివేయాల్సి ఉంటుంది. ప్రశంసించడం అనేది ఎవరి అభిరుచిని బట్టి వారు చేయాల్సిన పని కదా!

ఈ నవల మీరు చదివారా అని తెలుసుకోవాలని ఉంది.

ఇది కేవలం మూఢాచారాలను మాత్రమే విమర్శించే నవల కాదు. మనిషి బతకడానికి వేసుకునే ముసుగుని కూడా విమర్శించే నవల! అంతే కాదు వివిధ సందర్భాల్లో పరిస్థితిని బట్టి మనిషి ఎలా వీలును బట్టి ప్రవర్తిస్తాడనేది అద్భుతంగా చిత్రీకరించిన నవల. ప్రతి సన్నివేశాన్నీ వివరించడం ఇక్కడ సాధ్యం కాకపోవడం వల్ల పరిమితంగా వివరించవలసి వచ్చింది.

నవల చదివితే మీరు ఇంకొచెం వివరంగా రాసి ఉండేవారు.

కేవలం బ్రాహ్మణుల మూఢాచారాల గురించి మాత్రమే ఎత్తి చూపడం ఈ పరిచయంలోనూ జరగలేదు.అటువంటి ఇంటెన్షనూ నాకు లేదు.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

ఇది నిజంగానే చాలా మంచి పుస్తకం. పుస్తకంలోని విషయం గురించి కాకుండా, ఒక విషయం చెప్దామని.

ఈ సాహిత్య అకాడెమి వారి అనువాద ప్రచురణ ఎంతో అభినందించదగ్గ ప్రయత్నమే అయినా, అందులోని అక్షరదోషాలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి. మీరు కూడా నేను చదివిన ప్రచురణే (2005, Rs 85/-)కనుక చదివుంటే, మీరు ఆ విషయం ప్రస్తావించకుండా వ్యాసం ఎలా ముగించారబ్బా అని అనిపించింది. ఈ అక్షరదోషాలు పంటి క్రింది రాళ్లలా, ఇంకా చెప్పాలంటే, రేషను బియ్యంలోని రాళ్లలా సతాయించేసాయి. మొదట్లో ఓ కలం పట్టుకుని అవి సరిచేసుకుంటూ సాగాను. ఇహ అవీ మరీ ఎక్కువయిపోయి, పుస్తకాన్ని ఆస్వాదించడానికి అడ్డొస్తోందని ఆ ప్రయత్నం మానుకున్నాను.

Praveen Sarma said...

మా వీధిలో ఎక్కువ మంది బ్రాహ్మణులూ, పట్నాయకులూ. బ్రాహ్మణులు మాత్రమే ఉండే అగ్రహారం వీధికి నేను వెళ్ళలేదు. మా జిల్లాలో కూడా అగ్రహారం గ్రామాలు ఉన్నాయి. కానీ అగ్రహారం గ్రామాలలో మా బంధువులు లేరు. బ్రాహ్మణవాదాన్ని అగ్రహారం నుంచి వచ్చినవాళ్ళే బాగా విమర్శించగలరు అని అనుకుంటాను.

సుజాత said...

ప్రవీణ్ శర్మ,
అలా అని ఏమీ లేదు. అనంత మూర్తో, ఆయన పూర్వీకులో అగ్రహారీకులు అవునో కాదో నాకు తెలీదు. నేను చెప్పింది మీరు నవల పూర్తిగా చదివితే తప్ప ఈ విమర్శ మీకు అర్థం కాదని! అంతే తప్ప మరొకటి కాదు.

Bhardwaj Velamakanni said...

Heard of this but didnt know many details - Now I do. Thanks for sharing this.

simplyblog said...

Hi Sujatha garu.I liked your review.

నిషిగంధ said...

లలిత గారి అభిప్రాయమే నాదీను.. ఈ పుస్తకం గురించి వినడం ఇదే మొదటిసారి.. మీ సమీక్షే/పరిచయమే రెప్ప పడనీయకుండా చదివించింది! ఇక అది నావరకూ చేరే మార్గమేదో అర్జెంట్ గా వెతుక్కోవాలి..

LBS said...

