December 28, 2009

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!


ఉపయోగకరమైన ఒక అంశం గురించి మనం చెప్పాలనుకున్న విషయం, సందేశం సూటిగా అవతలివారికి చేరితే ఎంత సంతృప్తిగా ఉంటుంది. పుస్తకాల సంతలో ఈ తెలుగు స్టాల్ ద్వారా ఈ అనుభూతి కల్గింది నాకు. ఈ తెలుగులో నాకు సభ్యత్వం ఏమీ లేదు. సెలవుల (ఎటన్నా పొదామంటే బస్సుల్లేవుగా మరి) కారణంగానూ,కొంచెం తీరిక ఉన్న కారణంగానూ స్టాల్ లో స్వచ్ఛందంగా పని చేయడానికి మూడు రోజుల పాటు వెళ్లగలిగాను.




ఎంతోమంది సందర్శకులు, ఎన్నెన్నో ప్రశ్నలు,ఆసక్తులు,అనురక్తులు,మరెన్నో..ప్రశంసలు!





అంతర్జాలంలో తెలుగు వెలగాలన్న లక్ష్యంతో ఈ తెలుగు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్ కి ఇంత ఆదరణ ఉంటుందని నేను ఊహించలేదు.



ఇంగ్లీష్ మీడియం చదువుల క్రీనీడలో తెలుగు మసకబారుతోన్న సంగతి గుర్తించి, వారి పిల్లలు తప్పకుండా తెలుగు నేర్చుకోవాలన్న కోరికతో తల్లిదండ్రులు స్టాల్ కి వచ్చి చాలా విషయాలు వాకబు చేయడం సంతోషాన్ని కల్గించింది.



పోయిన సారి స్టాల్ కి వచ్చినవారు మళ్ళీ ఈ సారి కూడా వచ్చి తాము బరహ, లేఖిని వంటి ఉపకరణాలను వాడుతున్న సంగతిని పంచుకున్నారు. బ్లాగులు రాయడానికి ఈ సారి ఎంతోమంది ఉత్సాహం చూపించారు. ఏం రాయాలి, కూడలిలో ఎలా చేర్చాలి అన్న విషయాలపై ప్రశ్నలు వేశారు.

కొంతమంది "లేఖిని ఎవరు తయారు చేశారు? ఇక్కడ వీవెన్ ఎవరు?"అని అడిగి తెలుసుకున్నారు.
అవును, వేలకొలది బ్లాగర్లను ఒకచోట చేర్చిన వీవెన్ గురించి అందరూ తెలుసుకోవల్సిందే!



తెలుగు సాఫ్ట్ వేర్లు, ఇతర సాంకేతిక విషయాలతో తయారు చేసిన సీడీలను ప్రత్యేకంగా అడిగి మరీ ఈ తెలుగు స్టాల్ నుంచి వందల కొద్దీ సందర్శకులు అడిగి తీసుకున్నారు. సీడీ కోసం కేవలం ఐదు రూపాయలు ఆపైన మాత్రమే సంస్థ విరాళం తీసుకుంటుందని తెలిసి తెల్లబోయిన వారున్నారు.
"మాతృభాషకోసం చేస్తున్న
ఈమంచిపని కోసం మీరు అడిగి మరీ తీసుకోవాలి విరాళం"అని ఉద్విగ్నంగా అన్నవారున్నారు.
"మీలాంటి వారు ఇప్పుడు తప్పక కావాలి"అని ప్రోత్సాహకరంగా మాట్లాడినవారూ ఉన్నారు.అందుకే ఐదు రూపాయల సీడీకోసం వందరూపాయలిచ్చి తీసుకున్నవారూ ఉన్నారు.