ఆ నవల నేను చదవలేదు. కానీ అలాంటి నవలలు చాలా చదివాను. బ్రాహ్మణుల్ని విమర్శించే ఏ రచనకీ నా అమోదముద్ర గానీ ప్రశంస గానీ లభించదు. I take all attack on Brahmins, no matter however creative and stylish it may be, as a direct personal attack on myself. I am a Brahmin.

--తాడేపల్లి

అబ్రకదబ్ర said...

బ్రాహ్మణవాదాన్ని విమర్శించటానికి అగ్రహారీకులు ఉన్నారు. మిగతా అన్నిటికీ మార్తాండ ఉన్నాడు :-)

Praveen Sarma said...

ప్లేగ్ గురించి తెలియనంత అజ్ఞానులు ఈ రోజుల్లో ఉంటారనుకోలేదు. అందుకే నేను మూఢ నమ్మకాలని ఆ కోణంలో విమర్శించలేదు. రమణీయం కథ అయినా, విమోచనం కథ అయినా అందులో మూఢ నమ్మకాలని అగ్రహారం కోణంలో విమర్శించకపోవడానికి కారణం అదే. ఇతర కథలలో కూడా ఆడ-మగ సంబంధాల విషయంలో మూఢ నమ్మకాలని విమర్శించాను. "నీటి ఘోష" లాంటి కథలలో కులం కట్టుబాట్లని కూడా విమర్శించాను. చదువురాని దళితుడికి ప్లేగ్ గురించి తెలియకపోవడం విచిత్రం కాదు కానీ కొద్దిగా చదువుకున్న అగ్రహారికులలో కూడా ప్లేగ్ గురించి తెలియని వాళ్ళు ఉంటారనుకోలేదు.

వేణూ శ్రీకాంత్ said...

సుజాత గారు,
గిరీష్ కర్నాడ్ గురించిన మాటలలో ఓ కన్నడ మితృడు ఈ సినిమా గురించి ప్రస్తావించినగుర్తు. అతను స్టోరీలైన్ గురించి గిరీష్ నటనగురించి చెప్పినపుడు అలా గుర్తుండిపోయింది. నవల గురించి ఇదే మొదట వినడం. చాలా బాగా పరిచయం చేశారు. ఎవరో కానీ కవర్ పేజ్ బొమ్మకూడా చాలా బాగా వేశారు.

కత్తి మహేష్ కుమార్ said...

ఈ పుస్తకం "బ్రాహ్మినిజం" మీద ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం. అవసరాల చట్రానికి అనుగుణంగా బ్రాహ్మణకులం వంచనాపూర్వితంగా నిర్మించుకున్న కుహానా సంస్కృతి/సాంప్రదాయాల వ్యాపారీకరణను-అర్థరాహిత్యాన్నీ ఎత్తిచూపిన నవల.మానవత్వాన్ని మరిచిన సంస్కృతీ సాంప్రదాయం ఎలా నిలుస్తాయని ప్రశ్నించకుండానే నిలదీసిన పుస్తకం.

రాసినకాలం నాటి పరిస్థితులకీ ఇప్పటికీ తేడా ఉన్నా, ఆభిజాత్యాల్లో ఏమాత్రం తేడా లేదు. అందుకే ఇప్పటికీ ఈ నవల సమకాలీనమే.

సుజాత said...

మహేష్,
"మనో వికారాలకు, దౌర్బల్యాలకు ఎంతటి వాళ్ళైనా అతీతులు కాదు, కాలేరు కూడా! పండితులనో మరోటనో ముసుగు వేసుకుంటే చాలదు" ఇది నవల్లో ఉన్న విషయం! ఈ కథను కాంప్లెక్స్ గా చెప్పాలంటే అది ఒక అగ్రహారంలో జరిగాలి! అదే దీనికి బేస్!

ఈ నవల్లో పాత్రలు మనకు నిజ జీవితంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. తరచి చూసుకుంటే మనలోనూ ఉంటాయి. ఎందుకంటే పైకి ఎన్ని నీతులు వల్లించినా, అభిజాత్యాలు చూపించినా మనం,మన చుట్టుపక్కల ఉండే వారు బతికేది ముసుగుల్లోనేగా! we just try to show the best part of our faces! ఈ ముసుగుల్ని తొలగించి చూపిన నవల ఇది. ఇది బ్రాహ్మలకే కాదు,ఎవరికైనా వర్తిస్తుంది.