ఎంతోమంది ప్రముఖులు స్టాల్ కి వచ్చి అంతర్జాలంలో తెలుగును గురించిన వివరాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. వారిలో మెజీషియన్ బి.వి.పట్టాభిరామ్ ,కవయిత్రి జయప్రభ,,శ్రీ బుద్ధ ప్రసాద్,సినీ రచయితలు సుద్దాల అశోక్ తేజ,భాస్కర భట్ల,సీనియర్ జర్నలిస్టు తెలికపల్లి రవి,మరెంతోమంది ఉన్నారు.



ఆసక్తి చూపిన వారి వివరాలను నమోదు చేసిన కాగితంలో "సలహాలు-సూచనలు"అన్న కాలమ్ కూడా ఉంది.అందులో శ్రీ పట్టాభిరామ్ "ఇంకా కావాలా?(సలహాలు?)"అని రాయడం చాలా సంతోషపెట్టిన విషయం!



ఈ తెలుగు సభ్యులు కృపాల్ కశ్యప్, చక్రవర్తి,నాగమురళి,సతీష్ ఈ స్టాల్ విజయానికి చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు. ఎవరి వ్యక్తిగత జీవితాలు, ఉద్యోగాలు, బాధ్యతలు వారికున్నా ఒక మాతృభాషా వికాసానికై నెలకొల్పిన ఒక లాభాపేక్ష లేని సంస్థ కొసం ఒక పది రోజులపాటు పక్కనపెట్టి, పూర్తి సమయాన్ని స్టాల్ కోసం కేటాయించిన ఈ నలుగురూ అభినందనీయులు.





వీరితో పాటు స్టాల్ కోసం అంతర్వాహిని బ్లాగర్ రవిచంద్ర కూడా గరిష్టంగా తన సమయాన్ని కేటాయించారు.కేవలం బ్లాగులు చదివి, ఈ తెలుగు స్టాల్లో పని చేయడానికి గుంటూరు నుంచి వచ్చిన డాక్టర్ కౌటిల్య ను విస్మరించలేం!ఎంతైనా అభినందనీయులు. ఇంకా శ్రీహర్ష, హరివిల్లు శ్రీనివాస రాజు, శ్రీనివాస కుమార్(జీవితంలో కొత్తకోణం) నందం నరేష్,విజయ్ శర్మ,వరూధిని,పి.ఎస్.ఎం లక్ష్మిగార్లు కూడా స్టాల్ కోసం తమ సమయాన్ని కేటాయించారు. (ఇంకా ఎవరినైనా మర్చిపొతే తిట్టొద్దు! చెప్పండి చాలు)



స్టాల్ ని సందర్సించిన బ్లాగర్లు ఎంతోమంది.



తెలుగు వారందరికీ తెలుగు రావాలి! తెలుగు అందరిదీ కావాలి.



మా తెలుగు తల్లికి మల్లెపూదండ!

23 comments:

Unknown said...

చాలా ఆనందంగా ఉంది ఇలా అందరూ కలిసి రావడం.
అందరికీ అభినందనలు.

సుజాత వేల్పూరి said...

చౌదరి గారు,
నా బ్లాగ్ నచ్చినందుకు ధన్యవాదాలు!! మీరేమో "అన్నా"అని పిల్చేస్తున్నారు కానీ నా పేరు సుజాతండీ!

రవి said...

మీ అందరికీ హార్దిక అభినందనలు.

Ravi said...

పేర్లు మరిచిపోతామనే నేను నా బ్లాగులో ఎక్కడా పేర్లు రాయకుండా "పేరు పేరునా" అని చెప్పేశాను. :-)
అయినా సరే చెబుతున్నాను చూడండి కొణతాల వెంకటరమణ(తపన), సురేందర్(పుల్లాయన కబుర్లు)కూడా చెప్పుకోదగ్గ సమయాన్ని కేటాయించారు.

అందరికంటే మించి "సంకీర్తనా రవళిని" (సందడి) మాత్రం మరిచిపోలేను సుమా! :-)

శివ చెరువు said...

అక్కడికి వచ్చి నా వంతు (కొంచెం తక్కువే ) చేయగలిగినందుకు నేనూ మహాదానంద పడ్డాను..