ప్రవర్తనల విషయానికొస్తే ఇది సమకాలీనమే!

Praveen Sarma said...

తెలిసి తెలిసి కూడా మూఢ నమ్మకాలు నమ్మేవాళ్ళు ఉన్నారు. అగ్రహారం బ్రాహ్మణులు తెలియక మూఢ నమ్మకాలు నమ్ముతారు కానీ, మా వీధిలోని బ్రాహ్మణులు తెలిసే మూఢ నమ్మకాలని నమ్ముతారు. మా నాన్నగారు అల్సర్ వచ్చి చనిపోతే వాస్తు బాగాలేకపోవడం వల్ల చనిపోయారని అన్నారు. ఉప్పు, కారం లాంటి వేడి పదార్థాలు ఎక్కువగా తింటే అల్సర్ వస్తుంది. దానికి వాస్తుతో పనేమీ లేదు. ఈ విషయం చదువుకున్నవాళ్ళకి తెలియదా? మాది అగ్రహారం వీధి కాదు కానీ మా వీధిలో కూడా బ్రాహ్మణులు ఎక్కువే. వాళ్ళందరూ జాతకాలనీ, వాస్తునీ బలంగా నమ్మేవాళ్ళే. వాళ్ళు అగ్రహారం బ్రాహ్మణులలాగ మడి కట్టుకోరు. ప్యాంట్, షర్ట్, బూట్లు వేసుకుని ఆఫీసులకి వెళ్తారు. నాగరికత మారింది కానీ నమ్మకాలు మారలేదు.

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: నిజమే! కులాలకు అతీతంగా మనుషుల ఆభిజాత్యాలకూ స్వార్థాలకూ ప్రతీక "సంస్కార".

అయితే సమాజంలో ఆధిపత్యం స్థానంలో ఉంటూ, సాంస్కృతిక/సాంప్రదాయ విలువలకు ఆలవాలమన్న బ్రాహ్మణకులంలోని అణగారిని విలువల్ని నవలలో చూపించడం ద్వారా ప్రతీకాత్మకతకు మరింత బలం చేకూర్చాడు రచయిత.

రచనాకాలాన్ని చూసుకుంటే, ఒకవైపు ఫ్యూడలిజం మరోవైపు బ్రాహ్మినిజం అనే సామాజిక-ఆర్థిక-సాంస్కృతిక అణచివేతలనుంచీ భారతీయ సమాజం పోరాటం జరుపుతూ ఉంది. ఆ పోరాటానికి ప్రశ్నల ఆయుధాల్ని అందించింది ఈ నవల. ఆ ప్రశ్నలు ఇప్పటికీ సత్యాలే. కులచట్రాల్లోంచీ ఒదిగి చూసినా, ఎదిగి చూసినా ఇప్పటికీ ఈ నవల ఒక "కావ్యమే".

duppalaravi said...

బ్రాహ్మణులను తిట్టడం వేరు, బ్రాహ్మణవాదాన్ని తిట్టడం వేరు. బ్రాహ్మణవాదం కులంతో సంబంధం లేకుండా ఎవరిలోనైనా వుండొచ్చు. కానీ నవల అసలు చదవని తాడేపల్లిగారు రాసిన మొదటి ఉత్తరంలో రచయిత అనంతమూర్తి బ్రాహ్మణులనే తిట్టారని భావించి, ఏకంగా ఆయనను మేధావే కాదని దాడి మొదలుపెట్టారు. అది ఖచ్చితంగా రచయితను 'కేరెక్టర్ అసాసిన్ ' చెయ్యడమే. పైగా ఎవరి ఆచారాలు వారికున్నాయంటూ ఎవరూ ఎవర్నీ ఏమీ అనడానికి లేదంటూ కొ(చె)త్త సూత్రీకరణ చేశారు. తద్వారా సాహిత్య ప్రయోజనాన్నే ఆయన తూలనాడుతున్నారు. నాకు నచ్చనది రాసిన ప్రతివాడూ వెధవ, అలాంటి వాదనలను పట్టించుకోనవసరం లేదన్న తాడేపల్లి లాంటి ఆలోచనపరుల ధోరణులను ఖచ్చితంగా గర్హించాల్సిందే.

Praveen Sarma said...

తాడేపల్లి గారి అభిప్రాయాలతో మనం అంగీకరించకపోవచ్చు కానీ అతను తన మనసులో ఉన్నది డైరెక్ట్ గా చెప్పేస్తారు. అతను తాను బ్రాహ్మణుడినని డైరెక్ట్ గా చెప్పుకున్నారు కదా. పైకి సెక్యులరిస్టులలాగ మాట్లాడుతూ, లోపల లోపల కుల గజ్జీ, మత గజ్జీ ఉంచుకునే వాళ్ళ గురించి ఏమనుకోవాలి? కొన్ని నెలల క్రితం రిజర్వేషన్ల గురించి పెద్ద చర్చ జరిగింది. రిజర్వేషన్లకి అనుకూలంగా మాట్లాడినవాళ్ళకి గానీ, వ్యతిరేకంగా మాట్లాడినవాళ్ళకి గానీ నిజాయితీ లేదు. అక్కడ కుల ప్రయోజనాలూ, వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు. కొంత మంది అంటుంటారు "మేము ప్యూర్ వెజిటేరియన్స్ కి మాత్రమే ఇల్లు అద్దెకి ఇస్తాం" అని. బ్రాహ్మణులకీ, ఆర్య వైశ్యులకీ మాత్రమే ఇల్లు అద్దెకి ఇస్తాం అని డైరెక్ట్ గా చెపితే వాళ్ళలో ఉన్న కుల గజ్జి బయట పడుతుంది. సుజాత గారు అన్నట్టు overtగా కాకుండా covertగా మూఢ నమ్మకాలని నమ్మేవాళ్ళు చాలా మంది ఉన్నారు.

LBS said...

I want everyone to first stop referring to innocuous world-wide thinking patterns, and life-styles by caste. If they have nothing to do with caste, you should stop using caste. If they have something to do with caste, stop attacking that caste because it is its own unique life style which nobody has a right to question. And also, that caste is no more existent in that form now. When you take every opportunity to blame my caste by its name, it directly hurts me and will qualify you too for a counter-attack in future. You can't justify this hurt by whatever ideological argument. You should and must stop hurting me and my caste people. No compromise on this score. This old dirty activity of Brahmin-bashing in the name of some pseudo-intellectualism is not going to continue to enjoy this kind of legal immunity anymore in future. Only after you stop this caste-based badmouthing, then there will be some headway in understanding each other from a proper perspective.

I request the owner of this blog to kindly publish this comment.

--తాడేపల్లి

LBS said...

I think there is always a caste-neutral way to refer to the things you want to reform. Using my caste name for all and sundry things you dislike is absolutely objectionable besides being irrational. You can't go on hiding your communal hatred with some utterly nonsensical, abstract and faceless impersonal term of Brahminism. When there is no Kammaism, Reddyism or Velamaism, then I don't understand why there should be room for abusive and hateful words like the Brahminism while a caste by that name is very much alive, large as life in front of you in millions of population. It is not a dead or extinct race to be referred to in whatever way as you like. See, we Brahmins are all alive in blood and flesh. Try to find another word for what you want to express.

--తాడేపల్లి

Praveen Sarma said...

కమ్మ, రెడ్డి, వెలమ కులాల వాళ్ళ కులతత్వాన్ని విమర్శించకూడదని అనలేదు. కంచికచెర్ల, కారంచేడు ఊచకోతల విషయంలో కమ్మవాళ్ళనీ, చుండూరు ఊచకోత విషయంలో రెడ్లు, తెలగా కులస్తులనీ విమర్శించడం జరిగింది. మన రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులతత్వం ఎక్కువగా ఉన్నట్టే కర్నాటక, తమిళ నాడులలో బ్రాహ్మణ కులతత్వం ఎక్కువగా ఉంది. కన్నడ, తమిళ సినిమా పరిశ్రమలలో ఇప్పుడు కూడా ఎక్కువ మంది బ్రాహ్మణులే. బ్రాహ్మణవాదం లేదు అనడం వల్ల ప్రయోజనం ఏమిటి?