నాగప్రసాద్ said...

బాగున్నాయండి e-telugu కబుర్లు. మాకు ఇంకా పాల్గొనే అవకాశం రాలేదు ఆ స్టాల్‌లో. :( :( :(

అయినప్పటికీ, ఇక్కడ చెన్నైలో ఒకసారి ITA వారు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినప్పుడు, ఒక స్టాల్ ఫ్రీగా ఇస్తే, ఒక Laptop పట్టుకెళ్ళి, మేము కూడా అంతర్జాలంలో తెలుగు గురించి చెప్పాం. కానీ, ఇక్కడ తమిళం వాళ్ళు, ఇంకా ఇతర భాషల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, "Do your computer know your mother tongue" అనే caption ను Laptop తెరపై ప్రదర్శించాం. చాలా చక్కని రెస్పాన్స్ వచ్చింది. ఒక్కణ్ణే కావడంతో, అందరి అడ్రసులూ, ఫోన్ నెంబర్లు తీసుకోలేక చిరాకేసి, ఎప్పుడెప్పుడు స్టాల్‌లో నుంచి బయటపడదామా అన్న భావన కలిగింది. :) :) :)

Unknown said...

Matter is meaningful !
Title is DOUBLE MEANINGFUL !!

Kathi Mahesh Kumar said...

ఆందరికీ అభినందనలు. పనివత్తిడివల్ల నేను పుస్తకప్రదర్శన వైపుకే రాలేకపోయాను.ఈ-తెలుగు స్టాల్ కళకళలు వింటుంటే ఈర్షగా ఉంది.

kiranmayi said...

ఈర్షగా ఉంది హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ కి రాలేనందుకు. దాదాపు పదేళ్లైపోయింది ఆ సందడి చూసి. తెలుగు బ్లాగ్స్ లో బుక్ ఫెస్టివల్ గురించి, e తెలుగు స్టాల్ గురించి చదివి, ఫోటోలు చూసి, కొంత మంది బ్లాగర్లని గుర్తుపట్టగలిగాను. బుక్ ఫెస్టివల్ గురించి పంచుకున్న బ్లాగర్లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. I hope everyone had a great time at the book festival. చిన్నప్పటి నా బుక్ ఫెస్టివల్ అనుభవాలు నా బ్లాగ్లో పంచుకున్నాను. ఒక సారి లుక్కెయ్యండి.
http://mymayisblog.blogspot.com/

పరిమళం said...

తెలుగు వెలుగును వ్యాప్తి చేయటానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి స్వచ్ఛందంగా స్టాల్ నిర్వహించిన వారికీ , వారికి తోడ్పడిన వారికీ అందరికీ అభినందనలు !స్వయంగా రాలేకపోయినా ఇలా మీ అందరి టపాల్లో చూస్తుంటే సంతోషంగానూ , గర్వంగానూ ఉందండీ !

కొత్త పాళీ said...

చాలా సంతోషం. అండరికీ అభినందనలు.
కొన్ని కొన్ని సంస్థలు ఎవరో ఒకరిద్దరి పట్టుదలవల్ల బాగా నడుస్తున్నట్టు కనిపిస్తుంటాయి. ఈ-తెలుగు అలాక్కాకుండా కొత్త కార్యవర్గంతో కొత్త ఉత్సాహంతో పని చేస్తుండడం చాలా సంతో్షం.
మీక్కూడా అభినందనలు.

Unknown said...

ఇదిగో ఇక్కడ కూడా చూడగలరు.
మాతెలుగు తల్లికీ మల్లెపూదండ
http://kasstuuritilakam.blogspot.com/2009/09/blog-post_4654.html

సుజాత వేల్పూరి said...

రాజన్న గారూ,
మీరు మరీనండీ! ఇక్కడ కూడానా!:-))
అక్కడ స్టాల్లో మేము టంగుటూరి సూర్య కుమారి గారి పాటే రికార్డ్ వేశాము రోజూనూ! అదే శీర్షిక బాగుందనిపించి పెట్టేశాను.

శిశిర said...

మాతృభాష కోసం సమయాన్ని కేటాయించిన ప్రతి ఒక్కరూ అబినందనీయులేనండి. మీ అందరికీ పేరుపేరునా (రవిచంద్ర గారిని కాపీ కొట్టా :))అభినందనలు.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

నిరుడు పుస్తక ప్రదర్శన, ఈ-తెలుగు స్టాలు గురించి విని, అయ్యో నేను కూడా వుంటే ఎంతో బావుండేది అనిపించింది.

ఈ సంవత్సరం హైదరాబాదుకి మకాం మార్చేసాను కాబట్టి, ఒకటి రెండు సార్లు పుస్తక ప్రదర్శనకి, ఈ-తెలుగు స్టాలుకి రావడం కుదిరింది.

మీ అందరిని కలవడం చాలా ఆనందం కలిగించింది.

మరువం ఉష said...

ఇప్పుడే చదువరి గారి టపా చదివి వచ్చాను ఈ తెలుగు హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్ గురించి. ఇక్కడ మరికొన్ని విశేషాలు. మీకు ధన్యవాదాలు. వారికి అభినందనలు.

వేణు said...

హైదరాబాద్ పుస్తకోత్సవంలో ఈ -తెలుగు స్టాలు ప్రయోజనకరమైన పాత్ర నిర్వహించింది. అంతర్జాలంలో తెలుగు ప్రాధాన్యాన్ని వేల మంది తెలుసుకునేలా చేయటం సాధారణ విషయం కాదు!

సందర్శకుల్లో తెలుగుపై వ్యక్తమైన ఆసక్తి కూడా సంతోషం కలిగిస్తోంది!

ప్రత్యేకంగా సీడీ రూపొందించటం చక్కని ఆలోచన. ఈ పది రోజులూ తెలుగు వెలుగులను పంచటానికి స్వచ్ఛందంగా, అంకితభావంతో కృషి చేసిన ఈ-తెలుగు సభ్యులకు అభినందనలు!

Ravi said...

రాజన్న గారూ! e-తెలుగు ను e-తెలంగాణా గా మార్చాలని కూడా మీ డిమాండ్లలో చేర్చేసుకోండి. :-)

వేణూశ్రీకాంత్ said...

మంచిసమాచారాన్ని అందించారు అంతా ఇలాకలసి కట్టుగా పని చేయడం ఆనందదాయకం. పాల్గొన్న ప్రతిఒక్కరికీ పేరు పేరునా అభినందనలు.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

@రవి చంద్ర :
>> e-తెలంగాణా గా మార్చాలని కూడా మీ డిమాండ్లలో చేర్చేసుకోండి. :-)

:-)

Anil Dasari said...

Great job. Keep it up.

సుజాత వేల్పూరి said...

చివరి రోజు తనికెళ్ల భరణి గారు స్టాల్ కి వచ్చారు. ఆయన సెలబ్రిటీ భేషజాలకు పోకుండా ఎంతో ఆసక్తితో లేఖిని గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు, మధ్య మధ్యలో బోలెడన్ని ఛలోక్తులు విసురుతూ! ఆయనతో మాట్లాడ్డవే ఓ గొప్ప ఎడ్యుకేషన్ అనిపించింది అందరికీ!

"మీ ఈ తెలుగు బ్లాగు బాగు బాగు"అని అక్షరాలు వెదుక్కుని మరీ లేఖినిలో టైప్ చేసి మాతో సమానంగా సంతోషించారు.

తన గురించి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని చూసి, "ఇంత జరుగుతోందా ఇంటర్నెట్ లో, దీని సంగతేంటో చూడాల్సిందే"అన్నారు.

manohara said...

mari antha popularity unna veeven gaarevaro maaku kaastha aa photolo circle chesi choopinchocchu kadhandi!

Post a Comment