Aravinda said...

tadepalli garu, ఒక రచనలో మనకు కావాల్సింది మనం తీసుకుంటాము.. మీకు matladuthunnadi మీకు kavalsindena?

నేస్తం said...

చక్కటి పుస్తక పరిచయము ,సమీక్ష...సగం పుస్తకం చదివిన ఫీలింగ్ వచ్చేసింది.చాలా బాగా రాసారు :)

కార్తీక్ said...

SUJATHA GAARU

బాగా రాసారు

కుల మతాల కుంపటి ఆరిన నాడే
మనలో మానవ జ్యోతి వెలుగుతుంది....WWW.THOLIADUGU.BLOGSPOT.COM

కత్తి మహేష్ కుమార్ said...

కులబ్రాహ్మణత్వానికీ సైద్ధాంతిక బ్రాహ్మినిజానికీ తేడా తెలీని వాళ్ళకు చెప్పీ లాభంలేదు. మూర్ఖభ్రమను ఎవరు మాత్రం మార్చగలరు!

సుజాత said...

Indian Minerva,

ఈ పుస్తకం గురించి ఆన్ లైన్ లో చాలా ప్రయత్నించానండీ, లింక్ ఇవ్వొచ్చని! ఎక్కడా దొరకలేదు మరి! Land Mark, or Crossword లాంటి చోట్ల ఇంగ్లీష్ కాపీ దొరకవచ్చు! ప్రయత్నించండి. తెలుగు అనువాదం మరొకరి వెర్షన్ కూడా ఇటీవల వచ్చిందని విన్నాను! దాని లభ్యత సంగతి అస్పష్టంగా ఉంది. లక్ష్మీ పతి శాస్త్రి గారి అనువాదం మాత్రం ఒరిజినలే చదువుతున్నంత బావుంది. వీలైతే, దొరికితే అదే చదవండి!

భావన said...

వూపిరి బిగబెట్టి చదివించేరు మీ పరిచయమే, ఇంక పుస్తకం ఎంత గొప్ప గా వుంటుందో. మనిషి లోని అంతః సంభందమైన ఆలోచనల తీరు ను చాలా బాగా పరిచయమ్ చేసేరేమో రచయత అనిపించింది. మీ పరిచయం మాత్రం చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు సుజాత ఇంత చక్కటి పుస్తకం పరిచయం చేసినందుకు.

సమీరా వైఙ్ఞానిక్ said...

Heard about this movie. But is there a book? Well. Have to get it

Raj said...

నాకు ఈ నవలలో చంద్రి పాత్ర బాగా నచ్చింది.

మంచి నమీక్ష..
పుస్తకం దోరుకుతుందేమో ప్రయత్నిస్తా...

కెక్యూబ్ వర్మ said...

నేను ఇన్ని రోజులు ఈ చర్చను ఎలా మిస్ అయ్యానా అని బాధపడుతున్నా. మీ పుస్తక పరిచయం అద్భుతం. వెంటనే చదవాలనిపించేదిగావుంది. నిజంగా వ్యతిరేకించాల్సింది బ్రాహ్మణవాదాన్నే. ఎందుకంటే దానిని అనుసరించే వారు అన్ని కులాల్లోనూ వున్నారు. బ్రాహ్మణులని కాదు. చాలామంది ప్రగతివాదులు ఈ కులంలోంచే వచ్చారు. పుట్టిన కులం ఏదైనా గుణం ముఖ్యం.

కొత్త పాళీ said...

Good review/intro of a complex novel.
I am curious why you did not publish this in pustakam.

భాను said...

గూగుల్ లో ఏదో వెతుకుతుంటే మీ పోస్ట్ దొరికింది. మీ విశ్లేషణ పుస్తకాన్ని అర్జెంట్ గా చదవాలనిపించేలా ఉంది. ఇప్పుడు దొరుకుతుందా. ట్రై చెయ్యాలి. మీ రివ్యు కి అభినందనలు

Post a Comment